cover

ఒక పుర్రవాటంబుర్ర కథనం: సిటీ బ్యూటిఫుల్

Download PDF ePub MOBI

మొన్న కొనుక్కున్న తెలుగుపుస్తకాల్లో ఇది కేశవరెడ్డి రెండో పుస్తకం (మొదటి పుస్తకం రివ్యూ లింకు ఇక్కడ). దీని విషయంలో కూడా నన్ను ఆకట్టింది ‘సిటీ బ్యూటిఫుల్’ అన్న ఇంగ్లీషు పేరే. ఈ పుస్తకం తర్వాత కేశవరెడ్డి మీద ఇష్టం ఖాయమైంది. ఇది దేవీదాసు అనే మెడికో విద్యార్థి జీవితంలో ఒక రోజు జరిగిన కథ. ఆ రోజులో ఉన్న విశేషం ఒకటే! క్లాసులకు సరిగ్గా అటెండ్ కాకపోవటం మూలాన పరీక్షల నుంచి డీటైన్ కాబడ్డాడన్న వార్త ఆ రోజు తెలుస్తుంది. ఈ వార్త ప్రభావం దేవీదాసు మీద ఎలా పడిందన్నది కథ.

చాలా బక్కపలచని కథ. కథనంలో కూడా నాటకీయమైన సంఘటనలేవీ జరిగిపోవు – దేవీదాసు కాలేజీ హాస్టల్లో నిద్ర లేవడం, మెస్సుకి వెళ్లటం, అక్కడ అందరూ అతన్ని చిత్రంగా చూడటం, దానికి కారణమేంటో తర్వాత అతడ్ని డీటైన్ చేసారన్న నోటీసు చూసాక బోధపడటం, ముందు ప్రిన్సిపాల్ని తర్వాత ఫ్రొఫెసర్నీ కల్సి బతిమాలుకున్నా ఏం పనవకపోవటం, చివరకి అతను పరిస్థితికి రాజీపడిపోయి విసిగి రోడ్డు మీదకు రావటం, సినిమాకని వెళ్ళబోయి మనసు మార్చుకోవటం, దారిలో తారసపడిన ఒక కాలేజి కాంపిటీషన్లో క్వార్టరు బాటిలు గెలుచుకోవటం, సముద్రపు ఒడ్డున కూర్చుని తన విఫల ప్రేమని తల్చుకుంటూ దాన్ని తాగటం, తిరిగి అర్ధరాత్రి హాస్టలుకు చేరటం.. ఇలా సాదాసీదాగా జరిగిపోతుంది. ఇప్పుడు కథ మొత్తం ఇలా చెప్పేసినా నేను మీ అనుభవాన్ని ఏ మాత్రం పాడు చేసినవాడిని కాదని బల్లగుద్ది చెప్పగలుగుతున్నానంటే.. ఇందులో కథ అనేది ఎంత సెకండరీనో మీరు ఊహించుకోవచ్చు. ఇంత సన్నని కథని కేశవరెడ్డి కేవలం తన శైలి ఆధారంగా పకడ్బందీగా నడపగలిగారు. ముఖ్యంగా దేవీదాసు గొంతులో వినిపించే డ్రైహ్యూమరు పుస్తకం కిందపెట్టనివ్వకుండా చదివిస్తుంది. ఉదాహరణకి ఈ పేరా చూడండి -

(దేవీదాసు అర్ధరాత్రి దాకా సముద్రం ఒడ్డున ఫూటుగా తాగిం తర్వాత.. హాస్టలుకి వెళ్లటానికి జేబుల్లో డబ్బుల్లేక ఆ నాలుగు కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకుంటాడు)

