cover

రుణపాశం

Download PDF ePub MOBI

“ఇదిగో బావ! చూడ చక్కని బావోయ్! రా నాతో. నేనేంటో నువ్వే చూస్తావుగా… రా రా మగడా! రేటెంతైనా పర్లేదు, చలి కాచుకుందువుగాని. నా గదిలో వెచ్చని కుంపటుంది, అంతకుమించి వెచ్చగా నేనున్నాను, రా…”

ఊహూ, లాభంలేదు. ‘చూడచక్కనోడా’ అని పిలిచినా ఒక్కడూ చూడటంలేదు. ముసలి ముతక తేడా లేకుండా, దున్నపోతులా ఉన్నా కూడా గుర్తించనట్టు “సోగ్గాడా…” అని ఆమె పిలుస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదు.  తాపం తీర్చుకోవచ్చని కావలించి అల్లేసే క్రీగంటి సైగలతో, గిలిపెట్టే నవ్వులతో ఆమె ఊరిస్తున్నా, ఎముకలు కొరికే ఆ డిసెంబర్ చలి రాత్రిలో శరీరాలు రాజేసుకుందామని ప్రలోభపెడుతున్నా, ఒక్క బేరమూ తగలడంలేదు. రాత్రి ముదిరే కొద్దీ పాదచారులు తగ్గిపోతున్నారు. పొడవు కాళ్ల ఫన్నీ వృధాగా నడుస్తూనే ఉంది. మరోగంటలో రోడ్లు కచ్చితంగా నిర్మానుష్యమవుతాయి. కనీసం ఆలస్యంగా ఇంటికెళ్లే ఏ తాగుబోతోడైనా దొరికితే సరేగానీ, లేకపోతే ఒక్కత్తె ఇంటి మొహం పట్టాల్సిందే.

నిజానికి రివటలా నాజూకుగా ఉండే పొడగరి ఫన్నీ చాలా సొగసరి. ఏ అప్సరాంగన అంశలానో తన ముఖం గొప్ప కాంతితో వెలిగిపోతుండేది. దేవతలు సైతం ముట్టుకునేందుకు జంకే ఆ ఇరవైమూడేళ్ళ యవ్వన సోయగం ఇలా చీకటి పాపపు పేవ్‌మెంట్ల పాలవడం దుర్భరం. రేపటి రొట్టెముక్క కోసం దేవులాడుతూ, ఐదు ఫ్రాంకులకి దేబిరుస్తూ ఇరుకు మెరక వీధుల్లో మగ్గిపోవడం దౌర్భాగ్యం. నిజానికి  ఎంతో గొప్ప యోగం పట్టాల్సిన మేలిమి మేని బంగారం. కాని రౌరవ నరకంలాంటి ప్యారిస్ మహానగరమొక పీతల కూపం. పైకి పాకే పీతల్ని కిందకి లాగేసే పోటీ. కళాకారుల్లానే వేశ్యలు కూడా ఏళ్ళు ముదిరాకగాని పేరు తెచ్చుకోలేరిక్కడ. వీళ్లనీ అమూల్యమైన రత్నాలతో కూడా పోల్చొచ్చు, అతి విలువైనవి కాబట్టే వాడకం కాస్తంత జాస్తి.

బహుశా అందుకేనేమో ప్యారిస్ రేపటి వేదిక మీద తళుక్కుమనబోయే తటిల్లత, ఆ ఇర్వైమూడేళ్ల సౌందర్యాతిశయం, ఆ కుసుమ దేహపు కులుకు ఫన్నీ ఈ డిసెంబర్ మంచుదారుల్లో కాళ్ళీడుస్తుంది, చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా.

అప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇక ఎవరయినా దొరుకుతారన్నది అత్యాశే. కనుచూపు మేరలో మనిషి అలికిడిలేదు. ఏదో కూడబలుకున్నట్టు రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి, నిస్తబ్దంగా. ఆగాగి ముఖాన్ని చరుస్తున్న చలిగాలి మూలుగు తప్ప మరేమీ వినిపించడంలేదు.

