cover

పదనిష్పాదన కళ (17)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

(ఆ) తత్సమ విశేషణాలు:

సంస్కృతంలో లాక్షణిక విశేషణ శబ్దాల నిష్పాదనకు గల అవకాశాలు ఏ ఇతర భాష కంటే కూడా లెక్కకు మిక్కిలి. సందర్భాన్ని బట్టీ, అవసరాన్ని బట్టీ, అర్థాన్ని బట్టీ ఏ భాషాభాగం నుంచైనా విశేషణాల్ని నిష్పాదించవచ్చు. ఆధునిక కాలంలో విద్యా విజ్ఞానాల సముపార్జనకు మనం హెచ్చుగా ఆంగ్ల భాండాగారం మీద ఆధారపడుతూండడం వల్ల అందులోని సూక్ష్మార్థ ద్యోతకమైన పదజాలానికీ, పురోగత పరిభావనల (advanced concepts) కూ దీటైన దేశిపదజాలాన్ని రూపొందించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ లక్ష్యం దిశగా మనకు మన సంస్కృత వైయాకరణ సంప్రదాయమే లెస్సగా ఉపకరించగలదు. కాబట్టి మనం సంస్కృత విశేషణాల్ని ఆంగ్లభాషాదృష్టితో ఎలా రూపొందించవచ్చునో ఈ భాగంలో చర్చించబోతున్నాం.

I. విశేషణాల్లో రకాలు 

(i) తరతమాలు :- ఆంగ్లవ్యాకరణాన్ననుసరించి ప్రతి విశేషణాన్నీ Comparative degree, Superlative degree (ఔపమికస్థాయి, ఆత్యంతిక స్థాయి) అని ఇంకో రెండు స్థాయులుగా విస్తరించి చెప్పడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి-

Good (మంచి) -> better (ఇంకామంచి) -> best (అన్నిట్లోకీ/ అందఱికంటేమంచి)

Bad (చెడ్డ) -> worse (ఇంకా చెడ్డ) -> worst (అందఱికంటే చెడ్డ)

High (ఎత్తైన) -> higher (ఇంకా ఎత్తైన) -> highest (అన్నిటికంటే ఎత్తైన) etc.

సంస్కృతంలో వీటిని తర, తమ భేదాలంటారు. ఎందుకంటే – Comparative degree ని సూచించడం కోసం విశేషణ పదానికి -తరమ్ అనీ, Superlative degree ని సూచించడానికి -తమమ్ అనీ చేఱుస్తారు.

ఉదా :-

పరమ్ = great

పరతరమ్ = greater

పరతమమ్ = greatest

పైవి నపుంసక లింగరూపాలు. వీటినే స్త్రీలింగ, పుల్లింగ రూపాలుగా కూడా మార్చి వాడుకోవచ్చు. ఉదా :-

పరుడు – పర/ పరురాలు

పరతరుడు – పరతర/ పరతరురాలు

పరతముడు – పరతమ/ పరతమురాలు

తర, తమ ప్రత్యయాల్ని విశేషణాలకే కాకుండా నామవాచకాలక్కూడా చేర్చడం ఉంది. ఇది ప్రధానంగా వైదిక సంప్రదాయం. ఉదాహరణకి-

రాజతరుడు గొప్పరాజు ; రాజతముడు అందఱి కంటే గొప్పరాజు

దేవితర గొప్ప దేవత ; దేవితమ అందఱి కంటే గొప్ప దేవత

నదితర - గొప్పనది ; నదితమ - అన్నిటి కంటే గొప్ప నది

అర్వాచీన కాలంలో ఇలా నామవాచకాలకి తర, తమాల్ని చేర్చే అభ్యాసం పూర్తిగా మఱుగున పడింది. వాటి బదులు ‘ఉత్తమ, రాజ, రత్న, ప్రముఖ, ప్రకాండ, తల్లజ, సత్తమ, అగ్రేసర, శ్రేష్ఠ’ ఇత్యాది శబ్దాల్ని సమాసించడం వాడుకలోకి వచ్చింది. ఉదాహరణకి,

