జరిగిన కథ: యెగార్ చురుగ్గా నోవా యురీవ్నా ఇంటిపని చేయసాగాడు. ముందైతే 30 రూబుళ్లకే పని పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు గానీ, చివరకు లెక్క చేస్తే అంతకన్నా చాలా ఎక్కువే అయ్యేట్టు తేలింది. ముఖ్యంగా కలప ఖర్చు. అందుకని కలపకేంద్రం దగ్గరకు వెళ్లి అక్కడ ఉద్యోగికి లంచం ఇచ్చి రాత్రి వచ్చి దుంగలను దొంగతనంగా పట్టుకుపోయేట్టు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇలాంటి పని చేయటం అతనికి ఇదే మొదటిసారి. చాలా గాభరా పడతాడు. ఎలాగైతేనేం పని పూర్తి చేస్తాడు, కలప దుంగలను నోవా యురీవ్నా ఇంటికి చేరుస్తాడు. మరుసటి రోజు పని మొదలుపెడ్తాడు. కొడుకు కోల్కా అతనికి సాయం చేస్తాడు. వీళ్లు పని చేస్తుండగానే, కొత్త అటవీ అధికారి యూరీ తన తల్లి అందజేయమన్న పాకెట్టు తీసుకుని నోవా యురీవ్నా ఇంట్లోకి అడుగుపెడతాడు. ఇక చదవండి:—
14
తన జీవితంలో కోల్కాకి సొంతానికి ఎప్పుడూ ఒక్క కుక్క కూడా లేదు. ఊళ్లోని కుక్కలన్నీ అతడికి తెలుసు, కానీ చిన్న పిల్లప్పటి నుంచి పెంచిన తనదంటూ ఒక కుక్క ఎప్పుడూ లేదు. శిక్షణ ఇవ్వటం అటుంచి ఏదైనా నేర్పటానికి కూడా అతనిదైన కుక్క లేదు. ఇది చాలా అవమానకరమైన విషయమే.
కానీ ఓవా సంగతి అలా కాదు, అతడు కుక్క లేకుండా ఎప్పుడూ లేడు. ఫ్యొడార్ ఇపటొవిచ్ ఒక కుక్కని కాల్చి చంపటం ఆలస్యం మరొక కుక్క సిద్ధంగా ఉండేది, అదే రోజు, లేదా అంతకంటే ముందే మరొక కుక్క వచ్చేది.
తాను పెంచిన కుక్కలను ఫ్యొడార్ ఇపటొవిచ్ స్వయంగా చంపేసేవాడు. తాగి ఉన్నప్పుడో, క్రూరత్వంతోటో ఆ పని చేసేవాడు కాదు, పూర్తి స్పృహలో, ప్రశాంతంగా ఆ పని చేసేవాడు. కుక్క అంటే బొమ్మ కాదు కదా; దానికి ఖర్చు అవుతుంది, ఆ ఖర్చును అది సంపాదించుకోవాలి. కాబట్టి కుక్క ముసలిది అయిపోయినా, వాసన పసిగట్టే గుణం తగ్గినా, ఏదైనా చూడగానే వెంటపడే స్వభావం పోయినా, మరోలా భావించవద్దు, కుక్కని ఉంచుకుని స్వయంగా మొరగాల్సిన పరిస్థితి తెచ్చుకోవటం ఎందుకు? దాంట్లో అర్థం లేదు. కాబట్టి అటువంటి కుక్క దొడ్లోనే తిండిలేక మాడి చచ్చిపోతుంది, లేక ఫ్యొడార్ ఇపటొవిచ్ స్వయంగా దానిని తోటలో కాల్చి చంపేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మానవతా కారణంతో ఆ రకంగా చేస్తాడు. దానిని చంపి, చర్మాన్ని కుక్కలను పట్టుకునేవాళ్లకి ఇచ్చి (వాళ్లు దానికి అరవై కొపెక్కులు ఇచ్చేవాళ్లు!), మిగిలినదాన్ని యాపిల్ చెట్టు కింద పూడ్చిపెట్టేవాడు. ఆ యాపిల్ చెట్లు బాగా కాసేవనటంలో సందేహం లేదు.
ప్రస్తుతం వాళ్లు దూడంత ఉండే పాల్మా అన్న భయంకరమైన కుక్కను పెంచుతున్నారు. అది పెరట్లో గొలుసుతో కట్టేసి ఉంటుంది. దాని మూతి నల్లగా ఉండి, కళ్లు ఎర్రటి గోళాల్లా ఉంటాయి. దాని పళ్లు రెండు పదునైన కత్తుల మాదిరి ఉంటాయి. అది మొరిగిందంటే ఎవరికైనా గుండె గుభిల్లుమనాల్సిందే. అది తనతో పాటే పెరిగి పెద్దదైనప్పటికీ ఆ భయంకరమైన పాల్మా అంటే ఓవాకి కూడా భయమే. దానిని భయమనకూడదేమో, కానీ తన జాగ్రత్తలో తాను ఉండేవాడు. భధ్రతకి ముందుజాగ్రత్త తల్లిలాంటిదన్న నానుడిని ఓవా ఉయ్యాలలో ఉన్నప్పటినుంచీ వింటూనే ఉన్నాడు.
