cover

పెదవులంటని అనుభవం

Download PDF ePub MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) “రిగ్రెట్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. 

పెదవులంటని అనుభవం

గై డి మొపాసా

మాంటిస్ అంతా ‘శావల్ తాత’ అని పిలిచే శావల్ అప్పుడే నిద్ర లేచాడు. ఆకులు రాలుతున్న ఆ నిస్తబ్ధ ఉదయానే అతను దుఃఖపడ్డాడు. వాన కూడా తోడవడంవల్ల బరువుగా నెమ్మదిగా రాల్తున్న ఆకులు మరో వానని తలపిస్తున్నాయి.

చెప్పలేనంత దిగులు కమ్ముకుంది అతన్ని. గదిని వెచ్చబరుస్తున్న కుంపటి… కిటికీల మధ్య అసహనంగా పచార్లు చేశాడు. తీరని వేదన తప్ప జీవితంలో మరేమీ లేదు. అరవై రెండు శిశిరాలు గడిచిన జీవితం ఇకపై మరోలా ఉంటుందనే ఆశలేదు. తన వాళ్ళంటూ ఎవరూలేని ఒంటరి బ్రహ్మచారి.

‘నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేద’నుకుంటూ… ఎవరి ప్రేమా పొందని దైన్యంలో ఏకాకిగా రాలిపోవడానికి మించి విషాదం ఇంకేమైనా ఉంటుందా…

నిస్సారమైన… నిరర్థకమైన… తన జీవితపు పుటల్ని తిరగేశాడతను. జ్ఞాపకాల్లో ఎక్కువ ఖాళీలు. తన బాల్యం… అమ్మనాన్నలతో ఆనందంగా గడిపిన ఇల్లు… తన కాలేజీ జీవితం. గిల్లికజ్జాలు… చిలిపి తప్పిదాలు… పారిస్‌లో తొలి ఉద్యోగం… జబ్బు చేసి నాన్న చనిపోవడం… కుంగిపోయిన అమ్మని తానే అమ్మై సాకడం… వరుస దృశ్యాల్లా కదలాడాయి.

అమ్మని చూసుకోడానికి తిరిగి తన ఊరు వెళ్లిపోయాడు. ముసలి తల్లి, ఆ కొడుకు ప్రశాంతంగా… నిర్లిప్తంగాను బతుకు దొర్లించారు. ఆ తర్వాత ఆమె మరణించింది, జీవితం దుఃఖమయమని మరోమారు గుర్తుచేస్తూ. ఆ తర్వాత అతను ఏకాకిగానే గడిపాడు, ఇప్పుడు రాలిపోయే కాలం ముంచుకొచ్చింది. తాను త్వరలో అదృశ్యమైపోతాడు. ఇక మరేమీ ఉండదు. ఈ భూగ్రహం మీద శావల్ అనే జీవి గుర్తులు కూడా మిగలవు. ఎంత సహజ భయానకమైన సంగతి! నవ్వుతూ… తుళ్ళుతూ…. మిగతా ప్రజలంతా బ్రతికేస్తూ ఉంటారు. తన గుర్తులు… ఉనికి చెరిగిపోతే వారికేం? ఎప్పటికైనా తప్పని చావు పొంచి ఉన్నా… ఈ జనం ఇలా సంతోషంగా బతకగలగడం ఎంత ఆశ్చర్యం! ఈ చావు అనేది మన చేతుల్లో ఉన్నట్టయితే నిర్విచారంగా, పైలాపచ్చీసుగా బతికే అవకాశం కొంతైనా ఉంటుంది. కానీ అది అనివార్యం, పగటి తర్వాత ముసిరే రాత్రిలా –

