cover

పదనిష్పాదన కళ (12)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

పదో అధ్యాయం

లాక్షణిక నామవాచకాల నిష్పాదనపద్ధతి

మనకు ఏయే తెఱగుల నామవాచకాలు అవసరమవుతాయి ?

నామవాచకమంటే పేరు. దీన్నే ఆంగ్లంలో Noun అంటారు. వ్యాకరణ సహాయంతో ప్రయత్నపూర్వకంగా నిష్పాదించ బడేవాటికి లాక్షణిక నామవాచకాలు అని పేరు. వ్యక్తీకరణ (expression) అంతా జ్ఞానం మీద ఆధారపడి ఉంది. జ్ఞానం అనేది, ‘ఒకదాన్నుంచి మఱొకటి వేఱు’ అనే విచక్షణ మీద ఆధారపడి ఉంది. ఆ విచక్షణ భాష మీదా, ఆ భాష పేర్ల మీదా ఆధారపడి ఉన్నాయి. అందుచేత భాష యొక్క ప్రాథమిక స్వరూపం నామ ధాతువులే. ఈ పేర్లన్నీ ఒకటి కావు. వీటిల్లో రకాలున్నాయి. ‘భాషాభాగాల్లో నామవాచకాలు ఒకటి’ అని తెలిసినప్పటికీ ఏ కారణం చేతనో మన పూర్వీకులు వీటిని అర్థరీత్యా వింగడించి చూపడం పట్ల శ్రద్ధ వహించలేదు. వారు లాక్షణిక నామవాచ కాల్ని తద్ధితాలలో భాగంగా పరిగణించారు. తద్ధితమంటే తస్మై హితమ్ = అతని (వక్తకి హితమైనది అని నిర్వచించారు. ఎందుకంటే, ‘పరిపాలించేవాడు’ అని పొడవుగా చెప్పేపని లేకుండా, ‘పరిపాలకుడు’ అని క్లుప్తంగా వ్యక్తీకరిస్తూ, తద్ద్వారా మాట్లాడేవాడికి సౌలభ్యాన్ని చేకూఱుస్తుంది గనుక! వీటిని ఆంగ్లవ్యాకర్తలు మాత్రం అర్థాన్ని బట్టి 5 రకాలుగా వింగడించారు.

I. సాధారణ నామవాచకాలు (Common Nouns) :- ఇల్లు, గోడ, దారి, తోట, ఆకాశం, రాజు, గురువు, మతం ఇత్యాది.

II. విశిష్ట నామవాచకాలు (Proper Nouns) :- ఇంటిపేర్లు, వ్యక్తుల పేర్లు, ఊళ్ళ పేర్లు, వీథుల పేర్లు, రాష్ట్రాల పేర్లు, జిల్లాల పేర్లు, దేశాల పేర్లు, నదుల పేర్లు, సరస్సుల పేర్లు, సముద్రాల పేర్లు, పర్వతాల పేర్లు, పుస్తకాల పేర్లు, పత్రికల పేర్లు, భవనాల పేర్లు, సంస్థల/ సార్థవాహాల పేర్లు, ఉత్పాదనల ముద్రాంకనామాలు (Product brand names) ఇత్యాది.

III. పాదార్థిక నామవాచకాలు (Material Nouns) :- గోధుమలు, పెసలు, మినుములు, మట్టి, ప్రత్తి, బంగారం, నూనె, పెట్రోలు ఇత్యాది.

IV. సమష్టి నామవాచకాలు (Collective Nouns) :- పదార్థాల/ వస్తువుల/ వ్యక్తుల/ జీవుల సమూహాన్నీ, మొత్తాన్నీ తెలియజేసే మాటలు. ఉదాహరణకి – మానవాళి, మంద, ప్రజ, జనాభా, సమాజం, సమితి, మండలి ఇత్యాది.

V. అమూర్త నామవాచకాలు (Abstract Nouns) :- మూర్తి (ఆకారం) లేనివీ, కంటికి కనిపించనివీ, ఒకవేళ కని పించినా కేవలం అనుభూతి/ ఊహ/ పోల్పు (comparison) ద్వారానే అర్థం చేసుకోదగినవీ ఐన భావనల్ని సూచించేవి అమూర్త నామవాచకాలు. గుణగణాలూ, లక్షణాలూ, మనోభావాలూ, సంబంధాలూ, స్థితులూ, కళలూ, శాస్త్రాలూ మొదలైన వాటిని అమూర్త నామవాచకాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకి :

౧. గుణగణాలూ, లక్షణాలూ: ఎఱుపు, నలుపు, తెలుపు, పొడవు, లావు, సన్నం, మంచితనం, చెడ్డతనం ఇత్యాది

౨. మనోభావాలు: ప్రేమ, ద్వేషం, స్నేహం, కోపం, ఇష్టం, విసుగు, చిఱాకు ఇత్యాది.

