cover

మా బాబాయ్

Download PDF ePub MOBI

నాన్నేమో ఫొన్ చేసి అమ్మకి చెప్పమన్నాడు. అమ్మేమో “అమ్మలూ! గుడికెళ్ళి ముందు నాన్నామ్మకి చెప్పు. అలాగే దారిలో తమ్ముడు కనిపిస్తే తీసుకురా! ఎప్పుడనగా పోయాడో ఆటలకి” అంటూ తను మేజరు గారింట్లో చెప్పడానికి వెళ్ళింది. మేజరు గారికి చెపితే మా ఊర్లో సగం మందికి తెలిసినట్లే. గుళ్ళో నాన్నమ్మ కనిపించగానే పరిగెత్తుకెళ్ళి “రవి బాబాయ్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరోచ్!” అంటూ చెప్పేసా. అసలే నన్ను విన్నవాళ్ళంతా ‘మైకుగాని మింగిందేంటే ఈ పిల్ల!’ అంటారు. దాంతో వార్త ఊరంతా పాకిపోయింది.

ఆ మర్నాడు ఎప్పుడూ మా ఇంటికి రాని ప్రెసిడెంటు పెద్దరాజుగారు వాళ్ళబ్బాయి చినరాజుతో పాటు వచ్చేసి బాబాయిని తెగ మెచ్చేసుకున్నారు. మళ్ళీ సాయంత్రం చినరాజు, బాబాయి స్నేహితులు చందూ వాళ్ళతో వచ్చి బాబాయిని స్టేషన్ నుండి ఊర్లోకి ఊరేగిస్తూ తీసుకొచ్చే ఏర్పాట్లన్నీ చేస్తున్నామని చెప్పాడు.

నాకెప్పటినుండో ఊరేగింపులో అందరిలా ఈలలు వెయ్యాలని సరదా. చందు వెళ్తుంటే వెనకాలే వెళ్ళి “ఓసారి ఈల ఎలా వెయ్యాలో నేర్పించవా?” అని అడిగా. రెండు వేళ్ళు నోట్లో పెట్టి గాలి ఎలా ఊదాలో చెప్పాడు. ఇంకప్పటి నుండి ప్రాక్టీస్ మొదలు పెట్టా. గాలి తుస్సు బుస్సుమని వస్తొందేకాని ఈల మాత్రం రావటం లేదు. ఊది ఊది బుగ్గలు నొప్పెడుతున్నాయి.

ఆ రోజు సాయంత్రం అమ్మ ఫొను పెట్టేసి నాన్నతో మరింక నాన్నమ్మతో “ఈ రోజు ఇది రవిబాబు కోసం వచ్చిన ఆరో సంబంధం. వీళ్ళెవరో జమిందారులట!” అంటూ చెప్పి నవ్వింది.

“మనకు తగ్గ సంబంధం చూద్దాంలే అమ్మా! ఆ పెద్దరాజుకాని… ఈ జమిందారుగాని మనింటికిప్పుడు ఊరికే రావటం లేదు. కొడుకులా పెంచారు మీ ఇద్దరూ. వాడిని దూరం చేసుకోకండి” అంది నాన్నమ్మ.

నేను నోట్లో నుండి వేళ్ళు తీసి అడిగా “ఎందుకమ్మా? నాన్నమ్మ అలా అంది? వాళ్ళు మన బాబాయిని తీసుకుపోతారా?”.

అమ్మ నవ్వి “నువ్వింకా చిన్నదానివి. నీకిప్పుడే ఇవన్నీ అర్థంకావు” అంటూ వుండగా తమ్ముడు ఇంటికొచ్చాడు. నాన్న వాడికేసి ఓసారి అయోమయంగా చూసి “ఇదేవిటి? వీడిలా అయిపోయాడు?” అన్నాడు. “సెలవులిచ్చినప్పటి నుండి ఇంతే, ఆటలే ఆటలు. రోజు ఓ నాలుగు బకెట్ల వేన్నీళ్ళు పోస్తే కాని వదలటం లేదు వీడంటిచ్చుకొచ్చిన దుమ్ము” అంటూ అమ్మ వాడిని లోపలికి లాక్కెళ్ళింది.

నేనింకో సారి వేళ్ళు నోట్లో పెట్టి మళ్ళీ ఊదాను. ఈసారి ఎవరో బూర ఊదినట్లు రయ్యిన సవుండొచ్చింది. నాన్న నాకేసి ఉలిక్కిపడి చూసి “ఏమిటది?” అన్నాడు. “ఈల నాన్న! పొద్దున్నుంచి ట్రై చేస్తే ఇప్పటికొచ్చింది” అన్నా ఆనందంగా.