చావబోతున్న సీతాకోకచిలుకల్లా తోస్తున్న వీధిదీపాల రెపరెపలు మినహా మరేమీ కనిపించడంలేదు. ఇక చేసేదేమీలేదు, ఇంటికి తిరుగుముఖం పట్టడం తప్ప.

ఇంతలో హఠాత్తుగా ఫన్ని ఒక ఆకారాన్ని చూసింది రోడ్డుకి ఆవలివైపున. ఎవడో గానీ, ఎటు వెళ్ళాలో పాలుపోక నిల్చున్నట్టు కనిపిస్తున్నాడు. దాదాపు నేలను తాకుతున్న పొడవాటి కోట్‌లో పొట్టిగా, బక్కపల్చగా ఉందా ఆకారం. ‘బహుశా తను గూనివాడై ఉంటాడు’, తనకి తానే చెప్పుకుంది. సాధారణంగా వాళ్లకి పొడవాటి ఆడపిల్లలంటే భలే ఇష్టం. వడివడిగా అతనివైపు అడుగులేస్తూ, అలవాటైన చిలకపలుకుల్ని వల్లిస్తుంది – “ఏయ్ బావా! నాతో రారా అందగాడా”

ఆహా! ఏమి అదృష్టం!! ఆ మనిషి వెళ్ళిపోలేదు. సరి కదా, ఫన్నీ వైపు అడుగులేస్తూ వస్తున్నాడు. అయితే, హుషారుగా దగ్గరికొస్తూ కవ్వింపు మాటలు చెబుతున్న ఫన్నీ వైపు అతను వేస్తున్న అడుగుల్లో ఏదో బెరకు. తాగిన వాడిలా తూలుకుంటూ నడుస్తుంటే, మరింత వేగంగా నడుస్తూ అనుకుంది: “ఈ తాగుబోతు వెధవలు ఒక్కసారి కూలబడ్డారా, ఇక వాళ్ళని లేపటం ఎవరి తరంకాదు. ఎక్కడ పడితే అక్కడే వాలిపోతారు నిద్రకి. పడిపోక ముందే వాడ్ని చేరుకుంటే అదే పదివేలు”.

అదృష్టవశాత్తు సరైన సమయానికే అతన్ని చేరుకొని తన చేతుల్ని ఆసరా చేసింది. పట్టుకోవడమైతే పట్టుకుంది గానీ, దిగ్ర్భాంతిలో తానే అతనిని పడేసినంత పనిచేసింది.

అతను తాగుబోతు కాదు, గూనివాడూ కాదు. ఓవర్ కోట్‌లో నిండా మునిగిపోయిన ఒక కుర్రాడు, పన్నెండు, పదమూడేళ్ళకు మించని ఒక బాలుడు. బలహీనమైన స్వరంతో ఏడుస్తూ చెప్పాడు:

“మీ దయ కోరుకుంటూన్నానండీ. చాలా ఆకలిగా ఉన్నాను. చలితో చచ్చిపోతున్నాను… దయ చూపించండి.”

తన చేతుల్లో అతన్ని పొదువుకొని లాలనగా ముద్దుపెట్టింది. ఇంకా ఏడుస్తున్న ఆ బాబుని ఎత్తుకొని నిండైన మనసుతో అప్రయత్నంగా చెప్పింది: “భయపడకు కన్నా! నేనున్నానుగదరా… నా ఇంట్లో చలి కాచుకుందువు గాని…”.

ఇంటికి వెళ్ళేసరికి నిప్పు ఆరిపోయింది గానీ, ఇల్లు వెచ్చగానే ఉంది. లోనికి వెళ్ళగానే వాడన్నాడు: “అబ్బా! ఎంత హాయిగా ఉంది! నడి వీధుల్లో మంచుకి చచ్చిపోయాను. ఆరు రోజులుగా రోడ్లమీదే ఉన్నాను”.

