cover

పదనిష్పాదన కళ (11)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

తొమ్మిదో అధ్యాయం

వ్యతిరేకార్థకాల నిష్పాదన

ప్రతి భాషలోనూ “ఔనా?” అంటే, “కాదు” అనడానికీ, “ఉందా ?” అంటే, “లేదు” అనడానికి కావాల్సిన ప్రాథమిక పద సరంజామా తప్పకుండా ఉంటుంది. వీటిని వ్యతిరేకార్థకాలు (antonyms) అంటారు. ధ్రువీకారివాక్యాల (affirmative sentences)కి వ్యతిరేకార్థకవాక్యాల్ని (negative sentences) అందరూ కూర్చగలరు. కాని సానుకూల పదాల (positive words) ని ప్రతీపశబ్దాలు (negative words) గా మార్చడానికే కొంచెం అభ్యాసం కావాలి. భాషలో కొన్ని సానుకూల పదాలకి వ్యతిరేక పదాలు సహజసిద్ధంగానే లభ్యమౌతాయి.

వెలుగు X చీకటి 

మంచి X చెడు మొ.

కానీ అన్నిటికీ ఇలా పూర్వాయత్తం (ready-made) గా లభ్యం కావు. కనుక మనం చాలా పదాలకి ప్రయత్న పూర్వకంగా వ్యతిరేకార్థకాల్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇలా లక్షణ (వ్యాకరణ) సహాయంతో కృత్రిమంగా రూపొందించిన వ్యతిరేకా ర్థకాల్ని ‘లాక్షణిక వ్యతిరేకార్థకాలు’ అంటారు.

అలా రూపొందించడానికి తెలుగుభాష అందిస్తున్న సాధనాలేంటి ?  

మనకు రెండురకాల వ్యతిరేకార్థకాలు అవసరమౌతాయి. 1. కానిది 2. లేనిది.

ఉదా:- + విద్య = అవిద్య = విద్య కానిది (అజ్ఞానం) 

నిర్ + వివాదం = నిర్వివాదం = వివాదం లేనిది (సునిశ్చితం)

ఐతే ఇవి సంస్కృత నిర్మాణాలు. కృత్రిమ వ్యతిరేకార్థకాల కల్పనకి అచ్చతెలుగు అందిస్తున్న లాక్షణిక సౌకర్యాలు అతిస్వల్పం. ‘కానిది’ అని చెప్పే పద్ధతే తెలుగులో లేదు. ‘కాదు, కానిది’ అంటూ వాక్యరూపంగా చెప్పాల్సిందే తప్ప ఆ అర్థంలో ఉన్న పదాలకి ఎలాంటి మార్పులూ, చేర్పులైనా చెయ్యడానికి తెలుగు అవకాశమివ్వదు. ‘లేనిది’ అని చెప్పే పద్ధతి మాత్రం ఉంది.

(I) ఇందుకోసం ‘ఇడి’ లేదా ‘ఇండి’ అనే ప్రత్యయాల్ని వాడతారు.

ఉదా:- సిగ్గు + ఇడి (ఇండి) = సిగ్గిడి/ సిగ్గిండి = సిగ్గులేనివాడు/ సిగ్గులేనిది

వాలు + ఇండి (ఇండి) = వాలిండి = తోకలేని కోతి (ape/ primate)

ముక్కు + ఇది (ఇండి) = ముక్కిడి/ ముక్కిండి = ముక్కు లేనివాడు/ ముక్కులేనిది

వావి + ఇడి = వావిడి = వావీ, వరసా పాటించని కాముకుడు. (incestuous person)

కాని ఇదొక్కటే సరిపోదు. ‘ఇడి/ ఇండి’ ప్రత్యయాన్ని పునరుద్ధరించి ప్రచురపఱచడానికి సమయం తీసుకుంటుంది. కనుక అలవాటైన సంస్కృతప్రత్యయాలతో ప్రస్తుతానికి పని గడుపుకోవాలి.