నాన్న నాకేసి సీరియస్‌గా చూస్తూ “అమ్మలూ! ఇప్పుడు నీ వయసెంతా?” అనడిగాడు. అబ్బా! ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదు ఈ నాన్నకి. ‘నీ వయసెంతా? నువ్విప్పుడు ఎన్నో క్లాసు?’ అంటూ అడిగిందే అడుగుతాడు. బిక్క మొహం వేసుకుని “ఏడు” అన్నా. “ఇంకో నాలుగు నెలలు పోతే ఎనిమిది” అంది నాన్నమ్మ వెనకనుండి.

నాన్న వెంటనే “ఊ! పెద్దదానివవుతున్నావ్! అలా కూర్చుని నే చెప్పేది శ్రద్దగా విను” అంటూ చెప్పాడు. “కలెక్టర్ అంటే మన దేశంలో అతి గొప్ప పదవుల్లో ఒకటన్నమాట. ఆ హోదాయే వేరు. బాబాయి ఇకపైన మన బాబాయి కాదు. వాడికి ఎన్నో బాధ్యతలు. ఇంతకు ముందులా మీతో ఆడాడు. మీ ఇద్దరు కూడా బాబాయిని ఇంక ఆడమని విసిగించకూడదు. వాడి మూలంగా మన ఇంటి హోదా కూడా పెరిగిందన్నమాట. ఈలలు వెయ్యడం కాదు. ఇకపైన నువ్వు హుందాగా వుండడం నేర్చుకోవాలి”.

నేనలాగే అన్నట్లు బుద్దిగా తల ఊపాను.

“అంతే కాదు. ఇవన్నీ తమ్ముడికి అర్థమయ్యేలా చెప్పు”.

“వాడికా! వాడు నా మాట వినడు నాన్నా!” అంటూ వుండగానే చినరాజొచ్చాడు.

“ఒక్కసారె కాదులే. పడుక్కునే ముందు కథలు చెప్పమంటాడుగా అప్పుడు చెప్పు. సరేనా! మా అమ్మలు బంగారు తల్లి!” అంటూ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాకెందుకో చాల కోపమొచ్చేసింది. అమ్మేమో నువ్వింకా చిన్నదానివంటుంది. నాన్నేమో పెద్దదానివయ్యావు తమ్ముడికన్నీ చెప్పూ అంటాడు. వాడేమో నే చెప్పిన మాట అస్సలు వినడు.

“అమ్మా!” అంటూ ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి అడిగా “హుందాగా వుండడమంటే ఎలా అమ్మా?”. అమ్మ ఓ నిమిషం ‘ఊ!… ఆ!…’ అంటూ ఆలోచించి “అంటే… పెద్దమ్మా వాళ్ళ రాణక్కలా అన్నమాటా” అంది.

‘ఓస్! అంతేనా!’ అనుకుంటూ… నా గదిలోకెళ్ళా. అల్మారాలో నుండి చున్నీ ఒకటి తీసి చీరలా చుట్టుకున్నా. కొంగు చేత్తో పట్టుకుని అద్దంలో చూస్తూ… రాణక్కలా అటూ ఇటూ నడుస్తూ చెప్పా “ఎవిటి వంటావిడ గారు! మరివాల భోజనాలలోకి కాసిన్ని జిలేబీలు… మరిన్ని మైసూర్‌పాక్‌లు చేసుకుంటే ఎలా వుంటుందంటారు?”.

* * *

వాడి మంచం మీద పడుకుంటూ ఎప్పట్లాగే “కథ చెప్పవా అక్కా!” అంటూ అడిగాడు తమ్ముడు. ముందు నే చెప్పేది వింటేనే కథ అంటూ నేను నాన్నలాగే మొహం పెట్టి “బాబాయి ఇకపైన మన బాబాయి కాదు” అన్నా.

“మరెవరి బాబాయ్?”

“మన బాబాయే కాని కలెక్టర్ అన్నమాట. అంటే చాల గొప్పన్నమాట…” అంటూ నాన్న చెప్పినవన్నీ ఒక్కొక్కటే చెప్పడం మొదలు పెట్టా.

వీడెక్కడ వినాలి పూర్తిగా! మధ్యలో ఆపి అడిగాడు “మనతో అస్సలు ఆడుకోడా?”.

“ఊహూ!”

“మరి జాంకాయలెవరు కోసిస్తారు?”.

“లచ్చుని అడుగుదాంలే”.

