Julio Cortazar

బ్లో అప్

Download PDF   ePub   MOBI

(ప్రసిద్ధ సినిమాలకు మూలమైన కథానికల్ని తెలుగు పాఠకులకు అందిచాలనే ఉద్దేశంతో వెంకట్ సిద్ధారెడ్డి నెలకొక కథానికను అనువదిస్తారు. తొలి విడతగా, మైకేల్ ఆంటొనియాని సినిమా “బ్లోఅప్” మూలమైన హూలియో కొర్తసార్ కథానిక “ద డెవిల్స్ డ్రూల్”ను ఈ నెల అందిస్తున్నాం.)
cinema venuka kathaluచాలా రోజుల క్రితం నేను బ్లో-అప్ అని ఒక సినిమా చూశాను. ఆంటోనియాని దర్శకుడు. ఆ తర్వాత కాలంలో ఈ సినిమా చాలా సార్లు చూసినప్పటికీ, ఇప్పటికీ ఆ సినిమా అర్థమయ్యీ, అర్థం కానట్టే ఉంటుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నంలో నాకు తెలిసొచ్చిందేంటంటే,  “Las Babas del Diablo” అనే కథ బ్లోఅప్ సినిమాకి మూలం అని. ఈ కథలోని కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని కొన్ని సరికొత్త అంశాలను జోడించి బ్లోఅప్ సినిమా తీశారు. అర్జెంటినా దేశానికి చెందిన కొర్తసార్ ఈ కథా రచయిత. అసలీ కథేంటో చూద్దామని ఆ కథ యొక్క ఇంగ్లీష్ అనువాదం చదివాను. చదువుతున్నది ఇంగ్లీషే కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు. కానీ ఇందులో నాకర్థం కానిది ఏదో ఉందని మాత్రం అర్థమయింది. అసలా కథ రాసిన విధానం గమ్మత్తుగా ఉంటుంది. అంతకుముందెప్పుడూ అలాంటి ప్రయోగం చూడలేదు. షార్ట్ స్టోరీస్ ఆధారంగా రూపొందిన చలనచిత్రాల మూల కథలను ఎన్నుకుని తెలుగులోకి అనువదించాలన్న ప్రయత్నంలో మొదటగా నాకు కొర్తసార్ కథ గుర్తొచ్చింది. దీంతో మొదలుపెట్టేద్దామనుకుని మరోసారి చదివాను. అంతకుముందుకంటే ఇంకొంచెం ఎక్కువ అర్థమైంది కానీ పూర్తిగా అర్థం కాలేదు. అది కథలోని లోపం కాదు. కొర్తసార్ రచనా శైలి అంతే! బోర్హెస్ అనే మరో రచయిత మాటల్లో చెప్పాలంటే…
“No one can retell the plot of a Cortázar story; each one consists of determined words in a determined order. If we try to summarize them, we realize that something precious has been lost.” (Jorge Luis Borges)
కథేంటో చెప్పడమే కష్టమైన కొర్తసార్ కథ ని అనుదించాలనుకునే ధైర్యం నాకెలా వచ్చిందో తెలియదు. కానీ అనువదించడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి రోజూ నన్ను నేను తిట్టుకున్న సందర్భాలే ఎక్కువ. చాలా కాంప్లెక్స్ కథ కి నెరేటివ్ కూడా అంతే కాంప్లెక్స్ గా ఉన్న కథ. చాలా సార్లు నావల్ల కాదని ఆపేద్దామనుకున్నాను కూడా. మొత్తానికి ఏదో చేసి పూర్తి చెయ్యగలిగాను. అంతా అయ్యాక నాకు బ్లోఅప్ సినిమా మాత్రమే కాదు, కథ కూడా పూర్తిగా అర్థమైనట్టే అనిపించింది. కానీ ఏమర్థమయింది అని ఎవరైనా అడిగితే మాత్రం వివరించలేనటువంటి అనుభవం అది. – వెంకట్ సిద్ధారెడ్డి

బ్లో అప్

- హూలియో కొర్తసార్ (Julio Cortazar)