ఏది ఏమైనా తన జీవితానికి ఏమైనా అర్థముందా? తాను వెలగబెట్టిందేమైనా ఉందా, ఏమైనా సాహసాలు… లేదా తనకి మహదానందాన్నిచ్చేవి… మహా విజయాలు… ఏమైనా గొప్ప సంతృప్తినిచ్చే ఘన కార్యాలు… ఏమీ లేవు. తనేమీ చేయలేదు. పొద్దునే లేచి, సరిగ్గా నిన్నట్లానే తిని, తొంగొని, మళ్లీ లేచి… ఇలా గానుగెద్దు జీవితం – అంతే! ఇలా అరవై రెండేళ్లు దొర్లిపోయాయి. సాటి మగాళ్లలా పెళ్ళైనా చేసుకోలేదు. ఎందుకు? అవును! ఎందుకు తనకి తోడుగా ఓ ఆడదాని చేయందుకోలేదు? పోషించే తాహతు, సామర్థ్యం ఉన్నట్టయితే చేసుకునేవాడేమో పెళ్లి. తాను చేజార్చుకున్న అవకాశాల్లో అదొకటా? కావొచ్చు. ప్రతి జీవితంలోనూ అవకాశాలు ఏవో వస్తూనే ఉంటాయి. రావని కాదు. అయితే, వాటిని తాను అలక్ష్యం చేశాడు. ఆ ‘లెక్కచేయనితన’మే అతనిలోపం, అతని తప్పిదం. కేవలం నిర్లక్ష్యంతో మనుషులు జీవితాల్ని ఎలా చేజార్చుకుంటారో కదా! కొందరికైతే పొద్దునే నిద్రలేచి నాలుగడుగులు నడిచి, నలుగురితో మాట్లాడి, ఏమైనా అంతుచిక్కని ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడం వంటివి బొత్తిగా గిట్టదు.

ఇంతా చేసి కనీసం అతను ప్రేమలోనన్నా పడలేదు. తన హృదయాన్ని ఏ స్త్రీ కూడా ప్రేమతో నింపలేక పోయింది. ప్రేమలో ఉండే చిత్రమైన పులకింతగానీ, దాన్ని ఆశించడంలో ఉన్న మధురమైన బాధగానీ, ‘నేనున్నాన’నే భరోసాతో స్పృశించే అరచేతి అనుకంపనగానీ, నులిమంటలు రేపే మోహ విజృంభణగానీ తాను ఎరగనే ఎరగడు. అనాఘ్రాతమైన గులాబీ రేకుల్లాంటి వెచ్చని పెదాలు తొలిసారిగా కలుసుకున్నప్పుడు, అడవిమల్లె తీగల్లా నాలుగు చేతులు తమకంగా పెనవేసుకుని రెండు దేహాల్ని ఒకే అస్తిత్వంగా మారుస్తున్నప్పుడు, తెంచుకోలేని మోహపాశాల్లో గొప్ప ఇష్టంతో చిక్కుకుపోయినప్పుడు ఎంతటి అమరానందం నీ గుండెల్లో నిండి పోతుంది! ఏమో తనకి ఇవేమీ తెలియవు.

శావల్ కాలిమీద కాలేసుకుని కూర్చొన్నాడు. నిశ్చయంగా తన జీవితం వృథా అయిపోయింది. పూర్తిగా వ్యర్థమైపోయింది.

కానీ, తానూ ప్రేమించాడు, అదీ చాలా గోప్యంగా. తన స్వభావాన్ని పోలినట్లే అతి నిర్లక్ష్యంగా – తలవని తలంపుగా ఆ ప్రేమ తనలోకి చొరబడింది. తన పాత మిత్రుడు సౌడ్రిస్ భార్యనే తాను ప్రేమించింది. ప్చ్! ఆమెకి పెళ్లికాకముందే తనకి పరిచయమై ఉంటే. కానీ, ఆమె తనకి చాలా ఆలస్యంగా తారసపడింది, ఓ వివాహితగా.

