racayitrisvagatam

స్వగతం

Download PDF ePub MOBI

పేరు దేవకి, ఊరి పేరు, నాన్న పేరు కలిపి మహాసముద్రం కోదండరెడ్డి దేవకి. చిన్నప్పుడు నన్నందరు ముద్దుగా ‘చిన్నపాప’ అని పిలుచుకునేవారు. నన్ను ఏడిపించడానికో, ఎగతాళిగానో పొట్రాసు, ఇడ్లీ సుబ్బి, బేతమంగళం చెరువు అనేవాళ్లు.

చిన్నప్పుడు సగం కాలం ఆటలతోనే గడిచిపోయింది. వెన్నెల రాత్రులలో అర్ధరాత్రిదాకా, ఒక్కోసారి కోడికూసే జాముదాకా కూడా ఆడుకొని ఆ మట్టికాళ్లతోనే నిద్రపోయే వాళ్లమంటే ఈ తరం వాళ్లకు ఆశ్చర్యంగా వుంటుంది. ఎన్ని రకాల ఆటలు ఆడుకొనేవాళ్లమో తెలిస్తే నోరెళ్లబెడతారేమో! ఆయా ఆటలకు సంబంధించి పాటలెన్నో వుండేవి. చెమ్మచెక్క, వామనగుంటలు, ఒత్తొత్తి వారొత్తి, కర్రగానుగ, మల్లీపూవు మల్లీపూవు మెల్లగవచ్చీ గిల్లీపో’, వెన్నెల కుప్పలు, గోలీలు, కుంటాట, బొంగరాలు, చెడుగుడు, జిల్లాకట్టె… ఇలా చెప్పుకుంటూపోతే వందదాకా లెక్కతేలుతాయి. ఆడపిల్లలు, మగపిల్లలు అనే తేడా లేకుండా మేము అన్ని ఆటలూ ఆడుకొంటూ ఆనందంలో మునిగితేలేవాళ్లం.

హావభావాది చేష్టలతో కూడిన, శరీర వ్యాయామాన్ని కల్గించే ఆటలే గాక ఎండపూట ఏ చింత చెట్టుకిందో, కానగమాను నీడలోనో బొమ్మరిండ్లు కట్టుకొని విరిగిన పెంకుల్లో, టెంకాయ చిప్పల్లో మన్ను బువ్వను వండివారుస్తూ, పెద్దవాళ్లను అనుకరిస్తూ ఆనంద సంకేతాలైన ఆటలకోసం ఎంతో సమయాన్ని వెచ్చించేవాళ్లం. ఆడుకొనే సమయంలో మా అమ్మావాళ్లెవరైనా పనుందని పిలిస్తే కొంపలు మునిగిపోయినంత దిగులు పడేవాళ్లం. ఆట మధ్యలో ఎవరైనా వెళ్లిపోతే ప్రాణ స్నేహితురాలైనా సరే కోపంతో -

‘‘సగమాటలో బోయింది సాకలోడి పెండ్లాం – మధ్యాటలో బోయింది మంగలోడి పెండ్లాం’’ అంటూ ‘‘అడ్లాబుడ్లా – నాగలాబుడ్లా – పండగనాడు – పైడుబీమేసుకొని – పటుక్కునచావాల’’ అని మెటికలు విరవడం ఆనవాయితీ.

స్నానం చేయాలన్నా, తలదువ్వుకోవాలన్నా ఆ సమయమంతా వృధా అయిపోతుందనే ఆరాటంతో మా అమ్మకు అందకుండా జారుకొనే ప్రయత్నం ముమ్మరంగా సాగేది. చింపిరి తలతో ఎప్పుడూ చెట్లెంట పుట్లెంట తిరుగుతుంటానని మా అమ్మ నన్నుద్దేశించి ఎవరికైనా చెప్పేటప్పుడు, కోపం వచ్చినప్పుడు ‘ఇర్లచెంగి’ అనేది. మా అక్కావాళ్లుకూడా నన్ను ఏడిపించాలనుకున్నప్పుడు పదేపదే ‘ఇర్లచెంగీ’ అనే ఏడిపించి, ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించేవారు. నా చిన్నప్పటి జీవితానికి అతికినట్లు సార్థకనామధేయమై కూర్చున్న ‘ఇర్లచెంగి’ పేరంటే నాకూ ఇష్టమే. అందుకే నేను ఇటీవల రాసిన కథలకు ‘ఇర్లచెంగి కథలు’ అని పేరు పెట్టుకున్నాను.

