cover

యాభైపైసల కోసం…

Download PDF ePub MOBI

(అజీజ్ నేసిన్ టర్కీ కథకు కంది శంకరయ్య అనువాదం)

నేను విన్నది నిజమే! మంజూర్ కేవలం యాభై పైసలకోసం బస్ కండక్టర్‍ను కత్తితో పొడిచాడు. ఇది విన్నవాళ్లంతా మంజూర్‍ను నోటికి వచ్చినట్లు తిట్టారు. “బుద్ధిలేదూ? వెధవ యాభై పైసలకోసం రక్తం కళ్ళ జూస్తావా? నువ్వొక మనిషివేనా? ఒకవేళ కండక్టర్ చనిపోతే…?” అంటూ అతన్ని నానారకాలుగా చీదరించుకున్నారు. కొందరైతే పేపర్లో పడ్డ మంజూర్ ఫోటో మీద ఉమ్మికూడా వేశారు.

కాని వాస్తవం ఎందరికి తెలుసు? సంఘటన పూర్వపరాలను గురించి ఎందుకు ఆలోచించరు? తప్పంతా మంజూర్‍దేనా? ఆ రోజంతా మంజూర్ ఎలా గడిపాడో కాస్త గమనిస్తే ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో?

ఆరోజు శనివారం. ఆరోజే మంజూర్‍కు జీతం దొరికింది. చేసిన చేబదుళ్ళలో సగంకూడా తీర్చడానికి ఆజీతం సరిపోదు. అప్పుల సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని ఆలోచిస్తూ సాయంత్రం దాకా అన్యమనస్కంగా ఉన్నాడు.

ఆఫీస్ వదలగానే నేరుగా ఇంటికి వచ్చాడు. భార్య వంటింట్లో రెండు గ్యాస్‍స్టౌలలో ఒకదానిమీద ఏదో వండుతోంది. రెండవదానిని అంటించడానికి అగ్గిపుల్ల గీచింది. అది చూసి మంజూర్ కోపం తెచ్చుకున్నాడు. “నీకసలు పొదుపంటే తెలీదు. నీవల్లనే నేను అప్పుల పాలౌతున్నాను. ఓ లక్షాధికారి పెళ్ళాం తన పుట్టినరోజునాడు బాణసంచా కాల్చినట్టు అగ్గిపుల్లల్ని కాలుస్తున్నావు. పక్కపొయ్యి మండుతున్నప్పుడు దీన్ని ఓ కాగితంతో అంటించవచ్చు కదా! ఆ ఒక్క అగ్గిపుల్లను మిగిల్చి పొదుపు చేయకూడదా?” కాసేపు పెళ్ళాన్ని కసురుకొని చీకాకుతో ముందుగదిలోకి వచ్చాడు.

నోట్‍బుక్‍లోంచి కాగితాన్ని చింపుతున్న కూతురు కనిపించింది. “ఎందుకలా కాగితాలను చింపుతున్నావ్?” అంటూ గద్దించాడు.

“నాన్నా! దీనిమీద ఇంకు పడింది. అందుకే చింపుతున్నాను.” భయంతో వణికిపోతూ జవాబిచ్చింది కూతురు.

“మీకందరికీ నిర్లక్ష్యమే. డబ్బు విలువే తెలీదు. అంతాకలిసి నన్ను నాశనం చేస్తున్నారు.” అంటూ మంజూర్ కూతుర్ని కొట్టాడు.

ఇంతలోనే మంజూర్ కొడుకు దుకాణంనుంచి ఏదో కొనుక్కొని వచ్చాడు. పొట్లానికి కట్టిన దారాన్ని ముక్కలుముక్కలుగా తెంపివేసాడు. అది చూసి మంజూర్ మరింత రెచ్చిపోయాడు. “మీకు దేని విలువా తెలీదు. ఆ దారాన్ని కాస్త ఓపిగ్గా విప్పి దేనికైనా చుట్టి ఉంచితే ఎప్పుడైనా అవసరానికి వచ్చేది కదా! దారం కావలసి వస్తే కొనుక్కురావడానికి బజారుకు పరుగెత్తాలి. నా రెక్కల కష్టమంతా మీ నిర్లక్ష్యంవల్ల దుబారా అవుతోంది. మీరు బాగుపడరు.”

వికలమైన మనస్సుతో ఇంట్లోంచి బయటికి వచ్చాడు.

