cover

పదిహేనేళ్ళ ప్రాయంలో ఒకడు

Download PDF ePub MOBI

ఇది ఎస్. రామకృష్ణన్ అరవ కథకు తెలుగు అనువాదం. రచయిత పరిచయం ఇక్కడ.

పదిహేనేళ్ళ ప్రాయంలో ఒకడు

ఎస్. రామకృష్ణన్

నేను చెప్పబోయేది మీ కథే. అయితే నాకు తెలిసినవాడు ఆనందరావు కాబట్టి వాడి ద్వారా మీ కథని చెబుదామనుకుంటున్నాను. ఆనందరావుకి పదిహేనేళ్ళప్పుడు జరిగిన సంఘటన మీకూ జరిగుండచ్చు. మీరు కూడా వాడిలాగే ఈ సంఘటనకి సంబంధించిన జ్ఞాపకాలను దాచిపెట్టేసుంటారు. లేదా ఆ సంఘటనకి సంబంధించిన రహస్యమైన ఆశలనూ, అవమానాలనూ ఇక గుర్తుతెచ్చుకోకూడదు అని నిర్ణయించుకునుండచ్చు. మీకూ ఆనందరావుకీ ఉన్న బంధం విచిత్రమైనది. వాడు మీలో కొందర్ని చూసి భయపడ్డాడు. అలాగే మీలో కొందరు ఆనందరావుని భయపెట్టారు. ఆనందరావు జీవితంలో ఇలా అవమానపడటమేమీ తొలిసారి కాకపోయినా, వర్షం వెలిసాక ఆకుల నుండి రాలే చుక్కల్లా ఆ సంఘటన వాడి మనసుని అప్పుడప్పుడు ఆక్రమించుకుంటుంది. వాడు ఉక్కిరిబిక్కిరౌతుంటాడు. నేటి వరకూ ఆనందరావుని ఇబ్బందిపెడుతున్న ఆ వికృతమైన సమస్య ఒక పుస్తకం వల్ల మొదలవ్వడమే దీన్ని కథ అని చెప్పడానికి కారణం.

పదిహేనేళ్ళ ప్రాయపు ఉదయం

ఆనందరావు దగ్గర ఐదు రూపాయలున్నాయి. దాన్ని ఆ ఉదయమే ఇంటినుండి దొంగిలించాడు. దేవుడి ఫోటో కింద ఎవరో మడిచి పెట్టినట్టున్నారు. పసుపు, కుంకుమ అంటుకునుంది. విబూది ఖాళీ అయిపోయిందని గిన్నె తీసి చూసినప్పుడు మడిచిపెట్టిననోటు కంటబడింది. ఆ ఐదురూపాయిల కాగితాన్ని చూసిన మరుక్షణం వాడి మనసులో ఎలాగైనా ఆ పుస్తకాన్ని కొనుక్కోవాలి అన్న తలపు కలిగింది. టక్కున ఆ డబ్బుని తీసి లెక్కల నోటుబుక్కు అట్ట తీసి దాని లోపల దాచేసుకున్నాడు. రోజూకంటే ఆరోజు తొందరగా బడికి బయల్దేరాడు. దార్లో నడుస్తుండగానే వాడి మనసు ఏవేవో ఊహించుకుంటూ ఉంది. తనలో తానే నవ్వుకుంటూ రోజూ నడిచే దార్లో గాక రెడ్డిమిల్లుకి వెళ్ళేదార్లో నడిచాడు.

రెడ్డిమిల్లు రోడ్డులో పెద్ద సంత మైదానం ఉంది. దానికి ఆనుకుని ఒక పాత ఇనపసామాన్లంగడి, వినాయకుడిగుడి ఉన్నాయి. ప్రతి శనివారం అక్కడ సంత జరుగుతుంది. మిగిలిన రోజుల్లో పళ్ళ రసాలమ్మేవాళ్ళు, గోలీ సోడాలు అమ్మేవాళ్ళు కనిపిస్తారు అప్పుడప్పుడు అక్కడ గారడీలు చేసేవాళ్ళు ప్రదర్శనలిస్తుండటం కూడా చూశాడు. మైదానానికి దక్షిణంగా ఉన్న ఐస్ ఫ్యాక్టరీకి, గాజులంగడికీ మధ్య ఉంది సీనుగాడి కొట్టు.

అయితే ఆ కొట్టులో ఉన్న పెద్ద మనిషికి ఒళ్ళంతా తెల్ల బొల్లి ఉంటుంది. అతని జుట్టుకూడా బంగారు రంగులో ఉంటుంది. వయసులో పెద్ద వాడే అయినా అందరూ అతన్ని సీనుగాడు అనే అంటారు. బడిపిల్లలలు కామిక్స్ పుస్తకాలు కొనడం, సంతకొచ్చే ఆడవాళ్ళు సినిమా పాటల పుస్తకాలు, మాసపత్రికలు, నవలలు కొనడం ఈ సీనుగాడంగట్లోనే. ఆనందరావు కూడా ఈ సీనుగాడి కొట్లో ఎన్నో కామిక్స్ పుస్తకాలు కొనుక్కున్నాడు. సీనుగాడు కూర్చున్న బల్ల కింద ఉన్న పెట్టెలో చాలా పసుపుపత్రికలూ, నగ్న చిత్రాలున్న పుస్తకాలూ ఉన్నాయని వరప్రసాదు చెప్పాడు.

