cover

నీలికొండలు

Download PDF ePub MOBI

అతను.

మహానగరపు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 9 మీద చిట్టచివర ఆరిపోయిన లైటు క్రింద పరుచుకున్న క్రీనీడలో నిల్చుని వున్నాడు. సాధారణ యువకులకంటే విలక్షణంగా ఉన్నాడు. పొడుగాటి జులపాల జుట్టు చీకటినీడల్లో గీతల్లా కలిసిపోయింది. ఆరడుగుల పొడవు శరీరంతో బలిష్టమైన యోధుడిలా వున్నాడు పల్చటి టీషర్ట్ క్రింద కండలు తిరిగిన భుజాలు చేతులు ఛాతీ కనిపిస్తున్నాయి. భుజానికి నల్లటి లెదర్ బ్యాగ్ తగిలించుకున్నాడు. నీలిరంగు జీన్స్ కాళ్లకి అతుక్కుపోయి, కొనదేరిన గోధుమరంగు ‘కూపర్’ షూస్ ప్లాట్‌ఫారం నల్లటి నేలలో కలిసిపోయాయి.

అతను భుజానికి తగిలించిన సంచీ ఒకచేత్తో పట్టుకుని, రెండో చేతివేళ్ళు కళ్ళకి దగ్గరగా పెట్టుకుని చూస్తున్నాడు.

అది అతనికి ఒక అలవాటు. అతని కొనదేరిన గోళ్ళు చాలా పదునుగా వుంటాయి. చేతికండరాలు ఉక్కు కంటే గట్టిగా వుంటాయి.

ఆ ప్లాట్‌ఫారం చివరి అంచున అలముకున్న చీకట్లోనే S-9 కోచ్ ఆగుతుందని తెలుసతనికి. ఇక్కడ జనసంచారం పెద్దగా లేదు. ఉండదు.

రైలు ఇంకా రాలేదు.

అరచేతిని దగ్గరగా పెట్టుకుని చూసినప్పుడు అతని కళ్ళు తీక్షణంగా మారాయి. కనుపాపలు ఒక్కక్షణం నిప్పుకణికల్లా ఎర్రగా వెలిగి ఆరాయి.

ఒక్కక్షణం. అంతే! ఆక్షణంలోనే ఆ వేలి కొనల నుంచి ఒక నిప్పురవ్వ వెలిగినట్లు కొంచెం కాంతి వెలిగి ఆరింది.

దూరంగా సమాంతరంగా వున్న పట్టాల చివర రైలింజన్ హెడ్‌లైట్ ఒక్కసారి వెలుతురు కిరణం చిమ్మింది.

పెద్దరాక్షసి జంతువు అరిచినట్లు బొంగురు గొంతుతో కూత కూసి రైలు ప్లాట్‌ఫారం మీదికి దడదడా చప్పుడుతో రాసాగింది.

* * *

ఆఖరి బండి అది.

రాత్రి పదకొండుగంటలకి బయలుదేరి ఎన్నో వూళ్ళ మీదుగా ప్రయాణించి పొద్దున ఆరుగంటలకి అతను వెళ్ళాల్సిన వూరు చేరుతుంది.

అదే నీలికొండ స్టేషన్.

ఇక్కడి నుంచి మూడొందల కిలోమీటర్ల దూరం.

అతను…

ప్లాట్‌ఫారం మీద నిలబడి క్రమంగా నెమ్మదవుతున్న రైలు వేగం గమనిస్తూ ఉండిపోయాడు.

రైలుపెట్టెలు నల్లటి కాగితం మీద వెండిగీతలు గీచినట్లు దూసుకుపోతూ క్రమంగా వేగం తగ్గి ఆగిపోసాగాయి.

ధన్.. ధన్.. ధన్.. మెల్లగా S-9 రైలుపెట్టె అతని ముందుకొచ్చి ఆగింది.

రైలుపెట్టెలోకి ప్రవేశించి అతను తన బెర్తునంబరు వెతుక్కుంటూ నడిచి, పైబెర్తు మీదున్న రగ్గు దుప్పటీ తీసుకుని, క్రిందబెర్తు మీద పరుచుకుని పడుకోవడానికి ఉపక్రమించాడు.

స్లీపర్‌కోచ్‌లో అందరూ దాదాపు నిద్రావస్థలో వున్నారు. ఇద్దరోముగ్గురో తప్ప!

నిశ్శబ్దంగా రైలు కదిలింది.

అతనికి వెంటనే నిద్రపట్టేసింది.

… అయితే ఎప్పుడు నిద్రపట్టినా ఒక గంటే అతనికి గాఢంగా పడుతుంది.

ఆ తర్వాత కలలే!

నగరంలో హాస్టల్‌లో పెరిగినప్పుడు కూడా. ఒంటరి బాల్యంలో కూడా…

రెండు ముఖాలు స్పష్టంగా కనిపిస్తూంటాయి. ముఖం మీద ముడతలుబడిన చర్మం, కొనదేరిన మీసాలు, దట్టంగా పెరిగిన పొడుగాటి జడలుకట్టిన జుట్టు…

అతను తన తండ్రి.

ఎర్రబడిన కళ్లతో పొడుగాటి జుట్టు గాలికి ఎగిరిపోతుంటే, వణికే పెదవులతో తనవంకే చూస్తున్న స్ఫురద్రూపియైన స్త్రీ…

ఆమె తన తల్లి.

