cover

భారతంలో పాఠోళీ

Download PDF ePub MOBI

“మీరేం చెప్పినా వినాలనిపిస్తుంది. వెంటనే నమ్మబుద్ధేస్తుంది. అంతా నిజమే కదా! తప్పకుండా అలాగే జరిగివుంటుంది అని కూడా అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచించి చూస్తే మీరు చెప్పేవన్నీ వుట్టి పుక్కిటి పురాణాలేనని, మాటల్లోపెట్టి మాయచేసి పోతారని అనిపిస్తూ ఉంటుంది” తిడుతున్నాడో, పొగుడుతున్నాడో తెలీకుండా టకటకా పాఠం ఒప్పచెప్పినట్లు తన మనసులో భావాలన్నీ చెప్పేసి ఒక్క క్షణం ఆగాడు కృష్ణుడు.

వాడి అయోమయం చూస్తే నాకు చెప్పరానంత జాలేసింది. అన్ని అనుమానాలూ పటాపంచలు చేసే అవధూతలా ఒక చిద్విలాసపు చిరునవ్వు వాడికి కటాక్షించి ఇలా సెలవిచ్చాను.

“పుక్కిటి పురాణాలైతేనేంరా పిచ్చివాడా! అసలు పురాణాలకంటే పుక్కిటి పురాణాలకే జనాలు ఓటేస్తారు. అసలు కథకంటే కొసరు కథల్నే పదేపదే చెప్పుకుంటారు. పైగా బాగా ప్రాచుర్యంలో ఉన్న పుక్కిటిపురాణాలను ఎవరు సృష్టించారో, ఎవరు వాటికి పాపులారిటీ సంపాదించి పెట్టారో ఎవ్వరికీ తెలీదు. మనిద్దరి కథా అలాక్కాదు మరి. నేను చెప్పినట్లు, నువ్వు వినట్లు పక్కాగా రికార్డు అవుతోంది. సంతోషించు. కాశీమజిలీ కథలు చెప్పిన మణిసిద్ధుడికి, ఆ కథలు అడిగి చెప్పించుకున్న గోపాలకుడికీ సమానంగా పేరు వచ్చిందా లేదా… అలాగే మనం చెప్పుకునే కథలు కూడా…’’

ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే అందుకుని ఆపేశాడు కృష్ణుడు.

“ఆ కథలతో మన కథలకి పోలికెందుకు గానీ గురూగారూ! ఈవేళ మీరు చెప్పబోయే కథేమిటో అది చెప్పండి”అన్నాడు.

“పాఠోళీ సృష్టికర్త భీమసేనుని కథ” అన్నాను నా లోతైన చూపుల్ని ఆకాశంకేసి ప్రసరింప చేస్తూ.

“భారతంలో భీముడేనా?’’ అనుమానంగా అడిగాడు మావాడు.

“అవును. అజ్ఞాతవాసంలో వంటవాడిగా విరాటరాజు కొలువులో పనిచేశాడు భీముడు. అప్పటికతని పేరు వలలుడు. అప్పుడే పాఠోళీ అనే మహత్తరమైన వంటకాన్ని కనిపెట్టాడు” గొప్పవిషయాన్ని చాలా సింపుల్గా చెప్పాను.

“నేను చస్తే నమ్మను. కథ గడితే గోడకట్టినట్లు గట్టిగా ఉండాలండీ. ఇలా పడిపోయే తప్పుల తడకలెందుకు? అసలు భారత కాలానికి శనగ పంట వుందా?’’ తనలోని గొప్ప తెలివితేటల్ని గంపబోర్లించినట్లు నాముందు గుమ్మరించేశాడు మావాడు.

నేనసలు వెనక్కి తగ్గలేదు.

“పాఠోళీ శనగలతోనో, శనగపప్పుతో మాత్రమే చేయాలని ఎక్కడ ఉందిరా? అన్ని పప్పులతోనూ చేసుకోవచ్చు. జొన్నలతో చేసుకోవచ్చు. భీముడు నువ్వుపప్పుతో చేశాడంటాను. కాదంటావా… ఏం… చేయలేదంటావా? నిరూపించగలుగుతావా?’’ ఎదురు తిరిగాను.

“నువ్వుపప్పు అన్నింటికంటే ప్రాచీనమైన పంట కాబట్టి ఇంక అప్పీలే లేదనుకోండి. కానీ పాఠోళీని భీముడే కనిపెట్టాడు అంటే నమ్మడమెల్లాగ? ఎక్కడైనా రాసివుందా? తగినన్ని రుజువులూ, సాక్ష్యాలూ ఉన్నాయా?’’ తిరగేసి ప్రశ్నించాడు అపరాధ పరిశోధకుడు.