ముందు పెరట్లో పాల్మా గొలుసుతో అటూ, ఇటూ తిరుగుతూ ఉంటే వెనక దొడ్లో స్నానాల గది అవతల పాత ఇనప పీపాలో సుస్తిక్ ఉండేది. ఈ సుస్తిక్ ప్రాణాన్ని కాలంతో కాక దిక్సూచితో కొలవాలి: ఆ దిక్సూచి ఓవాకి నచ్చినంత కాలం సుస్తిక్ బతికుంటుంది. అది తన తోకను ఊపి, ఎముక ముక్కలో ఆనందాన్ని వెదుక్కోవచ్చు.
ఇప్పుడు దానికి తోక ఊపటం ఎక్కువ, ఎముక ముక్క దొరకటం తక్కువగా ఉన్న విషయం నిజమే. అలాగని ఓవా ఎదుటవాళ్లని బాధపెట్టి ఆనందించే తత్వం కలిగినవాడని కాదు. రోజూ ఆహారం తినటం కుక్కలకి కూడా ఇష్టమేనన్న సంగతి అతడు మరిచిపోయేవాడు. అతడు మరిచిపోయిన విషయం గుర్తు చెయ్యటంలో ఆ కుక్కపిల్ల చూపులు విఫలమయ్యేవి. ఎందుకంటే ఆ చూపులను అర్థం చేసుకునేవాళ్లు ఉండాలి కదా.
కుక్కపిల్ల చూపులోని విషాదాన్ని అర్థం చేసుకోటానికి చదవటం ఒక్కటే వస్తే సరిపోదు. ఇక్కడ మరోదాని అవసరం ఉంది. ఆ మరోది ఏదో ఇటు ఓవాకి గానీ, అటు ఫ్యొడార్ ఇపటొవిచ్కి గానీ లేకపోవటంవల్ల దానితో వాళ్లు ఇబ్బంది పడేవాళ్లు కాదు.
ఒకప్పుడు కోల్కా గుండెను తాకి అక్కడే ఉండిపోయిన ఓల్యా కుజినా జడలు – ఆ ఓల్యా కూడా ఓవా తీరులోనే మాట్లాడేది. ఆమె మాటలే ఓవా మాటలు, అతడి ఆలోచనలే ఆమె ఆలోచనలు. ఇది ఎలా కుదిరిందో కోల్కాకి జన్మలో అర్థం కాదు: ఓవా ఆమె వెంట పడి జడలు లేగేవాడు, ఎక్కడంటే అక్కడ పట్టుకునేవాడు, ఒకసారి ఆమెను కొట్టాడు కూడా. అయినా ఆ అమ్మాయి మరొకరివంక చూడకుండా అతడి వెంటే పడేది. మిగిలిన వాళ్లందరూ ఆమె కళ్లకి రాక్షసులు.
ఒకసారి ఓవా, “ఆ సుస్తిక్ని ఎలాగూ ముంచేస్తానేమో. నీ దిక్సూచి అంటే విసుగెత్తిపోయి, దానిని నీళ్లల్లో ముంచేస్తాను. అందునా అది ఎందుకూ పనికిరాని కుక్కపిల్ల.”
కోల్కా దానికి ఆహారం పెడుతూ అది తన చేతిని నాకటాన్ని చూస్తున్నాడు. కానీ అతడేమీ మాట్లాడలేదు.
“అది విలువైనదైతే దాని వెల చెప్పు,” అన్నాడు ఓవా.
“వెల ఏమిటి?” కోల్కాకి ఏమీ అర్థం కాలేదు.
“నిజమైన ధర,” పెద్దమనిషి తరహాలో ఓవా నిట్టూర్చాడు.
“కానీ నా దగ్గర డబ్బులు లేవు.” ఆ తరువాత కోల్కా కాసేపు ఆలోచించి చెప్పాడు, “కావాలంటే నీకోసం గ్రంథాలయంనుంచి ఒక పుస్తకం ఎత్తుకొస్తాను.”
“పుస్తకాన్ని నేనేమి చేసుకుంటాను? ఏదైనా వస్తువు ఇవ్వు.”