“పారిపో…! పారిపో…! పాణిగ్రాహీ! ఈ వూర్లో నిన్ను వెంటాడి చంపేస్తారు. పారిపో…! నా బాబూ! చదువుకో… బాగా పైకిరా! ఇక్కడికి మళ్ళీ రావొద్దు!”

తన చేతిలో కుక్కిన బాంక్ పాస్‌బుక్, డెబిట్‍కార్డు, పాస్‌వర్డులు ఉన్న చిన్న కవర్.

“నారాయణ బాయ్స్ హాస్టల్‌కి వెళ్ళిపో! నేను అనాథని అని చెప్పేయ్! అక్కడే వుండు! చదువుకో! తల్లిదండ్రులు నీలికొండ అగ్నిప్రమాదంలో చనిపోయారని చెప్పేయ్! నీకు బ్యాంక్‌లో నీ చదువుకి సరిపడా ఫీజులకీ, పుస్తకాల ఖర్చులకీ కావల్సినంత డబ్బు వుంది. బిటెక్ చదువు. జీవితంలో సెటిల్‌ అయి సుఖపడు! ఇదే మా ఆఖరికోరిక…!”

చూస్తూండగానే వారి ముఖాల్లో మార్పు. కళ్ళు ఎర్రబడి, ముఖం మీద ఎర్రటి, నీలంరంగు గీతలు. అవి సిరలో ధమనులో, లేక ఏదయినా చర్మసంబంధమైన వ్యాధినో మరి!

వాళ్ళిద్దరూ సుదూరంగా వెళ్ళిపోతున్నారు. వారి వెనక గుంపుగా ముసుగుల్లో అస్పష్టంగా నిలబడి చూస్తున్న స్త్రీపురుషులు.

వెనక్కి.. వెనక్కి.. నీలికొండల్లోకి.. క్రమేపీ అదృశ్యమవడం. ఎక్కడో సైరన్‌మోత, వెలిగి ఆరే బీకన్ లైట్లతో మిలిటరీజీపులు… ఆలివ్‌గ్రీన్ రంగులలో. అవి హఠాత్తుగా ఆగిపోవడం.

తను భయంగా పరుగెత్తి ఒక మర్రిచెట్టు వెనకదాగి భయంగా తొంగి చూడటం…

తుపాకులు పట్టుకుని బయటకు దూకిన సైనికులు…

“గోబ్యాక్! గోబ్యాక్!” అని అరవడం తుపాకులు పేలిన చప్పుళ్ళు… దూరంగా మెరిసే ఎర్రటి మంటలు… కొండల వెనుక తెల్లటి పొగ…

శరణార్థుల్లా ఆ గుంపులో తన తల్లిదండ్రులు కలిసిపోయి అస్పష్టంగా… పారిపోయి చీకట్లో కలిసిపోవడం…

అస్పష్టమైన రేఖాచిత్రాల వలే… అదే దృశ్యం ప్రతిరోజూ కలలోకి వస్తుంది.

ఇప్పుడూ… అదే…

ఇప్పుడు తనకి ఇరవైరెండేళ్ళు. పదేళ్ళ క్రితం నీలికొండ నుంచి పారిపోయి వచ్చేశాడు. అప్పుడు తను ఎనిమిదో క్లాసు. ఆ ప్రమాదం ఏమిటో ఎందుకు జరిగిందో పూర్తిగా మరిచిపోయాడు.

భయం… భయం… అస్పష్టమైన జ్ఞాపకాలు. వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తి, పరుగెత్తి నీలికొండ రైలుస్టేషన్‌లో ఆగివున్న రైలులో ఒకపెట్టెలో ఎక్కి కూర్చున్నాడు… ఒణికిపోతూ…

ఆ ఒణుకూ, భయం రైలు కదిలిన గంటకి కాని తగ్గలేదు.

తనతో ఎవరూ లేరు. తనకి ఎవరూ లేరు. మహానగరంలో నారాయణహాస్టల్ అని ఎక్కడ అడిగేది. ఎన్ని డజన్ల హాస్టళ్ళు ఉంటాయి?

రైలు నీరసంగా నగరపు ప్లాట్‌ఫారం మీద ఆగినప్పుడు అనే ప్రశ్నలు, అతని మనసులో.

కానీ… ఓ వ్యక్తి దూరంగా నిలబడి తీక్షణమైన చూపులతో తననే చూస్తున్నాడు. జడలు కట్టిన పొడుగాటి జుట్టు. ఎర్రటికళ్ళు, కొనదేరిన ముక్కు, తెల్లగడ్డం, పొడుగాటి నల్లటికుర్తా పైజమా.

“ఆగు!”

… ఆగిపోయాడు. ఆయనలో ఏదో శక్తి.

“పాణిగ్రాహి?”

“అవును… అవును సార్!”