(II) సంస్కృతంలో ‘కానిది’ అనే అర్థంలో పదానికి ముందు ‘అ’ అనే ఉపసర్గ చేఱుస్తారు. వ్యాకరణ పరిభాషలో దీనికి నఞ్ అని పేరు. వైయాకరణులు దీన్నొక తత్పురుషభేదంగా భావిస్తారు. ఉదా :-

+ జ్ఞానం = అజ్ఞానం = జ్ఞానం కానిది

+ సహనం = అసహనం = సహనం కానిది

+ సామాన్యం = అసామాన్యం = సామాన్యం కానిది

+ సాధారణం = అసాధారణం = సాధారణం కానిది

+ నాగరికం = అనాగరికం = నాగరికం కానిది

+ ప్రాచ్యుడు = అప్రాచ్యుడు = ప్రాచ్యుడు కానివాడు

+ యోగ్యుడు = అయోగ్యుడు = యోగ్యుడు కానివాడు

+ పాత్రుడు = అపాత్రుడు = పాత్రుడు కానివాడు

+ సహ్యం = అసహ్యం = సహ్యం (ఓర్చుకోదగినది) కానిది

+ జేయం = అజేయం = జేయం (గెలవదగినది) కానిది

+ వాస్తవం = అవాస్తవం = వాస్తవం కానిది

+ సంభవం = అసంభవం = సంభవం కానిది

+ సభ్యం = అసభ్యం = సభ్యం (సభలో ఉండదగినది) కానిది

+ శ్రీలం = అశ్రీలం = అశ్లీలం = శ్రీని (లక్ష్మీదేవిని) తీసుకురానిది 

+ సందర్భం = అసందర్భం = సందర్భం కానిది

కొన్నిసార్లు ‘అనుచితమైన’ అనే అర్థంలో కూడా ‘అ’ అనే ఉపసర్గని చేఱుస్తారు.

అనుచితమైన (తగని) స్థానం = అస్థానం

అనుచితమైన (తగని) కాలం = అకాలం

కొన్నిసార్లు ‘లేనిది’ అనే అర్థంలో కూడా ‘అ’ అనే ఉపసర్గని చేఱుస్తారు.

పారం (అవతలి గట్టు) లేనిది = అపారం

కళంకం లేనిది = అకళంకం

కారణం లేనిది = అకారణం

అన్ + అంతరం = అనంతరం = అంతరం (ఎడం) లేనిది

అన్ + ఆది = అనాది = ఆది లేనిది (మొదలెక్కడో తెలియనిది)

అన్ + అంతం = అనంతం = అంతం లేనిది (అంతం ఎక్కడో తెలియనిది)

అన్ + అర్థం = అనర్థం = అర్థం (ప్రయోజనం) లేనిది

అన్ + అర్గళం = అనర్గళం = అర్గళం లేనిది (గడియ, bolt వేయనిది)

ఇటీవల నఞ్ స్థానంలో - ప్రాచీన సాహిత్యంలో చాలా అరుదుగా ప్రయోగించబడ్డ ‘ఇతర’ అనే పదాన్ని బహుళ ప్రాచుర్యం లోకి తెచ్చారు మన పాత్రికేయులు. ఉదా :-

మత + ఇతరం = మతేతరం = మతం కంటే వేఱైనది అని అసలు అర్థం (irreligious, non-religious)

రాజకీయ + ఇతరం = రాజకీయేతరం = రాజకీయాల కంటే భిన్నమైనది (apolitical).

వ్యవసాయ + ఇతరం = వ్యవసాయేతరం = సాగు కంటే వేఱైనది (non-agro)