ఇంతలోనే ఏడుపు లంకించుకొని చెప్పాడు మళ్ళీ: “రెండ్రోజులయిందండీ ఏమైనా తిని…”

ఫన్నీ కబోర్డు లోనంతా వెతికింది. మధ్య అరలో ఆమె లోదుస్తులున్నాయి, పైన అరలో ఆల్బర్ట్ బిస్కెట్లు డబ్బా ఉంది. ఒక బాటిల్ అడుగున ఓ చుక్క బ్రాందీ, మరోపక్క ఒక కప్పులో కాసింత పంచదార ఉన్నాయి. ఉన్నవాటితోనే ఎలాగోలా సూప్ వంటిది తయారుచేసి వాడి

ముందు పెట్టింది. చాలా ఆబగా తాగేశాడు. కాస్త ఆత్మారాముడు శాంతించాక, తన కథ చెప్పడానికి ఉపక్రమించాడు, ముంచుకొస్తున్న నిద్రని ఆవలింతలతో వాయిదావేస్తూ-

వాడికి తెలిసిన ఒకే ఒక బంధువు వాళ్ళ తాత. సోయ్‌సన్‌లో చిత్రకారుడైన అతని తాత నెలరోజుల క్రితం చనిపోయాడు. చనిపోవడానికి ముందు మనవడిని పిలిచి చెప్పాడు: “చిట్టి తండ్రి! ఈ కాగితాల్లో ఒక ఉత్తరం రాసిపెట్టి ఉంచాను. అది ప్యారిస్‌లో వ్యాపారంచేస్తున్న నా తమ్ముడికి రాసింది. దాన్ని అతని దగ్గరకు తీస్కెళ్ళు. నిన్ను తప్పకుండా బాగా చూసుకుంటాడు. పెయింటింగ్ పట్ల నీకున్న మక్కువ బట్టి కూడా నువ్వు ప్యారిస్ వెళ్లడమే సరైంది. అక్కడ నువ్వొక మంచి చిత్రకారుడివవుతావు.”

తాత ఒక ఆసుపత్రిలో చనిపోయాక, ఆయన మిగిల్చి వెళ్ళిన ఓవరు కోటు, అందులో మిగిలిన ముప్పై ఫ్రాంకులు తీసుకొని పుట్టెడు దుఃఖంతో వచ్చాడు ప్యారిస్‌కి. అయితే ఆ ఉత్తరంలో రాసిన అడ్రసులో ఆ పేరుగలవాళ్లెవరూలేరు. అతని తాత సోదరుడు ఆర్నెల్ల క్రితమే అక్కడ్నించి వెళ్ళిపోయాడని, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదని చెప్పారక్కడ పొరుగువారు.

దాంతో ఆ కుర్రాడు అనాథై మిగిలిపోయాడు. ప్రయాణానికి ఖర్చైపోగా మిగిలిన డబ్బుతో కొద్ది రోజులు నెట్టుకొచ్చాడు. జేబులో చివరి పైసా కూడా అయిపోయాక, తలదాచుకోవడానికి, కనీసం ఒక రొట్టె ముక్క కొనుక్కోవడానికి కూడా అవకాశంలేక రెండ్రోజులుగా రోడ్లమీద పస్తులతో గడుపుతున్నాడు.

