cover

జిందగి

Download PDF ePub MOBI

ఎయిర్టెల్ టవర్ కాడ, పద్మజ్యోతి పాలీక్లినిక్ ముంగట, ఆల్టో కారు, ఐతే రాముల్గాడు ఉన్నడు క్లినిక్లనే, మద్యానం ఎండకు రోడ్డు ఎండిపోయిన పిట్టగూడు లెక్కుంది, ఏర్పడ్తలేగని, కాల్నొప్పి మస్తుంది, Glipizide గోలీలు ఐపోయినయ్, తెచ్చుకోవాలె ఇంటిక్వోయేటప్పుడు, దీనమ్మన్.. జమాన స్ప్లెండరిది, కొత్తద్దీయ్యాల్నేమో, బజాజ్ డిస్కవర్దీద్దాం.. హా.. డిస్కవర్దీద్దాం.. బండి సెంటర్ స్టాండ్ ఎయ్యనీగ్గూడ కష్టమైతాంది, కుంటోన్నైతున్న మెల్లమెల్లగ, క్లినిక్ మెట్లొక్కస్తలే, ఇంట్ల మందున్నదో లేదో, సాయంత్రం బావగాడొస్తాన్నడు , ఈ రిసెప్షన్ల పోరడు నన్ను గుర్తువడ్తడా, మా బల్లె సదివినోన్లెక్కనే ఉన్నడు,

“రాముల్డాక్టరున్నాడు బాబూ?”

“రాజిరెడ్డిసారా రాండ్రి సార్, హా ఉన్నడు, లోపల్రూంలున్నడు, ఇద్దరు పేషెంట్లు వొయిర్రు పద్నిమ్షాలకింద, జెర్సేపు కూసొర్రి, నేన్సారుకు జెప్పొస్త”

“వొద్దొద్దు, ఉండనీ, ఎగిర్తమేంలే, కూసుంటతీ, ఔగనీ, నీపేరేమో ఉండే?”

“రాజు సార్, మీ బల్లెనే సదూకున్న, శెయ్యి మట్టల మీద వాయిలిబర్గెల్తోని కొట్టి సదువ్ నేర్పిర్రుగని, నాకే ఎక్కలేసా, ఎస్సెస్సీ ఫేలైన, మల్ల పరీక్షల్రాయ్లే, రాముల్డాక్టర్కు పాలోల్లమైతం, అట్లా, ఇక్కడ పన్జేసుకుంటున్న”

“రాజూ, నీకో తమ్ముడో అన్ననో ఉండెగదరా, ఏం జేస్తుర్రిపుడు”

“తమ్ముడే సార్, సురేషు, నాకెట్లాగూ సదువెక్కలేదని వాన్ని సదూపిస్తున్న బాగ, MLT చేస్తుండు పట్నంల, మా అయ్య సచ్చినంక మావొంతుకు నాల్గెక్రాలొచ్చింది ఊర్లె, ఎవుసం మా అమ్మ సూస్కుంటది, సురేషని సదువైనంక ఇక్కడ్నే ఆస్పిటల్ల వాన్తోని ల్యాబ్ వెట్టిద్దామన్కున్నా, రాముల్సార్తోనిగుడ్క మాట్లాడ్న ఎప్పుడో”

“అయ్య సచ్చినా కష్టంజేస్కుంట అమ్మను తమ్మున్ని సూసుకుంటున్నావ్ బిడ్డా, సల్లగుండుపో.. వొస్తమరి, లోపలున్నోల్లు బైటికొస్తున్నట్టుర్రు”

లోపల రూంల రివాల్వింగ్ చెయిర్ల రాముల్డాక్టర్, ఇర్వయ్యేండ్లసంది నాకున్న దైర్యం… టేబుల్మీద పేపర్‌వెయిట్, మెడికల్ రిప్పోల్లిచ్చిన సీలిప్పని టాబ్లెట్ల డబ్బ, బీ.పీ మెషీన్, స్టెతస్కోప్… ఇనుప కుర్చీల కూసున్న నన్ను చూశి నవ్వి దగ్గర్కొచ్చి నా ప్యాంట్ మోకాల్ల మీద్దాక మడిశి నల్లగై కమిలిపోయినట్టున్న కాళ్ళూ, పెంకమీద కాలి ఇరిగిన కట్టెపుల్లలసోంటి గోర్లూ చూశి,

“రాజన్నా, మస్తు లేటైంది, నీకు షుగరున్నదే.. దెబ్బలేం తాకిచ్చుకోకు.. దెబ్బేమన్న తాక్తె పుండై పార్తదే అన్చెప్తి రొండేండ్లకిందట్నే, కాదే, మంద్దాగి రాత్రి బండిమీద వొదినన్తీస్కని జగ్దేపూర్ దావతుకు పోవుడు అవుసురమానే, హా, నువ్ వడి మడిమకు తాకిచ్చుకుంటివి, వొదినె నుదురు వలగ్గొడ్తివి,”

“ఏ, కావాల్నని పడ్తామే, ఐందట్ల, గాశారం,”

“మస్తు లేటైందే, పుండు మోకాల్దాకా పారింది, ఎడ్మకాలు కొట్టేసుడొక్కటే, నువ్వేం మాట్లాడకింక, వొద్నెకు నేన్చెప్త, హలో, ఆ, నేను డాక్టర్రాములు మాట్లాడ్తున్నా, అనెస్తెటిస్ట్ శ్రీనివాసేనా, ఆ సీనూ, ఓ కేసున్నది, డయాబెటిక్ ఫూట్, హా నా దోస్తుదే, amputation, up to the knee, జెన్రల్ ఇద్దామా, లోకల్ అనెస్తీషియా సాల్తదా, సర్జరీల ఉన్నవా, సరే సరే ఫ్రీ ఐనంక నాకోసారి ఫోన్చెయ్ సీనూ, మర్చిపోకు, అర్జెంట్ జెర, సరే, ఉంట!

“రాజన్నా, వొద్నెకు ఫోన్జేశి హాస్పిటల్‌కు రమ్మంట, పిల్లలకు తర్వాజ్జెప్దాం, భయపడ్తరు లేకుంటె, రాజన్నా, ఇన్పిస్తుందా గాభరైతున్నవా, ఎందుకే ఏంలే, చిన్న మత్తిస్తం, మోకాల్దాకా, నొప్పేం తెల్వదే, ఏమాలోచిస్తున్నవ్..”

“ఇప్పుడొద్దుతీయే, ఇంటికి వొయ్యొస్త, తర్వాతెప్పుడన్న చేపిద్దాం, కాలు బాగనే ఉన్నది, బానే నడ్వొస్తుందే, ఇప్పుడద్దుతీ”

పిల్ల పెండ్లి కాలే, పోరలు ఆవార తిర్గుతున్నరు, గిప్పుడు కాలు కొట్టేస్కుంటెట్ల, వొద్దొద్దు, ఇప్పుడొద్దు..

“నువ్వేం సోంచాయిస్తున్నవో ఎర్కలేకని. కండీషనైతె సీరియస్, ఎంత జల్దీలైతె అంత మంచిది, ఇంకా పైకివార్తె కాలు కొట్టేశ్నా ఫాయిదా ఉండది,”

“ఏ, గాందాకెందుకే, రెండుమూడ్రోజులల్ల చేపిద్దాం, వొస్త మల్ల, కని ఇప్పుడొద్దే, ఇంత ఆగమాగమెందుకని, బాగనే ఉన్న రాములూ”

“నువ్వెట్లున్నవో నాకు తెల్వదాయే, బీ.పీ శానెక్కువుంది, కూసున్నకాడ వొగరుస్తున్నవ్, సిగరెట్లింక ముట్టిస్తనే ఉన్నట్టున్నవ్, కొట్టి శెప్పెటోన్నే ఐతె గీందాకొచ్చేదేకాదు, నీ ఇష్టం, పొలగాల్లనాగం చెయ్యకన్నా, మందు జెర బంజేశి కాలవడు ఇప్పటికన్న”

రాములు కండ్లల్ల నీల్లు, వార్నీ, డాక్టర్లు భీ ఏడుస్తరా, ఎంతమందినేడ్పిస్తౌరా బాడ్కావ్, నీ పుట్క..