ఈ నిర్మాణాలకి సాంకేతిక అభ్యంతరం లేదు. కాని అన్నిచోట్లా ఇవే వాడడం వల్ల వ్యాకరణం అందించే సౌకర్యాల్ని కొన్ని సార్లు వినియోగించుకోలేకపోతాం. ఉదాహరణకి, ఇలాంటి నిర్మాణాలు సుదీర్ఘమైనవి. ఒక్క ‘అ’కారాన్ని పదం ముందు చేఱి స్తే సరిపోయేదానికి ‘ఇతరం’ అని పదాన్ని అనవసరంగా మూడక్షరాలు అదనంగా పొడిగించడం. తత్‌ఫలితంగా ఏర్పడిన నిర్మాణాల్ని వాటి ఇంగ్లీషు సమార్థకాలతో పోల్చిచూడండి. అర్థమౌతుంది. ఇందులో ఇంకో అసౌకర్యం ఏమిటంటే -ఇది సామాన్య వ్రాతగాళ్ళ పరిజ్ఞానానికి అతీతమైనది. ‘ఇతర’ అని చేర్చినప్పుడల్లా ముందు పదంతో సవర్ణదీర్ఘసంధో, గుణసంధో, యణాదేశసంధో చెయ్యాల్సి వస్తుంది. అంత దూరం పోలేక “కలిపికొట్టు కావేటి రంగా !” అనుకుని ‘యేతర’ (ఉదా :- హిందూ + యేతర) అంటూ ఏ సూత్రానికీ కట్టుబడని, తర్కసహం కాని ఒక రూపాన్ని సృష్టించి వాడుతున్నారు. కనుక వ్యతి రేకార్థకంగా నఞ్ ని విస్తృతంగా పునరుద్ధరించాల్సి ఉంది. ఇతర కి కూడా ప్రాధాన్యం లేకపోలేదు కానీ దాన్ని సాభిప్రాయం గా, సందర్భానుసారంగా, సమయస్ఫూర్తితో వాడుకోవాలి.

(III) పదం అచ్చుతో మొదలైతే పదానికి ముందు ‘అ’కారం బదులు ‘అన్’ వస్తుంది.

ఉదా : ఆచారం – అన్ + ఆచారం = అనాచారం = ఆచారహీనత్వం (ముఱికి అలవాట్లు)

అర్హుడు – అన్ + అర్హుడు = అనర్హుడు = అర్హుడు కానివాడు

ఉచితం (తగినది) – అన్ + ఉచితం = అనుచితం (తగనిది)

ఊహ్యం (ఊహించదగినది) – అన్ + ఊహ్యం = అనూహ్యం (ఊహించరానిది)

ఏకం (ఒకటి) – అన్ + ఏకం = అనేకం (ఏకం కానిది)

(ii) లేనిది అనే అర్థంలో :

(I) లేనిది అనే అర్థంలో పదానికి ముందు ‘నిః’ చేఱుతుంది. ఉదా :-

నిః + శేషం = నిశ్ + శేషం = నిశ్శేషం = శేషం లేనిది (మొత్తం)

నిః + సారం = నిస్ + సారం = నిస్సారం = సారం లేనిది

నిః + ఫలం = నిష్ + ఫలం = నిష్ఫలం = ఫలం లేనిది (వ్యర్థం)

నిః + కారణం = నిష్ + కారణం = నిష్కారణం = కారణం లేనిది

నిః + తంద్ర = నిస్ + తంద్ర = నిస్తంద్రుడు = సోమరితనం లేనివాడు

నిః + ఆకారుడు = నిర్ + ఆకారుడు = నిరాకారుడు = ఆకారం లేనివాడు (భగవంతుడు)

నిః + దయ = నిర్ + దయ = నిర్దయ = దయలేని స్థితి

నిః + మూలం = నిర్‌ + మూలం = నిర్మూలం = మూలం లేనిది (మూలాన్ని పోగొట్టుకున్నది)

గమనిక :- ఇక్కడ విసర్గ/ ష్టుత్వ/ శ్చుత్వ సంధిసూత్రాలు ప్రవర్తిస్తాయి. అంటే, పరపదం శకార, చకారాలతో మొదలైతే నిః లోని విసర్గ శకార చకారాలుగా మారుతుంది. అదే, షకార, టకారాలయితే అది షకార, టకారాలుగా మారుతుంది. అదే, సకార, తకారాలయితే అది సకారంగా మారుతుంది. పరపదం క, ఖ, ప, ఫ అనే అక్షరాల్లో ఏదో ఒకదానితో మొదలయితే విసర్గకి షకారం ఆదేశమవుతుంది. అచ్చులూ, అనునాసికాలతో సహా మిగతా అన్ని అక్షరాలకీ ముందు విసర్గకి రేఫ (రకా రం) ఆదేశమౌతుంది.

ఇతర ఉదాహరణలు : నిర్ + మొహమాటం = నిర్మొహమాటం = మొహమాటం లేకుండా

నిర్ + లక్ష్యం = నిర్లక్ష్యం = లక్ష్యం లేకుండా

నిర్ + వాసితం = నిర్వాసితం = వాసం (ఇల్లు) లేకుండా చెయ్యబడిన మొ.

