cover

ఈ కథనేం చేద్దాం?

Download PDF ePub MOBI

.
ఆమె పూవులు కోస్తూ వుంటుంది ఏ దేవుడి కోసమో
ఆతను చిత్రం గీస్తూ వుంటాడు ఏ దేవత రూపమో
అనునిత్యం ఆ ఆహ్లాదమైన ఉద్యానవనంలో
మౌనంగా సూర్యాస్తమయాన్ని పంచుకుంటారు
.
మిగిలిపోయిన పనుల్ని పట్టికలోనుంచి కొట్టేసి
విప్పలేని చిక్కుముడుల్ని మధ్యలోనే వదిలేసి
జవాబు దొరకని ప్రశ్నల్ని శుభ్రంగా చెరిపేసి
ఖాళీ జీవితం మీద కొత్త ఆహ్వన పత్రికొకటి
రచించి, రాబొయే ఆఖరి అతిధి కోసం
అలసిన మనసుతో ఎదురు చూస్తుంటారు
.
ముగింపుని గురించిన అదుర్దాతోనో,
సాహసానికి ముందుండే సహజమైన భయం వల్లనో,
చివరాఖరి ప్రయాణానికి చిరునవ్వుతో
వీడ్కోలు పలికి సాగనంపే వారెవరూ లేరనో,
కారణమేదయినా కాని ఒక తోడు కోసం
ఒంటరి స్వగతంలో తపన పడుతూ వుంటారు
.
నేనొక కొత్త ప్రేమకథకు మొట్టమొదటి శకునం కోసం
ఎర్రటి గులాబీ ఒకటి చేత పట్టుకుని ఎదురు చూస్తూ వుంటాను
వారి జీవితంపై నా కల్పనలో, నిజమైన ఒక కథలో
ఏ ముగింపైతే బాహ్య ప్రపంచానికి, వృద్ధులైన ఆత్మీయుల్ని
వారి అదృష్టానికి కష్టానికి వదిలి వెళ్ళిన వారికి,
ఆమోదయోగ్యమా అనే యోచనలో ఖాళీ పేజీలు తిరగేస్తుంటాను
.
యవ్వనంలో వున్న వారి మధ్యైతే ప్రేమ కల్పించొచ్చు
బాల్యంలో వున్నప్పుడైతే స్నేహం సృష్టించొచ్చు
ఈ నాయికా నాయకులను ఎంచుకోవటమెంత దుస్సాహసం?
మరి ఆసరా అత్యంత అవసరమయ్యేది వృద్ధాప్యంలోనే కదా.
వారి మధ్య కల్పించాల్సిందే అనుబంధం? ఏదైతే సముచితం?
సమాధానం మీ మీ ఆభిప్రాయాలకి, ఆదర్శాలకి పరిమితం
.

– మోహిని కంటిపూడి

Download PDF ePub MOBI
Posted in 2014, కవిత, జులై and tagged , , , , .

2 Comments

  1. తప్పకుండా కల్పించాల్సిందే వారి మధ్య అనుబంధం
    ఇక ఆమె పూవులు కోస్తూ వుంటుంది అతడి కోసం
    ఆతను గీస్తాడు కేవలం ఆమె చిత్రం :-)

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.