cover

పదనిష్పాదన కళ (15)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

VI. స్వీయార్థక రూపాలు

వినడానికీ, అర్థం చేసుకోవడానికీ ఒకేలా ఉంటూ, స్వల్పంగా మాత్రమే భేదించే పదనిర్మాణాలు స్వీయార్థక రూపాలు. ఆంగ్లంలో ఇలాంటివాటిని కల్పించడం కోసం నామవాచకానికి ‘-let’ అనే ప్రత్యయాన్ని చేఱుస్తారు.

Piglet = పందిపిల్ల ; Inlet = చిన్నప్రవేశమార్గం ; Booklet = చిఱుపొత్తం ; Starlet  = చిఱుతార (ఎక్కువ ప్రసిద్ధిలేని నటి) ; Islet = చిఱుదీవి ; Cutlet = మాంసం ముక్క.

తెలుగులోని స్వీయార్థక రూపాలు ఎక్కువభాగం వివిధ మాండలికాల వల్ల ఉనికిలోకి వచ్చినవి. ఉదాహరణకి, ఊడ్చు = ఊకు ; ఊడిపోవు = ఊసిపోవు ; వెయ్యి (1000) = వెయ్య ; చదువు = సతుకు ; చూపించు = చూయించు. ఉచ్చారణ పరిణామం తప్ప పైవాటి విషయంలో వ్యాకరణ సూత్రాలేవీ ప్రవర్తించవు. ఇలాంటివి సంస్కృతంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి,

ఆవాలం = ఆలవాలం (పాదు)

ఉష్ణం = ఊష్మం (వేడి)

వలగ్నం = అవలగ్నం (నడుము)

ఉత్తమం = అనుత్తమం

రిష్టం = అరిష్టం

పృథివి = పృథ్వి (భూమండలం)

పూర్ = పురం (ఊరు)

ఇవి ఇలా ఉండడానికి కారణం తరతరాల వ్యవహారప్రాబల్యమే తప్ప ఇందులో వ్యాకరణ సూత్రాలేవీ ప్రవర్తించడం లేదు. వీటిని రూపాంతరాలుగా భావించడానిక్కూడా అవకాశం ఉంది. తెలుగులో మాదిరి కాకుండా, సంస్కృతంలో స్వీయార్థకాల్ని లాక్షణికంగా నిష్పాదించవచ్చు. ఈ లాక్షణిక స్వార్థకాలు పై ఉదాహరణల మాదిరి పూర్తిగా స్వార్థకాలు కావు. ఎందుకంటే వ్యాకరణకార్యాల మూలాన వాటి అర్థం మూలశబ్దాన్నుంచి స్వల్పంగా భేదిస్తుంది. అందుచేత ఇవి మూడు రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు.

(i) పూర్ణ స్వీయార్ధకాలు (పూర్తిగా మూలశబ్దార్ధంలోనే ఉండేవి)

(ii) అర్ధ స్వీయార్థకాలు (మూలశబ్దార్ధాన్ని సగం వఱకు మార్చేవి)

(iii) పాద స్వీయార్థకాలు (చాలా వఱకూ మార్చేవి)

(i) అర్ధ స్వీయార్ధకాలు :- పదానికి ‘క’ అనే ప్రత్యయాన్ని చేర్చడం ద్వారా స్వార్ధకాల్నీ, అర్ధ స్వార్థకాల్నీ కల్పించవచ్చు. ఉదాహరణకి,

క్రీడనం (ఆట) -> క్రీడనకం (ఆటవస్తువు)

గృహం (ఇల్లు) -> గృహకం (స్వగృహం లాంటిదే కానీ నిత్యనివాసముండే భవనం కాదు)

పథం (దారి) -> పథకం (దారిలాంటిది – Scheme)

ఋషి -> ఋషిక = స్త్రీఋషి (లేక ఋషిభార్య)

భూమి -> భూమిక = నిలబడేందుకు సరిపోయే నేల (ప్రాతిపదిక, ఆధారం)

అస్థి -> అస్థిక = చిన్న ఎముక

ఈ మార్గంలోనే చలనకం (movie), భాషణకం (speaker), విహారకం (navigator), చామరకం/ వీజనకం (fan) మొదలైన పదాల్ని కల్పించను అవకాశం ఉంది.