నాది ఇలా నిరంతరం ఆటపాటల్లో మునిగి తేలిన పసితనం. స్కూల్లో తప్ప ఇంట్లో కూడా చదువుకుంటారని తెలియని అమాయకత్వం. హోంవర్క్‌ను కూడా స్కూలుకే పరిమితం చేసిన అజ్ఞానం. ఒకే వూర్లోవున్న మా ఇంట్లో, మా అమ్మమ్మ ఇంట్లో రెండు చోట్లా పెరగడంవల్ల వీళ్లడిగితే అక్కడున్నానని, వాళ్లడిగితే ఇక్కడున్నానని అబద్ధాలతో పబ్బం గడిపి ఆటలకే సమయాన్నంతా కేటాయించిన గడుసుతనం.

స్కూలు ఫైనల్‌ దాకా స్వేచ్ఛా స్వాతంత్రాలతో గడిపిన బాల్యం డిగ్రీ కోసం తిరుపతిలో మా చిన్నాన్నగారింట్లో వున్నప్పుడు కాలేజి, ఇల్లు తప్ప ఇతర వ్యాపకాలు లేకపోవడంతో గిలగిల లాడిన మనసు. అలాంటి జీవిత నేపథ్యంలో నుంచి వచ్చిన నేను చదువుకొని ఏదో సాధించాలనుకున్న నా పట్టుదల ముందు నా అమాయకపు పసితనపు పోకడలు తలవొంచినందువల్ల ‘ఇర్లచెంగి’గా పిలవబడిన స్థాయి నుంచి విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎం.కె. దేవకి స్థాయికి ఎదగడమైంది. ‘భారత మహిళా శిరోమణి’ అవార్డును కూడా పొందడమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2013లో ‘ఉత్తమ రచయిత్రి’ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.

అమూల్యమైన బాల్యం నుంచి వృధ్ధాప్యంలో అడుగుపెట్టినా ఇప్పుడు జరిగిందాన్ని ఇంకాసేపట్లో మరచిపోతున్న ఈ దశలో బాల్య స్మృతులు మాత్రం నిరంతరం వెన్నంటే వున్నాయి. అందుకే చిన్ననాటి అనుభవాలనే విత్తనాల నుంచి అనుభూతుల మొక్కలు మొలకెత్తి మహా వృక్షాలుగా ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఇన్నాళ్లకు కాపుకొచ్చి ఫలపుష్ప సమన్వితాలైనాయి. నా హృదయ ధర్మంతో సంవదించే మనఃప్రవృత్తి కలిగిన కొందరికైనా వాటిని రుచి చూపించాలనే తపనకు ప్రతిఫలమే ఈ ప్రయత్నం.

నాలో నిద్రాణంగా వున్న సృజనాత్మకశక్తిని తట్టిలేపి కార్యోన్ముఖురాలిని చేసింది తిరుపతి కొండలోని ప్రకృతి సౌందర్యం. మనిషి ఎంత విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నా ప్రకృతి ముందు వెలవెలబోతాడని నా అభిప్రాయం. సహజత్వం కలిగించినంత రసానందాన్ని కృత్రిమత్వం ఇవ్వలేదు కదా!

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పరిశోధన చేస్తున్న రోజుల్లో మా స్నేహ బృందమంతా కలిసి శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు నడిచివెళ్తున్నాం. ఆ ప్రకృతి సోయగాలను వర్ణించడానికి భాష చాలదు. మొదట సెలయేటి గలగలలు చెవులనిండా అమృతాన్నినింపి ఆ తర్వాత చాలా సేపటికి ఎదురై కనువిందు చేసినప్పుడు నా హృదయం స్పందించి నాలో వున్న సృజనాత్మక శక్తి అలవోకగా నా నోట కొన్ని పదాలు, పాదాలను వెలికి తెచ్చింది. పచ్చని చెట్లు, అడవిపూల అందాలు, సహజమైన వాసనలు, వాతావరణంలో అనుక్షణం కలుగుతున్న మార్పులు కవితా వస్తువులై గేయరూపంలో సాక్షాత్కరించాయి.