తెలుగు పాత్రికేయులు ఇంత సౌకర్యవంతమైన ప్రత్యయాన్ని కూడా వదిలిపెట్టి ‘రహిత, హీన’ మొదలైన పదాల్ని మాత్రమే ఎంచుకొని ఉచ్చరించలేనంత బారుగా పదాల్ని పొడిగిస్తున్నారు. రహిత, హీన ఇత్యాదులు కూడా భాషకి ఆవశ్యకమేనని అంగీకరిస్తాం. కానీ ఇటువంటి పదనిర్మాణాల్లో ఇమిడున్న ఒక అసౌకర్యమేంటంటే, ఆ పదాల్లోంచి క్రియల్ని కల్పించలేం, ఇంచుక్‌ ని ఉపయోగించి కూడా! ఒకవేళ అలా కల్పించబోయినా ఆ నిర్మాణాలు చాలా వికారంగా, కర్ణకఠోరంగా ధ్వనిస్తాయి. అదే, ‘నిః’ అనే ఉపసర్గని గనుక ఉపయోగిస్తే అనేక విశేషణాలతో పాటు క్రియల్ని కూడా నిష్పాదించగలం. ఉదా :

ఛందం = వోటు నిః + ఛంద + ఇంచుక్ = నిశ్ఛందించు (నిశ్ఛందీకరించు) = వోటు లేకుండా చేయు (disenfranchise)

అలాగే, (నిర్వాసితుడు లాగా) నిశ్ఛందితులు = వోటు లేకుండా చెయ్యబడ్డవారు (disenfranchised people)

అ + గుర్తించు = అగుర్తించు (derecognize) మొ||

(II) రేఫ (రకారం) తో మొదలయ్యే పదాల ముందు ‘నిః’ చేఱితే అందులోని విసర్గ లోపించి ‘ని’ లోని అచ్చు దీర్ఘ మవుతుంది. ఉదా :- నిః + రోగం = నిర్ + రోగం = నీరోగం = రోగం లేని/ రోగం లేకుండా నిః + రంధ్రం = నిర్ + రంధ్రం = నీరంధ్రం = రంధ్రాలు లేని/ రంధ్రాలు లేకుండా

గమనిక :- దీన్నుంచి ఒక క్రియాధాతువుని రూపొందించవచ్చు : నీరంధ్రించు/ నీరంధ్రీకరించు = (v. trans. సకర్మకక్రియ) వ్యవస్థలో రంధ్రాలూ, లొసుగులూ లేకుండా చేయు. to make the system foolproof.

లేదా నీరు, గాలీ, నీరూ చొఱబడకుండా చేయు. To make something air-proof or water-proof.

(III) ‘లేనిది’ అనే ఆర్థంలో కొన్నిసార్లు పదానికి ముందు ‘అ’ అనే ఉపసర్గతో పాటు చివఱ ‘క’ అనే ప్రత్యయం కూడా చేఱుతుంది. ఉదా:-

శిరస్ = తల

+ శిరస్ + క = అశిరస్కం = తల లేనిది (మొండెం)

మనస్ = మనస్సు

+ మనస్ + క = అమనస్కం = మనస్సు లేనిది (మనశ్శక్తుల్ని ఉపయోగించకుండా అనుష్ఠించే ఒకానొక యోగసాధన)

పుత్త్రుడు = కొడుకు

+ పుత్త్ర + క = అపుత్త్రకుడు = కొడుకులు లేనివాడు

రాజు = ఎకిమీడు, ఏలిక

+ రాజ + క = అరాజకం = రాజు (నాయకుడు) లేని రాజ్యం సంఖ్య = లెక్క

+ సంఖ్యా + క = అసంఖ్యాకం = లెక్కలేనిది

(IV) చకార మహాప్రాణం (ఛ కారం) మొట్టమొదట గల పదాల ముందు ఏదైనా ప్రత్యయం గానీ, ఉపసర్గ గానీ చేఱితే ఆ చేఱినవాటి తరువాత ఒక అల్పప్రాణ చకారం (సాధారణ చకారం) వస్తుంది.