౩. సంబంధాలు: కొడుకు, కారణం, మేనఱికం ఇత్యాది.

౪. స్థితులు : యాజమాన్యం, ఆధిపత్యం, పౌరసత్వం, బానిసత్వం ఇత్యాది.

౫. కళలూ, శాస్త్రాలూ : సంగీతం, శిల్పం, నాట్యం, సాహిత్యం ఇత్యాది.

౬. క్రియాధాతుజన్యాలు : నడక, పడక, రాక, పోక ఇత్యాది.

వీటిని తెలుగులో ఏ విధంగా నిష్పాదించాలో తెలుసుకుందాం. సాధారణ నామవాచకాలనేవి (Common Nouns) వాడుక లో తరతరాలుగా సంక్రమించాల్సిందే తప్ప వాటిని ప్రయత్నపూర్వకంగా నిష్పాదించడం సాధ్యం కాదు. ఐతే కొన్ని పరిభా వనలకు సమస్తరూపాల (compounded structures) తోనూ, ప్రత్యయాంత (suffixed) రూపాలతోనూ సమానార్థ కాల్ని కల్పించవచ్చు.

I. సాధారణ నామవాచకాలు

వీటిని పదనిష్పాదనదృష్టితో స్థూలంగా 4 తెఱగులుగా విభజించవచ్చు. అవి – ౧. లక్షణాలూ, వృత్తులూ, అలవా ట్లూ, పనులూ గలవారు ౨. నిమిత్త కట్టడాలూ, సౌకర్య భవనాలూ ౩. జీవులూ, జంతువులూ ౪. సాధనాలూ, యంత్రాలూ.

1. వృత్తులూ, అలవాట్లూ, పనులూ, లక్షణాలూ, ఆస్తులూ గలవారు

(అ) తెలుగులో ఈ అర్థాన్ని సూచించడానికి నామవాచకానికి ‘అరి/ ఆరి’ చేఱుస్తారు. ఉదాహరణకి,

పూజచేసేవాడు = పూజ + ఆరి = పూజారి

తల తీసేవాడు = తల + ఆరి = తలారి

జాలం (వల) వేసేవాడు = జాలం + అరి = జాలరి

మేతమేసేవాడు = మేత + అరి = మేతరి

పోటుపొడిచేవాడు = పోటు + అరి = పోటరి

(పక్షాంతరంలో) పోటీపడేవాడు = పోటి + అరి = పోటరి

విధమెఱిగినవాడు = వితము + అరి = వితమరి

గడుసుదనం గలవాడు = గడుసు + అరి = గడసరి

సొగసు గల ఆమె = సొగసు + అరి = సొగసరి

వెరవు (ఉపాయం) తెలిసినవాడు = వెరవు + అరి = వెరవరి

నేర్పుగలవాడు = నేర్పు + అరి = నేర్పరి

కూర్పుకూర్చేవాడు = కూర్పు + అరి = కూర్పరి

చదువుకున్నవాడు = చదువు + అరి = చదువరి

మదుపు పెట్టేవాడు = మదుపు + అరి = మదుపరి

సున్నం కొట్టేవాడు = సున్న + అరి = సున్నరి –>సూనరి

(ఆ) కొన్నిసార్లు ‘కారి, కాడు, కత్తె’ అని చేఱుస్తారు. ఉదాహరణకి,

చక్కగా మాట్లాడేవాడు = మాటకారి

అపకారం (దోసందోషం) చేసేది = దోసకారి

వేటాడేవాడు = వేటకాడు

ఆటాడేవాడు = ఆటకాడు

పొడిచేవాడు = పోటుకాడు

వన్నెగలవాడు = వన్నెకాడు

వ్రాసేవాడు = వ్రాయసకాడు (scribe)

