cover

క్షుద్రకులవ్యవస్థ కరాళనృత్యం: ఇన్‌క్రెడిబుల్ గాడెస్

Download PDF ePub MOBI

నేను మొదటిసారి తెలుగు పుస్తకాల షాపుకు వెళ్లి కొనుక్కున పుస్తకాల్లో ఇది ఒకటి. విశాలాంధ్రా వాళ్ల షాప్‌కి వెళ్లాను. అక్కడ నేను వెంటనే గమనించిందేంటంటే.. వాళ్లకు అస్సలు లెక్కే లేదు. ఇంగ్లీషు పుస్తకాల షాపుల్లో సిబ్బంది మన వెంటబడుతూ మనం అడిగిందీ అడగందీ కూడా చెప్పటానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడలా కాదు.. వాళ్లకి మూడ్ బాగుండి చెప్పాలనిపిస్తే చెప్తారు. అది అర్థమైన తర్వాత వాళ్ల జోలికి వెళ్లకుండా నేనే అటూ ఇటూ తిరిగాను. కొన్న పుస్తకాల్లో ఈ పుస్తకం కొంటానికి మాత్రం రెండు కారణాలున్నాయి. 1. దీని టైటిల్ ఇంగ్లీషులో ఉండటం. 2. ఈ పుస్తకం ముఖచిత్రం.

ఈ ముఖచిత్రం మీద ఒక మనిషి వెనక్కి విల్లులాగా వంగి తన కాళ్లను తానే తింటున్న దృశ్యం ఉంది. బొమ్మ పరంగా చూస్తే పెద్ద బాగా గీసింది అని చెప్పేదేం లేదు గానీ.. దాని వెనకున్న అర్థం ఆకట్టుకుంది. Ouroboros అని ఒక ప్రాచీన ఈజిప్టు చిహ్నం ఉంది. ఒక పాము తన తోకని తనే తినే బొమ్మ ఉంటుంది అందులో. మరల మరల పునర్జన్మించటానికి అది చిహ్నం అట. కానీ ఈ నవల చదివాకా ఇక్కడ వేరే అర్థంతో దీన్ని వాడారనిపించింది. ముందుకు పోనియ్యకుండా తమని తామే వెనక్కి లాక్కునే దళితుల మనస్తత్వానికి దీన్ని సింబల్‌గా తీసుకున్నట్టున్నారు.

నవలలో రామచంద్రుడనే మాల కులస్తుడు కథానాయకుడు. ఊరి పెద్దయిన పెదరెడ్డి ఒక దొంగ సాక్ష్యం చెప్పమంటే చెప్పటానికి ఒప్పుకోడు. దాంతో పెదరెడ్డి ఇతని ఇల్లు లాక్కుంటాడు. ఎదురుతిరిగిన రామచంద్రుడిని తోటి కులస్తులే కొడతారు. ఇక ఏం చేయలేక భార్య నాగని, కొడుకు కిష్టున్నీ, తన పెంపుడు పందుల్నీ తీసుకుని “రాముడుండాడు.. రాజ్జిముండాది” అన్న నమ్మకంతో ఊరు వదిలి రోడ్డు మీదకు అడుగుపెడతాడు. అలా ఎన్నో మైళ్లు నడిచి నడిచి ఒంటిల్లు అనే కొత్త ఊరు చేరి అక్కడ పొలిమేరలో ఉన్న సత్రంలో దిగుతాడు. ఆ ఊరులో పెదరెడ్డి లాగానే ఒక మునసబు ఉంటాడు. అతడిని చూడగానే “అదే నడక, అదే సౌరు. ఈన్తల్లిని…” అనుకుంటాడు రామచంద్రుడు. కొబ్బరి చెట్లు కూల్చే దినకూలికి చేరతాడు. కానీ అక్కడ ఎదురైన పరిస్థితుల్లో మళ్లీ సాటి కులస్తుల వల్లనే అతని పందులు మొత్తం చచ్చిపోతాయి. అంతకన్నా దారుణంగా అతని కొడుకు కూడా చచ్చిపోతాడు. తనకు మిగిలిన ఆ సగం జీవితాన్ని కూడా ఈ ఊళ్లో పోగొట్టుకున్న రామచంద్రుడు.. తన భార్య నాగని తీసుకుని మళ్లీ రోడ్డున పడతాడు. చివరకు మరో ఊరు చేరతాడు. తోటి మాలకులస్తులు అతడిని అక్కడ కూడా నిలవనివ్వరు. చివరకు.. అప్పటి దాకా తన కులం వల్లా కులస్తుల వల్లా ఎదురైన అన్ని ఇబ్బందులన్నీ ఎంతో నిబ్బరంగా ఎదుర్కొన్న రామచంద్రుడు.. తోటి మనిషి ప్రాణాలు పోతున్న సమయంలో అతనికి సాయం చేయటానికి ఒక కట్టుబాటు (దేవాలయప్రవేశనిషిద్ధం) అతిక్రమించాల్సి వచ్చినపుడు మాత్రం.. అలా చేయటానికి వెనకడుగు వేసే నిస్సహాయమైన స్థితికి చేరుకుంటాడు. దాస్య స్వభావం అనేది దళితుల్లో నరనరానా ఇంకిపోయి ఎలా వారిని మరో జీవితం గురించి ఊహించలేనట్టుగా సహించలేనట్టుగా చేస్తుందో ఈ నవల చూపిస్తుంది.