ఇది ఎలా చెప్పాలో ఎప్పటికీ తెలియదు. ప్రయత్నించి ఉత్తమ పురుషలోనో మధ్యమ పురుషలోనో చెప్దామా, లేదా ప్రథమ పురుషలో చెప్దామా? లేదా చివరికెలాగూ వృథాప్రయాసగానే తేలే సరికొత్త ప్రక్రియ ఎందులోనన్నా మొదలుపెడదామా! ఒక వేళ ఎవరైనా ఇలా చెప్తే ఎలా ఉంటుంది: “నేను నిన్న చంద్రోదయాన్ని చూడబోతున్నాను,”  లేదా: “మనందరం కలిసి నా కళ్ళు రేపు పొడిచేశాం”, లేకపోతే ఇంకొంచెం కొత్తగా: “సుందరీ నువ్వే ఆ మేఘానివి… నీ, నా, మన, వారి, అతని ముందుగా తరలిపోయే మేఘానివి”.  ఛీ…పరమ చెత్తగా ఉంది. ఎంత కొత్తగా చెప్పాలనుకున్నా ఇది చెప్పడం మాత్రం అంత సులభం కాదు.

చెప్పడానికి సిద్ధమై కూర్చుని, మళ్లీ ఫ్రిజ్ లో ఉన్న బీర్ తాగాలనిపించి లేచి వెళ్లినప్పుడు, ఒకవేళ టేబుల్ మీదున్న టైప్ రైటర్ దానిపాటికదే టైప్ చేసుకుంటే పోతే అంతకంటే సుఖం ఏదీ ఉండదు. కానీ అలాంటి సౌకర్యం లేదని నాకు బాగా తెలుసు. నేనిక్కడ్నుంచి లేచిన మరుక్షణం ఈ టైప్ రైటర్ ఇక్కడే రాయిలా నిశబ్దంగా కూర్చుంటుంది. టేబుల్ మీద నిశబ్దంగా, నిశ్చలంగా కూర్చుని ఉన్న ఈ కెమెరా ని చూస్తే ఆ విషయం మరింత గట్టిగా రూఢీ అవుతుంది. నీకంటే, నాకంటే, ఆ అందమైన అమ్మాయుకంటే, ఆ మేఘాలకంటే – ఒక మెషీన్ గురించి మరో మెషీన్ కే ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. కాబట్టి, వేరే మార్గం లేదు. ఇది ప్రపంచానికి చెప్పాలని అనుకున్నాక, మనలో ఎవరో ఒకరు రాసి తీరాల్సిందే. ఆ రాసేది నేనైతే మరీ మేలు; ఎలాగూ మిగిలిన వాళ్లలా రాజీపడలేక చచ్చాను కాబట్టి, నాకు మేఘాలు తప్ప మరేవీ కనిపించవు కాబట్టి, నా ఆలోచనలకు ఎవరూ భంగం కలిగించలేరు కాబట్టి (అదిగో మరో మేఘం…. బూడిద రంగు అంచులతో అటుగా వెళ్తోంది), నేను రాస్తున్నప్పుడు ఎవరూ ఆటంకం కలిగించరు కాబట్టి, నేను ఎలాగూ చచ్చినట్టే కాబట్టి (నేను బతికే ఉన్నాను. అనవసరంగా అపార్థం చేసుకోకండి. సమయం వచ్చినపుడు మీకే అర్థమవుతుంది. ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి కాబట్టి ఇక్కడ మొదలు పెడ్తున్నాను. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మొట్టమొదట్లో మొదలుపెట్టడమే మంచిదని మీకే తెలుస్తుంది.)