ఒక రోజు మయూరావిలాస్ లో పని చేసే వంటమాస్టరు సీనుగాడంగట్లో ఆ పుస్తకాలు తిరగేసి చూసి కొనుక్కుంటుండగా వీళ్ళు భయపడుతూ అటూఇటూ తిరుగుతున్నట్టు నటిస్తూ అక్కడే తచ్చాడుతూ చూశారు. ఆనందరావుకి అప్పుడు వరప్రసాదు మాటల మీద నమ్మకం కలిగింది. వంటమాస్టరు మూడు పుస్తకాలనూ ఒక్కోబొమ్మా తిరగేసి చూసి లావుపాటి స్తనాల అమ్మాయి బొమ్మున్న పుస్తకాన్ని ఎంచుకుని సీనుగాణ్ణి వెల అడిగాడు. ఐదు రూపాయలని చెప్పగానే మారుమాట్లాడకుండ డబ్బులిచ్చి లుంగీ పైకెత్తి చడ్డీ జేబులో దోపుకుని సైకిలెక్కి వెళ్ళిపోయాడు.

వంటమాస్టరు ఈ పుస్తకాలను ఎక్కడ దాస్తాడో తనకి తెలుసుననీ, సాయంత్రం తీసుకెళ్ళి చూపిస్తాననీ వరప్రసాదు చెప్పాడు. ఆనందరావుకి నమ్మకం కలగలేదు. ఆ రోజు సాయంత్రం వాళ్ళిద్దరూ కానుగుచెట్ల కటవ దాటుకుని అవతలికెళ్ళారు. అక్కడున్న చింత చెట్టు తొర్రలో దాయబడిన ఆ పుస్తకాన్ని వరప్రసాదు తీసి చూపించాడు.

వాళ్ళిద్దరూ కొడిదెలోళ్ళ బావిదగ్గరున్న బండమీద కూర్చుని ఆ పుస్తకంలోని బొమ్మలు తిరగేశారు. ఆనందరావు పెదవులు కొరుక్కుంటూ నగ్నంగా ఉన్న అమ్మాయిదేహాన్ని చూస్తూ ఉండగా ఎవరో దూరంగా సైకిలు ఆపి బావిలో స్నానం చెయ్యడానికి వస్తుండటం చూశాడు. వరప్రసాదు గబగబా ఆ పుస్తకాన్ని దాచిపెట్టేశాడు. ఏవీ జరగనట్టు కానుగకాయలు ఏరుకుంటున్నట్టు నటించారు.

అక్కడికొచ్చిన ఆ వ్యక్తి వీళ్ళిక్కడ ఎందుకు తిరుగుతున్నారో అని ఆరాగా చూస్తూ జేబులోనుండి ఒక పొట్లం తీసి అరచేతిలో పోసుకుని నలుపుతున్నాడు. ఆనందరావు ఆ మనిషినే చూస్తున్నాడు. ఆ మనిషి ఒక సిగరెట్ విరిచి నలిపిన ఆకుల్తో కలిపి మళ్ళీ నలిపాడు. వరప్రసాదు కళ్ళు చింత చెట్టు తొర్రమీదే ఉన్నాయి. ఆ మనిషి ఆ మిశ్రమాన్ని ఒక కాగిత గొట్టంలో నింపి నోట్లో పెట్టుకుని ముట్టించుకున్నాడు. రెండు దమ్ములు లాగ్గానే పూనకం వచ్చినవాడిలా ఒక రాయి తీసుకుని ‘ఇక్కడేంట్రా పనిమీకు? వెళ్ళండి’ అని వాళ్ళకేసి విసిరాడు. వరప్రసాదు, ఆనందరావు అక్కణ్ణుండి పరుగు తీశారు. అసంతృప్తితో ఇంటిముఖం పట్టారు.

మరుసటి రోజు ఉదయం మళ్ళీ అక్కడికెళ్ళి చింతచెట్టు తొర్రలో చూస్తే అక్కడ ఆ పుస్తకంలేదు. నిరాశ మిగిలింది. “ఐదు రూపాయలుంటే అలాంటి బొమ్మలున్న ఒక పుస్తకంకొనుక్కోవచ్చు” అని ఆ రోజునుండి చెప్తూనే ఉన్నాడు వరప్రసాదు. వాడన్నట్టు ఈ రోజు ఆనందరావు చేతికి ఐదురూపాయలు దొరికింది.

