irlachengi kathalu

ఇస్కూలికి ఎగనామం

Download PDF ePub MOBI

తెల్లార్తానే మాయమ్మలేచి ‘రాత్రంతా విసవిసాగాలి దోల్తోనే వునింది పాపా. బిన్న్య పోకుంటే సిన్నవ్యోళ్ల లచ్చుమక్క సింతాకాయిల్నంతా తన యెదానేసుకోని బోతాది’ అని బుట్టిచ్చి పంపించింది.

నిద్రకళ్లతోనే పొయ్యి పాలుమారకుండా సింతకాయిలన్నీ ఏరేసినాను. ఇస్కూలుకు బోకుండా వుండాలంటే ఏంసెయ్యాలా? అని ఆలోచిస్తా నల్లగుండు మింద కూసోనుండాను. గాలికి పక్కనుండే బల్చ కొమ్మ వొచ్చి తగిలింది. ఎంటనే బల్చముల్లించుకోని గుదిగాల్లో గుచ్చి పట్టుకొని అట్లే రాతిమింద అడుగు బెట్న్యాను. కసుక్కున కాలిలో దిగిపోయింది ముల్లు.

‘అమ్మా, అమ్మా’ అని అరస్తా కుంటుకుంటా ఇంటికి బొయినాను. ‘ఏమ’ని పరిగెత్తుకోనొచ్చింది మాయమ్మ. ‘ముల్లు గుచ్చుకునింది మా. శానా నొప్పిగా వుండాది’ అన్న్యాను యాడస్తా.

‘రామేశం బొయినా శనేశం వదలదంటే ఇదే. పనిలో సచ్చి సున్నమవతా వుండానిప్పుడే. ఆడాడ పిలకాయిలు సూసి రమ్మంటే కాల్చేసొస్తారు. నువ్వేమిరా అంటే ఏదో ఒకటి నెత్తికి దెచ్చుకోని నా నెత్తురు నా నోట్లో బోస్తావు’ అని సేందబాయికాడ నీళ్లకొచ్చినోళ్లలో సాకలి సుందరాన్ని బిల్చి ముల్లు దియ్యమనింది.

ఆ బిడ్డి నా కాలిని దీసి తన మోకాలి మింద బెట్టుకోని నోట్లో నుంచి ఏలితో ఎంగిలి దీస్కోని ముల్లు గుచ్చుకున్ని సోట పూసి రుద్ది కొంగుతో తుడిసేసి పిన్నుతో సుట్టూ గుచ్చిగుచ్చి లేపతావుంది. ‘ముల్లు తలకాయ కన్నిపిస్తావుంది. గోటి కందలేదే. మల్లిముల్లుంటే బాగున్నే’ అంటానే గోళ్లతో గిల్లి గిల్లి ల్యాపతావుంది. నాకు మాత్రం సగించినట్లగా వుండాది.

ఎగవింటోళ్ల కుంటాదెమ్మ నీళ్ల కొస్తే ఆయమ్మ మెళ్లో మొల్తాడులో మల్లిముల్లుంటాదని అడిగి తెచ్చి మెల్లంగా మల్లిముల్లుతో ముల్లును పెరికేసింది సుందరం.

నొప్పిగా వుందనే సాకుతో రొండు దినాలు ఇస్కూలుకు బోలేదు. మూడోదినం పోనన్నా మాయమ్మ వొదలలేదు. ‘ముల్లు గుచ్చుకునిందని నువ్వేమన్నా కుదురుగా వుండావా? ఊరంతా తిరగతానే వుంటివి’ అనింది.

‘అమా, నేనేడా బోలేదుమా ఎగవింటోళ్ళ దిన్ని మింద కూసోని అచ్చన రాళ్లాడుకుంటా వుంట్ని’ అన్నాను.

‘నువు బోకబోతే నేనే ఎత్తుకోని బొయ్యి ఇస్కూల్లో కూసో బెట్టొస్తా’ అనింది.

కాలికి మాయమ్మ జిల్లేడుపాలు బెట్టి, ఉప్పు కాపడమిచ్చింది కదా! నొప్పెప్పుడో ఉష్‌… కాకీ, ఊరికే మా వాళ్ల ముందు కుంటతా నడస్తా వుండాను.

ఇస్కూలుకు బోకుంటే మాయమ్మ ఇడ్సి పెట్టేట్లు లేదని తెలుకున్న్యాక ఉన్నపళంగా మొగం కడుక్కోని దుబాన్తో సింపిరితల దువ్వుకోని సద్దన్నం దిని ఇస్కూలుకు బొయినాను.

ఆజరు దీసుకొనేటప్పుడు ‘రొండు దినాలెందుకు రాలేద’ని నిలేసినాడు వొచ్చిన సిన్నయివోరు.

‘కాల్లో ముల్లు గుచ్చుకునింది సా. నడవడానిక్కూడా కాలేదు. అందుకే మాయమ్మ ఇస్కూలుకు నిలిపేసింద’ని అయివోరు దెగ్గరికి బోయి కాలెత్తి సూపెట్టినాను.