ఆయన తనని నగరంలో హాస్టల్‌లో చేర్పించి అన్నీ చూసుకుని చదివించాడు. ఆయనలోని ఏదో అతీంద్రియశక్తి… దాన్ని మించిన ఆప్యాయత… తన తల్లిదండ్రులని మర్చిపోయేటట్లు చేసింది. ప్రతి ఆదివారం తన్ని చూడటానికి వచ్చి అన్ని విషయాలు కనుక్కోవడం… ఆయనే తనకి తల్లితండ్రి గురువు స్నేహితుడు…

… విఠల్ దాదా… తను బిటెక్ దాకా చదివిన తర్వాత… ఒకరోజు…

“పాణిగ్రాహీ! నాకిక అవసానదశ వచ్చేసింది. నీకూ చదువయిపోయింది. ఇక నీవు జీవితంలో స్థిరపడాలి! కానీ…”

“దాదా! మీరు లేకపోతే నాకీ ప్రపంచంలో ఎవరూ లేరు! కానీ మీరు నా సందేహాలెన్నటికీ తీర్చరు. ఏమీ చెప్పరు! ఒక్కసారి కూడా… ఇప్పుడు కూడా!” అతని గొంతులో వణుకు. “నాకు వుద్యోగం కేంపస్‌ప్లేస్‌మెంట్‌లో వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఉద్యోగం కాదు. జవాబులు. నా ప్రశ్నలకి మీరే జవాబులు చెప్పాలి.”

చాలాసార్లు అడిగాడు ఆయనని ఇదివరకు. కోపం వచ్చినప్పుడు అద్దంలో చూసుకుంటే తన కళ్ళు ఎర్రగా ఎందుకు మెరుస్తాయి? ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం ర్యాగింగ్ చేసినప్పుడు తనని అవమానం చేయబోయిన సీనియర్ భయపడి ఎలా పారిపోయాడు? తన గోళ్ళు హఠాత్తుగా ఎందుకు ముందుకు పొడుచుకు వస్తాయి? ఒక చిన్న తోపు తోస్తే తనని కొట్టడానికి వచ్చిన ముగ్గురు సీనియర్స్ గాలిలో ఎగిరి దూరంగా వందగజాల అవతల ఎలా పడ్డారు? అందరికీ నెలల తరబడి చదివినా అర్థం కాని కంప్యూటర్ జావా కోర్స్ తనకి మూడురోజుల్లో ఎలా వచ్చింది?

రోజు వచ్చే ఈ కలలేమిటి? నా తల్లిదండ్రులెవరు? ఏమయ్యారు? నాకింత డబ్బు పెట్టి చదివించింది వాళ్ళేనా? తనని చూసి క్లాస్‌మేట్స్ మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎందుకు ముభావంగా అంటీముట్టనట్లు ఉంటారు?

“ఇప్పటికైనా చెప్పు దాదా! నాకేమయింది చిన్నప్పుడు? నాకెవరున్నారు ఈ ప్రపంచంలో? నాకు నువ్వే గురువువి, గార్డియన్‌వి, ప్రాణదాతవి, ఇప్పుడు అన్నీ చెప్పాల్సిందే!”

విఠల్ దాదా ముఖం ఎర్రగా అయి కళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి.

“పాణిగ్రాహీ! నా విధి నేను నిర్వర్తించాను. నీకు సమాధానం నీలికొండలోనే దొరుకుతుంది. కానీ నువ్వు అక్కడికి వెళ్ళకపోతేనే మంచిది! నీ తల్లిదండ్రులు బతికివున్నారని చెప్పలేను. చనిపోయారనీ చెప్పలేను. ఎందుకంటే మనం అందరం అజ్ఞాతంగా వుండాల్సిందే. మన గురించి ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే వెంటాడి వేటాడతారు. హాయిగా వుద్యోగం చేసుకుని నీకు నచ్చిన మంచిపిల్లని నువ్వే వెదుక్కుని పెళ్ళిచేసుకుని జీవితంలో స్థిరపడు! విదేశాలకి వెళ్ళిపో! ఇకకొద్ది దినాల్లో నా ఆఖరి క్షణం వస్తుంది. ఇవిగో ఇవన్నీ నీ బ్యాంక్ ఎకౌంట్ కాగితాలు, చిన్నప్పటి గుర్తులూ…”

డబ్బులు చాలానే వున్న బ్యాంక్ పాస్‌బుక్ కాక పాతకాలపు చిరిగిపోతున్న కాగితాలపై తన బర్త్ సర్టిఫికెట్ జాతకచక్రం, మాసిపోతున్న ఫోటోలలో తనని ఎత్తుకుని నిలబడిన తల్లిదండ్రుల ఫొటో, ఒక చిన్న బంగారపు గొలుసు…

“ఇవి నీ బాల్యపు మొమొరాబిలియా. నీ తల్లిదండ్రులు నాకిచ్చినవి. ఇక నీ శక్తుల గురించి నన్నడగకు. అవి నీకు నీలికొండ గ్రామంలో పుట్టడం వల్ల వచ్చినవి. వాటివల్లే నీ తల్లిదండ్రులు ఇంకా కొందరు పారిపోయారు. నేను ఇక్కడ అజ్ఞాతంలో వుండిపోవాల్సివచ్చింది. ఇంతకంటే ఏం చెప్పలేను…!”

తలనిమిరి ఆశీర్వదించాడాయిన.

“బై పాణిగ్రాహీ! టేక్ కేర్!”

వెళ్ళిపోయాడాయన.

* * *

రైలు దడదడా పెద్ద చప్పుడుతో నిశీధి చీకటిని చీల్చుకుంటూ ఏదో పెద్ద బ్రిడ్జిని దాటుతోంది.

అతను…

కలత నిద్రలోంచి హఠాత్తుగా మేలుకున్నాడు. కళ్ళు మెల్లగా తెరిచి చూశాడు.

ట్రైను అటూ యిటూ వూగుతూ అతివేగంగా పరుగెడుతోంటే పైన నీలిరంగు దీపం మిణుకుమిణుకుమంటోంది.