సీనుగాడు కొట్టు తెరిచి పటానికి అగరువత్తులు చూపిస్తున్నాడు. కొట్టుముందర చిరిగిన కాగితాలు, కవర్లూ గాలికి ఎగురుతున్నాయి. వరప్రసాదుని తీసుకుని వద్దామా అన్న ప్రశ్న కలిగింది ఆనందరావుకి. తెగించి కొట్టు దగ్గరకెళ్ళి కామిక్స్ పుస్తకాలు వెతికేవాడిలా తిరగేశాడు ఆనందరావు. సీనుగాడు వీడ్ని ఎగాదిగా చూసి బకెట్టు చేతబట్టుకుని నీళ్ళు పట్టుకురావడానికి ఎదరనున్న బోర్-పంపు దగ్గరకెళ్ళాడు. ఆనందరావుకి నోట్లో ఎంగిలి లేనట్టు తోచింది. సీనుగాడి దగ్గర ఆ పుస్తకం ఎలా అడగాలో తెలీడంలేదు.

సీనుగాడు బకెట్టు నింపుకుతెచ్చి అక్కడ పెట్టి లోపలికొచ్చి “ఏం పుస్తకాలు కావాల్రా?” అని చిరాగ్గా అడిగాడు. ఆనందరావు లెక్కల నోటుబుక్కులో దాచుకున్న ఐదురూపాయిలనోటు తీసి సీనుగాడికిచ్చి మాట్లాడకుండ నిలుచున్నాడు. సీనుగాడు ఐదురూపాయిల నోటు మడత విప్పగా అందులోనుండి కుంకుమపొడి రాలింది.

సీనుగాడు చేత్తో నోటుని తుడుస్తూ “బొమ్మలున్నవి కావాలా? బొమ్మలు లేనివి కావాలా?” అనడిగాడు. ఆనందరావు “బొమ్మలున్నవి” అనగానే బళ్ళకిందనున్న పెట్టెలోచెయ్యి పెట్టి ఒక పుస్తకం తీసి ఇచ్చాడు. ఏం పుస్తకం ఇచ్చాడని కూడా చూడకుండ ఎవరైనా తనని చూస్తారేమో అని కంగారు పడుతూ తీసి తన పుస్తకాల సంచిలో దాచుకున్నాడు.

అటుగా వినాయకుడి గుడికెళ్తున్న ఆడాళ్ళగుంపులో పక్కింటి సుశీలక్క ఉండటం గమనించాడు. ఆమె తననేమైనా చూసుంటుందా అని సందేహం కలిగింది. గబగబా నడిచి గానుగవీధి దాటుతూ ఉండగా బడిగంట మోగింది. అడ్డ సందులో తిరిగి గంగమ్మగుడి వైపుకి నడిచాడు. ఎక్కడైనా తన పుస్తకాలసంచిని దాచగలిగితే బాగుండు అనుకున్నాడు, ఎక్కడ దాచాలో తెలియలేదు.

రైల్వేలైను అవతలకెళ్తే మనుషులెవ్వరూ ఉండరు అనుకున్నాడు. అటుగా నడిచాడు. రైల్వేగోడౌను దగ్గర ఒక లారీ ఆగివుంది. అక్కడ నలుగురు చిరిగిన గోతం సంచుల్ని కుట్టుకుంటున్నారు. రైల్వేలైను దాటుకుని వచ్చేశాడు. మనుషులెవ్వరూ లేరు. ఒక కాకి మాత్రం అరుస్తుండటం చూశాడు. సంచి తీసి అక్కడున్న ఇనపస్తంభానికి వేలాడదీశాడు. ఆత్రంగా ఆ పుస్తకాన్ని బయటికి తీశాడు. కంగారుపడుతూ గబగబా పేజీలు తిరగేశాడు. ఇరవై నాలుగు బొమ్మలున్నాయి. అందులో రెండు బొమ్మల్లో మాత్రమే అమ్మా పూర్తి నగ్నంగా వుంది. మిగిలినవి పూర్తి నగ్నం కావు.

తననెవరైనా చూస్తున్నారేమో అని భయంగా ఉంది లోపల. చుట్టూ తిరిగి చూసుకున్నాడు. నగ్నంగా ఉన్న ఒక బొమ్మని చాలాసేపు చూశాడు. నవ్వొచ్చింది. ఎందుకో తెలియకుండానే ఆ బొమ్మని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. చూడగా చూడగా ఒంట్లో చీమలు కుడుతున్నట్టు ఏదో నొప్పి మొదలైంది. మళ్ళీ మళ్ళీ ఆ బొమ్మలన్నిట్నీ తిరగేసిచూశాడు. ఎండకి ఒళ్ళంతా చెమటలు కారుతున్నాయి. తల నుండి జారిన చెమట చుక్కలు బొమ్మమీద పడ్డాయి.