బ్రాహ్మణోత్తముడు = గొప్ప బ్రాహ్మణుడు

పండితోత్తముడు = గొప్ప పండితుడు

గ్రంథరాజం = గొప్ప గ్రంథం

శ్లోకరాజం = గొప్ప శ్లోకం

సూక్తిరత్నం = గొప్ప సూక్తి

సుహృద్రత్నం = గొప్ప సుహృత్తు (మిత్రుడు)

వణిక్ ప్రముఖుడు = గొప్ప వ్యాపారి

మునితల్లజుడు = గొప్పముని

ఆచార్యసత్తముడు = గొప్ప ఆచార్యుడు

వీరాగ్రేసరుడు = గొప్ప వీరుడు

స్త్రీలింగ పదాల్ని మాత్రం ‘మతల్లి, లేక మతల్లిక’ అనే పదంతో సమాసిస్తారు. ఉదాహరణకి,

నదీమతల్లి = గొప్పనది

దేవీమతల్లిక = గొప్ప దేవత

ఔపమిక, ఆత్యంతిక స్థాయుల్ని సూచించడానికి సంస్కృతంలో తర, తమ ప్రత్యయాలనే కాకుండా –ఈయస్, -ఇష్ఠ ప్రత్యయాల్ని సైతం ఉపయోగిస్తారు. అయితే ఇవి సాధారణంగా రెండక్షరాల విశేషణాలకే పరిమితం. ఉదాహరణకి,

 1st exp

ఈ తెఱగు రూపాలు తెలుగులో ఎక్కువగా వాడుకలో లేవు.

(ii) క్రియావిశేషణాలు :- క్రియాధాతువుల నుంచి పుట్టేవి ఇవి. వీటిని తెలుగులో ‘అసమాపక క్రియలు’ అంటారు. ఎందు కంటే వీటితో వాక్యం సమాప్తి చెందదు. సంస్కృతంలో మాత్రం, చేసిన-, చేయబడిన-, చేస్తున్న-, చేసే-, చేయ బోయే- ఇత్యాదులు క్రియావిశేషణాలు. కారణం – ఆ భాషలో వీటిక్కూడా విశేషణాలకు మల్లే లింగ, వచన, విభక్తులు ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణలుగా తెలుగు పదాల్నే ఇస్తున్నాను. కానీ వీటి వివరణల్ని సంస్కృత పదాలకు అన్వయించుకోవలసినది.

చేసిన : దీన్ని క్తవత్ అంటారు. ఇది మనకు పెద్దగా అవసరపడదు. ప్రాచీన తెలుగుకవులెవఱూ దీన్ని ప్రయోగించలేదు.

చేయబడిన : దీన్ని ‘క్తాంతం’ అంటారు. ఇంగ్లీషులో Part Participle అంటారు. Past Participles నే విశేషణాల్లా.

వాడే అలవాటు ఆ భాషలో ఉంది కనుక వాటిని క్తాంతాలతో అనువదించడం ఉత్తమం.

చేస్తున్న : దీన్ని శత్రంతం అంటారు. శానజంతం అని కూడా అంటారు.

చేసే : దీన్ని ‘లుట్’ అంటారు.

చేయబోయే : దీన్ని ‘లృట్టు’ అంటారు.

వీటి సమాచారాన్ని 13 వ అధ్యాయంలో విపులంగా ఇవ్వడం జఱిగింది. పరిశీలించగలరు.

(iii) కొన్నిటిని నేరుగా సహజ (పూర్వాయత్త) విశేషణాలతోనే అనువదించాలి. వాటికోసం క్రొత్తగా లాక్షణిక నిర్మాణాలు చేయడం కృతకంగా ఉంటుంది. ఉదాహరణకి-

addicted to – (కి) మఱిగిన, బానిసైన ; casual – యథాలాపం ; chequered – ఎగుడుదిగుళ్ళ ; extempore – ఆశువు ; formal – శిష్ట ; garrulous – వాచాలుడైన ; globular – గుండ్రని ; hardcore – కఱుడుగట్టిన ; incidental – అవాంతర- ; mercurial – చంచలమైన random– గ్రుడ్డివేటు ; stentorian – మేఘగంభీరమైన ;

