త్రిపుర కథ నిద్ర రావడం లేదు

నిద్ర రావడం లేదు

Download PDF    ePub   MOBI
త్రిపుర కథలపై చాలా సులువుగా “అబ్సర్డు”, “సర్రియలిస్టిక్” ముద్రలు వేస్తారు. నిజానికి త్రిపుర కథల్లో సింహభాగం వాస్తవిక (రియలిస్టిక్) ధోరణిలో సాగేవే. కానీ ఆయన వచనం ఆ వాస్తవికతలోని కవిత్వాన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటూ, ఆ ఎంపికను పాఠకుల ముందు ప్రదర్శనగా గాక తనకై తాను, తనలో తాను గొణుక్కుంటూ చెప్పుకు పోవటం వల్ల, అది అందరికీ అంత తొందరగా అర్థం గాక, పై ముద్రలకు తగిన రచనలకు కూడా ఆ అర్థంకానితనం ఒక లక్షణం కాబట్టి, త్రిపుర కథలకూ అవే ముద్రల్ని అతికిస్తారు.
ఒక్క “భగవంతం కోసం”, “వలసపక్షుల గానం” కథల్లో మాత్రమే అసంగత, అధివాస్తవిక ఛాయలు కనిపిస్తాయి. “భగవంతం కోసం”లో కూడా కథనం అంతా వాస్తవిక ధోరణిలోనే సాగుతుంది. కథ మాత్రమే అసంగత ఛాయలు కలిగి ఉంటుంది. (తన అస్తిత్వానికి అర్థాన్నివ్వగలిగే దైవం ఉనికి కోసం మనిషిలో అప్రత్యక్షంగా ర్సాగే నిరీక్షణకి ఈ కథ ఒక పేరబుల్. ఈ ఇతివృత్తం అబ్సర్డ్ రచయితలుగా అంతా పేర్కొనే బెకెట్, కామూల రచనలకు దగ్గరగా ఉంది. కనుక దీన్ని అబ్సర్డు రచన అనటం సబబే.) ఇక “వలసపక్షుల గానం” కథని అధివాస్తవిక కథగా కనిపింపజేసే ఉపకథలన్నీ నిజానికి వేర్వేరు కాఫ్కా రచనల్ని ఒక చోటకి ఏరి తెచ్చి చేసిన స్వేచ్ఛానువాదాలు (నేరేటర్ భగవంతం కోసం బయల్దేరి అతని ఇల్లు కనుక్కుని అతనక్కడ లేకపోవటం, బస్సులో బిల్డింగు కాంట్రాక్టరు చెప్పే ఒక మధ్యాహ్నం నాటి సంఘటన, అలాగే వీరబాహు చెప్పే గోడ ముందు నిలబడే ఐదుగురి కథ… ఇవన్నీ కాఫ్కా అనువాదాలే.) వీటిని మినహాయించి చూస్తే “వలసపక్షుల గానం”లో మరీ అంత అర్థం కాని అధివాస్తవిక అంశాలేవీ లేవు.
పోతే, ఈ “నిద్ర రావడం లేదు” అన్న కథ మాత్రం పూర్తిగా అధివాస్తవిక ధోరణిలోనే సాగుతుంది. ఇది 1988లో రాశారు. త్రిపుర కథల్లో అబ్సర్డూ, సర్రియలిస్టిక్కూ ఏమన్నా ఉంటే అది ఇదొక్కటే. నెలకొక పాత రచన ఇవ్వాలన్న ఆలోచన ప్రకారం ఈ నెల త్రిపుర కథా సంపుటిలో చేరని ఈ కథని ఇస్తున్నాం.

నిద్ర రావడం లేదు

రైళ్ళు కుడి చెవిలోంచి దూరి ఎడమ చెవిలోంచి పైకి పోతున్నట్లు, ఎడమ వేపు తిరిగి పడుకుంటే ఎవరో ఎర్రటి గోళ్ళతో మెడపట్టుకుని చీరుతున్నట్టు, కుడి వేపు తిరిగితే డేల్మేషన్ కుక్క, ఎలుగుబంటి లాంటిది, ఆకురాయిలాంటి నాలికతో పరపర నాకుతున్నట్లు…

లేచి, అద్దంలో చూసుకుంటే కళ్ళల్లో ఒక్క అయోటా అయినా నిద్ర కనిపించదు. రిస్ట్‌వాచ్‌లో కాలం ఘోరంగా ముందుకు రాత్రిలోంచి తోసుకుంటూ… రెండు గంటల యిరవయి నిమిషాల పదహారు సెకండ్ల… పదిహేడు…

జగ్‌లోంచి మెల్లగా గ్లాస్‌లో నీళ్ళు పోసి మె…ల్ల…గా తాగి, ఆవులించి, పక్క మీద పల్లె పువ్వులాంటి షీట్ మీద ఒళ్ళు విరుచుకుంటూ పడుకుని – నటన – మళ్ళీ ఆవులిస్తూ, కళ్ళు మూసుకుని, ఆ క్షణంలో నిద్రపోయేవాడిలా – అంతా నటన – ఒళ్ళు కొంచెం ముడుచుకుని – అంతా ఎంత నటన – మిల్లులో నలిగి అలిసిపోయిన  పెద్ద కూలీలాగ… ఏవో కలలొస్తున్నట్లు ఊహించుకోబోతూ వుంటే… డేల్మేషన్ గుర్రుమంటూ నాలికతో… ఈసారి ఎముకల్ని గీరుతున్నట్లు. ఆ ఎవరివో గోళ్ళు, పారల్లాంటి గోళ్ళు, మెడలో గుచ్చుకుంటున్నాయి.