“చేద్దామే, అన్ని చేద్దాం, ఒక్క రొండ్రోజులాగు, వొస్త మల్ల”

“ఏడికిపోతున్నౌ, జెరాగు, కూసో, పుండు సూశ్నవా ఎట్లుందో, డ్రెస్సింగ్ చేశ్నంక పో, సాఫ్ చేసుకోనీకన్న రోజిడిశి రోజు రారాదే, రాజూ, అరేయ్ రాజ్‌గా, పాపా సిస్టర్లను రమ్మను, cellulitis dressing ఉందన్చెప్పు, అట్లనే ఓ రెండు శాయల్వంపు, ఒకటి బగర్ శక్కర్. అబ్బాహ్, సూడు పుండెట్లుందో, బొక్క కానొస్తుంది, మంచిగుంది అనవడ్తివి మీదికెల్లి, ఈ పట్టి ఎన్నటిదే, రెండ్రోజులకోసారి పట్టీ మార్వాలి, లేపోతె ఇన్ఫెక్షన్ ఎక్కువైతది, నేనేదో నీ పాత బాకోన్లెక్క నా క్లినిక్‌కు రానే రావైతివి, పట్టి మార్వనీకి ఇంటికొస్తె ఇంట్లుండవైతివి, గన్ని పనులేందే రాజన్నా, స్కూల్టీచరెవడు రోజు స్కూల్‌కు పొయ్యేది, ఎవని రియలెస్టేట్ ప్లాట్ల బిజినెస్ వాన్దేనాయె, ఎవని చిట్టీ ల దంద వాన్దేనాయె”

“ఖాళీగేడున్ననే, నేనేం ఉత్త టీచర్నా, హెడ్ మాస్టర్నాయే”

“ఆ ఆ, ఇర్వయ్యేండ్లసంది హెడ్మాస్టర్వే, ఏ హెడ్మాస్టరే రోజిడిశి రోజు సంగారెడ్డి వొయ్యేది, ఎవలే నిద్రిడిశిపెట్టుకోని బిల్ల్స్ రాసేది, నీ తాగుడేందో నీ తిండేందో తప్ప ఎన్నడన్న పిలగాల్లను సూశ్నావే, మొన్నో దావత్ల ఎస్సై కలిశి, ఇట్ల, మీ రాజన్న పెద్దకొడ్కు పేరు పైరసీ సీడీ యవ్వారంల ఇన్పిస్తుంది, చెప్పోపారి అని పోయిండు, వాళ్ళేం చేస్తుర్రు.. ఏం ఏం తింటుర్రు ఎర్కేనా నీకేమన్న, శా తాగు, వొచ్చింది…”

“ఆ పైరసీ సీడీలల్ల మనోడేం లేడే, వాల్ల దోస్తులెవలో బద్మాష్గాల్లు, ఏదో కంప్యూటర్ అవుసరముందంటే మనోడిచ్చిండట దోస్తాన్ల, చిన్నోడు చెప్పిండు”

“ఆహ్.. ఖ.. ఖ, బగర్ శక్కర్ చాయ్ నాకొచ్చిందే, ముండకొడ్కు అటుదిటు వెట్టిపోయినట్టుండు, అరేయ్ రాజ్‌గా రాజూ..”

“హ హ హ, ఎట్లున్నది బగర్ శక్కర్, మజాకన్కున్నవా శుగర్ భీమారంటె, డాక్టర్‌సాబ్”

“మజాకేమున్నదే, మా అయ్యకుంటె నాగ్గూడొచ్చేది, అట్ల నా పొలగాల్లు బచాయించిర్రు, హ హ, ఆ పాపా, వొచ్చిర్ర, cellulitis dressing చేశిర్రా ఇంతకుముందు, తెల్సుకదా ముందు డిస్టిల్డ్ వాటర్, తర్వాత హైడ్రోజెన్ పెరాక్సైడ్, ఆ అంతే, పోవిడిన్ అయోడిన్ మర్చిపోయిర్రా, కన్పిస్తలేదు, తీస్కరాపోర్రి, ఎవరనుకుంటుర్రు, మా అన్న, మంచిగ చేయాలె”

నేన్నీకేమైతరా రామ్లూ, ఊరికి బత్కనీకొచ్చిన కొత్తల ఇర్వయ్యేండ్లకింద, నా ఇంట్ల కిరాయికున్నవ్, గంతె కదా, నేనేంజేశ్నరా నీకు అంతకంటె, నీకేమైత నేను, ఎన్నేండ్లు బత్కుతింక.. కాలున్నా , కొట్టేశ్నా.. నేన్జస్తె లక్ష్మి ఎట్ల, పొల్లేమైతరు…

“రాములూ, శ్రావనికి సమ్మందమొచ్చిందోటి, సిద్దిపేటోల్లు, పిలగాడు హార్డ్ వేర్ బిజినెస్, సొంత దుక్నముంది సీతారామాంజనేయ టాకీస్ముంగట, ఇది జెరంత సెటిల్జేశి నీకాడికొద్దామన్కున్నా, అంతే రామ్లూ, నీ దగ్గర నేన్దాశేదేమున్నది”

“నువ్ చెప్పకపోతె నాక్తెల్వదానే, వొదినె చెప్పింది, పొద్దుగాల్ల ఫోన్జేశింది, అప్పుడే చెప్పినుంటి వొదినెకు, పటేల్సాబును ఒక్కసారి క్లినిక్‌కు పంపీమని”

అందుకేనా లక్శ్మి పొద్దుగాల్సంది శెవుల జోరీగోలె మొత్తుకున్నది, రాముల్తానకు పొయ్యిరా అని, ఇందరు మంచోల్లుండంగ నాకేమైతది, ఏంగాద్.. అంతే.. నాకేంగా.. ఎంత ముద్దుగ కడ్గుతుర్రు పుండ్లను, శ్రావని వొయిసుంటదా వీల్లగ్గూడ, వీల్లు పెండ్లిల్లు చేస్కుంటరా…

“పట్టి మంచిగ్గట్టిర్రు బిడ్డా, బాగున్నది, పోయినసారి గిట్ల కట్టలే, గవర్నమెంటాస్పిటల్ల, రాములూ, ఇగ నేను పొయ్యొస్త, బావొస్తాన్నడు, అదే, లక్ష్మోల్ల అన్న, పిల్ల పెండ్లి గురించి మాట్లాడ్నీకి, ఔ, నీ పొలగ్గాల్లేడున్నరు”

“హో, వాల్లింక బడిసదువులల్లనే ఉన్నరే, హైద్రాబాద్ల, వాల్లమ్మగ్గూడ లెక్చరర్ కొలువుంది కద ఆడ్నె, వొస్తంతీ ఇంటికీసారి, పద్మ కూడ చాల్సార్లన్నది.. లక్ష్మొదినె ఇంటికి పోదామని, పిల్లలకు సెలవుల్రానీ.. అందరం వొస్తం, నువ్వైతె ఎల్లుండిరా, ఈ సార్నిన్ను ఇడిశేది లేదు, అట్లనే పిలగాల్లనోసారి పంపీయరాదే క్లినిక్‌కు, మాట్లాడ్త జెర్సేపు”

“సరే రాములూ, పంపిస్త, నేన్చెప్తె ఎట్లాగూ ఇనరు కొడ్కులు, సరే, వొస్త మరి,”

“హాహ్, రాజన్నా, మాటనే, మీ సడ్డకుడు, మీ బావ బాగ ప్రచారం చేస్తుర్రు నువ్ దివాల్దీశ్నవని, ఎవలికో ఫైనాన్సుల జమానతున్నవట, వాడు పరారై దొర్కుతలేడటకద, జెర జాగ్రత్తనే పైసలకాడ, మనోల్లె మనల్ని ముంచుతరు, ఏమన్నౌస్రముంటె చెప్పు, ఇబ్బందేంలే,”

“సరే రామ్లూ, గాందాకేం రాదుతీ, పొయ్యొస్తమరి, ఉంట, వొస్తరా పిలగా, రాజూ..”

లక్ష్మి అన్న, లక్ష్మి చెల్లె మొగడు , మనుశులెందుకిట్ల తయారైతరో, ఈ బతికే 60 70 ఏండ్లల్ల, కండ్లల్ల అగ్గిపోస్కొని ఓర్వలేకపోవుడేందో, జెర్ర మంచికుంటె కిరీటాలేం రాలి కిందవడ్తయా ఈ లంజొడ్కులై, ఆల్లు బతిలాడ్తెనే కద ఆ రియల్ ఎస్టేటోన్కి జమానతున్న, ఆల్ల దోస్తుగాడేగద వాడు, అందరు టీచర్ బాడ్కావులేకద, SGT సంతకం ఫైనాన్సుల నడ్వదని స్కూల్ అసిస్టెంట్ దే కావాల్నని నా సంకనాకి సంతకం పెట్టిచ్కుర్రుగద నియ్యతులేని లంజొడ్కులు, అప్పుడేమో పెద్ద మనిశన్నరు, ఇప్పుడు నువ్వో మనిశివీ అంటుర్రు, చత్, ఎవ్వడు మనోడు కాదు, అంత దొంగ లంజొడ్కులే, ఇప్పుడింటికి పోంగనే బావగాడుంటడు నక్కమొకమేస్కుని, ఎప్పుడెప్పుడు గవర్నమెంటాస్పటల్ పక్కజాగ దెంగిపోవాలని చూస్కుంట.. వాన్ని చూశి నవ్వాలె, మందు తాపియ్యాలె, పొల్ల పెండ్లికత మాట్లాడాలె, ఈ పోరగాల్లకు చెప్తె అర్దం కాదు, మున్గెదాక లోతు తెల్వది, నెలజీతంల సగం ఫైనాన్సుకే పాయె, ఇప్పుడు పిల్ల పెండ్లికి పైసలెట్లనో ఏమో, ఇల్లొచ్చెనా అప్పుడే, అబ్బాహ్ హ్, కాల్నొప్పి, ఈ ఇరిగిన సైడ్ స్టాండ్ కొత్తదేపియ్యాలె అనుకోవట్టి ఏకాలమాయె, ఛత్, పిల్ల పెండ్లి, ఇంటికి రంగులన్న ఏపియ్యాలే, మరీ బోడగున్నదిల్లు, బైటో లెట్రిన్ పొక్క తవ్వియ్యాలె, రేపు సుట్టపోడెవడన్నొస్తె ఎట్లుంటరో ఏమో ఈ ఇంట్ల, ఎందుకు బత్కుతున్నమో ఎప్పుడు తెలుస్తదో ఏమో, అందర్కి నాలెక్కనా అన్పిస్తదా, నేనే పిచ్చి బాపతోన్నా, కష్టమొచ్చిన ప్రతోడూ ఇట్లే అన్కుంటడేమో, అందర్నీ వానికన్న కల్పుకుంటడు, వాన్నన్న అందర్కెల్లి తీశేసుకుంటడు..