(iv) విశేషణాల ప్రయోగం అవసరం లేని సందర్భాలు :- మూలాంగ్ల నిర్మాణాలలో విశేష్యమూ, దాని విశేషణమూ వేఱు వేఱైనప్పటికీ తెలుగులో మాత్రం కొన్నిసార్లు నామవాచకాల్ని నామవాచకాలతోనే సమసించడం ద్వారా విశేషణాల భావాన్ని వ్యక్తీకరించవచ్చు. ఉదాహరణకి, ఈ క్రింది ఆంగ్ల, ఆంధ్ర పదనిర్మాణాల్ని పోల్చండి :

Administration – పరిపాలన ; Administrative officer – పరిపాలనాధికారి

America – అమెరికా ; American President – అమెరికా అధ్యక్షుడు

Constitution – రాజ్యాంగం ; Constitutional amendment – రాజ్యాంగ సవరణ

Discretion – విచక్షణ ; Discretionary powers – విచక్షణాధికారాలు

Environment – పర్యావరణం ; Environmental clearance – పర్యావరణ అనుమతి

Family – కుటుంబం ; Familial issues – కుటుంబ సమస్యలు

Literature – సాహిత్యం ; Literary festival – సాహిత్యోత్సవం

Mind – మనస్సు ; Mental agony – మనోవేదన

North – ఉత్తరం ; Northern India – ఉత్తర భారతం

Law – న్యాయం ; Legal aid – న్యాయసహాయం

Profession – వృత్తి ; Professional Education – వృత్తివిద్య

Religion – మతం ; Religious books – మతగ్రంథాలు

వీటిల్లో తొలి సమాసావయవం విశేషణంలా ప్రవర్తిస్తుంది.

II. మనకు ఏయే అర్థాల్లో విశేషణాలు అవసరమవుతాయి ?

ఆంగ్ల విశేషణాల్ని తెలుగులోకి అనువదించేటప్పుడు ఏదో అస్పష్టమైన అవగాహనతోనో, గ్రుడ్డివేటుగా దొఱికిన పదాల (random words) తోనో అనువదించడం మంచిది కాదు. మూలాంగ్లపదాలు ఎంతగా అందఱికీ తెలిసినవే ఐనా ముందు వాటి అసలైన అర్థాల్నీ, ఉపార్థాల్నీ క్షుణ్ణంగా మళ్ళీ తెలుసుకోవాలి. ఆ అర్థాలన్నీ తెలుగులో ఓపిగ్గా వ్రాసుకోవాలి. ఇంగ్లీషులో కాకుండా, తెలుగులో ఆలోచించడం మొదలుపెట్టాలి. మూలానుసారంగానే కాకుండా వైవిధ్యంగా కూడా ఆలోచించాలి. ఆ అర్థాలకు తగ్గ పదాలూ, ప్రత్యయాలూ, సమాస-అవయవాలూ ఏమిటై ఉంటాయా? అని ఊహించుకోవాలి. మన జ్ఞాపకశక్తి మనకు పూర్తిగా సహాయపడకపోతే నిఘంటువుల్నీ, వ్యాకరణ గ్రంథాల్నీ, అలాంటి మార్గదర్శనాల్నీ సంప్రదించే శ్రమ తప్పని సరిగా తీసుకోవాలి. అప్పుడే ఆ పదాల్ని అనువదించడానికి పూనుకోవాలి.

