coverkottapustakaalu

కొన్ని కొత్త పుస్తకాలు – సెప్టెంబరు 2014

కొసరు కొమ్మచ్చి

రచన: ముళ్లపూడి శ్రీదేవి, వరా ముళ్లపూడి, ముళ్లపూడి అనూరాధ, ఎమ్బీయస్ ప్రసాద్ & బివియస్ రామారావు

KosaruKommachi

కోతికొమ్మచ్చి పుస్తకాల్లో ముళ్లపూడి బాపుల ప్రపంచాలు జమిలిగా మన ముందు ఆవిష్కృతమవుతాయి. కానీ వాళ్లకు దన్నుగా వెనుకనున్న హోంఫ్రంటు గురించి పెద్దగా తెలియదు. సినిమాల్లో పత్రికల్లో ముళ్లపూడి బాపుల సంగతి సరే, ఇద్దరూ ఇంట్లో ఎలా ఉండేవాళ్లు? ఈ పుస్తకంలో ముళ్లపూడి కుటుంబం (భార్య, కొడుకు, కూతురు), ముళ్లపూడి సన్నిహితులు, స్నేహితులు (ఎమ్బీయస్ పసాద్, బివియస్ రామారావు) రాసిన జ్ఞాపకాల నెమరువేతలున్నాయి. ముళ్లపూడి అనూరాధ రాసిన రచన ‘నాన్న మామ మేము అను తోకకొమ్మచ్చి’ నుంచి మచ్చుకు ఒక అనెక్డోట్:—

నాన్నకీ మామకీ చాలా విషయాలు కామన్. చాలా వాటిల్లో సేమ్ టేస్ట్, సేమ్ అలర్జీస్ వుండేవి. అంతకు రెట్టింపు విషయాల్లో వాళ్ళిద్దరూ డిఫరెంట్. మామ యెప్పుడూ పంక్చ్యువల్. వెళ్ళేది షూటింగుకైనా సరే, సినిమా ఐనా సరే, ట్రెయిన్ స్టేషన్ అయినా సరే, రెస్టారెంట్కి అయినా సరే ఆల్వేస్ ఆన్ టైం. నిజం చెప్పాలంటే ఈవెన్ బిఫోర్ టైం. నాన్న కూడా ఆన్ టైమే కాని ఆయన ఓన్ టైం. సాయంత్రం ఆరు గంటలకి ట్రెయిన్ అంటే, మామ రెడీ అయిపోయి, సరిగ్గా రెండున్నరకి కిందకి వొచ్చేస్తారు. మాతో కాసేపు జోక్ చేసి, ఇంక వాచీని చూడడం మొదలుపెడతారు. నాన్నేమో మజ్ఝాన్నం నిద్రలో వుంటారు. మెల్లగ మూడున్నరకి బయటికివస్తారు. “యేవయ్యా వొచ్చేశావా, కాఫీ తాగుతావా? ఇదుగో శ్రీదేవీ…!” ముందు మామ సాఫ్ట్‌గా “నాకు కాఫీ వొద్దయ్యా, నువ్వెళ్ళి రెడీ అవ్వు “ అంటారు… తరవాత, నాన్న వేడి వేడి కాఫీ మెల్లగా సిప్ చేస్తూవుంటే, మామకి బాయిలింగ్ పాయింట్ దగ్గిరౌతూ వుండేది. ఇక నాలుగు గంటలకల్లా ఓర్పు, తూర్పుకి తుర్రుమనేది, ఒక్క సారి: వెళ్ళవయ్యా.. ట్రెయినుకి లేట్ అవుతోంది అని గట్టిగా అరిస్తే, అప్పుడు, నాన్న మెల్లగా ఆ కాఫీ కప్ కింద పెట్టి.. “ఆ, ఇంక టైము ఉంది కదయ్యా, తొందర యేల…” అని లోపలకి వెళ్ళేవారు… ఆ వోల్కనో ఎరప్షన్ లాగ వొచ్చిన కోపం మామకి 30 సెకండ్లు కూడా వుండేది కాదు. మళ్ళీ నాన్న రెడీ అయ్యి బయటకి వొచ్చేసరికి, అంతా మామూలే, జోక్సు, తిండి, ట్రెయిను… మేము పక్కన కూచ్చుని ఇవ్వాళ యెంత సేపటికి మామకి బరస్టింగ్ పాయింట్ వొస్తుంది అని చూస్తూ వుండేవాళ్ళం.