దూరాన ఏదో సన్నని అలికిడి అతని అతి సునిశితమైన శ్రవణశక్తికి పెద్ద చప్పుడుతో వినవస్తోంది.

ఎవరికీ వినబడని చప్పుళ్ళు.

అందరూ నిద్రలో వున్నారు.

ఎవరో ఎవరిదో నోరు నొక్కుతున్నట్లు మూలుగుతున్నట్లు పెనుగులాడుతున్నట్లు…

గబగబా లేచి నిల్చుని ధ్వనితరంగాలని వెంటాడుతూ నడిచాడు.

కంపార్టుమెంట్ చివర కండక్టర్ కూడా కూర్చునే గాఢనిద్రలో జోగుతున్నాడు. ఒక్క రైల్వే పోలీస్ కూడా లేడు.

ఎవరో మూలుగుతున్నారు. దడదడా ట్రైన్ వేగానికి రైలుపెట్టె అటూయిటూ వూగిపోతోంది. పెట్టెకీ పెట్టెకీ మధ్య వెస్టిబ్యూల్ దాటుకుంటూ పరుగెత్తి చూశాడు.

ఆఖరి కంపార్టుమెంటు చివరి నీడల్లో లావెటరీల దగ్గర క్రీనీడల్లో ఇద్దరు మగ ఆకారాలు, ఓ ఆడమనిషిని రెండు చేతులు అదిమిపెట్టి, ఒకడు ఆమె నోటిని తన చేతులతో నొక్కుతూ మరొకడు మోకాళ్ళ మీద నిలబడి, ఆమెని ఏదేదో చేస్తూ… ఆమె పెనుగులాడుతూ…

అతను.

అతనికి అర్థం అయింది. శరీరంలో అణువణువూ ఉప్పొంగింది. రక్తం ముఖ రక్తనాళాల నిండా ప్రవహించి ముఖం కళ్ళు ఎర్రగా వెలిగాయి. అతని కండలు హఠాత్తుగా ఉబ్బిపోయాయి. చేతిగోళ్ళు శూలాల్లా ముందుకు పొడుచుకువచ్చేయి.

ఒక్క అంగలో వాళ్ళని చేరుకున్నాడు.

అతీంద్రియశక్తి. అతిలోకమైన జంతుశక్తి. వేటాడే పులిజీన్స్. రక్తంలో వేల రెట్లు కెమికల్స్…

ఫెళఫెళా రెండు పంజాదెబ్బలు!

చప్పుడు లేకుండా ఒక్క మూలుగుతో నేలకొరిగిన రెండు మానవశరీరాలు.

ఒక్కక్షణం గిలగిలా తన్నుకుని అచేతనం అయిపోయాయి. వారి నోళ్ళలో నుంచి నురుగులు కలిసిన రక్తం ప్రవహించసాగింది.

విభ్రాంతురాలైన ఆ స్త్రీ అతని వంక మరింత భయవిహ్వలంగా చూసి తొలగిన చీరని సవరించుకుంటూ ఏడుస్తూ పరుగెత్తి తూలుతూ వెళ్ళిపోయింది.

అతను. పాణిగ్రాహి.

ఓ నిముషం స్థాణువై నిలబడి కిందబడిన శరీరాలకేసి చూస్తూ నిలబడిపోయాడు.

తన శరీరంలోంచి ప్రవహించిన మృత్యుశక్తి అతనికి అర్థం అయింది.

ఇప్పుడు అతని శరీరం తిరిగి చల్లబడింది.

రైలు వేగంగా పోతూనే వుంది.

గాలి తీసిన బెలూన్‍లా నీరసంగా సీట్లోకి తిరిగివచ్చేశాడు.

ఎలా? ఎలా జరిగింది? ఆమె ఎవరైతే తనకేం? ఎందుకలా చేశాడు? ఇప్పుడు రెండుహత్యలు చేశాడు!!

అతని మెదడు ఆలోచించడం మానేసింది. ఇంతజరిగినా స్లీపర్‌కోచ్‌లో అందరూ నిద్రపోతున్నారు. రైలుశబ్దం నేపథ్యంలో, లోపల నిశ్శబ్దం వూగుతోంది.

అతను తన బెర్త్‌లో పడుకుని రగ్గు ముఖం నిండా కప్పుకున్నాడు. నిద్రపట్టేసింది. మత్తుమందు ఇచ్చినట్లు. వెంటనే…

* * *

నీలికొండ స్టేషన్‌లో ఒక్క రెండునిముషాలే ఆగుతుంది మహానగరం నుంచి వచ్చిన రైలు.

తెల్లవారుతోంది. స్టేషన్ నిండా తెల్లటి పొగమంచు ఆవరించి వుంది. సిమెంటు బెంచీలు, బోర్డులు, ద్వారాలు అన్నీ తెల్లగా, అస్పష్టంగా…

అతనొక్కడే అక్కడ దిగాడు. ఒకే ఒక్క స్టేషన్ మాస్టర్ బయట ద్వారం దగ్గిర నిలబడి “టికెట్ ప్లీజ్!” అడిగాడు.

రైలు బయలుదేరి పెద్దకూతతో పెరుగుతున్న చప్పుడుతో వెళ్ళిపోయింది.

ఎక్కడో ఒక కాకి అరుపు తప్ప అంతా నిశ్శబ్దం. చుట్టూ తెల్లని పూర్వజన్మ జ్ఞాపకాల్లాంటి మిస్టీరియస్ పొగమంచు.

