cover

అంతరంగంలో అల్లుకున్న అల్లిబిల్లి ఆపేక్షల గూడు – ‘జూకామల్లి’

Download PDF ePub MOBI

ఆదిమ మానవుడి నుంచి మనిషి సంఘజీవిగా మారడంలో ప్రధాన పాత్ర పోషించినది “బంధం” అనేది సుస్పష్టం. బంధానికి పునాది కుటుంబం. వ్యక్తిని బలోపేతం చేసి సాంఘికజీవిగా మార్చేది కుటుంబం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా, భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ కుటుంబ వ్యవస్థకి అత్యంత ప్రాధాన్యం ఉంది.

బీదా గొప్పా, రాజూ పేదా తేడాలున్నా ఎవరి కుటుంబం వారికి ముఖ్యమైనదే. కుటుంబంలోని వ్యక్తులను కలిపి ఉంచేదీ, వ్యవస్థని నిలిపి ఉంచేదీ ఆప్యాయతతో కూడిన బంధం.

కుటుంబ నేపథ్యంలో వచ్చిన రచనలెన్నో గతంలో పాఠకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ధోరణి కాస్త తగ్గినట్లనిపించినా, బంధాల రూపు మారుతున్నట్లనిపించినా, మౌలికంగా కుటుంబం ప్రాముఖ్యత ఇప్పటికీ తగ్గలేదు. కుటుంబ విలువలు, మనుషుల మధ్య అనుబంధాలపై రచనలు చేసే వారిలో శ్రీమతి కె.బి.లక్ష్మి గారు ఒకరు. కె.బి.లక్ష్మి గారి రెండవ కథా సంకలనం “జూకామల్లి”. ఈ సంకలనం లోని కొన్ని కథలను గురించి ప్రస్తావించుకుందాం.

“జనని” కథలో – లేక లేక పుట్టిన కూతురు అల్పాయుష్కురాలవడం తల్లిదండ్రులను కలచివేస్తుంది. పులి మీద పుట్రలా తండ్రి కిడ్నీ పాడయిపోవడం, కూతురు తన కిడ్నీని తండ్రికి దానం చేసి కన్నుమూయడం – చదువుతుంటేనే గుండె చెరువవుతుంది. ‘జనని’ అంటే అమ్మ, తన తండ్రికే తల్లయి ఆయుష్షు పోస్తుందా కూతురు.

వృద్ధాప్యంలో కొడుకు నీడకి చేరిన జగన్నాథానికి, కొడుకు కోడలు తనని ఎంత బాగా చూసుకుంటున్నా, ఏదో తెలియని వెలితి పట్టి పీడిస్తుంటుంది. తన పల్లెకి వెళ్ళిపోవాలనుకుంటాడు. కాని అనుకోకుండా తన ఊరి మనిషిని పట్నంలో చూసి పల్లెకి వెళ్ళిపోవాలన్న ఆలోచనని వదిలేస్తాడు. ఆ మనిషి జగన్నాథంతో ఏమన్నాడో, ఆయన నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేసాడో తెలుసుకోవాలంటే “ఊరు మారినా… ఉనికి మారునా..” కథ చదవాలి.

నేటి కాలపు పుస్తకావిష్కరణ సభలపై రచయిత్రి సంధించిన వ్యంగ్యాస్త్రం “సమీక్ష” కథ. విదేశాల్లో స్థిరపడిన ఓ రచయిత తను తెలుగులో మొదటిసారి వెలువరించిన కథా సంకలనాన్ని ఆవిష్కరించడానికి ఇండియా వస్తాడు. తనకే తెలియని ‘ఆత్మీయ అతిథులు’ తనకుండడం చూసి ఆశ్చర్యపోతాడు.