LOGOఉన్నట్టుండి ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించింది. తిరిగి చూశాడు. దూరాన ఎవరో ఒక ముసలావిడ పేపర్లు ఏరుకుంటూ కుక్కని తరుముతుంది. అంత దూరాన్నుంచి ముసలావిడ కుక్కని అదిలించడం తనకెలా అంత స్పష్టంగా వినిపించిందా అని ఆశ్చర్యమేసింది. పుస్తకాన్ని కింద పెట్టి ముఖాన కారుతున్న చెమట తుడుచుకున్నాడు. పక్కనున్న వేపచెట్టు, దాని పచ్చనిఆకులు, పెచ్చులూడిన రైల్వేఆఫీసు, అల్యూమినియంరంగులో ఉన్న ఆకాశం, గాలికి తలూపుతున్న గడ్డిపరకలు అన్నీ ఇంత స్పష్టంగా, ప్రకాశవంతంగా కనపడుతుండటం ఆశ్చర్యంగా ఉంది. తన కళ్ళింత కాంతివంతంగా ఎలా మారాయి? ఎక్కడో దూరం నుండొచ్చే శబ్దాన్ని కూడా నా చెవులెందుకు ఇంత స్పష్టంగా వింటున్నాయి? ఆలోచిస్తూ చుట్టూ మరోసారి పరికించాడు. తననెవరో చూస్తున్నారేమో అన్న భావన కలుగుతూనే ఉంది. పక్కన ఎండిన ఆకులేవో గాలికి చప్పుడు చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ లేనిది ఇవాళ మాత్రం తన చుట్టూ ఉన్న అన్నీ ఇంత స్పష్టంగా వినబడటం, కనబడటం ఏంటా అని ప్రశ్న తొలిచేస్తుంది.

మళ్ళీ పుస్తకాన్ని తిరగేశాడు. అందులోవున్న అమ్మాయి ఒళ్ళు పాలరాయిలా ఉంది. చక్కని చర్మం ఉన్న అమ్మాయి. ఆమె ఒంటిపైన ఎక్కడా ఒక్క చిన్న మచ్చో, గాయపుమచ్చో కూడా లేదు. ఇది కేవలం పుస్తకం అని అనిపించడంలేదు. అదే సమయాన నిజం అనికూడా ఆనందరావు మనసు నమ్మలేకపోతుంది. నిజమూ, అబద్ధమూ కానిది ఏదో ఉందా అన్నట్టు ఆ అమ్మాయి నగ్న శరీరానికేసి చూస్తూ ఉండిపోయాడు.

అలా చూస్తూ ఉంటే జెర్రికి ఒళ్ళంతా కాళ్ళున్నట్టు తన ఒళ్ళంతా ఏదో తెలీని కాంక్ష ఉబికి పైకొస్తున్నట్టు తోచింది. ఈత రానివాడు నీళ్ళల్లో పడి మునుగుతూ తేలుతూ కొట్టుకుంటున్నట్టు ఆనందరావు ఆ పుస్తకం మత్తులో పడటం లేవడం జరుగుతోంది. అక్కడి చెట్టు మీదున్న కాకి ఇంకా అరుస్తూనే ఉంది. ఆనందరావుకి చిర్రెత్తింది. ఒక రాయి తీసి దాని మీదకి విసిరాడు. ఇప్పుడు ఆ కాకి కూడా లేదు. తనొక్కడే ఉన్నాను అని ధైర్యం వచ్చింది.

ఆ గడ్డిమీద ఒరిగి పడుకుని మళ్ళీ పుస్తకాన్ని తిరగేశాడు. అందులో ఉన్న అమ్మాయిల శరీరాలు నిజమైనవా, లేదంటే ఒట్టి బొమ్మలా అని అనుమానం కలిగింది. తీక్షణంగా చూడసాగాడు. తను కాకుండ ఇక్కడ ఇంకెవరో ఉన్నారు అన్న భావన మళ్ళీ మొదలైంది. ఒంటిలో వణుకు మొదలైంది.

దూరాన రైల్వేట్రాకుల మీదెవరో మరమత్తు పనులు చేస్తున్నారు. వరప్రసాదుని తీసుకు రావాల్సింది అనుకున్నాడు. అయితే వాడు ఈ విషయం ఎవరికైనా చెప్పేస్తే అన్న భయం కలిగింది. లేచి నిల్చుని చెట్టు మొద్దుకి వీలైనంత ఎత్తుకి ఉచ్చ పోశాడు.

ఉన్నట్టుండి ప్రపంచం చాలా విశాలమైనట్టు, తనకి ఏమాత్రమూ పరిచయంలేని వందలాది వస్తువులున్నట్టు అనిపించింది. ఒంట్లో ఎక్కడో ఓచోట మేకు గుచ్చుకున్నట్టు నొప్పి మొదలైంది. వీపు తడిమి చూసుకున్నాడు. ఎక్కడో తెలీడంలేదు. రక్తం కారుతున్నట్టు తోచింది. మళ్ళీ తడిమి చూసుకున్నాడు. రక్తమేమీ రావట్లేదు. ఏదో గుచ్చుకుని ఉంటుంది అని సమాధానపడ్దాడు.