కోల్కా దగ్గర ఎటువంటి వస్తువులూ లేనందున ఆ సంభాషణ అంతటితో ముగిసింది. అయితే కోల్కా దాని గురించి రోజూ ఆలోచించేవాడు, విషాదంగా ఉండేవాడు. సుస్తిక్ ప్రాణానికి నూకలెప్పుడు చెల్లుతాయో అని నిత్యమూ భయపడుతూ గడిపేవాడు కానీ అతని దగ్గర ఇవ్వటానికి ఏ వస్తువూ లేదు. ఇదంతా చాలనట్టు ఇంకోవైపు ఓల్యా కుజినా…
ఆ కారణం వల్ల ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంభాషణ అతడు విననే లేదు. అతడు కుక్కపిల్ల గురించి, ఓవా గురించి, తన దగ్గర లేని విలువైన వస్తువుల గురించి, ఓల్యా కుజినా కళ్లు, నవ్వులు, పిలకజడల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. బల్ల దగ్గర కొత్త అటవీ వార్డెనుకి ఎదురుగా నోనా యురీవ్నాతోపాటు కూర్చుని ఉన్నప్పటికీ అతడు ఏమీ వినలేదు.
బల్ల దగ్గర సంభాషణ ఇలా సాగింది:
“ఈ రోజుల్లో మనిషి పరుగులు ఎక్కువయ్యాయి,” అతడి నాన్న, యెగార్ పొలుష్కిన్ చెపుతున్నాడు. “ఉన్నట్టుండి ఎటో దౌడు తీస్తాడు, ఎగశ్వాసతో వస్తాడు, ఏదో చేస్తాడు, మళ్లీ పరిగెత్తిపోతాడు. అతడికి ప్రతి చోటా ఏదో ఒక అవకాశం కనపడుతూ ఉంటుంది… కానీ ఇక్కడొక ముక్క, అక్కడొక ముక్కతోటి అతడు పూర్ణత్వాన్ని పొందలేడు కదా, యూరి పెట్రోవిచ్.”
“ఆసక్తి గొలిపే పని కోసం మనుషులు చూస్తున్నారు. అది సహజమే కదా.”
“సహజమైనదైతే సరైనదని మీ అభిప్రాయమా? నేను మీతో అంగికరించను. ఏ ప్రదేశమైనా ఇప్పటికీ మనదే, అంటే ఉమ్మడిదని. జీవితం కోసం దానికేసి చూస్తే మనకి ఏం కనపడుతుంది? మన ఉరుకులాటలో దీనంతటి గురించి మరిచిపోయామని తెలుస్తుంది. నేను ఈ ఊరికి వచ్చాను. మంచి ఊరిది. అయితే ఇక్కడ అడవి ఉంది, నది ఉంది; చేలున్నాయి, మబ్బులు ఉన్నాయి. అవి ఎవరివి? పాతకాలపు మనుషులు అవి దేవుడివని అంటారు. మరి దేవుడు లేకపోతే అవి నావని అనుకుంటారు. అవి నావి అనుకున్నప్పుడు – వాటిని సంరక్షించాలి కదా. విధ్వంసాన్ని అనుమతించవద్దు: ఇది నీ భూమి. నీ భూమిని గౌరవించు. అదీ విషయం.”
“నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను, యెగార్ సవెలిచ్.”
ఇక్కడ యెగార్ చెప్పేది వింటున్నారు – అది చాలా ఆశ్చర్యంగొలిపే విషయం! అతడు చెప్పేది వినేవాళ్లు, మర్యాదగా సంభోదించేవాళ్లు, ఆచితూచి సమాధానాలు ఇచ్చేవాళ్లు. యెగార్కి ఇదంతా ఇష్టంగా ఉందని కాదు – అతడు ఎవరి మెప్పు కోసమూ ప్రయత్నించటం లేదు. కానీ అది అతడిని కదిలించి వేసింది. అతడు తన టీ కూడా తాగలేదు. కప్పులోని చెంచాను తిప్పుతూ అవసరమైనది, తనకి ముఖ్యమనిపించింది చెప్పాడు.
“మనిషి విశ్రాంతి తీసుకుంటాడు, జంతువులు విశ్రాంతి తీసుకుంటాయి, భూమి విశ్రాంతి తీసుకుంటుంది. ప్రతి ఒక్కరికీ విశ్రాంతి అవసరం, అది వినోదం కోసం కాదు, శక్తిని తిరిగి కూడగట్టుకోటానికి, మళ్లీ పనిలోకి దిగటానికి. కదా? అలాగే అడవి – దానికీ అప్పుడప్పుడూ విశ్రాంతి అవసరం. మనుషుల గురించి మరిచిపోయి, గొడ్డలినుంచి తేరుకుని, వాటి నుంచి కారే పాలు గాయాలను మాన్పటానికి దానికి విశ్రాంతి కావాలి. ఆ అవకాశం ఇవ్వకుండా మనం వెళ్లి చెట్ల బెరడు వలిచేస్తాం. ఇది పద్ధతిగా ఉందా? ఏమాత్రం లేదు. లిండెన్ చెట్లకి విశ్రాంతి ఇవ్వకుండా వాటిని చంపేశాం. తరచి చూస్తే ఇదంతా దేనికి?”