స్టేషన్ బయట ఒకేఒక్క ఆటోరిక్షా మంచులో బూడిద రంగు నీడలా నిలబడి వుంది. నిద్రపోయే డ్రైవర్‌ని “బాబూ వస్తావా?” అని నిద్రలేపాడు.

“ఎక్కడికి” అడిగాడు ఆ ఖాకీబట్టల డ్రైవర్ నిద్రకళ్ళతో మత్తుగా.

అతను. పాణిగ్రాహి. అతనికే తెలియదు తన గమ్యం ఏమిటో.

చిన్న వూరు. వూరి సర్పంచ్ ఇంటికి వెళ్ళి అడిగితే తల్లిదండ్రుల వివరాలు తెలియవచ్చు.

“వూళ్ళో సెంటర్‌కి తీసికెళ్ళు! అక్కడే ఏదైనా హోటల్ వుంటే అక్కడికి!”

“పది కిలోమీటర్లు వుంటదండి. వందరూపాయిలు” అన్నాడు ఆటోడ్రైవర్. “ఈ పల్లెటూళ్ళో ఒకే ఒక్క హోటల్ వుంది సార్. సెంటర్‌లోనే!”

ఆటో కదిలింది. రోడ్డు కటూయిటూ చెట్లు తెల్లటిశిల్పాల్లా పొగమంచులో నిశ్చలంగా నిలబడి వున్నాయి.

దారిపక్క పొలాల మధ్య హఠాత్తుగా పెద్ద ఇనపగేటు, పొడుగాటి కొండరాళ్ళ ప్రహరీగోడ, ఆశ్చర్యకరంగా గోడ వెనకాల దూరంగా మంచులో కలిసిపోతూ పెద్ద డోమ్ గుండ్రంగా, దాని చుట్టూ చాలా పెద్ద భవన సముదాయం. గేటు ముందు గన్స్‌తో కాపలా కాస్తూ, మిలిటరీ గార్డ్స్ ఇద్దరు. వారి ఆలివ్‌గ్రీన్ యూనిఫారం మంచులో తడిసి చారికలు కట్టింది.

“ఏమిటిది?” అడగబోతుండగానే పెద్ద బోర్డు కనిపించింది.

“ ది నీలికొండ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ”

ముదురు నీలిరంగు బోర్డు మీది తెల్లని అక్షరాలు మంచు బిందువులతో ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు ప్రతిఫలించి తళుక్కుమన్నాయి.

దూరంగా గ్రామం కనిపిస్తోంది.

ఊరి బయట పూరిగుడిసెలు, ఆ తర్వాత పెంకుటిళ్ళు, మధ్య మధ్య డాబాలు ఒకటిరెండు పెద్ద కాంక్రీటు భవనాలు… అక్కడక్కడా కొబ్బరిచెట్లు, వేపచెట్లు కనిపిస్తున్నాయి.

వాటికంటె అతణ్ణి ఆకర్షించినది ఆ వూరి ఇళ్ళ వెనక ఇంకా సుదూరంగా ఆకాశం అంచున తెల్లని మంచు తెరల్లో కలిసిపోతూ సూర్యకాంతిలో తళుక్కున మెరిసిన కొండల సముదాయం…

నీలికొండలు.

వాటిని అల్లుకుని పచ్చని చెట్టూచేమా.

“అవేమిటి బాబూ?” అడిగాడు.

“నీలికొండలండి. అట్నుంచే మా వూరికి ఆ పేరు వచ్చిందండి!”

దారికి అటుయిటూ పచ్చటి పొలాలు. చెట్లు. సైకిళ్ళ మీద, ఎద్దులబండ్ల మీద గళ్ళలుంగీలు, పంచలు కట్టుకుని వున్న వ్యవసాయకూలీలు. అప్పుడే పొలాలకి బయలుదేరి వెళ్తున్నారు.

ఆటో వూరి సెంటర్‌లో ఆగింది.

అతను ఆటో డబ్బు చెల్లించి, ఒక రేకులషెడ్డులో వున్న టీస్టాల్ దగ్గర “ఒక టీ!” అని అడిగి నిల్చున్నాడు.

ఈ కుగ్రామంలో న్యూక్లియర్ పవర్‌స్టేషన్. తనకి తరుచు కలలో వచ్చే నీలికొండలు అవే!

నోరు కాల్చినంత పని చేసిన వేడి టీ చిక్కటిపాలతో రుచిగా ఉంది.

“వూరి సర్పంచ్ గారి ఇల్లెక్కడ?” అడిగాడు.

“తిన్నగా ఎల్లి ఎడం వైపు సందులోకి తిరగండి. రాంభద్రయ్యగారి ఇల్లంటే చెబుతారు. ఆయన యింటి పక్కనే పంచాయితీ ఆఫీసుంటుంది.”

బ్యాగు భుజాన వేసుకుని నడిచాడు. గతుకులు పడిన కంకర్రోడ్డు. అక్కడక్కడా ఆవులు విడిచిన పేడముద్దలు. గడ్డిపరకలు. రాళ్ళు.

నీలికొండ పంచాయితీ ఆఫీస్ పక్కనే వున్న సర్పంచి ఇంటి ముందు ఆగాడు. ఎత్తరుగుల ఇల్లు. ఆకుపచ్చరంగు దర్వాజా.

తలుపు తెరిచే వుంది.

ఇప్పుడు బాగా తెల్లారింది.

