OnNamini&Mulintame

మూలింటామె గురించీ, నామిని గురించీ…

Download PDF ePub MOBI

నామినితో రెండేళ్ల క్రితం ఫోన్లో మాట్లాడినపుడు మాటల్లో ఆయన తన మీద వచ్చిన ఏదో విమర్శను ప్రస్తావిస్తూ, “నన్ను విమర్శించాల్సినేటివి వేరే ఉన్నాయి మెహెరూ. పల్లెటూళ్ళంటే నా కథల్లో ఉన్నట్టు ఎప్పుడూ ఇచ్చకాలే ఉంటాయా, పల్లెటూళ్లో అందరూ మంచి మనుషులే ఉంటారా, పల్లెటూళ్లో క్రూరత్వాలేం జరగవా, మరి అవెప్పుడూ నేను చూపించలేదే, నన్ను ఆ మాట ఎవరూ అడగరే?” అన్నారు. అప్పుడాయన మనసులో ‘మూలింటామె’ ఉందో లేదో నాకు తెలీదు. ‘మూలింటామె’ చదివాకా మాత్రం ఇది ఆ ఎవరూ అడగని ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం అనిపించింది.

పల్లెటూళ్లు ఒక్కోచోట నిజంగానే చాలా క్రూరంగా ఉంటాయి. మనం మన రొమాంటిక్ మెదళ్లతో ఇక్కడ నగరాల్లోంచి చూస్తూ ఎన్నో సమ్మోహనమైన దృశ్యాల్ని రచించుకుంటామే గానీ, నిజంగా అక్కడికి వెళ్తే కొన్ని అంశాల్లో ఆ మానసికమైన ఉక్కపోతను రెండు రోజులైనా భరించలేము. నీది ఒద్దికైన, పద్ధతి తప్పని జీవితమై, if you can keep up every appearance that’s stipulated through the very air there, అప్పుడు అక్కడ మనటం చాలా సులువు. ఏ మాత్రం తోవ మళ్లిన జీవితమైనా సరే నిన్ను పల్లెటూరితో పోలిస్తే నగరమే ఆదుకుని అక్కున చేర్చుకుంటుంది. అక్కున చేర్చుకోకపోయినా, కనీసం పట్టుకుని పొడవదు. అక్కడి కాంక్రీటు సమూహాల్లో నీకై కేటాయించిన మూల, నీ పట్ల చూపబడే సుఖవంతమైన నిర్లక్ష్యాన్ని వెచ్చగా అనుభవిస్తూ జీవించేయొచ్చు.

ఈ ఏడాది మొదట్లో కినిగె పత్రిక ఇంటర్వ్యూ కోసం నామినికి ఫోన్ చేశాను. అప్పుడే ఆయన “మూలింటామె” పుస్తకం పూర్తి చేసిన సంతోషంలో ఉన్నారు. ఆయన రాసే పద్ధతి అదే పనిగా వేసిన వాక్యం తీయటం తీసిన వాక్యం మళ్లా వేయటంగా ఉండదు. కాబట్టి తాను ఊహించని సంగతేదో జరిగినట్టు సంబరంగా ఉంది గొంతు. తర్వాత రెండు మూడు రోజులకు నా ఈమెయిల్లో ‘మూలింటామె’ పిడిఎఫ్ ఫైలు వచ్చి చేరింది. స్పైరల్ బైండు చేయించి తెచ్చుకుని చదివాను.

“ఒక మంచి శుక్రోరం. సందల గూకతా” ఉండగా కథ మొదలవుతుంది. కథ మొదలయ్యేటప్పటికే మూలింటామె మనవరాలు రూపావొతి మొగుణ్ణీ పిల్లల్నీ వదిలేసి ఒక అరవమాదిగోడితో లేచిపోయి ఉంటుంది. ఆ సంగతి నెమ్మదిగా ఊరంతా పాకుతుంది. కొందరు ఊరోళ్లు కలిసి తిరుపతి వెళ్లి ఆమెను వెనక్కి తీసుకురావాలని చూసినా ఆమె రానంటుంది. దాంతో ఇక ఆమె తల్లి (మూలింటామె కూతురు)తో సహా అందరూ ఆమెను చచ్చిందానిగా జమకట్టేస్తారు. మూలింటామె మాత్రం మనసులోంచి తీసేయలేకపోతుంది. ఆమె ఫోటోను ఎదరపెట్టుకుని మూలింటామె చెప్పుకున్న స్వగతం చదివితీరాలి. సాహిత్యంలో అంత కదిలించే మాటలు అన్ని కొన్ని పేజీల్లో ఎక్కడైనా తగలటం అరుదు.

రెండో భాగం (‘కొన బాగం’)లో మూలింటామె కొడుకు నారాయుడికి మళ్లీ పెళ్ళి జరుగుతుంది. కోడలు వంసత, కానీ లావుగా ఉంటుందని అందరూ పందొసంత అని పిలుస్తారు. ఈ పాత్ర అప్పటికే శిథిల దృశ్యంలా ఉన్న కథలోకి తుఫానులా ప్రవేశిస్తుంది. నవల మొదటి భాగంలో తన పెంపుడు పిల్లులతో పాటు కళ్లెదుటే కనపడిన మూలింటామె పాత్ర ఈ రెండో భాగం వచ్చేసరికి వెనక్కి వెళ్లిపోతుంది. లేచిపోయిన రూపావతికి పక్కా వ్యతిరేకం ఈ పందొసంత పాత్ర. మొగుడి ముందే రంకుమొగుణ్ణి మెంటైన్ చేస్తుంది. కానీ వాడు ఆషామాషీ అరవమాదిగోడు కాక బుల్లెట్ మీద తిరిగే డబ్బులున్న కులమున్న గుడుగుడు చంద్రడు కాబట్టి అందుకు చుట్టూ ఉన్నవాళ్ల చేత శభాష్ అని కూడా అనిపించుకుంటుంది. దీనికి మొగుడు నారాయుడూ అడ్డం చెప్పడు. పందొసంత వచ్చీ రాగానే ఇంటి చుట్టూతా ఉన్న చెట్లు బేరంపెట్టి కొట్టేయిస్తుంది. బంకు తెరుస్తుంది. చిట్టీలేయిస్తుంది, వడ్డీకి డబ్బులిస్తుంది. మొగుడికి తాగుడు నేర్పిస్తుంది. అతని చేత ఎడ్లూ ఎడ్లబండీ అమ్మించి, మోపెడు కొనిపిస్తుంది. పొలం కూడా బేరానికి పెడుతుంది. కానీ పొలం రిజిస్ట్రేషనుకి మూలింటామె సంతకం కావాల్సొస్తుంది. అప్పుడు గానీ ఈ రెండో భాగంలో మూలింటామె పాత్ర మళ్లా మన ఎదుటికి రాదు. ఆమె చేత సంతకం పెట్టించేందుకు బీమారం నుంచి ఆమె అక్క ఎర్రక్క బయల్దేరి వస్తుంది. ఆమె, పందొసంతా కలిసి మూలింటామెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. ఆమె ససేమిరా అనటంతో ఆమె పెంపుడు పిల్లులకు ఎలుకలమందు పెట్టి చంపేస్తారు. మూలింటామె అట్లే లేచి వెళ్ళి వొడిశాకు కోసుకుని తిని చనిపోతుంది. తర్వాతెపుడో, ఆమెను పూడ్చిన దిబ్బ మీద పడి మనవరాలు రూపావొతి గుండెలు బాదుకుంటూ ఏడవటం చూశామని కొందరంటారు, ఆమె తిరుపతి కొండల మీంచి దూకి చనిపోయిందని కొందరంటారు.

