coverfinal

దస్తయేవస్కీ ‘తిరస్కృతులు’పై సమీక్ష

Download PDF ePub MOBI

దస్తయేవస్కీ “క్రైం అండ్ పనిష్మెంట్” ద్వారా పేరు తెచ్చుకోకముందు రాసిన నవల “The Insulted and the Injured”. దీనికి తెలుగు అనువాదం ఈ “తిరస్కృతులు”. “ఏడుతరాలు” లాంటి అనువాదాలతో ప్రసిద్ధుడైన జంపాల ఉమామహేశ్వరారావు (సహవాసి) మొదటసారిగా చేసిన అనువాదం ఇదేనట. పీకాక్ క్లాసిక్స్ వాళ్లు ప్రచురించారు. మానవ సంబంధాలు, మనస్తత్వాలపై చక్కని అవగాహనతో రాసిన నవల అనిపించింది నాకు. ఇందులో ప్రధాన పాత్రలివి:-

ఇవాన్ పెట్రోవిచ్(వాన్యా): తాను రాసిన మొదటిపుస్తకంతోనే పెద్ద పేరు తెచ్చుకుని, రెండో పుస్తకంతో విఫలమైన ఒక రచయిత. ఈ కథ అంతా మనకు చెప్పే పాత్ర ఇదే. కథను మలుపు తిప్పే పాత్ర కాకపోయినా, కథలో అంతో ఇంతో పాలుపంచుకునే పాత్ర. నతాషా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె మరో అబ్బాయిని ప్రేమిస్తుంది. అలా ప్రేమలో విఫలమైనా నతాషాకు స్నేహితునిగా ఆమె హితం కోరుతూ ఆమె చెంతనే నిలబడతాడు.

నతాషా: ఈమె అయేషా అనే సంపన్నుడి కొడుకును ప్రేమిస్తుంది. నిలకడలేని అతణ్ణి నమ్మి చివరకు వంచనకు గురై, ఇటు తల్లిదండ్రులకు దూరమయ్యే పాత్ర.

అయేషా: నతాషా ప్రియుడు. పైకి మనసు ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళిపోయే వెర్రిబాగులవాడిలా కనిపిస్తాడు. కానీ అతని మనసు ఎప్పుడూ అతని స్వార్థానికి సరిపోయే లెక్కలే వేస్తుంది.

ప్రిన్స్: ఇతను అయేషా తండ్రి, ఈ కథలో విలన్. ఆస్తిపరుడు, సంఘంలో పేరు గలవాడు. ఆ రెండింటిని కాపాడుకోవటం కోసం ఎంత దూరానికైనా వెళ్లి ఎంతకైనా తెగించే పాత్ర.

నికొలాయ్: ఇతను నతాషా తండ్రి. కష్టపడి సంపాదించుకున్న దానిలో తృప్తిగా జీవించడమే తెలిసిన వ్యక్తి. అనాథ ఐన (మనకు ఈ కథ చెప్పే) వాన్యాని ఇతనే చేరదీసి పెంచుకుంటాడు.

నీలి: వంచనకు గురైన ఓ అభాగ్యురాలి కూతురు.

కథ

మంచితనం, శ్రమించే గుణం కలిగిన నికొలాయ్ ప్రిన్స్‌ని నమ్మి అతని ఎస్టేట్ వ్యవహారాల్ని చూసే బాధ్యతను తీసుకుంటాడు. కొంతకాలం పాటు సాఫీగానే నడుస్తుంది. రెండు కుటుంబాలు కలివిడిగా ఉంటాయి. ప్రిన్స్ కొడుకు అయేషా నికొలాయ్ కూతురు నతాషాని ప్రేమిస్తాడు.

డబ్బుకు ప్రాధాన్యతనిచ్చే ప్రిన్స్… ఈ ప్రేమ వ్యవహారాన్ని ఎలాగైనా తెగదెంపులు చేయాలనుకుంటాడు. తన ఎస్టేట్ వ్యవహారాలో అక్రమాలకు పాల్పడ్డాడని, నష్టపోయిన సొమ్ము తిరిగి ఇప్పించమనని నికొలాయ్ పై కోర్టులో దావావేస్తాడు. దీంతో ఆస్తి, పరువు అంతా కోల్పోతాడు నికొలాయ్. ఉన్న ఊరి నుంచి భార్యతోను, కూతురు నటాషాతోనూ నగరానికి వస్తాడు. మరోపక్క నతాషాకు మాత్రం అయేషాపై ప్రేమ చావదు. అతని కోసం తల్లి తండ్రులని కాదని ఇల్లు విడిచి వెళుతుంది. తాను చేసిన పనికి ప్రస్తుతం చీదరించుకున్నా, జీవితంలో స్థిర పడ్డాకా వారే అంగీకరిస్తారనే గుడ్డి నమ్మకంతో ఆ పని చేస్తుంది.

