cover

అమ్మ సంతకం

.
మరచిపోయిన అమ్మ మళ్ళా మతిల కొచ్చింది
మరణించిన అమ్మ ఆనాటి సంతకంలోంచి పుట్టుకొచ్చింది
వణుకుతున్న చేతివేళ్ళ మధ్య
పెన్నును బిడ్డలా పొదవుకొని
బతుకు మీది తీపినంతా
తన పేరులో రంగరించి
నా డైరీలో ప్రతిష్టించింది సంతకంలా –
ఎవరూ వూహించి వుండరు
ఏ అవసరాల మేరకో
అమ్మ సంతకం చేసింది
సమాధుల చాటున అమ్మను పోల్చుకోలేక పోయిన
తన పాత సూట్కేస్ లోనే దృశ్యమానం కాలేకపోయింది
తిథి పెట్టినప్పుడల్లా
ఏ పదార్థం పైన వాలలేక పోయింది
.
దినాలు, దినచర్యలు
కాలం తోక పట్టుకుని వెళ్ళిపోయినా
డైరీ పేజీలు తిప్పుతూ
ముదనష్టపు మరపులోకి వెళ్ళిపోతున్నా
ఒక్కసారిగా ఆకాశమంత కళ్ళలో కొచ్చి
మెరిసినట్టుగా
అమ్మ సంతకం దర్శించా
ఈ అపురూప క్షణాన –
ఎట్లా వున్నావమ్మా అని అడగాలనిపించింది
చేతులందించాలనిపించింది ఎత్తుకొమ్మని
యోగక్షేమాలు అడిగినట్లనిపించి,
నా గురించి, నా భార్యాపిల్లల గురించి ఏకరువు పెట్టాలనిపించింది
.
గుర్తున్నానా
అని తల పంకించింది కాబోలు
మాయదారి లోకం గదా
పేగుతో పుట్టిన నిమిషం వరకే
పేగు తెంపిన క్షణం తర్వాత
ఎవరికీ ఎవరు కానితనమే చొరబడ్తది
ఋణాల మాట దేముంది
అన్ని ఋణాలకు వడ్డీ కడుతున్నా
మెడ మీద కత్తి పడేనాడైనా తేర్పవలసిందే గదా
అమ్మా, నీ ఋణం గురించి
ఎన్నడైనా ఆలోచించానా
నువ్వే నాకింకొక గోరుముద్ద బాకీ వున్నట్టు
అనిపిస్తూ వుంటుంది
నాన్న పాత్రను, నీ పాత్రను పోషించీ, పోషించీ
అలసిపోయావనుకుంటా
ఏ పూట ఏం మాట్లాడాలో
తెలియని అపసవ్యపుగాళ్ళం
శారీరక నొప్పులకే జడిసిపోతం
బతుకునొప్పి గురించి నువ్వెంత చెప్పినా
అర్థం కాలేదప్పుడు –
అనుభవం కావాలంటే అమ్మే కావాలి
ఓ అమ్మా
ఆ స్వర్గంలో అతిథి మర్యాదలతో
హాయిగా వుండు
నేను నీ ఆరని సంతకం చివర్న ప్రణమిల్లి… సుఖంగానే –

– దాసరాజు రామారావు
96182 24503

Download PDF ePub MOBI

for regular updates like this page: https://www.facebook.com/KinigePatrika

Posted in 2014, ఆగస్టు, కవిత and tagged , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.