cover

పదనిష్పాదన కళ (13)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

II. విశిష్ట నామవాచకాలు (Proper Nouns) :-

ఏ భాషావ్యాకరణంలోనూ విశిష్ట నామవాచకాల నిర్మాణ నియమాలకి స్థానమిచ్చినట్లు కనిపించదు. కానీ ఇవి కూడా అర్థవం తమైన పదాలే. ఇతర పదాలలాగానే వీటిని కూడా తఱచూ ఉపయోగించాల్సి వస్తుంది. ఒకే పదం, లేదా సమాసంతో వివిధ వస్తువులకీ, వ్యక్తులకీ, ప్రదేశాలకీ పేరుపెట్టాల్సివస్తుంది. కనుక ఇవి కూడా భాషలో భాగమే. వీటిని నిర్మించాలన్నా కొన్ని నియమాలుంటాయి. వ్యక్తుల పేర్లని వదిలేస్తే సార్వజనీనంగా ఉపయోగపడేలా నిష్పాదించదగ్గ విశిష్ట నామవాచకాలు 1. ఊళ్ళ పేర్లు 2. పేటల పేర్లు 3. వీథుల పేర్లు.

మనం పుట్టకముందే దేశమంతా ఊళ్ళు ఏర్పడ్డాయి. వాటికి మన పూర్వీకులే పేర్లుపెట్టారు. ఉన్న ఊళ్ళే ఇంకా ఇంకా విస్తరిస్తున్నాయి. అందువల్ల కొత్త ప్రదేశాల్లో కొత్త ఊళ్ళు కట్టే అవసరమూ లేకపోయింది. కనుక మన కాలానికి ఊళ్ళ పేర్లని కొత్తగా నిష్పాదించే ఆవశ్యకతా లేకపోయింది. కానీ ఉన్న ఊళ్ళల్లో కొత్తకొత్త పేటలూ, బస్తీలూ వెలుస్తూనే ఉన్నాయి. అయితే వాటికి పెడుతున్న పేర్లు చాలా సందర్భాల్లో అర్థరహితంగా, వైవిధ్యహీనంగా ధ్వనిస్తున్నాయి. ప్రతీ పేటా ఏదో ఒక ‘నగర్’ లేదా ‘పురం’ మాత్రమే. వేఱే విధమైన శైలిలో పేరు కనపడదు. ఇవి ఉత్తర భారతీయుల్ని చూసి పెట్టుకున్న భావదారిద్ర్యపు వాతలని నా అభిప్రాయం. ఉత్తరభారతదేశంలోని ఊళ్ళ పేర్లు వేలాది సంవత్సరాల ఉచ్చారణప్రక్రియలో గుర్తుపట్టలేనంతగా అరిగిపోయి, తఱిగిపోయి, విఱిగిపోయి మారిపోయాయి. అందుచేత అవి ఈనాడు అర్థరహితంగా ధ్వనిస్తాయి. అందుకని ఆధునిక ఔత్తరాహులు తమ ప్రదేశనామాల్ని కాస్త అర్థవంతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ప్రముఖుల/ దేవతల పేర్లని ‘నగర్, పూర్’ అనే పదాలతో సమాసించి పేర్లు పెట్టుకోసాగారు. ఈ క్రమంలో ప్రదేశ నామాలన్నీ దేశివాసనల్ని పోగొట్టుకొని మొత్తం సంస్కృతభూయిష్ఠమే అయిపోయాయి. ప్రదేశాలకి నామకరణం చేయాలంటే వారి భాషల్లో ఇంతకన్నా వేఱే పదాలు లేకపోవడం వల్లనే ఇలా జఱుగుతోందనేది అవబోధ్యం. కానీ ఆ లేమిని మనం ఫ్యాషన్ అనుకోవడమే హాస్యాస్పదం.