నేను చదవటం మొదలుపెట్టాక మొదటిభాగం అంతా ఒక్క ఊపులో, ఆయన ఎలా ‘ఉమాదం’తో ఆన్చిన పెన్ను పైకెత్తకుండా రాసి ఉంటాడో అలానే, చదివేశాను. ‘సత్యం శివం సుందరం’ అంటారు మనవాళ్లు. సత్యం అందినాక ఇక అదే సౌందర్యం. దాని కోసం వేరే ప్రయత్నం అక్కర్లేదు. రచనలకి సంబంధించి సత్యం అంటే జీవితం, సౌందర్యం అంటే సౌష్టవం. జీవితం నాడి పట్టుకోగలిగాక ఇక దాన్ని రచనలోకి తెచ్చేటపుడు రచనాసౌష్టవం విషయమై ప్రత్యేకంచి ప్రయత్నించనక్కర్లేదు. అందుకే ఈ నవల మొదటిభాగం అంతా అలా అప్రయత్నంగానే కుదిరిపోయి ఒక్క వాక్యం కూడా పక్కకు తీయలేనంత సౌష్టవాన్ని అందుకుంది. జీవితం నామిన్ని రాతగాడిగా నియమించుకుని అంతా చెప్పి రాయించుకున్నట్టు సాగిపోయింది. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు, నాకు తెలిసిన చాలామంది ఈ పుస్తకం గురించి మాట్లాడినప్పుడు మొదటిభాగంలో ఆపకుండా చదివించే గుణం గురించి కూడా మాట్లాడారు.

రెండోభాగం మాత్రం నాకు అలా సాగిపోలేదు. కాస్త ఇబ్బందిగా అనిపించింది. మొగుడూ భార్య మిండగాడూ అనే ఈక్వేషనూ, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలూ దానికేమన్నా కారణమా అని ఆలోచించాను. అదైతే అస్సలు కాదు. ఎందుకంటే మానసికంగా నేను మర్యాదస్తుడ్ని కాదు, మధ్యతరగతివాణ్ణి అంతకంటే కాదు (అలాంటి మనుషులు, సన్నివేశాలు అసంభవమూ కావు). మరి ఏంటి తేడా అని ఆలోచిస్తే బహుశా నేను ఒంటబట్టించుకున్న Flaubertian సూత్రాలు నాకు అడ్డువస్తున్నాయేమో అని తట్టింది.

అదే నామినికి చెప్పాను, “కొన బాగంలో రచయిత సమక్షం తెలుస్తుండీ” అని. ఆయన చొప్పున, “రచయిత సమక్షం అంటే ఏంది మెహెరూ… అది లేంది ఎక్కడ? మరి నేను పుస్తకం మొదులుపెట్టటమే ‘మంచి శుక్రోరం’ అని మొదలుబెట్టినాను కదా. అది ‘మంచి శుక్రోరం’ ఎట్టయ్యింది. రచయిత చేప్తేనే కదా అయ్యింది. మరి అక్కడ లేని రచయిత రెండోభాగంలో ఎట్ట వచ్చేసినాడు? రచయిత దూరటం దూరకపోవటం అయ్యన్నీ దొంగ మాటలబ్బా. అంతా చేప్పేది రచయితే కద” అని అన్నాడు. నామినిలో నేను గౌరవించే అంశాల్లో ఇదొకటి. ఆయనది దత్తు తెచ్చుకున్న జ్ఞానం కాదు. సొంతంగా తన కళతో తాను పడిన యాతనలోంచి తేల్చి తెచ్చుకున్న జ్ఞానం (శ్రీపాద లాగా.) ‘రచయిత రచనలో దూరకూడదు, దేవుళ్ళా వెనకే ఉండి అంతా నడిపించాలి’ అని Flaubert అంటే ‘అబ్బో రచయిత అంటే దేవుడి మాదిరి’ అని పొంగిపోయి ఏం ప్రశ్నించకుండా ఒప్పేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు నామిని సడెన్‌గా నా ముందు ఇంతింతై ఉబ్బిపోయి వామహస్తం పైకెత్తి ఈ మాటలు ప్రవచించి నా కళ్లు తెరిపించేశాడని కాదు గానీ, అప్పటికే సత్యంలో దిటవైన పునాది లేక వట్టి మాటల పేర్పుగా డొల్లబారుతున్న ఆ సూత్రం నామిని స్టేట్మెంటుతో ఇంకో ఎదురు దెబ్బ తినిందని మాత్రం ఒప్పుకోవాలి.

ఐనా మరి రెండోభాగంతో నేను కొంత ఇబ్బంది పడిన మాట మాత్రం వాస్తవం. తర్వాత మేం ఫోన్‌లో మాట్లాడుకున్న మాటల్లో అది తెలియజేస్తూనే వచ్చాను. కానీ స్పష్టంగా కాదు. ఎందుకంటే ఆ రెండోభాగంలో ఇబ్బంది ఏంటన్నది నాకూ తెలియదు, ఆయనకీ తెలియదు. మాట్లాడుకోవటమైతే చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఆయన నా ‘రచయిత సమక్షం’ అన్న అభ్యంతరాన్ని అలా తీసిపారేసిన తర్వాత నాకు మళ్లీ ‘వ్యంగ్యం’ అన్న కాచ్‌వర్డు దొరికింది. దాంతో ఆయన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టాను. రెండోభాగంలో రచయిత వ్యంగ్యం తీవ్రంగా, కోస్తున్నట్టు ఉంటుంది. ఈ భాగం గురించి మా మాటల్లో ఎపుడు ప్రస్తావనకు వచ్చినా నేను ఒక్కసారైనా ఈ సంగతి గొణిగేవాణ్ణి. ఇక ఆయన విని విని విసిగి వేసారి ఒక మాట అన్నారు. “మొదటి భాగం దేవుడు చెప్తున్నాడు, రెండో భాగం సైతాను చెప్తున్నాడు. ఇక అట్ట అనేసుకోండి” అని. ఏ రచయితైనా తన రచన వెనుక ప్రేరణలూ, ఉద్దేశాల గురించి ఎల్లపుడూ స్పష్టమైన అవగాహనతోనూ, స్టడీగైడ్సుతోనూ సిద్ధంగా ఉంటాడని చెప్పలేం. రచయితల్ని, ముఖ్యంగా నామిని లాంటి రచయితల్ని, నిర్దేశించేది ఇంట్యూషన్. నామిని తన రచన గురించి అన్న ఈ మాట తిన్నగా ఆయన ఇంట్యూషన్నించి తన్నుకొచ్చిన మాటగా అనిపించింది. ఇది నిజానికి చాలా విశదమైన విషయం. నామిని రచయితగా తన రచనల వెనుక అదృశ్యం కావటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఫస్ట్‌పెర్సన్‌లో చెప్పినా, థర్డ్‌పెర్సన్‌లో చెప్పినా కథ చెప్పేది ఎప్పుడూ నామినే. ఇక్కడ నామిని అంటే రచనాసూత్రాలకు బద్ధుడైన రచయిత నామిని కాదు (అలాంటివాడెవడూ లేడు); రక్తమాంసాలూ రాగద్వేషాలతో సజీవంగా చలించిపోయే మానవమాత్రుడు నామిని. మనకు ఇన్ని కథలు చెప్పింది ఈ నామినే. ఇప్పుడు మూలింటామె కథ చెప్తోందీ ఈ నామినే.