(ii) పాద స్వీయార్ధకాలు :- నామవాచకానికి ‘ఈ’ లేదా ‘ఇక’ అనే ప్రత్యయాన్ని చేర్చడం ద్వారా వీటిని నిష్పాదిస్తారు. ఈ నిర్మాణం ఎల్లప్పుడూ స్త్రీలింగంలోనే ఉంటుంది. దీన్ని సాధారణంగా ‘చిన్నది లేదా స్త్రీ’ అనే అర్థంలో ప్రయో గిస్తారు. అందుచేత వీటిల్లో మూలశబ్దార్ధం ఇంకా మారుతుంది. ఉదాహరణకి,

ఈశ్వర -> ఈశ్వరి = ఈశ్వరుని స్త్రీరూపం

వనం -> వని/ వనిక = చిట్టడవి

కలశం -> కలశి = చిన్న చెంబు

స్థలం -> స్థలి = పరిమిత ప్రదేశం

పేట -> పేటి/ పేటిక = చిన్నపెట్టె

వాటం -> వాటి/ వాటిక = చిన్నబస్తీ

కణం -> కణిక = కణం కంటే చిన్నది

మాల -> మాలిక =చిన్నపూదండ

నవల -> నవలిక = చిన్ననవల

తెలుగులో కూడా ‘క’ ప్రత్యయంతోనే స్వీయార్ధకాలు ఏర్పడతాయని కొన్ని పదాల మూలాన తెలుస్తుంది. ఉదాహరణకి –

నిప్పు -> నిప్పుక ; పాటు -> పాటుక

VII. ‘అంతర’ రూపాలు

‘మఱొకటి’ అనే అర్థంలో నామవాచకానికి ‘అంతరం’ అనే సమాసావయవాన్ని చేఱుస్తారు. ఉదాహరణకి,

గ్రామాంతరం = వేఱే గ్రామం

దేశాంతరం = వేఱే దేశం

విషయాంతరం = వేఱే విషయం

ప్రకరణాంతరం = వేఱే సందర్భం

గత్యంతరం = వేఱే గతి (దారి)

రూపాంతరం = మఱో రూపం ఇత్యాది.

సమాసాలతో పదనిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి రూపాలు టూకీతనం కోసం ఉపకరిస్తాయి.

అభ్యాసకార్యములు

I. ఈ క్రింది నామవాచకాలకు ‘అరి’ ప్రత్యయాన్ని చేర్చి కర్మకారులనూ, యజమానులనూ సూచించండి :

1. ఇల్లు 2. పొలం 3. నేల 4. సొమ్ము 5. చేత 6. వేధింపు 7. మదింపు 8. విధింపు 9. తలపు 10. ముఠా 11. వడ్డింపు 12. జీతం కోత 13. పెద్దల్ని తిట్టడం 14. తిరుగుబాటు 15. బెదిఱింపు 16. అదుపు 17. ఎన్నిక 18. ఎంపిక 19. కూలద్రోపు 20. బరితెగింపు 21. చావు 22. మలుపు.

II. ఈ క్రింది క్రియాధాతువులకు నేరుగా ‘అరి’ ప్రత్యయాన్ని చేర్చి కర్మకారులను సూచించండి :

1. చంపు 2. నిలుపు 3. నిలబెట్టు 4. తలవంచు 5. తప్పులెంచు 6. మార్చు 7. దిద్దు 8. మంచిచెప్పు 9. పుట్టు 10. బ్రతుకు 11. దుమ్ములేపు 12. ఛీకొట్టు 13. తన్ను 14. మ్రోగు 15. తెల్పు 16. మార్పుతెచ్చు 17. లావెక్కు 18. దాటు 19. మించు 20. బుఱదజల్లు.

III. ఈ క్రింది నామవాచకాలకు ‘కారి, కాడు, కత్తె ’ ప్రత్యయాల్ని చేర్చి కర్మకారులను సూచించండి :

1. వంట 2. ప్రమాదం 3. నాట్యం 4. నేర్పు 5. పాట 6. తీరు 7. జాప్యం 8. ఈవి 9. వలపు 10. కీడు.

IV. ఈ క్రింది క్రియాధాతువులకు ‘అక’ ప్రత్యయాన్ని చేర్చి కర్మకారులను, కర్మకారకాలనూ సూచించండి :

1. పరిశీలించు 2. సంబోధించు 3. సందేహించు 4. ఆగ్రహించు 5. ఉపసంహరించు 6. కంపించు 7. స్తంభించు 8. భావించు 9. ఆచ్ఛాదించు 10. అభివర్ణించు 11. వందనం చేయు 12. అభినందించు 13. ప్రవహించు 14. బాధించు 15. క్రీడించు 16. ప్రసరించు 17. విధ్వంసించు 18. చికిత్స చేయు 19. ఉపదేశించు 20. కల్పించు 21. ఉత్పాదించు 22. దూషించు 23. నివేదించు 24. విభజించు 25. ఆశీర్వదించు 26. శిక్షణ ఇచ్చు 27. ఉపా సించు 28. పర్యటించు 29. పూరించు 30. విజ్ఞాపన చేయు 31. పరిహసించు.