“లిండెన్ల విషయంలో తప్పంతా నాదే,” అన్నాడు యూరి పెట్రోవిచ్. “రిజర్వు అడవిలో బెరడు వలవటానికి అనుమతి లేదు.”
“ఇది ఎవరి తప్పన్నది కాదు ఇక్కడ విషయం, ఎవరి దౌర్భాగ్యమన్నది…”
అతిధులకు నోనా యురీవ్నా మౌనంగా టీ పోస్తూ, బ్రెడ్డు ముక్కలు కోసి ఇస్తోంది. యెగార్ చెప్పేది, అటవీ వార్డెను చెప్పేది వింటూ కోల్కాలాగే ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు.
“లిండెన్ తోపులు చాలానే పాడయ్యాయా?”
“ఆఁ,” బెరడుకోసం తాము అడవికి వెళ్లిన అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ నిట్టూర్చాడు యెగార్. “కిలో బెరడుకి అర రూబులు ఇస్తామన్నారు కదా… ఇక వాళ్లను ఆపేదెవరు.”
“అవును,” చువలోవ్ నిట్టూర్చాడు. “సిగ్గు పడాల్సిన విషయమే. ఇక్కడ అడవుల్లో అడవి తేనెటీగలు ఒకప్పుడు దండిగా ఉండేవని పాత పుస్తకాల్లో ఉంది.”
“అహ్, మేము…” మాటమాత్రం లేకుండా నిశ్సబ్దంగా కూర్చున్న కోల్కా వైపు పక్కచూపులు చూసి యెగార్ మరోసారి నిట్టూర్చాడు. “మేము కూడా బెరడు కోసం వెళ్లాం. అవును. అడవంతా తెల్లటి చెట్ల కాండాలతో ఉండటం చూసి సిగ్గు, బాధతో తిరిగి వచ్చేసాం.”
ఆ రోజు ఎంత హాయిగా, ఎంత బాగా ఉంది! సంభాషణ చాలా తీరుబడిగా సాగింది. కొత్త వార్డెను చాలా స్నేహపూర్వకంగా అనిపించాడు. యెగార్ పొలుష్కిన్కి తాను ఆ రోజు తెలివిగా, స్వతంత్రంగా ఉన్నాననిపించింది. కోల్కా అలకతో చిరచిరలాడుతుండటం నిజమే. కానీ యెగార్ తన కొడుకు చిర్రుబుర్రులను పట్టించుకోలేదు. అటవీ వార్డెనుతో తన సమావేశపు మధురానుభూతులను, వాటినెక్కడ వలకబోస్తానోనని ఎంతో జాగ్రత్తగా, నిదానంగా ఇంటికి తీసుకెళ్లాడు.
ఆ రాత్రి పడుకోటానికి మంచంమీదకి ఒరిగినప్పుడు, “కొత్త వార్డెను చాలా మంచి మనిషి,” హారిటీనాతో అన్నాడు. “సాధు జీవి, హృదయంనుంచి స్పందిస్తాడు.”
“స్పందించేవాడైతే నిన్ను పనిలో పెట్టుకోవాలి.”
“అలాగెందుకంటావు, టీనా?”
యూరి పెట్రోవిచ్ కోసం పనిచెయ్యటమనే ఆలోచనే యెగార్‌ని భయపెడుతోంది. అంటే, అతడు దాని గురించి ఆలోచించాడు. ఆ చక్కని కల అతడిలో చోటు చేసుకుంది, అయితే దానిని బయటకు వెల్లడి చెయ్యాలని అతడికి లేదు. తన అదృష్టంలో అతడికి పూర్తిగా నమ్మకం పోయింది, కలలకి సైతం శాపం పెడతానేమోనన్న భయం అతనికి ఉంది. అందుకే దానినుంచి బయటకు పడటానికి, “ఇక్కడికి అతడు పర్యాటక పని మీద వచ్చాడు,” అని చెప్పాడు.
“పర్యటనకు వస్తే నువ్వు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే మరొక మూడొందలు పోగొట్టుకుని వగచాల్సి వస్తుంది.”
ఒక మంచి మనిషికి సమర్ధనగా మాట్లాడాలని యెగార్కి ఉన్నా అతడు నిట్టూర్చి పక్కకి తిరిగి పడుకున్నాడు. అతడి భార్యతో వాదించటానికి పూనుకుంటే అతడి మెదడు గందరగోళానికి లోనవుతుంది. అంతేకాకుండా అంతిమంగా ఆమె మాటే చెల్లుతుంది.