ఇక ‘మొదటిభాగం దేవుడు చెప్తున్నాడు, రెండో భాగం సైతాను చెప్తున్నాడు’ అన్న ఆయన మాట నాకు ‘మూలింటామె’ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటానికి సాయపడింది. ఆ మాటని నేను ఎలా తర్జుమా చేసుకున్నానంటే: మొదటిభాగాన్ని నడిపించింది ప్రేమ, రెండోభాగాన్ని నడిపించింది ద్వేషం అని. ఈ నవలలో ఎప్పుడూ ప్రత్యక్షంగా పాఠకుల ముందుకు రాని రూపావొతిపై నామిని ప్రేమా, రూపావతిని తిరగేస్తే పుట్టిన పందొసంతపై ఆయన ద్వేషమూ కొట్టొచ్చినట్టు తెలుస్తూనే ఉంటాయి. మరి అలా ఒక రచయిత తన పాత్రలపై ప్రేమ ద్వేషాలు కలిగి ఉండొచ్చా అంటే, ఆ రచయిత వాటిని తాను కల్పించిన పాత్రలుగా గాక, తన మనోనేత్రం ఎదుట రక్తమాంసాలతో కదలాడుతున్న మనుషులుగా చూడగలవాడైనపుడు, ఉండొచ్చా ఉండకూడదా అన్న మాటే రాదు, ఉండి తీరతాయీ అని చెప్పాల్సొస్తుంది. నామిని తన పాత్రల్ని అలా మనుషుల్లాగే చూశాడు. మనుషులు కాబట్టే, వాళ్లని చెప్పుతో కొట్టేసి తనకు నచ్చినట్టు మార్చలేక, అవి ఎలా మసలుకుంటే అలా చూసి రాశాడు. ఆ రాయటం మాత్రం రచనాసూత్రాలకు బద్ధుడై, రచయితగా తాను జోక్యం చేసుకోకూడదని చెప్పి, ఒక తెచ్చిపెట్టుకున్న తాటస్థ్యం(detachment)తో రాయలేకపోయాడు. ప్రేమ కలిగినపుడు ప్రేమిస్తూ రాశాడు, ద్వేషం కలిగినపుడు ద్వేషిస్తూ రాశాడు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ గుంభనంగా ఉంటుంది, ద్వేషం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మొదటిభాగంలో రూపావొతి మీద రచయిత ప్రేమ కనపడలేదు గానీ, రెండోభాగంలో పందొసంత మీద ద్వేషం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడింది. నిజానికి ఆ ద్వేషం పందొసంత మీద కూడా కాదు. నామిని ఇప్పటి దాకా పల్లెటూళ్లలో తాను ఏ కోణం చూపించలేదనుకున్నాడో, ఆ కోణం పైన, ఆ క్రూరత్వంపైన, ఆయనకి ద్వేషం. ఆ క్రూరత్వానికి మూర్తీభవించిన ఉదాహరణల్లాంటి రంజకం, మొలకమ్మ, ఎర్రక్క, పందొసంత లాంటి మనుషుల పట్ల పరమ కచ్చతో రగిలిపోతూ కథ చెప్తున్నాడు. ఆపుకోలేని ద్వేషం తారాస్థాయికి చేరినపుడు వ్యంగ్యంలోకి దిగిపోతుంది. ఈ వ్యంగ్యమే మొదటిసారి చదివినపుడు నన్ను ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే నేను Flaubert ని చదువుకుని ‘రచయిత కథలో కనపడకూడదు’ అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకున్నవాణ్ణి. పండిత పాఠకుణ్ణి. నాలాంటోళ్లని చూసి విసిగిపోయే అనుకుంటా జెడి శాలింజర్ తన ఒక పుస్తకాన్ని ఇలా అంకితమిచ్చాడు:

“ఈ ప్రపంచంలో ఇంకా అమెచ్యూర్ పాఠకుడు అనేవాడు ఎవడైనా – కనీసం చదివి తన మానాన తాను పోయేవాడు ఎవడైనా – మిగిలి ఉంటే, నేను చెప్పలేనంత అనురాగంతోనూ కృతజ్ఞతతోనూ వాణ్ణి నా భార్యా పిల్లలతో పాటూ నాలుగోవంతుగా ఈ పుస్తకాన్ని అంకితం తీసుకొమ్మని కోరుతున్నాను.”

నామిని ప్రతి పుస్తకం లాగే ఈ ‘మూలింటామె’ కూడా అలాంటి పాఠకుల కోసమే. పైన చెప్పిన బేగేజీ అంతా పక్కనపెట్టి రెండోసారి చదివినపుడు ‘మూలింటామె’ను మరింత దగ్గరగా ఆస్వాదించగలిగాను. రెండోసారి కాబట్టి, కథ ఏమవబోతోందో అన్నట్టు చదవాల్సిన ఇది లేకపోవటంతో, నింపాదిగా చిన్న చిన్న వివరాల్ని ఆస్వాదిస్తూ చదవగలిగాను. అలాంటివి ఇందులో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి, మూలింటామె తలపోటు టాబ్లెటుతో పాటూ దాన్ని చుట్టివుండే కాగితాన్ని కూడా నోట్లో వేసుకుని నమలడం, అదేంటని అడిగితే “మాత్ర కంటే మించిన సత్తుమానం కాతికంలో వుంటింది” అని చెప్పడం; మాలమ్మాయి గురివి మూలింటామె ఇంటికొచ్చి “ఈ నాలుగూళ్లలో ఏ ఆడదన్నా మాలదాని చేతికి కుంచమిచ్చి కొలుచుకోమంటాదా! మీ మనవరాలు తప్ప” అని చెప్పటం; పిల్లుల్ని చంపటానికి వచ్చినవాడితో మూలింటామె చెప్పే బ్రిటిషు కాలం నాటి పిట్టకథ…. జీవితంలోంచి అరుదుగా మాత్రమే సాహిత్యంలోకి వచ్చే ఇలాంటి చిన్న చిన్న సంగతులెన్నో కలిసే తనని పుస్తకం రాసేలా చేశాయని నామిని కూడా తల్చుకున్నారు. ఇలా అంటే మహా చిత్రం కదా మన మహా రచయితలకి! మరివాళ్లు ఏదో మహా ఉద్దేశం ఉంటే తప్ప పుస్తకం రాసే జోలి పెట్టుకోనే పెట్టుకోరు కదా! అసలు ఎవడన్నా పర్యావరణం గురించీ, ప్రపంచీకరణ ఫలితాల గురించీ, జీవకారుణ్యం గురించీ ఏదన్నా రాసేద్దామని గొప్ప ఉద్దేశంతో ఓ నవల మొదలెట్టాడంటే వాడికన్నా దొంగరచయిత ఇంకోడు ఉంటాడా! రచయిత చేత కలం పట్టించేది అతని అనుభవం వడ కట్టిన జీవితం. ఇక అందులోంచి వెయ్యి మంచి ఉద్దేశాలెవరన్నా ఏరుకున్నారంటే అది వాళ్ల వెసులుబాటు. దానికి రచయితకీ ఏం సంబంధం లేదు.

అసలు నిజమైన రచయితకు పుస్తకం రాయటానికి ఏ ఉద్దేశమూ ఉండదు చాలాసార్లు. అతని జీవిత విస్తారంలో క్రమేణా ఏవో కొన్ని మూలకాలు ఒక అదృశ్యబిందువు దగ్గర దట్టంగా గుమికూడతాయి. అవన్నీ అక్కడ క్రిక్కిరిసిపోయి ఇక నిభాయించుకునే వీలు లేక అతని మీద పడతాయి. అతను నిలదొక్కుకోలేక ఆ పళంగా వచ్చి కాగితం మీద పడతాడు. ‘మూలింటామె’ నవలకు ఉద్దేశం ఆపాదించటం సులువు. అలా ఆపాదిస్తూ వాడేది ఎంత పెద్ద పదమైనా కావొచ్చు. కానీ అది ఎంత పెద్ద పదమైతే ఆ మాట అంత అబద్ధం. ‘ఈ నవల్లో నామిని పిల్లులంటే తనకున్న ఇష్టం చూపెట్టుకున్నాడూ’ అను, కొంత నిజం ఉంది. కానీ ‘ఈ నవల్లో నామిని జీవకారుణ్యం గురించి చెప్పినాడు’ అను, అంతకన్నా సత్యదూరమైన మాట ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనం వాడే పెద్ద పెద్ద పదాలన్నీ నిజానికి భ్రష్టుపట్టిపోయిన పదాలు. వట్టి జీవకారుణ్యం ఏం ఖర్మ, ప్రపంచీకరణ గురించి మాట్లాడొచ్చు, మార్కెట్ శక్తుల గురించి మాట్లాడొచ్చు, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడొచ్చు. వీటిల్లో ఏదో ఒక దాన్ని మనసులో ఉద్దేశంగా పెట్టేసుకుని నామిని ఈ నవల మొదలెట్టాడూ అనొచ్చు. తిన్నగా నామిని ముందే బుకాయించో మొహమాటపెట్టో ఆయన్నే ఒప్పించొచ్చు. కానీ ఆర్టిస్టు మనసు ఎలా పనిచేస్తుందన్నదానిపై అవగాహన ఉన్నవాళ్లెవరూ ఆ వాగుడు వాగరు.

