coverkottapustakaalu

కొన్ని కొత్త పుస్తకాలు – ఆగస్టు 2014

కె రామలక్ష్మి రచనలు (కథలు, నవలలు)

ప్రముఖ నవలా రచయిత్రి ఆరుద్ర భార్య కె. రామలక్ష్మి గారి ఐదు పుస్తకాలు ఇప్పుడు ఈబుక్స్‌గా లభ్యమవుతున్నాయి. వీటిలో “అద్దం” “ఒక జీవికి స్వేచ్ఛ” కథా సంపుటాలు కాగా; “శత్రువుతో ప్రయాణం”, “తరాలు”, “కృష్ణార్పణం” నవలలు. తన “తరాలు” నవలకు ముందుమాటలో ఆవిడ తన రచనా తత్వాన్ని ఇలా చెప్తారు:—

“వ్యక్తిగతంగా నేను కాస్త ఆశావాదిని. భవిష్యత్తుని బెంగతో ఎదురుచూడను. కష్టం – నష్టం, సుఖం – దుఃఖం, దరిద్రం – ఐశ్వర్యం – అంతేకాదు మనని కట్టిపడేసేవీ, తోసిపారేసేవీ – ఎన్నో – ఎత్తుపల్లాలు, బంధు, బాంధవ్యాలు వుంటాయి. ఇన్నిటినీ తోసిరాజనను. అలా అని భవిష్యత్తుపై భయంలో బ్రతకను. కాలం ఎన్నో సమస్యలకి – పరిష్కారం చూపెడుతుంది. కాలానికి ముందు పరుగులు తీయలేను. అలా అని కాలానికి వెనకపడడం కూడా నాకు అసంతృప్తి కల్గిస్తుంది. అందుకే ఆధునిక యువతులంటే – నాకు చాలా ఇష్టం. వారి పురోగతి – నారీలోకానికి – కావాలి. అందరూ అనుకునేటట్టు అందరూ పాతతరాన్ని తోసిరాజనడం లేదు – అనుకుంటాను. నమ్మకం అవసరమే. గాని దాని నిజానిజాలు పరీక్షించాలనుకోవడం ద్రోహం కాదు కదా? అనుకుంటాను. ఏ తరానికైనా తగినట్టు మారడం అవసరం.”

AddamRamalakshmiKathalu OkaJeevikiSwechcha SatruvutoPrayanam Taralu Krishnarpanam

~ ఈబుక్స్ లభ్యం

*

పి. ఎస్ నారాయణ రచనలు (కథలు, నవలలు)

పి.ఎస్. నారాయణ రచనలు ఇకపై వరుసగా ఆన్‌లైన్లో అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో ప్రస్తుతానికి మూడు కథా సంపుటులు (“నిర్ణీతి”, “నిన్నటికి వీడ్కోలు”, “రేపటి సూర్యోదయం”) కాగా; మూడు నవలలు (“ఓ స్త్రీ ‘ఆత్మ’ కథ”, “ఆరు నెలలు ఆగాలి”, “ఆమని పిలిచింది”). వీటిలో కొన్ని ప్రింటు పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఆయన రచనలపై వడ్డి విజయసారథి విశ్లేషణ:— “రచయితగా పి.ఎస్‌.నారాయణగారికి మూడు ముఖ్యమైన లక్షణాలున్నాయి. మొదటిది ఆయన స్త్రీ పక్షపాతి. పరకాయ ప్రవేశంలాగా ఆ పాత్రలలోకి ప్రవేశించి, అన్నీ స్వయంగా అనుభవించి చెపుతున్నంత నమ్మకంగా వారు కథనం సాగించగల్గటంలోని కిటుకు ఇదే. రెండవది-ధర్మపక్షపాతి, అంటే సమాజానికి అహితకరమైన రచనలు ఆయన చేయరు. వివాహేతర సంబంధాలను నిరసించటము, మాదక ద్రవ్యాల బారినుండి పిల్లలను రక్షించుకోవాలనుకోవటమూ, సంపద పెంచుకోగోరినా, అక్రమ సంపాదనలకు ఆరాటపడకూడదని హెచ్చరించటమూ ఈ విషయాన్ని సూచిస్తాయి. మూడవది – మానసిక విశ్లేషణ ప్రధానాంశంగా కథాకథనం సాగిస్తారు. ఈ శక్తి పుష్కలంగా ఉన్న కారణంగానే వీరి కథల్లో, నవలల్లో సంభాషణలు రక్తి కడతాయి. పాత్రలు సజీవ రూపాలుగా దర్శనమిస్తాయి. ఎక్కడా అసంబద్ధమైన వర్ణనలుగాని, మలుపులుగాని, ఆకాశ విహారాలుగానీ ఉండవు.”