“పాత విషయాలు, తియ్యటివి, ఏవో జ్ఞాపకం తెచ్చుకుంటూ పడుకో” అని ఎప్పుడో అన్నాడు భుజంగం ది సైకో అనలిస్ట్… పెన్సిల్ చెక్కుతూ దోసకాయ తరిగినట్లు తరగబడిన ఎడమచేతి చూపుడు వేలూ, అమాయకంగా పుస్తకం తీసి దుమ్ము దులుపుతుంటే క్రూరంగా కుట్టిన ఎర్ర తేలూ, పరధ్యాన్నంగా ఎదురింటి వేపు చూస్తుంటే తన వేపే ఎప్పుడూ కళ్ళప్పజెప్పి చూస్తుంటాడని భర్తతో రిపోర్ట్ చేసిన మహా యిల్లాలూ, కటకటాల్లో ఏమీ తోచక పెడితే మళ్ళీ తిరిగి రాదనుకున్న కుడికాలూ, ఆకాశం అంత న్యూస్ పేపర్ పేజీలో బొక్కి పన్నులాగ నా నంబరే లేని ఫరీక్షా ఫలితాలూ…..

యివీ.

ఎవరివో ఆ గోళ్ళు జూగ్యులర్ రక్త నాళంలోకి గుచ్చుకుని…

డేల్మేషన్ స్థిరంగా కూచుని ఎముక చుట్టూ మిగిలిన మాంసాన్ని చీకుతూ…

“అది కూడా పని చెయ్యకపోతే గొర్రెల్ని లెక్క పెట్టు. వెస్టర్నర్స్ అలాగే చేస్తారు” అన్నాడు ఈ మధ్యనే భుజంగం ది సైకో. భుజంగానికి క్లయింట్స్ లేరు. సెల్ఫ్ మీదనే ప్రయోగాలు. దారిన పోతూంటే నేనొకణ్ణి దొరికాను. మొత్తం ఇద్దరు.

… తొమ్మిది వందల తొంభయి ఆరు… తొమ్మిది వందల తొంభయి ఏడు… ఎన్నో వందల నలభయి ఎనిమిది… ఎన్నో వందల నలభయి తొమ్మిది…

గొర్రెల్ని దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. చూసినట్లు జ్ఞాపకం లేదు. చాలా కాలం నుంచీ నాలో ఒక ఊహ. పల్లెటూర్లో నాకో ఇల్లు. గజపతి నగరంలో? కారంపూడిలో? తాడి, దువ్వాడ, బండ మీద? కమ్మ పల్లె? నాకో పెద్ద పొలం. “మాగాణి”. నాకో రైతు. వెంకయ్య? ఈరినాయుడు? గురప్ప? రొబ్బి సోమన్న? సోమన్నే. వాడి పాకలో గొర్రెలు, మేకలు, ఆబోతులు. కొట్టాం. నేనక్కడకి సమ్మర్ లో సిస్తులు వసూలికి. చిన్న స్టేషన్ దిగి ఎద్దుబండి. రామినాయుడు, కాదు సోమన్న వంగి వంగి దండాలు. డబ్బు, నలిగిన నోట్లు. వేడిగా పాలు కంచు గ్లాసులో. ఇంటి వెనక గొర్రెలు. గొర్రెలెలా వుంటాయి? మేకల్లాగ వుంటాయా? అసలు మేకలెలా వుంటాయి. ఇంకా అసలుకి వస్తే మేకలంటే ఏమిటి? గొర్రెలకీ, మేకలకీ భేదం?

Posted in 2013, Uncategorized, డిసెంబరు, పాత రచన and tagged , , , .

One Comment

  1. త్రిపుర గారికి కినిగె ఇస్తున్న గౌరవపూర్వక నివాళి కి ప్రతీకగా యీ కధను కృతజ్ఞతాపూర్వకంగా అందుకుంటున్నాము. కధను, దానిలోని శైలీసరళుల పట్ల మెహర్ లాంటి ప్రతిభావంతుల విశ్లేష్ణాత్మక వివరణ మరింతగా ఇచ్చి ఉంటే బాగుండేదేమో కదా. ~ త్రిపుర గారి ఓ వీరాభిమాని (కె.కె. రామయ్య)

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.