ఒక బుంగమీసాల ముసలాయన.

తెల్లధోవతి జుబ్బాతో బయటకి వచ్చాడు. నుదుటిన ఎర్రటిబొట్టు. మెడలో రుద్రాక్షలు.

“ఎవరు బాబూ నువ్వు? ఎవరు కావాలి?”

“మహానగరం నుంచి వస్తున్నాను. రైలు దిగాను. పూర్వం మా తల్లిదండ్రుల వూరు ఇదే. నేను నగరంలోనే చిన్నప్పట్నించీ చదువుకున్నాను. నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే పోయారు. వాళ్ళ పేర్లు తప్ప నాకేం తెలియదు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందామని… నా చదువయిపోయింది. ఇంజనీరుని. వారి వివరాలు చెబుతారేమోనని…” గబగబా చెప్పి ఆగిపోయాడు.

బుంగమీసాలు పైకీ కిందకీ ఆడాయి. సర్పంచ్ రాంభద్రయ్య ముఖంలో నెత్తురంతా మెదడులోకి వెళ్ళిందో ఏమో అది ఒక్కసారి తెల్లగా పాలిపోయింది.

“మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పునాయినా! కూచో!” చేతితో అరుగు మీదకి చూపించాడు.

“మా తండ్రిగారు అనంతగ్రాహి, తల్లి లక్ష్మిందేవి, విశ్వబ్రాహ్మణులని విన్నాను. మాకు ఇక్కడ పొలాలు, నగలషాపులు వుండేవట.”

ఆయన భయపడిపోయాడు. వణికిపోతున్నాడు. “నీ పేరు..?”

“పాణిగ్రాహి”

“పాణిగ్రాహీ అది ఎన్నో దశాబ్దాల క్రితం విషయం. ఈ వూరికి శాపం. మీ తండ్రి న్యూక్లియర్ కార్పొరేషన్‌లో పని చేశాడు. మీ పొలాలు కంపెనీకి అమ్మినందుకు వాళ్ళిద్దరికీ ఉద్యోగాలిచ్చారు. కాని నువ్వు వెంటనే వెళ్ళిపోవడం మంచిది. వారి బిడ్డగా నీకు చాలా అపాయం!”

ఓ చిన్నపిల్ల స్టీలు గ్లాసులో కాఫీ మంచినీళ్ళు ప్లేటులో పెట్టుకుని బయటకి వచ్చింది.

రాంభద్రయ్య రిటైరయిన సర్పంచి. పైగా తొంభైయ్యేళ్ళ ముదుసలి అని ఇప్పుడు అర్థం అయింది. ఆయన ముఖంలో వేలముడుతలు. ఎర్రటిముడుతల్లో చెమటలు కారుతున్నాయి ఇప్పుడు.

“పాణిగ్రాహీ! ముప్ఫై ఏళ్ళ క్రితం నేను వూరి సర్పంచిని. ఇప్పుడు నన్ను అదే పేరుతో పిలుస్తారు. ఇప్పుడంతా మారిపోయింది. ఈ వూరు నీకు మంచిది కాదు. నీ తల్లిదండ్రులు న్యూక్లియర్ ప్రాజెక్టు కట్టిన సంవత్సరానికే జబ్బున పడ్డారు. వాళ్ళని ఫ్యాక్టరీ యాజమాన్యం తరిమేసింది.” ఆయన గొంతు రహస్యంగా మారింది. “ఆ ఫ్యాక్టరీలో జబ్బుపడిన వాళ్ళంతా కొండల్లోకి పోయి తలదాచుకున్నారు. కొందర్ని చంపేశారు. ఏదో చెప్పరాని మహమ్మారి వారిని పొట్టనపెట్టుకుందని అంటారు. ఇది ఎవరూ మాట్లాడరు, చర్చించరు! వారి గురించి అడగటానికి వచ్చినవాళ్ళని కూడా అనుమానంగా చూస్తారు. ఆ పాతకేసులన్నీ ఎప్పుడో మాఫీ చేశారు. బాబూ ఈ కంపెనీ వాళ్ళు మంచివాళ్ళు కాదు. క్రూరులు. బలవంతులు!”

పాణిగ్రాహికి ఆశ్చర్యం వేసింది. “ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఇంత రహస్యమా… పోలీసులు, పత్రికలు, నాయకులూ, ప్రభుత్వమూ…”

“అన్నీ అయిపోయాయి బాబూ! ఇదొక చిన్న కుగ్రామం. అదొక బహుళజాతి కోట్ల డాలర్ల సంస్థ! వారి సైన్యం అధికారం పలుకుబడీ వారికి వుంది. అణుశక్తి మీద కరెంటు తయారు చేసి అమ్మే వ్యాపారం. అడ్డువచ్చిన వాళ్ళని భస్మం చేస్తారు. పొలాలు మాడిపోయాయి. చెట్లు పాడయిపోయాయి. ఏదో నష్టపరిహారం మీద కాలక్షేపం చేస్తున్నాం…”

“మరి వాళ్ళు, నా తల్లిదండ్రులు, మిగిలినవాళ్ళు, వాళ్ళకేమయింది?”

“నువ్వు వెళ్ళిపో! పాణిగ్రాహీ! నీకు ఇక్కడ ప్రమాదం. అదే నా సలహా! జవాబు!”

పాణిగ్రాహి లేచి నిల్చున్నాడు. ఈ ముసలివాడి నుంచి ఇంతకంటే ఏ సమాచారం రాదు.

