cover

పదనిష్పాదన కళ (16)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

పదకొండో అధ్యాయం

లాక్షణిక విశేషణాల నిష్పాదనపద్ధతి

(అ) అచ్చతెలుగు విశేషణాలు – ఉపోద్ఘాతం

ఒక వస్తువూ, పదార్థం, వ్యక్తి, ప్రదేశం, భావం, విషయం గుఱించి విశేషించి (ప్రత్యేకంగా) వర్ణనపూర్వకంగా తెలిపే పదాలు విశేషణాలు. వీటినే ఆంగ్లంలో Adjectives అంటారు. ఇవి రెండు విధాలు. 1. సహజ విశేషణాలు. 2. లాక్షణిక విశేషణాలు. అవసరాన్ని బట్టి వ్యాకరణ సూత్రాల సాయంతో క్రొత్తగా కల్పించుకునేవి లాక్షణిక విశేషణాలు. తెలుగులో విశేషణాలకి లింగ, విభక్తి, వచనాలు ఉండవు. తెలుగులో ఒక విశేషణం ఏ పదాన్నైతే వర్ణిస్తుందో ఆ పదానికి తాను ముందు వస్తుంది. విశేషణ సహాయంతో వర్ణించబడే పదాన్ని విశేష్యం అంటారు. తెలుగులో విశేష్యాలకి మాత్రమే లింగ, విభక్తి, వచనాలు ఉంటాయి. విశేషణాలకి అవి ఉండవు. సాధారణంగా తెలుగులో విశేషణ-విశేష్యాల్ని సమాసంగానూ, విడిగా కూడా వాడతారు. ఒక పదం విశేషణంగా ప్రవర్తించేటప్పుడు, లేదా మారేటప్పుడు దాని మూలస్వరూపానికి కొన్ని మార్పులూ, చేర్పులూ జఱగడం కూడా ఉంది. ఇందుకోసం ఉపయోగపడే ఉపసర్గల్నీ, ప్రత్యయాల్నీ, పదాల్నీ విశేషకాలు అనవచ్చు.

I. విశేషణాల విషయంలో తెలుగు రచయితలు తఱచూ చేసే పొఱపాట్లు

ఒక్క విశేషణాల గుఱించే కాదు, తెలుగులో వ్రాసేవారిలో అత్యధిక సంఖ్యాకులకు తెలుగు భాషాభాగాల గుఱించిన అవగా హన తక్కువ. “ఏది నామవాచకం? ఏది భావార్థకం? ఏది సముచ్చయం? ఏది అవధారణార్థకం ? ఏది విశేషణం ?” అని అడిగితే ఎక్కువమంది తెల్లమొహం వేస్తారనడంలో సందేహం లేదు. కాస్తో కూస్తో తెలిసినవారెవఱైనా ఉంటే వారు మహా పండితులుగా మన్నన. అందుచేత వ్యావహారికం పేరుతో ఏ విధమైన తర్కబద్ధతా లేని భాష వ్యాప్తిలోకి తేబడుతోంది. ఆంగ్ల ప్రాధాన్యాన్ని మాత్రమే నొక్కివక్కాణించే విద్యావ్యవస్థలో మాతృభాష విషయంలో ఈ విధమైన నిర్లక్ష్యపు నీడలూ, అజ్ఞాన మేఘాలూ ఆవరించడం ఆశ్చర్యకరం కాదు. కానీ మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తున్న పురోగత దేశాల ప్రజలు తమ వాడుకల విషయంలో మనలా లేరని, చాలా నిర్దుష్టంగా, పట్టింపుగా ఉంటున్నారనీ గమనించాలి. కనుక తెలుగులో ఎలా వ్రాసినా ‘చల్తా హై’ అనే ఈ బౌద్ధిక జులాయితనం పోవాలి.

