cover

పొగుడ్రు డబ్బీ

Download PDF ePub MOBI

మా వూర్లో పుల్లూరోళ్ల నీలవేణి, నేను ఒగే సమత్సరం పుట్న్యాము. ఒగే కలాసులో సదవతా వున్న్యాము. ఎలిమెంట్రీ స్కూలైనా, మా ఇస్కూల్లో ఐదో తరగతోళ్లకు ఆనుకొని కూసొనేదానికి నేలబెంచీలుండేవి. నేనూ, నీలా ఒగే బెంచీలో కూసొనే వోళ్లం. ఎప్పుడూ ఒగటిగా కలిసి తిరగతా సట్టిపెంకులు, టెంకాయి సిప్పల్తో నలుగురైదుగురిని కూడేసుకోని బొమ్మరిండ్లు గట్టుకోని ఆట్లాడుకుంటా సింతమాన్లకిందా, మావిడిసెట్లకాడా కాయల కోసం ఎగబడతా యాడ జూసినా మేమే అన్నట్లుగా వుండేవోళ్లం. అట్లాడుకొనేటప్పుడు మా యబ్బోడోళ్లు గోపిని, రవిని గూడా సేర్సుకుంటాం కాబట్టి మాయమ్మతో తిట్లు తప్పేవి.

నీలా వాళ్లకు, మాకు సుట్టరికం గూడా వుండాది. పక్కపక్క బాయిలకింద సేద్యాలు. అది మా యింట్లో, అది తప్పితే నేను వాళ్లింట్లో ఒగర్నొకరు ఎడబడకుండా మాయమ్మ మాటల్లో సెప్పాలంటే ఊరు బసివిలు తిరిగినట్లుగా తిరిగేవోళ్లం. నేను తలకు సమురు బెట్టుకోకుండా, తలకాయ దువ్వుకోకుండా పుట్టెడుపేన్లతో ఇర్లసెంగి మాదిరిగా తిరగతావుంటానని మాయమ్మ యాకారేది. మాయక్క బుద్దిగా ఇంట్లోనే వుంటాదా! ఆ నంగనాచి టంగు బుర్రవల్ల నాకు తిట్లు.

ఇప్పుడైతే మా వూర్లో నాగరికం మించిపోయింది. మేం పిలకాయిలుగా వున్న్యప్పుడట్లాకాదు. నీళ్లు బోసుకున్న్యప్పుడే మొగానికి సబ్బు రుద్దుకొనేది. ఒంటిమింద బండరాయితో రుద్దుకోకుండా నీళ్లుబోసుకొనేది లేదు. అయిస్కూల్లో సదివేటప్పుడు కూడా మాయమ్మే ఒళ్లు రుద్ది నీళ్లుబోసేది. మాయమ్మే తలబులిమేది. మొగం గడుక్కున్న్యాక సాందుచిప్పలో రొండు సుక్కల నీళ్లుబోసి సాంది ఏలికి దీసుకోని దాన్ని బొట్నేలూ సూపుడేళ్లతో ఒక సోటికి దెచ్చుకొని గుండ్రంగా సుక్కబొట్టు బెట్టుకొనేటోల్లం. లేదా పొరకపుల్లతో నాంబొట్టు పెట్టుకొనేటోళ్లం. సాందు గూడా ఇంట్లోనే తయారు జేసేది మాయమ్మ. రాగుల్ని నల్లంగా ఏంచి నీళ్లు బోసి వుడికించి పప్పుగుత్తితో ఎనిపి టెంకాయ చిప్పల్లో బోసి పెట్టేది. అది ఆరిపోయి గెట్టింగా అవతాది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో నీళ్లుబోసి సాంది పెట్టుకొనేటోళ్లం. కలబందకు ఆమిదిం పూసి దీపం పైన బోర్లకు బెట్తే కాటికి తయారయ్యేది. అది కండ్లకు బెట్టుకుంటే ఎంత సల్లంగా వుంటాయని కండ్లు, సాందుబొట్టు కూడా అంతే. రాగులుతో సేస్తారుగదా గమగమా వాసనేస్తా తళతళా మెరస్తావుంటాది. ఈ బొట్టు కాటికిలు తప్ప పొగుడ్రులు, ఇస్నోలు, కిరీములు ఎరగము మేము. మా నాయినోల్ల సిన్నన్న కూతురు లీలక్క దెగ్గిరుండేదిలే ఇవన్నీ. మా లీలక్క ఒకసారి నోముల పండక్కి మా వూరొచ్చింది. మా నాయన వాళ్ల మేనత్తోళ్లకు దత్తుకొచ్చినాడు కాబట్టి మేము వేరేవూర్లో వుండేవాళ్లంలే. వాటితో నన్ను, మాయక్కను సింగారించి మెడలో పూసల దండలు గూడా ఏసింది. అవేసుకొని మాయక్క ఇంట్లోనే వుండి పోయిందిగాని నేను మాత్రం వూర్లో వాళ్లంతా నా సింగారాన్ని సూడాలని ఆ దినమంతా ఈదిలో ఈపక్క నుంచి ఆపక్కకు తిరగతానే వున్న్యాను.