తెరలతెరల ఆవులింతల మధ్య సగం నిద్రలో జోగుతూనే ఇదంతా చెప్పాడామెకి. ఇంకా వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నప్పటికీ, వాడి అవస్థ చూసి ఇంకేమీ అడగలేదు. అంతేకాదు, వాడు చెబుతున్నప్పుడే మెల్లగా దుస్తులు మార్చి నుదుటిన ముద్దుపెట్టుకుంటూ తానే ఆపింది “ఇక చాల్లేరా నాన్నా! రేపు చెబుతువుగానీ ఇప్పుడొద్దులే. పడుకో, మంచినిద్ర కావాలి నీకిప్పుడు” అంటూ. తను నిద్రలోకి జారుకున్నాక, మెల్లగా పక్కమీద పడుకోబెట్టింది. అంతలోనే వాడు గాఢనిద్రలో మునిగిపోయాడు. తానుకూడా బట్టలు మార్చుకొని వాడికి మరింత

వెచ్చదనాన్ని అందించడానికి వాడి పక్కన పడుకుంది. కారణమేమిటో తెలియని దుఃఖం మెలితిప్పి, ఆమెకూడా నిద్రలోకి ఒరిగిపోయింది.

మర్నాడు అప్పుతెచ్చిన డబ్బుతో ఇద్దరూ అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. పొద్దుగుంకాక వాడినొక దుకాణం దగ్గర కూర్చోబెట్టి వెళ్తూ ఆమె జాగ్రత్తలు చెప్పింది: “ఇక్కడే ఉండు. నేను త్వరగానే వచ్చేస్తానులే.” రాత్రి పదిగంటలప్పుడు, ఒక విధంగా పెందలాడే, తిరిగి వచ్చిందామె. తాను సంపాదించానంటూ అతని చేతిలో పన్నెండు ఫ్రాంకులు పెట్టింది.

“ఈ పూట వరస చూస్తుంటే ఇంకా సంపాదించేదాన్ననిపించింది. ఈవేళ చాలా అదృష్టం కలిసొచ్చింది, కచ్చితంగా నీవల్లే. నాకోసం ఎదురుచూస్తూ బెంబేలుపడకు. కాలక్షేపానికి భంగు తాగుతూ ఉండరా కన్నా”, నవ్వుతూ చెప్పిందామె.

ఒక స్వచ్ఛమైన మాతృ స్పర్శని అనుభవిస్తూ వాడ్ని ముద్దాడింది, బయటకు మళ్ళీ వెళ్లబోయేముందు. అయితే ఒక గంట తర్వాత అభ్యంతరకర ప్రదేశంలో పట్టుబడిన కారణంగా ఆమెను పోలీసులు అరెస్టుచేసి సెయింట్ లాజరె (ప్యారిస్‌ లో జైలు)కి తరలించారు. దుకాణాలు మూసే వేళయ్యి, ఆ కుర్రాడిని బయటకు పంపేశారు. ఉదయాన్నే ఫన్నీ ఇంటికి వెళ్తే ఆమెను జైల్లో వేశారని తెలిసిందతనికి. చేతిలో 12ఫ్రాంకులతో వాడు మళ్ళీ రోడ్డున పడ్డాడు.

* * *

పదిహేనేళ్ల తర్వాత ఓరోజు ఉదయాన్నే దినపత్రికలు ఒక వార్తని ప్రముఖంగా ప్రచురించాయి: ఎవరి పద చలనాలకి ప్యారిస్ కులీన వర్గం పాదాక్రాంతమయిందో, శృంగారాధిదేవత వీనస్‌కి రంగస్థలం మీద ప్రాణప్రతిష్ట చేసిన ఏ అసాధారణ నటకౌశలానికి, నిగారించిన దేహ మార్దవానికి కళా ప్రియులు దాసోహమయ్యారో, ఏ లలిత సౌందర్య సామ్రాజ్ఞి కోసం ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారో, లెక్కలేనంత మంది తమని తాము నైవేద్యంగా అర్పించుకొని శుష్కించిపోయారో, ఆ కోటిదివ్వెల తటిల్లత, రహోవేదనలు రగిలించే మధుకీల ఫన్నీ క్లెరైట్ పిచ్చాసుపత్రి పాలయింది. పక్షవాతం కమ్మింది. అంతులేని అప్పులవల్ల ఆమె ఆస్తులన్నీ జప్తుచేశారు. దాంతో ఆమెకు మతి చలించింది.