ఈ నవల కేశవరెడ్డి మొదటి నవల అంటే ఆశ్చర్యం వేసింది. రచయిత శైలి నాకు నచ్చింది. హెమింగ్వేలా చిన్న చిన్న వాక్యాలతో సాగుతుంది. ఐనా జరిగేదాన్ని చాలా స్పష్టంగా మన కళ్ల ముందు జరుగుతున్నట్టుగా చూపిస్తుంది. ఈ నవలల్లోని దొర – బానిసల టైపు సన్నివేశాలు చాలా టి. కృష్ణ, ఆర్.నారాయణమూర్తి సినిమాల్లో చూసినవాటిగా అనిపిస్తాయి. అంటే పాత్రలు కాస్త అలా కనిపిస్తాయి. బహుశా ఈ నవల వచ్చింది 1977లో అన్నారు కాబట్టి తర్వాత వచ్చిన అలాంటి సినిమాలకు ప్రేరణ కల్పించిన రచనల్లో ఇది కూడా ఒకటి కావొచ్చు.

రచయిత కథ చెప్పే టోన్ చాలా ఫార్మల్‌గా ఉంటుంది. కానీ డైలాగులు వచ్చినపుడు చిత్తూరు యాసని బాగా వాడతాడు. నాకు తెలియని పదాలు చాలా ఉన్నాయి. కథ ఎక్కువ భాగం డిస్క్రిప్టివ్‍గానే సాగుతుంది. కొని పోలికలు మనకి చూపిస్తున్న విషయాన్ని ఇంకా పాతుకుపోయేట్టు చేస్తాయి. ఉదాహరణకి.. రామచంద్రుని భార్య నిస్పృహగా సత్రంలో పడిఉండటాన్ని “చెదతినిపోతున్న దూలం వలె నాగ సత్రంలో పడుకుని వున్నది” అంటాడు. అలాగే “సూర్యుడు పగవాని హృదయంలాగ మండుతూ ఆకాశం మధ్యకొస్తున్నాడు” లాంటి కొన్ని పోలికలు ఆహా అనిపిస్తాయి. కానీ కొన్ని చోట్ల ఈ డిస్క్రిప్షన్లు ఇర్రిలవెంటుగా మారిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి.. తన పందులు చనిపోయాయన్న సంగతి తెలుసుకున్న రామచంద్రుడు శరవేగంతో ఆ ప్రదేశం వైపు పరిగెడుతుంటాడు… అప్పుడు..

“రామచంద్రుడు వరి పైర్లను, చెరకు తోటలను, గడ్డివాములను, గుంతలను, కాలువలను శరవేగంతో దాటుకుని మట్టిరోడ్డు మీద పడ్డాడు. మట్టి రోడ్డు మీద ట్రాక్టరు చక్రాలు దొర్లిన గుర్తులు కనిపిస్తున్నాయి. అతడు మట్టిరోడ్డు మీద పరుగిడుతుండగా పుల్లటి దుమ్ముమేఘాల వలె రేగ సాగింది”

..పై పేరాగ్రాపులో “మట్టి రోడ్డు మీద ట్రాక్టరు చక్రాలు దొర్లిన గుర్తులు” ప్రస్తావించటం చాలా సంబంధం లేని విషయంగా అనిపించింది. అది ఎవరు గమనిస్తున్నట్టు? తన పందులను కోల్పోయిన తొందరలో పరిగెడుతున్న రామచంద్రుడైతే ఖచ్చితంగా దాన్ని గమనించడు. పోని కథని చెప్తున్న రచయితే దాన్ని గమనిస్తున్నాడా అనుకుందాం అంటే.. అతి ముఖ్యమైన తొందరలో పరిగెడుతున్న తన పాత్రని వదిలేసి రచయిత నింపాదిగా ఆ చిన్న వివరాన్ని ఎందుకు గమనించినట్టూ.. ఎందుకు మనకి చెప్పినట్టు? ఇలాంటివి అక్కడక్కడా ఉన్నాయి. ఇవి పట్టించుకునేంత పెద్దవి ఐతే కాదు. కానీ ఒక్కోసారి ఈ డిస్క్రిప్షన్లు కథకు అడ్డుపడుతున్నట్టుగా అనిపిస్తాయి. వాటిని దాటేసి కథలో ఏమవుతుందో అది మాత్రం చదువుకుంటూ పోదామా అనిపిస్తుంది.

