cover

పదనిష్పాదన కళ (10)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

ఎనిమిదో అధ్యాయం

సమాసాల సహాయంతో క్రియాపదనిష్పాదన
అవ్యయీభావ సమాసాల ద్వారా క్రియాపదాల నిష్పాదన:-

సంస్కృతంలో ఉపసర్గల్ని prepositions లాగా ఉపయోగించే పద్ధతి ఒకటుంది. ఈ క్రింది సాంప్రదాయిక ఉదాహరణల్ని పరిశీలించగలరు.

1. ఉప + హరి = ఉపహరి (హరికి దగ్గఱగా/ హరికి దగ్గఱగా ఉన్నటువంటిది)

2. అధి + గంగా = అధిగంగమ్ (గంగ వద్ద / గంగ వద్ద ఉన్నటువంటిది)

3. మధ్యే + మార్గమ్ = మధ్యేమార్గమ్ (దారి నడుమ/ దారి నడుమ ఉన్నటువంటిది, జఱిగినటువంటిది)

4. ప్రతి + రామ: = ప్రతిరామమ్ (రాముని గుఱించి /రాముని గుఱించి/ రాముని కొఱకు వ్రాసినది)

వీటిని అవ్యయీభావ సమాసాలు అంటారు. ఇక్కడ అనుకొన్న అర్థం గలిగిన ఉపసర్గల్ని ఇంగ్లీషు prepositions మాదిరి నామవాచకానికి ముందుచేర్చి అవ్యయీభావ సమాసాలేర్పఱచాలి. అనంతరం కావాల్సిన అర్థంలో వాటికి ‘ఇల్లుక్/ ఇంచుక్’ చేర్చుకుని క్రియాధాతువులుగా రూపొందించి పని పూర్తిచేసుకోవచ్చు. వీటికీ విస్తారమైన పద కుటుంబం ఉంటుంది.

ఉపసర్గ, నామవాచకాల మిశ్రణతో కల్పించిన కొన్ని నూతన అవ్యయీభావ క్రియలు :

1. అప + మార్గం = మార్గం కంటే వేఱుగా – అపమార్గించు = తప్పుదోవ పట్టించు (hijack); అపమార్గణ (n)

2. అవ + నావమ్ = అవనావం = అవనావం = నౌక నుంచి కిందికి – అవనావిల్లు = నావలో నుంచి దిగు (disembark); అపనావన (n)

3. ఇంచుక్ చేర్చగా, అవనావించు = నావలోంచి కిందికి దించు (to haul)

4. అను + రూపమ్ = అనురూపం = ఉన్న రూపాన్ని అనుసరించినది అనురూపిల్లు = to conform

5. అనురూపించు = ఉన్నరూపాన్ని అనుసరించి ఇంకో రూపాన్ని తయారుచేయు to replicate, to customize

అనురూపణ (n); (అనురూపత = conformity)

6. అభి + నది – అభినది = నదికి ఎదురుగా (river-front) = అభినదించు = నదికి ఎదురుగా నిర్మించు. అభినదన (n)

7. సమ్ + కాలౌ – సంకాలం = రెండు కాలాలు కలగలిసినది = సంకాలించు to synchronize సంకాలనం = (n) synchronization

8. ప్రతి + పాలం – ప్రతిపాలం = పాలకునికి పోటిగా ఉన్నది ప్రతిపాలించు = పాలకునికి పోటీగా ప్రవర్తించు. (సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పఱిచి పన్నులు వసూలు చేయు)

9. వి + జనం – విజనం = జనం లేనిది విజనించు (విజనీకరించు) = జనం లేకుండా చేయు. to de-populate. (వ్యతిరేకార్థకం – సజనీకరించు లేక జనాపించు. to populate.

10. పరి + నగరం – పరిణగరం = నగరం చుట్టూ ఉన్నది పరిణగరించు = నగరాన్ని చుట్టుముట్టు, నగరం చుట్టూ ఏర్పఱచు.

