cover

మూలింటవ్వ – మా పెద్దపెద్దమ్మ

Download PDF ePub MOBI

నడీది నుంచి సర్కారు సేందబాయికి ఎదురుగా వుండే ఈదిలో నాలుగు బారలు బోతామో లేదో! ఎడంపక్క కొప్తపల్లి రెడ్డోళ్ల మిద్దిల్లుంటాది. కుడి పక్క బక్కయివోరోళ్లుండే సావిడిల్లు. అదీ మా మూలింటవ్వోళ్లదే. ఈది కెదురుంగా కిష్నారెడ్డి తాతోలిల్లు. సావిడింటికి తాతోలింటికి మద్య సందులోబోతే అక్కడుంటాది ఒకమూలకు మాయవ్వోలిల్లు. మాయవ్వ గురించి సెప్తా ఆయమ్మ ఎట్లుంటాదో సెప్పకుంటే ఏమన్నా మర్యాదగా వుంటాదా? మా తాత అచ్చం గాందీతాత మాదిరిగా వుంటాడులే. ఇంగ మాయవ్వ వొడ్డూపొడుగుతో మా తాతకు సరిజోడుగా వుంటాది. ఎప్పుడూ తలముడేసుకొనే వుండేది గానీ జడేసుకోడంగాని, బిశానా ఏసుకోవడం గాని ఈ పాపిస్టి కండ్లతో సూళ్లేదు. తలముడి ఇప్పిందంటే సాలు అబ్బబ్బబ్బా… ఏమి ఎంటికిలు, బారెడు పొడుగుతో ఈపు కన్పించకుండా పర్సుకొనేది. అంత సింగారంగా వుండేవి మాయవ్వకు ఎంటికిలు. అమ్మానాయిన్లు పెట్టని సొమ్ముగదా! అది.

ఇంక మాయవ్వ మనసంటావా. ఎన్నపూస. ఎవురితోను గెట్టింగా మాట్లాడిందిగానీ, కొట్లాడిందిగానీ ఈ బూమండలం మింద ఎవురూ సూసుండరు, బూదేవి కున్నంత ఓర్పిచ్చినాడు దేవుడు మాయవ్వకు. సిన్నపిలకాయిలు తప్పుజేసినా గెట్టింగా కసిరిందిల్యా. తిట్టిందిల్యా. మా తాత మాయవ్వకు ఏమని బొట్నేలు దొక్కి బొట్టు కట్టినాడో అప్పిట్నించి మాతాతకు ఎదురు మాట్లాడిరది లేదు. ఆయన అన్న్యాయంగా ఒక మాటనినా మాంతమైన శాంతంతో ఓర్సుకొనిందే గాని ఎత్తుబారం బతుకై పోయిందని ఎప్పుడూ యాస్టపోలా. ‘మిన్నిరిగి మింద బడినా మాయవ్వ అదరదు, బెదరదు’ అని మాతాతే మాతో ఎన్నోసార్లనింటాడు. నలుగుర్లో పచ్చంగా వుండాంగదా అని పదిరిందీ లేదు.

మాయవ్వ గెలికే సంగటి, కాంచే కూర గుర్తొస్తే ఇప్పుడు కూడా మాయవ్వ సచ్చిపొయ్యి ఇరవయ్యెనిమిదేండ్లయిందా! వాటి రంగూ, రుసీ, వాసనొచ్చి నోట్లో సెలమలో వూరినట్లూరతాయి నీళ్లు. సింతాకు పులగూర మామూలింటవ్వెనపాల, తినాల.

సందకాడ దీపానికి పేండబెట్టి కడప్మెట్లమింద నీళ్లుజల్లి ముక్కర్రేసి నట్టింట్లో దీపంబెట్టి పెదపాపా, సినపాపా ఇంట్రండి అని మాతో దేమునికి దండంబెట్టించి పలకా బలపాలు మాసేతుల్లో బెట్టి ‘బాగా సదుంకోండి నాయినా’ అని బక్కయివోరి దెగ్గిరికి పంపించేది.

మేము ప్రయివేటు సదుంకోనొచ్చేదాకా అయివోరోళ్లక్క (ఆయమ్మ బక్కయివోరు పెండ్లామైనా అందరూ అట్లే పిలుస్తాము), మాయవ్వ సందులో కూసోని ఆమాటా ఈ మాటా మాట్లాడుకుంటా వుండేటోళ్లు. మేము రాంగానే మాతాతతో మేమూ వాకిట్లో పీటలేసుకోని కూసుంటే కతో గితో సెప్తా కడుపునిండ తినిపించేది.