మళ్ళీ ఆ పుస్తకాన్ని మొదట్నుండి చివరిదాక తిరగేశాడు. అమ్మాయి ముఖాన్ని చేతివేళ్ళతో మూసి పెట్టుకుని ఒంటిని మాత్రం చూశాడు. చచ్చిపోయిన పీనుగలా తోచింది. వెంటనే చేయి తీసేశాడు. దూరానున్న రోడ్డుపైన సైకిలు మీద ఒక స్త్రీ వస్తుండటం కనిపించింది. ఆమె ఎర్ర చీర గాలికి ఎగురుతూ ఉంది. గాలికి ఎగిరే ఆ చీర వాడి ఒంటిలో ఏదో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మళ్ళీ ఆత్రంగా పుస్తకాన్ని తిరగేశాడు. శిల్పాల్లా ఉన్న అమ్మాయిల దేహాలు. ఆబగా చూస్తున్నాడు. వీపున రక్తం కారుతున్నట్టుతోచింది.

 దూరాన కనిపించిన స్త్రీ తన కంటికి మరుగునపడుతోంది. చిరాకుగా అనిపించింది. తానెందుకని ఈ బొమ్మలని చూస్తూన్నానో అని అసహనంగా అనిపించింది.

పదిహేనేళ్ళ ప్రాయపు మధ్యాహ్నం

తినాలనే అనిపించలేదు. ఆనందరావు తన పుస్తకాల సంచినీ, టిఫినుబాక్సునీ బజారులో ఉన్న టైలరుకొట్టులో పెట్టి వీధిలో నడవడం మొదలెట్టాడు. ఎండ రోడ్డు మీదకి దిగి ఏరై పారుతున్నట్టు తోచింది. ఇపుడు మళ్ళీ వీపున సన్నగా రక్తం కారుతున్నట్టు తోచింది. చేత్తో తాకి చూసుకున్నాడు. ఓ సారి చొక్కా తీసి చూసుకుంటే మంచిదేమోఅనిపించింది. అందుకని హసన్ కొట్టు పక్కనున్న సందులోకి తిరిగాడు. ఆ సందులో కాస్త దూరం నడిచాడు. అక్కడ ఒకావిడ నిల్చుని మూత్రం పోసుకుంటుంది. చప్పుడు కాకుండ ఆ దృశ్యాన్ని చూస్తూ నిల్చున్నాడు ఆనందరావు. ఆమె పనవ్వగానే తల పైకెత్తి చూసి “త్తూ!” అని మురికి కాలువలో ఉమ్మేసి మరో వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

ఆనందరావు మరికాస్త దూరం నడిచి తన చొక్కా తీసి పరిశీలించాడు. చెమట మరకలు తప్ప ఇంకేంలేదు. చొక్కాలేని తన దేహాన్ని తను చూసుకోడం కూడా ఏదో వింతగా తోచింది. గబగబా చొక్కా వేసుకుని ఆ సందు నుండి వెనుతిరిగాడు. బజారులో కీరకాయలు, మరేవేవో అమ్మే ఆడవాళ్ళు కూర్చుని ఉండటం చూశాడు. ఒట్టి దేహాలు మాత్రమే అన్నట్టు తోచింది. ఉన్నట్టుండి ఆడవాళ్ళను తను దగ్గరగా చూస్తున్నట్టు అనిపించింది. ఎక్కడ చూసినా ఆడవాళ్ళే కంటబడుతున్నట్టు ఉంది.

padihenava praayamlo okaduవాడు కీరకాయలమ్మే ఆడవాళ్ళకేసి గుడ్లప్పగించి చూడసాగాడు. చెమటలు పోస్తున్న దేహాలతో కూర్చునున్న వాళ్ళ ఒంటి ఒంపుల మీదికెళ్ళింది దృష్టి. వారి ఒంపులు వాడిలో అలజడి పెంచుతున్నాయి. వీధి చివరున్న రాతిమీద కూర్చున్నాడు ఎండలో. సినిమా ముగిసినట్టుంది, థియేటర్నుండి జనాలు బయటికొస్తున్నారు. ఆ జనాలలో ఒకావిడ నైలాన్ చీరలో నవ్వుతూ వస్తుంది. ఆ నవ్వు ఆనందరావు దేహాన్ని తొలిచేస్తున్నట్టు అనిపించింది. ఎటైనా వెళ్ళి మరోసారి తన దగ్గరున్న ఆ పుస్తకాన్ని తిరగేసి చూడాలి అనిపించింది. ఎక్కడికెళ్ళాలో అన్న ఆలోచనలోపడి రోడ్డుమీద నడవసాగాడు. ఊరంతా ఎందుకిలా రద్దీగా ఉంది అని చిరాకుపడుతూ బస్​స్టాండు దగ్గరకెళ్ళాడు. ఇద్దరు అమ్మాయిలు స్కూల్ యూనిఫార్మ్ లో బస్ కోసం చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ గలగలా నవ్వుకుంటున్నారు. వాళ్ళని కాసేపు చూస్తూ నిలుచున్నాడు. ఎండకు తారు కరిగి నడిచే వాళ్ళ కాళ్ళను అంటుకున్నట్టు చూసే దృశ్యాలన్నీ తనకి అంటుకుంటున్నట్టు తోచింది.

