cover

కొత్త పలక – నున్న బలప్ము

Download PDF ePub MOBI

(రచయిత్రి స్వపరిచయం)

‘సిన్నెయ్యా, రేపు దీన్ని పలికూటంలో సేర్చాలంటా వుండాడు మా కోదండడు. ఇంత బతుకూ బతకతా నాలుగు బొరుగ్గింజలన్నా పంచకుంటే బాగుంటాదా సెప్పు?’ అని సిత్తూరికి వొంటెద్దుబండి నడిపే సిన్నెయ్యనడిగింది మా దొరసానవ్వ. ఆయమ్మ మా నాయినికి మేనత్త. మా నాయిన్నామె దత్తుదీసుకునిందంట.

నన్ను ఇస్కూలుకు సేరస్తావున్న్యందుకు శానా కుశాలుగా వుండాది.

‘మీ బోటోళ్లు అంత మాత్రమన్నా సెయ్యకపోతే బాగుండదు లేమా!’ అన్న్యాడు సిన్నెయ్య.

‘మడి సేడబెట్తావుండారు సిన్నెయ్యా. మా కోదండానికి నిలుకు లేదు. నువ్వు సిత్తూరు నుంచొచ్చేటప్పుడు నాలుగు సేర్లు బొరుగులు, రొండు తవ్వలు సెనిగిపప్పు దీసుకొనిరా’ అని సంచి, ఆరణాల దుడ్లు సిన్నెయ్య సేతిలో బెట్టింది మాయవ్వ.

ఆరేత్రి నేనూ, మాయ్యక్క అన్నం దింటా వుండాము. మాయమ్మ మా పెద్దబ్బోడికి అన్నం దినిపించి నిద్రపిస్తా వుండాది. మా నాయిన అన్నానికొచ్చినాడని మాయవ్వ మాయబ్బోన్ని కాళ్లమింద పండుకోబెట్టికోని మాయమ్మను పంపించింది.

తిన్నిగిన్ని కడగాల్సొస్తాదని నేనెప్పుడూ రెండు ముద్దలన్నం మిగిలబెట్టేసి లేస్తాను.

‘అమ్మా, సూడుమా ఈ బిడ్డి’ అని మాయక్కుందే బిల్లి బిత్తిరిది మాయమ్మకు సూపించింది.

‘సినపాపా, ఇట్రా’ అని పిలిసింది మాయమ్మ.

అన్నించి పరిగెత్తి పోదామనుకున్ని దాన్ని ఎనక్కొచ్చినాను.

‘ఏంపనిది తినేసి గిన్ని కడిగిపెట్టు’ అని మానాయినికి గిన్నిలో అన్నం బెట్టకరాను కదిలింది.

నేను ఆన్నించి జారుకోవాలని సూసినాను. కాని మా సుప్పనాతి సూరపనక ఆడేవుండాది గదా!

‘అమ్మా..’ అనబోయింది నాపక్క జూస్తా మాయక్క. నాకు కోప్మొచ్చి మాయక్కను గిల్లిపెట్టి పరిగెత్తబొయినాను. మాయక్క ‘సూడుమా ఈ బిడ్డి’ అని ఏడుపెత్తుకొనింది.

‘అది తినేసి గిన్ని కడిగిపెట్టు’ అని ఉరిమిసూసింది మాయమ్మ నాపక్క. కాళ్లు కడుక్కోని పైగుడ్డతో మొగం తుడ్సుకుంటా గుడ్సింటిలో కొచ్చినాడు మా నాయన.

‘ఏంది గలాటా?’ అని అడిగినాడు.

‘ఏముంది. నీ సిన్నకూతురుంది గదా! ఇర్లసెంగి మాదిరిగా వూరంతా తిరిగొచ్చేది. తట్టకేసి పెడ్తే తినేది. యాడ గిన్నికడగాల్సొస్తాదో అని ఒక మింగడ దాంట్లో వొదిలిపెట్టేది. ఒక సిన్న పనన్నా సేస్తాదా! కొరకరాని కొయ్యయిపోతావుంది’ అని మా నాయనితో నా మింద ఏమేమో సెప్పేస్తా వుంది.