“రుజువులూ, సాక్ష్యాలతో మొదలెట్టడానికి మనం ఏమైనా పాఠోళీ పేటెంట్ హక్కులకోసం దరఖాస్తు చేయబోతున్నామా? కథ చెప్పుకుంటున్నాం. నువ్వడిగిన రుజువులూ గట్రా కావలిస్తే కథ చివర్లో చెప్తాను. నస పెట్టకుండా వింటానంటే ముందు కథ చెప్తాను” బెదిరింపుగా అన్నాను.

“అయ్యబాబోయ్! కథ మానేస్తే మొదటికే మోసం వస్తుంది. ముందు కథ చెప్పండి. నాకేమైనా డౌట్లుంటే చివర్లో అడుగుతాను. చెప్పండి చెప్పండి మొదలు పెట్టండి మరి” ఉత్సాహంగా అన్నాడు మావాడు.

“ఈనాటి రాజస్థాన్లోని బైరాట్ అనే గ్రామమే భారతకాలం నాటి మత్స్యదేశపు రాజధాని. దీనికి పాలకుడు విరాటరాజు. ఈరాజు రాజ్యంలోనే ఏడాదిపాటు పాండవులు అజ్ఞాతవాసం చేశారు. శకునితో ఆడిన జూదంలో అయితే ధర్మరాజు ఓడిపోయాడు గానీ విరాటరాజుతో మాత్రం ఎప్పుడూ గెలుస్తూనే ఉండేవాడు. ఒకేఒక్కసారి మాత్రం ఒకనాటి మిట్టమధ్యాహ్నం మిడసరి లగ్నంలో కేతు ప్రభావం కలిసొచ్చి విరాటరాజు ఆట నెగ్గాడు. దాంతో ఎక్కడలేని సంతోషం వచ్చింది విరాటరాజుకి.

“గొప్పగా ఆనందం వేసినా, బాగా దుఃఖం వచ్చినా ఒక్కోమనిషి ఒక్కోరకంగా స్పందిస్తూ ఉంటాడు. స్పందన అనేది మనిషికీ మనిషికీ వేరుగా ఉంటుంది. విరాటరాజుకి ఆటలో నెగ్గిన ఆనందంలో వెర్రి ఆకలి వేసింది. నిజానికి ఆయన మధ్యాహ్న భోజనం అంతకుముందే అయిపోయింది. మామూలుగా అయితే మళ్లీ రాత్రి వరకూ ఏమీ తినడాయన. అటువంటిది ఆరోజు ఎందుకో వెంటనే ఆకలి వేస్తోంది. ఏ పళ్లో తెప్పించుకుని తినవచ్చు గానీ, ఈ ప్రత్యేక సందర్భం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాడాయన. ‘తనకోసం ఏదైనా ఒక ప్రత్యేక వంటకం చేసి తీసుకురావలసింది’గా పాకశాలకు భీముడికి కబురు పంపాడు.

“ఆ కబురందేసరికి వంటింట్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కీచకుడు, అతని వందమంది తమ్ముళ్లు రాజధానికి వచ్చిపడ్డారు. యుద్ధాల్లో అలిసిపోవడం వల్ల, భీముడి వంటకాలు తినమరగడం వల్ల ఈ రెండు కారణాల వల్ల ఒక్కొక్కపూటా ఆవురావురావురు మంటూ వెయ్యిమంది తిండి ఆ వందమందే తినేస్తున్నారు. ఇంతలో కీచకుడు సైరంధ్రిని అవమానించడం, అతన్ని నర్తనశాలకు రప్పించి చంపడానికి నిర్ణయించుకోవడం అయిపోయింది. ఆ సాయంత్రమే భీముడు కీచకుణ్ణి చంపాలి.

“యుద్ధం అంటే వీరుడికి ఉత్సాహంగా ఉంటుంది కదా మరి. మాంచి భోజనం చేశాడు. చీకటి ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో రాజుగారి దగ్గర నుంచి వర్తమానం… ప్రత్యేకమైన ఆహారం వెంటనే వేడిగా సిద్ధం చేసి పట్టుకురమ్మని.