బస్​స్టాండు దాటుకుని బయటికొచ్చేశాడు. తన బాబాయి సైకిల్ మీద తనను దాటుకుని వెళ్ళడం చూశాడు. మనసులో ఉన్న భయం పోయి తెలీని కైపేదో తలకెక్కుతూఉంది. చేసేది తోచక తిరుగుతూ ఉన్నాడు. సూరీడు తన తలకి అతి దగ్గరగా ఉన్నట్టు ఎండ మండిపోతుంది. సినిమాథియేటరుని ఆనుకునున్న పిండిమిల్లు దగ్గరకెళ్ళాడు. లారీలో మూటలెక్కిస్తున్నారు. పిండి పట్టించుకోడానికి ఎప్పుడు రావాలో తెలుసుకెళ్ళడానికి వచ్చాను – అని అబద్దం చెప్పాడు. లోపలకెళ్ళి అడగమన్నారు. నేల మీదంతా పిండి, గోడల మీదంతా పిండి. గాలిలో కూడా పిండి దుమ్ము ఎగురుతోంది. లోపలెవ్వరూ లేరు. అక్కడ నీళ్ళకుండలో నీళ్ళు ముంచుకుని నాలుగు గ్లాసులు తాగాడు. పిండి పేరుకుపోయున్న కర్ర బెంచీ మీద కూర్చున్నాడు. పక్క థియేటర్ లో సినిమా ఆడుతున్న శబ్ధం వినిపించింది.

తన చడ్డీ జేబులోని పుస్తకాన్ని బయటకి తీసి చూశాడు. బొమ్మలో నగ్నంగా ఉన్న అమ్మాయి తననే చూస్తున్నట్టు ఉంది. ఈ పిల్ల పేరేమైయుంటుంది? ఏ ఉళ్ళో ఉంటుంది? తనని ఇలా ఒకడు చూస్తు ఉంటాడని తనకి తెలిసుంటుందా? అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ పుస్తకాన్ని ఎక్కడైనా దాచిపెట్టాలి అని అనుకుంటూ బయటకి నడిచాడు. పిండి పట్టించుకోడానికి ఎవరో ఒకావిడ లోపలికి వస్తోంది. ముప్ఫై ఏళ్ళుంటాయేమో. మంచి దృఢమైన దేహం ఆమెది. ఆమెకేసి చూశాడు ఆనందరావు. ఆమెబియ్యం మరపట్టించడానికి ఎంత – అని అడిగింది. వీడు సమాధానమేమీ చెప్పలేదు. పైకీ కిందకీ వీడిని చూసి “కరెంట్ లేదా?” అని అడుగుతూ లోపలికెళ్ళిపోయింది. ఆత్రంగా ఆమెను ఏమైనా చేసేస్తానేమోనని కూడా భయం కలిగింది ఆనందరావుకి. తిరిగి చూశాడు. మెషిన్ దగ్గరకెళ్ళిపోయింది. బయట ఎండ వాయించేస్తోంది.

పదిహేనేళ్ళ ప్రాయపు సాయంత్రం

ఆనందరావు “నగ్న పుస్తకా”న్ని దాచిపెట్టడానికోసం మొగిలిదిబ్బ వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. మొగిలిదిబ్బలో ఇళ్ళు ఎక్కువుండవు. ఎక్కడచూసినా బండలూ, పెద్దవీచిన్నవిగా రాళ్ళూ, ముళ్ళ చెట్లూ ఉంటాయి. పిల్లలతో ఆడుకోడానికి ఈ మొగిలిదిబ్బకి చాలా సార్లే వచ్చాడు. ఒక బండకింద దాచిపెట్టాలి అనుకున్నాడు. ఏ బండ అనువైనదో తెలీడం లేదు. ఒక పెద్ద బండ పైకెక్కాడు. అక్కణ్ణుండి చూస్తే కింద రోడ్డు మీద వెళ్తున్న బస్సులు ఆట బొమ్మల్లా చిన్న చిన్నవిగా కనిపించాయి. గుర్తుకోసం అన్నట్టు ఒక చిన్న రాయి తీసి తన పేరులోని “ఏ ఆర్” అక్షరాల్ని బండ మీద చెక్కాడు. పుస్తకాన్ని ఆ బండకింద దాచేముందు ఒకసారి మళ్ళీ తిరగేసి చూసుకున్నాడు. దాచాక చుట్టూతిరిగి తననెవరైనా చూస్తున్నారా అని చూసుకున్నాడు. ఎండిన ఆకులు గాలిలో ఎగరడం తప్ప అక్కడ మరో అలికిడిలేదు.

