Ajatha cover

అజాత

Download PDF ePub MOBI

“బళ బళ ఖాళీ బొక్కెన సప్పుడు, గిర గిర గిరుక సప్పుడు, దభెళ్ళున నీళ్ళల మునిగిన బొక్కెన సప్పుడు, మల్లా బరువుతోని కిర్రు కిర్రున గిరుక సప్పుడు… నీల్జేదేటప్పుడు నానికి గీ సప్పుల్లు భలే అనిపిత్తయి.”

ఇది గుర్రం ఆనందు కథ ‘గా దేవుడు మీరే…మళ్ళా!!’ నుండి. కళ్ళులేని పిల్లడు నాని స్నానం చెయ్యటాన్ని గురించి వర్ణన. వర్ణం అంటే రంగు. వర్ణన అంటే రంగులద్ది చూపించేది – దృశ్యం. చూడ్డానికి నానికి కళ్ళు లేవు. వాడు ప్రపంచాన్ని ‘వింటాడు’. ఈ కథ నాని దినచర్య వెంట పాఠకుణ్ణి గంతలుకట్టి నడిపించి పొద్దస్తమానం ప్రపంచాన్ని చూడ్డమే కాదు, ఎలాగ వినొచ్చునో పరిచయం చేస్తున్నాది, అనుభవం లోనికి తెస్తున్నాది. నిరుడు ఈ కథని ఫణిబాబు నాకు పంపించేడు. ఎవరు రాసిందో చెప్పకుండా. అది చదివి నేను పళ్ళు కరిసీసుకున్నాను. బత్తుల ప్రసాద్ రాసిందా? అని అనుకున్నాను. కాదు గుర్రం ఆనందు అని చెప్పేడు. ఆ తరవాత ఆనంద్ రాసినవే ఇంకో నాలుగు కథలు వేసేడు – ‘నందుగాడి రంగుల కల’, ‘నాయనమ్మ లొల్లి’, ‘ఇస్కూలు బ్యాగు’, ‘నందుగాడి గర్ల్‌ఫ్రెండ్’. ఈ నాలుగింట్లో నాని మరి రాడు. ఇవి “నల్లపాలు నందుగాడ్ని” గురించి. నందుగాడికి కళ్ళున్నాయి. అంతే కాదు. రంగురంగుల బొమ్మలు వేస్తాడు. కలలు కంటాడు. పెంకితనం చేస్తాడు. తన్నులు తింటాడు.

మొదటిది నాని కథ చదివినప్పట్నుండి నాకు ఆనందు కథల్ని గురించి ఏదైనా అనాలి, ఏదైనా రాయాలీ అని ఒకటే సలుపుతున్నాది. మిగిలిన నాలుగూ చదివేక అది మరింత ఎక్కువయిపోయింది. ఒకళ్ళకి దాల్చించెక్కంటే వల్లమాలిన ఇష్టం అనుకోండి. అప్పుడు తినేవాట్లో, తాగేవాట్లో, పీల్చే వాసనల్లోన, చూసే బొమ్మల్లోనా, నలుగురితో మాటల్లోనా, చివరికి కలల్లోనా, ఒక్కళ్ళే కూచున్నప్పుడూ దాల్చించెక్కనే తల్చుకుని, వెదుక్కుని, సాధించుకుంటారు. ఓ రూపూ, పేరూ ఉన్న వస్తువుల్నైతే “ఇదుగో ఫలానా ఫలానా!” అని చెప్పి వెదుక్కుని, కొనుక్కోడానికి వెసులుబాటు ఉంది. ఆ అనుభవాన్ని ఎవరితోనైనా పంచుకోడానికీ వీలున్నాది. కథలు, కవిత్వాల్లోని దాల్చించెక్కతనంతో ఇలాగ వీల్లేదు. ఎవరి వరకో ఎందుకు “అందులో ఏం చూసుకుని అంతలా ఇదైపోతున్నావు?” అని నా నల్లంతరాత్మే నా తెల్లంతరాత్మని కసిరి పారీగల్దు. ఐనా వినకుండా “అదుగో చూడు! ఐదు కథలు!! ఏదేనా తల్చుకో, ఏదేనా రాయి!” అని నా తెల్లంతరాత్మ ఊరికే సలుపుతున్నాది. కాని “ ‘గుర్రం ఆనందుతనం’ ఇదీ! అని ఏం అంటావు? ఎక్కడ మొదలెడతావు? దీనికి ఓ తలా తోకా లేదు, ఇదంత అరీ బురీగా తేలే వ్యవహారం కాదు! ‘ఇంకా ఉంది’ అని ఇప్పుడే అనుక్కుని నోర్మూసుక్కూచో!” అని నా నల్లంతరాత్మ అడ్డు తగులుతున్నాది. మామూలుగా తెలంతరాత్మకీ నల్లంతరాత్మకీ టకాఫోర్ వొచ్చినప్పుడు ఎప్పుడూ నల్లంతరాత్మే గెలుస్తుంది.