“నడుస్తూ నేను సినిమా హీరోల నడకను ఇమిటేట్ చెయ్యసాగాను. కొంతసేపు యం.జి.ఆర్‌ను, కొంతసేపు శతృఘ్నసిన్హాను, మరికొంతసేపు దేవానందును ఇమిటేట్ చేస్తూ నడిచాను. క్లింట్ ఈస్ట్ ఉడ్‌ను గూడా ఇమిటేట్ చేద్దామనుకున్నాను కాని, వీలుపడలేదు. నేను చూసిన వాడి సినిమాలన్నీ కౌబాయ్ సినిమాలే. ఆ సినిమాల్లో వాడు మొదటి రీలు నుండి చివరి రీలు దాక గుర్రం మీదనే ఉంటాడు. ఎప్పుడైనా ఒకటి రెండు నిముషాలు నేల మీద నడిచినా దొడ్డికాళ్లతో నడుస్తాడు. ఆ నడక మా ప్రొఫెసరు గాడి నడకను పోలి ఉంటుంది. నేను కావాలంటే మోకాళ్ళ మీద, మోచేతుల మీద దేకుతూ హాస్టలు చేరుకుంటాను గాని ప్రొఫెసరుగాడిని మాత్రం ఇమిటేట్ చెయ్యను.”

ఈ సీను “Catcher in the Rye” అనే ఇంగ్లీషు నవల చదివినవాళ్లకి అందులో ప్రొటాగనిస్టు హోల్డెన్ కాల్‌ఫీల్డు ఊరకే సినిమాల్లోలా తనను ఎవరో పొట్టలో కాల్చినట్టూ.. తాను గాయపడనినట్టూ ఉహించుకుంటూ నడిచే సీనుని గుర్తుకు తెస్తుంది. నిజానికి ఈ సీననే కాదు, ఈ పుస్తకం కథ ఒక్క వాక్యంలో విన్నవారికైనా జెడి సలింజర్ “కాచర్ ఇన్ ద రై” గుర్తుకు వస్తుంది. ఇది పెద్ద రహస్యం కూడా కాదు. ఈ నవల ముందుమాటలో స్వయంగా రచయితే ఆ ప్రభావాన్ని ఒప్పుకున్నాడు.

అయితే ఆ నవలతో పోల్చి చూసినపుడు ఈ నవల ఒక విషయంలో దిగదుడుపుగా అనిపిస్తుంది.. ప్రొటాగనిస్టు దేవీదాసుకి రచయిత ఉపయోగించిన గొంతు విషయంలో. “కాచర్ ఇన్ ద రై” నవల్లో మెయిన్ పాత్రయిన హోల్డెన్ కాల్ఫీల్డు గొంతు అచ్చం వయసుకు తగ్గట్టే ఉంటుంది. రచయిత ఆ వయసు కుర్రాళ్ల మాట తీరుని కరెక్టుగా పట్టుకుని కథ చెప్తాడు. ఈ “సిటీ బ్యూటిఫుల్”లో మాత్రం రచయిత అలా చేయలేకపోయాడు. (అసలు చేయాలని అనుకోలేదేమో అని కూడా అనిపిస్తుంది.) మెడికోల వయసెంత ఉంటుందో నాకు ఖచ్చితంగా తెలియదు గానీ, దేవీదాసు పాతికేళ్ల లోపు కుర్రవాడే అనుకుంటాను. కానీ అతని కథ చెప్పటానికి వాడిన మాటలు ఆ వయసు కుర్రాడి మాటల్లా ఉండవు. “ప్రాతఃకాలపు తాజా సమయాన్ని బుద్ధి దారుడ్యం కోసం వినియోగించడం ప్రారంభించాను” లాంటి భాష ఆ వయసుకి అతకదు.

