cover

ఓ, న, మః

Download PDF ePub MOBI

ఎప్పుడూ అట్లాడుకుంటావున్ని బిడ్నిగదా! నేను. అట్లాంటి దాన్ని దీసకపోయి మాయవ్వ ఇస్కూల్లో సేర్సేసొచ్చిందా. మాయమ్మేమో మాయక్క మాదిరిగా దినాము ఇస్సూలుకు బోవాలంటాది. నేను, మాయక్క మాయవ్వోలింట్లోగదా వుండేది. కంటారా నిద్రబోదామంటే ‘ఇస్కూలుకు బోవాల లెయ్యి’ అని మా మూలింటవ్వ అట్ల పొర్లించి ఇట్ల పొర్లించి లేపేస్తాది. లెయ్యకపోతే ‘సినాపాపా, అద్దో మీ మామొస్తావుండాడు’ అని సెవుదెగ్గిర గుసగుసలాడతాది. మా మామంటే మాకు అడల్‌ గదా! అందుకని లేసేస్తాను.

ఇస్కూలుకు బోవాలంటే ఎవురికైనా ఏడుపురాదా! నేను మామామకు బయపడి మెల్లింగా రాగందీస్తా యాడస్తాను. అట్లే మాయవ్వ పండ్లుతోమతాది. మూతి గడగతాది. సద్ది కలిపిస్తే తాగనుగదా నేను. అందుకని నీల్లలో ఏసినన్నాన్ని పిండి రసమో, కూరో ముందు దినానివి ఏది మిగిలుంటే అది బోసిస్తాది. అది తినేసినాక అయివోరోలక్క దెగ్గిరికి బొయ్యి జెడలేసుకోని రావాల. మాయవ్వకు రొండు జల్లెయ్యను రాదులే.

ఇస్కూలుకు బోవాలంటే శత్రసెమ అనిపించినా ఇంట్రెల్లులో వుచ్చల సెట్లు గుర్తొస్తే పోవాలనిపిస్తాది. నాలుగు దినాలుగా ఇస్కూలుకు పోతావొస్తావుండాను. ఇంటికొచ్చినాక పయిటేల సంగట్దిని సెనిక్కాయిలో, సెరుకులో దినుకుంటా వూరిమిందబడి ఆట్లాడుకోవడమే పని.

ఆ పొద్దు అయివోరు రాసిచ్చిన ‘ఒ, న’లను యాడికాడ సెక్కలు సెక్కలుగా రుద్దతా వుండేది సూసి అయివోరు తలమిందొక మొటిక్కాయేసినాడు. ‘కసమాలమా, ఇట్ల రాస్తే నీకు జల్మకు అచ్చరం ముక్కరాదు’ అని తిట్టినాడు. నా సెయ్యిబట్టుకొని ఎట్లా రాయాలో సూపించినాడు.

అచ్చరం మిందనే సెప్పుకుంటా రుద్దతా వుంటే ఎంతసేపిటికి అవి లావుగా కన్పించలేదు. కాని ఆ అచ్చరాలు నాకెప్పుడో వచ్చేసినట్లనిపించింది. పలకను ఎనక్కి తిప్పి సూడకుండా రాసేసినాను. ‘ఒ’ బాగానే వొచ్చింది. ‘న’నే పలక్కి అడ్డం బడింది. అచ్చరాలు రుద్దేదిడ్సిపెట్టి ఎనకపక్కే రాస్తా, ఎంగిలితో తుడస్తావుంటే రెండచ్చరాలు వొచ్చేసినాయి. అయవోరి దెగ్గిరికి బోయి ‘వొచ్చేసింది సా’ అన్న్యాను.

‘పో బయిటికి బిరీన’ అని అర్సినాడు. బయటికి బొయ్యి ఆన్నే నిలబడి పొయినాను తలుపుదెగ్గిర.

‘ఏం పోలేదా’ అన్న్యాడు నన్నుసూసి

‘యాడికి సా’

‘ఏందో వొచ్చేసిందంటివే’

‘అచ్చరాలు సా’

అయివోరి మొగం మింది నవ్వు సూస్తే నాకు దైర్నంగా వుండాది. నవ్వతానే ‘ఏ అచ్చరాలు’ అన్న్యాడు

‘ఇవేసా’ అని పలక సూపించినాను.