అందం గల ఆమె = అందకత్తె

మోసం చేసే ఆమె = మోసకత్తె

ఉంచుకున్న ఆమె = ఉంపుడుకత్తె

చెలికారం (స్నేహం) చేసే ఆమె = చెలికత్తె

పని చేసే ఆమె = పనికత్తె

మంత్రాలు వేసే ఆమె = మంత్రకత్తె

పుల్లింగ ఏకవచన శబ్దాల చివఱ వచ్చే ’డు’ ప్రత్యయం కొంతమంది చెవులకి మర్యాదగా ధ్వనించదు. కనుక కావాల్సినవారు దాని బహువచన రూపాన్నే ఏకవచనానిక్కూడా వాడుకోవచ్చు. దాన్నే ‘డు’ ప్రత్యయానికి ఆధునికరూపంగా భావించవచ్చు. ఉదాహరణకి,

వేటకాడు –వేటకాఱు

ఆటకాడు –> ఆటకాఱు

(ఇ) కానీ సమకాలీన పాత్రికేయులు పై ప్రత్యయాల బదులు ‘దారు/ దారుడు’ అనే ప్రత్యయాల్ని తఱచుగా వాడుక చేస్తూ వస్తున్నారు. వీటి అసలు అర్థం ‘ధరించేవాడు/ ఆమె’ అని ! ఉదాహరణకి,

లబ్ధి పొందేవాడు = లబ్ధిదారు Beneficiary

వినియోగించుకునేవాడు = వినియోగదారు Consumer

ఎగుమతి చేసేవాడు = ఎగుమతిదారు Exporter

పెట్టుబడి పెట్టేవాడు = పెట్టుబడిదారు  Capitalist

దోపిడి చేసేవాడు = దోపిడిదారు Exploiter

పంపిణీ చేసేవాడు = పంపిణీదారు Distributor

గుత్తకు తీసుకొని పనులు చేసేవాడు = గుత్తేదారు Contractor

పోటీపడేవాడు = పోటీదారు Contestent/ Competitor/ Rival

వాహనాన్ని నడిపేవాడుయజమాని   = వాహనదారు Vehiclist

మద్దతిచ్చేవాడు = మద్దతుదారు Supporter

కొనుగోలు చేసేవాడు = కొనుగోలుదారు Buyer

ఇవి వాస్తవంగా హిందూస్థానీ ప్రత్యయాలే తప్ప, తెలుగు కావు గనుక, దేశ్యాభిమానులు వీటిని పరిమితంగా వాడడం ఉత్తమం. ‘అరి, కారి, కాడు, కత్తె ప్రత్యయాల సహాయంతో ఇంకా ఎన్నో నామవాచకాల్ని రూపొందించడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి,

పెద్ద గొంతు గలవాడు = గొంతు + అరి = గొంతరి Stentorian (adj)

జాడపట్టేవాడు = జాడ + అరి = జాడరి Detective

జట్టులో సభ్యుడు = జట్టు + అరి = జట్టరి (జట్టుదారు) Team member

బొగ్గు వెలికి తీసేవాడు  = బొగ్గు + అరి = బొగ్గరి Coal miner

ఇసుక త్రవ్వేవాడు = ఇసుక + అరి = ఇసుకరి Sand quarry worker

మొదలుపెట్టినవాడు = మొదలు + అరి = మొదలరి Pioneer

వాడేవాడు = వాడుక + అరి = వాడుకరి User

నడిచేవాడు =   నడక + అరి = నడకరి Walker

వెంటబడేవాడు = వెంటబాటు + అరి = వెంటబాటరివెంటరి Stalker

కట్టేవాడు = కట్టుబడిదారు Builder

వెల్లడించేవాడు  = వెల్లడిదారు Whistle-blower

మారుపలికేవాడు = మారుపలుకు + అరి = మారుపలుకరి Responder

వచ్చేవాడు = రాక + అరి = రాకరి Comer

ఆలస్యంగా వచ్చేవాడు  = ఆలస్య రాకరి Late-comer

కొత్తగా వచ్చినవాడు = కొత్త రాకరి New-comer

తడబడేవాడు = తడబాటు + అరి = తడబాటరి  Falterer

వ్రాసేవాడు = వ్రాత + అరి = వ్రాతరి Writer

తీసుకునేవాడు  = తీసుకోలు + అరి = తీసుకోలరి Taker    

(ఇది సాంప్రదాయిక పద్ధతి. ఇలా కాకుండా ఇంగ్లీషులో –er/ -or ప్రత్యయాల మాదిరి దీన్ని నేరుగా క్రియా ధాతువుకే చేర్చడం భవిష్యత్తులో వాంఛనీయం. ఇలా చేసినందువల్ల పదనిష్పాదనలో క్లుప్తతా, స్పష్టతా సిద్ధిస్తాయి. ఉదాహరణకి,

పోయేవాడు = పోవుఅరి –> పోవరి

కట్టేవాడు = కట్టు + అరి –> కట్టరి

దాటేవాడు = దాటుఅరి –> దాటరి

ఇచ్చేవాడు = ఇచ్చుఅరి –> ఇవ్వరిఈవరి

ఇసుక త్రవ్వేవాడు = ఇసుకత్రవ్వుఅరి –> ఇసుక-త్రవ్వరి || ఇత్యాది.