ఒకటేం చెయ్యొచ్చంటే సినిమా చూసొచ్చేక చెప్పుకునేటట్టు ఆ ఐదు కథల్లోని కథనే మళ్ళీ టూకీగా ఎత్తి చెప్తూ, నచ్చించోటల్లా “అబ్బ! అక్కడ వాళ్ళ బాపుకి ఉత్తరం చూడు… ఇదుగో నష్యం పట్టు!” అనీ “అక్కడ సావిత్రి కళ్ళెగరేస్తుంది చూడూ?!” అన్నట్టు చెప్పుకోవచ్చు. సమీక్ష అనీసి ఇలా రాస్తారు. నాకలాగ మనస్కరించదు. గుర్రం ఆనందు కథలు దేన్నిగురించో మళ్ళీ ఇంకో పరమానందు సమీక్ష ఎందుకు? వెళ్ళి మీరే ఆ కధలు చదువుకుంటే మెరుగు కదా? Jennette Wintersen అని బ్రిటిష్ రచయిత్రి ఇలాగే నొచ్చుకున్నాది. మీ పుస్తకం దేన్ని గురించి? అన్న ప్రశ్న చాలా ఇబ్బందిగా ఉంటుంది అని. “It is about itself and if I could condense it into other words, I should not have taken such care to choose the words I did.” అని. నల్లపాలు నందుగాడి కథల్ని అతని మాటల్లోనే చదువుకోండి, ఇదుగో లింకు అనూరుకుంటే పోయింది. తొండే ముదిరితే ఊసరవిల్లి అయినట్టు సమీక్షే కొంచెం ఒళ్ళుచేసి, గిడసబారితే విమర్శ అవుతుంది. అదంటే నాకు మరీ గుద్దుకున్నట్టుంటుంది.

సమీక్షల జోలికీ, విమర్శల జోలికీ పోకుండా ఇలాంటి సలుపుల బారినుండి తప్పించుకోడానికి ఇంకొన్ని సుళువులున్నాయి. ఒకటి ఏంటంటే చదివిందాని మీద మరీ కులికి సచ్చేంత దీనిగా ఉంటే రాసినోడికి ఒక తెల్ల కాయితాల పుస్తకం గాని, పెన్ను గాని, వాటర్ కలర్ బాక్సు ఇలా పంపించి ఊరుకోవచ్చు. లేదంటే ఊళ్ళోనే ఉంటే రాత్రి పావుతక్కువ తొమ్మిదీ ఇలాగ వోడు రిటారైపోయి టీవీ చూసుకుంటుంటే తిన్నగా సోఫా దెగ్గిరికెళిపోయి “హలో! నీను మీ ఫేన్ని!” అని నిలబడతాము. ఆ ఊళ్ళోనా దేశంలోనే లేకపోతే ఆకాశరామన్న ఉత్తరం గాని, ఫోను గాని చేసి “హలో?! బాంది.. అసలు…” అని ఏదో గొణిగీసి పెట్టీడాలు. అలాగా ఉండబట్టకపోతే పత్రిక కామెంటు పేజీల్లోన మన మానాన్ని మనమే మాకులకి కట్టుకోకుండా ఏదైనా దొంగ పేరు పెట్టుకుని “అబ్బ, చితక్కొట్టీసేవు బెదరు!” అనీసి ఇంక గమ్మున మూస్కోనుండొచ్చు. త్రిపుర ఇవేవీ కాకుండా “ఊఁ… ఊఁ.. ఇది!” అని చూపుడు వేలితో బుక్కు మీద ఒప్పుకోలుగా కొట్టి ఊరుకుండిపోయేవారు. అలా ఊరుకోగలిగినోడు ఉత్తమ యోగి. ఇవన్నీ సమంజసమైన పద్ధతులే – these are all possibilities. కాని నాకే గుర్రం ఆనందు కథల్తోటి ఇలాగెలాగా ఉండబట్టకుండా, కక్కాలేకా మింగా లేకా ఉంటూ వచ్చింది.