ఛాయ = నీడ అ + ఛాయ = అ + చ్ + ఛాయం అచ్ఛాయం = నీడలేని (నీడనివ్వని) చెట్టు

అభ్యాసకార్యములు

I. ‘అ’ లేక ‘అన్’ ఉపయోగించి ఈ క్రిందిపదాలకి ‘కానిది’ అనే అర్థంలో లాక్షణిక వ్యతిరేకార్థకాల్ని నిష్పాదించండి :

1. పండితుడు 2. వ్యవస్థ 3. కలుషం 4. సంబద్ధం 5. చంచలం 6. 7. అల్పం 8. కల్పితం 9. చతురుడు 10. చిరకాలం 11. ప్రశస్తం 12. చేతనం 13. శుచి 14. వ్యక్తం 15. వాచ్యం 16. వాంఛనీయం 17. అభిలషణీయం 18. అవబోధ్యం (అర్థం చేసుకోదగినది) 19. విధేయత (loyalty) 20. సమ్మతం 21. అంగీకారం 22. సౌఖ్యం 23. సదృశం (similar) 24. అన్యసాధ్యం (ఇతరులకి సాధ్యమైనది) 25. భూతం (జఱిగినది) 26. సితం (తెలుపు) 27. ధైర్యం 28. ఆసక్తి 29. ఆదరం 30. స్థిమితం 31. పాక్షికం 32. స్థిరం 33. ఆకారి

II. ‘ఇతర’ ఉపయోగించి ఈ క్రిందిపదాలకి ‘కానిది’ అనే అర్థంలో లాక్షణిక వ్యతిరేకార్థకాల్ని నిష్పాదించండి :

1. సాహిత్యం 2. హైందవం 3. క్రైస్తవం 4. మహ్మదీయం 5. జైనం 6. బౌద్ధం 7. ప్రభుత్వం 8. కుటుంబం 9. స్త్రైణం (feminine) 10. పౌంస్నం (masculine) 11. ప్రాంతీయం (regional) 12. అధికపన్నుల్ని విధించడం కంటే వేఱైన అవరోధాలు (non-tariff barriers) (పన్న అని అకారాంతంగా మార్చండి) 13. ముద్రణ కంటే వేఱైన మాధ్యమాలు 14. ఎలక్ట్రానిక్ కంటే వేఱైన మాధ్యమాలు 15. సంస్కృతి కంటే వేఱైన వేదికలు 16. విద్యుత్తు కంటే వేఱైన శక్తివనరులు (వైద్యుత అని వాడండి) 17. అడవులు కాని ప్రాంతాలు (అటవి అని వాడండి) 18. విద్య కంటే వేఱైన వ్యాపారాలు 19. పరిశ్రమల కంటే వేఱైన ఉపాధిమార్గాలు 20. ఆరోగ్యం కంటే వేఱైన ఇబ్బందులు 21. శిలాజాల కంటే వేఱైన ఇంధనాలు (non-fossil fuels) 22. కులం కంటే వేఱైన విభజనలు 23. ఆహారం కంటే వేఱైన అవసరాలు 24.

తల్లిదండ్రుల కంటే వేఱైన సంరక్షకులు (తల్లిదండ్రులకు ‘జనక’ అని వాడండి) 25. పండుగల కంటే వేఱైన సెలవులు 26. డబ్బుకంటే వేఱైన లాభాలు (ఆర్థిక అని వాడండి) 27. కెరియర్ కంటే వేఱైన అభిరుచులు (వ్యాసంగం అని వాడండి) 28. పాఠ్యాల కంటే వేఱైన కార్యకలాపాలు 29. దేశి కంటే వేఱైన పదజాలం 30. దక్షిణం కంటే వేఱైన దిశల్లో ఉన్న రాష్ట్రాలు.

