cover

సిమ్మాద్రి ప్రయాణం

Download PDF ePub MOBI

(పాతరచన విభాగంలో మీ ముందుకు వస్తున్న ఈ కనక ప్రసాద్ పేరడీ రచన మొదట “రచన మాసపత్రిక” జూన్ 1992 సంచికలో ప్రచురితమైంది.)

ఈ రచన కేవలం హాస్యం కోసం రాసినది. ఇందులోని విషయాలేవీ నిజం కాదు. ఎవర్నీ నొప్పించటం కోసం రాసింది కాదు. – రచయిత

[మంత్రబుడ్డి సిమ్మాచలం భార్య పైడితల్లి, కొడుకు చినసన్నాసితో సింహాచలం యాత్ర ముగించుకొని గుమడ వెళ్ళటానికి రాయిపూరు బండీ కోసం చూస్తూంటాడు. రైలు ఎంతకీ రాదు. ఆరుద్రగారు టీటీ. ఆయన్నడిగితే ‘నువ్వెక్కాల్సిన ఆ రైలు ఓ జీవిత కాలం లేటు’ అనేస్తారు. గాభరా పడి రైలొస్తుందో రాదో ఎవర్నేనా అడుగుదాం అని చుట్టూ చూస్తాడు. ఆ ప్లాట్‌ఫాం మీద ఆ వేళ జరిగిన సాహితీ సభల్నుండి ఇళ్ళకి వెళ్ళిపోతున్న రచయితలు, ప్రముఖులు బెంచీల మీద కూర్చుని ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళనే బండి గురించి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు వాళ్ళ వాళ్ళ ధోరణుల్లోనే చెప్పిన పద్ధతి]

విశ్వనాథ

అతడేమో అనినాడు. నీవేమో వినినావు. అనుటయనగా వాక్కు. వాక్కునకు ఆధారము శబ్దము. శబ్దము వాణీవరప్రసాదము. అయిన శబ్దమునకు ఆది బ్రహ్మమనవచ్చునా? అనదగును, అనరాదు. ఈ లోకమునందు జీవులు ఏదో ఒక కూతవెట్టుట కద్దు. నిర్జీవులు కూయజాలవు. అయిన శకటము ‘కోం’యని కూతవెట్టుట ఎట్లు? ‘కోం’యన కకారమున లీనమైన ప్రణవమే గదా! ప్రణవము మరల శబ్దప్రకృతి. శకటము శక్తి స్వరూపిణి. శక్తికి మూలము ప్రణవము. కకార ఉకార మకారములు ‘కోం’యని ఏకో రీతి కూవెట్టు నాదబ్రహ్మమా ఈ రైలు బండి! అవును, కాదు!

సిమ్మా: ఏటి బుగతా? బెమ్మ రాచ్చసా…?

పైడి: ఓలమ్మో, బుగతగోరు శెపించేత్తారు. బేగి పార్రారా మాంవా.

రావిశాస్త్రి

మీరు ఎక్కవలసిన బండీ ఖచ్చితంగా వెళిపోయి ఉండజాలదని నేను మీతో ఖచ్చితంగా చెప్పజాలను. ఐనా రవిల్వేవోడ్నీ, బోగందాన్నీ ఎవడ్నమ్మమన్నాడు? టిక్కట్లు కొనిపించీసి నిన్ను టేసన్లో వొగ్గేత్తారు. ఆల్రారు, నువ్వెల్లవు! ఈల్లన్నమ్ముకునే మా క్లయింటొకడు ఇజానారం టేసన్లో సూస్సూస్సచ్చిపోనాడు. సచ్చిపోనాడు కాబట్టి బతికిపోనాడు గాని బతికుంటే ఆడ్ని సంపీరా? ఏటి!

సిమ్మా: అయితేటంతావు బాబూ? టయాం సెప్పు సావుకారంతె సచ్చిపోమంతావా? ఏటి…

పైడి: పిగడ్రు బాబుతోటి ఇగటాలేటి వొల్లకోరా.

ఎన్టీరామారావు

హుఁ..! ఈ కేంద్రం నడిపే రైళ్ళెందుకు తమ్ముడూ మన తెలుగు బస్సుండగా? నా తెలుగింటి చి…ట్టి తమ్ముళ్ళూ, చిన్నా…రి చెల్లాయిలూ సుఖంగా ప్రయాణించాలన్న ఆశతో, ఆకాంక్షతో బస్టేండుల్లో మా ‘తెలుగు క్షీర బాల వృద్ధ మహిళా చిన్న పిల్లల బహిర్భూమి సుఖీభవం’ వంటి కార్యక్రమాలు ఎన్నో… ఎన్నో… చేపట్టాం. ఎంతో… ఎంతో… చేసినా ఇంకా ఎన్నో… ఎన్నో… తెలుగు తల్లికి నివేదించాల్సి ఉందని మాకు గ్నాపకం చేసిన మీకు సదా… మా కృతగ్నత. జై తెలుగు నాడు, జైహింద్!

