cover

సినరాజి – సీమ్మిరపసెట్టు

Download PDF ePub MOBI

మా వొరిగిపల్లి ఇస్కూల్లో ఒగిటో తరగతి నుంచి అయిద్దాకా వుండేది. నేను ఒగిటో తరగతిలో వుండేటప్పుడు మూడంకనాల పూరిల్లది. నేను మూడోతరగతికొచ్చేటప్పటికి మూడంకనాల సీమ్పెంకులిల్లు దాన్తోపాటు తాల్వారం గూడా కట్టినారు. ఇస్కూలుకు సుట్టూ గోడగూడా గట్న్యారు. రోడ్డుకానుకోనుండేది మా ఇస్కూలు. ఒంటికి బెల్లు గొట్టంగానే మొగపిలకాయిలు రోడ్డుకవతల బొయ్యి పనిగానిచ్చేవారు.

మేము ఆడపిలకాయిలంతా కలిసి వొడ్డిగుడ్సిలికానుకో నుండే సింతమాన్లకల్ల బొయ్యేవోళ్లం. ఆడ పేండదిబ్బలుండేవి. ఆ దిబ్బల సుట్టూ ఎర్రమన్ను గెట్లు దిబ్బలకు గోడగట్టినట్ల. వాటిపైన సీమ్మిరపసెట్లుండేవా? సెట్టూ, పూత మిరపసెట్టు మాదిరేవుంటాది గాని కాయలు గాయవులే.

నేను ఒగిటో తరగతిలో సేరినానా. మాయక్క అప్పిటికే మూడో తరగతిలో వుండాది. దిబ్బలకాడికి బొయినాక ఒక సెట్టుసుట్టూ పుల్లతో మన్ను దొవ్వి సుట్టూ పాది జేసింది మాయక్క. మాయక్కకు మా పెద్దమ్మ కూతురు లలితక్క, దయామణి కూడా సగాయం జేసినారు. పాది నుంచి ఒక మూరెడు పొడుగు కాలవదీసి మల్లీ ఆడ అరిసెయ్యడల్పుగా పాది జేసినారు. అంతొరకు నన్ను వొంటికి బొయనీలేదు మాయక్క. తొవ్వి పాది జేసేది అయిపోయినాక సిన్నపాదికూడ కూసోమనింది అది కాలవగుండా ఆసెట్టుపాదిలో పడేట్టుగా పుల్లతో సరిజేస్తానేవుంది మాయక్క. ఇదినేను ఇస్కూల్లో జేరిన మొదటి దినం జరిగింది.

ఆడ పిలకాయిలంతా తలా ఒక సెట్టుకు అట్లా పాది జేసుకోనుండారా. ఆ పనయిపోంగానే ఎవురి సెట్టు ఎంతబాగా పెరిగిందా అని సూసుకుంటావుండాము. అందురివి కొంచిం ఎక్కువతక్కువగా ఒగే మాదిరిగా వుండాయి. వాటి మద్దెన ఒకటి మాత్రం పెద్దపొద మాదిరిగా గుబురుగా పెరిగుండాది.

నేను ఇస్కూల్లో సేరిన మూడోదినం పుల్లూరోళ్ల నీల ఇస్కూల్లో సేరింది. ఆ బిడ్డి వర్సకు నాకు పెద్దమ్మ కూతురు. ఎప్పుడెప్పుడు వొంటికి బెల్లుగొట్తారా అని కాసుకోనుండాన్నేను. నీలావాళ్లిల్లు ఇస్కూలుకు కొంచిం దెగ్గిరే. ఆ బిడ్డి ఇంటికి పరిగెత్తతావుంటే దాని పావడ బట్టి ఈడ్సుకోనొచ్చి అందురి సెట్లను సూపించి ఆ బిడ్డికి ఒక సెట్టుకాడ గుంత జేసియ్యమని మాయక్కకు సెప్పినాను.

మర్సనాడు గాండ్లకొత్తూరు అంసవేణి మా కలాసులో సేరింది. నీల, నేను కలిసి వొంటికి బోసే సెట్ల గురించి సెప్పినాము. బెల్లు గొట్టంగానే ఆడికి పరిగెత్తి పోయినాము. పొయ్యీపోంగానే ఆ బిడ్డి నాకీ సెట్టే గావాల అని మేము ఆ బిడ్డికోసం ఇంగో సెట్టెతకతా వుంటే పెద్దసెట్టు దెగ్గిర పని కానిచ్చేసింది. అప్పుడొచ్చింది రొండో తరగతి సదివే సినరాజి.

‘యానాసవితే నా సెట్టుకు నీళ్లు బోసింది’ అని నడుంమింద సెయిబెట్టుకోని పోజు బెట్టింది సినరాజి. అంసవేని అని ఐదారు మంది ఒగేసారి అర్సినారు. వాళ్లిద్దురిదీ గాండ్లకొత్తూరే. అంతే సినిరాజి బొయ్యి ఆ బిడ్డిని కిందదోసి మింద బడింది. మాయక్కావాళ్లు బొయ్యి సినరాజిని పైకిబట్టి ఈడ్సినారు. ఉడుం పట్టుబట్టి ఆ బిడ్డి అంసను వొదిలిపెడ్తేనా?

