cover

డెంగ్యు జ్వరం

Download PDF ePub MOBI

vAmukOmu2రచయిత గురించి: వా.ము.కోము – తమిళనాడు, ఈరోడు జిల్లాలోని వాయ్పాడి గ్రామానికి చెందిన ఈయన పూర్తి పేరు “వా‌య్పాడి ముత్తయ్యా కోమగన్”. కోమగన్ అనగా యువరాజు/రాజకుమారుడు అనర్థం. కథలు, కవితలు, నవలలు రాస్తారు. ఈయన రచనలన్నీ కోయంబత్తూర్ ప్రాంతపు మాండలికంలోనే ఉంటాయి. గ్రామీనవాతావరణంలో చెప్పబడే సర్‌రియలిజం, ప్రేమ, శృంగారం సంబంధించిన విషయాలే ఈయన కథల్లోని ప్రత్యేకత. తమిళంలోని అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఈయన కథలు ప్రచురితమయ్యాయి. 2008 లో “తవళైగళ్ గుదిక్కుం వయిఱు” (కప్పలు దూకే పొట్ట) అన్న కథల సంపుటానికి విగడన్ వారి ఉత్తమ పురస్కారం లభించింది.

రచయిత రాసిన కొన్ని కథల పుస్తకాలు : అళువాచ్చి వర్దుంగ్ సామీ, అరుక్కాణిక్కు సొంద ఊర్ విజయమంగళం, మణ్‌బూదం, చేగువేరా వందిరుందార్, కళ్ళి, సాందామణియుం ఇన్న పిఱకాదల్‌గళుం, మఱియు కొన్ని పుస్తకాలు రాశారు.

బ్లాగు : http://vaamukomu.blogspot.in/

ఈ-మెయిల్ : vaamukomu@gmail.com

డెంగ్యు జ్వరం

వా ము కోము

నెల రోజులుగా ఊర్లో అందరూ భయంతో ఉన్నారు. తూర్పున పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నిమలలో ఇద్దరు స్త్రీలకు డెంగ్యూ జ్వరం అని దాదాపు పదిహేనువేలు ఖర్చుపెడితే బతికారని ఊర్లో చెప్పుకుంటున్నారు. ఇదివరకు రాష్ట్రంలో నలభైమందికి పైగా డెంగ్యూ జ్వరం వచ్చి మృతి చెందినట్టు టీ.వీలో వచ్చిన వార్త ఇంకా ఎక్కువ భయాందోళనలకి గురి చేసింది. మూడేళ్ళ క్రితం చికెన్ గునియా అన్న జ్వరం వచ్చినప్పుడు ఈ ఊళ్ళోని ప్రతి ఒక్కర్నీ హింసించింది.

ఇది కూడా అలాంటిదే ఏమో అని అందరూ తమ తమ ఇళ్ళలో ఉన్న నీటి తొట్లను ఒంపేసి పట్టిన పాచినంతా గోకి కడిగి శుభ్రం చేసుకున్నారు. దోమ కుడితే పసుపుని నీటిలో కలుపుకుని తాగి నాటు వైద్యం చేసుకున్నారు. సంతోషమూ దుఃఖమూ చెప్పిరావంటారుగా!

“ఏంటే రుక్మిణీ… నీ కొడుకేమైనా తిని వెళ్ళాడా బడికి? మా వాడు డబ్బు కావాలని సతాయించి మరీ తీసుకుని తినకుండానే వెళ్ళిపోయాడు. ఎందుకురా, బడిలో పుస్తకాలూ, నోట్‌బుక్ లూ ఫ్రీగానే ఇస్తారు కదా అన్నాను. మా ఫ్రెండ్‌కి జ్వరం వచ్చింది ఇవ్వు అని ఏడ్చి మరీ తీసుకెళ్ళాడు” అంటూ వచ్చింది పక్కింటి చినపండమ్మ.