* * *

“నమస్తె బావా, ఎంతసేపైందొచ్చి, కూసో కూసో.. కరంట్లేదాయె లక్ష్మీ.. మీ అన్నకు షా పోశ్నవా లేదా, ఇప్పుడే వొస్త బావా, కాల్జేతులు కడుక్కొనొస్త”

పంటికింద నొప్పి దాస్కొని నడ్వాలె, ఈని ముంగట కుంటినట్టు నడిస్తే మల్లేదో కథల్లుతడు లోకమ్మీదికి, గలీజ్నాకొడ్కు, బాత్రూంల సబ్బేది, ఐపాయెనా అప్పుడే, పద్రోజులన్నగాలే, గిట్లైతె బాగనే నడుస్తది సంసారమ్

“లక్ష్మీ, సబ్బే, లక్ష్మీ..”

ఏదిది, హాల్లకుపొయ్యిందా, ఏమో మాటలిన్పిస్తున్నయ్, లక్ష్…

“అన్నా, మంచిసమ్మందం, ఇద్దరే అన్నదమ్ములు, ఆడిపిల్లలెవ్వల్లేరు, పెద్దాయినకు పెండ్లైంది, శిన్న పిలగాడు డిగ్రీ చేశిండు, హార్డ్ వేర్ షాపు నడిపిస్తుండు, వొచ్చేనెల్ల పూల్పండ్లు వెట్కుందామన్నరు, అప్పటికి శ్రావని పరిక్షలు కూడ ఐపోతై,”

“మొటాటోల్లు కాదటగదనే, ఏమిటోల్లు వాల్లు..”

“పాకనాటి రెడ్లు, ఐనా ఏమిట్లైతేంది, పిల్ల పిలగాడూ మంచిగుంటె సాలు”

“మీ ఇష్టమొచ్చినట్టు చెయిర్రి. మాకేం చెప్పి చూస్కొచ్చిర్రా సమ్మందం, మంచి మొటాటోల్లు కరువ్వొయ్యిర్రా లోకమ్మీద, ఐనా ఏమాగమొచ్చింది ఇప్పుడే పెండ్లికి, శెయిర్రి శెయిర్రి, మమ్మల్ని కల్పుకోకుంటనే శెయిర్రి,”

“ఔ, మిమ్మల్ని కల్పుకుంటె మా కడుపులు బాగనే నింపుతరు, నువ్వెట్టిన కతకే ఆయినిట్ల దివాల్దీశినట్టయ్యె”

“ఔ ఔ, లేకపోతె మీరు కోటీశ్వరులాయె”

“మేమా? మీరు కోటీశ్వరులన్నా, మీ యారాలు కొడ్కుకు గూడాటి రెడ్ల పిల్లనిచ్చి చేస్తరు బాగనే, మేమ్మాత్రం పాకనాటోనికియ్యద్దు, గంతేనా, పైసలున్నోడు ఏంచేశ్నా నడుస్తదిలే..”

“ఏమ్మట్లాడ్తున్నవే, వాల్లేడా మీరేడా, ఐనా గవన్ని మాట్లాడనీగ్గాదు వొచ్చింది, సర్కార్ దావఖాన పక్క జాగ ఎవల్కో అమ్ముతున్నడట మీ సార్”

“ఆ పొల్లపెండ్లికి ఎట్లాగూ అమ్మాలె కదా, పైసలెక్కడివి మాకాడ మరి, పురాగ ఏంపెట్టకుంట దాన్నెట్లిస్తం అత్తగారింట్ల”

“మరి ఫైనాన్స్ కిస్సలు ఎవలిస్తరు, రేపో ఎల్లుండో ఈనకేమన్నైతె ఆ పైసలెవడు కడ్తడు, వాల్లు నన్నడ్గరా సుట్టపోన్నని, ఇంకా ఇర్వై నెల్లున్నై కట్టేది, మొత్తం ఒక్కపారే కడ్తె జెర తక్కువకు మాట్లాడి కట్టుకోవొచ్చు”

“ఏందీ, వాడెవడో ఎగవెట్టిపోయిన ఫైనాన్స్ పైసలు మేం కట్టాల్నా, నీ దోస్తేగద వాడు, జెరంత చెప్పి కాలవడ్రాదు వానికి, వానింట్ల పీన్గెల్ల, మేమెవరికి అన్యాయం చెయ్యలేదు, ఒకని పైస తిన్లేదెప్పుడు..”

“ఏడున్నడ్వాడు ఎప్పుడో దెంకపాయె, జమానతున్నందుకు మనమే కట్టాలే, పోలీసోల్ల కాడికి పోతె మనిజ్జతే పోతది, అసల్కే పిల్ల పెండ్లి పెట్కుర్రు, గందుకే గా జాగ నాకే ఇస్తే, ఆ ఫైనాన్స్ కిస్సలుపొనూ ఎంత మిగుల్తె గంతిస్త, మీరు కావట్టి ముందుకొచ్చిన శెల్లే, లేకపోతే నాకేంతీట..”

—“లక్ష్మీ, గిలాసలేవే, రొండువట్కరా, ఉల్లిగడ్డ ముక్కలూ, వాటర్బాటిల్కూడ, లక్ష్.. ఏందే, హాల్లనే ఉన్నవా.. అప్పటి సంది పిలుస్తున్న.. ఏకాలమాయె, బాత్రూంల సబ్బులేదు, పెట్టుపో, ఆహ్మ్.. బావా.. ఏం తాగుతవే, విస్కీనా బ్రాందీయా..”

“ఏదోటి పొయ్యిగని, దావఖాన పక్కజాగ, ఎంతుంటది, 200 గజాలా 250 గజాలా”

“నీక్తెల్వదా ఎంతుంటదో అది, హ హ, ఏం రేటుంది ఆడిప్పుడు,”

“గజం రెండువేలన్నరు మరి, నేనింకో రెండొందలెక్కువిస్త”

“రొండువేలా, ఎప్పటిమాటది, ఇప్పుడు తెలంగానొచ్చే, కేసీఆర్ ఈడికెల్లే CM ఆయే, హా, ఆరేడువేలుందట కదా, సరే.. సూద్దాంతీ, అవుసరమొస్తె చెప్త”

“అవసరమే వొచ్చే, ఆ ఫైనాన్స్ పైసలు??”

“ఆ బావా, మర్చిపొయ్యిన అడ్గుడు, ఆ ఉమా మహేశ్వర్రావ్ ఫోన్నెంబరుందా ఏమన్న, లంజొడ్కు, తిడ్తె ఎట్లాగూ ఇయ్యడు, బతిలాడ్తెనన్న ఇస్తడేమో పైసలు.. లక్ష్మి… ఉల్లిగడ్డలు సాలే, ఓ ఆమ్లెటేస్కరా, తీస్కో బావా, ముత్తంత స్ట్రాంగ్ ఐనట్టుంది, మాటలల్లవడి మందెంత పడ్తుందో సూస్కోలే”

“ఆన్నెంబర్ నాతానెందుకుంటది, దెంకపోయిన లంజొడ్కాడు, నీ కిస్స కాకుంట ఇంకో కిస్సల నన్నిర్కిచ్చిపొయ్యిండు, నీకే ఏమన్న తెలుస్తే నాకు చెప్పాలె నెంబర్ రేపటెల్లుండి”

“సరేతీ, మొత్తానికి ఆంద్రోడు మస్తు తన్నిండు మన ముడ్లమీద, హ హహ, వొచ్చే ఆదివారం సిద్దిపేట వొయ్యొద్దాం బా, పన్లేం పెట్టుకోకు, అదే, మా ఇయ్యంపునింటికి, మా పిలగాడు అన్పిచ్చుకొనొద్దాం, రాదకు లక్ష్మి చెప్తా అన్నది”

“ఆదివారమా, కుదిరేటట్టులేదు, రాద అక్కలొస్తా అన్నరు, హన్మకొండకెల్లి,”

“ఔనా, పోనీతీ, ఏమే మెల్లెగ తాగవడ్తివి, బడికిపోవుడేం లేదుకద ఎట్లాగూ, అయ్యప్ప ఫైనాన్స్ లనే కూసుంటున్నవ్గదా, ఏమన్న పాట్నర్షిపున్నదా అండ్ల”

“యేహే, నేనేడ కూసున్న, ఓ రొండుమూడుసార్లు ఆ ఫైనాన్స్ కోమటోడు పిలిస్తె పొయ్యినా మందు తాగనీకి, ఆడో బేకార్లంజొడ్కు.. కొమటోడు..”

“హహ, నీ ముంగట అందరం బేకార్లంజొడ్కులమేతీ, హహ, సూడు, ఆదివారం కుదిరెటట్టుంటె మాత్రం రాకమానకు, పిల్లలు హైద్రవాద్లనే సదూతుర్రుకద, ఎట్లున్నరే, చిన్నది ఇంజనీరింగ్ సెకండియర్గదా, పెద్దోని మెడిసిన్ ఐపాయెనా,”

“హా, ఐపోతది, ఇంకోసంవత్సరం, నువ్ జాగమ్మితె వానికో దావఖానకు ఐతదనుంటె కానిస్తలేవ్ కద”

నీ రండమొఖంల చెప్పులు దాపురమైనవ్, పక్కోడు నాశ్నమైనా పాయెగని, నీ మెతుకు జారొద్దుగదరా భోశిడీ..

“లేద్బావా, ఔసరమొస్తె నీకే అమ్ముత, శెప్తికద, ఇటియ్యరాదిగ, ఐపోయిన గిలాసవట్కొని ఏం సప్పరిస్తున్నవ్, ఇటియ్య్, ఇంకో పెగ్గల్పుత.”