కానీ ఆమెను అయేషా అటూఇటూ కాని స్థితిలోకి నెట్టుతాడు. కొన్నాళ్ల పాటు ఇటు నతాషానా లేక తండ్రి ఖాయం చేసిన అత్యంత ఆస్తిపరుల సంబంధమా అంటూ ఊగిసలాడతాడు. చివరకు తండ్రి చూసిన సంబంధం వైపే మొగ్గుచూపుతాడు.

ఈ కథకు సమాంతరంగా మరో కథ జరుగుతూంటుంది. అది నీలి అనే పదమూడేళ్ల పిల్ల కథ. ఆమె తల్లి ప్రేమలో వంచనకు గురై, చివరకు ఎవరూ ఆదరించక విధిలేని పరిస్థితుల్లో చనిపోతుంది. నీలి కూడా సంఘంలో అత్యంత నిరాదరణకు గురై, ఎదుటి మనిషిని నమ్మలేని స్థితికి వస్తుంది. దాదాపు నతాషా విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. ప్రేమించినవాడే సర్వస్వం అని నమ్మినందుకు, ప్రతిఫలంగా ప్రియుడు చేసిన మోసానికి తట్టుకోలేకపోతుంది. ఈ సంఘటనలన్నింటినీ మనకు చెప్పే వాన్య మాత్రమే కాస్త సానుభూతితో ఆమెకు తోడుగా నిలబడతాడు. అతనే నీలిని కూడా చేరదీస్తాడు.

అయేషా త్రండ్రి ప్రిన్స్ చుట్టూనే కథ ఎక్కువ తిరుగుతుంది. పక్కవాడిని నేలరాసి పడేసి తాను అందలాలెక్కాలని చూసే మనిషతను. నీలి అతని కూతురే! డబ్బు కోసం ఆమె తల్లిని మోసగించి చివరకు ఆమె ప్రాణాలు పోవటానికే కారణమవుతాడు. ఆమెకు పుట్టిన నీలిని అనాధగా వదిలేస్తాడు.

సమాజంలో తిరస్కృతులుగా మిగిలి, అత్యంత దయనీయ స్థితిలో కడతేరే నీలి, ఆమె తల్లి పాత్రలను దాస్తయేవస్కీ చిత్రించిన తీరు పుస్తకం పక్కన పెట్టిన చాలాకాలం వరకూ పాఠకుని మనసును వెంటాడుతుంది. నిజానికి ఇది ఇద్దరు తండ్రుల కథ అని కూడా చెప్పొచ్చు. కూతురు నీలిని గాలికొదిలేసి ఆమె చావుకు కారణమైన తండ్రి ప్రిన్స్ ఒకడైతే, కూతురు నతాషా తప్పుదారి పట్టినా తన ప్రేమతో వెనక్కు తెచ్చుకుని అక్కున చేర్చుకునే తండ్రి నికొలాయ్ ఇంకొకడు.

ఎంతో ఋజుమార్గంలో జీవితం నడిపినా ఎక్కడా మనశ్శాంతి పొందలేని నికొలాయ్ పాత్రపై నాకు జాలి కలిగింది. తండ్రిగా కూతురి పట్ల అంత ప్రేమ చూపించటమే అతని నేరమా అనిపిస్తుంది. పైకి కూతురి పట్ల ద్వేషం ఉన్నట్టు కనిపించినా, అది ద్వేషం కాదనీ వట్టి పంతమేననీ కొన్ని సంఘటనల వల్ల మనకు తెలుస్తుంది. ప్రిన్స్ పాత్రపైన చాలా కోపంతో పాటూ, అలాంటి పాత్రని రచయిత నడిపించిన తీరు పట్ల ఆశ్చర్యం కూడా కలుగుతుంది. మన పురాణాల్లో శకుని పాత్ర లాంటిది అది. పైకి సానుభూతి చూపిస్తున్నట్టు కనిపిస్తూనే మిగతా పాత్రలపై అజమాయిషీ చెలాయిస్తుంది. అతని కొడుకు అయేషా నిజానికి అతనికన్నా నీచమైన పాత్ర అని చెప్పుకోవాలి. ఇతని తండ్రి చెడ్డతనంలోనైనా నిలకడగా ఉంటాడు. ఇతనికి మాత్రం ఎందులోనూ నిలకడ లేదు.