గత కొద్దికాలంగా కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు పట్టణాల/ నగరాల చుట్టూ ఉన్న శివారు గ్రామాల్లోని ఖాళీ స్థలాల్నీ, పొలాల్నీ ఎకరాల కొద్దీ కొనేసి, వాటికి ఇలాంటి హిందీ, ఇంగ్లీషు పేర్లు పెడుతూ, స్థానిక చరిత్రా, సంప్రదాయమూ భూస్థాపితం కావడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఊళ్ళ పేర్లని మార్చడానికీ, తాజ్ మహల్ ని కూలగొట్టడానికీ పెద్ద తేడా ఏమీ లేదని ఇలాంటివారు గ్రహించే రోజు రావాలి. నిజానికి మనకా ఖర్మ లేదు. మన భాషలో ఊళ్ళ పేర్ల కోసం చాలా పదాలున్నాయి. మనవారు పెట్టిన ఊళ్ళపేర్లలో ‘నగర్‌లు’ చాలా అరుదు. అలా ఉన్నవి గత 150 ఏళ్ళల్లో మాత్రమే ఏర్పడి ఉండొచ్చు. అక్కడక్కడ కొన్ని ‘పురాలు’ లేకపోలేదు కానీ తక్కువే.

అచ్చతెలుగు ఊళ్ళపేర్లు అర్ధం, పర్ధం లేని కేవల శబ్దసౌందర్యాలు కావు. వాటిల్లో ప్రతి ఒక్కటీ ఏదో ఒక గట్టి కారణం చేత ఏర్పడినటువంటిది. అవి అర్థవంతమైనవీ, సప్రయోజనమైనవీ, సహజమైనవి. ఒకప్పటి తెలుగుదేశపు భౌగోళిక స్వరూపమూ, పరిసరాలూ, స్థానిక చరిత్రా, సంస్కృతీ వాటి ద్వారా ద్యోతకమౌతాయి. ఉదాహరణకి – ‘కొఱ్ఱపాడు’ అంటే ఒకప్పుడు అక్కడ కొఱ్ఱలు పండించేవారని, వఱి తినేవారు కాదనీ తెలుస్తుంది. ‘భీమడోలు’ అంటే భీముడి ప్రోలు. చాళుక్య రాజవంశానికి చెందిన భీముడనే రాజు కట్టించిన ఊరు అని వెల్లడవుతుంది. కంకణాల పల్లి అంటే ఒకప్పుడు అక్కడ కంకణాల తయారీ పరిశ్రమ ఏదో ఉండేదని అర్థమవుతుంది. ఈ కాలంలో ఇంత వాస్తవికంగా, అర్థవంతంగా పేర్లుపెట్టడం అరుదు. విశాఖలో ఉక్కునగరం, అదిలాబాదులో కాగజ్ నగర్ లాంటివేవో మూణ్ణాలుగు పేర్లు తప్ప ఎక్కువ భాగం అవంతీనగర్, అయోధ్యానగర్ వంటి అసందర్భప్పేర్లే. ఈ అసందర్భ నామాలతో సమస్య ఏంటంటే, ఇవి సదరు ప్రాంతపు వివరాలేవీ భావితరాల కోసం నమోదుచేయవు. పైపెచ్చు ఆ ప్రాంతం ఏదైతే కాదో ‘అదే అది’ అని భావితరాలు పొఱపడే సంభావ్యత కూడా ఉంటుంది.

