cover

స్తెప్ మైదానాల్లో ప్రేమకథ ‘జమీల్యా’

Download PDF ePub MOBI

అందరి జీవితాలు పూలపాన్పులు కాదు, ముళ్ళు పరిచిన పాన్పులూ ఉంటాయి. సవ్యంగా క్రమపద్దతిలో జమీల్యా జీవితం సాగితే ఇలా మనం మాట్లాడుకునేవాళ్ళమే కాదేమో…

జమీల్యా తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే ఆడపిల్ల. తండ్రి దగ్గర గుర్రపుస్వారీలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదిస్తుంది. ఊరిలో జరిగిన గుర్రపుపందాల్లో సాదిక్‌ అనే యువకుడి మీద గెలుపు సాధిస్తుంది. ఆడపిల్ల చేతిలో ఓటమి పాలయ్యానన్న ఉక్రోషంతో ఆమెను బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్ళి చేసుకుంటాడు సాదిక్. తెగ సంప్రదాయం ప్రకారం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎవరూ. జమీల్యా కూడా అతనితో కుటుంబబాధ్యతల్లో మునిగిపోతుంది. పెళ్ళయిన కొద్దిరోజులకే సాదిక్‌ యుద్ధంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడూ అతని దగ్గర్నించి ఉత్తరాలు వచ్చేవి. అందులో “తల్లిదండ్రులకూ, బంధువులకూ, గ్రామపెద్దలకూ, కులపెద్దలకూ నమస్కారాలు” – అంటూ సాగే ఉత్తరంలో చివరగా ఓ చిన్న మాటగా జమిల్యా క్షేమసమాచారాల గురించి పరామర్శ ఉండేది. ఆశగా ఉత్తరాన్ని అందుకున్న ఆమె మనసు భర్తకు తన మీద ప్రేమలేనితనాన్ని తలుచుకుని మౌనంగా వెనుతిరిగేది. భర్త ప్రేమకు దూరమైన బాధకన్నా ఊరిమగాళ్ళకు తాను లోకువైపోయినందుకు బాధ పడేది. ధైర్యంగా వాళ్ళనుండీ తప్పించుకునేది.

గోధుమ పంటను రైల్వేస్టేషనుకు గుర్రపు బండ్లపై తీసుకువెళ్లేందుకు జమీల్యాను పంపడానికి నిరాకరిస్తుంది అత్తగారు. మరిది సయ్యద్ (ఈ కథను మనకు చెప్పేది అతనే) తోడుగా వస్తాడని చెప్పటంతో ఒప్పుకుంటుంది. తర్వాతి రోజు ఉదయం నుంచి వీరిద్దరూ గోధుమలు తీసుకెళ్ళే పనిలో ఉంటారు. అక్కడే ధనియార్ పరిచయం అవుతాడు. యుద్ధభూమి నుండి గాయపడి తిరిగివచ్చిన ధనియార్ ఆ ఊరివాడేనని తేల్చుతారు ఊరిపెద్దలు. తనకంటూ ఎవరూలేని ధనియార్ ధాన్యం తోలుకెళ్ళడానికి పనిలో కుదురుతాడు.

లోపల ఎంత కష్టమున్నా పైకి చిలిపిగా, నవ్వుతూ తిరిగే జమిల్యాకు ధనియార్​ని చూడగానే బాగా ఆటపట్టించాలనిపిస్తుంది. సహజంగా మౌనంగా ఉండే ధనియార్ కి, జమిల్యాకు మధ్య కాస్త చిలిపి తగాదాలు నడిచినా ధనియార్ పాటలు ఆమెను ఆకట్టుకుంటాయి. అతని బండి పక్కగా బండి నడుపుతూ, పాటలో లీనమై వినేది. అలా ఆ సైపుమైదానాల్లో ఒకరి సమక్షాన్ని ఒకరు ఇష్టపడతారు.

తన భర్త యుద్ధంలో గాయపడి త్వరలో ఊరికి తిరిగి వస్తున్నాడన్న వార్త వినగానే జమీల్యా ఒక్కసారిగా బిత్తరపోతుంది. తనకు తెలియకుండానే ధనియార్ ప్రేమలో పడిపోయిన ఆమె ఎటూ నిర్ణయించుకోలేని పరిస్థితుల్లోకి వెళుతుంది. చివరకు సంఘం మన్ననపొందే బంధం కన్నా, తన దృష్టిలో విలువైనదైన బంధాన్నే ఆమె ఎన్నుకుంటుంది. పెళ్ళి అనే బంధం ఏర్పడిన తరువాత సంఘం కట్టుబాట్ల మధ్య జీవించాల్సిన స్త్రీ, భర్తే దిక్కుగా సంతానమే పరమావధిగా జీవించాల్సిన స్త్రీ, సంసారం పట్ల తన బాధ్యతను ఎందుకు విస్మరించింది? తాను తీసుకున్న నిర్ణయంపై సంఘానికి సమాధానం చెప్పి తీరాలా? ధైర్యం చేసి ముందడుగు వేసిన స్త్రీ సమాజం దృష్టిలో అవమానపడుతూనే ఉంది. అర్థం చేసుకునేవారు కొందరైతే ఆజ్యం పోసేవారు కొందరు. తనకు ప్రేమను అందీయలేనివాడు ఆమె ప్రేమను పొందలేని నాడు అతనెంత గొప్ప వ్యక్తి అయినా జమీల్యాకు అవసరం లేదు.

కిర్గిస్తాన్ రచయిత “చింగీజ్ ఐత్మాతోవ్”కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నవల జమీల్యా. ఈ కథ ఎన్నో భాషలలోకి అనువదింపబడింది. కథాకాలం రెండవ ప్రపంచయుద్ధం నాటిది. ఈ కథను గురించి ఎందరో రచయితలు, పాఠకులు, విమర్శకులు “ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకథ”గా అభివర్ణించారు. కానీ నావరకూ మామూలు కథలానే అనిపించింది. ఆమె వివాహిత అయివుండీ మరో మగవాడిని ఇష్టపడి, అతని కోసం ఇల్లు విడిచి వెళిపోవడం వల్లనే ఈ కథకు ఇంత ప్రాధాన్యం వచ్చిందేమో అనిపించింది. అదే ఆమె పెళ్ళికానిది అయివుండి ఇలా ఎవరినో ప్రేమించి ఇల్లు విడిచి వెళిపోతే అలాంటి కథ ఎన్నో కథల్లో ఒకటిగానే మిగిలిపోయేది.

కినిగెలో లభ్యం
జమీల్యా కథ సినిమాగా

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఆగస్టు, పుస్తక సమీక్ష and tagged , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.