ఓ నడివయసు ఇల్లాలికి ఉన్నట్లుండి బొకేలూ, కొరియర్‌ వస్తాయి. ఎవరు పంపిస్తున్నారో అర్థం కాదు. చెడు ఊహలు లేకుండా, వివాహితతో స్నేహం చేసే మగవాళ్ళుంటారా అని అంతకు ముందే అనుకుంటుందామె. ఇంతలో అపరిచిత వ్యక్తి నుంచి బొకె… వాటిని పంపించింది ఎవరు? ఎందుకు పంపారు? ఈ ఘటన ఏ పరిణామాలకు దారితీసిందో తెలుసుకోవాలంటే “చెలిమి” కథ చదవాలి.

ఎన్నో ఏళ్ళ తర్వాత కనపడ్డ నేస్తం, ఇంకా కష్టాల కడలిలోనే ఉందని భావిస్తుంది మీనా. కాని ఆమె ఊహ పూర్తిగా నిజం కాదు. ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని జీవిస్తున్న మిత్రురాలు శాంత కథ విన్నాక, తన అభిప్రాయం మార్చుకుంటుంది మీనా – “ఇది నా దారి” కథలో.

అందరూ దాదాపుగా మర్చిపోయిన అలవాటు ఉత్తరాలు రాసుకోవటం! ఓ అన్న తన చెల్లెలికి ఆప్యాయంగా రాసుకున్న ఉత్తరాలు ఓ కుటుంబానికి భరోసా కల్పించిన వైనం తెలుసుకోవాలంటే “సుభద్ర” కథ చదవాలి.

తలపాగా బరువు కాదని, అది బాధ్యత అని, కర్తవ్య నిర్వహణకు ప్రతీక అని తెలియజేస్తాడో రాజస్థానీ యువకుడు “పగిడీ!” కథలో. ఒంటి పిల్లి రాకాసిగా మారి, అహంభావంతో అయినవారిని దూరం చేసుకొన్న ఓ ఇల్లాలిని మార్చడానికి భర్త ప్రయత్నిస్తాడు, ఆ రాజస్థానీ యువకుడి స్ఫూర్తితో. మరి ఆమె మారిందా? మారడానికి సిద్ధమయ్యిందా? ఆసక్తిగా చదివించే కథ ఇది.

కొత్త దంపతుల మధ్య తలెత్తే అపోహలను, చిన్న చిన్న అనుమానాలతో, ఒకరినొకరు శిక్షించుకునే భార్యాభర్తల ప్రవర్తనను సందర్భోచితంగా పాటలను ప్రస్తావిస్తూ చెబుతుంది “కొత్తరోజు పరిమళాలు” కథ. ఎంత చదివినా, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా మొగుడనే వాణ్ణి కొంగున కట్టేసుకోవాలనుకునే యువతులకి; “కళ్ళతో కట్టిపడేసే నేర్పుంటే కౌగిలి సడలదని”, అనుమానాలని అప్పటికప్పుడు తీర్చేసుకుంటే అపార్థాలకి తావుండదని చెబుతుందీ కథ.

మనుషులు ఎలా ఉంటే ఇల్లు బాగుంటుందో, కుటుంబాలు బావుంటాయో, ఊర్లు బావుంటాయో తెలిపే కథ “నాటేది ఒక్క మొక్క”. అందరూ అలా ఉంటే, కనీసం ఉండడానికి ప్రయత్నిస్తే, ఎంత బాగుంటుందో కదా అని అనిపిస్తుందీ కథ చదివాకా.

భార్యాభర్తల మధ్య చిలిపి కబుర్లు, ఇంటి పరిసరాలలో జరిగే ఘటలనలతో అల్లిన హాస్య కథ “ఏమండోయ్ శ్రీవారు”. స్వైన్‌ఫ్లూ నేపథ్యంలో చతురమైన సంభాషణలతో కథని నడిపిన తీరు బాగుంది.

ఒకప్పుడు ఎంతో సరదాగా జీవితం గడిపిన యువ దంపతుల మధ్య – చాపకింద నీరులా – అగాధం సృష్టిస్తుంది కాలం. ఇద్దరి ధోరణి, కెరీర్ వేరు వేరయి, ఎవరి జీవితం వాళ్ళదయిపోతోందని తెల్సినా ఆగి ఆలోచించలేని తీరికలేనితనం, గాఢమైన సాన్నిహిత్యం పలచన అయిపోయిన వైనం చెబుతుంది “పూచే పూలలోన” కథ. చేసిన తప్పుని, కోల్పోయిన ఆనందాన్ని గ్రహించిన భర్త ఏం చేసాడు?