విశేషణాల విషయానికొస్తే, ఈ మధ్య మన రచయితలు ప్రతి నామవాచకానికీ ‘ఆత్మకం’ అని చేర్చి అది విశేషణం అనుకుం టున్నారు. అలా విద్యాత్మకం, సృజనాత్మకం, సకారాత్మకం, నకారాత్మకం, వర్ణనాత్మకం, వివరణాత్మకం లాంటి పదాల్ని సృష్టించారు. ఇది కొన్ని సందర్బాలకి ఫర్వాలేదు గానీ అన్ని రకాల పిడుగులకీ, బియ్యాలకీ పనికొచ్చే మంత్రం మటుకూ కాదు. ఈ పోకడ బహుశా హిందీకి అనుకరణ కావచ్చు. దీని మూలాన ఆంధ్రవిశేషణాలు ఆంగ్లవిశేషణాల కంటే పలకడానికి బహుకష్టంగా, బారుబారుగా తయారయ్యాయి. మళ్ళీ వీటికి భావార్థక ప్రత్యయాల్ని చేఱిస్తే ఇవి మఱింత పొడవూ, మఱింత కష్టమూ అవుతాయి. ఉదా :- ధ్వన్యాత్మకత్వం. దీనికి టూకీగా ‘ధ్వానిక’ అనొచ్చు. ఇలా ప్రతీదానికి ఒక ‘ఆత్మ’ని చేర్చడం ద్వారా మన రచయితలు ఒక అనువాద సౌలభ్యాన్నైతే వెతుక్కున్నారు కానీ వీటిని విన్నాక/ చదివాక వీటి మూలాంగ్లపదం ఏమిటై ఉంటుందని ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పదనిర్మాణాల్లో జాతీయత లోపించి ఇవి తొలి నాళ్ళలోని బైబిల్ అనువాదాల్లా కృతకంగా ధ్వనిస్తున్నాయి. ఒక్కొక్క ప్రత్యేక అర్థానికీ ఒక్కో విభిన్న ప్రత్యయపు, లేదా పద సంయోగపు సహాయంతో విశేషణాల్ని రూపొందించాల్సి ఉంటుంది.

అదే విధంగా, ‘గా’ (-ly/ as) వర్ణకానికీ, ‘లా’ (like) వర్ణకానికీ తేడా తెలీని పాత్రికేయులు ఉన్నారు మనకు! ఉదాహరణకి – ఇటీవల ఒక దినపత్రికలో లింగమార్పు కోసం శస్త్రచికిత్స చేయించుకొన్న వ్యక్తి గుఱించిన వార్తని నివేదిస్తూ పక్క పక్కనే రెండు ఛాయాచిత్రాలు ప్రచురించారు. ఒకటేమో, చేయించుకోక ముందటిది. ఇంకొకటేమో, చేయించుకున్న తరువాతిది. మొదటి ఛాయాచిత్రపు శీర్షిక “మగపిల్లాడిలా” అని వ్రాశారు. తెలుగులో ‘-లా’ వర్ణకం పోలిక (simile) ని సూచించ డానికి మాత్రమే ! యథార్థ వస్తుస్థితిని సూచించడానికి ‘-గా’ వర్ణకం వాడతారు. శస్త్ర చికిత్స చేయించుకోక ముందు ఆ వ్యక్తి యొక్క యథార్థస్థితి ‘మగపిల్లాడిలా’ కాదు. అక్కడ మగపిల్లాడితో పోల్చాల్సిందేమీ లేదు. ఎందుకంటే అతనప్పుడు సాక్షాత్తూ మగపిల్లాడే. కాబట్టి అప్పుడు అతనున్నది ‘మగపిల్లాడిగా’.