V. ఈ క్రింది నామవాచకాలకు ‘కార, కర, కృత్’ అనే సమాస అవయవాల్ని చేర్చి కర్మకారులను సూచించండి :

1. విప్లవం 2. ఆందోళన 3. వినాశం 4. కళ 5. శాస్త్రం 6. ప్రబంధం 7. జ్ఞానోదయం 8. ప్రయోజనం 9. గ్రంథం 10. శక్తి 11. సంపత్ 12. స్వాస్థ్యం 13. క్షీరం 14. వర్ణం 15. ఆలస్యం 16. కీర్తి 17. యశస్ 18. క్షేమం 19. ఆరోగ్యం 20. పుష్టి.

VI. ఈ క్రింది నామవాచకాలకు ‘ఆలయం, శాల, అగారం, మందిరం, స్థానం, మంటపం, ప్రాంగణం, గృహం, భండారం, కేంద్రం’ అనే సమాస అవయవాల్ని చేర్చి నిమిత్త భవనాల్ని సూచించండి :

1. సామగ్రి (cloak room) 2. ధాన్యం 3. ధ్యానం 4. ఉత్సవం 5. ప్రతీక్ష 6. నాటకం 7. నాట్యం 8. సంగీతం 9. అభ్యసన 10. సమావేశం.

VII. ఈ క్రింది ప్రాణులకు తెలుగులో పేర్లు పెట్టండి :

1. Giraffe 2. Gorilla 3. Panda 4. Rhino 5. Lion 6. Emu 7. Dinosaur 8. Hippo 9. Dolphin 10. Octopus.

VIII. ఈ క్రింది ఆంగ్లపదాలు సూచించే సాధనాలకు తెలుగు సమానార్థకాల్ని కల్పించండి:

1. Printer 2. Screwdriver 3. Dryer 4. Bomber 5. Cooler 6. Transmitter 7. Cotton press 8. Extractor 9. Boiler 10. Capacitor 11. Compressor 12. Connector 13. Plug 14. Tester 15. Mixer.

IX. ఈ క్రింది క్రియాధాతువులకు ‘ఎన/ ఎల’ లేదా, ‘అలి’ ప్రత్యయాన్ని చేర్చి పనిముట్లను సూచించండి:

1. కడుగు 2. తుడుచు 3. పిడుచు (రసం తీయు) 4. చూపు 5. కుట్టు 6. మొదలుపెట్టు (‘మొదలు’ అని వాడొచ్చు) 7. తెఱచు 8. వడపోయు 9. మాడ్చు 10. వండు.

X. ఈ క్రింది నామవాచకాలకు ‘తనం, ఱికం/ అఱికం’ ప్రత్యయాల్ని చేర్చి భావార్థకాల్ని కల్పించండి :

1. స్తబ్దు 2. మామ 3. అన్న 4. చెల్లెలు 5. బండ 6. బిరుసు 7. తీర్పరి 8. స్వంతం 9. ఘాటు 10. లోపాయికారి.

XI. ఈ క్రింది నామవాచకాలకు ‘త్వం, త’ ప్రత్యయాల్ని చేర్చి భావార్థకాల్ని కల్పించండి:

1. ఆకస్మికం 2. యాదృచ్ఛికం 3. దేశం 4. సానుకూలం 5. ప్రతికూలం 6. హేయం 7. నైతికం 8. వంచకుడు 9. సమదర్శి 10. ఉత్కృష్టం 11. సక్రమం 12. దారుణం.

XII. పదాదివృద్ధినీ, పదాంత ‘య’ ప్రత్యయాన్ని, లేదా ’క’ ప్రత్యయాన్ని ఉపయోగించి ఈ క్రింది నామవాచకాలకు సముదాయార్థకాల్ని సూచించండి:

1. సేన 2. గోపాలుడు 3. అధ్యాపకుడు 4. యువతి 5. ఉద్యోగిన్ 6. గూఢచారిన్ 7. అధికారిన్ 8. వ్యవహారిన్ 9. విలేఖిన్ 10. క్షేత్రిన్ 11. మంత్రిన్ 12. అర్చకుడు. (వీటికి సమాధానాలు కావాలంటే ఈ అభ్యాసాల చివఱ చూడండి)

XIII. ఈ క్రింది అచ్చతెలుగు క్రియాధాతువులకు భావార్థకాల్ని సూచించండి:

1. కొనసాగు 2. అడుగు 3. జఱిపించు 4. ఒప్పుకొను 5. కలగు 6. జఱుగు 7. విఱుగు 8. నలుగు 9. బ్రతిమాలు 10. విఱగబడు 11. దుఃఖపడు 12. కూలబడు 13. చతికిలబడు 14. వాపోవు 15. వలసపోవు 16. 17. వృథాపోవు 18. గుర్తొచ్చు 19. ఆటివచ్చు 20. అందివచ్చు.