మాయక్క మొగం సూడల్ల. నన్ను తిడ్తావుంటే ఆ బిడ్డికి తమసా. నాకు ఏడుపొచ్చేసింది. ముక్కెగరేస్తా తలుపును గిల్లుకుంటా తలాంచుకోనుండాను. మద్ది మద్దిలో ఆవిలిస్తావుంటే మళ్లీ తిట్లు మొదులు బెట్టింది మాయమ్మ.

‘ఆడబిడ్డి ఎంత అణకువగా వుండాల. సిన్న సేతుల్తో ఎంత పనిజేస్తే వొద్దన్న్యా. పుట్లు మూసేదాని మాదిరిగా సింపిరితల బెట్టుకోని ఇరవైనాలుగ్గంటలు మంటిలో పడి పొర్లాడ్తా నీళ్లు గొట్టుకోమన్న్యాగూడా కొట్టుకోదు. దీంతో యాంగాలంటే నాకు నా తల ప్రాణం తోకకొస్తాది….’.

నాకు కండ్లు మూతలు బడి పోయ్‌నాయి. తలుపుకు జారబడింది తెలుసు.

మా నాయినొచ్చి నన్నెత్తుకున్న్యాడు. కండ్లు దెర్సి సూసినాను. ‘ఒగేసారి యాడ పండుకోవాలో ఆడ పండుకుంటే ఏమి నాయినా!’ అని మాయబ్బోని పక్కన బొంతమింద పండుకోబెట్టినాడు.

‘తెల్లారింది లెయ్‌ నాన్నా, నా బంగారు కదా! ఈ పొద్దు కొత్త పలకా బలప్మెత్తుకోని నా కుట్టికన్న ఇస్కూలికి పోతా దంటా’ మాయమ్మ లేపతావుంది.

‘కొంచేప్మా’ అని ఇంగా ముడుకుక్కున్న్యాను.

‘నాకేంలే. అట్నే పొండుకో, నీ పలకాబలప్ము అక్క దీసుకుంటాది’ అనింది.

అంతే గబుక్కున లేసినాను. పెళ్లోకి బొయ్యి వొంటికి బోసొచ్చి ‘నా పలకా బలప్మియ్యిమా’ అన్న్యాను.

‘వాట్నేమి గెద్దెత్తుకోని బోదులే. అక్కక్కనిపించకుండా నేనెత్తి పెట్న్యాను. పండ్లు దోముకోనిరా. నీళ్లు బోసుకుందువు’ అనింది.

పెళ్లోకి బొయ్యి పిడకబూడ్దిని ఎడం సేతిలో ఏసుకోని అద్దుకోని అద్దుకోని పండ్లు దోముకుంటా వుండానా. మా యక్కొచ్చింది. అప్పుడే పక్కింటి పొన్నెక్క దెగ్గిర బొయ్యి రొండు జల్లేసుకోనొచ్చింది. తల్నిండా సేమంచి పూలు గూడా పెట్టుకోనుండాది.

‘అకా నేనుగూడా నీతో ఇస్కూలుకు కొత్త పలకా బలప్మెత్తుకో నొస్తానే’ అన్న్యాను.

మా యక్కకు శానా కుశాలైపోయింది. నాకు మొగం కడిగించి ఆబిడ్డీ కడుక్కొనింది.

మాయమ్మ ఇప్పపిండి సట్టితో వొచ్చింది. ‘అమా నేను తలకు బోసుకోను మా’ అని ఏడ్సినాను.

‘తలకు బోసుకోని, మంచి గుడ్డలేసుకోని, కొత్త పలకా బలపం దేవుని ముందర బెట్టి మొక్కోని బోతివనుకో, సదువు బాగొస్తాది. అందురికంటే పస్టొస్తే… ఇంగ నీకు ఎన్ని దెచ్చిస్తాడో మీనాయిన’ అంటా నా గుడ్డలిప్పేసి తలకు బోసింది.

ఇప్పపిండి కంట్లో బడి మంటబెట్టి యేడస్తావుండాను. మాయమ్మ పెట్లో నుంచి మా గుర్రాలమిట్ట మామ పెండ్లికి దెచ్చిన పనసకాయిల పావడా రైక తియ్యడం సూసినాక నా ఏడుప్యాడికి బోయెనో!

irlachengi kathaluమాయవ్వ బోగాన్లో బొరుగులు, పప్పులు బోసి ఒక ముద్ద బెల్లాన్ని కొట్టి దాంట్లో కలిపింది. ఆకులు వొక్కలు గూడా దానిమింద బెట్టుకొనింది. మాయమ్మ టెంకాయ బొచ్చుదీసి తెచ్చిచ్చి నా తల్లో వున్న ఇప్పపిండి ఇదిల్చి తలార్సుకోమని నీ రెండలో నిలబెట్టింది. ఆడికే సద్దన్నంలో గెడ్డపెరుగుబోసి కలుపుకోనొచ్చి తినిపించింది. మూతీ ముక్కూ కడిగి పొగుడ్రు బూసి సాందు చిప్పలో నీళ్లుబోసి సాంది పొరకపుల్లతో మాయక్కకు, నాకు నామం బెట్టింది.