అలాగే, ఇక్కడ అసందర్భమైనప్పటికీ ఇంకో ముక్క చెప్పాలనిపిస్తోంది. తృతీయా విభక్తిప్రత్యయం (‘తో’) ఉపయోగించకుండా ‘సహా’ అనే అవ్యయాన్ని వాడ్డం కనిపిస్తోంది మన దినపత్రికల్లో! ఇది చాలా ఇటీవలి అపభ్రంశం. ‘ముఖ్యమంత్రి సహా, రైతులు సహా’ ఇలా ప్రయోగిస్తున్నారు. ఇది కనీసం వాడుకభాషైనా కాదు. ఎందుకంటే వాడుకభాషలో ‘సహా’ పదానికి ముందు ‘తో’ అని వాడకుండా ఎవ్వఱమూ మాట్లాడం ఇంగ్లీషులో కూడా along with అని వాడతారే తప్ప, ఈ అర్థంలో వట్టి along వాడ్డం ఎక్కడైనా చూశామా ? నిజానికి ఈ వాడుకకు మూలమైన సంస్కృతంలో కూడా తృతీయ తరువాతే ‘సహ’ అని ప్రయోగిస్తారు. ఉదాహరణకు, రామేణ సహ (రామునితో పాటు). ఇలా తృతీయని వదిలేసి సహ ప్రయోగం చేయడంలో వీరి ఉద్దేశాలు రెండు ఉండొచ్చు. ఒకటి – కనీసం ఒక్క అక్షరాన్నయినా వదిలించుకుందామనే పంక్తిబారు (column space) లోభం. రెండోది –‘సహ’ అనే మాటకు ‘తో’ అని అర్థమనీ, కాబట్టి వాక్యంలో ఒకే చోట రెండు ‘తో’ లు ఎందుకు? అనే భ్రమ ప్రమాదం. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ‘సహ’ కి అర్థం ‘తో’ అని కాదు. ‘కలిసి/కలిపి’ అని అర్థం. “నాతో సహా ముగ్గుఱు” అన్నప్పుడు “నాతో కలిపి ముగ్గుఱు” అని అర్థం. ఇక్కడ ‘సహ’ గానీ, ‘తో’ గానీ అనవసరమైన పదం కాదు. రెండూ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా చేయదల్చుకున్న వ్యక్తీకరణ వికలాంగమవుతుంది.

అదే విధంగా ‘మార్పు’నీ, ‘మార్పిడి’నీ ఒకే అర్థంలో వాడుతున్నారు. నిజానికి మొదటిదానికి Change అనీ, రెండోదానికి Exchange అనీ అర్థం. పరభాషా వ్యామోహంలో పూర్తిగా మునిగిపోయి, మన పుస్తకాలు చదవడం మానేసి, అలా మన భాషే మనకర్థం కాని దుర్దశలోకి మనం అడుగుపెట్టామని ఇలాంటివన్నీ సూచిస్తాయి.

II. వాడుకతెలుగులోని సహజ విశేషణాల స్వరూపం

౧. కొన్ని నామవాచకాలకి నేరుగా ‘ఐన’ అనే క్రియాజన్య విశేషణాన్ని చేర్చడం ద్వారా వాటిని విశేషణాలుగా మారుస్తారు.

ఉదా :- అందమైన ఇల్లు, నాణ్యమైన సరుకు, అచ్చమైన తెలుగుతనం, పొందికైన కూర్పు, లోతైన బావి, పొడవైన త్రాడు, తీరైన ముక్కు, ఎత్తైన గుట్ట, తేలికైన పని, బరువైన మోపు, వరసైన సంబంధం, మనసైన మొగుడు.

అంటే, ఇక్కడ గ్రహించాల్సింది – అచ్చతెలుగు నామధాతువులకి విశేషణరూపాలు దొఱక్కపోతే నామవాచక రూపాన్నే విశేషణంలా వాడుకునే సౌలభ్యం తెలుగులో ఉందని!

౨. కొన్ని నామవాచకాలకి ఏ మార్పూ చేయకుండా నేరుగా విశేషణాల్లా ప్రయోగిస్తారు. కానీ ఆంధ్ర వ్యాకరణ సంప్రదాయా నుసారం ఇవి విశేష్య-విశేషణ మిశ్రమాలు కావు. వీటిని, రెండు నామవాచకాలతో ఏర్పఱచిన సమాసాలుగానే పరిగణిస్తారు.

ఉదా :- చెప్పుడుమాటలు, పెట్టుడు ముహూర్తం, తిరుగుడురకం, జారుడుబల్ల, కంపునెయ్యి, వంకరబుద్ధి, సంకరజాతి, అడ్డుగోడ.

౩. కొన్ని మువర్ణకాంత నామవాచకాలకి పుంప్వాదేశం చేసి వాటిని విశేషణాలుగా మారుస్తారు.

ఉదా :- పల్లపు చోటు, అబద్ధపు సాక్ష్యం, అనవసరపు ఖర్చు, అడ్డదిడ్డపు నడవడి, మూర్ఖపు వాదన, , పెడసరపు ధోరణి.