పైడి: ఎన్టీవోడి కెందుకడిగేవురా… సూడు! ఎర్రిబేపినాగ అరుత్తన్నాడు.

సిమ్మా: నానేటి సేసీదే? ఆ బాబు నువ్వేటడిగినా అలగే అంతాడు…

యండమూరి

(వాచీ చూసుకుని) రేడియం అంకెల వాచీ రెండు చూపిస్తోంది. గంట క్రితమే ఏ.ఎస్.ఎమ్ చైతన్య గంట తీసాడు. గంట కిర్రుమంది. తలుపుతోసాడు. తలుపు బర్రుమంది. పేరు తెలియని పిట్ట ఒకటి ‘ట్రీ…చ్’ మని ఏడుస్తూ ఆ వైపుగా పోయింది. హే భగవాన్! ఎందుకీ పరీక్ష? మనసులోనే నాగాంగ భైరవుణ్ణి ఉద్దిష్టం చేసుకున్నాడు… ‘ఓం క్రీం హ్రీం! యమా… తమా… బిందియ, చిందియ, చిందియ, చిందియ, ఉచ్చాటయ, ఉచ్చాటయ…!’

సరిగ్గా అంతలో….

రూక్షార్క విభార హితిత హితమై ధరణి ఫెటిల్లున విరిగిపడినట్లూ, రుధిర మందాకినీ కాసారాంత కృతాంత నిశాంత పత్రకూట మేఘం ఛిర్రున చిరిగి వర్షించినట్లూ, ఉద్బుత ప్రచ్చన్నోన్మత్త అమధన్మంద విగ్లాగ్ర జంభాల ఘూకం హృదయ విదారకంగా రోదించినట్లూ వెలువడిందొక కూత –

కూ… ఛుక్ ఛుక్ ఛుక్…

చినసన్నాసి: అయ్యా! ఒంటేలు కొత్తందిరా… నాకు బయఁవేత్తందీ… ఓలమ్మా… వూఁ… వూఁ…

పైడి: బెంగెందుకురా ఎదవా? బండొత్తాదంతన్నాడు బాబు… బేగెలిపోరారా!

చలసాని ప్రసాద్

గవర్మెంటు రైలెందుకండీ ఎక్కటం? అసలు మీరు గనక ఈ రైళ్ళెందుకు లేటవుతాయని గతి తార్కిక భౌతికవాద పునాదిపై, మార్క్సిజ లెనినిజ మావో ఆలోచనా విధాన భావజాలంతో అధ్యయనం చేస్తే.. ఇది ఒక్కనాటి లేటు కాదని, నాడు వెంగళరావు ప్రభుత్వం నుండి నేడు జనార్దనరెడ్డి ప్రభుత్వం దాకా ఈ సర్కారుకుక్కలు ప్రజల అవసరాలపైనా, వాళ్ళ ఉద్యమాలపైనా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న కుట్రని బోధపడుతుంది. అసలు మీరు మార్క్సిజం చదివేరా? చదవలేదా?!… ఎందుకు… మార్క్సిజం చదవండి!

సిమ్మా: కోప్పడకండి బాబూ! తెలీక తప్మాటన్నాను… దయుంచండి శాన!

రేడియోలో ఉత్తరాలు చదివే వాళ్ళు

(ఆడ): లబడబారికి నుండి మంత్రబుడ్డి సింవాచెలం, మంత్రబుడ్డి పైడితల్లి, మంత్రబుడ్డి చినసన్నాసి మరియు వారి కుటుంబ సభ్యులూ… అంటున్నారూ… 3-2-92 శనివారం నాడు రావలసిన రైలుబండి రానేలేదూ… అసలు మాకు ఏంవీ నచ్చలేదూ… అంటున్నారు.

(మగ): అవునా?! అంటున్నారా… చూడండి సింవ్వాచెలాంరూ! వీలున్నంతలో అన్ని రైళ్ళూ వేళపట్టున నడపటమే ప్రభుత్వం వారి ఉద్దేశమండీ… ఔనా?!