మాయమ్మోళ్లు ఈ వూర్లోనే ఆ సివర వుంటారు. అయిదోతరగతి సదివేసేదాకా మాయక్క నేనూ మా యవ్వోలింట్లోనే పెరిగినాము.

మాయమ్మకు ఇద్దురక్కోళ్లు. ఒక తమ్ముడు. అప్పిట్లోనే మా మామ సిత్తూరికి బొయ్యి బ్యాంకిలో పన్జేసేటోడు. మా పెద్దమ్మాళ్లను కనుసూపుమేరలో వుండే కుక్కలపల్లిలో సొంత తమ్ముడికి పెద్ద కూతుర్ని, పిన్నమ్మ కొడుక్కి సిన్నకూతుర్ని ఇచ్చుకొనింది మా యవ్వ. మానాయినోళ్లే కొత్త సుట్టరీకం.

సిన్నపెద్దమ్మ కూతురు మా యమరక్క సిన్నప్పుడు మాయవ్వోలింటికి వొచ్చిపోయిన గెవనం లేదు గానీ, మా పెద్దపెద్దమ్మ కూతుర్లు శాంతక్క, నా ఈడుదే అయిన ఆనంద మాత్రం అడపా దడపా లీవుల్లో మాయవ్వోలింటికొచ్చి ఒగిటిరొండు దినాలుండేటోళ్లు.

మా మామంటే అందురికి అడలు. మా యవోలింట్లో మా యక్కా నేనూ సొంతింటిలో మాదిరిగా తిరగలాడ్తావుంటే మా శాంతక్కోళ్లు పులుకు పులుకుమని కాండ్లార్సుకుంటా సూస్తా నిలబడిపోయేటోళ్లు.

మాయవ్వ సుట్టింట్లో సంగటిగెలకతా వుంటాదా! నేను మాయవ్వ ఈప్మిందబడి ‘ఆకిలవతా వుంది బిరీనగానీ’ అని గారాలు బోతావుంటే మా పెద్దపెద్దమ్మ కంట్లో కారం బోసుకొనేది.

తమాసకు మాట్లాడినట్లగానే ‘మీ ఇంటికి బొయ్యి ఆడ మీ యమ్మనడుగు పోండేమే బిరీన సంగటి జేసి వుడుకుడుగ్గా గిన్నిలో కెయ్యమని మాయమ్మనెందుకూ సతాయించేది’ అంటా మాపక్క జూసి గుడ్లురిమేది.

ఆ కండ్లను జూడలేక మాయవ్వకు ఇంకా అతుక్కోని బొయ్యేదాన్ని. మా పెద్దమ్మమింద కోపాన్నంతా మాయవ్వమింద సూపెట్టి ఈప్మింద పిడుగుద్దులు గుద్దతా వుంటే ‘మా నాయిన గదా! ఆ సంగటి ముద్దలు జేసే పలకిట్లద్యా నీకు గుజ్జేరి ముద్ద జేసిస్తా’ అని మెల్లింగా ఇడిపించేది.

బొప్పగిన్నిలో చిన్న చిన్న జేజిముద్దలు చేసి యేసి మద్దిలో గుంతజేసి కూరబోసినాక మా శాంతక్కకు ఆనందాకు ఇచ్చి తిరగ మాయక్కా నేనూ తినేటోళ్లం. వాళ్లమ్మగారింట్లో సెల్లికూతుర్లయిన మేము సొంతమోళ్లమాదిరిగా తిరగాడతావుంటే, తన కూతుర్లేమో కొత్త సుట్టాలమాదిరిగా బిక్కుబిక్కు మనుకుంటా వుంటే మా పెద్దమ్మకు యాడలేని కుళ్లు బుట్టేది.