ఇంతట్లోకి ఝాంగ్ ఝునావు అని ఒకడు యూట్యూబులో తగిలేడు. ఝాంగ్ ఝునావు మూడేళ్ళ బుజ్జిబాబు, చైనావోడు. వాడు అందరు మూడేళ్ళ పిల్లల్లాగే ముద్దులు మూట కడుతున్నాడు కాని, ముద్దులతో పాటు ఇంకా ఇదమిద్ధం అని చెప్పరాని దాల్చించెక్కతనాన్ని మరీ రసాలూరుతున్నాడు, చవులూరిస్తున్నాడు. రంగం మీదికి, అన్ని వేలమంది జనాల మధ్యకి తన పాటల డబ్బా, డేన్స్ చెయ్యాలన్న తొందరా తప్ప ఇంకేదీ పట్టనట్టొచ్చి నిలుచుంటాడు. న్యాయ నిర్ణేతలు, విమర్శకులు, ప్రేక్షకులూ ఎలా గుచ్చుతున్నా, ఏం అంటున్నా వాడికి ఖాతరు లేదు. వాడి ధ్యాసంతా డేన్సులాడదామనే ఉన్నాది. పాట సిచ్చు నొక్కగానే పాటతో పూర్తిగా తన్మయమైపోయి నాట్యం చేస్తున్నాడు. వాడి ప్రదర్శన వింటూ, చూస్తూ పోతే ఎక్కడా ఏ ఒక్కచోటా కూడా పంట్లో రాయి పడినట్టో, బండి పెట్రోల్లేక గుద్దుకుంటున్నట్టో ‘టక్.. టక్క్…’ అని గుద్దుకోదు:

.

.

ఎందుకురా డేన్స్ చేస్తావు? అంటే వాడికి ఎంత స్పష్టంగా తెలుసునో?! “చూసే మిమ్మల్ని సంతోషపెట్టడానికి! నేను డేన్స్ చేస్తే మీరు నవ్వుతారు. నవ్వటం అంటే సంతొషం అని మా అమ్మ చెప్పిందీ!” అని తడుముకోకుండా జవాబు చెప్పి ముందుకి ఏ పాటకి డేన్స్ చెయ్యమంటావు? అన్నట్టు చూస్తున్నాడు. వాణ్ణి చూస్చూస్చూసి జ్ఞాపకం చేసుకుని మళ్ళీ నా తెల్లంతరాత్మ “ఆనందు కథలు!” అని సలుపుతున్నాది.

2

“Everything that irritates us about others can lead us to an understanding of ourselves.” – Carl Jung