(ఆడ): ఔను కదా మరి… అంతే కదా మరి!

పైడి: (రహస్యంగా) ఇది రేడియోదాయిరా! ఈల్లకే వొల్లకాడూ తెల్దు. ముత్తా వోల్ల ఈరకాడు ఈ రేడియో యినీ యినీ ఎర్రోడైపోనాడు తెల్దేటి? రా… రా…

నామిని సుబ్రమణ్యం నాయుడు

నియ్యమ్మా ముత్తరాశి ముండనాయాలీ డైవరు ముక్కలాన తాగి ఏడ బోయిండో గదే. దిన్దినానికీ దిగ్గరిపోతా వుందిరే ఈ సర్కారీ. టికెట్టుకు నూర్రూపాలిచ్చి, నార్జీకి డబ్బయ్ రూపాలిస్తే ఒచ్చిన రొండొందల్లో ఇంక మిగిలేదేందిరే! కలిగ్గంలో ఈ ఎండలుకాసే బూమండలం మింద మడుసులికి ఓ కుశాల లేదు, ఓ సౌక్రిం లేదు. బండి సంగతి ఏం జరిగిద్ది నాకు తెలవదు, బిడ్డా… నిజ్జింతో… పచ్చనాకుసత్తెంతో…

సింమ్మా: తమరు పడవటి వోరా బాబూ! మీ బాస మాకు యిశదం కాదు రాజా…!

చందు సుబ్బారావు

జీవితకాలం లేటా? అసలు ఆరుద్రగారు అన్నారని తక్కుంగల కవుల్నందర్నీ విస్మరించటమేనా? మహాకవులకి మహాకవి మా గురువుగారు శ్రీశ్రీగారుండగా ఎవర్నో అడగటం ఎందుకు? అలనాడు ప్రపంచ తెలుగు మహాసభల్లో వెన్నెముకలేని సర్కారీతొత్తులు ఒకొర్నొకరు డబ్బాలు కొట్టుకుంటూ, పరమ నీచంగా ఛండాలంగా రొచ్చుగా బిరుదుల్ని పంచుకుతింటే ‘నాకు ముందూ నా తరవాతా ఈ ప్రపంచ సాహిత్యం శూన్యం!’ అని సగర్వంగా రొమ్ముగుద్దుకుని చెప్పుకోగలగిన మహాకవి, మహామనీషి, మహాప్రస్థానం… మహా… మహా…

సిమ్మా: మహాపరాదం బాబో! మహాప్రెబువులు… ఈ యెర్రోడి తప్పుకాయండి.

ప్రాచార్య ఎస్వీ జోగారావు

రైలా?… వొస్తుందిలే! ఆఁ… దా, కూర్షో..! ఆఁ! రైలంటే జ్ఞాపకం వొచ్చిందీ… ఆఁ… ఈ మధ్య ‘మదన భోగినీ శృంగారము’ అని కావ్యం రాస్తున్నానురా. మదనా, భోగినీ అని ఇద్దరు అప్పచెల్లెళ్ళు… ఆఁ? ఇద్దరికీ ఒకేసారి పెళ్ళయింది. రైల్లో ఫస్ట్‌క్లాస్‌లో వాళ్ళ కార్యం! ఆ అడావిళ్ళో మదన మొగుడూ, భోగిని మొగుడూ తారుమారైపోయేరు… ఆఁ… ఆ చీకట్లో ఆ మదన అంటున్నాదీ-

మదన యను ‘స్వామి! నీ ముద్దు కాలునేమి?’

స్వామియను ‘మదన! నీ కౌగిలేమి బిగువు?’

సిమ్మా: ఛీ! ఏటి బాబూ! పెద్దవోరు… అసంటి మాట్లాడొచ్చునా?

ప్రాచార్య: అప్పుడే ఏవైందిరా? అసల్దంతా ముందే వుందీ… ఆఁ…

సిమ్మా: మమ్మల్నొగ్గేయండి బాబూ! ఆడంగులున్నారు… దండాలు!