మఱికొన్ని ఇలా :

సహ + ఫలం – ఫలంతో కూడుకొని – సఫలిల్లు/ సఫలీభవించు = ఫలించు/సఫలమగు

(అలాగే ఇంచుక్ చేర్చగా) సఫలించు/ సఫలీకరించు = విజయవంతం చేయు

స్వ + స్థలం – స్వస్థలించు/ స్వస్థలీకరించు = (v) స్వస్థలానికి పంపు (repatriate);

స్వస్థలీకరణ = (n) repatriation

బహువ్రీహిసమాసాన్ని కలిగి ఉన్న/ కలిగి లేని’ అనే అర్థంలో వాడతారు. ముక్కంటి, తమ్మిచూలి, పుల్లుమావి మొదలైన తెలుగుపదాల్లోను, త్రినేత్రుడు, చక్రపాణి, మృగనయని మొదలైన సంస్కృత పదాల్లోను, heavy weight, feather-weight, south paw (left-hander) మొదలైన ఇంగ్లీషుపదాల్లోనూ మనకు ఇలాంటి నిర్మాణం కనిపిస్తుంది. సమాసం లో కలుస్తున్న రెండు పదాలకు విడివిడిగా ఉన్న అర్థం కన్నా భిన్నమైన కొత్త అర్థాన్ని బహువ్రీహి ఇస్తుంది. కలుస్తున్న పదాల్ని కాకుండా వాటిద్వారా వాటికంటే భిన్నమైన ఒక మూడో వస్తువుని/ వ్యక్తిని అది సూచిస్తుంది.

బహువ్రీహిలో పదసమ్మేళనాలు (word combinations) స్థూలంగా మూడురకాలుగా ఉంటాయి.

1. నామవాచకం + నామవాచకం

ఉదా:-శూలపాణి = శూలము పాణియందు గలవాడు

2. విశేషణం + నామవాచకం

ఉదా:- ఆర్ద్ర హృదయుడు = తడిసిన/ చల్లని హృదయం గలవాడు

3. క్రియావిశేషణం (past participle/ present participle) + నామవాచకం

ఉదా:- నతగాత్రుడు = వంగిన గాత్రం (శరీరం) గలవాడు.

బహువ్రీహినే కాదు అసలు ఏ చిఱుసమాసాన్నయినా మనం క్రియాధాతువుగా మార్చేసి వాడుకోవచ్చు. high-lighting, gate-crashing, hitch-hiking, tape-recording మొదలైన పదాల విషయంలో ఇంగ్లీషువారు అవలంబించిన విధానమిదే. శబ్దపల్లవాల రూపంలో తెలుగులో కూడా ఎప్పట్నుంచో ఈ పద్ధతి వాడుకలో ఉంది. ఈ క్రింది పదాలు ఉదాహ రణల కోసం నిష్పాదించినవి:

1. సమయ పాలన – సమయపాలించు = నిర్ణీత సమయాన్ని పాటించు

2. వ్యాసరూపం – వ్యాసరూపించు (అలాగే, గద్యరూపించు – paraphrasing) –వ్యాసంగా వ్రాయు

3. లిప్యంతరం = మఱో లిపి; లిప్యంతరించు = మఱో లిపిలోకి మార్చు

4. ఉరిశిక్ష – ఉరిశిక్షించు = ఉరివేసి శిక్షించు

5. క్రమశిక్షణించు = క్రమశిక్షణలో పెట్టు (to discipline somebody)

6. మున్‌తేదించు = ముందటి తేదీ వేయు (pre-date)

7. మఱుతేదించు = మఱుసటి తేదీ వేయు (post-date) మొ. (మఱుతేదీ చెక్కు – post-dated cheque)

8. స-తేదించు = అదే (ఉన్న) తేదీ వేయు.

బహువ్రీహితో కూడా మనం ఇలాంటి ప్రయోగాలు చెయ్యొచ్చు.

1. హతాశుడు – హతాశించు/ హతాశీకరించు (హతాశుడుగా చేయు) to frustrate

హతాశితుడు = frustrated

అలాగే, నిరాశించు = నిరాశపఱచు (to disappoint)

2. (వారసించు = వారసుడుగా చేయు x ) అవారసించు = వారసత్వానికి అనర్హుడుగా చేయు disinherit)

తన చిన్నభార్య సంతానాన్ని అవారసిస్తూ విల్లు వ్రాశాడు. అతని చిన్నభార్య సంతానం అవారసితులు.

అలాగే, నిర్వారసించు = వారసులు లేకుండా చేయు మొ ||

అలాగే, నిర్వంశించు = నిర్వంశనం = వంశనాశనం అతని కొడుకును అపహరించి, చంపేసి అతన్ని నిర్వారసించాడు. (నిర్వంశించాడు)

3. దృఢదీక్షిల్లు – గట్టి పట్టుదల పట్టు ఉదా:- ఎంజినీరింగ్ లో చేఱాలని ఆమె దృఢదీక్షిల్లింది.

(సకర్మకంగా అయితే –దృఢదీక్షించు = గట్టి పట్టుదల పట్టేలా చేయు) ఉదా :- ఎన్నికల్లో పోటీచేయాలని వాడు వీణ్ణి దృఢదీక్షించాడు.