తన పుస్తకాల సంచి తీసుకోవాలని త్వరత్వరగా టైలరుకొట్టు వైపుకి నడిచాడు ఆనందరావు. దార్లో వరప్రసాదు టీ కొట్టుదగ్గర టీ తాగుతూ కనిపించాడు. వాడి దగ్గర ఓ గుక్క తీసుకుని తాగచ్చు అనుకుంటూ అటు వెళ్ళాడు. వాడు “ఎందుకురా స్కూల్ కి రాలేదు?” అనడిగాడు. జవాబు చెప్పకుండ ఆనందరావు నవ్వడం గ్రహించి, “సినిమాకెళ్ళావా”అని అడిగాడు. వాడి దగ్గర్నుండి గ్లాసు తీసుకుని తాగుతూ రహస్యమైన గొంతుతో, “ఐదు రూపాయిలు పెట్టి సీనుగాడి కొట్లో పుస్తకం కొన్నాను” అన్నాడు. వరప్రసాదు నమ్మలేనట్టు “ఇంగ్లీష్ వాళ్ళ బొమ్మలున్నవా?” అనడిగాడు. ఆనందరావు గర్వంగా నవ్వాడు.

వరప్రసాదు ఆరాటం ఆపుకోలేక “ఎక్కడ ఉందిప్పుడు? నాకు చూపించు రా” అని బతిమాలుతున్న గొంతుతో అడిగాడు. ఆనందరావుకి తాను గొప్పవాడిలా తోచింది. కావాలనే “ఇంకో రోజు చూపిస్తాలేరా” అని బెట్టు చేశాడు. వరప్రసాదు బతిమలాడాడు. సరే అన్నట్టు మొగిలిదిబ్బ ఎక్కారు. అక్కడ కొందరు బర్రెలకి స్నానం చేయిస్తున్నారు. వాళ్ళని దాటుకుని పైకెక్కారు.

అక్కడ అది దొరకలేదు. ఏ బండకింద దాచాడో అని సందేహం వచ్చింది. ప్రతి బండా వెతికారు. ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. ఆ పుస్తకంలో ఏం బొమ్మలు ఉన్నాయి? ఎలా ఉండేవి అని వివరాలు అడిగాడు వరప్రసాదు. ఆనందరావు తాను చూసిన ఆ బొమ్మలను వర్ణించాడు. చూసినప్పటికంటే ఇలా వర్ణిస్తున్నప్పుడే తన ఒంట్లో ఎక్కువ మార్పులూ, కవ్వింతా కలుగుతున్నట్టు అనిపించింది ఆనందరావుకి.

నిరాశతో వరప్రసాదు, “రేపు బడికి సెలవెట్టీసి వెతుకుదాంరా. ఎలాగైనా దొరుకుతుంది అది” అని అన్నాడు. ఇద్దరూ బండపైన కూర్చుని ఆ పుస్తకం గురించి మాట్లాడుకుంటూఉన్నారు. తన ఒంటిలో ఏదో వేడి రగులుతున్న భావన కలుగుతూ ఉంది ఆనందరావుకి. వరప్రసాదు, “ఆ పుస్తకం దొరికి మనం ఆ పుస్తకం లోపలికి వెళ్ళిపోగలిగితే బాగుండు కదా?” అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటలు వింతగా అనిపించినా బాగుండు అనే అనిపించింది ఆనందరావుకి.

 ఆనందరావు తన సంచి పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఈ రోజు ఇల్లు చాలా ఇరుకుగా ఉన్నట్టు తోచింది. ఉన్నఫళంగా ఇంట్లో ఎందరు మగవాళ్ళు, ఎందరు ఆడవాళ్ళు అన్నట్టు తన కళ్ళు విభజన మొదలుపెట్టాయి. ఇంట్లో ఉన్న పిన్ని, అక్క అందరూ కూడా ఆడవాళ్ళలానే కనిపిస్తున్నారు. దండెం మీదున్న చీరలు, లంగాలూ, లోదుస్తులూ తొలిసారిగా చూస్తున్నట్టు తోచింది. ఆడవాళ్ళ మాటలు కూడా ముందెప్పుడూ విన్నవిలా లేవు. కొత్తగా ఉంది. చుట్టూ ఉన్న ఇళ్ళల్లో, వీధుల్లో ఎక్కడ చూసినా ఆడవాళ్ళే ఉన్నట్టు తోచింది.

ఆనందరావు కాఫీ అయినా తాగకుండ బయటికెళ్ళిపోయాడు. తను ఐదు రూపాయలు తీసుకున్నది ఎవరికైనా తెలిసుంటుందా? ఇవాళ బడి ఎగ్గొట్టినట్టు ఎవరైనా ఇంట్లోచెప్పి ఉంటారా? అన్న భయం పట్టుకుంది. ఈ భయాల మధ్య కూడా మనసు ఆ పుస్తకాన్ని ఎక్కడ దాచాడో గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. మళ్ళీ ఒంటిలో అక్కడక్కడా రక్తం కారుతున్న భావన కలిగింది. నిద్రపొయ్యే టైంకిగానీ ఇంటికి వెళ్ళకూడదు అని తీర్మానించుకున్నాడు. వీధుల్లోనూ, గుడి దగ్గరా తిరుగుతూ గడిపాడు.