ఈ నవల చదువుతున్నప్పుడు రచయిత ఉద్దేశించాడో లేదో మరి నాకు తెలియదు గానీ ఇంకోటనిపించింది. రామచంద్రుడి కుటుంబం ఎప్పుడూ రోడ్డు మీద ఉన్నప్పుడే సేఫ్‌గా ఉంటుంది. ఎక్కడైనా ఆగి ఏ ఊరైనా చేరితే ఏదో ఒకటి కోల్పోతుంది. బహుశా ఈ రోడ్డు మీద నడిచే సన్నివేశాలు చాలా వివరంగా కళ్లకు కట్టినట్టుగా చిత్రించటాం కూడా ఒక కారణం కావొచ్చు. ఈ రోడ్డు మీద ఈ కుటుంబం నడుస్తున్నప్పుడు వచ్చిపోయే పాత్రలు రెండు ఉంటాయి. ఒక పాత్ర లారీ నడిపే డ్రైవరు, ఇంకో పాత్ర ఎడ్ల బండి నడుపే రైతు. ఇన్ని క్రూరమైన పాత్రల మధ్యా క్రూరమైన సన్నివేశాల మధ్యా ఈ రెండు పాత్రలు దయగల స్వభావంతో ఉంటాయి. మరో రెండు పాజిటివ్ పాత్రలు సత్రంలో కనిపించే సాధువు ఒకడు కాగా.. రెండోవాడు ఒక ఊరి మొదట్లో ఊరి చేత వెలివేయబడినట్టు (లేదా ఊరినే తాను వెలివేసినట్టు) కనిపించే అర్జునుడు. అగ్రకులమైన రెడ్డి కులానికి చెందినవాడైన ఈ అర్జునుడు ఊరి మీద కోపంతోనో లేదా మరి ఊరి కోపానికి గురయ్యో ఊరిచివర చిన్న గుడిసె వేసుకుని బతుకుతుంటాడు. ఈ అర్జునుడి పాత్ర చివరి కొన్ని పేజీల్లోనే వచ్చినా చదివేవాళ్ల మనసులపై చాలా గట్టి ముద్రను వేస్తుంది. నిజానికి ఈ నవలను ఒక మంచి ముగింపు వైపుకు తీసికెళ్లే పాత్ర ఇదేననే చెప్పాలి.

ఈ పుస్తకానికి ముందుమాటలు వెనకమాటలు అన్నీ కలిపి (రచయిత మాటతో సహా) మొత్తం నాలుగు ఉన్నాయి. వీటిలో త్రిపురనేని మధుసూధనరావు ముందుమాట కాస్త కమ్యూనిస్టు కోణం నుంచి రాసిందిగా అనిపిస్తుంది. అంబటి సురేంద్రరాజు రాసిన చివరి మాట అసలు విషయంతో పెద్దగా సంబంధం లేనిదిగా అనిపిస్తుంది. నవలలో సన్నివేశాల్ని అతిగా విశ్లేషించినట్టు అనిపిస్తుంది. అంటే రచయిత నిజంగా అలా అనుకుని రాసిఉండడేమో అనిపించేలాటి విశ్లేషణలు (ఉదాహరణకి.. అర్జునుడు మంటల్లో కాలి చనిపోవడమన్నది రెడ్డికులం చేసిన దౌర్జన్యాలకు ప్రతిగా ఒక పొయెటిక్ జస్టిస్ అనటం ఒకటి). అలాగే ఆయన తన వ్యాసంలో తెచ్చి పెట్టిన ఇంగ్లీషు కొటేషన్లకీ తర్వాత వచ్చే విషయానికీ పెద్దగా సంబంధం ఉండదు. మధురాంతకం రాజారాం రాసిన ముందుమాట రచయిత అంతకుముందు రాసిన రెండు కథలని ప్రస్తావిస్తూ సాగుతుంది.

మొత్తం మీద ఈ నవల మంచి పుస్తకం చదివిన అనుభూతి మిగిల్చింది.

ఇన్‌క్రెడిబుల్ గాడెస్bookcoverpage

రచన: కేశవరెడ్డి

హైదరాబాద్ బుక్ ట్రస్టు, ఫ్లాట్ నెం.85,

బాలాజీనగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ 67

ఫోన్ 040 23521849

ఈబుక్ & ప్రింట్ బుక్ కినిగెలో లభ్యం

 Download PDF ePub MOBI

Posted in 2014, జూన్, పుస్తక సమీక్ష and tagged , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.