అక్కడ నోనా యురీవ్నా ఇంటి దగ్గర పొద్దుగుంకేవరకు కూర్చున్న కొత్త అటవీ వార్డెను, యూరి పెట్రోవిచ్ చువలోవ్ ఆ రోజు ఇంకా ఎక్కడికీ వెళ్లలేదు. ఆ రోజుకి ఆలస్యమవ్వటం ఒక్కటే కాక ఇంకా అతడికే స్పష్టం కాని ఇతర కారణాలు ఎవో ఉన్నాయి.
ప్రిన్సిపాల్ ఇంటివరకు అతడికి తోడుగా ఆమె వెళ్లినప్పుడు అదంతా జరిగింది.
అటవీ వార్డెను అనుకోకుండా ఆ ఊరికి రావటం, అతడెవరో వెల్లడిచేయాలనుకోకపోవటం వల్ల అతడు తన కింద పనిచేస్తున్న ఫ్యొడార్ ఇపటొవిచ్ బుర్యానోవ్ ఇంటిలో కాకుండా నోనా యురీవ్నా చెప్పిన మీదట పాఠశాల ప్రిన్సిపాల్ ఇంటిలో బసచేయాలనుకున్నాడు. ఆ సాయంత్రం ప్రిన్సిపాల్ ఇంటివరకు నోనా యురీవ్నానే దిగబెట్టింది.
ప్రిన్సిపాల్‌తో నోనా యురీవ్నాకి మంచి స్నేహమే ఉంది. ప్రిన్సిపాల్‌తో బాగానే ఉంది కానీ, ఆమె సహచరులతో, అంటే టీచర్ల సముదాయంతో ఆమెకు మంచి సంబంధాలు లేవు. అయితే అలా జరగటం నోనా యురీవ్నాకి ఏమాత్రం ఇష్టంగా లేదు.
లెనిన్గ్రాడ్ నుంచి వచ్చిన ఈ యువ టీచరుని అందరూ స్నేహ పూర్వకంగానే, కుటుంబం మాదిరే ఆహ్వానించారని చెప్పాలి. అందరికీ ఆమెకు సహాయపడాలనే ఉంది – రోజువారీ విషయాల్లోనూ, సలహాల రూపంలోనూ ఆమెకు సహాయపడ్డారు కూడా. మార్చి 8 సందర్భంగా జరిగిన విందునాటి వరకు అంతా బాగానే ఉంది. సిబ్బందిలో ప్రిన్సిపాల్ తప్పించి అందరూ ఆడవాళ్లే కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిజంగా ఆడవాళ్ల పండగ కాబట్టి, ఆ రోజును ఘనంగా నిర్వహించాలనుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇంకొకళ్లకి తెలియనివ్వకుండా తమకోసం కొత్త బట్టలు కుట్టుకోసాగారు.
అయితే ఆ రోజు నోనా యురీవ్నా ప్యాంటు, సూటు వేసుకుని వచ్చింది. తాను ప్రత్యేకంగా నిలబడాలని కాదు. తనకున్న బట్టలలోకెల్లా ఇదే బాగుంటుందని ఆమె ఆభిప్రాయం. తన కళాశాల పట్టాప్రదానోత్సవ కార్యక్రమం రోజున ఒక్కసారే దానిని వేసుకుంది. తోటి విద్యార్ధినులందరూ ఆమెను చూసి అసూయపడ్డారు. అయితే ఇక్కడ ప్రతిస్పందన వేరేగా ఉంది. ఇక్కడ ఆమె బట్టలు చూసి కొంతమంది ఇబ్బందిపడ్డారు, కొంతమంది అసహ్యించుకున్నారు.
“ఇక్కడ మనం తోట పని చేయటానికి రాలేదు, అమ్మాయీ, పండగ చేసుకోటానికి వచ్చాం. మహిళల పండగ, అదీ అంతర్జాతీయ స్థాయిది.”
“కానీ, నాకు ఇది బాగుందనిపించింది,” నోనా గొణిగింది. “సమకాలీనంగా కూడా ఉంది.”
“దాని గురించి నీకే బాగా తెలిసి ఉండాలి. అయితే ఈ సమకాలీనతతో పార్టీలకు వెళతానంటే, మమ్మల్ని మన్నించాలి. మేం ఇంకా దానికి సిద్ధంగా లేం.”
నోనా యురీవ్నా అక్కడినుంచి వెళ్లిపోయింది, ప్రిన్సిపాల్ ఆమెను అనుసరించాడు. మూడవ మలుపు దగ్గర ఆమెను చేరుకున్నాడు.
“నీది తప్పు, నోనా యురీవ్నా.”
“నా తప్పేమిటి?” బెక్కుతూ అడిగింది నోనా.
“ఈ రకంగా స్పందించటం తప్పు.”
“వాళ్లది ఒప్పా?”