అనుకున్న అర్థంలో ఏ కొత్తపదమూ రాత్రికి రాత్రే పుట్టదు. ఇంతకు ముందున్న పాతపదాలు ఏ విధంగానైతే పరిణామం చెందుతూ వచ్చాయో, మనం కనిపెట్టిన కొత్తపదాలు కూడా మన మనస్సులలో అలాగే పరిణామం చెందుతాయి. ఉదాహర ణకి, triumphant అనే విశేషణానికి మనం మొదట ‘విజయగర్వి’ అనే సమానార్థకం బావుందని అనుకోవచ్చు. తరువాతి రోజుల్లో దాన్ని ‘విజయోత్సాహి’ అని మార్చుకోవచ్చు. ఆ తరువాత వేఱొకఱు ఈ రెంటి కన్నా ఇంకా మెఱుగైన పదాన్ని సూచించవచ్చు. ఇందులో మనకు రాగద్వేషాలు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మనం కొత్తపదాల్ని నిష్పాదించేటప్పుడు, ఎవఱో ఏదో అనుకుంటారనో, ఆమోదించరనో, లేక True translation అంటూ ఎగతాళి చేస్తారనో వెనుకంజ వేయకూడదు. పదాలేవీ స్వర్గంలోంచి ఊడిపడవు. వాటిని ఎవఱో ఒక భూలోక మానవుడు కల్పించాల్సిందేనని మఱువరాదు.

౧. ఆంగ్లంలో ఒక గణనీయశాతపు లాక్షణిక విశేషణాల్ని ‘సంబంధించిన’ అనే అర్థంలో వాడతారు. ఉదాహరణకి-

Alpahbet -> Alphabetical = వర్ణమాలకు సంబంధించిన (వర్ణమాలేయ/ అకారాదిక)

Bi – party -> Bipartite = ఇరుపక్షాలకు సంబంధించిన (ద్వైపాక్షిక)

Cardio -> Cardiac = గుండెకు సంబంధించిన (హార్దిక)

Cartography -> Cartographic = పటరచన (పటకర్మ) కు సంబంధించిన (పాటకర్మిక)

Cerebrum -> Cerebral = మెదటికి సంబంధించిన (మైధసిక)

Corpus -> Corporal = శరీరానికి సంబంధించిన (శారీరిక)

Corpus -> Corporate = సార్థవాహాలకు సంబంధించిన (సార్థవాహిక)

Culture -> Cultural = సంస్కృతికి సంబంధించిన (సాంస్కృతిక)

Locus -> Local = ఒక ప్రదేశానికి సంబంధించిన (స్థానిక/ ప్రాదేశిక)

Nation -> National = జాతికి సంబంధించిన (జాతీయ)

అదే విధంగా-

Decennial = పదేళ్ళకి సంబంధించిన (దాశాబ్దిక, దశవర్షీయ)

Epidermal = చర్మపు పైపొఱకు సంబంధించిన (పారిచర్మిక)

Electoral = ఎన్నుకునేవారికి సంబంధించిన (వారీతృక)

Fluvial = నదికి సంబంధించిన (నాదేయ)

Royal = రాజుకు సంబంధించిన (రాజకీయ)

Regional = ప్రాంతానికి సంబంధించిన (ప్రాంతీయ)

ఈ అర్థాన్ని స్ఫురింపజేయడానికి సంస్కృతంలో కూడా నామవాచకానికి వివిధ ప్రత్యయాల్ని చేఱుస్తారు. వీటిల్లో ముఖ్యమైనవి ఇకాంతాలూ, ఆదివృద్ధిమాత్ర విశేషణాలూ, యాంతాలూ, ఈయాంతాలూ, ఈనాంతాలూ, ఏరాంతాలూ, పరాంతాలూ.

(i) ఇకాంతాలు :- ఇక ప్రత్యయం చేఱే విశేషణాలు ఇకాంతాలు. ఇది చేఱేటప్పుడు ఆ నామవాచకం యొక్క మొదటి అచ్చుకు వృద్ధి వస్తుంది. వృద్ధి ముఖ్యంగా నాలుగు తెఱగులుగా ఉంటుంది.