4. కృతనిశ్చయిల్లు – కృతనిశ్చయుడు/రాలు అగు

(సకర్మకంగా అయితే-కృతనిశ్చయించు = గట్టి నిర్ణయం తీసుకునేలా చేయు)

5. వేగవంతించు - వేగిరపఱచు (to expedite, to accelerate)

బహువ్రీహి అంటే ‘పెక్కు వరిపంటలు’ అని అర్థం. వరిలో ఎన్ని రకాలున్నాయో బహువ్రీహిలో అన్నిరకాలు ఉన్నాయట. మఱో రకం బహువ్రీహి ఇలా ఉంటుంది.

ఉప + దశ – ఉపదశ = పదికి దగ్గఱగా (9 కావచ్చు, 11 కావచ్చు)

దీన్నుంచి మనం నిష్పాదించగల క్రియాధాతువు : ఉపదశించు – పదికి దగ్గఱగా పూర్ణాంకం వేయు (round figure చేయు)

ఇదే క్రమంలో – ఉపశతించు (వందకు దగ్గఱగా)

ఉపసహస్రించు (వెయ్యింటికి దగ్గఱగా)

ఉపాయుతించు (పదివేలకు దగ్గఱగా)

ఉపలక్షించు (లక్షకు దగ్గఱగా)

ఉదా:= అతని జీతం ఈ మధ్య ఉపలక్షిల్లింది. (లక్షకి దగ్గఱగా పెఱిగింది.. సుమారు లక్ష అయింది)

ఉపకోటించు (కోటికి దగ్గఱగా)

ఉపశతకోటించు (బిలియనుకు దగ్గఱగా) మొ.

ఉదా:- అతని వ్యాపార పరిమాణం (turnover) ఇటీవల ఉపశతకోటిల్లింది. (బిలియన్ కి దగ్గఱయింది. సుమారొక బిలియన్ అయింది)

అభ్యాసకార్యములు

I. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లోని ముఖ్యమైన పదాల్ని (సమాసించి) క్రియాధాతువులుగా మార్చి వాక్యాల్ని తిరగ వ్రాయండి.

1. ఆమె దేవుడికి ధూపదీపాలతో పూజ చేసింది 2. వాళ్ళిద్దఱూ జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకున్నారు. (కేశాకేశి అని వాడండి) 3. వాళ్ళిద్దఱూ ఒకఱినొకఱు గోళ్ళతో ఱక్కుకున్నారు (నఖానఖి అని వాడండి) 4. ఆపద్ధర్మాల్ని నిత్యనైమిత్తికాలుగా మార్చకూడదు 5. నిత్యనైమిత్తికాల్ని ఆపద్ధర్మాలుగా మార్చకూడదు 6. ఈ సంవత్సరం జమా ఖర్చుల పద్దు (budget) పదిలక్షలైంది 7. అధికారం కోసం వారు చాలా నెత్తుఱు చిందించారు (రక్తపాతం అని వాడండి) 8. ఆయన ఆ సంఘానికి చాలాకాలంపాటు కార్యదర్శిగా ఉన్నాడు 9. నింగికెగసే ఊహల్ని నేలదారి పట్టిం చాలి 10. అతడు ఉపకారం చేసినవాడి పట్ల కృతఘ్నుడిలా ప్రవర్తించాడు 11. ప్రజలు పూలతో మహాత్ముడికి అంజలి ఘటించారు. 12. ఆమె జనన వివరాల్ని తీసుకొని ఆయన గ్రహస్ఫుటం చేశాడు. 13. పని పూర్తిచేయడానికి అధికారులు చిరకాలం తీసుకుంటున్నారు 14. ఆ వార్త విని పరమానందం పొందాను 15. సమయోచితంగా చేయాలి/ ప్రవర్తించాలి. 16. స్వభాషలో మాట్లాడ్డం అభివర్ధితమైన స్వతంత్ర జాతుల లక్షణం 17. పరభాషలో మాట్లాడ్డం వెనకబడ్డ బానిసజాతుల లక్షణం 18. ఆ రోజుల్లో దేశనాయకులంతా ఆ నటుడికి పాదాక్రాంతులయ్యారు. (వశంవదులు అని కూడా వాడొచ్చు) 19. ఒక జాలగూటి లాంఛనాల్ని సమూలంగా మార్చాలంటే దానికి మళ్ళీ మొదట్నుంచీ కార్యక్రమం వ్రాయాల్సి ఉంటుంది 20. పారలౌకిక ఆదర్శాల్ని ఇహలోకానికి అనుగుణంగా మార్చుకోవాలి.

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, పదనిష్పాదన కళ and tagged , , , , , , , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.