“మరింక పతంగులో! నాకు ఎగరెయ్యడం రాదుగా”.

నాకు తమ్ముడి మీద నిజ్జంగా జాలేసింది. చరకా అయితే పట్టుకుంటాడుగాని పాపం ఎగరెయ్యడం రాదే. కాళ్ళ దగ్గర వున్న దుప్పటి విప్పి కప్పుతూ “కలెక్టర్ గారు అలాంటి ఆటలు ఆడితే ఊర్లో అందరూ నవ్వుతారు” అన్నా.

తమ్ముడు వెంటనే దుప్పటి మొహం పైన కప్పేసుకుని “ఎందుకు మరి కలెక్టరవడం. హాయిగా ఆడుకోకుండా!” అన్నాడు.

నేను మొహం మీంచి దుప్పటి లాగేస్తూ “అలా కాదురా తమ్ముడూ! మరి పెద్దయ్యాక బాగ చదువుకోవాలి. పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి కదా!” అంటూ ఓ పక్కన చెపుతూనే వున్నానా… వాడేమో “నేనసలు పెద్దవను” అంటూ పక్కకి తిరిగి పోయి పడుక్కున్నాడు.

“అయ్యో! అప్పుడే పడుకుంటావేంటిరా? నేనింకా చాల చెప్పాలి”.

* * *

తీరా బాబాయిని తీసుకురావడానికి వెళ్తుంటే తమ్ముడు కనిపించలేదు. పొద్దున్నే ఆటలంటూ వెళ్ళిపోయాడంది అమ్మ. పోనిలే వొస్తే కుదురుగా ఓ చోటుండడు వాడు అన్నాడు నాన్న. నేను కూడా ‘హమ్మయ్యా!’ అనుకున్నా. స్టేషన్‌లో నుండి బయటకి వచ్చిన బాబాయి మెడలో దండలు వేసి పొడుగు బొట్టు పెట్టారు. నన్ను, నాన్నని చూసి చెయ్యూపాడు బాబాయి. చినరాజు, బాబాయి ఓపెన్ టాపున్న జీపులోకి ఎక్కి నిల్చున్నారు. నేను నాన్నా వేరే కారులో కూర్చుంటే… మిగిలిన వాళ్ళు వ్యాన్లో మరింక బైకుల మీద ఫాలో అయ్యారు.

జీపులో నిల్చున్న బాబయి ఏంటో కొత్తగా వున్నాడు. అంటే ఎప్పుడూ వున్నట్లు లేడు. తమ్ముడిని వాడి జిలేబి అడిగితే గోరుతో గిల్లి చిన్ని చిన్ని ముక్కలు పెడతాడే… అలా చాలా కొద్ది కొద్దిగా నవ్వుతున్నాడు. అదే నాన్నతో అంటే ‘అలాగే వుండాలి. అదే హుందా అంటే’ అన్నాడు.

కార్లు పెద్దరాజుగారి వీధిలోకి తిరిగాయి. నేను కంగారుగా “బాబయిని పెద్దరాజుగారింటికి తీసుకు పోతున్నారా?” అన్నా. “ఛ! లేదు. ఆయనే మనింటికి వస్తున్నారు” అన్నాడు నాన్న. ఈలోగా ఈలలు వినిపించాయి. చూస్తే సబితా వాళ్ళ మేడపై నుండి అమ్మాయిలంతా “రవి, రవి” అంటూ పిలుస్తూ ఈలలు వేస్తున్నారు. వాళ్ళని చూసి వెనకాల బైకులమీద ఒస్తున్న బాబాయి స్నేహితులు కూడా ఈలలు వేసారు. నాన్న మాత్రం ‘ఉత్త అల్లరి మూక’ అంటూ విసుక్కున్నాడు.

తీరా ఇంటికి వచ్చి చూస్తే పెద్దరాజు గారే కాదు మాకు ఊర్లో తెలిసిన జనమంతా అక్కడే వున్నారు. ఇంటి ముందు కుడి వైపు బాదం చెట్టు కింద ఓ నాలుగు కుర్చీలు వేసారు. పెద్దరాజు గారు ఓ కుర్చిలో కూర్చుంటే బాబాయిని మరో కుర్చిలో కూర్చో పెట్టారు. మరో రెండు కుర్చీలలో మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇంకో దాంట్లో మేజరు గారు కూర్చున్నారు.