“ఏ వొద్దొద్దు, సాలిగ,”

“పిల్ల పెండ్లికి పైసలేం అడ్గతీ, రందేం పెట్కోకు, నిద్ర శెడగొట్టుకోకు, గిలాసిటియ్యి, పెండ్లికొచ్చి తినిపోతె సాలు, మీరేం చెయ్యకుర్రి, ఇక్కడున్న రాయెత్తి అక్కడ వెట్టకున్న పోతెమాయె, కాని దాన్ని ఏడిపియ్యపోతె సాలు, మీ శెల్లెను, ఇదే లాస్ట్ పెగ్, తాగి తిందా ఇంక, లక్ష్మీ.. అన్నాలైనయానే, వొస్తున్నం ఐద్నిమిషాల్ల”

దీనమ్మన్, కాల్నొప్పి మల్ల, చెరుకురసంబండి లేశి తింపినట్టు అవ్వట్టే నొప్పి, కాలిపుండు భయాన్కి సిగ్రెట్లైతె ఆప్తిగని, మంద్దాగుడెప్పుడాగాలె, లివర్మంచిగనే ఉన్నట్టుంన్నదింకా..

* * *

“లక్ష్మి, నువ్ కూడ తిన్రాదే, ఎనిమిదైతుంది, శ్రావని రాలే కాలేజ్కెల్లి..”

“వొచ్చింది మద్యానమే, చీరలు చూస్కోనీకి దోస్తు ఇంటికి పొయ్యింది, గదే వెంకట్రమన శారీస్, దివ్యోల్లింటికి,”

“పిల్లలేరే, సందీపూ సంపతూ, పురాగ నల్లవూసలైర్రు, మాట్లాడ్ద్తామంటె కానొస్తలేరు..”

“వాల్లుకాదు, నువ్వైనవయ్యా నల్లవూసవు, శీకటితోనే లేవవడ్తివి, శీకటితోనే ఇంటికి రావడ్తివి, బడే ఎక్కువాయె అన్నిటికంటే, లోకమ్మీదెవ్వడు నీఅసోంటి నౌకరు చేస్తనేలేరిగ,”

“యెహె, గుల్గకు,పిల్లలేరి”

“రాముల్తానకు పొయ్యిరమ్మన్న, శెయ్యిదాటకముందే ఓ తొవ్వకు పడెయ్యాలె పిలగాల్లను.. పదోతర్గతి కాంగనే పట్నంల ఇంటర్ చేపిద్దామంటె, పిల్లలు కండ్లముందుండాల్నని ఇక్కడ్నే సదివిస్తివి, ఏమాయె, లంగ సోపతులవడి నడిమిట్లకే సదువాపిరి, ఆ దేవుని పున్యానికి వాల్లు జెరంత మంచిగైతె సాలు, సరేగని, ఏమంటుండు మా అన్న, ఎంత కర్సైతది పెండ్లికి”

“ఏమంటడే నక్కకు తక్కువ, తోడేలుకెక్కువ మీ అన్న, హహహ.. ఎక్వల ఎక్వ పదిలక్షలైతే ఐతదే, ఎంతకాదన్నా 4-5 లక్షలు కట్నం, బంగారానికి ఐతయ్, లక్ష లక్షన్నర బట్టలకేస్కో, ఓ 4 లక్షలు పెండ్లి కర్సుకు.. హుహ్, సూద్దాం, మంచి దరొస్తే జాగమ్మేద్దాం, పొలగాల్లేమన్న లొల్లివెడ్తరా జాగమ్ముతే”

“పొలగాల్లా, శేతిల పైసల్లేక సదువురాక గట్లైర్రుగని చెల్లెలంటె మస్తు ప్రేమ, పొద్దుగాల్ల పెద్దోడనవట్టె, తాతింటికాడ మనగ్గూడ పాలుంటదికదా, నేను మాట్లాడొస్త మామేమన్న జ్యాదా ఉషార్వడ్తే , అదీ ఇదీ అని..”

“చత్, నీ..! మీ ఇంటికాడిపైసలు మనకెందుకే, తప్పిదారి రూపాయి తెచ్చుకున్నా మీ అన్న మనం సచ్చేదాకా పొడుస్తనే ఉంటడు, నేనే పిల్ల పెండ్లి చేశ్నా, ఆల్లకు గతిలేకపోతె అని, మనకొద్దది, అస్సలొద్దు, నేనే చూస్తతీ, ఏదో ఒకటి, నువ్ మంచిగుండు, పిల్లల్నీ నన్ను మంచిగుంచు, సాలు, పొల్లొచ్చేసరికి లేటైతది, నువ్ తినుపో, అన్నం సల్లగైతది, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తతీ, రాముల్తోటి మాట్లాడ్త రేపు, ఇప్పుడే ఫోన్చేశి చెప్తాగు, నా ఫోన్దీస్కరాయే, బెడ్రూంల ప్యాంట్ జేబుల.. అబ్బ, హ్హ్, నడ్వనీకొస్తలేదే, జెష్టపు నొప్పి, నంబరు కల్పియ్యి రాముల్ది..”

ఏమ్మాట్లాడాలే, పైసలడ్గన్నా, జాగమ్మన్నా, ఎప్పుడడ్గలే రాముల్ను, ఏమనుకుంటడో ఏమో, చత్, దోస్తాన్లపైసల్లొల్లి రానేవొద్దు, మనుసులం గిట్లే ఉంటే సాలు, అంతె, ఏమన్న అడ్వైస్ అడ్గుదాం, రాముల్గాడు చెప్తడు..

“హలో, ఆ రాములూ, పనిలున్నవా ఫ్రీగనేఉన్నవా, ఖాలీగనే ఉన్నవా, ఏంలేదు, రేపు క్లినిక్కాడికొస్తా పొద్దున్నే, మాట్లాడేదుంది, ఎటువోకు జెర, హా, ఎమర్జెన్సీ ఏ, కాల్నొప్పి కాదు, నొప్పేంలే రాములూ, వేరే విషయం, సరేనా, రైట్ మరి, ఉంటా..”

* * *

నిన్నటంత నొప్పిలేదియాల, కాలు పుచ్చిపోతె నొప్పి తగ్గుతదట రాన్రాను, పిల్ల పెండ్లయేదాకనన్న కాలు మంచిగుంటె సాలు.. పోరగాల్లు ఎట్లన్న బత్కుతరు ఏదోటి చేస్కుంట..

పద్మజ్యోతి పాలీక్లినిక్ ముంగట పోలీస్ జీప్, ఎవలో, S.I ఆ C.I ఆ, 10 గంటల పొద్దుగాల్ల పోలీసోడిగ్గీడేంపని..

“ఏంరా రాజూ, సారున్నడా,”

“ఆ ఉన్నడ్సార్, లోపల C.I సాబున్నడు, జెరాగుర్రి చెప్పొస్త”

రాములంత మంచి సర్జన్ సుట్టుపక్కల ఊర్లెనే లేడు, డాక్టరంటె సదూకున్న సదువు చూపిచ్చుడు కాదు, రోగంతోని వొచ్చినోన్తోని నాల్గు మంచిమాటలు మాట్లాడాలె, ఏడ్శెటోన్నికూడా నవ్వియ్యాలె.. అని చెప్పేటోడు, అదృష్టవంతుడు రాములు, మంచి పెండ్లాం.. మాటినే పిల్లలు.. ఏంకావాలింకా జిందగీకి, అంతేనా.. ఏంకావాలీ జిందగీకి, ఇంకేమొద్దా..

jindagee

ఈ ఆలోచనేడ మొదలైంది, ఏందాకపోతుంది, అసలు నేనేమాలోచిస్తున్ననో నాకు తెలుస్తుందా, ఇదేనా, ఇదేనా జిందగీ..

“సార్, రమ్మంటుర్రు , హా లోపలికే”

C.I ఉన్నప్పుడు నన్నెందుకు రమ్మంటుండీడు, అసలే ఆ సీ.ఐ గాడు కమీనే గాడు..

“నమస్కారం సార్, కూర్చోండి, నేను కొత్త సీ.ఐ, వారమైంది ఇక్కడికి ట్రాన్స్ఫరై.. నన్ను గుర్తువట్టిర్రా,”

“నమస్తే, ఆహ్, లే.. లేదు, రాములూ ఎవలీ సార్”

“టెంత్ మీకాడ్నే సదూకున్న, వర్గల్ ZPHS బడ్ల్లె, నర్సింలు, పదిహేనేండ్లకిందటిమాట సార్, ఎట్లుర్రు, ఏదో ఫైనాన్స్ ఛీటింగ్ కేసుందని రాములన్న ఫోన్చేశిండు, మీ కేసని తెల్వది వొచ్చేదాక, అన్న అంతా చెప్పిండు, మీ బావకో ధంకీ ఇస్తే అంత సెట్టైతదని, మరి మీరేంఅంటరు”

“…… …… ……”

“ఏంలే సార్, మీరుమీరు సుట్టపోల్లు, రేప్రేపు మొకాల్జూసుకునేటోల్లు, మీకు ఓకే ఐతే నేను పైసలిప్పిచ్చే ప్రయత్నం చేస్త, వాని పేరేమన్నవన్న, ఉమా మహేశ్వర్రావ్ కదా, డాగేసుడు ఎంత సేపు సార్, మా పనే గది”

“చెయ్యి నర్సింలు, ఏదో ఒకటి చెయ్, పిల్వకుంటనే సాథియ్యనీకొచ్చినవ్, సుట్టం లేదు ఏంలేదింక, చెయ్య్, పిలగాల్లు ఆగం ఔతరు, నేనే పోలీసులకాడ్కి పోదామన్కున్న గని, పిల్లపెండ్లి పెట్కున్నం, అందర్కి ఎర్కైతె పెండ్లాగుతదని భయపడ్డా, మా బావ నంబరిగో.. శంకర్‌రెడ్డి, ఆడు కూడ స్కూల్టీచరే..”