‘ఇట్రా’

పోయినాను.

పలకమింద నేను రాసిన అచ్చరాల్ని తొడిపేసి మళ్లీ రాయమన్నాడు.

రాసినాను.

అయివోరు నవ్వతా ఈప్మింద కొట్న్యాడు. మెల్లింగా పలక తుడ్సుకోని రమ్మని ఈసారి ఒగే అచ్చరం పెద్దదిగా రాసిచ్చినాడు. ‘మః’ అని సెప్పించి ‘దిద్దుకోని రాబో. సెప్పుకుంటా ఇట్లే దిద్దల్ల. సెక్క కూడదు’ అన్న్యాడు. నాకు శానా కుశాలగా వుంది రొండచ్చరాలు వొచ్చినందుకు.

irla 02 copy‘మః’ ‘మః’ అని సెప్పుకుంటూ గబగబా రుద్దతావుండాను. ఓం వర్కు రాపించుకోను అందుర్ని సోలుపుగా నిలబడమన్న్యాడు అయివోరు. నా ముందోళ్లదైపోయింది. నావొంతొచ్చింది. పలక అయివోరి సేతిలో బెట్న్యాను. రుద్దింది సూసి మెచ్చుకుంటాడని మురిసిపోతా వుండానా! ఎంటనే పలక నాసేతిలో బెట్టి తలమిందొకటి మొటిక్కాయేసి ‘పోఁ పొయ్యి పలక తుడుపుకోని రాబో’ అని కసిరినాడు. నాకు కండ్లలో నీల్లు దిరిగినాయి. పొయ్యి ఎంగిలితో అద్దం మాదిరిగా తుడ్సుకోని అయివోరి దెగ్గిరికి బొయినాను. అప్పిటికి అందుర్దీ అయిపోయింది. అయివోరు సంచి సర్దుకుంటా వుండాడు.

‘సా’ పిల్సినాను.

‘వూఁ ఏమి’

‘వోంవర్కు సా’

‘ఇప్పుడు తెల్లారిందా నీకు. ఇట్ల త్యా’ అని నాబలప్మే దీస్కోని ‘వూఁ ఎంతొరకొచ్చింది’ అడిగినాడు.

‘ఓ, న వొచ్చేసింది సా’

‘ఇంకేంలే ఎం.బి.ఎస్‌. సదివేసినట్లే’ అంటా ‘మః’ ఒక పక్క, రెండో పక్క 1,2 రాసిచ్చినాడు. ఒగటి నాకు సూడంగానే వొచ్చేసింది.

‘ఒగటొచ్చు సా’

‘ముందే సెప్పొద్దా’

‘ముందు రాదు సా’

‘మళ్లెప్పుడొచ్చింది’

‘ఇప్పుడే సా. నువ్వు రాస్తావుంటనే వొచ్చేసింది సా’

‘ఇంగేంలే. నువ్వు గబురు కన్నయ్య సిత్తూరి సిన్నయ్య’ అని నవ్వినాడు.

‘అబ్బా’ అనుకున్న్యాను.

‘ఈ పొద్దిదే దిద్దు. రేపు కొత్త అచ్చరాలు రాసిస్తా’ అని నాపక్క జూసినాడయివోరు.

నేను తలూపినాను. స్కూలుబెల్లుగొట్టి శానాసేపైంది. స్కూల్లోనే సర్కారు సెట్టుకింద కూసోని పలకమిందున్న వాటిని గబగబా రుద్దేసినాను. మా యక్క వోంవర్కు కూడా అయిపోయినాక పైటేల సంగటిదిన్ను మా యవ్వోలింటికి నువ్‌ ముందా, నేను ముందా అనేట్లుగా పరిగెత్తినాము.

పెళ్లో కిచ్చిలి సెట్టుకింద సట్లు బోర్లించే దిన్నుంది. గోడకానుకోని ఆడ కూసోని అరువులు మాట్లాడుకుంటా సంగటి దింటావుండాము.

‘బాపనయివోరు శానా గండా గుండోడు. కొత్త సిన్నయివోరు ఎప్పుడొస్తాడో ఏమోఁ!’ అనింది మాయక్క. అయివోరు నా తలమింద మొటిక్కాయేసిండేది మాయక్క సూసినట్లు లేదు. సూసుంటేనా. ఇయ్యాలికెప్పుడో నా మానం దీసేసుండేది. అందుకే మాయక్క మాటలకు నేను పతి బలకలేదు.