“మా వాడు కూడా అలానే ఏడ్చి డబ్బులు తీసుకుని తినకుండా సంచి భుజానికేసుకుని వెళ్ళిపోయాడే! పక్కవీధిలో కృష్ణవేణి కూతురు సీత కూడా తినకుండానే వెళ్ళిపోయిందట. డబ్బులేమైనా చెట్లకి కాస్తాయా? వీళ్ళు అడగ్గానే రాల్చుకొచ్చి ఇవ్వడానికి? స్కూల్లో మధ్యాహ్నం పెడతారుగా తింటార్లే. ఒక రోజు తినకుంటే ఏమౌతుంది?” అంది రుక్మిణి.

“నిన్న రాత్రి నేనూ నా కొడుకూ అంజయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ముకుందాన్ని చూసొచ్చాం. ఒంటిపైన అక్కడక్కడా కందిపోయిననట్టు ఎర్రగా ఉంది. అమ్మవారు పోసిందని అన్నారట. వేపాకులు నేలమీద పరిచి పిల్లాణ్ణి దాని మీద పండబెట్టి, పచ్చడి బండ మీద వేపాకు, పసుపు నూరుతుంది పాపం దేవకి. అప్పటికి కూడా అంజయ్య ఇంటికి రాలేదు. ఎక్కడ తాగి పడున్నాడో! నలుగురికి కటింగ్, షేవింగ్ చేసి డబ్బులు పోగైతే చాలు సారాయి కొట్టుకెళ్ళిపోతాడు. దేవకి మేడలో అదివరకు ఉన్న బంగారు గొలుసు కూడా లేదిప్పుడు. అమ్మేశాడేమో! పసుపుతాడు మాత్రమే ఉంది దాని మెడలో”

“ఊళ్ళో అమ్మవారి జాతర చేసి రెండేళ్ళయిందిగా? అందుకే ముకుందం మీదకి దిగినట్టుంది” అంది రుక్మిణి.

“నీకు విషయమే తెలీనట్టుంది. రాత్రి టౌన్ నుండి వచ్చిన నర్సు వాళ్ళింటికెళ్ళి బిడ్డని చూసి అంజయ్య మీదా, దేవకి మీదా అరిచిందట.”

“అమ్మవారు దిగిన ఇంటికెళ్ళి ఏందుకు అరిచిందట ఈ నర్సమ్మ? ఊళ్ళోనే ఉన్నాను ఈ విషయం తెలీదే నాకు? ఏం చెప్పిందట? సూదెయ్యమందటా? అమ్మవారు పోసిన ఒంటిపైన సూది గుచ్చకూడదు. అమ్మవారు ముత్యాలు చల్లినప్పుడు సూదేస్తే అమ్మవారికి కోపమొస్తుంది. ఈ మాత్రం తెలీదా ఆ దేవకికి?”

LOGO“నువ్వూ నేనూ అరుచుకుని ఏం లాభం? ముకుందం ఒళ్ళంతా పసుపూ వేపాకూ పట్టేసింది కదా? పిల్లాడి ఒంటిని పరీక్షించి, అమ్మవారేమీ కాదు. ఇది డెంగ్యూ జ్వరం! చీటీ రాసిస్తాను వెంటనే చెన్నిమల గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అందట. దేవకి అసలొప్పుకోలేదట. అక్కడికి వెళ్తేగానీ డెంగ్యూ జ్వరానికి రక్త పరీక్ష చెయ్యలేరు; అదే అయితే పిల్లాడి ప్రాణానికే ప్రమాదం అందట. అప్పుడు అంజయ్యకి భయం పుట్టి పిల్లాణ్ణి ఆటోలో వేసుకుని చెన్నిమలకు వెళ్ళాడట. ఇవేవీ తెలిసినట్టులేదు నీకు” అంది చినపండమ్మ.

“నాకు తెలియదే.. ముకుందానికొచ్చినట్టు ఆ డెంగ్యు జ్వరం ఇక మన పిల్లలకి వస్తే అంత డబ్బులకెక్కడికిపోతామే? వంద రోజులు పని పథకం కింద రోడ్లమీద రాళ్ళు ఏరుకుంటూ, కాలవల్లో మట్టి తొవ్వుతూ ఉన్నాము. అదేమైనా అంటు వ్యాధేమోనని భయంగా ఉందే” అని కంగారుగా చెప్పింది రుక్మిణి.