Nirneeti NinnatikiVeedkolu RepatiSuryodayam

OStreeAtmakatha AaruNelaluAgali AmaniPilichindi

~ ఈబుక్స్ లభ్యం

*

కథ చెప్తాను వింటావా (కథలు)

రచన: అరిపిరాల సత్యప్రసాద్

“ఇందులో కథలున్నాయ్..!! నవ్వులున్నాయ్!! అనగా నవ్వించే కథలున్నాయ్!! అరిపిరాల సత్యప్రసాద్ రాసిన 20 సరదా కథల సంకలనం ఇది. అన్నీ చిట్టి పొట్టి కథలే కాబట్టి మాంచి మూడ్‌లో వున్నప్పుడో, మూడు బాలేనప్పుడో, అయ్యగారు తిట్టినప్పుడో, అమ్మగారు మొట్టినప్పుడో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక కథ చదివేసి ఎంచక్కా చిరునవ్వుల్ని పూయించుకోవచ్చు…!! అలా కాదు అన్నీ ఒకేసారి చదివేస్తారా, అయితే ఇక నవ్వులే నవ్వులు…!!”

KathaCheptanuVintava

~ ఈబుక్ లభ్యం

*

ప్యాసా (కవిత్వం)

రచన: తనికెళ్ల భరణి

“తనికెళ్ళ భరణిగారి ఈ ‘ప్యాసా’లోని ముక్తకాలు, ఉర్దూ షేర్లను పోలిన రచనలు. భావాలలోనూ, ఊహలలోనూ, కవి సమయాలలోనూ, చమత్కారంలోనూ, ఉర్దూ షేర్ల లక్షణాలు పుణికిపుచ్చుకున్నాయి. ఈ ‘ప్యాసా’ లోను ప్రతి ముక్తకమూ ఒక మౌక్తికమే. ఈ ‘ప్యాసా’ ఓ ముత్యాల భరిణె.” అంటున్నారు పెన్నా శివరామకృష్ణ

Pyasa

~ ఈబుక్ లభ్యం

*

అనుపమ (కవిత్వం)

రచన: బండ్ల మాధవరావు

ఇటీవలే విడుదలైన ఈ కవిత్వ పుస్తకాన్ని గురించి దేవీప్రియ ఇలా అంటున్నారు:— మైనస్ అయిదు డిగ్రీల సెల్సియస్ చలిలో నా చుట్టూ యెవరో వండడిగ్రీల మంటని రాజేసి, నన్ను మరిగించి, కరిగించి వేస్తున్నట్లు, అయినా వేదనలో కేక వేయడానికి కూడా నా నోరు పెగలనట్టు…! నిజమే; వెండీ ముల్‌ఫోర్డ్ అన్నట్లు అత్యుత్తమమైన, సాంద్రమైన కవిత్వం చదివిన తరువాత మనం వెంటనే మాట్లాడలేము. కేసేపు మౌనంగా వుండిపోతాము. అది ఉన్నతదశకి చేరిన కవిత్వానికి ఒక గీటురాయి.

Anupama

~ ఈబుక్ లభ్యం

*

ఆంధ్రనగరి (చారిత్రాత్మక నవల)

రచన: సాయి పాపినేని

“క్రీ.పూ.మూడవ శతాబ్దంలో కృష్ణా నదీమతల్లి ఒడిలో వికసించి ఒక వెయ్యేళ్ళు ఆసియా మారుమూలలకీ నాగరికతని పంచిన” ఈ అమరావతి కథ గురించి ద్వానాశాస్త్రి మాటలివి:— “ఇది నవలా? అంటే అవును, కాదు. ఇది చరిత్రా అంటే? అవును, కాదు. ఇది మన చారిత్రక, సాంస్కృతిక పరిశోధనాత్మక విశేష నవలా? అంటే అవును, అవును అని ముమ్మాటికి చెప్పదగినది… మన తెలుగు నగరి ‘అమరావతి’ పై రాసిన తొలి తెలుగు నవలగా చెప్పవచ్చు. మన జాతి గొప్పది, మన శిల్పప్రాభవం గొప్పది… అంటూ కనువిప్పు కలిగించే నవల ఇది. ఎందరెందర్నో సంప్రదించి, చర్చించి, తెలుసుకుని ఒక నవలగా రాయటం- మాటలు కాదుగాని- మాటలే అని నిరూపించారు సాయి పాపినేని.”

Andhranagari

~ ప్రింటు & ఈబుక్స్ లభ్యం

*

వేమన ఫౌండేషన్ నుంచి పుస్తకాలు (నాన్ – ఫిక్షన్)

వేమన గురించిన పరిశోధనాత్మక రచనల్ని పుస్తకాలుగా ప్రచురించింది వేమన ఫౌండేషన్ . వేమన గురించి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, ఆరుద్ర, బంగోరె ఇత్యాది ప్రముఖుల రచనలు వీటిలో ఉన్నాయి.

VemanaRallapalliAnanthakrishnaSarma ManaVemana VemanaC.R.Reddy

~ ప్రింటు బుక్స్ లభ్యం

*

దమ్మపదం కథలు

(సంక్షిప్త స్వేచ్ఛానువాదం)

రచన: బోధ చైతన్య

“నలభైఐదేండ్ల సుదీర్ఘ ధర్మచక్ర ప్రవర్తన కాలంలో భగవానుడు ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులకు బోధించిన భోధనల సంకలనమే ఈ ధమ్మపదం.”

DhammapadamKathalu

~ ప్రింటు పుస్తకం లభ్యం

*

Posted in 2014, ఆగస్టు, కొత్త పుస్తకాలు and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.