“వేడిగా ఉండాలి… వెంటనే కావాలి. పైగా మామూలు చిరుతిళ్లవంటివి పనికిరావు… ప్రత్యేకంగా ఉండాలి. పొద్దున్న వండిన పిండివంటల్లో రాజుగారు తిననిది ఏదైనా వేడి చేసి పంపిద్దామన్నా వంటగిన్నెలన్నీ ఎప్పుడో ఖాళీ అయిపోయాయి. సాయంత్రం పచ్చడి చేద్దామని నానబెట్టిన శెనగలు మాత్రమే ఎదురుగా కనిపించాయి.

paatholi“రాత్రికి నర్తనశాల ప్రోగ్రామ్ని ఊహించుకుంటూ భీముడు శెనగలు రోట్లో వేసి రుబ్బడం మొదలెట్టాడు.

“చూడు… నిజంగా ఇది ఎంత గొప్ప ఘట్టమో. అంత పెద్ద భారతం రాసిన వ్యాసుడు ఈ సన్నివేశం మాత్రం రాయకుండా మానేశాడు. కారణం ఏంటో ఊహించావా?’’ కథ ఆపేసి కొశ్చెనేశాను మావాడికి.

లేదన్నట్లుగా తలకాయ అడ్డంగా ఊపాడు మావాడు.

“టేస్టుండాల్రా. బకాసురుడు, భీముడు, దుర్యోధనుడు ఇలా ఎవడెవడు ఎంతెంత తిన్నాడో రాశాడు కానీ వ్యాసుడు వాళ్లు ఏవేం తిన్నారో, అవి ఎలా చేస్తారో రాశాడా? నలుణ్ణి గురించి, భీముణ్ణి గురించి కూడా వ్యాసుడు రాశాడు. వంటంటే నలభీములదే. వాళ్లకంటే గొప్పవంటవాళ్లు లేనేలేరు అని రాసి వదిలేశాడు కానీ, అంత గొప్ప వంటగాళ్లు ఆరోజుల్లో ఏవేం వండేవాళ్లో, ఎలా వండేవాళ్లో మాత్రం చెప్పలేదు వ్యాసుడు. దేనికంటావ్? టేస్ట్ లేకపోవడం వల్లనే కాదూ! అందుకే అన్నపూర్ణాదేవి స్వయంగా వచ్చి వడ్డించి కడుపునిండా తిన్నాక ముక్కచీవాట్లేసి పంపించింది” చెప్పుకుంటూ పోతున్నాను.

“గురూగారూ! అసలు కథ” మధ్యలో అడ్డంగా తగిలాడు మావాడు.

“చెప్తా… చెప్తా. ముందీ విషయం విను. భీముడంటే గతిలేక విరాటరాజు లాంటి వాడి దగ్గర చేరాడు. అతగాడికి జూదం గురించి తప్ప మరోవిషయం పట్టదు. అందుకని ధర్మరాజును దగ్గరకు తీసినట్లు ఇంక ఎవ్వరితోనూ అంత చనవుగానూ, కాలక్షేపంగానూ ఉండేవాడు కాదు. ఆ విషయంలో చెప్పుకోవాలంటే భీముడి కంటే నలుడి పరిస్థితే కాస్త మెరుగు. జూదంలో ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకుని, దమయంతికి దూరమైన తరువాత మళ్లీ పాచికల జోలికి పోలేదు. బాహుకుడనే మారుపేరుతో రుతుపర్ణ మహారాజు వద్ద వంటవాడిగా కుదిరాడు. ఒకసారి సారధిగా కూడా ఉన్నాడు. కానీ ముఖ్యంగా అతని దగ్గర ఉన్నన్నాళ్లూ అతనిది వంటవాడి గెటప్పే. రుతుపర్ణుడు మంచి టేస్ట్ ఉన్నవాడు. నలుడు వండిన ప్రతి వంటకాన్నీ ఆస్వాదిస్తూ అవి వండే విధానం గురించి నలుణ్ణి అడిగి తెలుసుకునే వాడట. నలుడు ఆశువుగా చెప్పే విషయాలన్నీ ఎప్పటికప్పుడు వ్రాయసగాళ్ల చేత రాయించి వివిధ పత్రికల్లో ప్రచురణ అయ్యేలా చూసేవాడు రుతుపర్ణుడు. అలాగే శాటిలైట్ చానళ్లలో కూడా నలుడి వంటలపేరుతో రకరకాల కార్యక్రమాలు ప్రసారం చేయించేవాడు”

నేను చెప్పుకుపోతుంటే భయం వేసిందో ఏమిటో, ‘‘గురూగారూ!’’ అని ఒకసారి గట్టిగా అరిచాడు మావాడు.