III. ‘నిః’ ఉపయోగించి ఈ క్రిందిపదాలకి ‘లేనిది’ అనే అర్థంలో లాక్షణిక వ్యతిరేకార్థకాల్ని నిష్పాదించండి :

1. కరుణం 2. సంకోచం 3. కామం 4. పాపం 5. దోషం 6. జలం 7. సారం 8. లక్ష్యం 9. మమకారం (attachment) (మమం అని వాడండి) 10. ఆధారం 11. ఆలంబం (ఊత) 12. అంకుశం (ఏనుగుని కట్టడి చేసే సాధనం) 13. తేజం 14. ఆహారం 15. విరామం 16. ధూమం 17. జీవం 18. శంక 19. సందేహం 20. గుణం 21. దాక్షిణ్యం 22. ఆశ 23. అక్షరాస్యుడు 24. స్వార్థం 25. సంతానం 26. బీజం 27. ఇంద్రియం 28. వీర్యం 29. ఈశ్వరవాదం 30. ఆమయం (రోగం) 31. ఆకరం (source)

IV. ‘-రహితం, -హీనం, -వర్జితం, -అపేతం, -శూన్యం, -దూరం’ అనే పదాల్లో ఏదైనా ఒకటి ఉపయోగించి ఈ క్రింది పదాలకి ‘లేనిది’ అనే అర్థంలో లాక్షణిక వ్యతిరేకార్థకాల్ని నిష్పాదించండి :

1. రసం 2. పక్షపాతం 3. పదవి 4. విధివిధానం 5. నియమం 6. ప్రమాదం 7. వివేకం 8. అయోమయం 9. ఆందోళన 10. భావం 11. గౌరవం 12. హోదా 13. బాధ 14. కోలాహలం 15. కల్లోలం 16. కాలుష్యం 17. సంబంధం 18. శక్తి 19. ప్రతిభ 20. మార్దవం 21. శృంగారం 22. ప్రాముఖ్యం 23. వివాదం 24. ఆచారం 25. చికిత్స 26. రవాణా 27. పరిజ్ఞానం 28. నైపుణ్యం 29. ఆవాసం 30. ఆశ్రయం 31. రూపం 32. లజ్జ 33. భయం

V. ‘అ’ ఉపయోగించి ఈ క్రిందిపదాలకి ‘లేనిది’ అనే అర్థంలో లాక్షణిక వ్యతిరేకార్థకాల్ని నిష్పాదించండి :

1. కల్మషం 2. రోగం 3. భయం 4. అవరోధం 5. కంటకం 6. ఉపమ (పోలిక) 7. కరవాలం (కత్తి) 8. కుసుమం 9. ధూళి 10. సత్త్వం 11. స్వనం (చప్పుడు) 12. మార్గం 13. వర్ణం 14. గంధం 15. గృహం 16. శరణం 17. విధానం 18. నికేతనం (నివాసం) 19. ఈశ్వరుడు 20. పర్ణం 21. వర్షం 22. వైరం 23. వాలం (తోక) 24. రోమం (వెంట్రుక) 25. విపక్షం (శత్రువులు) 26. ఛత్త్రం (గొడుగు, రక్షణ, ఏల్బడి) 27. ప్రకాశం (వెల్లడి) 28. వంశం 29. భూషణం 30. అపత్యం (సంతానం)

VI. ‘అ….కం’ ఉపయోగించి ఈ క్రిందిపదాలకి ‘లేనిది’ అనే అర్థంలో లాక్షణిక వ్యతిరేకార్థకాల్ని నిష్పాదించండి

1. కర్మ 2. నామం 3. మంత్రం 4. పత్త్రం 5. తపస్ 6. ఆయుష్ (బ్రదిమి) 7. వచస్ (మాట) 8. నమస్ 9. రజస్ 10. తమస్ 11. వర్చస్ 12. తేజస్ 13. ఓజస్ 14. శిరస్ 15. వపుష్ (శరీరం) 16. ఏనస్ (పాపం) 17. సతీ (భార్య) 18.

లతా (తీగ) 19. శాఖా (కొమ్మ) 20. భర్త (భర్తృ) 21. గురు 22. వ్యాధి 23. నిర్మాత (నిర్మాతృ) 24. దాత (దాతృ) 25. విద్యుత్ 26. సరిత్ (నది) 27. మరుత్ (గాలి) 28. సూత్రం 29. యశస్ 30. దంతం.

 (తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, సీరియల్, హంసలను వేటాడొద్దు and tagged , , , , , , , , , , , , , , .

One Comment

  1. ఇడి ప్రత్యయానికి లేకుండ చేయు అనే అర్థం కూడా ఉంది.

    “పామిడి (గరుత్మంతుడు) తురగపు పాదము ”

    అని అన్నమయ్య ప్రయోగం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.