(అ) ఆ పదం అకారంతో మొదలైతే ఆ అకారం దీర్ఘమవుతుంది. పదాది అచ్చు స్వతహాగానే ’ఆ’ కారం అయితే మార్పుండదు. ఉదాహరణకి-

అంగం -> ఆంగ -> ఆంగిక

అధునా -> ఆధున -> ఆధునిక

అర్థం (డబ్బు) -> ఆర్థ -> ఆర్థిక

అశ్వం -> ఆశ్వ -> ఆశ్విక

ఆత్మా -> ఆత్మిక

ఆయుధం -> ఆయుధిక

కర్మ -> కార్మ -> కార్మిక

కాలం -> కాలిక

గ్రంథం -> గ్రాంథ -> గ్రాంథిక

పక్షం -> పాక్షికం

ప్రథమ -> ప్రాథమిక

మనస్ -> మానస -> మానసిక

మాసం -> మాసిక

వర్షం -> వార్షిక

వాక్ (చ్) -> వాచిక

శబ్దం -> శాబ్ద -> శాబ్దిక

(ఆ) అది ఇకారం గానీ, ఈకారం గానీ, ఏకారం గానీ అయితే ’ఐ’ కారంగా మారుతుంది. అది స్వతహాగానే ’ఐ’

కారమైతే మార్పుండదు. ఉదాహరణకి-

ఇతిహాసం -> ఐతిహాస -> ఐతిహాసిక

ఐరావతం -> ఐరావతిక

గిరి -> గైరిక

ద్విపక్షం -> ద్వైపక్ష -> ద్వైపక్షిక

దేవ -> దైవ -> దైవిక

నీతి -> నైతిక

అటవి -> ఆటవిక

లింగం -> లైంగ -> లైంగిక

వీణ -> వైణిక (వైణికుడు)

వేదం -> వైద -> వైదిక

శైవాలం (నాచు) -> శైవాలిక

స్త్రీ à స్త్రైణ -> స్త్రైణిక

సేన -> సైన à సైనిక (సైనికుడు)

(ఇ) అది ఉకారంగానీ, ఊకారం గానీ, ఓ కారంగానీ అయితే ’ఔ’ కారంగా మారుతుంది. అది స్వతహాగానే ’ఔ’ కారమైతే మార్పుండదు. ఉదాహరణకి-

ఓషధి (మందుమొక్క) -> ఔషధిక

కుశ (దర్భ) -> కౌశ -> కౌశిక

గౌతమ (ఒక ఋషి) -> గౌతమిక

జ్యోతిస్ (వెలుగు) -> జ్యౌతిష -> జ్యౌతిషిక

భూత (పంచభూతాలు) -> భౌత -> భౌతిక

(ఉ) అది ఋకారమైతే ’ఆర్’ గా మారుతుంది. ఉదాహరణకి-

మృదంగం -> మార్దంగ -> మార్దంగిక (మార్దంగికుడు = మద్దెల వాయించేవాడు)

వృత్తి (వ్యాఖ్య) -> వార్తి -> వార్తిక

(ఊ) పదాది అక్షరం యకార సంయుక్తం గలదైతే తొలి సంయుక్త అవయవానికి ‘ఐ’ అనే అక్షరం ఆగమం అవుతుంది.

ఉదాహరణకు- వ్యాకరణం.

ఈ పదాన్ని ‘వ్ + య్ + ఆకరణం’ అని అర్థం చేసుకోవాలి. ఇందులో పదాది అక్షరమైన ‘వ్యా’ అనేది వకార – యకారాల

సంయుక్తం. ఈ సంయుక్తంలో మొదటి అవయవం వకారం. రెండోది యకారం. విశేషణాన్ని నిష్పాదించేటప్పుడు వకారానికి

‘ఐ’ అనే ఆగమాన్ని చేర్చాలి. ఆ తరువాతనే పదాంతంలో ‘ఇక’ ప్రత్యయం వస్తుంది. అప్పుడు-

వైయాకరణ -> వైయాకరణిక

న్యాయం -> నైయాయ -> నైయాయిక 

వ్యాసుడు -> వైయాస -> వైయాసిక

వ్యాఘ్రం -> వైయాఘ్ర -> వైయాఘ్రిక మొ||వి.

(ఎ) పదాంత అచ్చు ఉకారమైతే, ‘ఇక’ ప్రత్యయం చేఱబోయే ముందు అది ’అవ్’ గా మారుతుంది. ఉదాహరణకి,

పశు -> పాశవిక

వస్తు -> వాస్తవిక

మధు -> మాధవిక

బంధు -> బాంధవిక

జంతు -> జాంతవిక

 (తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, ఆగస్టు, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.