*

నామినితో మాట్లాడినపుడు ఆయన పదే పదే ఇష్టంగా తల్చుకునే రచనలు రెండు అని గమనించాను. ఒకటి దాస్తోయెవ్‌స్కీ ‘క్రైం అండ్ పనిష్మెంటు’, రెండోది ఆల్బెర్ట్ కామూ ‘అవుట్‌సైడర్’. మూలింటామె విషయంలో నామినిపై అవుట్‌సైడర్ ప్రభావం కొంత కనిపిస్తుంది. ప్రభావం అంటున్నానంటే మనవాళ్లు కథల్ని సన్నివేశాలూ, పాత్రల స్వభావాల్తో సహా దించేసే తంతు గురించి కాదు నేచెప్పేది. ఒక రచన సారం మనలో ఇంకినపుడు దాని ప్రభావం వల్ల అంతకుముందు చూచాయగా మాత్రమే స్ఫురణ పొలిమేరల్లో తచ్చాడే రూపరహిత అంశాలు ఒక రూపాన్ని సంతరించుకుని ముందుకు రావటం గురించి చెప్తున్నాను. అలా చూసినపుడు కామూ నవలకీ, నామిని నవలకీ కొన్ని పోలికలు కనపడతాయి. ముఖ్యంగా ‘అవుట్‌సైడర్’ కథానాయకుడు మీర్‌సాల్టుకూ, మూలింటామె పాత్రకూ మధ్య. తను చేసిన హత్యకు గాక, తల్లి చనిపోయినపుడు సరిపడా విషాదం బయటకు చూపించనందుకు మీర్‌సాల్టుకు శిక్ష పడుతుంది. సమాజం యొక్క దున్నపోతు స్వభావం ఎలా ఉంటుందన్నది కోర్టులో మీర్‌సాల్టుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పిన వ్యక్తుల మనస్తత్వాల్లో వ్యక్తమవుతుంది. సమాజం మీర్‌సాల్టును వెంటపడి ఎంత వేధిస్తుందో మూలింటామెనూ అంతే వేధిస్తుంది. అయితే ఇక్కడ పోలికేమిటంటే… మీర్‌సాల్టూ, మూలింటామె ఇద్దరూ క్రూరత్వాన్ని నిలువరించటానికి వాడే ఆయుధం ఉదాసీనతే. ఆఖర్లో పందొసంతా, ఎర్రక్కా కలిసి మూలింటామె ప్రాణంగా “నా చిన్నామున్నులూ, కానాచ్చులూ, కొండాచ్చులూ” అని పిలుచుకునే పిల్లుల్ని ఎలకలమందు పెట్టి చంపి శవాల్ని చేటలో వేసుకొచ్చి ఆమె కళ్ల ముందు ఆడించినా “తోడబుట్టిన అక్కకు చేతులెత్తి దండంబెట్టి నోరు తెరవకుండా, కండ్లు మూసు”కుంటుంది. వొడిశాకు తినేసి ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు కూడా దొంగ ఏడుపులు ఏడుస్తున్న “అక్కకల్లా చేతులెత్తి దండం బెట్టి కడగా పొమ్మన్నట్టు చూసింది”. ‘అవుట్‌సైడర్’లో మీర్‌సాల్టుకు ఇక ఉరిశిక్షఖాయమనగా, తనని పశ్చాత్తాపపడమని వచ్చిన క్రైస్తవ ఫాదరీని చెడామడా తిట్టేసి వెళ్లగొట్టేస్తాడు. అందరూ వెళ్లిపోయాక జైలు గది నిశ్శబ్దంలో తన మనసులో ఇలా అనుకుంటాడు:

“As if that blind rage had washed me clean, rid me of hope, for the first time, in that night alive with signs and stars, I opened myself to the gentle indifference of the world. Finding it so like myself—so like a brother, really—I felt that I had been happy and was happy again.”

తన కోపం అంతా బయటకు కక్కేయడం వల్ల కలిగిన తేటదనంతో, ఇక ఏ ఆశా మిగలి లేదని అర్థమవగా, నిస్సత్తువగా జైలు గదిలో చప్టా మీద కూలబడతాడు. నక్షత్రపు రాశులతో వెలుగుతున్న ఆ రాత్రిలో మొట్టమొదటిసారి ప్రపంచపు “దయాపూరితమైన ఉదాసీనత”ను చూడగలుగుతాడు, దానికి తనను సమర్పించేసుకుంటాడు. మూలింటామె ఉదాసీనత ఇలాంటిదే. మీర్‌సాల్టు తన ఆక్రోశం అంతా ఒక్కసారైనా వెళ్లగక్కుకున్నాకనే ప్రపంచపు “gentle indifference”ను చూడగలుగుతాడు, అది తనలోనూ చూసుకుంటాడు. బహుశా స్త్రీ కాబట్టి, భారతీయస్త్రీ కాబట్టి మూలింటామె ఆ మాత్రం కూడా ఎక్కడా బయటపడదు. మన ప్రపంచం ఇన్ని అసంగతపు (అబ్సర్డు) లెక్కల మీద నడుస్తుందని ‘అవుట్‌సైడర్’ నవల ప్రతిపాదిస్తే, మనం మానవావరణలో నమ్మకంగా వేసే అడుగుల కిందే ఎన్నో క్రూరత్వాలు ఆవలిస్తూ అవకాశం కోసం కాచుక్కూచోవటం ‘మూలింటామె’లో కన్పిస్తుంది. సారంలోనే కాక, సౌష్టవం విషయంలోనూ రెండు నవలలకూ పోలికలున్నాయి. రెండు నవలలూ రెండేసి భాగాలుగా విడగొట్టి ఉంటాయి. రెండూ దాదాపు అంతే స్లిమ్‌గా ఉంటాయి.

*

‘నెంబర్ వన్ పుడింగి’ తర్వాత నామినికి చాలామంది అంతిమనివాళులు అర్పించారు; రచయితగా అస్తమించాడన్నారు, గోర్కీ అన్నవాళ్లే గోరీలు కట్టేశారు. కానీ జీవితంతో కాంటాక్టు నిలుపుకున్నంతవరకూ ఏ రచయితా వట్టిపోడు, చచ్చిపోడు. నామిని వరకూ ఈ ‘మూలింటామె’ దానికి ఋజువు. ఎంతో జీవితాన్ని, ఎంతో సౌష్టవంగా వెలిబుచ్చిన నవల ఇది.

నామిని పట్ల నామిని రచనల్ని మించిన గౌరవం నాకు. ఎందుకంటే కళాకారుని మూర్తిమత్వం శుద్ధంగా వ్యక్తమయ్యేది అతని సృజన ఒక్కదాంట్లోనే కాదు. ఆ కళ పట్ల కలిగి ఉన్న అభిప్రాయాల్లోనూ, వాటికి నిబద్ధుడై ఏ మొహమాటాలకూ లొంగకుండా నడుచుకోవటంలోనూ కూడా వ్యక్తమవుతుంది. నాకు తెలుగునేల మీద తారసపడిన – ఒంటిచేతి వేళ్లతో లెక్కపెట్టదగిన – కళాకారుల్లో నామిని ఒకడు.