రెండు నవలల మధ్యా ఇంకో తేడా ఏంటంటే.. హోల్డెన్ కాల్ఫీల్డు కథ చెప్పుకుంటూ పోతాడే గానీ.. ఎక్కడా తన భంగిమల్నీ పరిసరాల్నీ మరీ అతిగా వర్ణించడు. హోల్డెన్ అనేముంది లెండి, సొంత కథ చెప్పుకునే మనిషి ఎవరైనా అంతే కదా. నిజజీవితంలో ఎవరైనా “నేను” అంటూ కథ చెప్పేటప్పుడు జరిగింది జరిగినట్టు చెప్పుకుంటూ పోతాడు తప్ప మధ్యలో అవసరానికి మించి పరిసరాల వర్ణనలు చేస్తూ పోడు కదా. పోనీ పరిసరాల సంగతెలా ఉన్నా.. తన భంగిమల్నీ, వేసుకున్న దుస్తుల్నీ (అవి కథకి ముఖ్యమైతే తప్ప) వర్ణించి చెప్పడు కదా. కానీ దేవీదాసు నేరేషన్‌ మాత్రం.. “నా ముఖంలో కత్తివేటుకు నెత్తురుచుక్క లేకుండాపోయింది”, “… శిలువ మీద యేసుక్రీస్తులాగ చేతులు పక్కకుచాచి, మెడను పక్కకు వాల్చి, కళ్లు మూసుకున్నాను” అంటూ తనని తానే బయటి నుంచి గమనించుకు వెళ్తుంది. అందుకే అనిపిస్తుంది నిజానికి ఇది ఫస్టుపెర్సనులో రాద్దామని మొదలుపెట్టి అనుకోకుండానే చాలావరకూ థర్డుపెర్సనులో రాసేన నవలేమో అని.

ఈ ఒక్క ఇబ్బంది పక్కకుపెడితే ఈ నవల బాగా చదివిస్తుంది. ఇందాకే చెప్పినట్టు దానికి ముఖ్య కారణం దేవీదాసు గొంతు. అతని దృష్టిలో చాలామంది మగాళ్లు “ఇంబెసైల్ ముండాకొడుకులు”, అడపాదడపా ఆడాళ్లు “ఇంబెసైల్ లంజ”లు. ఒక్కొక్కసారి ఇది ఇబ్బంది కలిగిస్తుంది. కానీ రచయిత ఉద్దేశమూ అదేనేమో అనిపిస్తుంది. రచయిత దేవీదాసు గొంతులో ఒక టీనేజీ ఇమ్మెచ్చూరిటీని చూపించాలనుకున్నాడు. ఆ వయసులో చాలామంది geeky కుర్రాళ్లకి మల్లేనే దేవీదాసు ప్రపంచం పట్ల ఒక అక్కసు కలిసిన వెక్కిరింతతో ఉంటాడు. దానికిక అంతూపొంతూ ఉండదు – ‘తగినంత చిల్లర ఇయ్య వలెను’, ‘మనది అందమైన నగరం. దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం’ లాంటి నోటీసులు మొదలుకొని (“నోటీసులు! నోటీసులు! ఊర్నిండా నోటీసులే. ప్రపంచమంతా ఈ నోటీసుల్ను, రూల్సును ఆధారం చేసుకునే బతుకుతున్నట్టుంది”), తాను వెళ్ళని సినిమా థియేటరు నిర్మాణం (“సౌండ్‌ట్రాక్ నుంచి వచ్చే శబ్దాలు రోడ్డు మీదకు వినిపిస్తున్నాయి. థియేటరు నిర్మాణం అంత లక్షణంగా ఉంది”), బీచిలో గడపడానికొచ్చే జనం (“నీటి అంచువద్ద కోతుల్లాగ నవ్వుతూ వెనక్కు పరిగెత్తుకొచ్చే ఆడవాళ్ళు, ఇసుకలో గూళ్ళు కట్టుతూ తాము పసిపిల్లలకన్న నిష్కల్మష హృదయులమని తెలియజేయటానికి ప్రయత్నించే ముసలివాళ్ళు”), తను ఏకాంతంగా ఉండాలనుకున్న చోటకి జాగింగుకి వచ్చిన అపరిచితుడు (“ఇంబెసైల్ ముండాకొడుకు. జాగింగ్ చెయ్యడానికి వేళాపాళా లేదు”)….. ఇలా చివరకి రోడ్డు మీద నిలబడిన తన్ను తాను కూడా వెక్కిరించుకోకుండా వదలుకోడు (“నేను రోడ్డు మీద నిలబడి తార్పుడుగాడిలాగ వచ్చేపొయ్యే జనాన్ని చూస్తూ రెండు సిగరెట్లు కాల్చాను.”). ఈ తరహా పొసగనితనం ఒక్కోసారి ఎంత ముదురుతుందంటే, ఈ మధ్య అమెరికాలో గన్ వయొలెన్సుకి పాల్పడుతున్న టీనేజీ కుర్రాళ్ల మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అనిపించేంతగా -