నాన్నని కూడా కూర్చోమన్నారు కాని మా ఇంట్లో నాకు మర్యాదేమిటీ అంటూ వాళ్ళకి ఎదురుగుండా వున్న జనాలకి ఓ పక్కగా నిల్చున్నాడు. ఇంటి ఎత్తరుగుల పైన కుర్చిలో నాన్నమ్మా కూర్చుంటే – ఇంక మిగిలిన అరుగు పైన మరింక మెట్ల పైన అమ్మతో పాటు ఆడవాళ్ళందరూ కూర్చున్నారు. నేను నాన్న పక్కనే నిల్చున్నాను. బాబాయ్ నన్ను దగ్గరికి రమ్మని సైగ చేసాడు. నేను నవ్వి తల అడ్డంగా ఊపాను.

ముందు పెద్దరాజుగారు మాట్లాడుతూ బాబాయి ఊరికంతా మంచి పేరు తెచ్చాడని మెచ్చుకున్నారు. ఇక పైన ఊరి బాగోగుల చూసే తమకి తోడుగా వుండాలని అడిగారు. తరువాత హెడ్ మాస్టర్ గారు చిన్నప్పుడు స్కూల్‌లో బాబాయి ఎంత అల్లరి చేసేవాడో ఇంకెంత బాగా చదువుకునే వాడో చెప్పారు.

ఆ తరువాత మేజరు గారు లేచారు. మా ఊర్లో జరిగే ఏ ఫంక్షన్‌లోనైనా ఆయనే ఎక్కువ మాట్లాడుతారు. “అందరూ శ్రద్దగా వినండి. ఈ రొజునుండి రవిబాబు ఉత్త రవిబాబు కాదు. కలెక్టర్ రవిబాబు. నన్ను మేజరని ఎలా పిలుస్తారో ఊరంతా వారిని ఇకపైన కలెక్టర్ బాబు అనే పిలవాలి. మనమే కాదు. వారి అన్న గారైనా, అమ్మ గారైనా అంతే మరి”. అందరూ నవ్వుతూ తలలు ఊపారు. ఈసారి మేజరు గారు బాబాయ్ స్నేహితుల కేసి తిరిగి “ఏరా చందు! నువ్వు నీ స్నేహితులు కూడా… ఇంతకుముందులా అరే, ఒరేలు కుదరవు. జాగ్రత్త మరి” అన్నారు. వాళ్ళు ముసిముసిగా నవ్వారు.

అప్పుడే గుంపుని తోసుకుంటూ చందూ పక్కనుండి హటాత్తుగా బయటకి వచ్చాడు తమ్ముడు. పొద్దున్నననగా వెళ్ళి ఎండలో కాలవ ఓడ్డున ఆడుతున్నాడేమో మొహమంతా కంది పోయి… జుట్టు నిండా ఇసుకతో… వళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి వున్నాడు.

ఇంట్లోకి పరిగెత్తుకుని పోబోయినవాడళ్ళా బాబాయిని చూసి టక్కున ఆగిపోయాడు. కళ్ళు పెద్దవి చేసి చూసి నిక్కరు పైకి లాక్కుంటూ “ఏరా! బాబాయ్!… ఎప్పుడొచ్చావ్!” అన్నాడు. నేను కంగారుగా నాన్న కేసి చూసాను. అందరూ అప్పటికే తమ్ముడినే చూస్తున్నారు. తమ్ముడు మాత్రం బాబాయినే చూస్తూ ఓ రెండు అడుగులు అటువేసాడు.

దాంతో అమ్మ కంగారుగా “వాడినాపండి. రవిబాబు దగ్గరికెళ్ళిపోతాడో ఏమో! అసలే దుమ్ము కొట్టుకు పోయున్నాడు వెధవ!” అంటూ అరిచింది. దాంతో “ఒరేయ్ కన్నిగా! ఆగరా!” అంటూ నాన్న వాడికేసి పరిగెత్తారు. వాడు చటుక్కున వెనక్కి తిరిగి చందు కాళ్ళ మధ్య నుండి దూరి మాయమయ్యాడు. అందరం ‘హమ్మయ్యా! ‘ అనుకునేలోగా చినరాజు వెనకనుండి మళ్ళీ బయటకి వచ్చాడు.