“ఈ ఫైనాన్స్ దందల ఎస్సైకీ, పాత సీ.ఐకీ పైసలు ముట్టేటియట నెలనెలా, అందుకే రికగ్నిషన్ లేని ఇల్లీగల్దందా అన్తెల్శినా ఊకున్నరు ఆ కొడ్కులు, నేనెట్లూకుంట మనూరుకొచ్చి, ఆహ్..

 (( హలో, ఆ శంకర్రెడ్డ, ఎవరు మాట్లాడేది, నేను సీ.ఐ నర్సింలు, అయ్యప్ప ఫైనాన్స్ మీద రెండు ఫోర్జరీ, ఒక కిడ్నాపింగ్ కంప్లెయింట్స్ వొచ్చినయ్, హా, నీది కాదా, నీకు సమ్మందంలేదా, కొమటాయనదా, పక్కకే ఉన్నడు కొమటాయ్నెకూడ, ఇద్దరు పాట్నర్స్ అట కదా,

కాదా, మీ ఇద్దరు రాస్కున్న కాయితాలున్నయ్ మాతాన, చారాన బారానొంతు, బొక్కలు.. బొక్కలిర్గుతై చెప్పు, నువ్వో గవర్మెంట్ టీచరువు, పోరగాల్లకు సదువుల్జెప్పుమంటే గీ దందలా నువ్ చేశేయి,

ఉమామహేశ్వర్రావెవడు, వాన్కి పదిహేన్లక్షలు ఇప్పిచ్చినౌ నీ ఫైనాన్స్ కెల్లి.. దెంకపోయిండా, నీ దోస్తే అటకదా, నువ్వీమంటెనే ఇచ్చినా అంటుండు కోమటాయ్నె, దెంకపోతె మరి పోలీస్ కంప్లెయింట్ ఎందుకియ్యలేరా, పైసలా పెంకాసులా అవి లంబ్డీకే, బద్దలు వల్గుతై స్టేషన్లేశి గుద్దుతె,

నువ్వూ ఆ దెంకపోయినోడూ మాట్లాడ్కున్న ఫోన్‌కాల్ డీటైల్స్ ఉన్నై మాతాన, రమ్మంటవా ఇంటికి, ఏడున్నవిప్పుడ్నువ్వు, ఆ, స్కూల్లున్నవా,

ఎప్పుడు మాట్లాడ్నవ్ వాన్తోని ఆఖర్కి, నిన్న రాత్రా, ఎక్కడుండువాడు, తెల్వదా, అరేయ్ మాక్యొడే, స్కూల్‌కొచ్చి బట్టలిప్పి కొడ్తా, చెప్పు లంజొడ్కా చెప్పు,

హైద్రాబాద్ల, ఎక్కడా, సనత్నగర్లనా, ఇల్లీగల్ దందాల్చేసుకుంట లక్షల్లక్షలు మీవోల్లకు మీరే అప్పులిచ్చి మీరే ఎగదెంగి.. పాపం అమాయకులను ఎందుకు సంపుతున్నర్రా జమానతులు వెట్టిచ్చుకుని..

రాజిరెడ్డి సార్ కతేంది, ఆయన్ను జమానతువెట్టి పైసలిచ్చినవట కదా ఆ ఆంద్రోన్కి , నువ్వియ్యలేదా, కోమటోడు ఇప్పిచ్చిండా, నిజంచెప్రా, నువ్విట్లినౌరా, వొస్తున్నుండు,

ఆ, చెప్తవా.. ఏం చెప్తౌ, చెప్పు, ఆ, అచ్చ, హా, వార్నీయమ్మా.. హా.. హా.. ఆ.. ఇగాపు సాలు, ఇంకేం చెప్పకు, ఎంత కట్టిచ్చుకున్నౌ సార్తాన ఇప్పటిదాక, యాభైవేలా, అరెయ్ కంత్రీ కొడ్కా, ఆయ్నె జీతమే 55 వేలట కద్రా, ఎన్నినెల్లసంది కట్టిచ్చుకుంటున్నౌ జమానతు పైసలు.. వాడు దెంకపోయినప్పటిసంది గదా, ఔనా.. అంతేకదా, అంతేనా కాదా, నోరిప్పవేంరా.. మరి మొత్తం ఎంతైనై, రెండున్నర లక్షలా, అంతేనా, బస్, కొడ్క నువ్ ఏంచేస్తవో తెల్సా,

సాయంత్రం, బడి ఇడ్శినంక స్టేషన్కురా, పైసల్దీస్కరా, సార్తాన ఎన్ని కట్టిచ్చుకున్నవో అన్ని, రాకపోతే నేన్నీఇంటికొస్త ఆరు దాటితె, నువ్ ఎవ్వని సంక నాకినా ఏం కాదు, కొత్తగొచ్చిన నేను, మల్ల ట్రాన్స్ ఫరయ్యేదాకా నీ బొక్కలిరగ్గొడ్తా రోజిన్ని, ఏం తమాష చేయకు, దా ఇగ, ఆ దెంకపోయినోని డిటైల్స్ పట్కరా వొచ్చెటప్పుడు, ఫోన్ పెట్టిగ ))

సార్, మీరేమన్న అన్కోర్రిగని, మీ బావ గలీజ్ లంజొడ్కు సార్, మీరు జమానతున్న పైసలన్నీ ఆ ఉమామహేశ్వర్గాడెప్పుడో కట్టేశిండట, వానికేవో వేరే అప్పులు యాభై లక్షలుండి ఊరిడ్శిపోయిండట, మీ ల్యాండ్ ఏదో ఉందటగద దానికెసరువెట్టి మీ బావ, జమానతు తీరిపోయిన సంగతి చెప్పలేద్ట మీకు, మరి ఆ లంజొడ్కు ఆ దెంకపోయినోడన్న చెప్పాలె కదా మీకు ఫోన్జేశి, గంత నమ్మినందుకు.. ఆన్ని మీ బావ భయపెట్టిండట ఊర్లె నువ్ ఎవన్కి ఫోన్జేశ్నా నువ్వేడున్నవో తెల్శిపోతది అని.. మొత్తాన్కి మీ బావ జాదూగాడ్సా, పామ్‌కు పాల్వోశి పక్కకు పండవెట్టుకున్నట్టే వాన్తోని, సరే, మీరిప్పడ్దాకా కట్టినయన్ని రికవర్చేసుకుంటం, ఏమన్న ఔసరమైతె ఫోన్చేస్త సార్, వొస్త మరి, మినిస్టర్ బందోబస్తున్నది, పొయ్యొస్త, ఉంట డాక్టర్‌సాబ్, కలుస్త మల్ల..”

“థాంక్యూ నర్సింలూ, దేవున్లెక్కొచ్చినవయా, ఏం చెప్పాల్నో కూడ తెలుస్తలే, థాంక్స్..”

ఏమైందిక్కడ ఇప్పడ్దాకా, ఏదో ఐంది, మెల్లమెల్లగ అర్దమైతదేమో..

“రాజూ, రాజిగా, ఒక్క పావుగంట పేషెంట్లను కూసోవెట్టు, లోపల్కి పంపకు.. రెండు కాఫీలు పంపు, ఒకటి బగర్..”

“రాములూ, బగర్ నక్కో, రెండు శుగరే చెప్పు ఈ ఒక్కదినం నోరింత తీపి చేస్కోనీ, ఇంకెన్ని దినాలుంట ఇట్ల,”

“ఊకోయే, ఏం మాటలవి, మేం లేమా ఎట్ల, నువ్వెటువోతవ్ నేనెట్వోత, హా, రాజూ, రెండు కాఫీ విత్ శుగర్ పంపీ.. హ.హ.హ్..”

“రామ్లూ, అదీ, అద్..”

“రాజన్నా, నువ్ నాకు మస్తు చేశ్నవ్, కులంతక్కువోన్కి ఎవ్వడు ఇల్లియ్యనంటె నీ కడుపుల దాసుకున్నవ్ ఇరవయ్యేండ్లకింద మా అమ్మ నాన్న ఆక్సిడెంట్ల సచ్చిపోతె, ఒక్కడ్నే బత్కాల్నా సావాల్న తెల్వపోతే నువ్వున్నవ్ నాకప్పుడు, ఆయాల, నాకేందే.. ముక్కూమొకం ఎర్కలేనోనిక్కూడ సాయం చేశ్నౌ, మంచోల్లకెప్పుడు మంచే ఐతది, కాపోతె ఆలస్యమైతుండొచ్చు, ఔనే, ఏదొ ఎమర్జెన్సీ మాట్లాడాలన్నవ్, ఏంది..”

“ఏంలే గదే, ఆ 200 గజాల జాగ, ఎవలన్నుంటే అమ్మేద్దామని అన్కున్నా, పిల్ల పెండ్లికి ఎంత లేదన్న పదిలక్షల్దాకైతదే, ఇంకెక్కువనే ఐతుండొచ్చు సిద్దిపేటోల్లు బాగ ఉన్నోల్లు, పెట్టుపోతలేమన్న తక్కువైనా పెండ్లి మంచిగ గ్రాండ్​గ చెస్తే మనగ్గూడ జెర ఇజ్జతుంటది.. మరీ, గజం ఆరేడువేల్దాకా ఉంటుందన్నర్రు..”