“బిడ్డని చేతుల మీదెత్తుకుని అంజయ్య ఆటో ఎక్కగానే ఏడ్చేశాడట. అంత వయసొచ్చిన మొగాడు ఏడవడం ఎప్పుడూ చూళ్ళేదే అంది సరస్వతక్క. ఒకసారి చెన్నిమలకెళ్ళి చూసొద్దాం అంటే భయంగా ఉంది రుక్మిణి. హాస్పిటల్ గడప తొక్కగానే నాకు జ్వరం వచ్చినట్టు అయిపోతుంది” అంది చినపండమ్మ.

ఉళ్ళో అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. అందరి పిల్లలూ కలిసికట్టుగా మాట్లాడుకుని తినకుండ బడికెళ్ళారన్నది అర్థం అయింది. పదకొండు గంటలకు ఊరికి పడమరనున్న కనికలమ్మ గుళ్ళో పూజలు చేసే నాగయ్య వచ్చి ఆ వార్త ఋజువు చేశాడు.

“మన ఊర్లో పిల్లలందరూ గుడిదగ్గర కానుగమానుకింద కూర్చునున్నారు. ముకుందానికి తొందరగా నయమవ్వాలని కనికలమ్మ గుళ్ళో ప్రత్యేకంగా పూజలు చెయ్యమని నన్ను అడిగారు. నేను పూజ చేసి కుంకుమ, విబూది ఇచ్చాను. అందరూ డబ్బులు పట్టుకొచ్చారు. బడికైనా వెళ్ళకుండ చెట్టుకిందే కూర్చున్నారు. నా అనుభవంలో ఇలాంటిది ఎప్పుడూ చూళ్ళేదు. అందరు పిల్లలూ ఇలా తినకుండ గుడికి రావడం, బాగలేని సాటి పిల్లాడికోసం పూజలు చెయ్యమనడం! టీచ్చరొచ్చి పిలిస్తే మా అమ్మవాళ్ళు వచ్చేంతవరకు ఇక్కణ్ణుండి కదలం అని అంటున్నారు ఆ పిల్లలు” అని చెప్పాడు నాగయ్య.

పేదరికంతో కష్టపడుతున్నా అంజయ్య కొడుకు బుద్ధిమంతుడు. లెక్కలైనా సరే, ఇంగ్లీషైనా సరే అది చాలా సులువు అని పాఠాలు ఒంటబట్టని పిల్లలందరికీ అర్థం అయ్యేలా చెప్పేవాడు. తన దగ్గరున్న చిన్న సైకిలుతో ఈ ఊళ్ళో ఉన్న పిల్లలకి సైకిల్ తొక్కడం కూడా నేర్పాడు. వాడంటే అందరి పిల్లలకీ ఇష్టం.

“అరే యువరాజూ… నిన్న ముకుందం అన్నట్టు వాడు చనిపోతే ఇక మనతో చదుకోడానికి రాడు కదా? మట్టిలో పాతేస్తారేమో కదా? మన అమ్మవాళ్ళందరూ మనల్ని వెతుక్కుంటూ వస్తారిక్కడికి. అప్పుడు డబ్బులు తీసుకునెళ్ళి డాక్టర్ కి ఇద్దాం. సూదులేసి ముకుందాన్ని కాపాడేస్తారు. పాపం… వాడికి జ్వరం తగ్గిపోతే బాగుండు..” అని తన స్నేహితూలతో విలపిస్తూ అన్నాడు సందీప్. జ్వరమొచ్చిన ముందు రోజు సాయంత్రం అందరు పిల్లలూ కలిసి ఆడుకుంటుంటే ముకుందం మాత్రం నీరసంగా చెట్టు కింద కెళ్ళి ముడుచుకుని పడుకున్న దృశ్యం సందీప్ కళ్ళముందు కదిలింది.