ప్రిన్సిపాల్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కోపంతో అడుగులేస్తున్న ఆమెతోపాటు అంగలు వేస్తూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. టీచర్లు స్వయంగా ఆదర్శంగా ఉండాలని, బూర్జువా ధోరణుల గురించి, మనవి కాని ఫ్యాషన్ల గురించి అతడు మాట్లాడి ఉండవచ్చు. కానీ ఇవన్నీ మనస్సులో అనుకుని పైకి మాత్రం పూర్తి భిన్నమైనది చెప్పాడు.
“వాళ్లు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు, నోనా యురీవ్నా! ఆడవాళ్లు ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. నువ్వు వయస్సులో ఉన్నావు. అంతేకాదు నువ్వు, అహ్ – నన్ను మన్నించాలి – అందంగా కూడా ఉంటావు. వాళ్లకి సంసారాలు, మొగుళ్లు, ఇంటి పని, బాధ్యతలు వంటివి ఉన్నాయి. కానీ నీకు – నువ్వు రేపటి ఉదయానివి. కాబట్టి పెద్దమనసు చేసుకుని వాళ్లమీద జాలి చూపించు.”
కన్నీటి కళ్ల గుండా అతడిని చూసి నోనా నవ్వింది.
“మీరు భలే జిత్తులమారి కదా!”
“చాలా,” అన్నాడు ప్రిన్సిపాల్.
నోనా తిరిగి పార్టీకి వెళ్లలేదు, అయితే ప్రిన్సిపాల్‌తో స్నేహం కుదిరింది. ఆమె అప్పుడప్పుడు అతడి ఇంటికి టీకి కూడా వెళ్లేది. ఈ కారణంగానే ముందుగా చెప్పకుండానే అతడి ఇంటికి అటవీ వార్డెనును తీసుకెళుతోంది.
ఆ సాయంత్రం వెచ్చగా, బిడియంగా ఉంది. దూరంగా క్లబ్బు దగ్గరనుంచి సంగీతం వినిపిస్తోంది, మబ్బులు గులాబీ రంగుకి తిరిగాయి. చెక్క దారి మీద నోనా యురీవ్నా ఎత్తు మడాలు స్పష్టతతో శబ్దం చేస్తున్నాయి.
“ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది,” అన్నాడు చువలోవ్.
“అవును,” నోనా యురీవ్నా అంగీకరించింది.
వాళ్ల మధ్య సంభాషణ అంతగా సాగలేదు. ప్రయాణం చేసి అటవీ వార్డెను అలసిపోయి ఉన్నాడో, లేక నోనా యురీవ్నాకి మాటల అలవాటు తప్పిందో ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరచటానికి ఇద్దరూ ప్రయత్నించలేదు. బ్రష్షుకి సరిపడా కాసింత పేస్టు నొక్కినట్టు వాళ్ల మధ్య అరకొర మాటలు సాగుతున్నాయి.
“ఇక్కడ ఏమీ తోచదేమో కదా?”
“లేదు, లేదు. చాలా పని ఉంటుంది.”
“కానీ, ఇప్పుడు శలవులు కదా.”
“నేర్చుకోవటంలో వెనకబడిన పిల్లలతో ప్రస్తుతం పని చేస్తున్నాను: మీకు తెలుసు కదా. వాళ్లు రాయటంలో చాలా తప్పులు చేస్తారు.”
“లెనిన్గ్రాడ్కి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా?”
“అమ్మని చూడటానికి వెళతానేమో, ఇంకా ఏమీ అనుకోలేదు.”
మళ్లీ యాభై అంగలు నిశ్శబ్దంగా సాగాయి. ఒక మౌన ప్రదర్శనలో వెలిగించిన కొవ్వొత్తులు పట్టుకుని నడుస్తున్నట్టు వాళ్లు నడుస్తున్నారు.
“ఈ మారుమూల ప్రదేశాన్ని నువ్వే ఎంచుకున్నావా?”
“అహ్- లేదు. నాకిక్కడ ఇచ్చారు.”
“వేరేచోట కూడా ఇచ్చి ఉండవచ్చు కదా?”
“పిల్లలు – ఎక్కడైనా పిల్లలే కదా.”
“కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, నువ్వు ఏం కావాలని అనుకున్నావు? పంతులమ్మవి కావాలని నిజంగానే నీకుండిందా?”
“మా అమ్మ టీచరు.”
“అయితే కుటుంబ వృత్తి అన్నమాట?”
సంభాషణ అంతగా ముందుకు సాగటం లేదు. ఆ ప్రశ్నకు నోనా బదులివ్వదలుచుకోలేదు. యూరి పెట్రోవిచ్ అది గ్రహించాడు. తానెంత మొద్దునని అనుకున్నాడు, కానీ నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు. తనకి తెలియని అమ్మాయిలతో ఉబుసుపోక కబుర్లు చెప్పటం అతడికి తెలియదన్నది నిజమే, అయితే మౌనంగా ఉండటం కూడా అతడికి ఇబ్బందికరంగా అనిపించింది.
“నువ్వు సాహిత్యం చెబుతావా?”