*

Download PDF ePub MOBI

Posted in 2014, జూన్, వ్యాసం and tagged , , , , , , , , , , .

17 Comments

 1. కెకె రామయ్య గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను. ఖదీర్ గారు ఈ నవల గురించి రాసిన సమీక్ష గొప్పగా ఉందన్న విషయం. “రచయితని తోద్దామంటే…..” అన్న వ్యాఖ్య పరథిని దాటింది గాని.. ఆ సంగతి ఆయన గమనించి (గమనించేట్లు చేశారు) ఆ మాటని వెనక్కి తీసుకోవడం బాగుంది. అయితే చిన్న విషయానికే పేజీలు పేజీలు చాలా వివరంగా రాసే రంగనాయకమ్మ గారు ఆ వాక్యాన్ని హాస్యంగా తీసుకోవాలనడం నాకు ఆశ్చర్యంగానూ, నా అభిమాన రచయిత్రి ఇలా అంటుందేమిటా అని బాధగానూ అనిపించింది.

 2. ‘beyondcoffee ‘చదివాక నాకు కూడా రచయతని కొండ ఎక్కించి మరీ తోద్దామని పించింది …నామిని రచనల్లో వున్నా స్వచ్చత ని ఈయన ఎన్ని జన్మలు ఎత్తిన సాధ్యం కాదు ..అని తెలుసుకుంటే మంచిది …బమ్మిడి ,గోపిని లతో వున్న prejudice ని ఎక్ష్ప్రెస్స్ చేసినట్లు నామిని పై express చేసినా ఆయన చాలా హుందాగా కామెంట్ చేసారు

 3. ‘మూలింటామె’ రచన లోని సత్యానికి, సమకాలిక వాస్తవానికి చదువరిని చేరువచెయ్యటానికి సాయపడ్డ పరాయోళ్ల కధల జి. ఉమామహేశ్వర్, రమాసుందరి, కె. ఆర్. చంద్ర, మెహెర్ గార్లకు కృతజ్ఞతలు.
  ..
  రమాసుందరి గారు! దయచేసి “ ప్రపంచమంతా పందొసంతల స్వాధీనం అయిపోయింది “ అని ప్రకటించొద్దు. పరాజయాల పరాభవాల నైరాస్యంలోంచి మరణించని ఓ స్వప్నం మళ్లీ మేల్కొంటుందనే ఆస్వాసను మీ నుంచి ఆశించాను.

  వికృత రూపం దాలుస్తున్న వ్యవస్థ ప్రతినిధి పందొసంత, మానవత్వం నైతిక విలువల ప్రతినిధి మూలింటామెను చంపేసింది అన్న ఉమా! రెండు నిముషాలు మౌనం కాదు, నిత్య మేధోమధనం జరగాలేమో కదా. భారత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో మాత్రమే కాదు మొత్తం వ్యవస్థలో మార్పు అనివార్యం అని పెద్దలందరూ అంటున్నారు కదా.

  నామిని గారిపట్ల తనకున్న గురుతుల్య భావంతోనో, చనువు కొద్దో, మరెందుకో పరిధి దాటిచేసినట్లుగా అనిపించిన ఒకటి రెండు వ్యాఖ్యలను మినహాయిస్తే, ఖదిర్ బాబు గారు ‘మూలింటామె’ మీద సాక్షిలో రాసిన సమీక్ష కూడా గొప్పగా ఉంది.

 4. మూలింటామె ని చదివాకా ఎందుకో తెలియని దిగులు పట్టుకొంది . గొప్ప రచన చదివాకా పుట్టే దిగులు లాంటింది . రచన లోని సత్యాన్ని సమకాలిక వాస్తవంలోకి చదువరి దించుకున్నకా చదివిన విషయంతో అంతర్చర్చ చేస్తాడు . అప్పుడు పట్టుకుంటుంది దిగులు . మూలింటామెలు ,పిల్లులు ,చెట్లు కనుమరుగయ్యే అసంకల్పిత కాలగతిని నామిని తన అతివాస్తవిక నుడికారంతో , అడ్డూ అదుపూ లేని తూగుతో , చదువరికి లోపలి కన్ను తెరిపించే తీరుతో సాగిన “మూలింటామె ” వొక మాస్టర్ పీస్ . నామినిగారూ మీకు దణ్ణం సరిపోదు . మెహెర్ కి శుభాకాంక్షలు ..

 5. పందొసంత ఒక స్త్రీ కాదు. దాని ముందడుగుకి అడ్డం వచ్చిన ప్రతిదాన్ని ధ్వంసం చేసుకొంటూ పోయే వ్యవస్థ. చివరకు అడ్డం వచ్చిన కాడిమానుని కూడ పొయ్యిలో పెట్టి తగల పెట్టి వెనుకటి యుగలక్షణానికి “దినం” చేయగల సైతాన్ ప్రగతి. దానికి మానవత్వం, నైతిక విలువలు వుండవని చెప్పటానికే నామిని ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఆయన కసి స్థాయి తారస్థాయికి చేరుకొన్నా వ్యంగ్యంతో అదుపులోనే పెట్టగలిగారు నామిని. నామిని విశ్వరూపం కనబడిన రెండో భాగమే నాకు బాగా నచ్చింది.
  అవును. వరూధిని గుర్తుకు వస్తుంది. భూమిని పెట్టుబడిగా మార్చటంలో.. అరవైలలో వరూధిని పరాజితురాలైంది. ఎనభైలలో పందొసంత గెలిచింది. పాతికేళ్ళ తరువాత ఇప్పుడిక పరాజయాల ప్రసక్తే లేదు. ప్రపంచం మంతా పందొసంతల స్వాధీనం అయిపోయింది.

 6. అభివృధ్ధి అనే భావన మొదటగా మనిషి ఉనికిని, సొంత అస్తిత్వాన్ని పోగొడుతుంది. మూలింటిల్లు అంగడిల్లు అవుతుంది. అభివృధ్ధి నిరంకుశంగా వుంటుంది – కాళ్ళచుట్టూ చుట్టుకలాడే అమాయకమైన పిల్లులను వాటికేమీ సంబంధం లేని ఆస్తి కోసం చంపిస్తుంది. సొంతకాళ్లమీద నిలబడి సంకటి తినేవాడికి కుచ్చునబెట్టి కూడేసే స్థితిని కల్పిస్తుంది. అప్పుల అవసరం కల్పించి చిన్న పొరపాటొస్తే ఎగించి రొమ్ములమీద తన్నించుకునేలా చేస్తుంది. రాజకీయుల , వ్యాపారవేత్తల బాసటతో వీరంగాన్ని సృష్టించి తనుచేసేది ఒప్పనే నిర్ణయానికి రప్పిస్తుంది. అవసరమైతే అనాగరికతని, లొసుగులని ఎత్తి చూపుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.
  పెట్టుబడి స్వభావాన్ని దాని వికృత పార్శ్వాలను, భిన్న కోణాలను కథలో దర్శింపచేసి దాని పర్యవసాలను మనముందు పెట్టి మనలను నిలదీస్తాడు. ప్రకృతికి , సాధారణ జీవన విధానానికి మనం ఎంత దూరం ప్రయాణించామో, ఎంత విధ్వంసం చేసి, ఎంత విధ్వంసానికి గురై ఈ ఘనకార్యం సాధీంచామో పతంజలి వ్యంగంతో, తనదైన బాణీలో ఎత్తిపొడిచాడు. భారత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ భూస్వామ్య భావజాలం నుండి , దాని అవలక్షణాలను కొనసాగిస్తూనే పెట్టుబడి ఆర్ధిక వ్యవస్థగా ఎలా రూపాంతరం చెందిందో అత్యంత సూక్ష్మంగా , అత్యంత నిశితమైన పరిశీలనతో వివరించే ఈ పుస్తకం మీద ఒక థీసిస్సే రాయొచ్చు.