“ముకుందం.. ఏరా పడుకున్నావు? ఏం చేస్తుంది నీకు? నీ చేతులు కాళ్ళంతా బొట్లు పెట్టినట్టు ఎందుకు ఎర్రగా ఉన్నాయి?” అని అడిగాడు.

“సందీప్… నిల్చుకోలేకపోతున్నాన్రా. మొన్న టీ కొట్టుకాడ గణేషన్న పేపర్ చదువుతూ మూర్తి అన్నతో చెప్తున్నాడు.. ఒంటిమీదా ఎర్రగా దద్దుల్లా వచ్చి జ్వరం వస్తే అది డెంగ్యూ జ్వరమట. నా ఒంటి మీదొచ్చినవి చూస్తుంటే డెంగ్యూ జ్వరమేమో అనిపిస్తుంది సందీప్.. మా నాన్నదగ్గర డబ్బులేదు… నిన్న కూడా మా అమ్మని కొట్టి డబ్బులు తీసుకెళ్ళాడు తాగడానికి.. నేను చచ్చిపోతానేమో.. చచ్చిపోయినా మీరందరూ బాగ చదువుకుని ఉద్యోగాలు చెయ్యండి. మీరందరూ కలిసి మా అమ్మని చూసుకోండి. అమ్మకు నేను తప్ప ఇంకెవరూ లేరు. నేను చదివి పెద్ద ఉద్యోగం చేసి తనని బాగ చూసుకుంటానని కలగంటుంది ఎప్పుడూ” ఆ పైన ఏం మాట్లాడలేక మళ్ళీ ముడుచుకున్నాడు. సందీప్ పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు.

“అయ్యో నా తండ్రీ.. ఏమైందిరా? ఎందుకిలా పడుకున్నావు?” అని ఏడుస్తూ వచ్చిన దేవకి పిల్లాణ్ణి భుజాన వేసుకుని నర్సు ఇంటికి పరుగుతీసింది. ముకుందంతో ఆడుకుంటున్న పిల్లలు కూడా తన వెంటే వెళ్ళారు. నర్సు ఇల్లు తాళం వేసుంది. ఆమె కాశిపాలెం హాస్పిటల్ కి డ్యూటీకి వెళ్ళిందట. వీధిలో వస్తున్న సుబ్బులు ముసలమ్మ పిల్లాణ్ణి చూసి, “బిడ్డకి అమ్మవారు పోసింది… వెళ్ళి వేపాకూ, పసుపూ నూరి ఒళ్ళంతా రాయి… నర్సు వచ్చేప్పటికి రేతిరవుతుంది!” అంది. దేవకి పిల్లాణ్ణి ఇంటికి తీసుకెళ్ళింది.

నిన్న రాత్రే అప్పటికప్పుడు పిల్లలందరూ కలిసి మాట్లాడుకుని తెల్లవార్తో తినకుండ వచ్చి బడికి వెళ్ళకుండ పూజలు చేసి చెట్టుకింద కూర్చున్నారు. ఇప్పుడు ఊళ్ళో అందరికీ విషయం తెలిసిపోయింది.

ఎలాగైనా బిడ్డని కాపాడుకోవాలన్న బాధతో అంజయ్య రామస్వామి ఇంటికొచ్చాడు. ఊళ్ళో రామస్వామి అందరికంటే డబ్బున్నవాడు. అయన తప్పక సాయం చేస్తాడు అన్న నమ్మకంతోనే దేవకిని హాస్పిటల్లో బిడ్డదగ్గర ఉండమని బస్ ఎక్కి వచ్చాడు. నర్సు చెప్పింది నిజమే. పిల్లాడికి డెంగ్యూ జ్వరమే. హాస్పిటల్లో వీడిలాగే ఇంకో నలుగురు పేషంట్లు ఉన్నారు. డాక్టరు, “భయపడకయ్యా… నీ కొడుక్కేమీ కాదు. మేము చూసుకుంటాం” అంటూ ఏడుస్తున్న అంజయ్య భుజం మీద చేయి వేసుకుని చెప్పాడు. దేవకి ప్రయాసతో అంజయ్య కంటబడకుండ దాచి ఉంచిన వేయి రూపాయిలు ఇప్పుడు ఆటోకీ, బెడ్ ఛార్జీలకీ, తిండికీ ఖర్చు పెట్టేసింది.

