cover

సైన్సూ, ఆధ్యాత్మికతల ఉత్కంఠభరిత మేళవింపు: అహో! విక్రమార్క

Download PDF ePub MOBI

మనిషి ఎదుగుదలలో కీలకపాత్ర పోషించినది జిజ్ఞాస. తెలియనిదాన్ని తెలుసుకుని తనకి అనువుగా మార్చుకుని పురోగమించాడు మానవుడు. ఎన్నో రంగాలలో విశేష జ్ఞానం పొంది విజ్ఞాన సాగర మధనం జరిపినా, మనిషి మృత్యువు రహస్యం కనుక్కోలేకపోయాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అపారమైన జ్ఞానం ఆధారంగా మిగతా ప్రాణికోటి కంటే అధికుడయ్యాడు మానవుడు. మనుషుల్లోనూ జ్ఞానం అధారంగా బేధభావాలు ఏర్పడ్డాయి. కాలక్రమేణా జ్ఞానం స్థానాన్ని ధనం ఆక్రమించింది. ఆధునిక సమాజం ధనం ఆధారంగా వర్గీకరించబడుతోంది.

లౌకికమైన జ్ఞానం కన్నా, పారలౌకిక జ్ఞానం మనిషికి ఎప్పుడూ ఆసక్తిగొల్పుతునే ఉంది. దేవుడు, ఆత్మ, మరణం, మరుజన్మ… ఈ అంశాలు జిజ్ఞాసువులను వేధిస్తునే ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధన చేసే వారితో పాటుగా సామాన్య పాఠకులకూ ఈ అంశాలపై ఉత్సుకత ఉంటుంది. ఆధ్యాత్మిక రంగమూ, జ్యోతిష్యమూ, నాడీ శాస్త్రమూ, మొదలైన రంగాలను సృశిస్తూ చేసిన రచనలు జనాదరణ పొందాయి, పొందుతునే ఉన్నాయి. గతజన్మ, ప్రస్తుత జన్మ, పునర్జన్మలపై వెలువడిన మొదటి నవల మాస్టర్ రైటర్ సూర్యదేవర రామ్‌మోహనరావు రాసిన “అహో! విక్రమార్క”. తొలుత ప్రముఖ వారపత్రిక స్వాతిలో సీరియల్‌గా ప్రచురితమై, తదుపరి నవలగా వెలువడింది.

ఓ మాములు సాదాసీదా కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి, డబ్బు లేక దుర్భర దారిద్ర్యం అనుభవిస్తాడు విశ్వాత్మ. పెళ్ళయిన కొద్ది రోజులకే భార్యని పోగొట్టుకుంటాడు. ధనరాహిత్యం వల్ల సమాజంలో ఎన్నో అవమానాలను ఎదురుకుంటాడు. డబ్బంటే కసి పెంచుకుంటాడు. తీవ్రంగా శ్రమించి శరీరాన్ని మేధస్సుని పూర్తిగా వినియోగించుకుని రూపాయిని పది రూపాయలుగా, పది రూపాయలని వందగా, వందని వేలుగా, వేల రూపాయల్ని లక్షలు, కోట్లుగా మార్చి ధనవంతుడవుతాడు. ఎన్నో పరిశ్రమలు స్థాపిస్తాడు. దేశ పారిశ్రామిక రంగాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు. సుఖాన్ని, ఆనందాన్ని, విశ్రాంతిని పక్కకి నెట్టి మొండిగా డబ్బు కోసమే బతుకుతాడు. జీవితం అంత్యదశకొచ్చేసరికి, తాను జీవితంలో ఏమీ అనుభవించలేదనీ, ప్రేమ, ఆప్యాయతా, అనురాగాలు ఈ జన్మలో పొందలేకపోయానని గ్రహిస్తాడు.

తను కూడ బెట్టిన ఈ సంపదని అనుభవించే అవకాశం ప్రస్తుత జన్మలో లేదు కనుక, మళ్ళీ జన్మించి ఈ ఆస్తిని, ప్రేమానురాగాలని పొందాలని తపిస్తాడు. తన మరణ సమయాన్ని తెలుసుకోడానికీ, తనని కలలో వెంటాడే పురాతన స్మృతులను అర్థం చేసుకోడానికి నాడీ జ్యోతిష్యుడిని సంప్రదిస్తాడు. నాడీ జ్యోతిష్యంలోని మృత్యుకాండ ప్రకారం తన మరణ కాలాన్ని తెలుసుకుంటాడు. తరువాత మృత్యుకోనలోని ప్రమాదకరమైన, ఘోరారణ్యంలోకి ప్రవేశించి సిద్ధమునిని కలుసుకుంటాడు. తనకి పునర్జన్మ ఉన్నదీ లేనిది చెప్పమంటాడు. తదుపరి జన్మలో ప్రాణిగా పుడతావని చెబుతాడు సిద్ధముని. మానవ జన్మ లభిస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటాడు విశ్వాత్మ. ఆ విషయం తెలపడం తన శక్తికి మించిన పని అని, అమర్‌నాథ్ గుహల్లోని హిమలింగస్వామి తెలుపగలరని ఆయన చెబుతారు. విశ్వాత్మ హిమాలయాలకు బయల్దేరి, అర్హులకు మాత్రమే దర్శనమిచ్చే హిమలింగస్వామిని కలుస్తాడు. విశ్వాత్మ తదుపరి జన్మలో మానవుడిగానే జన్మిస్తాడనీ, అయితే, ఈ జన్మలో బలవన్మరణం పొందితేనే పునర్జన్మ సాధ్యమని చెబుతారు హిమలింగస్వామి.