  ఏదో సాధించామని వెనక్కి తిరిగి చూసుకుంటే , ఏది కోల్పోయామో అది వెక్కిరిస్తూ కనపడుతుంది. అందుకే చదువుతున్నప్పుడు , చదివిన తరువాత ఒక బాధ. మనలో నారాయుడు బయటకొచ్చి తప్పయిపోయిందని పశ్చాత్తాప పడతాడు. కానీ ఏం ప్రయోజనం – అప్పటికే పందొసంత మూలింటామెను చంపేసింది. రెండు నిముషాలు మౌనం పాటిద్దాం.

 7. ఈ నవల చదవడం చాలా కష్టం గా బాధ గా వుంటుంది.భాష ,మనం వినడానికి వాడటానికి సంకోచించే
  బూతు పదాలు ఉండటం ఒకటి ,మనం ఊహించలేని అక్రమ సంభందాలు ఈ రచయిత భాష లో చెప్పాలంటే “లంజరికాలు” ఇంకా ఎన్నో మన కి ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయి.నేను అందరి లాగా నే పల్లెటూరు లో పుట్టి పెరిగిన వాడినే.పల్లెటూళ్ళ లో అక్రమ సంభందాలు వ్యాపారం చేసి డబ్బుసంపాదించే వాడు వ్యవసాయంచేసేవాడి కంటె ఎక్కువ తెలివిగా సంపాదించడం ఇవన్ని మనం చూస్తూనే వుంటాం. వీటి ఎనాలిసిస్ మనం చేయం ..
  ఈ నవలలో ఆడ మనిషి తన అక్రమ సెక్స్ సమ్భ్హన్దాలని వాడుకుని వ్యాపారం లో సక్సెస్ అవడం పరమ సినికల్ గా చూపిస్తాడు రచయిత. పిల్లు లని ప్రేమించే మోలింటామె పొలం అమ్మడాని కి సంతకం చేయలేదని ఆమె కి ఇష్టం అయిన పిల్లి పిల్లలని హత్యా చేయడం ఎంతో క్రూరం గా హృదయ విదారకం గా వుంటుంది.అలా ఆమె ఆత్మహత్య చేసుకోడాని కి కారణం అయినా, డబ్బు సంపాదించుకుంటూ ముందుకు పోయే వసంత లాంటి మనుషులు ఉండె వుంటారు .ఇద్దరు పిల్లలు పుట్టినాక లేచి పోయిన రూపవతి కంటె పరాయి మగ వాళ్ళ తో సంబంధాలు పెట్టుకుని చాలా మామూలు గా వుండి పిల్లులని చంపినా పందోసంత మనకి పరమ నీచురాలిగా కనిపిస్తుంది.కాని వూళ్ళో ఆడవాళ్ళకి ఆమె గొప్ప ప్రయోజకురాలు గా కనిపిస్తుంది.ఇవన్ని నిజమైతే మన గ్రామాల్లోని విలనీ నగరాలని మించి పోయింది.ఈ నవల లోని ఆఖరి వాక్యాలు సంఘటనలు నన్ను ఎప్పటికి ఎప్పటికి వెంటాడి హంట్ చేస్తాయి.చాలా డిస్టర్బ్ చేస్తాయి. ((నా మనమరాలు లేచి పోయింది గాని పిల్లులని చంప లేదే!)

 8. ఏ ఉద్దేశ్యంతో, ఏ ప్రయోజనం ఆశించి నామిని గారు (‘ప్రపంచీకరణ వికృతిని దర్శించి తృణీకరిస్తున్న నిర్మల మనస్కుడు నామిని’) “మూలింటామె” ను రాసారో వారి నుండే వినే అవకాశం కోసం ఎదురుచూద్దాం.

  “ మనిషి తెచ్చిన భూకంపం ( ప్రపంచీకరణ వికృతి ) వల్ల పల్లెల్లో కూలిపోతున్న చెట్టు చేమ, కూడు గూడు, మనిషి పశువు, మానం దానం, సర్వం సమస్తం ఉన్నాయని “

  “ బహుముఖమైన గ్రామీణ జీవన వైవిధ్యం, మానవ పరిణామ క్రమంలో ‘మనిషి-మొక్క-పశువు’ మధ్య ఏర్పడ్డ ఆత్మీయ త్రికోణ బంధం, సహజ గ్రామీణ జీవనంలో బ్రతుక్కు శ్రమకు ఉన్న సంబంధం, మనిషికి మనిషికి మధ్య ఉండే ఆత్మీయతలు ఇవన్నీ పెట్టుబడి చొరబాటుతో, గుడు గుడు చంద్రుళ్ళు, పందొసంతల పెనవేతతో ఏమవుతాయో, మూలింటామెలు, నడిపింటామెలు, కొనామెలే కాక మేడి, కాడి, ఎద్దు, చెలక, అరక, ఆకు, కొమ్మ, రెమ్మ, చెట్టు, ఆఖరికి ఏ హానీ చేయని ప్రేమమయ పిల్లులూ ఎలా కనుమరుగై పోతాయో ‘మూలింటామె’ లో నామిని చూపించారు “.

  అన్న భూసారం శివన్న గారి వివరణతో “మూలింటామె” పుస్తకంను విస్తృత పరిధిలో అర్ధం చేసుకోవటానికి వీలవుతుందని నమ్ముతున్నాను.

  [ భారత జాతీయ ఉత్పత్తి సంపదలో (GDP) వ్యవసాయం 18 శాతంను మించలేదు. భూమి లేని నిరుపేద కుటుంబాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైతుల ఆత్మ హత్యలు, బ్రతుకు తెరువు కోసం గ్రామీణ కూలీలు పట్టణాలకు వలస పోవటం ఆగటంలేదు. దేశ జనాభాలో 70 శాతం ప్రజలు నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలివ వసతులకు, సరైన అభివృద్ధికి నోచుకోవటంలేదు.]

 9. “మూలింటామె” చదివాక దానిమీద ఖదీర్ బాబు, భూసారం శివన్న ఇక ఇప్పుడు మెహెర్ సమీక్షలు చదివాను.
  సహజంగానే నామిని రచనల అభిమాన పాఠకుడిగా పాజిటివ్‌గా చదవడం మొదలెట్టాను. రచన అద్భుతంగా వున్నా మొదటి భాగం నుండి తర్వాతి భాగానికి కథకుడి గొంతులో మార్పు వచ్చినట్టు గమనించాను.

  ఖదీర్ బాబు సమీక్ష చదివినప్పుడు అది సమీక్షగా కాక ముందే పెట్టుకున్న అక్కసుతో రాసినట్టు అనిపించింది. నున్నా నరేష్ గారు కుడా ఇదే మాట అనడంతో చెప్పడానికి నాకు మరింత ధైర్యం వచ్చింది.

  ఇక భూసారం శివన్న ఈ కథను పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల దుష్పలితాలు వగైరా కళ్ళద్దాలుతోనే సమీక్షించారనిపించింది. ఒక కథను కథలా, జీవితాన్ని జీవితంలా కేవలం దానికి దర్పణంలా రచన వుండకూడదా? రచయితకు, రచనకు లేని లక్షణాలని, ఉద్దేశాలని ఆపాదించడం ఎందుకు? అయినా అవి లేవు అనుకోవడం కూడా ఒక ఉద్దేశాన్ని ఆపాదించడమే అవుతుంది.