ఇలలో సాధ్యం కానివి కలలో సాధ్యమే కదా! అందుకే ఎంత అద్భుతమైనవైనా అవాస్తవాలైన ఆ భావాలను కలకు ముడి పెట్టాను. తర్వాత కాగితం మీద అక్షరరూపం పొందిన ఆ గేయం ఉదయ భారతి ప్రచురణ సంస్థవాళ్ల ‘మంజీర స్వనాలు’ అనే కవితా సంకలనంలో చోటు చేసుకుంది. ఆ గ్రంథం ఏఫ్రిల్‌ 1979లో ప్రచురితం. ఆగేయం :

.
అమ్మమ్మ చెబుతున్న కాకమ్మ కథవింటు
చిక్కనీ చీకట్ల సందిట్లో వాలేను
చింతలను మరిపించు నిదురలో తూలేను
కళ్లెమే లేనట్టి కలల గుర్రమునెక్కి
దేశదేశాలన్ని తిరిగి వచ్చాను
.
కొండలలొ కోనలలొ నిండుగా పారేటి
సెలయేటి గలగలలు చెవులార విన్నాను
అడవి మల్లిపూల అందాలు చూశాను
సెలయేటి వాగులో రాగాల రవళిలో
మురళి నాదము నేనై మునిగితేలాను
.
కోటి కిరణాలతో కోరి వెలుగులు నింపు
బాలభానుని తోటి వూసులాడేను
నీరజాలను చూసి నిండుగా నవ్వేను
సూర్య కిరణాలలో నేనొక్క కిరణమై
వెలుగులను విరజిమ్మి వేడుకలు చూశాను
.
పచ్చనీ చెట్లపై పరువాల సొగసుతో
పాటలను పాడేటి పక్షులను చూశాను
మధుర రాగాలకు మైమరచి పోయాను
కిలకిలా రావాల కలకలలు వింటూ
పక్షిలో పక్షినై పరవశించేను
.
నీలాల నింగిలో నిండుగా నవ్వేటి
చక్కనీ చంద్రునితొ దోబూచులాడేను
చుక్కలా భామలను వెక్కిరించేను
చంద్రునీ మోములో చిరునవ్వు నేనౌతు
మూడు లోకాలను మురిపించి వేశాను.

తెలుగు బాలసాహిత్యంతో తొలి పరిశోధన చేసి బాలగేయాలెన్నో రాశాను. జానపద సాహిత్యంపైన వున్న devakiఅభిమానంతో గేయాలు, సామెతలు, పొడుపుకథలు కొల్లలుగా సేకరించి ఎన్నో వ్యాసాలు, గ్రంథాలు రాశాను. నేను రాసిన ‘తెలుగు నాట జానపద వైద్యవిధానాలు’ అనే గ్రంథానికి ఏ.పి. జానపద సాహిత్య పరిషత్‌ ఆచార్య బిరుదురాజు రామరాజుగారి పేరున ప్రకటించిన బహుమానం, బెంగుళూరు విశ్వవిద్యాలయం తంగిరాల సాహిత్య పీఠం ఉత్తమ పరశోధనకుగాను ఇస్తున్న సీతామహాలక్ష్మి అవార్డు వరించాయి. వృత్తిపరంగా సంతృప్తికరమైన రచనా వ్యాసంగం జరిగింది. నేను రాసిన ‘జాతిరత్నాలు’ అనే ఉపవాచకం కొన్నేళ్లపాటు తొమ్మిదో తరగతి వాళ్లకు పాఠ్యగ్రంధంగా ఉండిరది. ఆంధ్రరాష్ట్రంలో ఇంటర్‌మీడియట్‌కు ఏడు గ్రంథాలు, మహారాష్ట్రలో 10,12 తరగతులకు పాఠ్య పుస్తకాలను రాయడం, సంపాదకత్వాన్ని నిర్వహించడం, ఆకాశవాణిలో ప్రసంగించడం నేను చేసిన సరస్వతీ సేవలు. ఎం.ఏ. తెలుగు దూరవిద్యకోసం జానపద సాహిత్యం, దాక్షిణాత్య భాషా సాహిత్యాలు – తులనాత్మక పరిశీలన అనే పాఠ్య గ్రంథాలు రాశాను.

కథలు రాయాలనే ఆలోచన 1979లో నిరుద్యోగిగా వున్నప్పుడే వచ్చింది. తరం మారింది, సెలయేట్లో గులకరాళ్లు అనే నవలలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఒకటి రెండు కథలు రాసినా పత్రికలకు పంపలేదు. మళ్లీ నాలో కథలు రాయాలనే తపన కలిగి పదేండ్లయింది. 2005లో ముళ్లదోవ, మంటల ఒడిలో అనే రెండు కథా సంకలనాలు వెలువడినాయి. ‘నవ్య’ వారపత్రికలో 4 కథలు వచ్చాయి. వరంగల్లు, శ్రీలేఖ సాహితి వాళ్లు ప్రచురించిన తరంగం, సౌరభం, వ్యయ, సంగడి, శ్రీ కంజము, శ్రీ హంస మొదలైన సంకలనాల్లో నాకథలు చోటు చేసుకున్నాయి. ఆ సంకలనాలను సమీక్షించిన మేధావులు నా కథలు మొదటి స్థాయిలో నిలబడతాయని చెప్పడం ఆనందాన్నిచ్చింది. హిందూలో రెండుసార్లు నా కథలు బాగున్నాయని రెవ్యూలు రావడం కొండంత బలాన్నిచ్చింది.