ఇప్పుడు మా కలాసులో నీలావతి, అంస, పాండురంగడు, పురుసోత్తం, జి.సుబ్రమన్నెం ఇంత మందుండారు. అంతా కొత్తగా సేరినోళ్లే. ఒగటో రెండో దినాలకు కొత్తయివోరొచ్చినాడు. ఆయనే మాకిప్పుడు అచ్చరాలు రాసిచ్చేది. మా కలాసు పిలకాయిల్లో ఒ,న,మః వొచ్చింది నా కొక్కదానికే కదా! అంస, నీల అచ్చరాలను కొంచెం కొంచెం సెక్కతావుంటే అట్లాకాదని ఈన్నించి ఈడదాకా ఒకేసారి బలప్ను పైకెత్తకుండా రుద్దాలని సెప్పింది గూడా నేనే.

ఒగదినం వొంటికి బోసే ఇసయంలో సినరాజికి అంస వేణికి తగాదా వొచ్చింది. అప్పుడు నేను వొంటికి బోసే సెట్లకోసమని సల్పేటు దీసుకోని బోయి నీలాకు, అంసాకు ఇచ్చినానా? అప్పట్నుంచి అంసాగూడా నాతో శానా బాగా మాట్లాడ్తాది. ఆట్లాడుకుంటాది.

బాపనయ్యోరునుకుంటే కొత్తగా వొచ్చినోడు ఇంగా అసాద్దుడు. వాన్నోట్లో పుండు బుట్నాని మేము నోరు దెర్సి పక్కనోళ్లతో మాట్లాడ్తే సాలు తిట్లు సాపిస్తా వొచ్చి ఈపు ఇమానం మోత మోపిస్తాడు. అందుకే ఇస్కూలుకు బోవాలంటే బయంగా వుంటాది. పిలకాయి లన్న్యాక గలాం బులాం అని అర్సుకోకుండా వుంటారా!

ఓ, న, మః సూడకుండా రాసి సూపించినప్పుడు ‘సెబ్బాస్‌’ అని ఈప్మింద గెట్టింగా కొట్టినాడు. నేను తిడ్తా కొట్టినాడని ఉల్సరపోయినాను. కానీ నవ్వతా ‘మ’కు సిన్న సున్న బెట్టాలని రాసి సూపించినాడు. శి, వ అని రాసిచ్చినాడు. ఎట్లా రుద్దాలో సూపించినాడు.

ముండాకొడుకు తక్కువోడా, బెత్తం సేతిలో బట్టుకోని మేము రాస్తావుంటే మా పలకల్లోకి తొంగి తొంగి సూస్తా తిరగతానే వుంటాడు.

మూడో తరగతొరకు పిలకాయిలంతా యప్నాను, రాగిమానుండే గెట్టుపైన కూసుంటాము. పక్కనోళ్లతో ఎవురైనా కిముక్కంటిమా. పడా ఏటు.

‘శి’ని ఎట్లా రుద్దాలో గెవనం లేదు. అందుకని ఆ అచ్చరాన్ని రొండు తునకలుగా జేసుకొని పైన సగమచ్చరాన్ని ముందు కిందుండే సగమచ్చరాన్ని ఎనకా రుద్దతా వుండాను. అయివోరిచ్చి నా ఎనక నిలబడి సూత్తా వుండాడు. అంతే ‘అట్లేనా’ అని గెట్టింగా గదిమినాడు. వులిక్కి పన్న్యాను నేను. నా సెయిసాపమని బెత్తంతో సేతిపైన రెండేట్లేసినాడు. ‘శి’ ఎట్లా రాయాలో సెయి బట్టుకోని రాపిచ్చినాడు. అంసా, నీలా వాళ్ల ముందర కొట్టినందుకు నాకు తలదీసేసినట్లుండాది. మాంతమైన సిగ్గుతో తలొంచుకోని వుండిపొయినాను. అప్పుడే ‘రేపు నేను ఇస్కూలుకు రానుగాక రాను’ అనుకున్న్యాను మనసులో.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఇర్లచెంగి కథలు, జులై, సీరియల్ and tagged , , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.