“ఊఁ. చిన్న పిల్లలకి కూడా చెబుతాను: సరిపడా టీచర్లు లేరు.”
“మీ పిల్లలు నిజంగా ఏమైనా చదువుతారా?”
“అందరూ కాదు. కోల్కా బాగా చదువుతాడు.”
“కోల్కా గంభీరమైన పిల్లవాడు.”
“అతడికి ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి.”
“పెద్ద కుటుంబమా?”
“కాదు, చిన్న కుటుంబమే. అతడి నాన్న కొంచెం వింతగా ఉంటాడు. ఎక్కడా ఇమడలేడు, తనను తాను నిందించుకుంటాడు, బాధపడతాడు. అతడు మంచి వడ్రంగి, మంచి వ్యక్తి కూడా. అయితే, ఎక్కడా పనిలో నిలదొక్కుకోలేడు.”
“ఎందుకని?”
“ఒక వ్యక్తిని అర్థంచేసుకోవటం కష్టమైనప్పుడు అతడికి పిచ్చి అనటం తేలిక. యెగార్ సవెలిచ్ని అందరూ ఏమీ చేతకానివాడని అతడి ముఖం మీదే అంటారు. ఇదంతా కోల్కాకి చాలా కష్టంగా ఉంటుంది. ఒక్క క్షణం.”
నోనా ఆగి, కంచెకి ఆనుకుని తన చెప్పులలోంచి ఇసుక దులుపుతూ కాసేపు నిలబడింది. నిజం చెప్పాలంటే వాటిల్లో అంత ఇసుక లేదు. కానీ నోనాకి వచ్చిన ఆలోచనను వ్యక్తం చెయ్యటానికి కొంత ధైర్యం కావాలి, దానిని కూడగట్టుకుంటూ కాసేపు ఆ వంకన నిలబడింది.
“నల్ల చెరువుకి ఒంటరిగా వెళ్లాలనుకుంటున్నారా?” ఆ మాట వెలువడిన వెంటనే ఆమె విభ్రాంతికి లోనయ్యింది: అతడి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాని అతడనుకుంటాడు. ఆ తరువాత కంగారుగా. “ఒంటరిగా వెళితే భయం, భయంగా ఉంటుంది. అంత సరదాగా కూడా ఉండదు. అంతే కాకుండా…”
ఆమె వివరణలు మరింతగా తప్పు దిశలో వెళుతున్నాయని గ్రహించి ఆమె మిన్నకుండిపోయింది. ఏం చెయ్యాలో తోచక, అనాలోచితంగా, “సాయానికి పొలుష్కిన్ని తీసుకెళ్లు. అతడిని పంపిస్తారు: అతడికి స్థిరమైన ఉద్యోగం ఏమీ లేదుగా.”
“నేను కూడా అదే విషయం ఆలోచిస్తున్నాను తెలుసా.”
“నిజంగా?” కొంత సాంత్వన పొందిన నోనా నవ్వేసింది.
“నిజంగా” యూరి పెట్రోవిచ్ కూడా నవ్వాడు. కారణమేమిటో తెలియదు కానీ అతడుకూడా సాంత్వన పొందాడు.
ఆమె అంత తొట్రుపడుతూ సూచించే వరకు యెగార్ పొలుష్కిన్ గురించి ఆలోచనే అటవీ వార్డెను మనసులో లేకపోయినా అతడలా బదులిచ్చాడు. అతడు అడవులలో తరచు ఒంటరిగానే తిరుగుతాడు. కాలక్రమంలో అతడికి తన ఒంటరితనం ఇష్టంగా అనిపించసాగేది. అతడికి ఎవరి సహాయమూ కూడా అవసరం లేదు. ఉన్నట్టుండి అతడికి ఎందుకో తల్లిచాటు పిల్లలాగా సిగ్గుపడుతూ, ఇబ్బందిపడుతున్న ఈ అమ్మాయి కోసం; ఈ మారుమూల గ్రామంలో నిజాయితీతో కష్టపడుతూ ఉద్యోగం చేసుకుంటున్న ఈ అమ్మాయి కోసం ఏమైనా చెయ్యాలనిపించింది. ఆమె ముఖం వెలిగిపోవటం చూసి, “వస్తానంటే కోల్కాని కూడా తీసుకెళ్లవచ్చు.”
“చాలా బాగుంటుంది,” అంది నోనా. “నీకు తెలుసా, నాకు అప్పుడప్పుడు కోల్కా కవి అవుతాడనిపిస్తుంది. లేకపోతే కళాకారుడౌతాడు.”
ఆపాటికి వాళ్లు ప్రిన్సిపాల్ ఇంటికి చేరుకోవటంతో సంభాషణ ఆగిపోయింది. ఆ సంభాషణ దానంతటదే మొదలయ్యి, ఇబ్బందికరంగా ముగిసింది. కానీ అది యూరి పెట్రోవిచ్ జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. దానికంత ప్రయాసపడవలసి రావటంవల్లనే అది అతడికి గుర్తుండి పోయిందేమో.