 

ప్రింటు & ఈబుక్స్ లభ్యం 

*

కథ నేపథ్యం 2

కథల, కథానేపథ్యాల సంకలనం (తానా ప్రచురణ)

KathaNepathyam

34 మంది కథకుల కథలు, వాటి నేపథ్యాలే ఈ సంపుటం. ఆర్. యమ్. ఉమామహేశ్వరరావు, జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్‍ల సంపాదకత్వంలో తానా ప్రచురించిన పుస్తకం ఇది. కథ నేపథ్యం సంపుటాలలో ఇది రెండవది. మొదటి దాంట్లో పాతతరం కథకులుంటే, ఈ రెండోసంపుటంలో సమకాలీన రచయితలకు ప్రాముఖ్యత ఇచ్చారు. రమణజీవి, బి. అజయ్ ప్రసాద్, పెద్దింటి అశోక్ కుమార్, ఓల్గా, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, ఖదీర్‌బాబు, కుప్పిలి పద్మ ఇత్యాది కథకుల ప్రముఖ కథలూ, వాటి వెనుక నేపథ్యాలూ ఉన్నాయి. అటు పఠనాసక్తి పాఠకులనూ, ఇటు రచనాశక్తి వున్న పాఠకులనూ రంజింపజేసే పుస్తకం.

ప్రింట్ & ఈబుక్స్ లభ్యం

*

ముగ్గురు కొలంబస్‌లు

రచన: సోమరాజు సుశీల

MugguruKolumbuslu

ఇల్లేరమ్మ మళ్లీ వచ్చింది. ఈసారి అమెరికా కబుర్లతో. అన్వర్ బొమ్మలతో. “అనుభూతులు అనుభవాలూ చూసేవాళ్లనిబట్టి వుంటాయి. ఇందులో ఉన్న అమెరికా అబ్జర్వేషన్లు డా. సోమరాజు సుశీలవి. విమానంలోంచో, రైల్లోంచో, కారులో వెళ్తూనో చూస్తే దేశం అంతు పట్టదు. ఆ నేల మీద దిగాలి. అక్కడి గాలి పీలుస్తూ ఆ మనుషుల నైజాలను సంస్కారాలను సక్రమంగా అంచనా వేసుకోవాలి. అచ్చోటి సంస్కృతిని అవగతం చేసుకోవాలి. అంతే ఆ ప్రాంతన్ని మరోసారి కనిపెట్టడమే అవుతుంది. కథలు – కథనాలలో మనం అహ్లాదపడే భోగట్టా ఉంది. దాని తాలూకూ అంతరంగమూ ఉంది. ప్రపంచదేశాల వారంతా సహజీవనం చేస్తూ అవకాశల అమెరికా నేల మీద కనిపిస్తారు. అక్కడ వినిపించే వివిధ సంస్కృతుల సంగీతం ఏడు రంగుల ఇంధ్రధనుసులా కమనీయంగా కనిపిస్తుంది. ఆ వాద్యస్వర సమ్మేళనానికి అక్షరరూపం యీ రచన.”

ఈబుక్ లభ్యం

*

అపరిచితం

రచన: నరేష్ నున్నా

Aparichitam

మన తరపు మేటి వచన రచయితల్లో ఒకరైన నరేష్ నున్నా రచన ఇది. ఒక ఆమె గురించి: “నిజానికి నేను తేరిపార చూసింది ఆమెను కాదు. సర్దుకోని అలక్ష్యానికి ఒత్తైన ఒంకీల అలలై భుజాలపైకి జీరాడుతున్న ఆకాశవల్లి అడివితీగల్ని కాదు; పలకరింపు నవ్వులు చక్కిలిగుంటల బుగ్గలై ఊరితే చికిలించుకుపోయిన రెండు కాంతిపుంజాల్ని కాదు; ఏ కాలాలు దాయలేని ఏడు మల్లెలెత్తుని నిరలంకారం చేయాలని చూస్తున్న బోసిమెడని, నగ్న పాదాల్ని కూడా కాదు. కనిపించని క్రమశిక్షణతో కలగలిసిన రంగులు కుంచె అంచుల్లోంచి చిక్కగా జారి పాలరాతి గచ్చు మీద వేసిన abstract painting వంటి ఆమెని కానే కాదు, నేను తదేకంగా చూసింది. ఆ మాటకొస్తే, నేను తనని చూడటం అదే మొదటిసారి కాదు. అంతకుముందు ఎన్నోసార్లు చూశాను. చూశానని తెలుసు కానీ, ఎప్పుడు, ఎక్కడ.. అన్నది గుర్తు రాకపోవడం వల్లే అలా చూపులా అనిపించే ప్రయాణం చేశాను, గడిచిన యుగాల్లోకి, గత జన్మల్లోకి.”