పిచ్చాసుపత్రి పాలయిన ఆమె జీవితం అక్కడే అంతమయ్యేదేమో.

runapaasam‘అలా జరగడానికి వీల్లేదు’- ఫ్రాంకోయిస్ గర్లాండ్ తనకితానే చెప్పుకున్నాడు, పేపరులో ఆ వార్త చదివి. ‘ఎంతో గొప్పదైన ఫన్నీ జీవితం అలా ముగియడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఆమె… అవును ఆమే. తానెన్నటికీ మరువలేని మేలు చేసిన దేవత. నాడు ఆమె కురిపించిన వాత్సల్యం, చూపిన దాక్షిణ్యం తనని రుణగ్రస్తుడ్ని చేశాయి. తనకి మళ్ళీ ప్రాణం పోసిన దయామయిని చూడాలని ఆ రోజుల్లోనే ప్రయత్నించాడతను. కానీ ప్యారిస్ ఒక మంత్రనగరి. తాను ఎదగడానికి, తనకంటూ ఒక జీవితానికి ఏరుకోవడానికి, తనకంటూ ఒక ఉనికిని ఏర్పరచుకోవడానికి అతడు పడిన పాట్లకు అంతులేదు. తరువాత ఒకసారి ఆమెను దూరం నుంచి చూశాడు. నటవేదిక మీద కంటిలిప్తలో కదిలిపోయే ఆ మెరుపు తీగని చూసి చప్పున గుర్తుపట్టాడు. ఏదో రాజ్యానికి యువరాణిలా ఆమె వెలిగిపోతుంటే అబ్బురంగా చూశాడు. అలాంటి సమయంలో ఎలా ఆమెనుచేరగలడు? అయిదు ఫ్రాంకులకి అమ్ముడుపోయిన పాత రోజుల్ని ఆమెకు ఎలా గుర్తుచేయగలడు? లేదు, ఎంతమాత్రమూ చేయలేడు. అందుకే ఆమెకి దూరంనుంచే ప్రణమిల్లాడు, ఆమె క్షేమాన్ని కాంక్షించాడు.

కానీ, ఇప్పుడు తన రుణం తీర్చుకునే సమయమొచ్చింది, తీర్చుకుంటాడు కూడా. అప్పటికే అతను ప్రఖ్యాత చిత్రకారుడు. అయితే, భవిష్యత్తు మరిన్ని రంగులతో అతని ముంగిట ఎదురుచూస్తున్నప్పటికీ తనేమంత స్థితిమంతుడు కాడు. కానీ అదసలు అతనికొక సమస్యేకాదు. తనకోసం ప్రజలు దాచి ఉంచిన భవితవ్యాన్ని, తన కుంచెని, మునివేళ్లని ఒక చిత్రకళా వ్యాపారికి తాకట్టు పెట్టాడు, అమ్ముడుబోయాడు.

దాంతో ఫన్నీ పిచ్చాసుపత్రినుంచి ఒక సౌఖ్యమైన చికిత్సాలయానికి తరలించబడింది. అక్కడ వైద్యానికే కాదు, భోగానికి కూడా లోటు లేదు. అయితే, పక్షవాతానికి క్షమ అంటే తెలియదు. మాయదారి పిల్లి ఎలుకను వదిలినట్టు ఊరికే అలా పట్టు విడుస్తుంది. అది తాత్కాలికమే. వెంటనే మరింత వేగంగా, మరెంతో క్రూరంగానూ పట్టుకుంటుంది. ఫన్నీ విషయంలో కూడా అదే జరిగింది. రోగలక్షణాలు తాత్కాలికంగా కొంత తగ్గుముఖం పట్టాయి. దాంతో ఒక రోజు అతనితో డాక్టరు చెప్పాడు: “ఆవిడని తీసుకెళ్ళాలని మీకు ఆత్రంగా ఉందా, మంచిది! అయితే మీరు మళ్ళీ ఆమెను తిప్పి తీసుకురావాల్సింది ఉంటుంది. చికిత్స మొత్తం కేవలం కంటితుడుపుకే. ప్రస్తుతం ప్రశాంత స్థితి గట్టిగా ఒక నెల మించి ఉండకపోవచ్చు. అది కూడా ఆమెకు ఎటువంటి ఉద్వేగం కలిగించే పరిస్థితులు కల్పించకుంటే…”