“ఇంబెసైల్ జనం. భ్రష్టకారి జనం. రేపొక పౌర్ణమి రోజు సాయంత్రం మెషిన్‌గన్ తీసుకుని బీచికి వెళతాను. హోటన్ లాంటినెంటల్ రూఫ్ మీద నిలబడి మెషిన్ గన్‌తో బీచి మీద ఒక్క నలుసు కూడ మిగలకుండా కాల్చిపారేస్తాను.”

(ఇన్సిడెంటల్లీ.. గాయకుడు జాన్‌లెన్నన్‌ను కాల్చిచంపిన హంతకుని మీదా, రొనాల్డ్ రీగన్‌ను చంపటానికి ప్రయత్నించి విఫలమైన హంతకుని మీదా.. “కాచర్ ఇన్ ద రై” నవల ప్రభావం ఉందని అంటారు. 1982లో “సిటీ బ్యూటిఫుల్” నవల విడుదల అవకముందే ఆ సంఘటనలు జరిగాయి కాబట్టి, బహుశా రచయిత వాటి నుంచి ప్రేరణపొంది ఈ మాటలు రాశాడనీ అనుకోవచ్చు.)

దేవీదాసు గొంతు సంగతి అలా ఉంచితే, ఈ నవలని చదివించే ఇంకో ముఖ్యమైన ఎలిమెంటు కేశవరెడ్డి శైలి. ఆయన శైలి కథని చాలా క్లోజ్‌గా ఫాలో అవుతుంది. కథని కల్పించి చెప్పటం లేదేమో.. అక్కడ జరుగుతుందే చూసి చెప్తున్నాడేమో అన్నట్టు ఉంటుంది. ఉదాహరణకి.. ఒకచోట దేవీదాసు తన ప్రియురాలి హాస్టల్‌కి ఫోను చేస్తాడు. వాచ్‌మన్ పిలుపు అందుకుని ఆమె ఫోను దగ్గరకి వచ్చే లోగా రిసీవరు పట్టుకుని వెయిట్ చేస్తుంటాడు. ఈలోగా లైనుకి అవతలి వైపు నుంచి ఆ హాస్టల్లో అమ్మాయిలు కారమ్స్ బోర్డు ఆడుకుంటున్న చప్పుడు (కారమ్స్ కాయిన్ల టకటకమని కొట్టుకోవటం) రిసీవర్లోంచి వినిపిస్తుంది. రచయిత కథతో ఎంతో బాగా కనెక్టయి ఉంటే తప్ప అలాంటివి గమనించలేడనిపించింది. అలాగే ఆ అమ్మాయి తన గురించి దేవీదాసుకు చెప్తూ తన తండ్రి చేపల వ్యాపారం చేస్తున్నాడని కూడా చెప్తుంది. మామూలు రచయితైతే, ఆ ఒక్క వివరం చెప్పి ఆ కారెక్టరు బాక్‌గ్రవుండుని చాలించేస్తాడు (అక్కడికే ఏదో విలక్షణత చూపించినట్టు ఫీలవ్వచ్చు కూడా). కానీ కేశవరెడ్డి అక్కడితో ఆగడు. ఆ తర్వాతి తక్కువ వాక్యాల్లోనే నిజంగా ఆ అమ్మాయి నాన్న చేపల వ్యాపారి అయితే ఆమె తన తండ్రి గురించి ఎలాంటి వివరాలు (కథకు అనవసరమైనవైనా) చెప్పుకుంటుందో అచ్చం అట్లాంటి వివరాల్నే దేవీదాసు ద్వారా మనకి చెప్పిస్తాడు. ఇలాంటివి చదివినపుడు ఏమనిపిస్తుందో దేవీదాసు మాటల్లోనే చెప్పాలంటే – “ఈ పుస్తకాలు రాసేవాళ్ళకు మూడోకన్నులాంటిదేదో ఉంటుందని నా కనుమానం. వాళ్ళు తాము కూర్చుని ఉన్నచోటు నుంచే ప్రపంచాన్ని చూడగలరు.”