కొద్దిదూరం నడవగానే ఓ మిత్రుడు కలిసాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ దగ్గర్లోని రెస్టారెంట్‍కు వెళ్ళారు. అల్పాహారం తిని టీ తాగారు. పధ్నాలుగు రూపాయల బిల్ అయింది. ఇద్దరూ జేబుల్లో చేతులు పెట్టారు.

“నువ్వాగవోయ్! బిల్ నేనిస్తాను.” అన్నాడు మంజూర్.

“వద్దు.. వద్దు! నన్నివ్వనీ” అన్నాడు మిత్రుడు.

“నువ్వు బిల్లిస్తే దేవునిమీద ఒట్టు… నాకు కోపం తెప్పించకు.”

“అంత ఒట్టు ఎందుకులే! ఈసారి నువ్వే ఇవ్వు. మళ్ళీ కలుసుకోమా?” మిత్రుడు ఓటమిని అంగీకరించాడు.

మంజూర్ రెండు పదిరూపాయల నోట్లను బేరర్‍కు ఇచ్చాడు. బేరర్ మిగిలిన డబ్బును తెచ్చి ప్లేటులో పెట్టి వెళ్ళిపోయాడు. ఐదురూపాయల నోటొకటి, ఒకరూపాయి నోటొకటి. అది చూసి మంజూర్ సందిగ్ధంలో పడ్డాడు. రూపాయిని టిప్‍గా వదిలితే చిన్నతనంగా అనిపించింది. ఐదురూపాయలు వదలాలంటే మరీ ఎక్కువ! కాసేపు వెనకా ముందులాడి ఏదో అజ్ఞాతశక్తి ప్రోద్బలం చేసినట్లుగా చేయి చాచి ప్లేటులోని రూపాయి నోటు తీసికొని లేచాడు. బేరర్ ఐదు రూపాయలు తీసికొని, వంగి నమస్కారం చేసి మరో కస్టమర్ వైపు వెళ్ళిపోయాడు.

మంజూర్ తనలో తానే తిట్టుకున్నాడు. “ఒరే గాడిదా! హాయిగా ఇంట్లో తినక హోటల్లో తినమని ఏ వెధవ సలహా ఇచ్చాడు? సరె! ఇంట్లో తినాలనిపించలేదనుకో… రోడ్డుపక్కన ఆలూబజ్జీ తిని ఆకలిని చంపుకోక రెస్టారెంటు కెందుకు రావాలి? వచ్చావు సరే! ఆ పెద్దమనిషి బిల్ ఇస్తానంటే ఎందుకు వద్దనాలి? బిల్లు ఇచ్చావనుకో… రూపాయి టిప్ వదిలితే నీ గౌరవానికి ఏం నష్టం వచ్చేది? వ్యర్థంగా అయిదురూపాయలు పోగొట్టుకున్న నువ్వు నిజంగా మనిషివి కాదు… కచ్చితంగా అడ్డగాడిదవు!”

మిత్రుని దగ్గర సెలవు తీసికొని కొద్దిదూరం వెళ్ళాడో లేదో ఓ పరిచయస్తుడు కలిసాడు. “ఎటు బయలుదేరావు మిత్రమా? ఏమిటి ప్రోగ్రాం?”

“ప్రోగ్రాం అంటూ ఏదీ లేదు. ఊరికే అలా తిరిగి వద్దామని…” నసిగాడు మంజూర్.

“అయితే పదండి. కల్‍ఫటన్ కాఫీహౌజ్‍లో కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం.” అంటూ మిత్రుడు టాక్సీని కేకేసాడు.

టాక్సీలో కల్‍ఫటన్ చేరుకున్నారు.

కాఫీహౌజ్ ముందు టాక్సీ దిగి ఇద్దరూ జేబుల్లోంచి డబ్బు తీసారు.

“మీరుండండి! నేనిస్తాను.”

“అబ్బే వద్దండి. నేనిస్తానుగా.”

“అలా అయితే మీతో మరోసారి ఎక్కడికీ రాను సుమా!”

“బాగుంది. మళ్ళీ మనం కలుసుకోమా? మీరు ఇవ్వకపోతారా?”

“మీ మాట ఎందుకు కాదనాలి? సరె… కానీండి…”

గెలిచిన మంజూర్ టాక్సీడ్రైవర్‍ను అడిగాడు ”ఎంతయిందోయ్?”