‘కాల్లో గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకున్నంత యాక్సన్‌ సేస్తావుండావే. పట్టు సెయ్యి’ అని బర్రతో సురుక్కుమనేట్లుగా నాలుగు దెబ్బలేసినాడు. అంత గెట్టింగా ఎప్పుడూ ఎవుర్నీ కొట్టంగ సూళ్లేదు. అప్పిటికప్పుడు ఇంటికి పరిగెత్తిపోవాలనిపించింది నాకు. కానీ ఇప్పుడు పరిగెత్తితే అయివోరు పిలకాయిల్ని తరమతాడు పట్టుకోమని. శానా నామర్దాగా వుంది నాకు. ఎప్పుడెప్పుడు వొంటికి బెల్లు గొడ్తారా అని కాసుకోనుండాను. అంతొరకు పలకలో పిచ్చిగీతలు గీస్తా అయివోరి గురించే ఆలోసిస్తా వుండా.

ఒంటికి బెల్లు కొట్న్యారో లేదో మాయక్క కోసం గూడా సూల్లేదు నేను. ఒకే పరుగులో రచ్చబండ దెగ్గిర సేరినాను. ఆడ నిలబడి ఒగ నిమసం ఆలోచించుకోని బలమంతంగా ఏడస్తా ఇల్లు సేరినాను. మా మూలింటవ్వోలింటికి బోలేదు నేను.

నా ఏడుపు సూసి మా దొరసానవ్వ, మాయమ్మా ఇద్దురూ ఒగేసారి ఏమయిందంటా వొచ్చినారు. రొండు దినాలు ఇస్కూలుకు పోలేదని సిన్నయివోరు సావగొట్న్యాడని సెప్పేసినాను.

‘ఇస్కూలిడ్సేదాకా వుండు నాయినా. వాడికత నేను జూస్తాను’ అని మాయవ్వ ఆమాటా ఈమాటా సెప్తా నా ఏడుపును ఆపాలని సూస్తా వుండాది.

‘అమా, సినపాప ఇంటికొచ్చిందా?’ అని మాయక్క గెసబోసుకుంటా వొచ్చింది. నన్ను సూసేసి మా మూలింటవ్వకు నేనిక్కడుండానని సెప్తానని అదే పతా బోయింది.

ఉన్న పళంగా మా దొరసానవ్వ నన్ను సంకలో కెత్తుకునింది. కర్నమోలింటికి బోయింది. మా సిన్నయివోరు వాళ్లకు సుట్టమంట. దినాము క్యారీరు దెచ్చుకోని మద్దేనం వాళ్లింట్లో కూసోని తింటాడన్నం.

అయివోరు నడవలో సాప్మింద కూసోని అన్నం తింటావుండాడు. మా యవ్వ నేరుగా ఆడికిబొయ్యి నన్ను కిందికి దించింది.

నడుంమింద సెయ్యి బెట్టుకొని ‘ఏమయివోరా, అయివోరుద్యోగం రాంగానే పిలకాయిల్ని ఏమైనా సెయొచ్చనుకుంటివా? బిడ్డి ఎంతగా బిత్తరపోయింది. ఇస్కూలుకే రానంటావుండాది. నీకు బిడ్లు లేరా? ఉంటే వాళ్లను కంటివా కక్కితివా’ అని ఆవేశం అణిగేదాకా తిట్టొదిలిపెట్టింది.

అయివోరు పల్లెత్తి ఒక మాట మాట్లాడలా. దించిన తల ఎత్తలా. కర్ణమోళ్ల రాజమ్మే ‘పిలకాయిలు తప్పుసేస్తే అయివోర్లు కొట్టకుండా వుంటారా? ఏదో ఒక దెబ్బేసుంటాడు. ఈ బిడ్డి నీ దెగ్గిరొచ్చి ఆగడం జేసుంటాది. పోనీ వొదిలేయ్‌ మా. నా యల్లునికి నేను జెప్తాలే’ అని సగరుద్ది పంపించింది.

రాజమ్మవ్వోళ్ల పెద్దమ్మ కూతురికి అయివోరు అల్లుడంట. ఆ సంబందం వల్లే వాళ్లింట్లో క్యారేజి తెచ్చుకోని తినడం.

నేను ఏడ్వడం, మా యవ్వ అయివోర్ని అందురి ముందర ఆగమాగం సెయ్యడం కర్ణమోలక్కోలింట్లో వాళ్లకు కోపమొచ్చినట్లుండాది. రాజమ్మవ్వ కూతుర్లు సరస్వతి, కౌసల్య మా యమ్మకు శానా కావాల్సిన స్నేహితులు. వాళ్లు ల్యాకుండా ఒక యీదినాటకానికి గాని, బారతం గుడిగాక సెప్పే పొగులు కతకు గాని, ఆకిరికి సిత్తూరికి సినిమాకు గాని పోదు. మంగసెక్కకు, బోవాలన్న్యా, పొరక పుల్లలు కోసుకోని రావాలన్న్యా వాళ్లుండాల్సిందే. అట్లాంటోళ్లు మా యమ్మతో ఒక సమత్సరంపాటు మాట్లాడ్డం ఇడ్సిపెట్టి మా యమ్మను నరక యాతన పెట్టేసినారు.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్‌డేట్‌ల కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి: https://www.facebook.com/KinigePatrika

Posted in 2014, ఆగస్టు, ఇర్లచెంగి కథలు, సీరియల్ and tagged , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.