  ఇక మెహెర్ సమీక్ష మొహమాటపడుతూ సాగింది. రచయితతో వున్న అనుబంధమో, స్నేహమో, శత్రుత్వమో రచనల సమీక్షమీద పడకూడదు.

  మొదటిభాగానికి, రెండవ భాగానికి కథకుడి స్వరంలో తేడాను “మొదటి భాగం దేవుడు చెప్పాడు, రెండవ భాగం దెయ్యం చెప్పింది” అనడం ద్వారా రచయితే అంగీకరించారు.
  రచయిత సమక్షాన్ని “మరి నేను పుస్తకం మొదులుపెట్టటమే ‘మంచి శుక్రోరం’ అని మొదలుబెట్టినాను కదా. అది ‘మంచి శుక్రోరం’ ఎట్టయ్యింది. రచయిత చేప్తేనే కదా అయ్యింది.” అని సమర్థించుకోవడమూ అతకలేదు. రాయి మీద కథ రాయాలో, రత్నం మీద కథ రాయాలో రచయితకు స్వేఛ్ఛ వుంది అలాగని రాయితో కథ మొదలెట్టీ దాని సహజ న్యాయ, స్వభావాలకు విరుద్దంగా కథ రాయడం మాత్రం రచయిత చేతిలో లేదు.

  అయితే ఏది సహజ న్యాయం అనేది మళ్ళీ పెద్ద ప్రశ్న. పెళ్ళయి నెల కాకుండానే పందొసంత మొగుడి తమ్ముడి వరసయ్యే వాడితో సంబందం పెట్టుకుంటుంది. కొంత మంది అభ్భే ఇలా జరగనే జరగదు, ఇది సహజం కాదు అనొచ్చు. అది మామూలుగ జరగనిదో, అనుభవంలో లేనిదో అయినంత మాత్రాన పందొసంత లాంటి వాళ్ళు ఉండరు, వుండాటానికి వీళ్ళేదు అనలేము గదా!

  ఖదీర్ బాబు తన సమీక్షలో “కాని నిజంగా మునుపటి గ్రామీణ సమాజం ఈమెలా లేదు. అది ఆమె అత్త మూలింటామెలా ఉంటుంది.” అంటారు. బహుశా అది ఆయన గమనింపు, అనుభవం, అవగాహన. ఖదీర్ బాబు అనుకున్నట్లు ముడొంతుల గ్రామీణ సమాజం ములింటామెలా వున్నా, ఆ మూడొంతుల సమాజాన్నే కథ ప్రతిభింభించాలి అని ఎందుకనుకోవాలి? ఒక్క పందొసంత చాలదా ఈ కథకి.

  పందొసంత వ్యవహరం ఇంత మందికి తెలిసినా ఎవరూ మిన్నకుండటం పల్లె వాతావరణంలో పెరిగిన నాకు ఆశ్చర్యమనిపించలేదు గానీ, గుడుగుడు చంద్ర బార్య వచ్చి పందొసంతను నిలదీసినపుడు పల్లెలో ఎవరూ గుడుగుడు చంద్ర బార్య వైపు ఎవరూ మట్లాడకపోవడం కాస్త ఆశ్చర్యమనిపించింది. కానీ అది అసాధ్యమో, అసహజమో అనిపించలేదు.

  మరొక ఆశ్చర్యం తన కూతురు ఒకడితో లేచి పోయాక పట్టుబట్టి తన అన్నకు పందొసంతను తెచ్చి చేసిన నడిపామె రెండవభాగంలో పుర్తిగా కనుమరుగవుతుంది. మూలింటామె గానీ, నడిపామె గానీ నోరెత్తకపోవడానికున్న ఒకే ఒక కారణం “అరవమాదిగొనితో పోయిన నీ కూతురులా” అంటూ ఎత్తిపొడుస్తుందేమోననే భయం. కానీ నిప్పులా వున్న ఆడదే అలా ఎత్తి పొడవగలిగే ధైర్యం చేస్తుంది. పందొసంత ఇంట్లోనే అంత చేస్తున్నా నడిపామేకు ఇంత కథలో ఒక్క మాటా లేకపోవడం విచిత్రం.

  • ఇది సమీక్ష కాదు; టాగ్ వేరే దొరక్క “వ్యాసం” అని తగిలించాం గానీ, అది కూడా కాదు. నామినితో నా పరిచయం నేపథ్యంలో ‘మూలింటామె’ పఠనానుభవం ఎలా సాగిందో తల్చుకోవటం; నామిని పట్ల నా గౌరవాభిమానాలు బయటపెట్టుకోవటం. అందుకే, నరేష్ గారన్నట్టు, “పరామర్శలకు సంబంధించిన పాత రచనాసూత్రాలకు బద్ధుడ్ని” కాదల్చుకోలేదు. I think it’s pretty evident.

 10. నాకు ఈ నవల్లో రెండవ భాగం నచ్చలేదు. వ్యాసంలో ఎంత మీరు కన్విన్సింగ్ గా చెప్పడానికి ప్రయత్నించినా, ’వ్యక్తిగత ఏడుపు’ ను – సాహిత్యం గా భావించడానికి ’ఏదో’ అడ్డుపడుతూ ఉంది.

 11. ‘మూలింటామె’ ని బాగా అర్థం చేసుకోవటానికి సాయపడిన. బాపు గారు, భూసారం శివన్న, (సాక్షి పత్రికలో) ఖదీర్ బాబు, ఇప్పుడు మెహర్ గార్లకు; ‘రక్తమాంసాలూ రాగద్వేషాలతో సజీవంగా చలించిపోయే మానవమాత్రుడు’ నామిని గారికి; మానవత్వం, మౌలిక విలువలూ మట్టివాసనల మాండలీకంతో అలంకరించి అందించే నామిని గారికి కృతజ్ఞతలు.

  మూలింటామె గురించీ, నామిని గురించీ… – మెహెర్

  మొదటిభాగం అంతా ఒక్క ఊపులో, ఆయన ఎలా ‘ఉమాదం’తో ఆన్చిన పెన్ను పైకెత్తకుండా రాసి ఉంటాడో అలానే, చదివేశాను. జీవితం నామిన్ని రాతగాడిగా నియమించుకుని అంతా చెప్పి రాయించుకున్నట్టు సాగిపోయింది. ‘మొదటిభాగం దేవుడు చెప్తున్నాడు, రెండో భాగం సైతాను చెప్తున్నాడు’ అన్న నామిని మాట నాకు ‘మూలింటామె’ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటానికి సాయపడింది.
  జీవితంతో కాంటాక్టు నిలుపుకున్నంతవరకూ ఏ రచయితా వట్టిపోడు, చచ్చిపోడు. నామిని వరకూ ఈ ‘మూలింటామె’ దానికి ఋజువు. ఎంతో జీవితాన్ని, ఎంతో సౌష్టవంగా వెలిబుచ్చిన నవల ఇది.

  http://patrika.kinige.com/?p=2322
  నామిని ‘మూలింటామె’ నవలపై బాపు స్పందన

  రాముణ్ణి తలచుకున్నా మీ రచనలు చదువుతున్నా ఎమోషన్ తట్టుకోలేను. కేవలం పట్టలేని ఆనందంతో. మీ రచన కలచి వేసింది – కథనం అనండి, పాత్రల చిత్రీకరణ – వారి మనస్తత్వాలు – వర్ణనలు – ఈ మాటు మిమ్మల్ని మీరే మించిపోయారు. మీ భాష చదువుతుంటే కళ్లమ్మట నీళ్లు తిరిగేవి. ‘మూలింటామె’ గురించి మీ నోటంబట అనేక విషయాలు తెలుసుకోవాలని వుంది. అంతగా కలచి వేసింది. ప్రతీ దృశ్యం కళ్లను కట్టినట్టుంది! నవల చివరి వాక్యానికి సాటి లేదు.

