feather cloud

ఆవిరి

Download PDF    ePub   MOBI
పెంకుటిళ్ల వెనకనుండి సాయంకాలాలు  పైకిలేచే పొగ
సుళ్ళెత్తిన గాలిలో శివాలెత్తిన తెల్లఈక
కదిలే వాహనానికి ఎదురొడ్డి పరిగెడుతూ చెట్లూ, గట్లూ
వీటి ప్రయాణం లోపలికా, గుండ్రంగానా?

*

“మరెప్పుడో కాదు, ఈరాత్రికే అంతా- అంతా మనం అనుకున్నట్టే ” అని నువ్వన్నప్పుడు పైకిచూసి తలొంచుకుని మళ్ళీ గోరుచిక్కుళ్ళు వలుచుకుంటుంటే- “నమ్మవని తెలుసు, మరెలా?” అనుకుంటూ పాత కాగితాలన్నీ వెదకడం మొదలెట్టావు. నీక్కావల్సిన రుజువు వాటిల్లో లేదని తెలిసి కూడా. “ఆరోజూ నువ్విలాగే చెప్పలేదూ! అదే ఆ సాయంత్రం గ్లాసులో టీపైన మీగడ కట్టేసినప్పుడు” అని నింపాదిగా చెబుతానా… సర్దుతున్న గుండుసూదులు, ఎప్పటివో శుభలేఖలు, పాత కరెంటు బిల్లులు ఒక్క ఉదుటున పడేసి తొందరగా వచ్చి మోకాళ్ల దండేసుకుని “అవును కదా! గుర్తొచ్చిందిగా, అలాగే ఇదీనూ!” అన్నావు వివరంగా చెప్పడం చేతగాకపోవడం వల్ల వచ్చిన ధీమాతో.

“ఐతే ఈ పూట వెల్లుల్లీ వెయ్యనా చిక్కుళ్లలో”

“నీకు భలే గుర్తూ! ఆరోజూ వేసుకున్నాం ఇలానే. అప్పుడు టైమెంతైందని నువ్వడిగి నేను చూసి చెప్పేలోపు నువ్వడిగినప్పటి టైమ్ మారిపోయింది కదా! ఇంకానేమో…” ఈలోగా రోడ్డుమీద కంకర గుమ్మరిస్తున్న చప్పుడు వంటగిన్నెల్లోంచి విసవిసమంటూ పైకిలేచింది.

*
“ఈ కవరు ఆ ఊరికి పంపాలి”

తుళ్ళిపాటు లేకుండానే నిద్రలోంచి ప్రశ్నలోకి నవ్వుతూ చొరబడ్డాడతను “ఇంత ఎండలో వచ్చారేం?” అంటూ-

“ఇది మొదటిసారి కాదుగా! పదేళ్లక్రితమోసారి ఇలాగే వచ్చాను గుర్తులేదూ? ఐనా అప్పుడున్నది మీరు కాదుకానీ మీక్కూడా గుర్తుండే ఉండాలి. ఈ పోస్టాఫీసు కూడా అప్పుడు వేరే ఊర్లో ఉంది లెండి. నవ్వుగా ఉంది ఇదివరిలా వానలో రానంతమాత్రన మీరు నన్ను మర్చిపోవడం.. అంతే కదూ మనందరం? అసలదేగా తమాషా అంతానూ” ఏమంటారన్నట్టు అతని కనుబొమల వైపు చూశాను. అక్కడ అంతకుముందటి ముళ్ళు విడిపోయాయి.

ఆ గది నిండుకూ నవ్వేస్తూ అన్నాడు “నాకర్ధమయిందిలెండి. ఈ కవరుపైన మీ చేతిరాతలో అడ్రెసూ, దానికంటుకున్న కాఫీ మరకా, ఇవి పంపడానికేగా లోపలేదో పుస్తకమో, పాతచొక్కానో, ఉంగరమో పెట్టి ఉంటారు బరువు తూగడం కోసం.”

*
పగలంతా పగలబడ్డ ఎండ తరఫున క్షమాపణ అడగటానికి మొహమాట పడ్డట్టు సాయంత్రం కొద్దిగా జల్లుపడి ఆగినప్పుడు; సరిగ్గా అప్పుడే- మల్లెమొగ్గలబ్బాయి సందు చివర సైకిలాపి గట్టిగా కేకలేస్తాడు. పోయిన వేసవి కాలంగా అతనంతే- మల్లెలు లేనప్పుడు కూడా; ఒక్కోసారి “మంచు మొగ్గలోయ్” అనీ అరుస్తాడు.

ఇప్పుడూ- చీమల బారొకటి అటుగా వెళ్తూ ఉంటుంది. ఎండనపడి ఎక్కడినించో వచ్చి చెంబెడు నీళ్ళు కుమ్మరించి కళ్ళు కడిగేస్తావు వాటిపైన, అటు చూడకుండానో లేక “ఆ ఏముందిలెద్దూ” అనో. అర్ధం కాలా? అంతేగా నువ్వైనా నేనైనా ఎప్పుడోసారి?

*

(Image Courtesy: http://www.flickr.com/photos/70481575@N00/111339489)

ఆవిరి Download PDF     ఆవిరి Download ePub     ఆవిరి Download MOBI

బాహ్య లింకులు:

స్వాతికుమారి పుస్తకాలు కినిగెలో ఇక్కడ 

స్వాతికుమారి బ్లాగు ఇక్కడ 

Posted in 2013, డిసెంబరు, మ్యూజింగ్స్ and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.