అంతకుముందే ఆమె పరిచయమైనట్లైతే… నిస్సందేహంగా చిటికెన వేలందించి, కోరేవాడు ఆమె చిటికెడు సావాసాలు. ఆమెను తొలిచూపులోనే గాఢంగా ప్రేమించాడు. ఉద్రేకాలు తొక్కిపట్టి ప్రశాంతంగా ఆమెకు సంబంధించిన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు. ఆమెని వదిలి ఇంటికి వెళ్లలేక ఎంత మధన పడేవాడు! ఆమె తలపుల సలపరింతలతో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు!

నిన్న కుంగిన పొద్దుని మించిన నిస్సత్తువతో మొదలయ్యేది మర్నాటి ఉదయం. ఎందుకు? ఉత్సాహం, ఉల్లాసం కలగలిసిన సౌందర్యమూర్తి ఆమె కావడం చేత. నిజానికి సౌడ్రిస్ ఆమెకి తగినవాడు కానేకాదు. ఇప్పుడామెకి యాభై రెండేళ్లు – ముఖంలో ఎప్పుడూ సంతోషచ్ఛాయలే.

అబ్బ! ఇన్నేళ్లు ఆమె తననే ప్రేమించి ఉన్నట్లయితే! అవును ఆమె తననే ప్రేమించినట్లయితే బాగుండేది. తానింతగా ప్రేమిస్తుంటే ఆమె మాత్రం తనని ఎందుకు ప్రేమించలేదూ, ప్రతిగా –

ఆమె తన ప్రేమని ఏ రూపాన్నైనా బైటపెట్టి ఉన్నట్టయితే? ఎప్పుడూ ఏమీ బైటపెట్టలేదా… చిన్న సంకేతం, చిరు సందేశం ఏదీనూ? ఆమె మనసులో ఏముంది? తాను అడిగినట్లైతే ఆమె బదులు ఎలా ఇచ్చి ఉండేది? శావల్ ఇలాంటివే లక్ష ప్రశ్నలు వేసుకున్నాడు. తన జీవితాన్నంతటినీ కలబోసుకున్నాడు, తలపోతల పునశ్చరణతో.

సౌడ్రిస్ భార్య పచ్చి పరువంలో ఉన్నప్పుడు, అలవికాని అందంతో మెరిసిపోతూ కనిపించేటప్పుడు, సౌడ్రిస్ ఇంటిదగ్గర తాను గడిపిన సుదీర్ఘ సాయంత్రాల్ని గుర్తు తెచ్చుకోసాగాడు శావల్. తెంపులేకుండా సాగే ఆమె ఊసులు, కలకూజితాలు ఈర్ష్యపడే ఆమె కంఠస్వరం, నానార్థాలు స్ఫురించే ఆమె చిరునవ్వులు… ఇంకా ఎన్నో జ్ఞప్తి తెచ్చుకున్నాడు. సౌడ్రిస్, ఆమె, తనూ కలిసి సైనీ నదీతీరంలో గడిపిన రోజులు… ఆదివారాలు ఆ నది ఒడ్డున పచ్చిక బయళ్లలో మధ్యాహ్న భోజనాలు… అతని మస్తిష్కంలో దొంతర్లుగా కదలాడాయి. అదే తీరం దాపున ఉన్న పొలంగట్ల మీద ఆమెతో కలిసి నడిచిన ఒక నులివెచ్చని దృశ్యం అతనికి చప్పున స్ఫురించింది.

ఆ రోజు భోజనాన్ని బుట్టలో పెట్టుకుని పొద్దునే బయల్దేరారు. ఏదో మధురమైన మత్తుతో జోగుతున్నట్టున్న వసంతంలో ఓ ఉదయం. పరిసరాలలోని అణువణువులో ఏదో పరిమళం, ప్రతిదృశ్యంలోను జీవన మకరందం, అనిర్వచనీయమైన ఆనందం. ఉల్లాసంగా రెక్కలల్లార్చే పక్షులు చేసే కువకువలు పరిసరాల్ని సంగీతమయం చేస్తున్నాయి. సూర్యకిరణాల తళుకు అంటుకుని మెరుస్తున్నాయి చిరుకెరటాలు.