వాడి అరుపుతో నేను ఒక్కసారి సర్దుకుని ‘‘ఏదో… ఈ విషయంలో నలభీములకి వ్యాసుడు అన్యాయం చేశాడు. ఆరోజుల్లో పత్రికలు, టీవీలు లేకపోయాయే… ఉండిఉంటే వారి వంటలు, అవి చేసే విధానం చక్కగా ఎంతోమందికి తెలిసివుండేవి కదాని ఆవేదనలో నోరుజారాను. అయితే ఒక్క విషయం… నలుడు రుతుపర్ణుడితో చెప్పిన పాకశాస్త్ర రహస్యాలన్నీ హర్షనైషధంలోనూ, మరికొన్ని ప్రాచీన గ్రంధాలలోనూ ఉన్నాయి. కానీ మన భీముడికే పాపం అన్యాయం జరిగింది. ఆయన పాకనైపుణ్య వైభవాన్ని వర్ణించే మహత్తర గ్రంథరాజం ఏదీ ఏ భాషలోనూ రాలేదు. ఆలోటు ఇప్పుడు మన కథ తీరుస్తుంది. ఏమంటావ్?’’ గర్వంగా అడిగాన్నేను.

“పూర్తిగా చెపితేనా లోటు తీర్చేందుకు. మిగులు పంచేందుకూను. సగంలో కథ ఆపి, దోవమళ్లిపోతిరి. సరే… భీముడు కీచకుణ్ణి రోట్లో వేసి రుబ్బడం మొదలుపెట్టాడు తర్వాతేం జరిగింది గురూగారూ?’’ ఉత్సాహంగా అడిగాడు మావాడు.

“కీచకుణ్ణి కాదురా శుంఠా! నానబెట్టిన శనగల్ని రుబ్బుతున్నాడు. ఆ శనగల్ని మెత్తగా రుబ్బేసి మిరియాలపొడి, ధనియాలపొడి, ఇంగువ ఇలా కంటికి కనిపించిన సుగంధద్రవ్యాలన్నీ అందులో వేసేశాడు. ఇంత ఉప్పేసిన తర్వాత గిన్నెకి వాసిన కట్టి పిండివడియాల సైజులో పరిచి ఉడికించాడు. ఉడికిన వాటిని తేలికగా చిదిపి నేతిలో దోరగా వేయించాడు.

“అప్పటిదాకా చూసిచూసి ఇంకా ఆలస్యమైన కొద్దీ విరాటరాజుకి ఉత్సాహం చప్పబడిపోతోంది. ఆట గెలిచిన ఆనందంలో వేసిన వెర్రి ఆకలి పిచ్చికోపంలా మారిపోతోంది. వెంటనే వంటకంతో పాటు వలలుణ్ణి ప్రవేశపెట్టండి అని ఆజ్ఞ ఇచ్చి ఇద్దరు భటుల్ని ఆయుధాలతో పంపించాడు.

“చేసిన వంటకం తన క్రింద పనిచేసేవాళ్లలో ఎవరికో ఇచ్చి పంపిద్దామనుకున్నాడు కానీ, విరటుడు తననే రమ్మంటున్నాడని కబురు తెలిసేసరికి ఇంక తానే బయలు దేరక తప్పలేదు భీముడికి. నడుస్తున్నాడు కానీ అతని మనసంతా రాత్రికి నర్తనశాల ప్రోగ్రాం గుట్టుచప్పుడు కాకుండా విజయవంతం చేయడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంది. రాజుగారి ద్యూతగృహంలో ప్రవేశిస్తూంటే పక్కనే రాణీ సుధేష్ణ అంతఃపురంలో నుంచి ద్విజయవంత రాగంలో సైరంధ్రి పాడుతున్న కృష్ణభక్తి గీతం వినిపిస్తోంది.

“తనకు కర్తవ్యబోధ చేస్తున్నట్లు అనిపించిన ఆ పాట వింటూనే యాంత్రికంగా తిండి పళ్లెం తీసుకెళ్లి విరాటరాజు ముందు పెట్టాడు. ‘ముందు మీరు తీసుకోండి’ అని కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజును విరటుడు అడిగాడు కానీ, ఆయన ‘ఇప్పుడొద్దండీ’ అని మొహమాటం నటించాడు. తనుకూడా సైరంధ్రి పాడుతున్న కృష్ణభక్తి గీతాన్ని వింటూ తన్మయుడై ఉన్నాడు.