పదిహేనేళ్ళ ప్రాయపు రాత్రి

ఆనందరావు తన చాప పరచి పడుకున్నాడు. ఇంత వరకు ఎవరూ తనకి సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదన్నది ఆశ్చర్యం కలిగించింది. బాబాయి ఇంటికి వచ్చినట్టు బయట చప్పుడైంది. సైకిలు స్టాండు వేసి లోపలికొచ్చాడు. కాళ్ళు చేతులైనా కడుక్కోకుండా నేరుగా వంటింట్లోకి వెళ్ళి “ఆనంద్ పడుకున్నాడా?” అని అడుగుతుండటంవినిపించింది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. వీడికోసం పక్కోడీ కొనుక్కొచ్చినట్టు తెలిసింది. అయినా లేచి తినటానికి వెళ్ళలేదు. అయితే అమ్మా పిన్నీ ఎవరూ అసలుపట్టించుకోలేదు. వీళ్ళు ఇవాళ ఎందుకిలా ఉన్నారు? నా తప్పునెవరైనా పసిగట్టచ్చుకదా? తిట్టడమో కొట్టడమో చెయ్యొచ్చుకదా? అని పశ్చాత్తాపంతో ఆలోచనల్లోపడ్డాడు. నిద్రపట్టడంలేదు. బాబాయి భోజనం చేసి రేడియో పెట్టుకుని పాటలు వింటున్నట్టున్నాడు.

ఇవాళ తను సీనుగాడి కొట్టులో కొనుక్కున్న పుస్తకం మామూలు పుస్తకం కాదనీ, అదొక రహస్య కోటకి దారి అనీ తోచింది. ఆలోచనలంతా ఆ పుస్తకంచుట్టూ, పుస్తకంలో చూసిన బొమ్మల చుట్టూ తిరుగుతున్నాయి. నిద్రపట్టక అలా పడుకునే ఉన్నాడు. నాన్న చాలా రాత్రయ్యాక వచ్చినట్టున్నాడు. తలుపు కొడుతున్న చప్పుడు వినిపించింది. ఆయన వచ్చిన కాసేపటికి తిని పడుకున్నట్టు ఉన్నాడు. ఈ రోజు తను చేసొచ్చిన పని గురించి నాన్న కూడా అలా ఏమీ దండించకుండా నిద్రపోవడం ఆనందరావుని ఇంకా కలతపెట్టింది. తన మీద తనకే విసుగ్గా అనిపించింది. పశ్చాత్తాపాన్ని పెంచింది.

ఉన్నట్టుండి తనకి ఇంకో తల మొలిచినట్టు అనిపించింది. ఒళ్ళు కూడా ముందున్నట్టు కాకుండ కొమ్మలు విస్తరించుకున్నట్టు, తన కాళ్ళూ చేతులూ విస్తరించుకున్నాయేమో అనిపించేలా ఉంది. తన ఒంటిలో రక్తం ఇంకా వేగంగా పోటెత్తిన నదిలా ప్రవహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆనందరావుని భయమూ బాధా రెండూ కల్లోలపరుస్తున్నాయి. తానొక వానపాములా మెదులుతున్నట్టు తోచింది. తను పడుకున్నచోట రక్తం ధారలు పారుతున్నట్టు, జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపించింది. ఆ చీకటిలో లేచి నేలని చేత్తో తడిమి చూడసాగాడు. ఇంటిలోని మరో గదినుండి ఒక ఆడగొంతూ, మగగొంతూ రహస్యంగా నవ్వే చప్పుడు గాలిలో తేలుతూ వచ్చి తన చెవిలో వినిపిస్తుంది. ఆనందరావు చీకట్లో ఇంకా నేలని తడిమి చూసుకుంటూనే ఉన్నాడు. పుస్తకాలు నిజమా మాయా? అన్న కలవరం మొదలైంది. ఇంత రాత్రివేళలో, ఈ చిమ్మచీకట్లో కూడా తన తల మీద సూర్యుడు దహించేస్తున్నట్టు ఉండటాన్ని ఎవరికి ఎలా చెప్పాలో బోధపడటంలేదు. ఆ తర్వాత ఆనందరావెప్పుడూ ఆ విషయం గురించి ఎవరినైనా అడగడమో, ఎవరితోనైనా పంచుకోవడమో జరగలేదు.

మిగిలిన అందర్లాగానే ఆనందరావుకుకూడా ఇలానే గడిచింది తన పదిహేనేళ్ళ ప్రాయం!

*

Download PDF ePub MOBI

for regular updates, like Kinige Patrika facebook page.

Posted in 2014, అనువాదం, అరవ కథలు, ఆగస్టు and tagged , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.