‘ఎడ్డిమొగాళ్లారా, ఆ సింపిరి తళ్లకు మీయమ్మను సమురు పూయమని దువ్వించుకోని రాబోండేమే’, ‘బాన పొట్టేసుకోని ఎప్పుడూ తిండిమిందేనా పుస్తకాలు దెర్సి సదూకొనేదేమన్నా వుందా?’ అని కసిదీర్సుకొనేది. యాడన్నా బైటికి పొయ్యొస్తే. ‘ఇర్లసెంగీ యాడ పుట్లుముయ్యను బొయ్యుంటివి’ అనేది. మాయవ్వ తినడానికి బెల్లమో, సెనిక్కాయలో ఇస్తాదిగదా! అవి తింటా వుంటే ఆ యమ్మ కూతుర్లు గూడా తింటా వుంటారు. అయినా మమ్మల్ని ‘ఆ నోటికి నిలుకూ నిబందమేమన్నా వుందా ఎప్పుడూ సెరుగ్గానిగాడినట్లు ఆడాల్సిందేనా’ – ఇట్లా ఏదో ఒకటని తనకుళ్లుబుద్దిని బైటబెట్టుకొనేది. మా యవ్వ ముందర మాత్రం మాపైన ఒక్కోసారి యాడలేని పేమని వొలకబోసేది.

నా గురించి ఎవురితోనైనా సెప్పేటప్పుడు గూడా సినపాపనో, నా పేరు బెట్టో సెప్పకుండా ఇడ్లీసుబ్బి, పొట్రాసు, బేతమంగళం సెరువు, కొయిల గోపి, తిండిపోతు, కొండ్రాసుకాలవ, ఊరిబిండి సట్టి అని ఎన్నో పేర్లతో సెప్పి నామిందుండే కసంతా తీర్చుకొనేది. ఇంతకూ ఆ యమ్మకు నేన్జేసిన దొరోహమేమన్నా వుందా అంటే – లేదు. మా యవ్వ నన్ను ముదిగారంగా కిందబెట్తే మన్నయి పోతాదనీ, పైన బెడ్తే గెద్దెత్తక పోతాదని సాకతా వుందికదా! అందుకే నామిందంత కోపం.

irlachengiమా యమ్మోళ్లు ముగ్గురప్ప సెల్లిండ్లకూ గలిపి ఒకడే కదా అన్నదమ్ముడు. అందురికంటే సిన్నోడు. అయిస్కూల్లో సదివి, మళ్లీ అనంతపురంలో బ్యాంకుద్దోగానికి సదివొచ్చి సిత్తూరికి సైకిలిమింద బొయ్యి సంపాదిస్తావుండాడు. మా శాంతక్కనిచ్చి పెండ్లిజేస్తే అమ్మగారింట్లో ఆయమ్మకు ఎదురుండదని పిలానేసింది మా పెద్దపెద్దమ్మ. మా శాంతక్క నల్లంగా సామనసాయంటారే ఆ నలుపుతో పొడుగ్గా సన్నంగా వుంటాది. జడమాత్రం బారెడు పొడుగుతో నల్లనాగుబాము మాదిరిగా వుంటాది.

ఇద్దురు ముగ్గురితో కూతుర్ని సేసుకోమని మద్దిస్తం బంపించింది, మా సిన్నపెద్దమ్మక్కూడా తెలీకుండా. మాయవ్వ అయివోర్లోళక్క దెగ్గిర ‘కిష్ణమ్మకేమన్నా అరువూ తెరువూ వుందా కూతుర్నిస్తానని సెప్పిపంపించింది. పండమ్మ కూతురు అమరానే నర్సిమ్మానికన్నా పన్నెండేంళ్లు సిన్న, దానికంటే మూడేండ్లు సిన్నది. పెద్దదాన్ని కాదని దీని కూతుర్ని సేసుకుంటే నలుగురూ మమ్మల్ని కారూంచరా. అసలు నాకు మనమరాండ్లను సేసుకోవాలనే లేదు. ఈ పొద్దు నీతో సెప్తావుండాక్కా’ అని యాకారింది. అయివోరోళ్లక్క మాయవ్వకంటే శానా చిన్నది. కానీ మా యవ్వ కూతుర్లను కూడా అడపా దడపా పేరుబెట్టి పిలవనప్పుడు ‘అక్కా’ అనే పిల్చేది.