ఇవన్నీ బాల్యాన్ని గురించిన కథలు. చిన్న పిల్లడు చెప్తున్నవి. ఆత్మాశ్రయమైన కథలు. అంతే కాక సాంతం మాండలీకంలో చెప్తున్నవి. నామిని సుబ్రమణ్యం నాయుడు గారి ‘పచ్చనాకు సాక్షిగా’ కోవకి చెందినవి. ఇలా తల్చుకోగానే ఎన్నో ప్రశ్నలే గుర్తొస్తాయి. ఈ తరహా దాల్చించెక్కంటే ఏమంత ఇష్టం లేనివాళ్ళనుండి – ఇంక కథలంటే ఇలా పిల్లలు చిన్నప్పుడు అన్నాలు తిండాలు, స్కూలుకెళ్ళడాలూ ఇవి తప్ప ఇంకేం వస్తువుల్లేవా? చిన్న పిల్లల ప్రపంచం తప్పించి మీకింక ఏ ప్రపంచమూ అవుపడటం లేదా? ‘మంచి’ కథలంటే ఇవేనా? అసలు ఇవి కథలా? ఏవో కొన్ని చిన్నప్పటి జ్ఞాపకం ముక్కలు! కధకులు ఇ… లా… తమ స్వంత గొడవల్నే, అందునా చిన్నప్పటి జ్ఞాపకాల్నే పట్టుకుని వేలాడుతూ ఎంత కాలం, ఎన్ని కథలని రాస్తారిలాగ? అని ప్రశ్నించేవాళ్ళున్నారు. కొందరికి మాండలీకం చదివితే చికాగ్గా అనిపిస్తుంది. పోనీ వస్తువు మాట అలా ఉంచితే, ఈ మాండలీకం గొడవ ఏమిటి? ఇలాటి కథల్ని మాండలీకం లోనే చెప్పాలా? కనీసం సంభాషణల్ని మాత్రం మాండలీకంలో రాసి మిగతా కథని మామూలుగా ‘మన భాష’లో చెప్పొచ్చు కదా? అని ఇలాగ. ఇవి చాల సమంజసమైన ప్రశ్నలు. వాటి వెంబడి ఆలోచిస్తూ, తవ్వుతూ పోతే ఆసక్తి ఉన్నవాళ్ళకి ఇష్టం, సహాయమూ అయ్యే ప్రశ్నలు.

ఈ దాల్చించెక్కతనం ఏమిటో, అదంటే ఎందుకిష్టమో కారణాలు చెప్పలేకపోయినా ఇవి ఇష్టంగా ఉన్నవాళ్ళకి సైతం జీవితం నల్లేరు మీద బండీ ఏం కాదు. వాళ్ళైనా సరే ఒక్కళ్ళూ కూచున్నప్పుడు వాళ్ళ నల్లంతరాత్మ కూడాను ఉండుండి “ఇదేంటి ఈ కథలంటే నీకింత వెర్రి? ఇవే కథలా? జీవితం అంటే ఎంత సంక్లిష్టమైనది. ఎన్నుంటాయి అసలు?! అవన్నీ ఏం పట్టనట్టు ఎంచేపూ ఈ గుంట్నాకొళ్ళ గొడవేనా?” అని అడక్కపోదు. తరచి చూస్తే ఈ రెండు రకాల పాఠకులున్నూ ఇలాంటి కథల్లోని essential mystique అంటే దాల్చించెక్కతనాన్ని గురించే శోధిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నల్ని గురించి ఎంతో కొంత వివేచన చెసి, ఏ కొంతైనా సమాధానం పడలేకపోతే మిగిలే అవగాహన ఒకవైపు విముఖతతో అసహనానికీ, అసహ్యానికీ, ఇంకొక వైపు ఇందుకూ అని చెప్పలేని ఇష్టంతో దురభిమానానికీ, పెత్తనానికీ దారి తీసే ఆస్కారం ఉంది. ఈ రెండూ కాకపోతే మధ్యే మార్గంగా “వారిది అదో పద్ధతి. అదీ బావున్నాది! వీరిది ఇదో పద్ధతి! ఇదీ బావున్నాది మరి!! ఈ అన్ని రకాల పోకడలూ సాహిత్యానికి అవసరమే.” అని ముక్తాయించేది ఉదారవాదం, పెద్దరికం. ఇది అకారణంగా, హేతువుల్ని చూపించకుండా సర్దిచెప్పే వైఖరి కాబట్టి సమాధానాన్ని ఇవ్వలేదు. లోకో భిన్న రుచిః అయితే అయ్యేరు గాని, అలా అనుకుని సమాధాన పళ్ళేకపోతే అప్పుడు – లోకో ఎందుకు భిన్న రుచిః? అని సలుపుతూనే ఉంటుంది.