జీవితమంటే ప్రతి మనిషి తనకు తాను గీసుకున్న అందమైన చిత్రం కాదు. అనుకోని సంఘటనలు జరగడమే జీవితం. ఎన్నో ఒడిదుడుకులు, చిన్నచిన్న ఆనందాల సమాహారం. నవలలో మంచితనాన్ని నింపుకున్న పాత్రలన్నీ ఏదో రకంగా ప్రపంచం చేత తిరస్కరణకు గురై అవమానించబడేవే. అందుకే “తిరస్కృతులు” అన్న పేరు నవలకు నప్పింది.

*

Download PDF ePub MOBI

Posted in 2014, జులై, పుస్తక సమీక్ష and tagged , , , , , , , , , , , , .

3 Comments

  1. టాల్‌స్టాయితో కలుపుకుని రష్యన్ సాహిత్య స్వర్ణయుగం నాటి ప్రముఖ రచయితగా పేరు గాంచిన దాస్తొయెవ్‌స్కీ (Dostoyevsky) చెకోవ్, హెమింగ్వే లాంటి రచయితలను నీషే, సార్త్రే లాంటి తత్వవేత్తలను విశేషంగా ప్రభావితం చేసారు.

    19 వ శతాబ్దపు రష్యన్ సామాజిక, రాజకీయ, నైతిక సంఘర్షణల నేపధ్యంలో మానవ సంబంధాలు, మనస్తత్వాలు, మానసిక విశ్లేషణలతో కూడిన రచనలు చేసిన దస్తయేవస్కీ “క్రైమ్ అండ్ పనిష్మెంట్” ( Crime and Punishment ) “బ్రదర్స్ కరమొజొవ్” ( The Brothers Karamazov ) లతో ప్రపంచ ప్రసిద్ది గాంచారు. “బ్రదర్స్ కరమొజొవ్” నవల అత్యంత విశిష్టమైన రచన అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చే ప్రశింసబడింది.

    దస్తయేవస్కీ “Notes From Underground” ( అజ్ఞాతవాసపు యాదస్తు చీటీలు ) నవల అస్థిత్వవాద సాహిత్యపు ( Existentialist literature ) తొలినాటి రచనగా గుర్తింపు పొందింది. 20 వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమయిన, అస్థిత్వవాద శైలితో రచనలు చేసిన, ఫ్రాంజ్ కాఫ్కా దస్తయేవస్కీని తన రక్తసంబందీకుడు ( blood-relative ) అంటూ అభిమానించాడు.

    విశిష్టమైన మనస్తత్వవేత్త (psychologist ), తత్వవేత్త (philosopher) అయిన దస్తయేవస్కీ మానవ హృదయపు లోతుల్ని, సంక్లిష్టాలని తన రచనల్లో ప్రతిభావంతంగా చిత్రించారు. దస్తయేవస్కీ రచనలు ప్రపంచ భాషలెన్నింటిల్లోకో అనువదించబడి (170 languages) కోట్లాది కాపీలు అమ్ముడుబోయి (34 million copies from 1917 to 1981) ప్రాచుర్యం పొందాయి. (వివరాలు వికీపిడియా నుండి).

    దాస్తొయెవ్‌స్కీ “ The Insulted and the Injured ” నవల అనువాదం “తిరస్కృతులు” పరిచయం చేసినందుకు శ్రీశాంతి గారికి ధన్యవాదాలు. ( నవలలో మంచితనాన్ని నింపుకున్న పాత్రలన్నీ ఏదో రకంగా తిరస్కరణకు గురై అవమానించబడేవే. అందుకే “తిరస్కృతులు” అన్న పేరు నవలకు నప్పింది అన్న ముగింపు వాక్యాలు బాగున్నాయి )

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.