మాతాత అమరక్కనే మా మామకు సేసుకున్న్యాడు. మా సినపెద్దమ్మకు అయింట్లో సొంత మెక్కువయిపోయిందని కొన్నాళ్లు రాకపోకలు తగ్గించింది మా పెద్దపెద్దమ్మ. కానీ తమ్ముని మిందుండే పేమను వొదులుకోలేక ఏదో ఒక సందులో దినాము వొచ్చి పొయ్యేది. ఏం జేసినా సివరికి ఏమీ తినేదానికి లేకున్న్యా పప్పుకూరైనా సరే అంత సట్టిపిడతలో తెచ్చి తమ్మునింట్లో ఇయకుంటే ఆ యమ్మకు నిద్రబట్టేదికాదు. కోడాండ్లొచ్చినాక దినానికి రొండుసార్లు కూడా దిరిగేది. వొచ్చినప్పుడు ఒక దోవలోవొచ్చి పొయ్యేటప్పుడు మాయింటికొచ్చి మళ్లీ ఇంగోదోవలో పొయ్యేది. ఆ వూరికి మడికట్లలో నుంచి శానా దోవలుండాయి.

మాయమ్మ క్యాన్సరొచ్చి మద్రాసులో అడయారాస్పత్రిలో వుండినప్పుడు మమ్మల్ని అక్కునజేర్సుకోని ఆలనా పాలనా జూసింది మా పెద్దమ్మోళ్లే. అందులోనూ మా పెద్దపెద్దమ్మ సెల్లెలిమింద పేమతో తిండిగూడా సరిగ్గా తినకుండా సగమైపోయింది.

కన్నోళ్లు, తోడబుట్టినోళ్లు అందురూ కాలం జేసినా ఏ రోగం రొచ్చు లేకుండా మా పెద్దమ్మింకా బతికేవుంది. ఈ ముసలితనంలో కూడా మిద్దెక్కి శెనిక్కాయిలు కుప్పదోస్తాదని, మిరక్కాయిలు ఎండబోస్తాదనీ, ఇంటి ముందర చెత్తోస్తాదని, పేడకళ్లు ఎత్తడానికి పోతాదని గర్వంగా సెప్పుకుంటారు వాళ్లింట్లో వోళ్లు, వొచ్చినోళ్లముందర.

ఈ మద్దిన ‘ఒక నాలుగు నెలలుగా గెవనం సరిగ్గా వుండద’ని సెప్పిందామె కోడలు, మాపెద్దన్న బార్య సావిత్రొదినె. ‘నేనెవురు పెద్దమ్మా?’ అని అడిగితే ‘ఎవురో ఏమో! ఆ వూరామయ్యుంటావు’ అనింది. ‘ఆవూరామె అంటే’ – ‘అదే రొడ్డుపక్కనుండేవూరు. నీకుదెల్దులే’ అనింది.

కొంచేపిటికి మా సెల్లొచ్చి ‘నేనెవురు?’ అంటే ‘నువ్వు ఇసియా గదా!’ అనింది. నేనెక్కడుంటాను అంటే తలగీరుకుంటా మళ్లీ ‘ఏం పాడో’ అనింది. మాయక్కను మాత్రం ‘మాసెల్లికూతురు గదా నువ్వు’ అని గుర్తుబట్టింది.

‘ఆరోగ్గెం బాగుందా?’ అంటే ‘నాకింతొరకు నొప్పీనొడూ అంటే ఏమో తెల్దుపాపా’ అనింది. ఆమె కూతుర్ల వరసైన మేము ఉప్పుయాది, సెక్కిరియాది, కాళ్లుమంటలు, నొప్పులతో ఏ పనీ జేయాలన్నా శక్తికూడా ల్యాకుండా అల్లాడి ఆకులు మేస్తా వుండామా. ఇప్పుడు మా పెద్దమ్మను జూస్తే మాకు కుళ్లుగా వుంటాది.

‘అమ్మకిప్పుడెంత వొయిసునా?’ అని ఆమె పెద్దకొడుకైన మునిరత్నమన్నను అడిగితే నూటమూడేండ్లనినాడు.

ఇంటికొచ్చినాక మాయక్కతో ఆ మాటంటే ‘అన్న పులుగుంటాడులే. మహా అయితే 90 ఏండ్లుంటాయి’ అనింది. ఇది జరిగి నాలుగేండ్లయిందా. ఇంగా మా పెద్దమ్మ బతికే వుండాది అంతే ఆరోగ్గింగా.

*

Download PDF ePub MOBI

for regular updates, like Kinige Patrika facebook page.

Posted in 2014, ఆగస్టు, ఇర్లచెంగి కథలు, సీరియల్ and tagged , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.