నందుగాడి కథల తరహా కథలు ఆత్మాశ్రయ కథలు, అందునా బాల్యాశ్రయ కథలు. ఇందుకు భిన్నమైన పోకడల్లోని కథల్ని, భిన్న ధృవాలే అనుకోదగిన కథల్నీ కూడా పరికించి చూస్తే అది నందుగాడి కథల గురించిన వివేచనకు, అవగాహనకు కొంత పనికొస్తుంది. తాత్విక విషయకమైన అవగాహనకి ఇలా భిన్నమైన అంశాల్ని పక్క పక్కన పోల్చి చూసుకోవటం ఆవశ్యకం అనీ, తప్పనిసరీ అనీ ఒక సిద్ధాంతం ఉంది – Jacques Derrida ఆయన అనుయయులూ différance అని ప్రతిపాదించినది. ఏ విషయానికీ స్వతఃస్సిద్ధంగా, నిరపేక్షంగా ఏ అర్థమూ, విలువా ఉండవనీ, అంచేత దాని విలువ చుట్టూ ఉన్న మిగిలిన విషయాల నేపథ్యంలో మాత్రమే తెల్లమౌతుందనీ. (“Meaning isn’t in the signifier itself, but that it only exists in a network, in relation to other things.”) బాల్యాశ్రయమూ, ఆత్మాశ్రయమూ కాని కథలు అనేకం ఉంటాయి – సాంఘిక జీవనం నుండి ఎన్నో రకాల సమస్యల్ని, సన్నివేశాల్నీ వస్తువులుగా స్వీకరించి కట్టేవి. నిజానికి జీవితపు చిక్కు సమస్యల నుండి బాల్యానికి మినహాయింపు ఉంటుంది. పెద్దవాళ్ళ జీవితాలు అలాక్కాదు; వాళ్ళు అభద్రత, జీవిక, దోపిడీ, హింస, అణచివేత, వివక్ష, దారిద్ర్యం, వలస, అనారోగ్యం, సంఘర్షణ వంటి రకరకాల సమస్యల్ని తప్పనిసరిగా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యలు మన దేశం వంటి దేశాల్లోన అత్యధికులు ఏదో ఓ రూపంలో తరచూ ఎదుర్కోవలసినవి. కాల్పనిక సృజన ప్రవృత్తిగా ఉన్న మనుషుల్నీ ఈ సాంఘిక నేపథ్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. Elephant in the room అన్నట్టుగా ఏ మాత్రం విస్మరించలేని ఈ గడ్డు సమస్యల నేపథ్యంతోన ఈ బాల్యాశ్రయ సృజన ఎలా సమాధాన పడుతున్నాది? అతివేలమైన ఆత్మాశ్రయతకు బాగా ఎడం అనిపించే సంఘాశ్రయమైన వస్తువులు, పెద్దవాళ్ళ సమస్యలపైన వీళ్ళకు ఆసక్తీ, పట్టింపూ ఉండవా? ఎందుకూ? వీళ్ళు “పలాయనవాదులా?” సమస్యల్నుండి పారిపోతున్నారా? ఇవి కూడా సమంజసమైనవి, చాల అవసరమైన ప్రశ్నలు. తొందరపడి ఈ పరిశీలనల్లో కథలకి ఒకవైపు సుముఖంగా “సామాజిక స్పృహ” అని, ఇంకొక వైపు విముఖంగా “పలాయన వాదం” అనీ, లేదంటే ఒకటి సత్యమైనదని, నిష్కల్మషమైనదనీ ఇంకొకటి కాదనీ ఇలా లేబిళ్ళు తగిలించడం సహాయకరంగా ఉండదు. ఈ రెండు కోవల్లోనే కాకుండా కాల్పనిక సృజన ఇంకా హాస్య కథలు, డిటెక్టివ్ కథలు, తాత్విక కథలు వంటి అనేకమైన Genreల్లో వ్యక్తమౌతుంది కదా. వీటిలో ప్రతి ఒక్కదానికీ తమవైన పాఠకులు, సంప్రదాయమూ ఉంటాయి. ఇలాంటి భిన్నమైన పోకడల్లోంచి ఆసక్తి ఉన్నవాటిని పక్క పక్కన పోల్చి, దేన్నీ విశేషంగా ఒప్పుకోకుండా, తిరస్కరించకుండా ఒకటికి పది సార్లు పరికించి చూస్తే అది సహాయంగా ఉంటుంది. త్రిపుర వ్యతిరిక్తం, వివాదాస్పదమూ అయిన భిన్నమైన అంశాలని ఇలాంటి వైఖరితోటి, ఏ మాత్రం పట్టు ఒదలనియ్యకుండా పరిశీలించేవారు, ఎదుటివాడితో కలిసి. ఇలాంటి చంక్రమణంలోన అవగాహన ఉంటుంది, పరిశోధన ఉంటుంది, నిర్ధారణ ఎప్పుడో గానీ ఉండదు, అయినా సద్దినట్టు ఉంటుంది – అంటే కొన్ని రకాల సలుపులకి ఝండూబామ్ ఝండూబామ్ నొప్పి హరించే బామ్ లాగ.