(ఉ) సంస్కృతంలో క్రియాధాతువుకు ‘అక’ ప్రత్యయాన్ని చేర్చడం ద్వారా ఆ పనిచేసేవారిని సూచిస్తారు. ఉదాహరణకి,

పాలించేవాడు  = పాలకుడు

సేవించేవాడు = సేవకుడు

విసర్జించేది = విసర్జకం

చంపేది = మారకం

పోషించేది = పోషకం

ఇచ్చేది  = దాయకం

నడిపేవాడు = నాయకుడు

వెలిగించేది = దీపకం

వెతికేది = శోధకం

పవిత్రం చేసేది  = పావకం

కారేది (ద్రవించేది) = ద్రావకం

సంహరించేది  = సంహారకం

ధరించేవాడు = ధారకుడు

భరించేవాడు = భారకుడు

రక్షించేవాడు =  రక్షకుడు.

విశేష పరిజ్ఞాన నిమిత్తం 13 వ అధ్యాయం చూడవలసినది.

(కొన్నిసార్లు ‘అన/ అణ’ ప్రత్యయాన్నే క్రియాధాతువుకు చేర్చడం ద్వారా ఆ పని చేసేవారిని సూచిస్తారు.

ఉదాహరణకి,

శత్రువుల్ని దమించేవాడు = శత్రుదమనుడు

పాపాల్ని హరించేది = పాపహరణం

తపింపజేసేవాడు = తాపనుడు

విదారించే (చీల్చే) వాడు = విదారణుడు

వంశాన్ని వర్ధిల్లజేసేవాడు = వంశవర్ధనుడు

(తఱచూ వృత్తులకి సంబంధించిన వస్తు, పదార్థ సూచక పదాలకి ‘కార, కర, కృత్’ అనే సమాస అవయవాల్ని చేర్చడం ద్వారా ఆ వృత్తులు చేసేవారిని సూచిస్తారు.

చిత్రాలు గీచేవాడు = చిత్రకారుడు

మాలలు (దండలు కట్టేవాడు) = మాలాకారుడుమాలాకరుడు

కుంభాలు (కుండలు) చేసేవాడు = కుంభకారుడు

కర్మ (పని) చేసేవాడు = కర్మకరుడు (కూలీ)

ఉద్యమం చేసేవాడుఅందులో పాల్గొనేవాడు = ఉద్యమకారుడు

వ్రాసుకునేవాడు (గుమాస్తా) =లిపికారుడు

దినాన్ని (పగటినికలిగించేవాడు = దినకరుడు (సూర్యుడు)

నిశ (రాత్రిని కలిగించేవాడు = నిశాకరుడు (చంద్రుడు)

సూపం (పప్పువండేవాడు = సూపకారుడు

రథం తయారుచేసేవాడు = రథకారుడు        

(చర్మంతో) చెప్పులు కుట్టేవాడు = చర్మకారుడు

బంగారప్పని చేసేవాడు = స్వర్ణకారుడు

ఇనప్పని చేసేవాడు = లోహకారుడు

2. నిమిత్త కట్టడాలూ, సౌకర్య భవనాలూ (Utility Establishments)

(ఇప్పటికే విస్తృత వాడుకలో ఉన్న ఈ క్రింది పదాల్ని పరిశీలించండి:

Office = కార్యాలయం ; Secretariat = సచివాలయం ; Temple = దేవాలయం ; Museum = సంగ్రహాలయం ; University = విశ్వవిద్యాలయం ; Printing press = ముద్రణాలయం ; Library = గ్రంథాలయం ; Court = న్యాయాలయం, న్యాయస్థానం ; School = పాఠశాల ; College = కళాశాల ; Restaurant = ఫలహారశాల ; Eatery = భోజనశాల ; Cowpen = గోశాల ; Zoo = జంతుశాల ; Gymnasium = వ్యాయామశాల ; Hospital = వైద్యశాల ; Showroom = ప్రదర్శనశాల ; Retail outlet- = విక్రయశాల ; Barracks = స్కంధావారం ; Jail = కారాగారం ; Treasury = కోశాగారం ; Factory = కర్మాగారం ; Study = పఠన మందిరం ; Dining hall = భోజనమందిరం ; Bathroom = స్నానమందిరం ; Art Gallery = కళామందిరం ; Rest house = విశ్రాంతి మందిరంవిశ్రాంతిగృహం ; Guest house = అతిథిగృహం ; Marriage hall = కల్యాణమంటపం ; Conference hall = సభామంటపం ; Police station = భటనిలయం ; Railway station = రైల్ నిలయం.

పై ఉదాహరణలు ఆధారంగా, ఒక పని కోసం ఉద్దేశించిన, అందఱికీ ఉపయోగపడే కట్టడాలకు సందర్భాన్ని బట్టి తెలుగులో ‘ఆలయం, శాల, అగారం, మందిరం, స్థానం, మంటపం, ప్రాంగణం, గృహంభండారం’ లాంటి సమాసావయవాల్ని ఎక్కువగా వాడతారని తెలుస్తుంది. వీటిని ఉపయోగించి ఇంకా చాలా పదాల్ని కల్పించవచ్చు. ఉదాహరణకి,

Cinema theatre = చిత్రమందిరం ; Waiting room = నిరీక్షామందిరం ; Internet Café = అంతర్జాల మందిరంజాలమందిరం ; Mint = నాణ్యాగారం ; Lecture hall = ఉపన్యాస మంటపం, ప్రసంగ మందిరం ; Seminar Hall = గోష్ఠీమంటపం ; Farm house = తోట విడిది ; Arcade = దుకాణావళి ; Gas station = ఇంధన నిలయం ; Workshop = కార్యశాల ; Studio = చిత్రశాల.

(కొన్నిటికి సహజమైనసరిసూటి సమానార్థకాలు ఇప్పటికే భాషలో సిద్ధంగా ఉంటే అలాంటివాటికి నూతన పదనిష్పాదన అవసరం లేదు. ఉదాహరణకి,

Shop = కొట్టు, దుకాణం ; Godown = గోదాము ; Store = భాండారం, ఉగ్రాణం ; Cellar = నేలమాళిగ ; Penthouse = విమానం ; Tower = గోపురం ; pen = కొట్టం ; Kitchen = వంటిల్లు ; Corridor = నడవా, వసారా ; Sitout = చావడి/సావడి ; Parliament = పేఱోలగం ఇత్యాది.

() సార్వజనీన సౌకర్యాల్ని అందించే కట్టడాల్ని సూచించడానికి ఇటీవల Center, Hub అనే పదాల్ని ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకి,

Medical center = వైద్యకేంద్రం ; Center of excellence = ప్రావీణ్యకేంద్రం ; Photostat center = ప్రతి చ్ఛాయణ కేంద్రం ; Diagnostic center = రోగనిదాన కేంద్రం ; Shopping center = క్రయకేంద్రం ; Research center = పరిశోధనాకేంద్రం ; Training centre = శిక్షణాకేంద్రం ; Study center = అధ్యయన కేంద్రం ; Examination center/ Test center = పరీక్షాకేంద్రం ; Industrial hub = పారిశ్రామిక కేంద్రం ; Hub of activity =కార్యకలాపాల కేంద్రం ఇత్యాది.

3. జీవులూ, జంతువులూ

(జీవులకూ, జంతువులకూ పేర్లుపెట్టడానికి ప్రాచీన తెలుగులు ‘ఏలు’ అనే పదాన్నో, ప్రత్యయాన్నో వాడినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు,

కుందు + ఏలు –> కుందేలు = గెంతే జంతువు        

తోడు + ఏలు  –> తోడేలు = ?

తంపు + ఏలు –>తంపేలు –> తాపేలు –తాబేలు = తంపు (తడి) లో ఉండే జంతువు

పోటు + ఏలు –> పొట్టేలు = పొడిచే జంతువు

ఈ ఒరవడి ననుసరించి ఆధునిక కాలంలో కూడా అనేక నూతన జీవజాలానికి పేర్లు పెట్టడానికి అవకాశం ఉంది.

(ఇలాగే సంస్కృతంలో కూడా ‘భ’ అనే ప్రత్యయంతో పశుపక్ష్యాదుల పేర్లు ముగియడం కనిపిస్తుంది.