మాండలిక భాషలో కథలు రాయాలనే ఉద్దేశంతో గొడ్లు మేపే పిల్లోళ్లను పాత్రలుగా తీసుకొని స్యాపలకూర, ఉర్సుతిర్నాల, సుద్దులు, గొబ్బియ్యాల పండగ, యాందమూరి తిర్నాల మొదలైన పేర్లతో ‘కొల్లోడొంక కథలు’ రాశాను. అవింకా అముద్రితాలు. సుద్దులు, నానుడులు, జాతీయాలు, సామెతలు, ఆర్యోక్తులు, జంటపదాలు తెలుగులో కోకొల్లలుగా వున్నాయి. భాషతోపాటు అవి కూడా అంతరించి పోతున్నాయనే ఆవేదన నాకు ఎక్కువగా వుంది. అందుకే వాటిని చాలా వరకు సేకరించాను. సామెతలను ఏ సందర్భంలో, ఏ అర్థంలో ఎలా ప్రయోగిస్తారో కొందరు ఆచార్యులకు కూడా తెలియడంలేదు. ‘చుట్టూరా ఆవరించి వున్న చీకట్లను తిట్టుకుంటూ కూర్చోవడం కంటె ప్రయత్నించి చిన్న దీపాన్నైనా వెలిగించడం మేలు’ అనే మాటల స్ఫూర్తితో, భాషకు సుస్థిరత్వాన్ని చేకూర్చిపెట్టాలనే సదుద్దేశంలో మధ్యతరగతి రైతుకుటుంబ నేపథ్యంతో ‘సామెతల సూరమ్మత్త’ అనే నవలను రాస్తున్నాను. అది దాదాపుగా పూర్తికావొచ్చింది.

‘ఇర్లచెంగి కథలు’ రాయడానికి ప్రేరణ నామిని సుబ్రమణ్యం నాయుడు గారు. అతని కథల్ని కొన్నేండ్లకు ముందే కొన్ని చదివినా అప్పుడు కేవలం పాఠకురాలిగానే వుండిపోయాను. ఇటీవలి కాలంలో ఫోను ద్వారా పరిచయమైన ఆయన తన పుస్తకాలను పంపించారు. వాటిని చదివి ముగ్ధురాలినయ్యాను. ‘పచ్చనాకు సాచ్చిగా’, ‘మిట్టూరోడి కథలు’, ‘మూలింటామె’ నవల మొదలైన వాటిని చదివినప్పుడు వాటిలోని సహజత్వం, సజీవమైన పాత్ర చిత్రణ, నిత్య వ్యవహారంలో నలిగిపోయిన భాషా సంపద నన్ను అమితంగా ఆకట్టుకొన్నాయి. ఆ మాటలనే నామిని గారితో అన్నప్పుడు అలాంటి కథలు మీరెందుకు రాయకూడదన్నారు. రాసి పంపించిన వాటిని చూసి బాగున్నాయని సహించి, ఉత్సహించి ప్రోత్సహించడమే గాక కన్పించిన వాళ్లతో అంతా వాటిని చదివించారు. సాకం నాగరాజుగారు, ఉమామహేశ్వరరావు గారు, స.వెం. రమేశ్‌గారు నా కథల్ని చదివి అభినందించిన వారిలో ఉన్నారు. నామిని కథల స్ఫూర్తితోనే ‘ఇర్లచెంగి కథలు’ రూపుదిద్దుకున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నా కథల్ని చాలామందితో చదివించాలనే నామినిగారి సలహాతో ఈ కథలకు ప్రాణమొచ్చింది. వీటిని ఆదరించాల్సింది పాఠక దేవుళ్లు. వాళ్ల అభిప్రాయాల కోసం ఎదురు చూస్తుంటాను.

– దేవకి

Download PDF ePub MOBI

Posted in 2014, ఇర్లచెంగి కథలు, జులై, సీరియల్ and tagged , , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.