నందుగాడి కథల వంటివి స్థూల దృష్టికి చిన్న పిల్లల కథల్లాగ ఉంటాయి గాని, అవి బాల్యం చుట్టూనే కేంద్రీకృతమై ఉండడానికీ, అనేకం పాఠకుల్ని విశేషంగా అలరించడానికీ, అవి తప్పనిసరిగా మాండలీకంలోనే రూపు దిద్దుకోడానికీ శాస్త్రీయమైన కారణాలున్నాయి. ఒకటి Cognitive Science నుండి, దానికి మాతృక వంటిది ఒకప్పటి మనస్తత్వ శాస్త్రం నుండీ, రెండవది పాతకాలపు రస సిద్ధాంతులు రస మతాన్ని, రసానుభవాన్ని గురించి చెప్పిన సంగతుల నుండీ, ఇంగ్లిష్‌లో Aesthetics నుండీ, మూడవది నైసర్గికమైన, అతివేలమైన సృజనశీలతకు ఉదాహరణలుగా ఉన్న సారస్వత కళాకారులు చెప్తూవస్తున్న సంగతులనుండి, వాళ్ళ వైఖరిని పరిశీలించటం వలనా. ఇవి పట్టించుకుంటే చెయ్యవలసిన తవ్వకం చాల విస్తారంగా, సుదీర్ఘంగా పోతుంది. నాకు ఆశైతే ఉంది గాని, అంతలా తలకెత్తుకోడానికి వ్యవధి లేదు. కొన్నైనా పంచుకుని నా తెల్లంతరాత్మ నోరు మూయించాలని, ఇంక లాభం లేదని, ఇంక నష్టమూ లేదని, ఇంకా ఆలస్యం ఎందుకని మరి ఇది రాయడానికే సిలకట్టు ఎగ్గట్టుకుని లడీ అయిపోయేను.

గుర్రం ఆనంద్ ఇప్పటి దాకా రాసిఅన ఐదు కథలూ ఈ లింకులో ఉన్నాయి.
(ఇంకా ఉంది)

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, వ్యాసం and tagged , , , , , , , , , , .

2 Comments

  1. “అబ్బ, చితక్కొట్టీసేవు బెదరు!” గుర్రం ఆనందు గారి కధల పరిచయం అంటూ

    జీవితపు చిక్కు సమస్యలైన అభద్రత, జీవిక, దోపిడీ, హింస, అణచివేత, వివక్ష, దారిద్ర్యం, వలస, అనారోగ్యం, సంఘర్షణ వంటి రకరకాల తప్పనిసరిగా ఎదుర్కోవలసిన సమస్యల గురించి “సామాజిక స్పృహ” తో కూడిన రచనలే కాక సృజనతో కూడిన నందుగాడి కథల తరహా ఆత్మాశ్రయ కథలు, బాల్యాశ్రయ కథలు మనల్ని అలరించడానికీ గల కారణాలను పరమానందంగా ( కులికి సచ్చేంతగా ) వివరించిన మీ తెల్లంతరాత్మ కు వొందనాలు.

    త్రిపుర లా ఊరుకోగలిగినోడు ఉత్తమ యోగివా.. అలా ఊరుకోలేక, కక్కాలేకా మింగా లేకా ఇలా పేట్రిగిపోయినోడిని ఉత్తమ యోగభోగి అనో లేక భోగయోగి అనో అనొచ్చోలేదో.

    బత్తుల ప్రసాద్ గారి గురించి కూడా మీ నుండి వినాలనున్నాది. సిలకట్టు ఎగ్గట్టుకుని లడీ అవ్వరా

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.