“ఆ జాగ్రత్త తీసుకోకపోతే…,” గర్లాండ్ అడిగాడు.

“చివరి రోజులు మరింత దగ్గర పడినట్లే. అటువంటి స్థితి దగ్గరపడినా, లేదా కాస్త వాయిదాపడినా అట్టే తేడా ఉండదు. మళ్ళీ తిరగబెడితే అది ప్రాణాంతకం అనడంలో సందేహంలేదు.”

“మీరంత కచ్చితంగా చెబుతున్నారు…”

“అవును ఖాయంగానే…”

తరవాత ఫన్నీని అక్కడ్నించి ఒక అధునాతనమైన ఇంటికి మార్చి, ఆమెతో పాటు తాను ఉండిపోయాడు ఫ్రాంకోయిస్. మెల్లగా ఆమెకి వయసు మళ్లింది. శరీరం ముడతలు పడింది, జుట్టు నెరిసిపోయింది. కొన్నిసార్లు ఆమె మనసులో ఏదో కదలాడుతుంది. ఎంత ప్రయత్నించినా అతనెవరో ఆమెకు గుర్తుకురాడు. ఎప్పుడో అతని చిన్ననాట తనని అక్కున చేర్చుకొన్న సంగతి జ్ఞప్తికి రాదు. అతనెప్పుడూ ఆమెకి గుర్తుచేయలేదు. ఒక సంపన్న యువకుడు తనని ఆరాధిస్తున్నాడని, అర్పించుకున్నాడని ఆమె అనుకునేలా ప్రవర్తించాడతను. అతడు యువకుడు, ఎంతో ఆత్మీయత, గాఢానురక్తి ఉన్నవాడు. అటువంటి ఆత్మసఖుడు ఆమెకు ముందెన్నడూ తారసపడలేదు. మళ్ళీ తీవ్రమైన మనోవైకల్యానికి గురై, అది ఆమె మరణానికి దారితీయడానికి ముందు మూడువారాల పాటు ఆ ప్రియ నేస్తం అందించిన వెచ్చని ముద్దుల మైకంలో ఆమె నిండా మునిగిపోయింది. ఆ ఉచ్ఛ ప్రేమోన్మత్త దివ్యానుభవంతో ఆమె చివరి శ్వాస తీసింది.

ఆ తరువాత ఒకానొక రోజు ఏదో విందులో కలిసిన చిత్రకారులు ఫ్రాంకోయిస్ గర్లాండ్ గురించి మాట్లాడుకున్నారు. అతని తాజా పెయింటింగ్‌కి సముచిత గౌరవం, ప్రతిష్ట దక్కాయని చెప్పుకుంటున్నారు.

“అవును నిజమే”, అందులో ఒకతను కొంత కంటగింపుతో అన్నాడు: “మీరనేది ఆ అందగాడు గర్లాండ్ గురించే అయితే అది నిజమే…”

మరొకతను అదే వెటకారాన్ని మరింత ఒత్తి పలుకుతూ అన్నాడిలా: “కచ్చితంగా వాడే. ఆ అందగాడే. ఆడోళ్ళకి మిండ మొగుడవడానికి వెంపర్లాడే ఆ మహా సోగ్గాడు గర్లాండ్ గీసిన…”

*

మొపాసా “ద డెట్” కథానువాదం: నరేష్ నున్నా 

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, జులై and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.