“మీ యిష్టం… దయ…”

మంజూర్ మనసులోనే తాము ప్రయాణం చేసిన దూరానికి ఎంత అవుతుందో లెక్క వేసుకునే ప్రయత్నం చేశాడు. కుదరలేదు. డ్రైవరే లెక్కప్రకారం తీసికొని మిగిలింది ఇస్తాడనుకొని యాభైరూపాయల నోటును అతని చేతిలో పెట్టాడు. డ్రైవర్ పన్నెండున్నర రూపాయలు తిరిగి ఇచ్చాడు. మంజూర్ రెండున్నర రూపాయలు టిప్ ఇచ్చి మిత్రునితో కాఫీహౌజ్‍లో ప్రవేశించాడు.

కాఫీకి ఆర్డర్ ఇచ్చాక మంజూర్ మళ్ళీ తనను తాను తిట్టుకున్నాడు. “వెధవ గాడిదా! నువ్వొక మనిషిగా మారనే మారవు. నీకీ కల్‍ఫటన్‍లో ఏం పని? హాయిగా ఇంట్లో కూర్చోలేకపోయావా? వచ్చినవాడివి ఈ సన్నాసి టాక్సీ డబ్బులు ఇవ్వబోతే నువ్వెందుకు వద్దనాలి? ఇచ్చినవాడివి టాక్సీడ్రైవర్ చేతిలో ఎందుకలా మోసపోవాలి? వాడు రెట్టింపు కిరాయి వసూలు చేశాడని తెలిసికూడా ఏమీ అనకుండా పైనుంచి దొరబాబులా ఫోజుకొడుతూ టిప్పు కూడా ఇవ్వాలా? నువ్వు గాడిదవు కాక మరేమిటి?”

మంజూర్‍కు తాగుతున్న కాఫీ విషంలా తోచింది. కాఫీ తాగి లేచాక బిల్ ఇచ్చే విషయంలో మళ్ళీ ఇద్దరికీ పేచీ వచ్చింది.

“మీరుండండి!”

“ఫరవాలేదు. నేనిస్తాను.”

“నేనిస్తా లెండి…”

“అదేం మాట? నేనిస్తానుగా…”

ఎదుటివ్యక్తి మౌనం వహించాడు. మంజూర్ బేరర్‍ను అడిగాడు. “బిల్ ఎంత?”

“ఎనిమిదిన్నర సార్!”

మంజూర్ పది రూపాయల నోటు బేరర్‍కు ఇస్తూ అన్నాడు “చిల్లర ఉంచుకో!”

బయటకు వచ్చాక మంజూర్ మళ్ళీ తనను తాను తిట్టుకున్నాడు. “కాఫీకి ఎనిమిదిన్నర రూపాయలా? దానికి టిప్పు రూపాయిన్నర! ఒరే మంజూర్! ఇదెక్కడి న్యాయంరా? విషంలాంటి ఆ కాఫీ కషాయానికి కూడా పోటీపడి నువ్వే బిల్లు కట్టావు. పైగా టిప్పు! గాడిద మనిషిగా మారుతుందేమో కాని నువ్వు మాత్రం మనిషిగా ఎన్నటికీ మారవు.”

ఇద్దరూ టాక్సీ ఎక్కారు. కిరాయి ఇచ్చే సమయంలో నేనంటే నేనని పోటీపడ్డారు. చివరికి మంజూరే గెలిచి కిరాయితో పాటు టిప్ ఇచ్చి మళ్ళీ తనలో తాను తిట్టుకుంటూ ముందుకు సాగాడు.

“హలో మిత్రమా… మంజూర్!”

మంజూర్ తలెత్తి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూశాడు. అతడు మంజూర్‍కు అంత దగ్గరి మిత్రుడేం కాదు. కేవలం పరిచయమే!

“ఎక్కడిదాకా?”

“అబ్బే… ఊరికే!”

“అయితే పదండి! బార్‍లో చెరొక మగ్గు బీర్ తీసుకుందాం.”

ఇద్దరూ బార్‍లోకి వెళ్ళి కూర్చున్నారు.

ఒక గ్లాసు… రెండు గ్లాసులు… ఆరు గ్లాసులు!

బీర్ తాగాక మిత్రుడు బేరర్‍ను పిలిచి అన్నాడు. “తింటానికి ఏదైనా తీసుకురా. బాగుండాలి సుమా! అలాగే ఒక బాటిల్ వోడ్కా తే! బీరు, వోడ్కా కాంబినేషన్… ఓహ్! బ్రహ్మాండంగా ఉంటుంది.”