౪. కొన్ని మువర్ణకాంత పదాలు సహజంగానే విశేషణాలైనప్పటికీ, వాటిక్కూడా పుంప్వాదేశం చేస్తారు.

ఉదా : – దూరపు కొండలు, సరసపుటలుక, విరసపు మాట, నిట్రపు గుట్ట.

౫. కొన్ని పదాలు స్వతహాగా విశేషణాలే అయినప్పటికీ వాటికి “ఐన” అని చేర్చి ప్రయోగిస్తారు.

ఉదా :- దట్టమైన అడవి, సుతారమైన తాకు, సున్నితమైన మనస్తత్త్వం, మృదువైన చర్మం, బలహీనమైన శరీరం.

౬. మఱికొన్నిపదాలు సహజంగానే విశేషణాలైనప్పటికీ, వాటికిటి, నిమొదలైన ప్రత్యయాల్ని చేర్చి గానీ,

చేర్చకుండా గానీ ప్రయోగిస్తారు.

ఉదా :- కమ్మతావి = కమ్మని తావి

చల్లగాలి = చల్లని / చల్లటిగాలి

తెల్లకలువ = తెల్లని/ తెల్లటి కలువ

ఇలాగే, తీయని పండు, గోరువెచ్చని నీళ్ళు, చక్కని చుక్క, నున్నని గచ్చు, సన్నని పొఱ, తిన్నని త్రోవ.

౭. కొన్ని విశేషణాల్ని మార్పూ చేయకుండానే ప్రయోగిస్తారు.

ఉదా :- గడుసుపిల్ల, బిరుసుజుట్టు, బిగుతుబట్టలు, పెళుసుకఱ్ఱ, చేదుసొఱ, మంచి మిత్రుడు, చెడుసావాసాలు, హెచ్చుశాతం, వేఱుకాపరం, దగ్గఱదారి, మోటుమనిషి, పెద్దచెఱువు, చిన్న ఊరు, నల్లావాలు, తెల్లవంకాయ, ఎఱ్ఱ ఉల్లి, జడివాన, తడివొళ్ళు, మడిబట్ట, పెనుతుఫాను, పినతల్లి, ఆడపులి, మగసింహం, మేటి నేత, సూటిప్రశ్న.

. కొన్ని రెండక్షరాల విశేషణాలకి “పాటి” అనే ప్రత్యయం చేఱుస్తారు. ఇది కొన్ని ఆంగ్ల విశేషణాలకి చివఱ వచ్చే –ish లాంటి వాడుక. ఇది విశేషణపు టర్థంలోని తీవ్రతనీ, అతిశయాన్నీ కాస్త తగ్గించి చూపుతుంది.

ఉదా :- కొద్దిపాటి, చిన్నపాటి, సన్నపాటి, లావుపాటి, మందపాటి, ఒకపాటి.

౯. కొన్ని క్రియాధాతువుల తద్ధర్మార్ధక రూపాల్ని విశేషణాలుగా ప్రయోగిస్తారు. మళ్ళీ వీటిల్లో కొన్నింటిని స్వతంత్రంగా నామ వాచకాలుగా కూడా వాడే సౌలభ్యం ఉంది.

ఉదా :- కులుకుప్రాయం, వణుకువయసు, ఉడుకునీళ్ళు, తెల్లవారుజాము, పండువెన్నెల, మండుటెండ, ఎండుమిఱప, తిట్టుకవిత్వం, కట్టుకథ, పట్టుకాఱు, మిగులు నిధులు, వాలు వసార, పేరునెయ్యి, పుచ్చువంకాయ, చచ్చుఘటం, పోరుబాట, బ్రతుకుతెఱువు, త్రాగునీరు, మారుతల్లి, అంటుకత్తెర, మాడన్నం, కుళ్ళువాసన, ముఱుగుకాలువ.

అంటే, ఇక్కడ గ్రహించాల్సింది– అచ్చతెలుగు క్రియాధాతువుల తద్ధర్మార్థకాల్ని నేరుగా విశేషణాలుగా కూడా ప్రయోగించ వచ్చునని!