తెలుగుదేశంలోని ఊళ్ళపేర్లూ, పేటల పేర్లూ అచ్చతెలుగులోనే ఉండడం వాంఛనీయం. ఈ పేర్లు ఇతర భాషల వారెవఱూ పెట్టుకోరు. మనం కూడా పెట్టుకోకపోతే ఎలా? వారు మన పేర్లు పెట్టుకోరు కనుక మనం కూడా వారి పేర్లు పెట్టుకోవలసిన అవసరం లేదు. కనుక పేర్ల విషయంలో మనవారు అంటించుకొన్న ఈ సంస్కృత–హిందీ–ఆంగ్ల వ్యామోహాల మిసిమి జిడ్డుని ఇహనైనా వదిలించుకోవాలి. తెలుగుపేర్లలో గుబాళించే స్వచ్ఛతనీ, జాతీయతనీ, మన తాతముత్తాతల నిరాడంబరతనీ, మాతృభూమి మట్టివాసననీ ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఒడీషా దాటి తెలుగ్గడ్డలోకి రైలుబండి ప్రవేశించినప్పుడు ఒడియా పేర్ల బదులు వరుసగా ‘ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాళి…’ అని తెలుగుపేర్లు కనిపించడం మొదలైతే ఆ ఆనందమే వేఱుగా ఉంటుంది. ఏమో, ఎవఱికి తెలుసు? మనకిప్పుడు ఉన్న ఈ ఒక్క తెలుగుదేశమే కాక, భవిష్యత్తులో ఎన్నో తెలుగుదేశాలు ఏర్పడవచ్చు. అప్పుడు ఆ దేశాలలో కొత్త ప్రదేశాలకి పేర్లు పెట్టేటప్పుడు పూర్వపు తెలుగువారు ఏ పదాల్ని ఉపయోగించారో మనం కూడా అదే పద్ధతిలో పేర్లుపెట్టాలి. అందుకోసం ఉపకరించే 30 ముఖ్యమైన పదాల గుఱించి మనమిక్కడ చర్చిస్తున్నాం. ఈ క్రింది ఉదాహరణల్ని పరిశీలించండి :

అంకి/ అంగి: జలదంకి, పోరంకి, వెల్లంకి, రేలంగి, చొల్లంగి, కోరంగి, మున్నంగి, వడ్డంగి, బాడంగి, బాసంగి, బోణంగి, మేరంగి, పండ్రంగి.

ఆం: ఉర్లాం, తెర్లాం, రాజాం, బుద్ధాం, మడపాం, కురుపాం.

ఊరు: అబ్బూరు, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కొండూరు, కొమ్మూరు, కోడూరు, కొల్లూరు, పాలమూరు, కైకలూరు, వేమూరు, నండూరు.

ఏఱు: గుడ్లవల్లేఱు, దత్తిరాజేఱు, పెదపుల్లేఱు, పాలకోడేఱు, పాడేఱు, పీలేఱు, చెయ్యేఱు, లావేఱు, బాలేఱు, కూనేఱు, పెల్లేఱు, వావిలేఱు, మాఱుటేఱు.

ఏడు: కారంచేడు (కాఱుమంచి + ఏడు), ఏర్పేడు, జుఱ్ఱేడు, పెంచేడు, వెల్చేడు, చౌటపుత్తేడు.

కల్లు: ఓరుగల్లు, గుంతకల్లు, కొడవటికల్లు, చెవిటికల్లు, మాగల్లు, పొన్నెకల్లు, నెమలికల్లు, రాయకల్లు, చాగల్లు, మోగల్లు.

కుంట/ గుంట/ కుంట్ల/ గుంట్ల: జమ్మికుంట, కర్లకుంట, నీళ్ళకుంట, బిట్రగుంట, రేణిగుంట, దూబగుంట, ఎఱ్ఱగుంట్ల, గోనుగుంట్ల.

కుప్పం: పాదిరికుప్పం, బీరకుప్పం, ఏకాంబరకుప్పం, రామకుప్పం.

కొండ/ గొండ: గోల్కొండ, నల్లగొండ, హనుమకొండ, సింగరాయకొండ, తాడికొండ, కోరుకొండ, మణికొండ, బెల్లం కొండ, ఋషికొండ, ఉరవకొండ, కొలనుకొండ, పత్తికొండ, అఱగొండ, కలువకొండ, ధేనువకొండ, పెనుగొండ.

కొలను: ఎలకొలను, గుండుగొలను.

కోట: మానుకోట, దేవరకోట, సారవకోట, తుమృకోట, కాండ్రకోట, దంతవరపు కోట, లక్కవరపు కోట, కామవరపు కోట, రుద్రకోట.