బయటకి నడిచాడు.

గతుకుల రోడ్డు. సెంటర్లో ఇప్పుడు జనసంచారం ఎక్కువయింది. రెండు ఎర్రబస్సులు, నాలుగు ఆటోలు ఆగివున్నాయి.

ఒంటి నిండా పొక్కులతో వికృతంగా వున్న బిచ్చగాడు “అయ్యా! ధర్మం!” అంటూ అడుక్కుంటున్నాడు.

నీలికొండలు. అక్కడికి వెళ్ళాలి. అక్కడే తనకి జవాబు దొరుకుతుంది.

“ఆటో…!”

ఈసారి ఖాకీబట్టలులేని చిరుగుల బనీనుతోవున్న ఆటోడ్రైవర్ ఆటో దిగి, “సార్! ఎక్కడికి?” అడిగాడు.

“నీలికొండల దగ్గరకి తీసికెళ్తావా? అక్కడ ఎవరున్నారో చూడాలి.”

ఆటో డ్రైవర్ కళ్ళల్లో భయం. ముఖంలో తొట్రుపాటు. పెదాలు వణికాయి.

“అక్కడ ఎవరూ వుండరు సార్! కొంతమంది పిచ్చోళ్ళు వున్నారంటారు. పగలైతే దయ్యాలుండవు గానీ, రాత్రిళ్ళు మడుసుల్ని తినే పిశాచాలున్నాయని చెప్పుకుంటారు బాబూ. నేను రాను అక్కడికి. మీరైనా ఎళ్ళటాకి చూడటాకి ఏముంటుందక్కడ?”

“రెండొందలు ఇస్తా. కొండల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపో!”

కొద్దిగా ఆశపడినట్లు వాడి ముఖంలో కాంతి వచ్చింది.

“డబ్బు గురించి కాదు గానీ… మీకే మంచిది కాదు” నసిగాడు.

“రెండొందల ఏభై!”

“సరే సార్ ఎక్కండి! లోపల గుహల కాడికి మీరే ఎల్లండి! కొండల దగ్గర బయిటే వదిలి వచ్చేత్తాను!”

ఇప్పుడు తెల్లటి ఎండకాంతి వూరంతా పరుచుకుని వెలిసిపోయిన డాబాలు, మంచుబిందువులతో తడిసిన పూరిపాకలూ తళతళా మెరుస్తున్నాయి.

ఆటో ఎక్కి “పోనీ!” అన్నాడు. మనసులో ఉద్వేగం. ఏదో ‘దిజావూ’ (deja vu), ఇదివరకే అక్కడ అన్నీ చూసినట్లు భావం.

గతుకులదారిలో వూరు దాటి పంటకాలువ ఒడ్డున పోతోంది ఆటో.

నీళ్ళల్లో సూర్యకిరణాలు కెరటాల్లా మెరుస్తున్నాయి. దూరాన పంటకాలువ ఒంగిన చెట్ల నీడల్లో మలుపు తిరిగింది. సన్నని రాళ్ళదారి తిన్నగా రెండు కిలో మీటర్ల వరకూ సాగిపోయింది.

ఆ చివర హఠాత్తుగా కనిపించాయి ఎత్తైన నీలిరాళ్ళగుట్టలు. వాటి వెనక ఇంకా ఎత్తైన కొండల గుంపులు. వాటి మీద అలుముకున్న పచ్చటి చెట్టూచేమా.

“ఇక్కడ ఆగిపోతా బాబూ! మీరు దిగండి! ఆ దారిన ఎల్లిపొండి!” అన్నాడు ఆటో అబ్బాయి. వాడి గొంతులో భయం, త్వరగా వెళ్ళిపోవాలనే ఆత్రుత.

పాణిగ్రాహి భుజాన బ్యాగ్ తగిలించుకుని ఆటో దిగాడు.

“ఇంద!” డబ్బునోట్లు అతని చేతిలో పెడుతూ హఠాత్తుగా ఆగిపోయాడు.

ఎక్కడో మోటరు వాహనాల చప్పుడు. తుపాకీ పేలిన మోత.

పైకి చూస్తే ఆకాశంలో వలయాలుగా తిరిగే పొగ.

కొన్ని పక్షులు చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి.

బరబరా ముళ్ళచక్రాలు గతుకుల రాళ్ళ మీద తిరిగిన చప్పుడు.

ఎక్కడ్నించి వస్తోందో ఒక మిలిటరీ జీప్ దుమ్ము రేపుకుంటూ వెనక వస్తోంది.

దానికి తగిలించిన స్పీకర్ లోంచి, అరుపు: “హాల్ట్! ఆగిపో! ఆగకపోతే కాల్చేస్తాం! ఆగు మిస్టర్!”

ఆటో అబ్బాయి దఢాలున ఆటోలో ఎక్కి దాన్ని పెద్ద చప్పుడుతో స్టార్ట్ చేసి ముందుకు పారిపోసాగాడు.

“చేతులు గాలిలో ఎత్తు! రైల్లో హత్యలు చేసి పారిపోతున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. కదిల్తే కాల్చేస్తాం.” హిందీలో ఇంగ్లీషులో మైక్ నుంచి కర్కశ స్వరం ఒకటి వినిపిస్తోంది.