౧౦. స్వభావార్థంలో కొన్ని పదాలకి మారి, కోరు, దారి లాంటి ప్రత్యయాలు చేఱుస్తారు. ఇలా నిష్పన్నమైన పదాలు సాధార ణంగా నిందార్థకాలై ఉంటాయి.

ఉదా :- తంపులమారి, జగడాలమారి, కజ్జాకోరు, ముఠాకోరు, కోపదారి, మాయదారి.

౧. నామవాచకాలకు ధాతుజన్య భావార్థకాల్ని చేర్చడం ద్వారా కొన్ని విశేషణాలు నిష్పన్నమయ్యాయి.

ఉదా :- ఏడుపుగొట్టు (ఏడుపు + కొట్టు) = ఏడుపుచేత కొట్టబడ్డవాడు

లంచగొండి (లంచమును కొనుడు -> కొనిడి -> కొండి)

దూబఱదిండి (దూబఱ తినుడు -> తిన్డు -> తిండి)

నెలదాల్పు (నెలను తాల్చువాడు = శివుడు)

. మొదట్లో వాటివాటి గుణాల్ని బట్టి పూర్వులు విశేషణాలుగా వాడినవి కాస్తా కాలక్రమేణ వాడుకలో నామవాచకాలు గా పరిణామం చెందినట్లు అనిపిస్తుంది. క్రమంలో, యుకారాంత క్రియాధాతువులకు “సు/ ఉసు” అనే ప్రత్యయం చేఱింది. అలాగే, చేయబడేదిఅనే అర్థంలో సకర్మక ధాతువులకుఅనే ప్రత్యయం చేఱడం గోచరిస్తుంది.

ఉదాహరణకు,

కోయు -> కోసు (sharp)

పులియు -> పులుసు, పుల్ల

తెలియు -> తెలుసు, తెల్ల

వెలియు -> వెల్ల

పొలియు -> పొలుసు (scale)

నలియు -> నలుసు, నల్ల

అలియు -> అలుసు (అలసట = బలహీనత)

పెళియు (ఊహితం, ప్రయోగం లేదు) -> పెళుసు, పెళ్ళ

చెక్కు -> చెక్క (చెక్కబడేది)

కోయు -> కొయ్య

ఎఱియు (బాధపడు) -> ఎఱియ -> ఎఱ్ఱ

(భౌతికంగా బాధపడినప్పుడు శరీరభాగాలు సంతరించుకునే స్థితి)

వ్రయ్యు -> వ్రయ్య

కట్టు -> కట్ట (bundle)

చుట్టు -> చుట్ట (spring/ coil/ spiral)

పట్టు -> పట్ట

మెట్టు (కాలెత్తి అడుగుమోపు) -> మెట్ట

చాపు (విస్తరించు, పఱచు) -> చాప

చేపు (తడియు) -> చేప

మీటు -> మీట (Switch/ key)

ఎండు -> ఎండ

చేదు (నీళ్ళు తోడు) -> చేద (నీళ్ళు తోడే చిన్న తాటాకుల బొక్కెన)

పేలు -> పేల (పేలాలు)

౩. కొన్ని మువర్ణకాంత పదాల షష్ఠీరూపాల నుంచి కూడా కొన్ని విశేషణాలు నిష్పన్నమై అనంతర కాలంలో నామవాచకాలుగా స్థిరపడ్డాయి. షష్ఠీరూపమంటే “యొక్క, చెందిన” అని అర్థమిచ్చే రూపం. ఉదా :-

కొమ్ము -> కొంప

(= కొమ్ము గలిగినది ; దక్షిణాది దేవాలయాలకు మల్లే ఒకప్పుడు తెలుగువారి ఇళ్ళ పైభాగాన కూడా కొమ్ముల్లాంటి అలంకారాలు ఉండి ఉండవచ్చు)

ఱొమ్ము -> ఱొంప

దుమ్ము (మట్టి) -> దుంప

తుమ్ము -> తుంపురు -> తుంపర

చెమ్ము (ఎఱుపు) (ఊహితం, ప్రయోగం లేదు) -> చెంప (ఎఱ్ఱబడేది)