గిరి: వెంకటగిరి, పుష్పగిరి, యాదగిరి, ఉదయగిరి.

గుట్ట: పంచగుట్ట, చాంద్రాయణగుట్ట, కీసరగుట్ట.

గూడెం: హనుమంతునిగూడెం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొత్తగూడెం, కొమ్ముగూడెం, కొయ్యలగూడెం, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం, ఎర్నగూడెం, పంగిడిగూడెం.

చెఱువు/ చెర్ల/ జెర్ల: పొట్లచెఱువు (పటాన్ చెఱువు), దామరచెఱువు, ములకల చెఱువు, మునగచెర్ల, చేజెర్ల, వెలి చెర్ల, వేడిచెర్ల, రెడ్డిచెర్ల.

పట్నం: ఇబ్రహీంపట్నం, నిజాంపట్నం, ఆమోదగిరిపట్నం, కృష్ణపట్నం, రామాయపట్నం, విశాఖపట్నం, భీముని పట్నం, మచిలీపట్నం, పురుషోత్తమపట్నం, పెదపట్నం, రాయభూపాలపట్నం, తమ్మినపట్నం, గంగపట్నం, కొత్త పట్నం, ప్రభాగిరిపట్నం.

పఱ్ఱు/ వఱ్ఱు: డోకిపఱ్ఱు, గఱికపఱ్ఱు, పెదపులివఱ్ఱు, చింతపఱ్ఱు.

పల్లి/ పల్లె/ బల్లె/ మల్లి/ వల్లి/ విల్లి: చల్లపల్లి, కొండపల్లి, ముదినేపల్లి, పెద్దపల్లి, లంకపల్లి, రేపల్లె, కళ్ళేపల్లి, తోటపల్లి, కోటిపల్లి, వాడపల్లి, గూడవల్లి, మందవల్లి, కుముదవల్లి, ఖండవల్లి, ఎడవల్లి, ఉత్తరవల్లి, పెనుబల్లి, అరసవిల్లి, భట్న విల్లి, ఐనవిల్లి, మెతుకుమల్లి.

పాక/ పాకం/ వాక: పందలపాక, తాటిపాక, ఈశ్వరవాక, అక్కఱపాక.

పాడు: అడవిరావులపాడు, అన్నవరప్పాడు, అగతవరప్పాడు, తోటరావులపాడు, దొండపాడు, దోసపాడు, మూలపాడు, తక్కెళ్ళపాడు, ముక్కెళ్ళపాడు, తునికిపాడు, ముండ్లపాడు, నల్లపాడు, గోగులంపాడు, కంకిపాడు.

పాలెం: చలివేంద్రపాలెం, మర్లపాలెం, కర్లపాలెం, బుఱ్ఱిపాలెం, బుచ్చిరెడ్డిపాలెం, అంకిరెడ్డిపాలెం, ఇసుకపాలెం, తిమ్మాయపాలెం, కమ్మవారిపాలెం, ఎగువరాజుపాలెం, ఉడతావారిపాలెం.

పూడి/ మూడి: గొల్లపూడి, మామిడిపూడి, గుడిపూడి, చింతలపూడి, కూచిపూడి, మఱ్ఱిపూడి, బేతపూడి, ద్వార పూడి, తుమ్మపూడి , జాగర్లమూడి, వడ్లమూడి, కత్తిపూడి, గొరగనమూడి.

పేట: నరసరావుపేట, చిలకలూరిపేట, వేగాయమ్మపేట, మండపేట, రంగంపేట, జగ్గయ్యపేట, జగ్గంపేట, ఆదివార ప్పేట, ఫరీద్ పేట, సీతంపేట, లక్ష్మీనరసుపేట, కామేశ్వరపేట, అక్కులపేట,

ప్రోలు/ ఓలు/ వోలు: రాయప్రోలు, భట్టిప్రోలు, పెనుగంచిప్రోలు, తేలప్రోలు, గొల్లప్రోలు, చిఱువోలు, మల్లవోలు, రాజోలు, ఒంగోలు, చనుమోలు, కనుమోలు, చందవోలు, బేతవోలు, కైకవోలు, ముచివోలు, బోగోలు, పొన్నవోలు, కొప్పోలు..