“ఏడ, గవర్మెంటాస్పిటల్ పక్కకా, పిచ్చోనివానె, పదిహేను వేలైంది గజం ఆడ, నిన్న మొన్న సంగతిది, ఊరు డెవెలప్ ఐతుంటె భూములూకెనే ఉంటాయె, ఎగుర్తై, జాగ అమ్ముడేం పెట్టకు, ఒక్కసారమ్ముతె మల్ల కొనలేం ఇయ్యాల్రేపు, పెండ్లి ఖర్చుకు రెండు చిట్టీలేస్కో, నాది 5 లక్షలు, 2 లక్షల్చిట్టీలు ఉన్నయ్, వొచ్చేనెల ఎత్తుకునిస్తా, నెలనెలా ఇరవయ్యైదువేలైతుండొచ్చు చిట్టి పైసలు, అవి నాకియ్యి నీ సాలరీ నుంచి.. ఎట్లాగూ ఫైనాన్స్ లొల్లి పోయింది కదనే ఇగ, ఐనా పైసలు సాలపోతె ఒక లక్ష తీస్కో, నీ దగ్గరున్నప్పుడు నీకెల్లినప్పుడు ఇయ్యి”

“రాములూ, ఏందిరా ఇది, నేనేమైత నీకు, సొంత అన్నదమ్ములే పరాయోల్లైతుర్రు, నేన్నీకేమైత”

కండ్లల్ల నీల్లాగుతలేవ్, కాల్నొప్పి మొత్తం తగ్గినట్టైంది..

“అన్న, ఇంకోటి, నిన్న సాయంత్రం పిల్లలొచ్చిర్రు క్లినిక్‌కి, మాట్లాడిన, పెద్దోడు చదూకునేందుకు తయారున్నడు, లాబ్ టెక్నీశియన్ కోర్సుకు అప్లై చేస్కుండట కూడా, సిటీల సదువంటె నువ్వేమంటవో అని చెప్తలేడట, ఏమంత దూరమే తిప్పికొడ్తె 70 కి.మీ, సదూకోనీరాదు, నేన్చదివిచ్చుకుంట, ఎట్లాగూ ఇంకో రెండుమూడేల్లకు పెద్దాస్పిటల్ కట్టే ప్లానుంది, అప్పుడు ఒక లాబ్ టెక్నీశియన్ కావాలె, మన రాజుగాని తమ్ముడూ, సంపత్గాడూ పన్జేసుకుంటరు కల్శి… ఇగ చిన్నొడే, చదుకుంటావ్రా అంటే నాతోని కాదంకుల్. ఏదన్న పన్జూపెడ్తె చేస్తా అన్నడు, వాన్ది కూడ మెల్లగ సెట్ చేద్దాం, నువ్వేం ఆలోచించకు, ఇగ నీ కాలు ఆపరేషన్ శ్రావని పెండ్లైనంక చేద్దాం, అప్పడ్డ్తాక రెగ్యులర్ డ్రస్సింగ్, ఆంటిబయటిక్స్ వాడుదాం, కాని, ఖచ్చితంగ మోకాల్దాక కొట్టేయాల్నే, సవ్వాలే లేదు, ఏం చేయలేం, ఈ రెండ్నెల్లు మంద్దాగకు, పుండు పెర్గకుంట చూస్కోవాలె”

“రాములూ, కాల్మొక్కుదామంటె శిన్నోనివైతివి, హా, ఏం జెయ్యాలింకా, మంద్దాగబుద్దైతుంది నీతోని, ఒక్కసారి.. ఈ ఒక్కసారికి..”

“తాగుదామే, తాగుదాం, వొచ్చే ఆదివారం సిద్దిపేట్ పోయ్యొస్తాన్నవ్ కదా, ఆ రోజు కూసుందాంతీ పనైనంక.. ఎవరెవరు పోతుర్రే”

“ఎవ్వల్లేరు, సుట్టపోల్లందరు లంజొడ్కులే, మన M.E.O వెంకట్‌రెడ్డి సార్‌ను తీస్కపోదామన్కున్న, నాకు డిగ్రీల టీచరాయిన, నీకు వీలైతె రారాదు నువ్ కూడ.. నాకు జెర దైర్యంగూడ..”

“దాందేముందే, వొస్తనే, పోదాం రాజన్నా, నువ్ మాత్రం జెర కాలు మంచిగ చూస్కో, అంతే..”

“సరే, చూస్కుంట నా గురించి నీగ్గాపోతెవనికి తెల్సు.. ఛలో మరి, ఇంటికిపోతా, రెండ్రోజులైంది స్కూల్‌కు సెలవు పెట్టి, వొస్త మరి”

నిజమేనా.. నాగురించి నాకంటెక్కువ రాముల్గాన్కే తెలుసా, లేకపోతె ఇయ్యాల్ల నేనింత ఉషారుగ నడుద్దునా లోకమ్మీద, పొలగాల్లన్నేనే పాడుచేశిన్నా సిటీకి పంపకుంట.. తప్పంత నాదేనా,

ఐనా ఏరోజన్న నామీద ఎగిరిర్రా పిల్లలు.. నేనేం చెప్తె గదే సదివిర్రు, ఏడుపొస్తుంది, బాధైతుంది, కాలొక్కటే కాదు, నా తల్కాయె నర్కేస్తె మంచిగుండు ఎవలన్న, కండ్లముంగట పోరగాల్లను నాశ్నం చేశ్నకదరా, అయ్యో.. లక్ష్మేం సుఖపడ్డది నన్ను చేస్కుని ఇన్నిదినాలు.. దానికేమన్న బంగారం దిగేశిన్న, ఐనా ఏ ఒక్కరోజన్నా ఎందుకడ్గలే లక్ష్మి, నాకది కావాలె, నాకిది కావాలె అని.. ఏంలేకున్నా అన్నీ ఉన్నట్టు బతికింది.. బతికిచ్చింది మమ్మల్నందర్నీ, శ్రావని, శ్రావన్ని అసలు అడిగిన్నా పిలగాడు నచ్చిండా, పెండ్లిష్టమేనా, M.tech చేస్తవా అని, ఐనా అది ఒప్పుకుంది నవ్వుకుంట,

ఒద్దొద్దు..

నేను బత్కొద్దు, ఇంతమందిని ఇన్నిదినాలు ఏడ్పిచ్చిన్నేను ఇంక బత్కొద్దు,

బండి ఒకదిక్కు ఒర్గుతుంది.. నేనే ఒర్గుతున్ననా, అదేనా, నాకేమైతుంది, కిందవడ్తున్ననా.. చక్కరొచ్చినట్టై.. బండి కింద.. నేను ఇశ్కల.. నాకేమైంది, నన్నెవరు లేప్తుర్రు, మొకమ్మీదెవరో నీల్లు కొడ్తుర్రు

కాల్మీదేం పడ్డది, బాగా బరువైతుంది కాలు, పట్టీ.. పట్టీ మార్చాలే పద్మజ్యోతి క్లినిక్‌ల… పాపా సిస్టర్ ఎంత ముద్దుగ మార్చింది చీమంటిన పాతపట్టీ.. గవర్మెంటాస్పిటల్ల కట్టిన పాతపట్టీ… పక్క జాగ నాదేనా.. నాదే.. నాదే, నన్నండ్లనే కాలవెడ్తరా నేన్జస్తే.. ఒద్దొద్దు నన్నండ్ల కాలేయకుర్రి, గజం పదేనువేలాడ.. నన్ను శెర్ల పడేయిర్రి, మెడకు రాయికట్టి… పెద్ద రాయికట్టి, పెద్ద రాయి… ఆహ్మ్ మ్మమ్మమ్మా మ్మ మ్మ నొప్పి…

కాల్మీద రాయి, నొప్పి… నాకేమైంది, నన్నెవరు లేపిర్రు, ముఖమ్మీద ఏమంటింది, ఇశ్కెనా.. నోట్లకేం పోయింది.. మట్టి… మట్టి… త్ఫు త్ప్ త్ప్ త్ఫుహ్, నీల్లు వోస్తుర్రెవరో నా మీద మొకమ్మీద… నోట్లె.

“నానా.. నా… నేను సంపత్, నానా… నీకేం కాలేదే, నానా…”

* * *

ఎక్కడున్న నేను, నా కాలేది.. పట్టీ.. పాత పట్టీ ఏది, ఎవరు మార్చిర్రు పట్టీ.. పరుప్మీదున్ననా.. గోడమీద నా ఫోటో, పక్కన లక్ష్మి,

నా బెడ్రూలున్ననా.. నొప్పి.. నొప్పి ఆహ్ హ్ హ్..

“రాజన్నా, ఏం కాలేదే, చిన్న దెబ్బ కుడి కాలుమీద, ఎడ్మ కాలుకేం కాలే, జెర్ర శుగర్ కంట్రోల్ల వెట్కోవాల్నే…”

రాములా.. ఇంటికొచ్చిండా.. ఎప్పుడు

“3 గంటలకోసారి ఏదన్నింత తినాలె, లేపోతె చక్కరొస్తది ఇట్లనే, ఒక dextrose పెట్టిన, ఇన్సులిన్ లెవెల్స్ మరీ ఎక్కువేం లేవ్, లేవకు లేవకు, పండుకో.. సందీప్, నాన్న ఫోన్దీస్కురా ఒకసారి.. రాజన్న, M.E.O వెంకట్‌రెడ్డి సార్ ఫోన్చేశిండు, అదే నువ్ V.R.S తీస్కుంట అన్నవటకద, దాని గురించే, నువ్ లేశ్నంక ఫోన్చేయ్మన్నడోసారి, ఇదిగో, కాల్ కాల్పిన, మాట్లాడే, రింగైతుంది,”

(( హలో,.. రాజిరెడ్డీ, నమస్తే, ..))