“రారా అంజయ్యా… వచ్చేవాడు ఉదయాన్నే రావాలిగానీ, ఏంటి మిట్ట మధ్యాహ్నం వచ్చావు? నువ్వొస్తావు జుట్టు కత్తిరిస్తావు అని చూసి నా మనవడు బడికెళ్ళిపోయాడు.. నేను కూడా చూసి చూసి షేవింగ్ నేనే గీసుకున్నాను. మీసాలు కొంచం దిద్దువుగానీరా.”

“లేదయ్యా! నేను సామాన్లు పట్టుకురాలేదు. మిమ్ముల్ని చూసిపోదాం అని చెన్నిమల హాస్పిటల్ నుండి నేరుగా ఇక్కడి వచ్చాను.”

“ఏమైందిరా?”

“పిల్లాడికి ఒంట్లో బాలేదయ్యా” అంటూనే బావురుమన్నాడు. రామస్వామి విషయం ఊహించాడు.

“నా దగ్గర డబ్బడగదాం అని వచ్చావా? వ్యాపారం ఎక్కడ్రా జరగుతుంది నాకు… ఉన్న మిల్లులన్నీ ఒక్కోటీ మూసేస్తుంటే? వర్షాల్లేకుండ కయ్యలన్నీ బీడుగా పడుంటే? వెయ్యి రూపాయిలిస్తాను తీసుకెళ్ళు.”

“లేదయ్యా, కొంచం ఏగేసి ఇచ్చినారంటే బాగుంటుందయ్యా. నాలుగురోజులైనా ఉండాలటండయ్యా హాస్పిటల్లో! నాలుగువేలైనా ఇయ్యండయ్యా!”

“చేతిలో డబ్బుంటే నువ్వు సారాయంగళ్ళ చుట్టూ తిరుగుతావు. నిన్నెక్కడ పట్టుకుని వసూలు చేసుకోనూ? ఇప్పుడు తెలుస్తుందా? డబ్బవసరం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఉన్నప్పుడు తాగేయడం కాదు.. దాచుకోవాలి. కళ్ళుపోయాక సూర్యనమస్కారం చేసినట్టు ఉంది నీ పని. ఈ సంవత్సరం జీతం కూడా ఇస్తాను తీసుకుందువుగానీ. ఎల్లుండి వచ్చి తీసుకుపో” అని రామస్వామి లోపలికెళ్ళిపోయాడు. అంజయ్యకి పైప్రాణం పైనే పోయినట్టయింది. నమ్మకంతో వచ్చాడు. ఇంటికెళ్ళి సైకిల్ తోసుకుంటూ రోడ్డు వైపుకి నడిచాడు. దేవకి ఏమీ తినుండదు తాగుండదు అనుకుని బాధపడుతున్నాడు.

ఇంకెవర్ని డబ్బడగాలో తెలీడంలేదు అంజయ్యకి. సైకిలెక్కి బడి దగ్గరకొస్తుంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా అక్కడుంటం చూసి ఆగాడు.

“అదేంటి అంజయ్య ఇక్కడ తిరగుతుండాడు.. పిల్లాణ్ణి హాస్పిటల్లో వదిలేది? ఇక్కడేంపనిరా?” అడిగింది సరస్వతక్క. “అదేగదా?” అని వంతపలికారు మిగిలిన వాళ్ళు.

“మీ ముకుందానికి నయమైపోవాలని మా పిల్లలందరూ ఏమీ తినకుండ పూజలు చేసి మమ్మల్ని డబ్బివ్వమని కూర్చున్నారా. ఆదివారం చీటీకోసం దాచుకున్న డబ్బు ఐదొందలు ఇచ్చాను మా వాడి చేతికి” అంది స్వర్ణముఖి. అంజయ్య దిగి వెళ్ళాడు. ఊర్లో పిల్లలందరూ హెడ్మాస్టర్ కేసి చూస్తూ కూర్చున్నారు.

