COVER

వలసపక్షినే కానీ…

Download PDF  ePub MOBI

పొద్దు పొద్దున్నే ఛాయ్ తెచ్చిచ్చింది అమ్మ. ఆ ఛాయ్‌ని తాగుదమని పక్కకు పెట్టుకున్న. గీ లోపల నాని గాడు వచ్చిండు. “మావయ్య నేను కుసుంట” అని ఆని భాషల ఆడేదో చెప్ప్తుండు.. సర్లే అని ఆన్ని మీద కూసబెట్టుకున్న. నేను ఛాయ్ తాగుదమనుకుంటె ఆడేమో ఏదేదో చెప్తుండు, “ఏయ్ సావగొట్టకురా” అన్న. ఆనికి ఏమర్థమైందో మీనించి దిగిపోయిండు. బుంగ మూతి పెట్టి నా దిక్కే చూస్తుండు. “సరే రా రా మీద కుసుందువు రా” అన్న, ఎమ్మటే ఒక్క నవ్వు నవ్వి మీదకొచ్చి కూసుండు. ‘అబ్బ ఏం నవ్వు రా’ అనుకున్న. గాడు అంత మంచిగ నవ్వినంక ఇగ ఆడేం జెప్తున్నా మస్తుగనిపిచ్చింది. నా కండ్లల్ల కండ్లు పెట్టి చూస్తుండు, నవ్వుతుండు, ముద్దు పెడుతుండు.. ఇగ ఆనికేమనిపెస్తె అది జేస్తుండు. జెర సేపయినంక, “మావయ్య నేను హైదాబాద్ వస్త” అన్నడు. “మరి హైద్రాబాదొస్తే అమ్మెట్ల రా, ఏం తింటవ్ రా” అన్న. మూతి మీద చేయ్ పెట్టి ఏదో చెప్దామనుకుంటుండు. ఏమనిపిచ్చిందో జెర సేపు ఏం మాట్లాడలే. మళ్లా గవే ముచ్చట్లు, గవే ముద్దులు. ‘మర్షిపోయిండంటవా’ మనసుల్నే అనుకుంటున్న. జెరయినంక ఆని పన్ల ఆడు పడ్డడు, నా పన్ల నేను పడ్డ. ఆడు మర్షిపోయిండా లేదా మాత్రం తెల్వలే.

ఒక్క సారే నిద్రల్నించి లేషిన; నాని గాడు లేడు, ఇల్లూ లేదు. గప్పుడర్థమైంది గిదంత కలని. ఇగ నిద్ర పడుతదా? అప్పటికీ పందామని బాగా ట్రై చేషిన లాభం లే. టైమ్ జూసుకున్న. 4 ఐంది. జెరసేపు అటు నుసిలి ఇటు నుసిలినా నిద్ర రాలే, ఒకటే ఇల్లు గుర్తుకొచ్చింది. దానంతటదే కళ్లెంబటి నీళ్లొస్తున్నయి. ఆబ్దామని చూసిన గానీ వేస్టని ఊకున్న. గట్లనే చానా సేపు కూసున్న. ఇగ మెల్లగ ఆలోచన్ల పడ్డ. ఇల్లు గుర్తొస్తే నాకే గిట్లుంటదా? ఎవ్వనికన్నా గిట్లనే ఉంటదా?

మన కానించి ఏం కోరకుండనే ప్రేమనిచ్చే అమ్మ, ఎవ్వని కోసమూ బలంగ నవ్వ పన్లేని.. ఆనికి నచ్చినప్పుడే స్వచ్ఛంగ నవ్వే నాని గాడు, ఏడికి పోయినా తోడుండే దోస్తులు, ఎప్పుడూ గొడవ (నాగ్గుడ అదే ఇష్టం మరి) పెట్టుకునే అక్క, బాగు జూస్కునే అన్న, నాన్న.. ఇగ చివ్వర్గ ‘నాది’ అన్జెప్పుకునె భూమి.. గివన్నీ మిస్సైతే ఏడ్పు రాదా మరి? అయితే.. అయితే మాత్రం ఏ జేస్తవ్‌రా ‘డెవలప్’ గావా? గిదా ‘డెవలప్మెంట్’ ? ఔను.. గిదే డెవలప్మెంట్ కాదా మరి?  ఔనౌను.. ఇదే డెవలప్మెంట్. దీని కోసమే గదా అంత దూరం నించొచ్చింది?! దీని కోసమేనా అంత దూరం నించొచ్చింది? గిట్లనే నాకు నేనే ఏదేదో మాట్లాడుకున్న. ఇగ తెల్లారింది లేట్ జేయకుంట ఇంటికి ఫోన్ జేసి జెరసేపు మాట్లాడిన.. రాత్ర కంటే జెర సల్లబడ్డ (జెర్ర సేపటికే). ఇగ ఎప్పట్లెక్కనే తయారై, ఆఫీస్‌కని ఎల్లిన.. జాబ్ నాకిష్టమైనదే మళ్ల, అహ ఏం లే జాబే ఇష్టం లేరనుకుంటరేమోని అన్న.. మళ్లా రోజయిపోయింది. నిన్నట్లెక్కనే మళ్లా అదే కల వస్తదో రాదో తెల్వదు గానీ వస్తే మాత్రం కండ్లెంబడి నీళ్లయితే ఆగవు. రాకున్నా గా ఆలోచన్లైతే ఆగవ్గా?! ఇగ ఇప్పటికింతే, రోజూ.. ఇట్లనే..

సర్లే మరి, గిట్నే చెప్పుకుంటె తెల్లార్తది.. ఉంట.. బై..

P.S. : మహబూబ్‌నగర్ల రోజూ వలసలుంటయి, ఇళ్లని పిల్లల్ని వదిలేషి పనికని పోతరని టీవీల పేపర్లల్ల జూసి బాధపడేటోన్ని. ఇగ పాలకులని, దేవుడ్ని తిట్టుకునేటోడ్ని. కొన్నాళ్లకదే పని నేను జేయాలనేసర్కి మాత్రం గివేవీ గుర్తుండవ్.. అది గాక, గీ ‘వలస’కి అభివృద్ధి అని పేరు పెట్టుకోని, పనికి ‘జాబ్’ అని ట్యాగ్ తగిలిచ్చుకొని తిరుగుతున్న.. దేన్నైనా మనకు దగ్గట్టు మార్చుకొనుడు మనకే తెల్సు.

*

Download PDF  ePub MOBI

(Image courtesy: https://www.flickr.com/photos/sukanto_debnath/476655012)

Posted in 2014, జులై, మ్యూజింగ్స్ and tagged , , , , .

3 Comments

  1. “దేన్నైనా మనకు దగ్గట్టు మార్చుకొనుడు మనకే తెల్సు” (మనకి మనం బతకడానికి చేసే వలస సరే…. అభివృద్ధి పేరుతో సుఖంగా బ్రతుకుతున్న వాళ్ళని ఖాళీ చేయించడం!!?) చాలా బాగా రాశారు. రాయండి మీరు ఇంకా రాయాలని కోరుకుంటూ…..

  2. పాలమూరు కూలీలు, దిక్కూమొక్కూ లేని వలసపక్షుల గళం వినిపించిన గొరుసన్న చేతిలో నిన్ను పెడుతున్నాబిడ్డా! నూరేల్లు సల్లగుండు …

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.