ఒడ్డుకు చేరువగా గొడుగులు పడుతున్న చెట్లకింద పచ్చికలో భోజనాలు చేశాం. పచ్చిగడ్డి వాసనలతో కైపెక్కిన పిల్లతెమ్మెరల్ని ఆస్వాదిస్తూ, చాలా మధురమైన పానీయాన్ని తాగాం. ఆ క్షణంలో పరిసరాలన్నీ ఎంత బ్రహ్మానందంతో నిండాయో!

భోజనాలు అయ్యాక సౌడ్రిస్ కునుకు తీశాడు. ‘ఇంత మంచి నిద్ర జీవితంలో తానెప్పుడూ పోలేద’ని చెప్పాడు తను నిద్రలేచాక.

ఈలోపు సౌడ్రిస్ నిద్రపోతున్నప్పుడు ఆమె శావల్ చేతిని పట్టుకుంది మృదువుగా. ఇద్దరూ నడిచారు నది ఒడ్డున పొలంగట్లమీద. ఆమె సుతారంగా అతని భుజంమ్మీద వాలింది. కొంటెగా నవ్వుతూ చెప్పింది ‘మత్తెక్కి ఉన్నానోయ్ నేస్తం! గమ్మత్తైన మత్తు…’

తను ఆమె ముఖంలోకి చూశాడు – వేగంగా కొట్టుకుంటున్న తన గుండెచప్పుడు తనకే వినిపించింది. తను తెల్లమొహం వేసినట్లు… జావగారిపోయినట్లు… ఆమెకి కనిపించాడేమో, తనలో పరవళ్లు తొక్కే కాంక్షని వణికే చేతులు సరిగా సూచించలేదనుకుంటా.

అడవి మల్లెలతో, కలువ పూలతో సిగని అలంకరించుకుని గోముగా అడిగింది: ‘ఇలా ఉంటే అందంగా ఉన్నానా?’

దీనికి ఏం చెప్పాలో తనకేమీ తోచక ఆమె ముందు మోకరిల్లాడు, నిరుత్తరుడై.

అసంతృప్తితో గీరబోయిన గొంతుతో పకాలున నవ్వి ‘మందమతీ! కనీసం మాట్లాడటమైనా చేతగాదా?’ అంది. తనకి ఏడ్వాలనిపించింది మాటలు దొరకని ఆ సందర్భంలో. నాటి సంగతులన్నీ తాజాగా, అవి జరిగిననాడంత స్పష్టంగా గుర్తుకొస్తున్నాయి. ‘మందమతీ! కనీసం మాట్లాడటమైనా…’ అని ఎందుకందామె? ఎంత సున్నితంగా తన భుజంమ్మీద వాలిందీ అతను జ్ఞాపకం చేసుకున్నాడు.

తర్వాత గుబురునీడల చెట్ల కింద నడుస్తూ ఆమె చెవి తన చెంపకాన్చింది. తను చటుక్కున ముఖం తిప్పేసుకున్నాడు, ఆ నునుపు దేహపు స్పర్శ అనాలోచితం, అసంకల్పితమేమోనన్న శంకతో.

‘మనం తిరిగి వెళ్లే వేళయ్యిందేమో కదా…’ అని తాను అన్నప్పుడు ఆమె తనవైపు అదోలా చూసింది.

‘తప్పకుండా’

ఆ ‘తప్పకుండా’ అన్నమాట ఆమెకి తన గురించి ఉన్న అలుసైన అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. అప్పుడైతే తను మరేఇతర విషయాల్ని ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఏదో కొత్త విషయం తేటతెల్లమవుతోంది.