ప్రింట్ & ఈబుక్స్ లభ్యం

*

లోయ నించి శిఖరానికి

రచన: యండమూరి వీరేంద్రనాథ్

LoyaNunchiSikharaniki

విద్యార్థులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ “మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి” అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.

“ఏ వయసులో?” అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, “ఇరవై అయిదేళ్ళకి” అంటారు.

“అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళవుతుందా? (నవ్వులు). అసలు పైకి రావడం అంతే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్ఫై ఏళ్ళకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లి తండ్రులని అనాధాశ్రమంలో చేర్చాడు మీరు జీవితంలో పైకి వచ్చినట్లా?”

పెద్దవాళ్ళు కూడా అంత తొందరగా సమాధానం చెప్పలేని ప్రశ్న.

 శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే “స్వార్థాన్ని పెంచడం” అన్న కొందరి అభిప్రాయాలని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయలపైగా అమ్మకాలు సాధించిన ‘విజయానికి అయిదు మెట్లు’ రచయిత అందిస్తున్న మరో మాస్టర్ పీస్ – “లోయ నుంచి శిఖరానికి”.

ప్రింట్ & ఈబుక్స్ లభ్యం

*

నదీమూలం లాంటి ఆ ఇల్లు

రచన: యాకూబ్

NadeemoolamLantiAaIllu

అట్టడుగు వర్గాలలో పుట్టి జీవితం నేర్పిన అపురూప, అరూప పాఠాల మధ్య ఉత్తమశ్రేణి కవిగా, తెలంగాణ రచయితలలో గొప్ప మానవీయ విలువలు ప్రవచించే రచయితగా యాకూబ్ రూపుదిద్దుకున్నాడనే చెప్పాలి. ‘నదీమూలంలాంటి ఆ ఇల్లు!’ సంపుటిలో ప్రత్యేకత ఏమిటంటే యాకూబ్ రాసిన వచన కవిత రూపంలో, సారంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒకానొక చారిత్రక సందర్భం రూపుదిద్దుకున్నప్పుడు దాని ప్రభావం కళారూపాలపై ప్రసరించి అవి కొత్తగా రూపాంతరం చెందడం ఖాయం. గతితార్కికత అంటే అదే. పాతది రద్దయింది అంటే దాని స్థానే కొత్తది పురుడు పోసుకున్నట్లే. ఈ సంకలనంలో యాకూబ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న వచన కవితా రూపం కొత్తది. వచన కవితకు సి. నారాయణరెడ్డి, మహాస్వప్న, అజంతా, కె. శివారెడ్డి పెట్టింది పేరు. వారివలె యాకూబ్ తన శైలిని రూపొందించుకున్నాడు. విచిత్రంగా శైలిరూపాలే కాక, కవితా వస్తువు, ఇతివృత్తాలు కూడా చాలా కొత్తవి. ప్రతీకలు, భాష మారడం కూడా చూడొచ్చు. క్లుప్తంగా రాసిన కొన్ని కవితలతో బలమైన మనోభావాలను పలికించాడు. ఒక కవితలో కొండను, మరో కవితలో చినుకును ఆలంబన చేసుకుని పొందుపరిచిన భావాలు, ఈస్తటిక్స్ దృష్ట్యా విలువైనవి. ఒకరకంగా చెప్పాలంటే కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో కొత్తగా వెలువడుతున్న కవితా సంపుటి “నదీమూలంలాంటి ఆ ఇల్లు!”. – సామిడి జగన్‌రెడ్డి

ఈబుక్ లభ్యం

*

ఈ తరం పిల్ల

రచన: కె. రామలక్ష్మి

EeTaramPilla

 

“‘మనం ఆడపిల్లల్ని చుట్టూ ముళ్ళకంచె వేసి ఎన్నాళ్ళు రక్షిస్తామయ్యా! రేపు నేను చచ్చిపోతే కట్టుకున్నవాడు ఇంకో కంచె వేసి కాపాడాలి. వాడు పోయాక – వాడి చుట్టాలూ పక్కాలూ. ఎన్నాళ్ళని వాళ్ళ బ్రతుకిలిలా చేస్తాం చెప్పు? ఎన్నాళ్ళని ఎగరకుండా రెక్కలు కత్తిరించి ఎగరమంటాం చెప్పు? కన్నవాళ్ళం మనమే వాళ్ళకి బ్రతకడం నేర్పకపోతే ఇంకా ఎవరైనా ఎందుకు నేర్పాలి?’ “