నీలావాళ్ల పెద్దన్నకు పెండ్లయింది. వాళ్ల వొదిన, వాళ్ల కంటే మాకే దెగ్గిరి సుట్టం. పేరు ఆదిలచ్మి. ఆయక్కకు కొడుకు పుట్న్యాడు. ఆదిలచ్మక్కోళ్ల అమ్మోళ్లు పురుడప్పుడు సబ్బు, పొగుడ్రుడబ్బీ, సొక్కాయి దెచ్చి ఉయ్యాల తొట్టిలో ఏసినప్పుడు తాంబాళం తట్టలోబెట్టి ఇచ్చినారు. నీలావాళ్లు కూడా తెచ్చి అన్నీ తట్టలోబెట్టినారు.

నీలాకు నీళ్లుబోసి తలదువ్వి జడేసేది వాళ్ల సావిత్రక్కే. ఆ పొద్దునుంచి వాళ్లక్క వాళ్ల సెల్లికి జడేసి పూలు బెట్టేది. వాళ్లకు బాయికాడ సెండుమల్లి తోటుండేది. పెళ్లో మల్లి పందిరి, గిన్నే సెంబులుతోమే సుట్టుపట్ల కనకాంబరాల సెట్లు గూడా దండిగా వుండేవి. నీలాకు గుండుగా వుండే పొగడ్రుడబ్బీలోంచి పౌడరు బూసే సెండుతో మొగానికి తెల్లంగా పౌడరు బూసి మళ్లీ సెండుకంటిన పొగుడ్రునంతా మొంగ మింద అట్టట్లా కొట్టేది వాళ్లక్క. అది పొడిపొడిగా సన్నరవ్వమాదిరిగా మొగం మింద పర్సుకోనుంటే నా మొగం మింద కూడా తెల్లంగా పొగుడ్రు పూసుకుంటే ఎంత బాగుంటాదనుకునేదాన్ని.

irlachengiఎప్పుడూ సిక్కిరిబిక్కిరిగా వుండే నాకు మర్సనాడు ఇస్కూలుకు బయలుదేరతా నట్టింటి దీగూట్లో వున్ని సాందు చిప్పదీసుకున్న్యాక ఒక అవుడియా తట్టింది. అంతే సాందు చిప్పను పక్కన బెట్టేసి రొండు అరిసేతుల్ని గోడకు రుద్ది తెల్లంగా అరిసేతులకంటిన సున్నాన్ని మొగానికి రుద్దుకున్న్యాను. అద్దంలో సూసుకుంటే మొగం తెల్లంగా, అందంగా కన్పించింది. బొట్టు బెట్టుకుంటే ఇంకెంత బాగుంటాదో అనుకుంటా అద్దాన్ని గూట్లోబెట్టి సాందు చిప్పలోకి నీళ్లు బోసుకోనొద్దామని తిరిగినానా మా జీతగాడు బాలడోలక్క పూబతి నన్ను జూసి నవ్వతా వుండాది కసమాలం ముండ. అప్పుడే రావాల్నా. సున్నం బూసుకోని మానం దిసేసుకున్న్యానే, అని బాదయిపోయింది.

ఒకదినం ‘రిబ్బన్లో, సాందు సీసాలో, పొగుడ్రు డబ్బాలో, మొలతాల్లో’ అని అమ్నుకుంటా జోలి దగిలించుకోని దాసర్లామె వూర్లో కొచ్చింది. మాయమ్మ నడిగితే సోకులెక్కు వయినాయని గ్యారంటీగా పొరక దిగేస్తాదని వామనగుంతలాట పీట తీస్కోని సంకలో బెట్టుకోని నీలావాళ్లింటికి పూడ్సినాను.

సాయంత్రం ఇంటికొస్తానే ‘కాళ్లూసేతులు కడుక్కోని దీపానికి పేండ ద్యాపో’ అనింది మాయమ్మ. నిమ్మకాయంత పేండ దీసుకొని ఎండిపొయ్యిందని నీళ్లుపోసి పిసుక్కోని గుండ్రంగా జేసుకోని ఎగరేసుకుంటా ఎగవింట్లోకొచ్చి దీగూట్లో పేండముద్ద పెడ్తావుండాను. దీపంబెట్టే చెక్కకు ఎనగ్గా బులుగు కలరు డబ్బీ నా కండ్లబడిరది. డబ్బీ సేతిలోకి తీసుకున్న్యాను. డబ్బీమింద నాలుక్కాళ్ల మింద నడుస్తావున్ని పాప బొమ్మువుండాది. పక్కనే బంతిపువ్వు మాదిరిగా మెత్తంగా వుండే పౌడర్‌ సెండుంటే సేతుల్లోకి తీసుకొని అపురూపంగా సెంపలకు తాకించిచుకున్న్యాను.

కుశాలతో కులకతా వుంటే దీపం బెట్టేదానికొచ్చిన మాయమ్మ ‘సుగురుగా వాడుకోండి అక్కా నువ్వు. మూడుదినాలకు దిగ్గొలిగేసి సున్నం గోడ మింద పడొద్దు’ అనింది. మాయమ్మగ్గూడా తెలిసి పోయిందే! మానం మాకులకు గట్టేసినట్లయిపోయింది నాకు.

*

Download PDF ePub MOBI

for regular updates like this page: https://www.facebook.com/KinigePatrika

Posted in 2014, ఆగస్టు, ఇర్లచెంగి కథలు, సీరియల్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.