‘నీ ఇష్టమొచ్చినట్టే కానీయ్! నువ్వు అలసిపోయినట్లయితే వెళ్లి పోదాం’ అందామె.

‘నాకు అలుపని కాదు. సౌడ్రిస్ ఈపాటికి నిద్రలేచి ఉంటాడని..’ అని తను బదులిచ్చాడు.

‘నా భర్త లేచాడేమోనన్నదే నీ భయమైతే, పద తిరిగి వెళ్లిపోదాం’

తిరిగి వచ్చేటప్పుడు ఆమె అతని భుజంమ్మీద ఒరగలేదు. మౌనంగా ఉండిపోయింది.

ఎందుకని? ఇదివరకు ఎన్నడూ లేనిది ఇప్పుడు మాత్రం ‘ఎందుకు?’ అని తర్కించుకోవడం అతనికి చాలా అనవసరంగా తోచింది. అయినా, తనకప్పుడు అర్థంకానిదేదో ఇప్పుడు బాగా స్పష్టమవుతుంది. అది ఏమైఉంటుంది? శావల్‌కి చప్పున సిగ్గేసింది. వయసు ముప్ఫై ఏళ్లు వెనక్కి జరిగినట్టు ఉత్సాహంగా లేచాడు ఒక్క ఉదుటున. ఆమె తనతో ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని విప్పి చెప్పినట్టుగా తోచింది. అది నిజంగా సాధ్యమేనా? ఈ సంశయం అతనిలోకి చొరబడి

అంతరాత్మను చిన్నాభిన్నం చేస్తుంది. తను కలోనైనా తలవనిది, ఏనాడూ అనుభవంలో లేనిది…. అది నిజమేనా? అతను తనలో తాను అనుకున్నాడు – ‘నేనీ విషయాన్ని తేల్చుకోవాలి. సందేహంతో సతమతమవడం నరకం. కాబట్టి తాను తెలుసుకు తీరాలి…’

త్వరత్వరగా బట్టలేసుకున్నాడు. ‘నాకు అరవై రెండేళ్లు, ఆమెకు యాభై రెండేళ్లు. కాబట్టి ఆమెని నొప్పించకుండా అడగొచ్చు, ఈ వయసులో’ అనుకున్నాడు. వెంటనే బయల్దేరాడు. సౌడ్రిస్ ఇల్లు వీధి ఆవలవైపే. దాదాపు తనకి ఎదురిల్లే. వెళ్లి తలుపు తట్టాడు. పని మనిషి వచ్చి తలుపు తీసింది.

‘శావల్ గారూ! ఏమిటింత ఉదయాన్నే? కొంపతీసి ఏ ప్రమాదమూ లేదుకదా!’ అందా పనిమనిషి.

‘అలాంటిదేమీ లేదు. నేను తక్షణం ఆమెతో మాట్లాడాలి. అమ్మగారి చెప్పు…’

‘అమ్మగారు చలికాలానికి గాను జామ్స్ తయారు చేస్తున్నారు. వంటింట్లో హైరానా పడుతున్నారు కాబట్టి ఎలా ఉండిఉంటారో మీరు అర్థంచేసుకుంటారనుకుంటాను.’

‘అయినా సరే! ఆమెతో చెప్పు అతిముఖ్యమైన విషయం మాట్లాడితీరాలని’

పనిమనిషి లోనికెళ్లింది. శావల్ ఆందోళనగా పెద్దపెద్ద అంగలు వేస్తూ ఆ డ్రాయింగ్ రూమ్‌లో పచార్లు చేయసాగాడు. అయితే అతనేమీ ఇబ్బందిపడటం లేదు. కూరలో ఏవీ ఏ పాళ్లలో వేయాలో అడిగినంత మామూలుగా ఆమెను అడగాలనుకుంటున్నాడు:

‘నాకు అరవై రెండేళ్లని నీకు తెలుసా?’