కొత్త అటవీ వార్డెనును ప్రిన్సిపాల్‌కి అప్పగించిన వెంటనే నోనా తిరిగి ఇంటికి పరుగున చేరింది. దేనిగురించో ఆలోచించాలని ఆమెకు ఉంది కానీ అదేమిటో ఆమెకు కూడా అంతుబట్టటం లేదు. చువలోవ్కి ప్రిన్సిపాల్ అన్నపానాదుల ఏర్పాటు చేసి అర్థరాత్రి వరకు కబుర్లు చెపుతూ కాలక్షేపం చేసాడు. అటవీ శాఖ సహాయం లేకపోతే పాఠశాల, టీచర్లు కట్టెపుల్లల కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదని ప్రత్యేకంగా చెప్పాడు. అతడి మాటలకు యూరి పెట్రోవిచ్ ఊకొడుతున్నాడే కానీ అంతసేపూ అతడి కళ్లముందు పెద్ద పెద్ద కళ్లద్దాలలో మెరుపుతీగలాంటి ఆ అమ్మాయే కదలాడుతోంది. “నల్ల చెరువుకి ఒంటరిగా వెళ్లాలనుకుంటున్నారా?” అన్న ఆమె వింతైన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అతడు అసందర్భంగా నవ్వుతున్నాడు.
మరునాడు ఉదయం అతడు కార్యాలయానికి వెళ్లి పొలుష్కిన్ని తనకి, అంటే అటవీ వార్డెను చువలోవ్కి చెరువు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పట్ల అవగాహన ఏర్పరుచుకోవటంలో సహాయకుడిగా వారం రోజులపాటు కేటాయించటానికి ఏర్పాట్లు చేయసాగాడు.
కొత్త అటవీ వార్డెనును చూసి కార్యాలయంలోని వాళ్లు నవ్వసాగరు. అది ఆశ్చర్యమేమీ కలిగించలేదు.
“పొలుష్కిన్, అతడి వింత చేష్టలూ మాకు బాగా తెలుసు!”
“కామ్రేడ్ వార్డెన్, అతడు భయపెట్టే పనులు చేస్తుంటాడు. అతడిని తీసుకెళ్లకపోవటం మంచిదని మా సలహా.”
“ఒక మోటారునే ముంచేసాడంటే మీరు నమ్ముతారా?”
“తాగి ఉన్నాడంటారు.”
వింత చేష్టల, భయంకర యెగార్ పొలుష్కిన్ని సహాయకుడిగా ఇమ్మని ఆదేశాలు జారీచేస్తూ, “అంటారా, లేక ఎవరైనా చూసారా?” చువలోవ్ యధాలాపంగా అడిగినట్టు అడిగాడు.
“వ్యక్తికంటే ముందు ఎప్పుడూ పుకార్లు చేరతాయి…”
“కుక్క కంటే ముందు మొరుగుడు వినిపించినట్టు. ప్రత్యేకించి అది మన వెనక మొరుగుతున్నప్పుడు.”
అతడు చెప్పదలుచుకున్నదేదో చాలా మెల్లగా చెప్పాడు. ఎంత మెల్లగా చెప్పాడంటే ఆ రోజంతా ఉద్యోగులు తమ కార్యాలయంలోనే మెల్లగా మాట్లాడుకున్నారు.
యూరి పెట్రోవిచ్ మాత్రం వెంటనే నోనా ఇంటికి వెళ్లాడు. ఆమె అప్పుడే నిద్ర లేచి రాత్రి బట్టలు ఇంకా మార్చుకోలేదు. దాంతో ఆమె తెగ ఇబ్బంది పడిపోయింది.
“ఒక్క నిమిషం, నేను…”
“మాతోపాటు నల్ల చెరువుకి రా,” శుభోదయం అని చెప్పకుండానే అతడన్నాడు. “టీచరుగా మీకు స్థానిక ప్రదేశాలు తెలిసి ఉండాలి.”
ఆమెకి సమాధానం ఇవ్వటానికి సమయం లేకపోయింది, అతడందుకోసం వేచి ఉండలేదు కూడా. తన భుజం సంచిని వసారాలో పెట్టి వ్యవహార ధోరణిలో, “పొలుష్కిన్ ఎక్కడుంటాడు? సరే, నువ్వు తయారు అవ్వు, నేను వెళ్లి అతడిని తీసుకొస్తాను. కోల్కాని కూడా!” అంటూ అక్కడినుంచి బయలుదేరాడు.
అతడు కొత్త అటవీ వార్డెను అయినప్పటికీ పరుగులాంటి నడకతో వెళుతున్నాడు.
(తరువాయి భాగం వచ్చే వారం)