హెడ్మాస్టర్ పోగైన డబ్బులన్నీ ఎంచి మూడువేలా మూడువందలా యాభై రూపాయలయ్యాయి అన్నాడు.

“ఇంత డబ్బు గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరంపడదమ్మా… ముకుందాన్ని ప్రైవేటు హాస్పిటల్లో చేర్చుంటే ఈ డబ్బు సరిపోదు. డెంగ్యు జ్వరానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మందులు దొరుకుతున్నాయి ఇప్పుడు. ఆ జ్వరం పాకకుండ చూసుకోడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. అక్కడ అంత ఖర్చయింది, ఇక్కడ ఇంత ఖర్చయింది అని విని ఈ పిల్లలు ముకుందాన్ని ఇక కాపాడుకోలేమేమో అని భయపడి కూర్చున్నారు. అయినా పిల్లలు ఇలా చెయ్యడం మంచి విషయమే! ఇతనేనా అంజయ్య?” అని హెడ్మాస్టర్ అడిగాడు.

“సామీ, నేనేనండి” అని హెడ్మాస్టర్ కాళ్ళమీద పడిపోయాడు. హెడ్మాస్టర్ కొంచం కంగారుపడి “ఇదేంపనయ్యా” అని వారిస్తూ తేరుకున్నాడు. అక్కడ చేరిన ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు.

“ముందు లేవవయ్యా.. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఇంకో నాలుగైదు రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సుంటుంది. అక్కడి నర్సుల్నీ, కంపౌండర్లనీ మంచిచేసుకుని చేతులు తడుపుతుండు. పిల్లాణ్ణి వాళ్ళు బాగ చూసుకుంటారు. గుర్తుపెట్టుకో మీ ఊళ్ళో పిల్లలందరూ పస్తుండి పూజలు చేసి వాళ్ళ ఇల్లళ్ళో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ముకుందం కోసం”

“సామీ, నా కొడుకు బతికితే చాలయ్యా నాకు. నా తల కుదవ పెట్టయినా ఈ డబ్బులన్నీ తిరిగిచ్చేస్తానండీ”

“నీ తల తాకట్టుపెడితే ఎవడు తీసుకుంటాడని? మాటలుచూడు? నువ్వు తాగుతావటగదా? చెప్పారు వీళ్ళు” గర్జించాడు హెడ్మాస్టర్.

“అన్నెంపున్నెం తెలిని ఈ పిల్లల సాక్షిగా చెప్తుండా సామీ.. ఇంకెప్పుడూ తాగను” అని అక్కడున్న పిల్లల్ని చూసి ఏడ్చాడు అంజయ్య.

హెడ్మాస్టరూ, కొందరు పిల్లలూ ఒంటిగంట బస్సెక్కి చెన్నిమల హాస్పిటల్ కి వచ్చారు. ముకుందాన్ని ఉంచిన వార్డ్ కి వెళ్ళి చూశారు. తన స్నేహితులని చూసి ముకుందం నీరసంగా నవ్వాడు. కనికలమ్మ గుడిలో ఇచ్చిన విబూదిని ముకుందం నుదుట రాశాడు మురళి.

“నీకు జ్వరం బాగయ్యి రాడానికి ఒకవారం పడుతుందని సార్ చెప్పాడ్రా. నువ్వు వచ్చాక ఈ వారం ఏం పాఠాలు చెప్పారో నీకు నేర్పుతాం మేము. ఏడవకుండ ఇక్కడే ఉండు. సరేనా?” అంది సీత. ముకుందం నెమ్మదిగా తలూపాడు.

డాక్టర్ లోపలికి రాగానే పిల్లలందరూ మెల్లగా బయటికి నడిచారు. కిటికీనుండి డాక్టర్ ని చూశారు. “ఎలాగైనా మా స్నేహితున్ని కాపాడండి డాక్టర్‌” అన్న వాళ్ళ ప్రార్ధన వాళ్ళందరి కళ్ళలోనూ కనిపించింది.

*

 Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, అరవ కథలు, జులై and tagged , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.