కమ్ము (వంకరపుల్ల) -> కంప -> గంప

పాము (బొడ్డుత్రాడు) -> పాప

వేము -> వేప

. కొన్నిసార్లు పదాల యొక్క ఔపవిభక్తిక రూపాల్ని ముందు విశేషణాలుగా వాడి తరువాత వాటినే నామవాచకాలుగా ఖాయం చేయడం జఱిగింది. ఉదాహరణకి :-

చీకు (గ్రుడ్డి) -> చీకటి

కుమ్ము (పొగ) -> కుంపటి

మూయి (ప్రయోగం లేదు) -> మూతి

తుండు (మొలకు చుట్టుకునే గుడ్డ) -> తుంటి

బూయి (మర్మాంగం) -> బూతి (బహువచనంలో – బూతులు)

కయ్యాలు (కొట్లాటలు) -> కయ్యాల -> గయ్యాళి (ఈ క్రమంలో – కయ్యాల కంప à గయ్యాళిగంప)

కలువకుఱ్ఱు -> కలువకుర్తి

అనపఱ్ఱు -> అనపర్తి

తుంగతుఱ్ఱు -> తుంగతుర్తి

వివరణ :- ఔపవిభక్తికాలంటే -చే,- తో, -వలన,- లో మొదలైన విభక్తిప్రత్యయాలు చేఱడానికి ముందు పదస్వరూపాన్ని మార్చే ప్రత్యయాలు. ఉదాహరణకి-

example

౧౫. క్రియాధాతువుల నామవాచకాల నుంచి కొన్నిపదాలు ముందు విశేషణాలుగా నిష్పన్నమై తరువాత

స్వతంత్ర నామవాచకాలయ్యాయి. తొలిచూపులో వీటి వ్యుత్పత్తి (etymology) కాస్త దూరాన్వయంగా భాసిస్తుంది. ఉదా :-

తేలు -> తేల్చు -> తేల్పు -> తేల్ప -> తెప్ప (raft)

మొలచు -> మొల్పు -> మొల్ప -> మొప్ప (finn)

చీలు -> చీల్చు -> చీల్పు -> చీల్ప -> చిప్ప (hemisphere)

కూలు -> కూల్చు -> కూల్పు -> కూల్ప -> కుప్ప (rubble)

౬. ‘వంటి’ అనే అర్థంలో నామవాచకాలకు ’అంటి’ అనే పదాన్ని చేర్చి విశేషణంగా మారుస్తారు. ఈ ’అంటి’ అనే విశేషకం ’వంటి’ కి రూపాంతరమే. ఉదా :-

పూవు + అంటి = పూవంటి (పూవును పోలిన)

III. విశేషణాల్ని గుర్తుపట్టడం

తెలుగులో నామవాచకాల్నీ, విశేషణాల్నీ విజ్జోడుగా (ఇది అదిగా, అది ఇదిగా) ప్రయోగించడం కద్దు. ఉదాహరణకి – అందం, మంచి మొదలైనవి. కనుక, ఒక తెలుగుపదం పరిపూర్ణ విశేషణమా ? కాదా ? అనేది తెలుసుకోవాలంటే దానికి తనం (-ness), త్వం లాంటి భావార్థక ప్రత్యయాల్ని చేర్చి చూడాలి.

అలాగే, ఒక పదాన్ని విశేషణంగా ప్రయోగించవచ్చునా? కూడదా? అనేది తెలుసుకోవాలంటే – ఆ పదానికి గా’ (ఆంగ్లం లో దీని సమానార్థకం –ly) అనే ప్రత్యయాన్ని చేర్చి అలా దాన్ని అవ్యయం (adverb) గా మార్చి చూడాలి. ఆ ప్రయోగం మన ఉద్దిష్టభావాన్ని వ్యక్తీకరించగలిగితే అది విశేషణంగా పనికొచ్చేదే. లేకపోతే అది కేవలం నామవాచకంగానే ఉపయోగ పడుతుందని అర్థం. అయితే అంతమాత్రాన అది యథార్థంగా విశేషణమని కాదు. ఉదాహరణకి ఈ క్రింది వాక్యాల్లో ‘నిజాయితీ’ ఇత్యాదులన్నీ భావార్థకాలే కానీ వాటిల్లో కొన్ని మాత్రం సందర్భానుసారం విశేషణాల్లా పనిచేస్తాయి.