XIV. ఈ క్రింది క్రియాధాతువులకు ‘చేసిన/ జఱిగిన వాస్తవం’ అనే అర్థంలో నామవాచకాల్ని కల్పించండి.

1. చేయు 2. అగు 3. తాకు 4. పడు 5. అలుముకొను 6. కఱుగు 7. అరుగు 8. ఆగు 9. ఊగు 10. తెగు.

XV. ఈ క్రింది క్రియాధాతువులకు ‘చేయని/ జఱగని వాస్తవం’ అనే అర్థంలో నామవాచక రూపాల్ని కల్పించండి:

1. ఓపు 2. ఓర్చు 3. గెల్చు 4. తెచ్చు 5. తిను 6. చూచు 7. వండు 8. పండు 9. కునుకు 10. చాలు.

XVI. ఈ క్రింది ఆంగ్లపదాలకు సరియైన తెలుగు/ సంస్కృత సమూహార్థకాలతో అనువదించండి:

1. Questionnaire 2. Plumage 3. Foliage 4. Citizenery 5. Gentry 6. Womenfolk 7. Wish-list 8. Sivalik range of moutains 9. Pile of books 10. Bundle of papers.

XVII. ఈ క్రింది పదాల్ని తగిన అవయవాలతో సమాసించి సమూహార్థకాలుగా మార్చండి:

1. వృత్తికారులు 2. పరిశోధకులు 3. రచయితలు 4. నాయకులు 5. కవులు 6. మహిళలు 7. స్త్రీలు 8. పురుషులు 9. దేవతలు 10. యాత్రికులు 11. ఉపాధ్యాయులు 12. అధ్యాపకులు 13. ఆచార్యులు 14. పాత్రికేయులు 15. విలేఖకులు 16. వంచకులు 17. పాచకులు 18. కృషీవలురు 19. బాలురు 20. సృజనశీలురు 21. ఒజ్జలు 22. చట్టలు 23. ఇళ్ళు 24. ఊళ్ళు 25. ఆణియాలు 26. లోయలు 27. అడవులు 28. చెఱు వులు 29. ఏర్లు 30. వాగులు.

XVIII. ఈ క్రింది నామవాచకాలకు ‘క’ ప్రత్యయాన్ని చేర్చి స్వీయార్థక రూపాల్ని సూచించండి:

1. సాధనం 2. వాహనం 3. చోదనం 4. యంత్రం 5. చిత్రం 6. హస్తం 7. భవంతి 8. మార్గం 9. తరువు (చెట్టు) 10. కుడ్యం (గోడ) 11. మంజరి (పూలగుత్తి) 12. వల్లి (తీగె) 13. ఓషధి 14. నిధి 15. మహతి (నారదవీణ).

XIX. ఈ క్రింది నామవాచకాలకు ‘ఇ’ లేదా ‘ఇక’ ప్రత్యయాన్ని చేర్చి స్వీయార్థక రూపాల్ని సూచించండి:

1. కవనం 2. భవనం 3. గ్రంథం 4. గరిష్ఠం 5. లత 6. రాధ 7. మండలం 8. రాష్ట్రం 9. ప్రాంతం 10. ధార 11. క్షేమం 12. కుశలం.

XX. ఈ క్రింది నామవాచకాలకు ‘మఱో’ అనే అర్థంలో ‘అంతరం’ అనే సమాసావయవాన్ని చేర్చండి:

1. కుటుంబం 2. మార్గం 3. సందర్భం 4. కాలం 5. ప్రస్తావన 6. కావ్యం 7. కృతి 8. శాస్త్రం 9. వంశం 10. ఋతువు.

XII అభ్యాసానికి సమాధానాలు

1. సేన – సైన్యం 2. గోపాలుడు – గౌపాల్యం 3. అధ్యాపకుడు – ఆధ్యాపక్యం 4. యువతి – యౌవతకం 5. ఉద్యోగిన్ – ఔద్యోగిన్యం 6. గూఢచారిన్ – గౌఢచారిణ్యం 7. అధికారిన్ – అధికారిణ్యం 8. వ్యవహారిన్ – వ్యావహారిణ్యం 9. విలేఖిన్ – వైలేఖిన్యం 10. క్షేత్రిన్ – క్షైత్రిణ్యం 11. మంత్రిన్ – మాంత్రిణ్యం 12. అర్చకుడు – ఆర్చక్యం.

 (తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, ఆగస్టు, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.