ఈసారి అమ్మా నాన్న ఇద్దరూ కూడా “వాడిని పట్టుకోండీ! రవి దగ్గరికి వెళ్ళనివ్వకండీ!” అంటూ అరిచారు. తమ్ముడి సంగతి నాకన్నా బాగా ఎవరికి తెలుసుట. ఎప్పుడూ వద్దన్న పనే చేస్తాడాయే! గోడల నిండా గీయకురా అంటే గీస్తాడు. కంపాస్ బాక్సు ముట్టుకోకురా అంటే… లాక్కోని ఇంటి చుట్టూ పరిగెట్టిస్తాడు. నా క్లిప్పులతో నీకేం పని? వాటి జోలికి రాకు అంటే… అవన్నీ తీసుకెళ్ళి పేపర్ క్లిప్పులా తన పుస్తకాలకి పెట్టేస్తాడు.

ma babayఇప్పుడూ అంతే… వాడిని పట్టుకోడానికి వెళ్తున్న చినరాజు వెనక్కి చటుక్కున పరిగెత్తి కాళ్ళు రెండు గట్టిగా పట్టుకున్నాడు. అదిగో వాడితో అదే చిక్కు. పట్టుకుందామని వెళ్తే నా కాళ్ళు అలాగే పట్టేస్తాడు. అల్లరి వెధవ! నాకైతే వాడి జుట్టయినా అందుతుంది ఆపడానికి. పట్టుకుని… ఆపి… నడ్డి ఒంచి నాలుగు గుద్దులు గుద్దేస్తాను. చినరాజుకి పాపం అందడు కూడాను. పట్టుకోడానికి చినరాజు కుడి వైపు తిరిగితే కుడి వైపు తిరిగాడు. ఎడమ వైపు తిరిగితే ఎడమ వైపు తిరిగాడు. చినరాజు మూడు సార్లు గిరగిరా వెనక్కి తిరిగితే… రెండు కాళ్ళు అలాగే పట్టేసుకుని ‘ఇహిహిహిహీ…’ అంటూ వాడు తిరిగెసాడు. నా వల్లకాదు బాబు ఇంక నవ్వాపుకోడం.

ఇక తిరగలేక చినరాజు ఆగిపోయాడు. వెంటనే కాళ్ళు రెండు టక్కున వదిలేసి… నాన్నా.. అమ్మా.. చందు… అందరూ “కన్నీ, కన్నిగా… కన్నిబాబు… ఆగు! ఆగు!” అంటూ వుండగానే రయ్యిన పరిగెత్తి బాబాయ్ ఒల్లోకి ఎగిరి దూకాడు. కాళ్ళతో బాబాయ్ తొడల మీద కుమ్మేస్తూ… మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేసి… గాట్టిగా పట్టేసుకున్నాడు. మళ్ళీ విడిచి రెండు చేతులతో బాబాయి చెంపలు నొక్కేసి… మొహంలోకి చూస్తూ… “ఒరెయ్! బాబాయ్! నా కొసం ఏం తెచ్చావ్?” అంటూ ఊరంతా వినిపించేలా అరిచాడు.

నేను భయంగా నాన్నకేసి చూసాను. నాన్నా కోపంగా తమ్ముడినే చూస్తున్నాడు. ఈలోగా తమ్ముడు బాబాయి భుజం పట్టుకుని ఒంచి నడ్డి వెనక్కి వెళ్ళిపోయి ఓ చేత్తో జుట్టు పట్టుకుని… మరో చెయ్యి మెడ చుట్టూ వేసేసి గుర్రం ఎక్కేసాడు.

ఇంక ఆపుకోలేక బాబాయి పకపకా నవ్వుతూ వాడినలాగే ఎత్తుకుని లేచి నిల్చున్నాడు. జుట్టంతా చెదిరిపోయింది. తమ్ముడి తలలో సగం ఇసుక దానిలోకి వచ్చేసింది. పొడుగు బొట్టు చెరిగిపోయింది. చెంపల పైనా… ముక్కు పైనా మట్టి మరకలు. తెల్ల చొక్కా… తెల్ల ప్యాంటూ రంగు రంగులుగా అయిపొయాయి.

బాబాయిని అలా చూసి పెద్దరాజుగారితో సహా అందరూ గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళాని చూసి అమ్మా నాన్నా మిగిలిన అందరూనూ. నాకయితే అమ్మో! నవ్వి నవ్వి పొట్టలో నొప్పొచ్చేస్తోంది. నవ్వుతూనే బాబాయ్ నాకేసి తిరిగి “అమ్మలూ! ఇలారా!” అని పిలిచాడు. నేను వెంటనే పరిగెత్తుకెళ్ళి బాబాయిని చుట్టేసాను.

*

(P.S. – పూడూరి రాజిరెడ్డి గారి ఆర్టికల్ ‘అల్లరి వీళ్ళ కవల పిల్ల’ ఈ కథకి స్పూర్తి.)

 Download PDF ePub MOBI

Posted in 2014, కథ, జులై and tagged , , , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.