ఆలోచిస్తే ఇదంతా నేనెందుకు చెప్పాలని కూడా అనిపిస్తుంది. కానీ మనం చేసే పనులన్నింటికీ కారణాలేంటని ఆలోచిస్తూ కూర్చుంటే, ఎవర్నుంచో అందిన డిన్నర్ పిలుపును ఎందుకు అంగీకరించామనో (అదిగో ఒక పావురం ఎగిరిపోతోంది…. కానీ ఎందుకో అది పిచుకలా అనిపించింది) లేదా, ఎవరైనా ఒక మంచి జోక్ చెప్పగానే కడుపులో ఏదో ఉబ్బరంలా మొదలై అప్పటికప్పుడు పక్క ఆఫీసులోకి వెళ్లి ఆ జోక్ ఇంకొకరికి చెప్పే వరకూ ఎందుకు కుదురుగా ఉండలేకపోయామో ఆలోచిస్తూ కూచుంటే, ఏం జవాబు తడుతుంది; ఎందుకో అలా చేయటం బాగుంటుందని, అంతే. ఎందుకంటే ఎవరూ చెప్పలేరు, కాబట్టి చేయాల్సిందల్లా ఏమిటంటే, అన్ని సంకోచాలూ మీమాంసలూ పక్కన పెట్టేయటమే. ఎవరైనా ఊపిరి పీల్చటం గురించీ, బూట్లు తొడుక్కోవటం గురించీ సిగ్గుపడతారా; అవి మనం సహజంగా చేసే పనులు, అంతే. అలాగే ఏదన్నా వింత జరిగినపుడు, అంటే నువ్వు తొడుక్కునే బూట్ల మీద సాలీడు కనిపించినపుడో, నువ్వు ఊపిరి పీల్చుకున్నప్పుడు నీ లోపల ఏదో బద్దలయినట్టో అనిపించినపుడో – అప్పుడు జరిగిందేమిటో చెప్పుకోవాలి, మీ ఆఫీసులో కొలీగ్స్ తోనో, లేదా హాస్పిటల్ లో డాక్టర్‍తోనో చెప్పుకోవాలి. డాక్టర్, నేను ఊపిరి తీసుకున్నప్పుడల్లా…. అంటూ చెప్పి తీరాల్సిందే, నిన్ను నిలవనివ్వని నీ కడుపులో ఉబ్బరాన్ని  తీర్చుకోవాల్సిందే.

సరే. ఇప్పుడు దీని గురించి చెప్పుకోవాల్సిందే అనే గట్టి నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మొదలుపెడదాం. నవంబర్ ఏడవ తేది. ఆదివారం. అంటే సరిగ్గా ఒక నెల క్రితం ఒక భవనంలోని ఐదో అంతస్థులో మన కథ మొదలవుతుంది. ఐదో అంతస్థునుంచి మెట్లు దిగి బయటకొచ్చి ప్యారిస్ వీధిలోని ఆ ఆదివారపు ఎండలో నిలబడితే – నవంబర్ నెలలోనూ ఇంత ఎండా? అని ఆశ్చర్యపడుతూ నగరం మొత్తం చుట్టివెయ్యాలని, చూసిన దృశ్యాలను ఆకలిగా కెమెరా లో (నేనొక ఫోటోగ్రాపర్ ని) బంధించాలనీ అనిపించకమానదు. నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి ఒక విధానం కావాలి; మార్గం కావాలి. లేదంటే కష్టం. మళ్లీ మళ్లీ ఇదే విషయం చెప్తున్నానన్న భయం నాకు లేదు. ఈ విషయం చెప్పడం ఎందుకింత కష్టమంటే ఇది ఎవరు చెప్తున్నారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను నేనేనా అని నా అనుమానం. నేను నేను కాకపోతే ఇది చెప్తున్నదెవరు? కళ్లతో చూసింది మాత్రమే ఇక్కడ చెప్పుకుందామా? అసలు కళ్లతో చూసిందంతా నిజమేనా? (మేఘాలు, అప్పుడప్పుడూ అటుగా ఎగురుతోన్న పావురాలు) నా నిజం, నీ నిజం ఒకటేనా? లేదా ఏదో ఒకటి చెప్పేయాలనే తపనతో నేనిలా చేస్తున్నానా? ఏదోఒకటి! ముందైతే చెప్పేస్తాను.

Posted in 2013, Uncategorized, అనువాదం, డిసెంబరు, సినిమా వెనుక కథలు and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.