మిల్లి: చెఱుకుమిల్లి, జఱుగుమిల్లి, బంటుమిల్లి, మారేడుమిల్లి, ఎఱ్ఱమిల్లి, జీలుగుమిల్లి.

వరం/ ఆరం: భీమవరం, ఐతవరం, అన్నవరం, మైలవరం, రాయవరం, చోడవరం, కృష్ణవరం, గంగవరం, మాచవరం, గోకవరం, ముమ్మిడివరం, లింగవరం, పోచారం, మేడారం (మేడివరం).

వాడ/ ఆడ: గుడివాడ, బెజవాడ, చిఱివాడ, వేములవాడ, పూడివాడ, చదలవాడ, సయ్యద్ వాడ, సిరివాడ, గోవాడ, బీతివాడ, సతివాడ, తొండవాడ, కొణితివాడ, పెన్నాడ, జొన్నాడ, గొల్లల మామిడాడ, దుర్గాడ, కూరాడ, ఉప్పాడ, నిమ్మాడ, అరసాడ, చింతాడ, డెంకాడ, గంగాడ, గంట్యాడ, కొమరాడ, కోనాడ, మెంటాడ, వేపాడ, చిత్రాడ.

వీడు: కొండవీడు, కన్నెవీడు, గోసవీడు, అర్ధవీడు, సత్యవేడు.

లంక: బొబ్బరలంక, ఏనుగువాని లంక, అన్నవరపు లంక, కొత్తలంక, సానపల్లిలంక, ఊబలంక, గాడిలంక, చెముడు లంక.

వలస: కొత్తవలస, చిట్టివలస, ఆముదాల వలస, రావివలస, మడ్డువలస, తాడివలస, జియ్యమ్మవలస, నాత వలస, డొంకినవలస, రెల్లివలస, నారాయణప్పవలస, కూనాయ వలస.

సాగరం/ సముద్రం: లింగసముద్రం, తిమ్మసముద్రం, అప్పాసముద్రం, కంపసముద్రం, గోపసముద్రం, అనుమ సముద్రం, రంగసముద్రం, నాగసముద్రం.

పైన పేర్కొన్నవే కాక, ‘గడ్డ, వంచ, లోవ, కోన, తోట, తిన్నె(దిన్నె), తిప్ప, తుఱ్ఱు, మఱ్ఱు, మాను, మంగళం, వేడు/ మేడు, మంచి, కండ్రిక(గ), మిట్ట, బండ, కుదురు, కుఱ్ఱు, కొటిక, మడుగు’ అనే సమాసావయవాలతో కూడా తెలుగు ఊళ్ళపేర్లు ఏర్పడతాయని గమనించవచ్చు. కానీ ఇవి ఎడాపెడా ఒకే అర్థంలో వాడదగ్గవి కావు. వీటిల్లో ప్రతిదానికీ ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఉదాహరణకి – ‘లోవ’ అంటే లోయ అని అర్థం. ‘కోన’ అంటే చిట్టడవి. ‘కండ్రిగ’ అంటే సాగుచేయదగ్గ భూమి. ‘వలస’ అంటే బయటినుంచి వచ్చినవారు కొత్తగా కట్టుకొని స్థిరపడ్డ ఊరు (colony). ‘లంక’ అంటే చుట్టూ గానీ, మూడువైపులా గానీ నీళ్ళున్న ప్రదేశం. ‘కల్లు’ అంటే పెద్ద ఱాయి, కొండ, గుట్ట. ఈ విధంగా వీటికున్న అర్థాల్ని సమీచీనంగా తెలుసుకొని ఆ అర్థంలోనే సమాసించాలి.

 (తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, పదనిష్పాదన కళ, సీరియల్.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.