“సార్, నమస్తే.. ఆ..”

(( పర్లే పర్లే, రాముల్డాక్టర్ కండీషన్ చెప్పిండు, ఇట్స్ ఓకే, అప్లై చేద్దాం.. ఇప్పుడు చేస్తెనే ఆర్నెల్లైతది అప్రోవల్కి, అదీ,

పిల్లలకేమన్న జాబ్ చూడుమంటివి కదా, మాట్లాడిన కలెక్టరేట్ల, రెండు మూడ్నెల్లల్ల క్లర్క్ పోస్ట్‌లకు నోటిఫికేషన్ పడ్తదట,

పడకపోయినా ఏం పర్వాలే, దేంట్లనో ఒక ఆఫీస్‌ల ఇప్పిద్దాం, ఇద్దరికంటే ఇంపాసిబుల్కని ఒక్కలికైతె తప్పకుంట వొస్తది,

నువ్వేం ఆలోచించకు, అమ్మాయ్ పెళ్ళి అంటివి కదా, ఈ ఆదివారం పోదామన్నౌ, పోదాం, సరేనా, మంచిగ రెస్ట్ తీస్కో.. నేనుంట మరి.. ))

“సరే సార్, మంచిది, రేపు మాట్లాడ్త, పండుకుంట కాశేపిప్పుడు, ఉంట సార్.. రాములూ, రామ్లూ..”

“అన్న.. చెప్పే..”

“పిల్లల్నీ లక్ష్మినీ ఒక్కసారి రమ్మనవా, ఎందుకో చూడబుద్దైతుంది ఓసారి..”

ఎందుకో ఇదే నాకు ఆఖర్రాత్రిలెక్క అన్పిస్తుంది, ఉహూ, సావొద్దు సావొద్దు, బత్కాలే, బత్కియ్యాలే, అంతే.. లక్ష్మొస్తుంది, పిల్లలొస్తుర్రు, నవ్వాలె జెర, నవ్వుమొకం పెట్టాలె, పిల్లలు భయపడ్తరు..

“ఏమైందయ్యా, గుండె వల్గినవట, నీకేంకాదు, మేమంతలేమా, నువ్వట్లుంటె పిల్లలెట్లుంటరు, శ్రావని ఏడుస్తనే ఉంది మద్యానంకెల్లి, నా పెండ్లి అన్కోపోతే అందరం మంచిగుండెటోల్లం అని, పిల్లలు మనమన్కున్నంత చిన్నోల్లు కాదు, పెరిగిర్రు, మన తప్పుల్నీ బాదల్నీ అర్దం చేస్కునే కాడికొచ్చిర్రి, నువ్ మంచిగ నిద్రపో, ఏం మాట్లాడకు, పండుకో, కండ్లు మూస్కో..”

నా కండ్లు నిజంగనే మూస్కపోతున్నై మెల్లగా.. నిద్రేనా ఇది, ఎక్కడున్న నేను.. ఏడ మొదలైన నేను, ఐదేండ్లప్పుడు అమ్మ సచ్చిపోయినప్పుడు, అమ్మ, నిద్రొచ్చిపండుకున్నది.. జెర్సేపాగి లేస్తదని రోజు రాత్రి బొందకాడ్నే పండుకున్న చీకట్లల్లనా, తాగీ తాగీ పిల్లల్నిడిశిపెట్టి సుఖపడ్డ బాపు పిచ్చోడై తప్పిపోయినప్పుడా, ఏడ.. ఏడ మొదలైననో నేను.. ఏడ ఆగిపోవాల్నేను,

చీకట్లవడి నడుస్తున్న కుంటికాల్మీద, లక్ష్మేదీ, పిల్లలేరీ.. రాములేడి నర్సింలేడి ఎంకట్రెడ్డి సారేడి శంకర్‌రెడ్డి గాడేడి రాజుగాడూ ఫైనాన్స్ కోమటాయ్నా ఉమామహేశ్వర్రావ్ ఎవ్వలు ఎవ్వలు కనవడ్తలేరు, ఒక్కడ్నే కాటకల్శిన చీకట్ల..

ఎటు నడ్వాలే, వెలుగేడున్నది, ఏమైంది కాల్లకు.. అల్కగైనై, బూమ్మీద లేనా.. ఎగుర్తున్ననా, హా.. నేను..

ఎగుర్తున్ననా.. మా ఇంటిమీంచి.. పద్మజ్యోతి క్లినిక్ మీంచి.. పోలీస్ స్టేషన్మీంచి.. ఎయిర్టెల్ టవర్మీదికి.. ఇంకామీదికి నేను ఎగుర్తున్ననా..

మబ్బులా అవి చేతికందుతున్నయ్ మెత్తగా.. వేల్లా, చేతివేల్లా, ఎవలివి, నాతోని ఎవరొచ్చిర్రు ఇంతమీదికి.. నా చేతులెవరు పట్టుకుర్రు..

ఎవలూ, ఎవరది, కనవడరూ?? ఎవరూ.. వెలుగొస్తుంది.. ముఖం కానరానంత వెలుగు.. ఎవలి ముకమది, దేవుడా, దేవుడేనా,

ఇన్నాల్లకు యాదికొచ్చినానువయా నీకు, ఐనా నేన్నిన్ను నమ్మ, నువ్ బద్మాష్ గానివి, పో పో.. నీతోన్నాకేంలే..

శెయ్యి ఇడ్శిపెట్టిర్రూ?? ఎందుకు?? నేను కిందికి పడ్తున్ననా, ప్రపంచం పైకి పోతున్నదా, లేద్లేదు నేనే పడ్తున్న.. కిందికి కిందికి,

బండలమీదవడ్డ గట్టిగ.. అమ్మా, ఆహ్ హ్ హ్ హ్.. ఎక్కడున్న నేను, మంచమ్మీంచి పడ్డనా, పక్కకెవరు. లక్ష్మా..  లక్ష్మేనా..

డ్రెస్సింగ్టేబుల్ ముంగటెవరూ పడుకుంది, శ్రావనా.. టైమెంతైతుంది, గడియారమేది రూంల, కరంట్లేదా, ఆ.. అంతే, చీకటి.. చిమ్మన్చీకటి,

నేను కూడ అంతేనా.. ఆఖరికి, చీకట్లోపల్కి.. నిద్రలోకి.. ఇదేనా జిందగీ.. ఇదేనా..

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఆగస్టు, కథ and tagged , , , , , , .

13 Comments

 1. Pingback: “నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి | వాకిలి

 2. ఇంటర్నెట్, అంతర్జాల పత్రికలకు అంతగా అలవాటు పడని పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు ( పాలగుమ్మి పద్మరాజు గారి శిష్యులు, త్రిపుర గారి ఆప్తమిత్రుడు ) “జిందగి” కధ ప్రింటు కాపీని అందుకుని చదివి చాలా చాలా సంతోషించారు. జిందగి (కధ) సె మొహబ్బత్ హో గయా అన్నారు జీవితం పట్ల, మాండలికం పట్ల, మానవత్వపు విలువల పట్ల పిన్నవయస్సులోనే ఇంత మంచి పట్టు సాధించిన డా. వంశీధర రెడ్డి గారికి తన హార్ధిక అభినందనలు, ఆశీస్సులు తెలియజెయ్యమన్నారు

 3. కినిగేలో ప్రచురించబడిన డా. వంశీధరరెడ్డి గారి కధల లింకులివి. (చౌరస్తా కధను వెతుక్కోవటంలో నాకు కలిగిన జాప్యం ఇతరులకు కలుగరాదనే ఉద్దేశ్యంతో)
  http://patrika.kinige.com/?p=3297 జిందగి
  http://patrika.kinige.com/?p=3528 కీమో
  http://patrika.kinige.com/?p=1059&cpage=1#comment-2134 చౌరస్తా

 4. Vamshi Anna Nee Telangana yasa musth rastav. Andula maa ammamma valladi Bayyaram. Gajwel tho vunna anubandam thoti baaga connect avutha nee kathalaki. You are doing wonderful job. Nenu Washington DC vunta anna nee katha chadivinappudalla Gajwel antha oka sari atla kandla mundara kanavaduthadi. Monna May la naa pelli ki vachchina Gajwel ki. Pragna Garden la nee pelli banner choosina bayata nundi vachchi palukariddam anukunna kaani piluvani perantaniki poyinattu ayitha ani voorkunna. Any Congratulations and happy married life.

 5. ఏడికెంచి దెత్తవో ఎట్ల రాస్కత్తవో…

  మనిశిని బతికిచ్చెటోడు మనిశే అన్నట్టు రాముల్డాక్టరూ… బతికిద్దామనుకొని బొక్కవోర్లవడ్డ రాజి రెడ్డి సారూ,నక్కసోంటి సారు బావా సడ్డకులూ…
  సారు పోరలూ,బిడ్డె ఇయ్యన్నిటి మద్య బతుకు కొట్లాట ….
  వమ్షీ…! ఇది కత అనుకున్న సదివెదాక కాదు జిందగి గిది జిందగి గిదే జిందగి
  డాక్టర్‌సాబ్ మల్లొక్కసారి కావలిచ్చుకోవాలె నిన్ను…

 6. ఈ కథ మనసుకు హత్తుకు పోతుంది .తెలంగాణా మాండలికం లో ఉన్న సౌందర్యం తపన అంతా ఈ కథ లో వుంది
  .డయబిటిస్ ని ఇన్ని సంవత్సరాలు గా ట్రీట్ చేస్తున్ననేను ఈకథ ని చూసి చలించిపోయాను.రచయిత వమ్శిధర్ రెడ్డి కి అభినందనలు

  .