దేవుని దెగ్గిర దండం బెట్టించి కొత్త పలక్కు పసుప్పూసి కుంకం బెట్టి నున్న బలపం కోపుదెచ్చి సేతికిచ్చింది. నేను పలకతో రాయబోతే ‘ఇప్పుడొద్దు అయివోరు రాపిస్తాడ’నింది.

మాయవ్వ ఏలు బట్టుకోని యీదిలో నడ్సుకుంటా పోతావుంటే నాకు శానా కులుగ్గా, కొంచిం సిగ్గుగా వుండాది. అందురూ మాయవ్వను పలకరించేవాళ్లే. నడీది సుందరమ్మవ్వయితే కలకటేరు సదవను బోతావుండావా అని దెగ్గిరికొచ్చి సక్కిలిగిలి బెట్టింది.

ఇస్కూల్లో పెద్దయివోరు మాత్రముండాడు. తెల్లంగా, పొడుగ్గా, కొంచిం లావుగా గుమ్మిడి పండు మాదిర్తో. తెల్లపంచి గట్టుకోని, తెల్ల సొక్కాయి ఏసుకోనుండాడు.

మాయవ్వను సూడంగానే అయివోరు లేసి నిలబణ్ణ్యాడు. మాయవ్వను జూస్తే యీదిలో దిన్నిలిమింద కూసోనుండే మొగోళ్లు గూడా లేస్తారు గదా!.

‘దండమయివోరా, ఈ బిడ్డి మా కోదండుని రొండోకూతురు. ఇస్కూల్లో సేర్సాల’ సెప్పింది మాయవ్వ.

‘దానికేం బాగ్గెమమ్మా అట్లేగానీలే’ అని ‘ఏం పేరు పాపా’ అని అడిగినాడు నాపక్కదిరిగి.

నేను సెప్పలా. మాయవ్వ కొంగు బట్టుకోని ఎనక దాంకున్న్యాను. ఈ లోపల మాయక్క గూడా వొచ్చి మాయవ్వ సెయ్యిబట్టుకోని నిలబడిరది.

‘నీకేం పనీడ పో’ అని కసిరినాడయివోరు మాయక్కను. ఆ బిడ్డి కదల్ల్యా. ‘నా పెద్ద మనమరాలు గదా సామీ’ అనింది మాయవ్వ.

‘తెలుసమ్మా. నాకెందుకు తెలీదు’ అన్న్యాడు.

నేను మెల్లింగా మాయవ్వెనక నుంచి పక్కకొచ్చినాను.

‘ఏం పేరు పాపా! సెప్పు. సెప్పాల గదా!’ అన్న్యాడు.

‘దీని పేరు దేవకి. కిష్నుని తల్లిపేరు బెట్టుకున్న్యాడు మా కోదండుడు. అంతటి గొప్పోన్ని కనింది గదా! అని. పెద్దది ఇంటికి దీపం మాదిరిగా పుట్టిందని ‘జోతి’ అని పెట్టుకున్న్యాడు గదా!’

అయివోరు మా యవ్వతో మాట్లాడ్తావుంటే పిలకాయిలంతా కాసర బీసరని మాట్లాడుకుంటా వుండారు. మా యక్క ఎప్పుడు బొయ్యిందో నాగరత్న, సరోజ, ఈబిడ్డి వుడ్డగా కూసోని మాట్లాడ్తావుండారు. ఇంగ యాప్మాను కింద కూసోనుండే పిలకాయిలైతే గలాం బూలాం అని కాకులర్సినట్లరస్తా వుండారు.

పాపం అయివోరొక్కడే. ఇంతమందినీ అణవరించాలంటే తక్కువపనా. ‘వస్తానుండమ్మా’ అని బెత్తం దీస్కోని రాగిమాను, యాప్మానుకింద కూసున్నోళ్ల దెగ్గిరికి పరిగెత్తినాడు.