నిజాయితీగా అంతా చెప్పేశాడు (నప్పింది)

సత్యంగా మాట్లాడాడు (నప్పలేదు)

ఆవేశంగా వెళ్ళిపోయాడు (నప్పింది)

భావోద్వేగంగా వెళ్ళిపోయాడు (నప్పలేదు)

వినయంగా నమస్కరించాడు   (నప్పింది)

విధేయతగా నమస్కరించాడు (నప్పలేదు)

బిడియంగా లోపలికొచ్చాడు   (నప్పింది)

మొహమాటంగా లోపలికొచ్చాడు (నప్పలేదు)

గమనిక :- కొన్ని నామవాచకాలకు “మయం/ భూయిష్ఠం/ పూరితం/ ప్రాయం” అనే అర్థంలో విశేషణాలకు మల్లే ‘గా’ వర్ణకాన్ని చేఱుస్తారు. ఉదాహరణకి-

వాతావరణం గాలిగా ఉంది. (వాయుపూరితం)

ఈరోజు ఎండగా ఉంది. (ఆతపమయం)

పెఱుగు మఱీ నీళ్ళగా ఉంది. (జలప్రాయం)

ఇలా వాడేటప్పుడు కొన్నిసార్లు ఈ నామవాచకాల్ని ఆమ్రేడితం (పునరావృత్తం) చేయడం కూడా కద్దు.

ఉదాహరణకి-

వాతావరణం గాలిగాలిగా ఉంది.

ఈరోజు ఎండెండగా ఉంది.

పెఱుగు నీళ్ళనీళ్ళగా ఉంది.

అన్నం గంజిగంజిగా ఉంది.

నేల బంకబంకగా ఉంది.

ఈ కలం సిరా జిగురుజిగురుగా ఉంది.

IV. విశేషణాలూ, తజ్జనిత అవ్యయాల అనువాద పద్ధతి

అవ్యయాలంటే లింగ, వచన, విభక్తులు లేకుండా ఉంటూ, అదే సమయంలో తమ పూర్తి అర్థం కోసం ఇతర పదాల చేఱికను అపేక్షించని పదాలు.

ఉదా :- హోరాహోరీ, చటుక్కున, ధడేలున, తఱచూ, రమారమి, అచ్చం, మతానుసారం మొ||

‘ఇంద, పద, దా, సై, ఊ (ఓ)’ లాంటి అధాతుకాలైన క్రియారూపాలు కూడా అవ్యయాల్లోకే వస్తాయి. వీటిల్లో ’ఊ (ఓ)’ ని కొన్ని కోస్తాజిల్లాల్లో ఉపసర్గలా ప్రయోగిస్తారు.

ఉదా :- ఊ (ఓ) తిట్టేశాడు = అతిగా తిట్టేశాడు.

ఆంగ్లంలోంచి తెలుగులోకి విశేషణాల్ని అనువదించేటప్పుడు మక్కికి మక్కి చేయడం పనికిరాదు. ఆంగ్లంలో ఏకైక పదాలతో వ్యక్తీకరించే భావాల్ని తెలుగులో కొన్ని సార్లు పదబంధాల (phrases) తో గానీ, క్రియానిర్మాణాలతో గానీ వెలిబుచ్చుతారు. లేదా ఆంగ్ల పదబంధాలకి దీటుగా తెలుగులో ఏకైక పదాల్నే వాడాల్సిరావచ్చు. ఇది చాలా వఱకూ సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. దానర్థం, తెలుగులో పదాలు లేవని కాదు. ఏది ఎక్కడ ఎలా ప్రయోగించాలో అనువాదకుడు తన యావద్ భాషాపాండిత్యాన్నీ ఉపయోగించి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఆంగ్లాన్ని మక్కికి మక్కి అనువదించలేకపోతు న్నామనే దుగ్ధతో, “తెలుగులో పదాలు లే”వంటూ మాతృ భాష మీద నెపం వేయ సమకట్టడం సరికాదు. ఆంగ్లంలో విశేషణాలుగా ఉన్నవాటిని తెలుగులో కూడా విశేషణాలుగానే అనువదించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. కొన్నింటిని నామవాచకాలుగానో, జాతీయాలుగానో అనువదించాల్సి వస్తుంది. ఉదాహరణకు, Callow – (adj) Young and inexperienced. దీనికి తెలుగులో ‘పిల్లకాకి’ అంటే సరిపోతుంది.