అతను ఎదురుగా నీలికొండల కేసి చూశాడు. కొండల పాదాల్లో గుహల ద్వారాలు ఇప్పుడు సూర్యకాంతికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిలోంచి కొన్ని డజన్ల ఆకారాలు తూలుకుంటూ, మెల్లగా నడుచుకుంటూ బయటకి వస్తున్నాయి.

“పాణిగ్రాహీ! పరుగెత్తి వచ్చేయి! వాళ్ళు నిన్ను చంపేస్తారు! అరెస్టు చేయరు! ప్రాణాలతో వదలరు!”

దూరంగా అరిచిన స్వరం అతని అద్భుతమైన శ్రవణ గ్రహణ శక్తికి కొన్ని వేల ఓల్టుల ధ్వనితో వినబడింది.

“వచ్చేయ్! పరుగెత్తు! నీకిక్కడే రక్షణ వుంటుంది!”

ఈసారి స్త్రీ గొంతు! అమ్మ గొంతులా ఆప్యాయంగా.

ధడాలున కొండ వైపు పరుగెత్తాడు.

జన్యుశక్తి వల్ల అతని వేగం గంటకి నూటపదికిలోమీటర్ల కంటే ఎక్కువే వుంటుంది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరుగెత్తాడు.

అతని వెనుక తూటాలు రివ్వురివ్వున చెవుల పక్క నుంచి దూసుకుపోతున్నాయి.

ఛిన్నాభిన్నమైన ఆటో మంటలంటుకుని ఆగిపోయి తగలబడిపోతోంది. ఆ కుర్రాడు ఒంటినిండా గాయాలతో అరుస్తూ పరుగెడుతున్నాడు.

లిప్తపాటులో గుహద్వారం చేరుకున్నాడు.

దూరాన జీప్ ముందుకు రాలేదు. ఆగిపోయింది.

neeli kondaluచుట్టూ వ్యక్తులు తెల్లటి జుట్లూ ముడుతలు పడిన ముఖాలూ కాని బలిష్టంగా కండలుతిరిగిన చేతులు. మాసిన చిరుగుల నీలి దుస్తులు చీరల్లో పురుషులు స్త్రీలు.

“రా నాయినా రా! లోపలికి వెళ్ళిపో! ఇక భయం లేదు!” ఓ స్త్రీ గొంతు.

దూరాన కొండలకీ జీపుకీ మధ్య అడ్డుగోడలా పెద్ద నిప్పురవ్వలతో ఎర్రని మంట లేచింది.

మిలిటరీ జీప్ వేగంగా రివర్స్ చేసుకుని వెళ్ళిపోసాగింది.

“ఎవరు? ఎవరు మీరంతా? ఇక్కడ ఎందుకున్నారు? మా నాన్న అనంతగ్రాహి, అమ్మ లక్శ్మిందేవి ఎక్కడ?” అరిచాడు ఆవేదనగా.

అతను.

అతను అరుస్తూ లోపలికి చీకట్లోకి వెళ్ళి అందర్నీ చూస్తూ పలవరించసాగాడు.

“ఏరీ! ఏరీ! ఏరీ నావాళ్ళు?”

చీకటిగుహల్లోంచి అక్కడక్కడా వెలుతురు చారికలు.

“అరవకు నాయినా! అంతా ఇక్కడే ఉన్నాం. మన స్థావరం ఇదే! మీ అమ్మానాన్నా ఇప్పుడు నువ్వు కూడా అందరం ఇక్కడే వుండిపోవాలి. ఇది మన కాలనీ. మన శక్తులతో మనని కాపాడుకుని మన ఆహారం మనమే సంపాదించుకుని, మన వింతలక్షణాలతో జీఇతం గడపాల్సిందే. ఇది మనం ఏర్పరుచుకున్న కాలనీ.”

“బ్లూహిల్స్ మ్యుటంట్స్ కాలనీ” ఒకావిడ అంది.

అతను.

అతని మేధకి భయంకరమైన విస్ఫోటంలా ఒక్కసారి అర్థం అయింది.

ఎన్నో దశాబ్దాల క్రితం జరిగిన న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ప్రమాదం. ఆ రేడియేషన్ ప్రభావానికి జన్యువుల మార్పు. వింతశక్తులు. వింతజబ్బులు.

మ్యుటేషన్.

తనొక మ్యుటంట్.

“ఔను!” అంది ఒక ముసలామె. అతని ఆలోచనలు చదివినట్లు.

“మనందరం. మ్యుటంట్స్. నీ సైన్సు తెలివికి ఈ సరికి అర్థం అయి వుండాలి. మనం వేటాడబడతాం. సమాజంలో వుండనీదు ఆ కంపెనీ. ఇక్కడే మనకి రక్షణ. ఇక్కడికి రాకుండానే వుండాల్సింది. ఇక తిరిగి వెళ్ళలేవు. అయినా బాధలేదు. మా లాగానే నీవు. మాతోనే నువ్వు. పద! పద!”

అతను.

వివశుడై విభ్రముడై తనని గురించి తాను తెలుసుకుంటూ అంధకార బంధురమైన చీకటిగుహల్లోకి ఇంకా ఇంకా లోపలికి అడుగులు వేయసాగాడు.

భారంగా నడుస్తున్న ఆకారాలు చీకటిలో క్రమంగా అదృశ్యం అయిపోయాయి.

నీలికొండల్లో నిశ్శబ్దం మళ్ళీ అలుముకొంది.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్ల కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి: https://www.facebook.com/KinigePatrika

Posted in 2014, ఆగస్టు, కథ and tagged , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.