 7. వంశన్న,

  కులాలకు, మాండలికాలకు, ఎన్నో జీవన విధానాలకు యెటువంటి ప్రాధాన్యమివన్ని మన homogenised popular culture లొ ఉంటున్నందుకొనేమొ, మీ కథలు చదివినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. వీళ్ళంత నేను చూసిన మనుషులు, ఇవి నేను వినె మాటలు, వీళ్ళ ఆలొచన ధోరణి, వీళ్ళ అనుబంధాలు ఎంత deeply rooted in reality ఒ ఇక్కడ పుట్టి పెరిగిన నాకెరుక. ప్రతీ పాత్రకు ఒక నిర్ధిష్టమయిన చిత్రీకరణ, వాళ్ళ మాటల్లో వాళ్ళ జీవిత సిద్ధాంతాలు స్పష్టంగ కనబడ్డాయి. మీ obtuse narration, screenplay ను గుర్తుచేస్తుంది( కేవలం ఈ కథే కాక చౌరస్త, వెడ్డింగ్ ఇన్విటేషన్లో కూడ plot points directగా కనబడవు; ఒక సన్నివేషాన్ని తీసుకొని పాత్రల మాటల్తొ, ఆలొచనల్తొ complete picture వచ్చెలాగ చేస్తారు. Personally, ఈ structure నాకు చాలా నచ్చుతుంది. ) చివర్లో ఇంకొంచెం ఆశాజనకమయిన సన్నివేషంతొ కథ ముగిస్తారని ఆశించాను కాని ఎటువంటి epiphany కనబడలేదు. జీవితంలొ happy ending అనేది tautology ఏమొ కాని ఇంకా కళ నుండి ఒక dramatic climax ఆశించడం నేను మానుకోలేకపోతున్నాను. బహుశ అది నాలోని లోపమేమొ. మీ మొదటి రెండు కథలంటె నాకు చాలా ఇష్టం. దీంట్లొ సెట్టింగ్ చాలా promisingగా ఉన్నపట్టికీ కథ కొంచెం underwhelming గానె అనిపించింది. కానీ తహిరో గారన్నట్టు, మీ కథల్లో తెలంగాణ యాస ఎంత అందంగ వినిపిస్తుంది.

 8. షుగర్ భీమార్ తో బాధపడుతున్న హెడ్ మాస్టర్ రాజిరెడ్డి, (పిల్ల శ్రావనికి పెండ్లి కాలే, పోరలు ఆవార తిర్గుతున్నరు, మోకాల్దాకా పాకిన పుండు – డయాబెటిక్ ఫూట్ – గిప్పుడు కాలు కొట్టేస్కుంటెట్ల, వొద్దొద్దు, ఇప్పుడొద్దు.. అనుకుంటూ)

  ఇర్వయ్యేండ్లసంది రాజిరెడ్డికున్న దైర్యం రాముల్డాక్టర్ (డాక్టరంటె సదూకున్న సదువు చూపిచ్చుడు కాదు, రోగంతోని వొచ్చినోన్తోని నాల్గు మంచిమాటలు మాట్లాడాలె, ఏడ్శెటోన్నికూడా నవ్వియ్యాలె.. అని చెప్పే రాముల్డాక్టర్)

  అయ్య సచ్చినా కష్టంజేస్కుంట అమ్మను తమ్మున్ని సూసుకుంటున్న రాముల్డాక్టర్ క్లినిక్ రిసెప్షన్ల పోరడు రాజు, పుండును ముద్దుగా కడిగి cellulitis dressing చేసిన పాపా సిస్టర్లు

  రాజిరెడ్డి బావ స్కూల్‌టీచర్ శంకర్‌రెడ్డి (నక్కకు తక్కువ, తోడేలు కెక్కువ. పోరగాల్లకు సదువుల్జెప్పుమంటే ఇల్లీగల్ దందాల్చేసుకుంట లక్షల్లక్షలు అప్పులిచ్చి, అమాయకులను జమానతులు వెట్టిచ్చుకుని సంపుతున్న శంకర్‌రెడ్డి. సర్కార్ దావఖాన పక్కనున్న రాజిరెడ్డి 200 గజాల జాగ కెసరువెట్టి ముప్పై లక్షలు చేసే జాగాని నాలుగు లక్షలకు బేరమాడిన శంకర్‌రెడ్డి)

  శంకర్రెడ్డికో ధంకీ ఇచ్చి, వాడెవడో ఎగవెట్టిపోయిన ఫైనాన్స్ పైసలకు జమానతున్న రాజిరెడ్డి ని కాపాడిన కొత్త సీ.ఐ నర్సింలు (రాజిరెడ్డి కాడ్నే టెంత్ సదూకున్న నర్సింలు)

  ఇందరు మంచోల్లుండంగ నాకేమైతది, ఏంగాద్.. ముక్కూమొకం ఎర్కలేనోనిక్కూడ సాయం చేశ్నౌ, మంచోల్లకెప్పుడు మంచే ఐతది, కాపోతె ఆలస్యమైతుండొచ్చు అని ఎరుక తెచ్చుకున్న రాజిరెడ్డి

  ఈ బతికే 60 70 ఏండ్లల్ల, కండ్లల్ల అగ్గిపోస్కొని ఓర్వలేకపోవుడేందో, జెర్ర మంచికుంటె కిరీటాలేం రాలి కిందవడ్తయా. మంచి పెండ్లాం.. మాటినే పిల్లలు.. ఏంకావాలింకా జిందగీకి, అంతేనా.. ఏంకావాలీ జిందగీకి, ఇంకేమొద్దా.. నేను కూడ అంతేనా.. ఆఖరికి, చీకట్లోపల్కి.. నిద్రలోకి.. ఇదేనా జిందగీ.. ఇదేనా.. అని ప్రశ్నించిన రాజిరెడ్డి
  _______________________________________________

  అచ్చమయిన, అందమయిన, తెలంగాణ బాష సౌందర్యాల డా. వంశీధర్ రెడ్డి గారి “జిందగీ” కథ. జీవితం పట్ల, భవిత పట్ల, మానవత్వపు సాటివాళ్ల సాయాల పట్ల ఆశను, విశ్వాసాన్ని, (ఉహూ, సావొద్దు సావొద్దు, బత్కాలే, బత్కియ్యాలే ) జెరంత ధైర్యాన్ని చిగురింపజేస్తుంది. (ఎటు నడ్వాలే, వెలుగేడున్నది). “ఎందుకు బత్కుతున్నమో ఎప్పుడు తెలుస్తదో ఏమో” కు సమాధానం జిందగీ కథ.

  డా. వంశీధర్ రెడ్డి గారి “చౌరస్తా” , “వెడ్డింగ్ ఇన్విటేషన్” కథలు చదవాలనే ఆత్రుత కలుగుతోంది.

  “నేను బత్కొద్దు, ఇంతమందిని ఇన్నిదినాలు ఏడ్పిచ్చిన్నేను ఇంక బత్కొద్దు, నన్ను శెర్ల పడేయిర్రి, మెడకు రాయికట్టి“ అని కుమిలిపోయిన రాజిరెడ్డి దుఃఖాలాపన ~ “ఊర్లందరికీ ఈతనేర్పి ఈదరాకుంట రెండు గాళ్లకు బండరాళ్లను గట్టుకుని బలిమి సావు సచ్చిన” గొరుసుసన్న గజఈతరాలు పూర్ణమ్మ; “యాడికోయిన మమ్ల మర్వకు కొడుకా” అన్న గజ ఈతరాలు ను మళ్లీ జ్ఞాపకానికి తెచ్చింది.

  డా. వంశీధర్ రెడ్డి, గొరుసన్న గార్లకు కృతజ్ఞతాపూర్వక నమస్సులు.

 9. ఎప్పటి మాదిరే వంశీధర్ రెడ్డి కథ అనగానే ఒక (బు)గుబులు. వెంటనే చదవాలనే ఆత్రుత . కారణం, గతంలో చౌరస్తా, వెడ్డింగ్ ఇన్విటేషన్ లాంటి కథలు చదవడం వల్ల కావచ్చు. అనుకున్నట్టుగానే జిందగి ఉంది . రాజి రెడ్డి లాంటి జీవితాలు విన్నవీ, కన్నవే … అయినా ఇంత పారదర్శకంగా భూతద్దం లోంచి రచయిత చూపిస్తే “థూ జీవితం ” అని పాటకుడికి ఎందుకనిపించదూ?
  డాక్టర్ రాములు కళ్ళలో నీళ్ళు చూసినప్పుడు రాజిరెడ్డి ప్రతి స్పందన లో తేడా అర్థం కాలేదు . అది కుల అహంకారమా? మనిషి లోపలి సంస్కారం ఆక్టొపస్ లా ఉంటుందనడానికి సింబలా ? కథ లో అవసరం కొద్ది పాత్రలను ,సన్నివేశాలను, నాటకీయతను కల్పించుకున్నా … కథ పూర్తి చేసే సరికి వొంట్లో కంపనం జీవితం మీద విరక్తి కలుగుతుంది .కేవలం అచ్చమయిన, అందమయిన, తెలంగాణ బాష సౌందర్యం కోసమే నేను వంశీధర్ రెడ్డి కథలు చదువుతాను . కథ,శిల్పం,మలుపులు, మెలోడ్రామా … ఇవన్నీ నాకు అనవసరం.