బోగీ అంతా తమదే అనుకుంటూ తమ వల్ల తోటి ప్రయాణీకులకి కలిగే అసౌకర్యాన్ని ఏ మాత్రం పట్టించుకోని జనాలపై వ్యంగ్య బాణాలు విసురుతుంది “హ్యాపీ జర్నీ” కథ. కొద్దిపాటి వయసుకే, ముదిమి మీద పడిందనుకుంటూ, అపసోపాలు పదే వ్యక్తులకు వయసుతో నిమిత్తం లేకుండా ఆనందంగా ఉండడం నేర్పుతుంది “జీవిత పాఠం” కథ. పాజిటివ్‌గా ఆలోచిస్తే, మానవ సంబంధాలు ఎంత ఆత్మీయంగా అనిపిస్తాయో చెబుతుంది “అమ్మ అన్నది..?” కథ.

ఓ వికలాంగ యువతి జీవితాన్ని నందనవనం చేసి, ఆమె బ్రతుకులో కొత్త పరిమళాలు నింపి, తాను లేకపోయినా జీవన సమరాన్ని ధైర్యంగా ఎదుర్కునేలా చేసిన ఓ భర్త కథ “జూకామల్లి”. శారీరక అందాన్ని కాకుండా, వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఆ భర్త – భార్యలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన వైనం హృద్యంగా ఉంటుంది. ఈ కథ శీర్షికనే పుస్తకానికి శీర్షికగా ఎంచుకోడం బాగా నప్పింది.

“సదానంద కళ”, “సీతత్త” – ఈ రెండు కథలూ కుటుంబాలలో నిత్యం జరిగే సంఘటనలకు కథారూపం. ఇంకా కొన్ని కథలున్న ఈ పుస్తకం ఆసాంతం చదివిస్తుంది. ఈ కథలలోని పాత్రలు మధ్యతరగతి ప్రజలకు ప్రతిబింబాలు. తాము బాగుంటూ, ఇతరులూ బాగుండాలని కోరుకుంటాయి. తోటివారికి వీలైనంత సాయం చేసినా, వాటి గురించి అనవసరంగా గొప్పలు చెప్పుకోని సంస్కారవంతమైనవి. ఈ పాత్రలు ఉన్నవాటితో సంతృప్తిగా జీవిస్తూ, జీవితాన్ని ఆస్వాదిస్తూ, అలా బ్రతకడంలోని మజాని అందరికీ చెబుతాయి.

ఈ కథలలోని పాత్రలన్నీ మనకి చిరపరిచితమైనవిగా అనిపిస్తాయి. ఆయా ఘటనలు మన జీవితంలోనూ జరిగినట్లనిపిస్తాయి. అందుకే ఇవి మన కథలుగా, ఈ కథలలోని జీవితాలు మన జీవితాలుగా అనిపిస్తాయి. చక్కని అనుభూతులను రేకెత్తిస్తూ, హాయిగా చదివించే పుస్తకం “జూకామల్లి”. ‘స్నేహనికుంజ్’ ప్రచురించిన ఈ పుస్తకం వెల 140/- రూపాయలు. 184 పేజీల ఈ పుస్తకం కినిగెలో ఈబుక్‌గా లభిస్తుంది. కినిగె వెబ్‍సైట్ నుంచి ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు.

– కొల్లూరి సోమ శంకర్

Sneha NikunjJukamalli Front Cover
# 206, Bishan Apts,
Srinagar Colony Road,
Panjagutta,
Hyderabad – 500 082

ప్రింటు & ఈబుక్స్ కినిగెలో లభ్యం

Download PDF ePub MOBI

Posted in 2014, ఆగస్టు, పుస్తక సమీక్ష and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.