తలుపుతీసుకుని వచ్చిందామె. ఇప్పుడామె నిండైన విగ్రహం. నిగారింపు చెక్కిళ్లు, గుండ్రని ఒళ్లు, మనోహరమైన నవ్వు. పంచదార పాకంలో ముంచిన చేతులు ఒంటికి ఆనకుండా నడుస్తూవచ్చింది. జబ్బలకు పైకి మడిచిన చేతులున్న గౌనులో వడివడిగా వచ్చి ఆత్రంగా అడిగింది:

‘మిత్రమా! ఏమిటి సంగతి? నువ్వు కుశలమే కదా!’

‘కుశలమే గానీ, నేను నిన్నొక నిజాన్ని గురించి అడగాలనుకుంటున్నాను. అది చాలా ముఖ్యమైంది. నా గుండెలు పిండేస్తోంది. నాకు నువ్వు ప్రమాణపూర్తిగా నిజంచెప్పాలి….’ అని ఆగాడు.

ఆమె నవ్వింది….’నేనెప్పుడూ ఉన్నదున్నట్టే మాట్లాడతాను. అడుగు.’

‘సరే! నేను నిన్ను తొలిచూపులోనే ప్రేమించాను. నీకు ఆ విషయం తెలుసా?’

వెనకటి రోజుల్ని గుర్తుతెస్తూ మధురంగా నవ్విందామె. ‘మందమతీ! నాకావిషయం ఆ తొలిక్షణం నుంచే తెలుసు.’

శావల్‌లో కంపన మొదలయ్యింది. మాటలు కూడదీసుకొని అన్నాడు ‘నీకు తెలుసా? మరి…’ అర్థోక్తిగా ఆపేశాడు.

ఆమె అడిగింది ‘మరి మరి ఏమిటి?’

‘మరి నువ్వేమనుకున్నావ్. నీ స్పందన ఎలా ఉండి ఉండేది?’ అడిగాడతను.

చటుక్కున చిట్లిపోయే నురగల్ని చిలిపినవ్వులుగా మార్చిందామె. ఆ నవ్వులకి కదిలిన భుజాల మీంచి వేళ్లమీదగా జారిన పంచదార పాకం కార్పెట్ మీద వృత్తాలు చుట్టింది.

‘నేనా? అయినా నువ్వు నన్నేమీ అడగలేదే. ముందుగా చెప్పాల్ల్సింది నేను కాదుకదా….?’

ఆమె వైపు ఒక అడుగువేశాడతను. ‘చెప్పు… నాకు చెప్పు ఆనాడు భోజనం చేశాక సౌడ్రిస్ నిద్ర పోయాడే మనం నది ఒంపుదాకా కలిసి వెళ్ళామే… ఆ రోజు నీకు జ్ఞాపకం ఉందా?’

అతను సమాధానం కోసం ఆగాడు. ఆమె నవ్వడం ఆపి, అతని కళ్లలోకి సూటిగా చూసింది ‘అవును! నాకు బాగా గుర్తుంది.’

స్వాధీనంలోకి రాని స్వరంతో అన్నాడతను ‘ఆ రోజు ఒకవేళ… ఒక వేళ… నేను నిన్ను అడిగినట్లయితే నువ్వేంచేసేదానివి?’

నిర్విచారంగా, తనవంటి సుహాసిని మాత్రమే నవ్వగలిగే జాణతనంతో కించిత్ వ్యంగ్యపు జీర కలిసిన గొంతుతో నిర్మొహమాటంగా చెప్పింది – ‘ప్రియ నేస్తం! నేను తప్పక లొంగిపోయేదాన్ని’.

సమాధానం చెప్పి గిర్రున వెనక్కి తిరిగి, మళ్లీ వంటింటి వైపు వెళ్లిపోయింది.

ఏదో మహావిపత్తుని ఎదుర్కొన్న వాడిలా ఖిన్నుడైపోయిన శావల్ చప్పున వీధిన పడ్డాడు.