పిలకాయిల ఈపులమింద ఇమానం మోత మోగిస్తావుంటే బిత్తరపోయినాను.

అయివారొచ్చి మాయవ్వ దెచ్చిన సేమంచిపూల దండను గోడమిందుండే సరస్వతీదేవి పటానికి యాలాడేసినాడు. టెంకాయ గొట్న్యాడు. పలకమింద నా సెయ్యిబట్టుకోని ఓనామాలు రాయించినాడు. అయిదో తరగతి సదివే ఆర్ముగాన్ని పిల్సి తలా పిడికిడు బొరుగులు పంచమన్న్యాడు. ఇస్కూల్లో వుండే పిలకాయిలందురూ నాకు దెల్సినోళ్లే. ఒగటో తరగతిలో ఇంగా కొత్తోళ్లెవురూ సేరలేదన్న్యాడయివోరు.

‘సరేమ్మా. ఇంగ నేను సూసుకుంటాలే. పాపనీడే ఇడ్సిపెట్టి నువ్‌బో’ అన్న్యాడు. మాయవ్వ కొంగుముడిప్పి అర్దనాదుడ్లు నా సేతిలో బెట్టి అయివోరికిచ్చి కాళ్లకు దండం బెట్టుకోమనింది. అయివోరు దుడ్లొద్దన్న్యా మాయవ్వ తీసుకొనేదాకా ఇడ్సిపెట్టలేదు.

ఒంటికిడ్సినాక మళ్లీ ఇస్కూల్లో కూసోవాలంటే ముండ్ల మింద కూసున్నట్లే వుండాది. ఇస్కూల్లో మావూరి పిలకాయిలే కాకుండా ఆడాడ కొత్తోళ్లుకూడా కన్పిస్తావుండారు. వాళ్లంతా గాండ్లకొత్తూరు, లచ్చుమయ్య కండిగి నుంచి వొచ్చినోల్లని రొండోతరగతిలో వుండే కురపోళ్ల సుశీల సెప్పింది.

కొత్త పిలకాయిలొకిద్దురు నన్ను సూసి కిసుక్కుకిసుక్కుమని నవ్వుకుంటూ వుండారు. పలక మింద అయివోరేందో రాసిచ్చినాడు దాన్ని నేను రుద్దిన పాపన బోలేదు. నోట్లో బలపం బెట్టుకోని అందురిమొగాల్ని సూసుకుంటా కూసునింది తెలుసు. కొంచిం కొంచిం కొరికి ఎప్పుడు తినేసినానానో నున్న బలపం కోపు కొంచిం గూడా మిగల్లేదు.

అందుకే ఒంటికిడ్సినప్పుడు బలప్మెవురో దొంగలించేసినారని మాయక్కదెగ్గిర నంగినంగినా యేడ్సినాను. మా యక్క బలప్మెప్పుడూ సేతిలోనే బెట్టుకోవాలని పాటం సెప్పేసింది.

సంచిలో నుంచి పలక దీసుకోని రాసుకుందామని సెయ్యి బెట్టినానా. అది ఒప్పులొప్పు లైపోయుండాది. ఎవురో దాన్ని కాలితో తొక్కి ఇరగ్గొట్టినారు. ఆ నవ్వతా వున్ని పిలకాయిలిద్దురు నా పక్క దొంగసూపులు సూస్తావుండారు.

మద్ద్యాన్నం సంగటి దిన్న్యాక నేను ఇస్కూలుకు పోనే పోనని మొరాయించినాను.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఇర్లచెంగి కథలు, జులై, సీరియల్ and tagged , , , , , , , .

3 Comments

  1. కధ చాల బాగుంది. అక్కచెల్లెల్ల గిల్లికజ్జాలు, పలుకాబలుపాలు.. నా చిన్నతనము గుర్తుకు వచ్చింది. మిగతా కధల కోసం ఎదురుచుస్తున్నాము.

    • కొత్త పలక-నున్న బలప్ము కథ చాలా చాలా బాగుంది . చిన్న పిల్లల ప్రవర్తన మనస్తత్వం చక్కగా చిత్రీకరించారు. ధన్యవాదాలు. మిగిలిన కథలు ఎప్పుడొస్తాయి?

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.