ఎవురిబొయ్యి సెప్పినారో సిన్నయివోరు బెత్తమెత్తుకోనొస్తావుండాడు. అయివోరొచ్చేది జూసి అంతా ఇస్కూలుపక్క పరిగెత్తినాము. ఇంగాపొద్దు మద్దేన్నందాకా పాటాలు జరగలా. సిన్నయివోరు, పెద్దయివోరు ఆండ పిలకాయిల్ని బిల్సుకోని మద్దిస్తం బెట్యారు. ‘యశోదా నువ్వు జెప్పు ఏం జరిగిందో’ అని పెద్దయివోరడిగినాడు.

‘నేనాడలేన్సా, తెల్తార్తో సద్దాగలేదు. మా యమ్మ ఇంట్రెల్లప్పుడు రమ్మనుంటే ఇంటికి బొయ్యి సంగట్దినొచ్చినా’ అనింది. ‘సాయిత్రీ నువ్‌ జెప్పు’ అడిగినాడు సిన్నయివోరు.

Irlachengi Kathalu 3‘మేమంతా వొంటికి బోసి ఒక్కొరొక్కోసెట్టును సాక్కుంటా వుండాం సా. అంసా కొత్తగా వొచ్చిందా. ఆ బిడ్డి కోసం దేవకి, నీలా సెట్టుగ్గుంతజేస్తావుంటే సినరాజి సెట్టు పెద్దదిగా వుండాదా దాంట్లో బొయ్యి పోసేసింది. సినరాజి అంసాను బాగా కొట్టింది సా’ అని సెప్పిందా బిడ్డి. అయివోర్లిద్దురూ ఒగురి మొగం ఒగురు జూసుకోని నవ్వుకున్న్యారు.

పెద్దయివోరు సినరాజిని సెయిజాపమని బెత్తంతో లెక్క బెట్టి పద్దెబ్బలు కొట్న్యాడు. యాడస్తావున్ని అంసను ఓదార్సినాడు.

మద్దేన్నం అంసవేణి అయిపులేదు. బెల్లుగొట్టంగానే పలకాబలపం దీసుకోని గాండ్ల కొత్తూరు పక్క పరిగెత్తిందని సూసినోళ్లు సెప్పినారు.

మర్సనాడు ఆ బిడ్డి ఇస్కూలుకు బోనని మొండికేసిందంట. ఎక్కిళ్లు బెట్టి యాడస్తావున్ని ఆ బిడ్నెత్కుకోని వాళ్లనాయిన సామిరెడ్డి, వాళ్లమ్మ ఆదెమ్మ ఇస్కూలుకొచ్చినారు.

ఏంజెయ్యాలో తెలియక అయివోర్లిద్దురూ తలలు బట్టుకున్న్యారు. వాళ్లకెంతగానో జెప్పి అంసవేణిని తరగతిలో కూసోబెట్టి పొమ్మన్న్యారు. ఆ బిడ్డి వాళ్లమ్మ సంకదిగితే కదా!

మళ్లీ అయివోర్లు సినరాజిని పిల్సినారు. ‘అంసా ఇస్కూలుకు రానంటావుంది. ఆ బిడ్నెందుకు కొట్న్యావో సెప్పు’ అని గెద్దించినాడు పెద్దయివోరు.

‘నేను తెల్లారినప్పిట్నుంచి కుండెడు నీళ్లు దాగి తూముడుచ్చలు బోసి పెంచుకుంటా వుండాన్సా. నా సెట్లో బోసింది. అది రేపు ఆ సెట్టు నాది అనొస్తాదని కొట్న్యాను’ అని ఆ బిడ్డి గూడా కండ్ల నీళ్లు బెట్టుకొనింది. నవ్వాలో, యాడ్వాలో తెలీలేదు అయివోర్లకి.

అంసాను అయివోర్లెత్తుకోని, ముద్దుబెట్టుకోని, గెడ్డం బట్టుకోని అంగిట్లో కిచ్చిలి పప్పురమెంట్లు గుప్పెడు దెచ్చి సంచిలో బోసినాక ఇస్కూల్లో వుంటాననింది.

‘మనం సెట్లను సినరాజికంటే పెద్దవిగా సాకి ఆ బిడ్ని ఓడిస్తాం’ అని నీల, నేను అంసతో అన్న్యాము.

మర్సనాడు మడికి సల్లడానికి తెచ్చిన సల్పేటును మూడు కాయితాల్లో పొట్లం గట్టుకోని పలకాబలపంతో బాటు సంచిలో బెట్టుకున్న్యాను నేను.

*

Download PDF ePub MOBI

కినిగె పత్రిక నుంచి రెగ్యులర్ అప్డేట్ల కోసం పత్రిక ఫేస్బుక్ పేజి ని లైక్ చెయ్యండి.

Posted in 2014, ఇర్లచెంగి కథలు, జులై, సీరియల్ and tagged , , , , , , , .

5 Comments

  1. మీ రచనలో మాండలికం బాగా మాగింది, ఈ మాగడం వలన అలవోకగా చిత్తూరు గ్రామీణులు మీ కలంలో బందీ చేయబడినారు. మీ సహజ చిత్రణ పాఠకులను ఆకట్టుకొనడమే కాకుండా హాయిగా చదివిస్తుంది. అభినందనలు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.