Aho vikramarkaవిశ్వాత్మ చనిపోవాలని నిశ్చయించుకుంటాడు. కాని చనిపోయే ముందు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. తన ఆస్తిని కొత్త జన్మలో తానే అనుభవించేందుకు – ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ని రూపొందించి అందులో తన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను, వాటి జవాబులను ఫీడ్ చేస్తాడు. తన వైద్యుడు, మానసిక నిపుణుడు, వ్యక్తిగత అంగరక్షకులతో ఓ ట్రస్ట్‌ని నియమించి, తన తదనంతరం ఆస్తి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్తాడు. పునర్జన్మ పొందిన తాను వచ్చి ఆ ఆస్తిని క్లెయిమ్ చేస్తానని, అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినవారిని, గతజన్మలో విశ్వాత్మగా అంగీకరించాలని వీలునామా రాయిస్తాడు. తన చివరి పుట్టిన రోజుని ఘనంగా చేయాలనుకున్న ఫాక్టరీ కార్మికుల కోరికని మన్నిస్తాడు. తర్వాత తనకు మాత్రమే తెలిసిన ఓ నిధిని ఓ చోట భద్రంగా దాస్తాడు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తయ్యాయని నిర్ధారించుకున్నాకా, వైన్‌లో విషం కలుపుకుని తాగి తనువు చాలిస్తాడు. ఇది జరిగిన ముప్ఫై ఏళ్ళకి కథ తిరిగి మొదలవుతుంది.

ఓ దొంగ స్వామిజీని అరెస్టు చేసిన పాపానికి సస్పెండ్ అవుతాడు అన్వేషి అనే సిబిఐ ఆఫీసర్. తానే రాజీనామా చేసి బయటకి వచ్చేస్తాడు అన్వేషి. అదే సమయంలో విశ్వాత్మ ఫౌండేషన్‌కి ఓ సమర్థుడైన డిటెక్టివ్ అవసరం ఉందన్న ప్రకటన చూసి, ఇంటర్వ్యూకి వెళ్ళి ఎంపికవుతాడు. 3170 కోట్ల 60 లక్షలు విలువైన ఆస్తులున్న విశ్వాత్మ ఫౌండేషన్ ట్రస్ట్ గత ముఫ్ఫై ఏళ్ళ విశ్వాత్మ వారసులంటూ వచ్చిన వారి నిగ్గుదేల్చి వారిని తిప్పి పంపింది. విశ్వాత్మ ఆస్తి మోసగాళ్ళ బారిన పడకుండా కాపాడడమే ట్రస్ట్ పని.

ఇక్కడిదాక వచ్చాక, కథ వేగం పుంజుకుంటుంది ఆస్తిని రాబట్టుకోడానికి కొందరు చేసే ప్రయత్నాలు, పన్నిన కుయుక్తులు, హత్యలు, అపర మేధావి అనిపించుకున్న జపాన్ కంప్యూటర్ నిపుణుడిని ఇండియాకి రప్పించి, క్రిప్టోగ్రాఫ్ లోని కోడ్‌ని రహస్యంగా దొంగిలిస్తుంది ఓ ముఠా. ఆ జపాన్ కంప్యూటర్ నిపుణుడి మనవడిని విశ్వాత్మగా ప్రకటించి భారతదేశానికి తీసుకువస్తారు. అతను తన మేధస్సుతో క్రిప్టోగ్రాఫ్ లోని ప్రశ్నలకు జవాబులు సాధించడం, కంప్యూటర్ పరీక్షలో నెగ్గినా, ట్రస్ట్ సభ్యులు పెట్టే తదుపరి పరీక్షలలో విఫలమవడం, ఎలాగైనా ఆస్తిని పొందేందుకు ఆ ముఠా చేసే ప్రయత్నంలో జరిగే హత్యలు… దాడులు, కథలో ఉద్విగ్నతని కలిగిస్తాయి.

ఇంతకీ విశ్వాత్మ తిరిగి జన్మించాడా లేదా, జన్మించినట్లయితే తన ఆస్తిని తాను పొందగలిగాడా… ఈ వివరాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి.

ఉత్సుకతని రేకెత్తించే ఇతివృత్తాన్ని తీసుకున్న రచయిత, కథనాన్ని నడిపిన తీరు సైతం పాఠకులని ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక విషయాలను ఎంత అలతి పదాలతో చెప్పారో, డబ్బు కోసం చేసే మోసాలు, కుట్రలను సైతం అంతే సులువైన శైలిలో వెల్లడించారు రచయిత. నాడీ జ్యోతిష్యం గురించి ఎన్నో వివరాలను కథానుగుణంగా వివరించారు. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువులను ఎంపిక చేసుకునే తీరుని వివరిస్తూ, ఆ పద్ధతి కూడా పునర్జన్మ ఆధారితమైనదేనని అంటారు. ఆసాంతం ఉత్కంఠను కలిగించే ఈ 430 పేజీల పుస్తకాన్ని మధుప్రియ పబ్లికేషన్స్, విజయవాడ వారు ప్రచురించారు. ప్రింటు పుస్తకం కినిగెలో లభ్యం. కినిగె వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు.

- కొల్లూరి సోమ శంకర్

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, పుస్తక సమీక్ష and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.