  http://patrika.kinige.com/?p=2722
  ప్రపంచీకరణ వికృతిని దర్శించి తృణీకరిస్తున్న నిర్మల తాత్వికత ‘మూలింటామె’ – భూసారం శివన్న

  “ మూలింటామె మంచి శాల్తయిన ఆడమనిషని, ఆమె కథలో గంగా బొండం జలమున్నాదని, గుండెలు మెలిబెట్టే అంతులేని బాధున్నాదని, భూకంపమొచ్చి కూలిపోతున్న చెట్టు చేమ కూడు గూడు మనిషి పశువు మానం దానం సర్వం సమస్తం ఉన్నాయని. ఇది ప్రకృతి తెచ్చిన భూకంపం కాదు, మనిషి తెచ్చిన భూకంపం “. ~ భూసారం శివన్న

  http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/21062014/4

  మూలింటామెకు కొంత పొలం ఉంది. ఏవేవో జరుగుతాయి. ఆ పొలం అమ్మాల్సి వస్తుంది. ఆమె విషం ఆకు తిని ఆత్మహత్య చేసుకుంటుంది. గతంలో వచ్చిన కథల్లో వలస, కరువు, పండిన పంట గిట్టుబాటు కాకపోవడం, కొడుకూ కోడలు తకరారు… ఇవన్నీ భూమిని అమ్మడానికి కారణాలు. కాని మూలింటామెలో? ఇది 1980ల నాటి తెలుగు గ్రామీణ జీవితాలపై ఒక స్టేట్‌మెంట్. ‘అభివృద్ధి’ అనే ఊహ నెమ్మదిగా మొదలై ఎన్నేళ్లు కష్టపడ్డా ఏ వెలుతురూ ఇవ్వని వ్యవసాయంపై రోసి వ్యక్తులు ఎలా పతనం కావడం మొదలుపెట్టారో చూపే శ్వేతపత్రం.

  మూలింటామె లో కథ ఉంది. వస్తువు ఉంది. ప్రపంచంలో ఏ రచయితా డీకొట్టలేనంత అద్భుతమైన సంభాషణా చాతుర్యం ఈ నవలలో అణువణువూ ఉంది. ~ ఖదీర్

  http://trishnaventa.blogspot.in/2014/05/blog-post_26.html
  మూలింటామె ~ తృష్ణ

 12. నామిని పట్ల prejudicesతో ఆయన రచనలు క్షుణ్ణంగా చదివాను ఒక phase లో. మరో రూపంలోకి వంకర తిరిగిన prejudicesతోనే ఆయన రాతలు చదవడం ఆపేశాను తర్వాతి phaseలో. ఈ రెండు దశల ఫలితంగా – ఈ చేరువ దూరాల వైచిత్రిలో – చదవకుండానే convey ఐ పోతున్నాడు నామిని.

  అలా మూలింటామెని అర్థం చేసుకున్నందువల్లేమో ఆ మధ్య ఖదీర్ సాక్షి సాహిత్యం columnsలో రాసినది – objectivity లోపించడం వల్ల కాదు గానీ, ఏదో వ్యక్తిగతమైన అక్కసుతో రాసినట్టు contemptuous గా అనిపించింది. మూలింటామె గురించే కాకుండా, నామిని గురించి అని శీర్షిక లోనే విమర్శ, పరామర్శలకు సంబంధించిన పాత రచనాసూత్రాలకు బద్ధుడ్ని కాలేదని (కాలేననీ) ముందస్తు ప్రకటన చేసిన మెహర్ పరామర్శలో కూడా objective కన్ను ఉద్దేశపూర్వంగానే మూసుకుపోయింది. ఇందులోనూ స్వకీయ పురాణాంశాలు మిక్కుటంగా ఉన్నా, ఇది అద్భుతం అనిపించడానికి ఈ వ్యాసంలోని నైశిత్యమే తప్ప, మెహర్ మీద నా prejudices కారణం కాదు. :-)

 13. జంపాల చౌదరి గారూ,
  నిజమే .చాలా తేడాలున్నాయి అకస్మాత్తుగా స్ఫురించిన పోలికల్ని పట్టుకుని రెండు పాత్రల్ని కలిపి కొన్ని ఆలోచనలు చేయడం చాలా బావుంది
  ‘వరూధిని పతనం’ మంచి అనే భావనని గెలిపిస్తుంది
  ‘పందొసంత దుర్మార్గపు విజయం’ఒక వాస్తవాన్ని కళ్ళకి కట్టింది

 14. @ malleeswari: I too thought of Varoodhini as I was reading this book, though there are important differences between her and vosantha. The latter is far more smarter and quite capable of taking care of herself and others around her.

  I do disagree with Meher in that I think Naamini did have a broader purpose in mind than just describing life. The other disagreement is about the readability of the second part. I don’t think that the issue is readability, but difficulty in empathizing with the featured characters.

  • మనకున్న ఎన్.ఆర్.ఐ మేధావుల్లో జంపాల చౌదరిగారు అగ్రగణ్యులు. పాతికేళ్లుగా తెలుగు సాహిత్యానికి తలలో నాలుకలా వుంటూ వస్తున్నారు. ‘తానా’ సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లి అక్కడ జనజీవనాన్ని లీలామాత్రంగా నైనా పరిశీలించడానికి మన అభిమాన తెలుగు రచయితలకు అంత తాహతు వుండదు. అంపశయ్య నవీన్, శ్రీరమణ వంటి రచయితలను అక్కడకు పిలిపించుకోవడంలో, మన తెలుగువారందరి తరపున సన్మానించుకోవడంలో జంపాలవారి పాత్రను మరువలేము.

   ఈమెయిళ్లతో, బ్లాగులతో, ఫేస్బుక్కులతో పరిచయం ఉన్న వారందరికీ తెలిసిందే – ఆయన పుస్తకాల మీద లేటెస్టు సినిమాల మీద నిర్మొహమాటంగా ఎన్నో విషయాల మీద కామెంట్సు పోస్టు చేస్తూ ఉంటారని! ఇక్కడ కె.ఎన్. మల్లీశ్వరి ‘మూలింటామె’ని చదివి అభిప్రాయం post చేస్తే, దాని మీద జంపాల చిన్న కామెంట్ post చేశారు. అంత shrewd and particular.

   ఈ చిన్న తెలుగుసాహిత్యం టీకప్పులో ఇటీవలి తుఫాను ఏమంటే – ‘మూలింటామె’ని జర్నలిస్టు రచయిత అయిన ఖదీర్ బాబు సమీక్షిస్తూ, ‘పందొసంతను చెప్పుతో కొట్టి…’ ‘రచయితను (కొండమీంచి) తోద్దామంటే పాఠకులకు అందుబాటులో లేకపోవడం…’ ఇలా అప్రజాస్వామికంగా రాసినా… చౌదరి గారి నుంచి కామెంట్ లేకపోవటం ఆశ్చర్యమనిపిస్తుంది. ‘తానా’ బాధ్యుడిగా ఖదీర్ కామెంటుకు మౌనంగా వుంటున్నారంటే – సాహితీజర్నలిస్టుల్తో ‘మంచి’గా వుండాలన్న వ్యూహంలో భాగమా? (లేదా) అంత బీభత్సాన్ని సృష్టించిన నామినిని కొండ మీంచి తోసినా, తోయమని పాఠకులకు పిలుపు యిచ్చినా తప్పు లేదన్న అభిప్రాయమా!

 15. పందొసంతని మనిషిగా నేను ద్వేషించలేకపోయాను (రచయిత వ్యంగ్యం అడ్డు పడింది) ఒక సాహిత్య పాత్రగా ఆ వైల్డ్ నెస్ ని అట్లా రాయగలిగినందుకు ప్రేమ కలిగింది. మట్టిమనుషులు నవలలో వరూధిని గుర్తొచ్చింది

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.