సంజీవదేవ్

దూరాన్ని కాలంతో కొలవటం అమాయకత్వం. దూరాన్ని తరించే కాలవాహిక ఆలస్యం కూడా ఒక రసమయ రూప గీతమే. అసలు కాలం ఒక మిధ్యాత్మక వాస్తవం. దూరం ఒక వాస్తవాత్మక మిధ్య. విచిత్రం ఏమంటే మిధ్యకీ వాస్తవానికీ మధ్య చిత్రకారుడు తన కుంచెతో అపురూపంగా వేసిన వంతెన లాంటిది ఈ రైలుబండి. అందుకే నైరూప్య చిత్రకళని ఎదుర్కొనే పారదర్శక ద్వంద్వవాదం (Translucent dualism)లా రైలుబండిని ఎదుర్కొనే ఈ ఆలస్యం స్వాప్నికుని ఉదాత్తమైన స్వాప్నిక సుషుప్తికి ఒక రేఖాత్మక అభివ్యక్తి అంటాడు సంజీవ్‌దేవ్.

సిమ్మా: బాబుగోరు తెలుగువోరు కారు. వొడ్డివోరిలా ఉంది. రాయే పైడీ పోదాం!

కె.వి. కృష్ణకుమారి

హుఁ… సిగ్గులేదూ ఆ ప్రశ్నడగటానికి? బోర్డు చదువుకోలేవూ! ఆ నీచుణ్ణి నమ్మి నీ సర్వస్వం అర్పించినప్పుడుండాలి ఈ బుద్ధి. పైగా రైలెందుకు రాలేదని ప్రశ్నొకటి. నీలాంటి అమాయకులుండబట్టే ఈ దుర్మార్గులలా టిక్కట్లు అమ్ముతున్నారు. ఈసారి సికింద్రాబాద్ ఒచ్చినప్పుడు నన్ను కలువు. అన్ని పరీక్షలూ చేసి నీకు చదువు రావటానికి పిల్స్ ఇస్తాను.

సిమ్మా: అంటే ఏటి, పిల్లలు పుట్టకుండానా? ఏటోలమ్మ ఇడ్డోలఁవు..! ఇంటి కాడ కూకుంతే పెద్దాస్పట్లాలొచ్చి ఆపరీసనాపరీసనని ఊదర గొట్టేత్తారు. ఇక్కడొచ్చినా ఈ బాదేనా.. ముండా సంత? ఏటి తల్లి.. ఈ గవర్మెంట్లు.. ఈ చిస్టాలు? (సిస్టంలు)

గద్దర్

ఏంటి తమ్ముడూ? రైలుబండి లేటేటంటున్నావా? అలనాడు ఈ చిక్కాకోలు గుమ్మలచ్చింపురం అడవుల్లో సవరలు జూలూములు విల్లంబులు సవరించి ‘ఈ ఊరు మాది, ఈ వాడమాది, ఈ రైలుమాది’ అని సామ్రాజ్యవాద పిచ్చికుక్కల్ని తమ సెమట సుక్కలే అగ్నికణాలుగా తమ నెత్తురు వరదలో ముంచెత్తిన ఈ గడ్డ మీద… హుఁ… రైలుబండి లేటేంటని అడుగుతున్నావా? లేదు బిడ్డా… రైలుబండి ఇక రాదు… కష్టజీవుల కన్నీటి పాటకి ఈ బూతల్లి కరిగి నీరైనా… ఈ సర్కారు రైలుబండి ఇక రాదంటున్నాం… ఈ రైలు బండి ఎక్కొద్దంటున్నాం…

(లేచి పాడతారు)

ఓ… ఓ… ఓ…

ఎక్కకురా కొడుకో సర్కారీ రైలుబండి

మక్కెలిరగందాము మాయదారి డైవోరుని

పోరుబాట వేయరో నోరులేని సిమ్మాద్రి

జజ్జనకడి జజ్జనకడి జజ్జనకడి జనాజనా…

(అందరూ కలిసి పాడుకుంటూ ఊళ్ళోకి వెళిపోతారు.)

రచన: ‘రచన మాసపత్రిక’ సౌజన్యంతో; బొమ్మ: బాపు సౌజన్యంతో

గొరుసు జగదీశ్వరరెడ్డికి కృతజ్ఞతలతో

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, పాత రచన and tagged , , , , .

4 Comments

  1. నాకు తెలీక అంటున్నా తప్పట్టుకోకు త్రిపుర గారి కణకణక పెసాదు బాబో!

    ఎందుకో గద్దరన్న ను పేరడీ చెయ్యటంలో కూసింత పట్టుచిక్కలేదనిపిస్తావున్నాది.
    ‘మక్కెలిరగందాము మాయదారి డైవోరుని’ అనేది అతకటంలేదు. అది గద్దర్ బాణి కాదేమో.

    కోప్పడకండి బాబూ! తెలీక తప్మాటన్నాను… దయుంచండి శాన!

    ~ గొరుసన్న గారి తం. మా. రామయ్య

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.