మఱో ఉదాహరణ :- He works hard అనే వాక్యాన్ని తీసుకోండి. ఇందులో hard అనే వైశేషణిక అవ్యయాన్ని ఇద్దఱు అనువాదకులు తలో రకంగానూ అనువదించారనుకుందాం.

మొదటి అనువాదకుడు - అతను కష్టంగా పనిచేస్తాడు. (తప్పు)

రెండో అనువాదకుడు - అతను కష్టపడి పనిచేస్తాడు (లేక) కష్టించి పనిచేస్తాడు. (ఒప్పు)

అలాగే, He took shelter in God అనే వాక్యం.

మొదటి అనువాదకుడు – అతడు భగవంతునియందు ఆశ్రయం తీసుకున్నాడు / పొందాడు. (తప్పు)

రెండో అనువాదకుడు – అతడు భగవంతుడికి శరణాగతుడయ్యాడు. (ఒప్పు)

ఇక్కడ ‘శరణాగతు’డనే విశేషణం సమయానికి స్ఫురించడం అవసరం.

కొన్నిటికి మాత్రం అచ్చుమచ్చుగా అతికే సమానార్థకాలు లభిస్తాయి.

ఉదా :- Business is dull.

= వ్యాపారం మందకొడిగా సాగుతోంది. (విశేషణాన్ని అవ్యయంగా మార్చి ప్రయోగించాం)

అభ్యాసకార్యములు

I. ఈ క్రింది పదాల్లో నిజమైన విశేషణాల్ని గుర్తుపట్టండి :

1. ప్రసన్నం 2. భక్తి 3. అంకితం 4. దీనం 5. సామరస్యం 6. నిష్కామం 7. నిర్మలం 8. అకారణం 9.

ప్రేమ 10. సమైక్యం 11. శ్రద్ధ 12. స్నేహం 13. హాస్యాస్పదం 14. ఖచ్చితం 15. మందం 16. సిగ్గు 17. నేలమట్టం 18. అసహ్యం 19. ఎగుడుదిగుడు 20. బిగ్గ.

II. ఈ క్రింది నామవాచకాల్ని సమాస-పదబంధ -వాక్యాది రూపాల్లో విశేషణాలుగా ప్రయోగించండి :

1. వాటం 2. ఒడుపు 3. నెమ్మది 4. పట్టు 5. అందుబాటు 6. ముద్దు 7. పేరు 8. వెడల్పు 9. నమ్మకం 10. అలవాటు 11. తెలివి 12. దట్టం 13. మౌనం 14. సంప్రదాయం 15. కష్టం 16. భారం 17. హాయి 18. విచిత్రం 19. బలం 20.

III. ఈ క్రింది పదాల్ని అవ్యయాలుగా మార్చి ప్రయోగించండి :       

1. నిర్లక్ష్యం 2. మనశ్శాంతి 3. విమర్శ 4. భయం 5. అద్భుతం 6. విశ్రాంతి 7. బద్ధకం 8. సరదా 9. బాధ 10. త్వర 11. ధైర్యం 12. చాదస్తం 13. పద్ధతి 14. ఆరాధన 15. విసుగు 16. లాలన 17. మెచ్చుకోలు 18. తృప్తి 19. హడావుడి 20. నిర్ధారణ.

IV. ఈ క్రింది విశేషణాల్ని అవ్యయాలుగా మార్చి ప్రయోగించండి :

1. ముక్కుసూటి 2. బుద్ధితక్కువ 3. గాఢం 4. నిశ్శబ్దం 5. శుభ్రం 6. లౌకికం 7. ఛాందసం 8. అన్యోన్యం 9. స్పష్టం 10. సహేతుకం 11. తార్కికం 12. పవిత్రం 13. కంగారు 14. కర్ణపేయం 15. మందకొడి 16. సరసం 17. చాటు 18. దీటు 19. గట్టి.

 (తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, ఆగస్టు, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.