ఉదాహరణకి – టిట్టిభం, సైరిభం, వృషభం, గార్దభం ఇత్యాది.

4. సాధనాలూ, యంత్రాలూ

() ఒక పనిని చేసే సాధనం, చోటు’ అని వ్యక్తీకరించడానికి తెలుగులో సంబంధిత క్రియాధాతువుకు ‘ఎన/ ఎల’

లేదా, ‘అలి’ అని చేర్చడం కనిపిస్తుంది. ఉదాహరణకు-

దువ్వే సాధనం = దువ్వు + ఎన = దువ్వెన

వీచే సాధనం =  వీచు + ఎన =  వీవెన

ఎత్తే సాధనం = ఎత్తు + ఎన = ఎత్తెన (చేపలు పట్టే సాధనం)

దోఁకే (గడ్డిచెక్కే) సాధనం = దోఁకు + ఎన = దొంకెన (ఒక రకం ఈటె)     

(మొక్కలుపాఁతే సాధనం = పందు + అలి  = పందలి à పందిలి à పందిరి

పండే సాధనం = పండు + అలి = పండలివండలి (నేల)

నాలుగు దార్లు) కూడే చోటు = కూడు + అలి = కూడలి

పై పదాల్లాగానే ధ్వనిస్తూ మూల క్రియాధాతువులు తెలీని నిర్మాణాలు : వంతెన, కందెన, ఉప్పెన, తఱిమెన, బొక్కెన గొల్లెన, గవిసెన, కుచ్చెల, వడిసెల, అంబలి, వేవిలి, వావిలి ఇత్యాది.

() ఒక పనిని చేసే సాధనం’ అని వ్యక్తీకరించడానికి సంస్కృతంలో సంబంధిత క్రియాధాతువుకు ‘త్ర/ ఇత్ర’

ప్రత్యయాన్ని చేఱుస్తారు. ఇలా చేర్చినప్పుడు కొన్ని వ్యాకరణ కార్యాలు ప్రవర్తిల్లుతాయి. ఉదాహరణకు,

పావనం చేసే సాధనం  = పూ + ఇత్రం = పవిత్రం (దర్భ)

కోసే సాధనం = లూ + ఇత్రం = లవిత్రం (కొడవలి)

చరించడానికి (ఉదాహరణ ఐనసాధనం = చర్ + ఇత్రం = చరిత్రం

వసించే (తొడుక్కునేవస్తువు = వస్ + త్రం = వస్త్రం

శాసించే సాధనం = శాస్ + త్రం = శాస్త్రం

వచించే (మాట్లాడేఅవయవం = వచ్ + త్రం = వక్త్రం (నోరు)

మానం (కొలతవేసే ప్రమాణం = మా + త్రం = మాత్ర

గానం చేసే అవయవం = గై + త్రం = గాత్రం (గొంతు)

గానం చేయబడే దేవత = గై + ఇత్రీ = గాయిత్రి

(ప్రజలు) రాజిల్లే సాధనం = రాజ్ + త్రం = రాష్ట్రం (రాజ్యం)

భ్రజ్జించే (వేపే) సాధనం = భ్రజ్ + త్రం = భ్రాష్ట్రం (బాణలి)

శ్వేతమయ్యే (తెల్లబడే) జబ్బు = శ్విత్ + త్రం = శ్విత్త్రం (బొల్లి)

(పక్షాంతరంలో – క్రియాధాతువుకు ‘అక’ ప్రత్యయాన్ని చేర్చి ఆ నిర్మాణాన్ని నపుంసక లింగంలో పెట్టడం

ద్వారా ఆ పనికి ఉపకరించే సాధనాన్ని సూచించవచ్చు. ఇక్కడ, నపుంసకలింగమంటే పదాన్ని సున్నతో అంతం చేయడం. ఉదాహరణకి,

సేవించేది = సేవ్ + అకం = సేవకం Server

వినిపించేది = వాద్ + అకం = వాదకం Player

మార్చేది = పరివర్త్ + అకం = పరివర్తకం Convertor

ముద్రించేది = ముద్రాప్ + అకం = ముద్రాపకం Printer

తీవ్రం చేసేది = తీవ్రాప్ + అకం = తీవ్రాపకం Amplifier

ఇలా కూడా చేయొచ్చు :

నమోదు చేసేది = నమోద్ + అకం =  నమోదకం Recorder

 (తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.