దిశ, గమ్యం లేనివాడి మాదిరిగా కురుస్తున్న వర్షంలో నిండా తడుస్తూ పెద్దపెద్ద అంగలతో నదిని చేరుకున్నాడు. నది ఒడ్డున ఎంతదూరం నడిచాడో తనకే తెలియదు. నిలువెల్లా తడిసి ముద్దయ్యాడు. గుడిసె చూరు నుంచి జారుతున్నట్టు అతని టోపీ మీంచి నీటిచుక్కలు అవిరామంగా రాలుతూనే ఉన్నాయి. వారు ఆనాడు భోంచేసిన ప్రదేశానికివచ్చాడు. అతని హృదయాన్ని వేదనకిగురిచేసిన నాటి సంఘటనలన్నీ జ్ఞాపకాలుగా మూకుమ్మడి దాడి చేశాయి. ఆకులు రాలిపోయిన ఒకానొక చెట్టుకింద కూలబడి ఏడ్చాడతను… ఎడతెగని దుఃఖంతో –

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, ఆగస్టు and tagged , , , , , , , .

3 Comments

 1. నరేష్ నున్నా గారు, మీ “పెదవులంటని అనుభవం“ అద్భుతహా!

  సౌడ్రిస్ భార్య నిగ్రహం, నిర్విచారం; తన మిత్రుడు సౌడ్రిస్ భార్యను ఆరాధించిన ఒంటరి బ్రహ్మచారి శావల్ అంతర్మధన, అంతర్వేదన. అడవిమల్లె తీగల్లా అల్లుకున్న వాక్యాలు, పరవళ్లు తొక్కిన వాక్యాలు. నిలువెల్లా తడిసి ముద్దయ్యాలా చేసిన మీ వాక్యాలు అద్భుతహా!

  అలవికాని అందం, ఊసులు, కలకూజితాల కంఠస్వరం, నానార్థాలు స్ఫురించే చిరునవ్వులు…
  శావల్ సౌందర్యారాధన తలపుల పలవరింతలు, జ్ఞాపకాల హృదయ వేదన, మధన మూకుమ్మడి దాడి చేసాయి.

  “ఆకులు రాలిపోయిన ఒకానొక చెట్టుకింద … ఎడతెగని దుఃఖంతో“ – అంటూ ముగించిన కధ గుండెను జీవన మకరందంతో, అమరానందంతో, మధురమైన బాధతో నింపినందుకు మోకరిల్లుతున్నాను.

  దీన్ని నాలాంటి మామూలు పాఠకుడు కాకుండా మీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారో, మీ చలం గారో, మీ త్రిపుర గారో మెచ్చుకుంటే మీకు న్యాయం జరిగినట్లవుతుంది.

 2. Great translation Sir. ఇలాంటి గొప్ప అనువాదాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

  అయితే అక్కడక్కడా కొన్ని పదాలు సూట్ అవ్వడంలేదు. గొప్పగా ఉండాలనో, మరే కారణంవల్లో – నేననుకుంటున్న ఆ కారణం ఇక్కడ చెప్తే నన్ను తంతారు :-) – ఎక్కువగా సంస్కృత పదాలు వాడుతున్నారు. కాస్త తెలుగులోనే రాయచ్చేమో ఆలోచించండి. ఉదాహరణకి, మస్తిష్కం అని రాశారు. అక్కడ బుర్రలో అని రాసుంటే ఇంకా బాగుండేదేమో! ఈ కథలో అనే కాదు తక్కిన మీ అనువాదాల్లో కూడా నేను ఇది గమనించాను.

  BTW, నాకు మరో సందేహం కూడా ఉంది. మీరు ఫ్రెంఛ్ నుండీ అనువాదం చేస్తున్నారా? లేదు ఇంగ్లీష్ లో చదివి అనువాదం చేస్తున్నారా?

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.