ఈబుక్ లభ్యం

*

మూవీ మొఘల్

రచన: యు. వినాయకరావు

MovieMoghal

“డాక్టర్ రామానాయుడు ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆయన జీవితం అంతగా మమేకమైంది. చిత్రరంగంలోకి అడుగుపెట్టే ప్రతి నిర్మాత ప్రారంభదశలో పరిశీలించే డిక్షనరీలాంటి వ్యక్తి రామానాయుడు. ఆయన జీవితం తెరచిన పుస్తకంలాంటిది. ఆ విషయం తెలిసినా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు … భారతీయ సినీ రంగానికే మకుటాయమనంగా నిలిచిన ఈ ఆదర్శ నిర్మాత విజయ ప్రస్థానాన్ని మరోసారి ఆవిష్కరించే సాహసం చేస్తున్నాను. ఐదు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమతో విడదీయరాని బంధం అనుబంధం ఏర్పరచుకున్న రామానాయుడు గురించి పుస్తకం రాయాలంటే తెలుగు సినీ చరిత్ర లోని కీలక అంశాలను ఆమూలాగ్రం స్పృశించినట్లే . ఏడాదిపాటు నిర్విరామంగా సాగిన ఈ అక్షర క్రతువుకి పుస్తకరూపం ‘మూవీ మొఘల్’. ఇప్పుడు పుస్తకం మీ చేతుల్లో ఉంది. నేను ఏ మేరకు విజయం సాధించానో తేల్చి చెప్పాల్సింది మీరే.” అంటున్నారు రచయిత.

ప్రింటు & ఈబుక్స్ లభ్యం

*

వాళ్ళు ఆరుగురూ

రచన: చలం, ఓల్గా

ValluAruguru

“చలం సృష్టించిన ఆరు స్త్రీ పాత్రలు (సుందరమ్మ, శశిరేఖ, పద్మావతి, రాజేశ్వరి, అరుణ, లాలస) ఒకేచోట తారసపడి తమ జీవితాను భవాలను, అన్వేషణలనూ ఒకరితో ఒకరు పంచుకోవడం అంటూ జరిగితే ఆ ఉద్వేగభరిత సందర్భం మనకు కొత్త పాఠాలను మిగిల్చిపోగలదు. తాము చేసినవి ఒంటరి పోరాటాలు కావనీ, లేవనెత్తిన ప్రశ్నలు ఈనాటికీ మౌలికమైనవే అనీ వారంతా గుర్తించినప్పుడు పాఠకుల హృదయాలలో వారు దిగవిడిచిన విషాదానికి చారిత్రకమైన ఓదార్పు లభిస్తుంది. ఇవాళ్టి యువతరం చేస్తున్న పోరాటాల్లో, అవి రాజేస్తున్న చైతన్యంలో చలం మానసపుత్రికలు భాగస్వాములైపోతారు. ఇదీ “వాళ్ళు ఆరుగురూ” అనే ప్రయోగాత్మక నాటిక చేయబూనిన సాహస ప్రయత్నం.” అంటున్నారు రచయిత ఓల్గా.

ప్రింటు పుస్తకం లభ్యం

*

అమూల్యం

రచన: నండూరి సుందరీ నాగమణి

Amulyam

ఈ కథల గురించి సినీ గేయరచయిత భువనచంద్ర ఇలా అంటున్నారు: “రచన రచయిత/లేక/రచయిత్రి సంస్కారాన్ని ప్రతిబింబిస్తుందనడనికి యీ కథాసంకలనం ఓ ఉదాహరణ. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా తప్పటడుగుల నించి దృఢమైన వ్యక్తిత్వానికి ఎదిగిన రచనలు నాగమణిగారివి. ఈ కథల్ని నేను సామాన్య పాఠకుడిగానూ, కథల్ని ప్రేమించే మామూలు మనిషిగానూ చదివాను. ‘ఇమాజినేషన్‌ యీజ్‌ గ్రేటర్‌ దేన్‌ నాలెడ్జ్’ అన్నారు. ఐన్‌స్టీన్‌గానీ, టీవీలుగానీ, సినిమాలుగానీ…, ఊహాశక్తిని పెంచవు. వారు ఏది వూహించి చూపిస్తే అదే మనం చూడలి. పుస్తకాలు అలా కాదు. ప్రతి పాత్రా మనకిష్టం వచ్చినట్టు మన ‘వూహ’లోనే రూపుదిద్దుకుంటుంది. అందుకే చదవండి… చదివించండి.”

ఈబుక్ లభ్యం

for regular updates, like Kinige Patrika facebook page.

*

 

 

Posted in 2014, కొత్త పుస్తకాలు, సెప్టెంబర్ and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.