“విరటుడు మాత్రం ఆకలి మీద ఉన్నాడేమో ఆబగా ఓ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. మహారుచిగా అనిపించింది. కానీ అదేమి పదార్ధమో అర్ధం కాలేదు విరటుడికి. ఎప్పుడూ తినని వంటకం కావడం వల్ల ‘ఏంటిది? అని అడిగాడు విరాటరాజు పళ్లెంలోకి చూస్తూ.

“ ‘పాట’ అన్నాడు భీముడు.

“ ‘నీకు వినబడుతున్నది కాదు. నా పళ్లెంలో పెట్టింది ఏమిటని?’ రెట్టించాడు విరటుడు.

“నిజానికి దాన్ని ఏమని పిలవాలో భీముడికి కూడా తెలీదు. అంతకుముందు ఎప్పుడూ వండలేదు కదా. అందుకే విరటునికి సమాధానం చెప్పడానికి కొంచెం తడబడ్డాడు,

“ఇంతలో కృష్ణభక్తి గీతంలో సైరంధ్రి కంఠంలో వినబడిన ఒక మధురమైన గమకానికి ముగ్ధుడై స్వగతంలో అనుకుంటున్నానుకుంటూ జనాంతికంగా ‘ఓహో భళీ’ అన్నాడు కంకుభట్టు రూపంలోని ధర్మజుడు.

“ఆ మాట వింటూనే కొత్త వంటకం పేరు వెంటనే స్ఫురించింది భీముడికి. ‘పాట ఓహో భళీ’ మూడు ముక్కల్నీ కలిపేసి ‘పాఠోళీ మహారాజా!’ అన్నాడు.

“విరటుడు మెచ్చుకుని బహుమానం చేసి అతన్ని పంపేశాడు. అది పాఠోళి పుట్టుక వెనుక కథ’’ చెప్పడం పూర్తిచేశాన్నేను.

కాసేపు మౌనంగా ఊరుకుని, దీర్ఘంగా ఆలోచించి ‘‘పాఠోళీ భీముడే కనిపెట్టాడని రుజువులూ, సాక్ష్యాలూ ఉన్నాయన్నారే! ఏంటవి?’’ అడిగాడు మిస్టర్ డిఫెక్టివ్.

“ఉన్నాయి. ఆగ్రా దగ్గర పాఠోళీ అనే ఊరు ఇప్పటికీ ఉంది. ఆనాడు పాఠోళీ తయారీలో, ఆ తర్వాత దాన్ని రకరకాలుగా ఎలా తయారుచేయాలో పరిశోధనలు చేయడంలోనూ సహకరించిన వంటవాళ్లందరికీ పాఠోళీ అగ్రహారాన్ని భీమసేనుడు దానం చేశాడు అని స్థలపురాణం చెపుతోంది. పాఠోళీ అగ్రహారంలోనే పాఠోళీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెంది కాలాలమీద భారతదేశమంతటా వ్యాపించింది.’’ అంటూ ఆఖరి ముక్క నోట్లో వేసుకున్నాను.

అప్పటివరకూ నేను చెపుతున్నదంతా వింటూ ఆశ్చర్యంగా నోరువెళ్లబెట్టుకుని చూస్తున్న కృష్ణుడు ఏదో ఆలోచిస్తూ అప్పటికే నేను ఖాళీ చేసిన తన ప్లేట్లో చెయ్యి పెట్టి తడిమి బావురుమన్నాడు.

అతన్ని ఓదార్చి, ‘‘పిచ్చివాడా ముక్కున గారె పెట్టుకుని ఊ కొట్టిన కాకిపిల్లలా అయింది నీ పరిస్థితి. ఏం పర్లేదు లోపలికెళ్లి మరో వాయి వేయించుకురా’’ అన్నాను.

ఆవురావురుమంటూ పరుగెత్తాడు వాడు.

– నేతి సూర్యనారాయణ శర్మ,
9951748340, పెదపాడు, ప.గో.జి.

Download PDF ePub MOBI

for regular updates, like Kinige Patrika facebook page.

Posted in 2014, ఆగస్టు, కథ and tagged , , , , , .

3 Comments

  1. పండగ రోజు పాఠోళీ చేద్దామని నిర్ణయించి, రెసిపీ ఒకసారి చెక్ చేద్దాం అని నెట్ లో వెదికితే ఇక్కడికి లాక్కొంచింది అన్వేషణ. అయితే పాఠోళీ పేరు వెనక ఇంతుందాండీ?

    మీ నెరేషన్ అద్భుతంగా ఉందండీ శర్మ గారూ! పొద్దున్నే ఇవాళ బోల్డన్ని నవ్వులు పూయించింది మా ఇంట్లో

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.