ఈసారి బిల్లు నూటతొంభై రూపాయలయింది.

కొంచెంసేపు వాగ్యుద్ధం జరిగాక ఈ బిల్లుకూడా మంజూర్ నెత్తినే పడింది. అతడు రెండువందల రూపాయలు బేరర్‍కు ఇచ్చి “మిగిలింది ఉండనీ!” అన్నాడు.

బయటికి వచ్చారు. అర్ధరాత్రి కావస్తోంది. మంజూర్ ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కాడు.

అంతకుముందు కంటె తీవ్రమైన పదజాలంతో తనను తాను తిట్టుకున్నాడు. గాడిద, వెధవ, పశువు లాంటి బిరుదుల్ని తగిలించుకున్నాడు. ఆ రోజు జీతమంతా దండగ కర్చు చేయడంవల్ల ఉత్పన్నమయ్యే కొత్త సమస్యలు సంవత్సరమంతా కష్టపడ్డా పరిష్కారం కావు.

“టికెట్… టికెట్!” అంటూ కండక్టర్ వచ్చాడు.

మంజూర్ జేబులో మిగిలిన ఒకేఒక నాణెం తీసి కండక్టర్‍కు ఇచ్చాడు. ‘అది రూపాయా? అర్ధరూపాయా?’ మంజూర్ కాసేపు ఆలోచించాడు. ‘రూపాయే అయివుంటుంది.’ అని నిశ్చయించుకున్నాడు.

yabhaiబస్ దిగబోతూ కండక్టర్‍ను అడిగాడు “మిగిలిన డబ్బులు…?”

“మిగిలిన డబ్బులా? ఎక్కడివి?” కండక్టర్ ఆశ్చర్యపోయాడు.

“నేనింతకుముందు రూపాయి ఇచ్చాను కదా! అందులో మిగిలిన డబ్బు…”

“లేదండీ! మీరింతకుముందు అర్ధరూపాయే ఇచ్చారు.”

“చూడు మిస్టర్! కాస్త నా కళ్ళల్లోకి చూసి మాట్లాడు. ప్రయాణికులను మోసం చేయడం నీకు సిగ్గనిపించదా?”

“మర్యాదగా మాట్లాడండి. మీరు నాకు యాభైపైసలే ఇచ్చారు.”

“ఛీ… నీతిలేని వెధవా!”

“చూడండి… దైవసాక్షిగా చెప్తున్నాను. మీరు నాకు…” కండక్టర్ తన మాటలు పూర్తి చేయనే లేదు…

మంజూర్ వేగంగా ప్యాంట్ జేబులోంచి కత్తి తీసాడు. నిజానికి అది పెద్ద కత్తి కాదు. కీ చెయిన్‍తో ఉండే పెన్సిళ్ళు చెక్కుకునే చిన్నకత్తి. అతడి ముఖంలో ఇప్పుడు ఏమాత్రం వ్యాకులత లేదు. బస్సులోని జనంలో ఎవరూ ఆ పెనిళ్ళు చెక్కుకునే కత్తితో అతడు పొడుస్తాడని ఊహించలేదు.

కాని మంజూర్ కండక్టర్ పొత్తికడుపులో పొడిచాడు.

యాభైపైసల కోసం రక్తం కళ్ళజూసిన సంఘటన పూర్వపరాలివి. ఈ సంఘటనకు గుర్తుగా ఆ మరునాడు అన్ని పేపర్లలోను అతడి ఫోటో వచ్చింది.

మంజూర్ కేవలం యాభైపైసలకోసమే ఇంత పెద్ద నేరం చేసాడా? తప్పంతా ఒక్క మంజూర్‍దేనా?

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్‌డేట్ల కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి: https://www.facebook.com/KinigePatrika

Posted in 2014, అనువాదం, ఆగస్టు and tagged , , , , , , , .

One Comment

  1. మనిషి బలహీనతలకి, మొహమాటాలకి, లోపలి మనిషి అంతర్యుద్దనికి

    ప్రతీక – ఇది మనలాంటి సగటు మనిషి కథ, ఇదీ జిందగీ అంటే .

    మీ సంగతి తెలీదు . ఈ కథలో నేను మాత్రం కచ్చితంగా ఉన్నాను

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.