cover

అనుకోకుండా (6)

Download PDF ePub MOBI

నదంటే నమ్మకం ఉండేది. వరదొచ్చి ఊరిని కావలించుకుంది. ఇక పడవతో పని లేదు, వంతెన కూడా కట్టుకోవద్దు.

*

ఏం లేదిప్పుడు – చినుకుల్ని చూస్తే వణుకు తప్ప

నీటిలాంటి నెత్తురు తప్ప

రంగులేం లేవు – నలుపు కూడా.

వస్తువుల్ని దాచుకోవడమూ రాదు

గాజుసీసాలో పొగమంచు ఒకటే – గుర్తుగా.

*

బాగుండటం మాత్రమే బాగుంటుందని నీకెవరు చెప్పారో కానీ, బాధుండటమే బతికుండటం కదా? ఈసారి ఇలా చేసి చూద్దాం – ఊలుబంతి అద్దానికి అతుక్కున్న అందమైన బొమ్మొకటి గీద్దాం. అద్దమే నిజమనీ, అందమంతా నీడ అని, బంతి కంటే బొమ్మే బావుంటుందని తెలుసు కాబట్టే ఇంకా రంగులు పారబోసుకోలేదని సంజాయిషీ చెప్పుకుందాం.

*

భోరుమని వాన. ఇంకా ఏదో నిండలేదు కదూ? ఎడారి ఇసుక లోపల్నుండి చెమ్మగిల్లే ముందు పైన నడిచి వెళ్ళిందెవరో గుర్తు రావట్లేదు కదూ? ఏవో కొత్త పదాల కోసం చూపుడు వేలుతో అడ్డగీతలు గీస్తున్నప్పుడు కాగితం కాసేపు కలవరపడటం గమనించావా? పోనీ చెప్పులు విప్పిన కాసేపటికి గుమ్మంలో చలిగాలి వణక్కపోవడమూ?

ఏమోనబ్బా! ఈ కాసేపూ మాత్రం ప్రాణాలంటే పెదాలనే అర్థం.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఆగస్టు, మ్యూజింగ్స్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.