ఇంతముకుందు రివ్యూలో కేశవరెడ్డి రాతలో పోలికల తీరు గురించి చెప్పాను. ఇక్కడా అలాంటి పోలికలు కొన్ని బాగా అనిపిస్తాయి. పరీక్షల ముందు విద్యార్థులు రాత్రంతా మేలుకుని చదివి, తీరా పగలు నిద్రకు జోగటం గురించి చెప్తూ, “చాపను వెడల్పు చేయాలనుకున్నవాడు కుడివైపున అరగజం కత్తిరించి ఎడం వైపున అతికించడంలో ఎంత విజ్ఞత ఉందో వీళ్లు రాత్రి నిద్రకాచి, పగలు నిద్రపోవడంలో అంత విజ్ఞత ఉంది” అని పోలుస్తాడు. అలాగే ఒక చోట దేవీదాసు మీద అయిష్టతతో తల ఎత్తకుండా తన ప్రాక్టికల్స్ చేసుకుంటున్న అతని ప్రియురాలు “పాకిస్తాన్‌లో కొరడా దెబ్బలు తింటున్న వేశ్యలాగా తలదించుకుని ఉంది”. ఒక చోట ఆమె అతనేదో అనబోతుంటే “వాక్యాన్ని చెంగిజ్‌ఖాన్ గాడి కత్తిలాగ నరికి…” సమాధానం చెప్తుంది. ఈ పోలికల్లో విలక్షణంగా ధ్వనించాలన్న ఇది కన్నా, రచయిత idiosyncrasy అందంగా వ్యక్తమై బాగా గుర్తుండిపోతాయి.

ఈ నవల్ని కొన్ని రోజుల్లోనే బాక్ టు బాక్ చదివాను. ‘ఇన్‌క్రెడిబుల్ గాడెస్’ కన్నా బా నచ్చింది. కేశవరెడ్డి అలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న నవలలో కంటే ఈ నగర నేపథ్యం ఉన్న నవల్లోనే సౌకర్యంగా కుదురుకున్నట్టు అనిపించారు నాకైతే. ఆయనది బేసిగ్గా అర్బన్ మైండు అనిపించింది.

120 పేజీల పుస్తకం ఒకే సిట్టింగులో చదివేయొచ్చు. కాశీభట్ల వేణుగోపాల్ రాసిన ముందుమాట బాగుంది. అలాగే ఇలా ఒక యువకుని దృక్కోణంలో చెప్పిన నవలలు తెలుగులో ఇంకేమన్నా ఉంటే చదవవాలని అనిపించింది. ఎన్ని ఇంగ్లీషు కథలు చదువుకున్నా మన తెలుగు కథలతో ఐడెంటిఫై అయినంతగా వేరే భాషల కథలతో అవలేం కదా.

సిటీ బ్యూటిఫుల్

రచన: కేశవరెడ్డిBookCover

హైదరాబాద్ బుక్ ట్రస్టు, ఫ్లాట్ నెం.85,

బాలాజీనగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ 67

ఫోన్ 040 23521849

ధర: రూ. 80/-

ఈబుక్ & ప్రింట్ బుక్ కినిగెలో లభ్యం

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, పుస్తక సమీక్ష and tagged , , , , , , , , , , , , .

One Comment

  1. All the novels written by Dr Kesava Reddy are extra ordinary. The story telling is very good and compels us to read in one sitting. All his novels depict various emotions.
    Out of his novels, Athdu adavini jayinchadu and Mugavani Pillani Grove are really fantastic and unique. Even afetr completion the theme lingers for long in the minds.
    I have collection of all his books. it becomes difficult to read novels of other writers after reading Dr Kesava Reddy’s books.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.