cover

తమామించిన మా మూలింటవ్వ తెలివి

Download PDF ePub MOBI

మామూలింటవ్వగురించి ఇంతకుముందే కొంచిం సెప్పుండానా. ఇంకిది సెప్పుకుంటే ఆమి గొప్పతనం మీకెట్లా తెలస్తాది.

మాయవ్వకు శానా ఓర్పుండాదని, పల్లెత్తి పసిబిడ్డినైనా కరుగ్గా ఒకమాటనదని తెలుసా మీకు. శానా అమాయికంగా కన్పించే మా యవ్వలో మాంతమైన తెలివితేటలుండాయనే ఇసయం మాత్రం మీకు తెల్దు.

సిన్నోళ్లను ఎంతో పెద్దోళ్లనుకోని మర్యాదియ్యడం ఆమికున్ని మితిమీరిన తెలివి. అందరూ ఆయమ్మకంటే గొప్పోళ్లే అనుకొనే సొబావం మా యవ్వది. ఈడ ఆయమ్మను తక్కవజేసుకుంటా వుండాదంటే కించపర్సుకోవడంగాదు. డంబం గింబం లేకపోవడం. కొవ్వుబట్టిందంటారే అట్లాంటి కొవ్వులేదు మాయవ్వలో. ఎంతో అణకువగా వొదిగిమదిగుంటాది.

నేనూ, మాయక్క, సెల్లి ఆయమ్మకు కూతురు బిడ్లుగదా! అంటే మేము సొంత మనమరాండ్లు. మమ్మల్ని కట్టుకున్నోల్లు ఆయమ్మకు మనవళ్ల కిందేగదా లెక్క.

మేము మాయమ్మగారింటికి బొయినప్పుడు మాయవ్వను సూడాల్నా వొద్దా. వొద్దంటే ఎట్ల కుదర్తాది. సిన్నప్పుడు మమ్మల్ని అత్తారుబత్తెంగా సాకి సంతరించింది మాయవ్వేగదా! అయితే అదేం సేటుగాలమో వూర్లో అడుగుబెట్టిన రొండుమూడు దినాలుగ్గాని మాయవ్వను సూడ్నుబోము. అందరూ కలిస్తే ఆ మాటా ఈమాటా మాట్లాడుకుంటా సెయ్యాల్సిన ప్రెతిపనినీ వాయిదా ఏసేస్తా వుంటాము.

మా యవ్వ మేం బొయ్యి సూసేదాకా వుండదు. ఆ సివర్నుంచి ఈ సివరుండే మాయింటికొస్తాది. సేతిలో కట్టి గూడా ఎత్తుకోదు. ఆ మాటే మా యవ్వతో అంటే ‘కట్టిబట్టుకోని ఈదిగుండా నడ్సొస్తావుంటే మానం మూడుగాసులకు పోదా!’ అంటాది. ‘ఎందుకు బోతాది మానం?’ అంటామా. ‘సూసినోళ్లు నవ్వుకోరా పాపా, ముసిల్దొకమూల బడుండక ఎట్టికొచ్చిన కస్తూరి నా ముడ్డికి పుయ్యండని ఇల్లిల్లు తిరగతా వుండాదనీ, కట్టి బట్టుకోని నడ్సేంత బొగిశాట్ల సేటు ఇంగోటుండదు’ అని కట్టిర్సినట్లంటాది. అమాయికంగా జెప్పినా ఆమిమాటల్లో మితిమీరిన తెలివితేటలుండాయి.

సరే! ఇంటికొస్తాదా, మా మొగోళ్లంతా కుర్సీల్లో కుసోనుంటారా. ‘బాగుండారానా’ అని అడగతాది. ‘బాగుండామవ్వా రా కూసో’ అంటారా. ఊహూఁ ఎంత సెప్పినా కూసోదు. ‘మేమే వస్తాంగదా! ఆన్నించి కాళ్లీడ్సుకుంటా ఎందు కొస్తివం’టే ‘మీరైతే పసిపిలకాయిలు. ఏరే గెవనాలుంటాయి మీకు. అందుకని మమ్మల్ని సూడాలనున్నా బిరీన రాలేరు. నాకు ఎప్పుడెప్పుడు సూద్దారా పిలకాయిల్నని ఆత్రంగా వుంటాది. ఆడకూసోని కలవరం బెట్టుకొనే బదులు వొచ్చేస్తే అందర్నీ సూసినట్లుంటాది గదా!’

‘సరేవ్వా, వొచ్చినావు కూసో’ అంటామా.

‘మీరు గొమ్మునుండండొసే. వగాతగా ల్యాకుండా పెద్దేళ్ల ముందర కూసోమని బాగా జెప్తారు’.

‘వాళ్లు నీకంటే పెద్దోళ్లావ్వా? నీ మనుముళ్లవ్వా వాళ్లు’

‘మొగోళ్లు పెద్దోళ్లే గదా! వాళ్ల ముందర ఆడముండలెవురైనా కూసుంటారా? నాకు ఏమి తెలీదనుకుంటారేమో! నేను మీ కంటే నాలుగాకులెక్కువే సదిమినాను’

‘యా పస్తకంలో (మా యవ్వ పుస్తకాన్ని పస్తకమనే అంటాది) సదివినావవ్వా? అంటామా ఎగతాళిగా.

‘నువ్వు బోయోసెయ్‌’ అని మొగం దిప్పుకుంటాది’ మాకు నవ్వు నవ్వుగాదు.

‘మొగాళ్ల ముందర మేము కూసుంటా వుండ్లా కుర్సీల్లో’

‘రాముడి పక్కన సీతాదేవి కూసుంటే తప్పులేదులే’ తలకుమించిన తెలివితో జవాబిస్తాది.

మాయమ్మ సచ్చిపోయిందా. ఆయమ్మ పోటో వుండాది హాల్లో పెద్దది. వొచ్చినప్పుడంతా దాని ముందు నిలబడి దండం బెట్టుకుంటాది.

‘నాకంటే ముందే దాటుకుంటివాక్కా. ల్యాందర పిలకాయిల్ని ఇడ్సిపెట్టి పోతివే’ అని కండ్ల నీళ్లు బెట్టుకుంటాది.

‘కూతుర్నేందవ్వా ‘‘అక్కా’’ అనేది’ అంటే

‘మీకు తెలీదూరుకొండసే. ఆయక్క మూడు దంకా సదుంకొనింది అచ్చరం ముక్కరానిదాన్ని ‘అక్కా’ అనకుండా ఇంగేమని పిల్సేది’ అంటాది ఇది మాయవ్వకుండే ఎక్కాతుక్కా తెలివిగాదా!

మాయవ్వకు సొంతంగా పుట్టిన తెలివి ఇంతా అంతాగాదు. ఒకదినం వాళ్లాడబిడ్లు గురించి సెప్తావుంది. రొండో ఆమె పేరు సెప్పింది. ఎవురో మా కర్తంకాలా. ఆయమ్మ పేరు మీకు తెలిసుండదులే. ఎందుకంటే ఆయమ్మ మనింటికొచ్చిందేలేదు. ఆయమ్మ పేరు జెప్పని వూర్లో వుంటాదిలే అనింది.

‘పేరు జెప్పని వూరా?’ వూరిపేరే అదా, అంటే కాదు. మా రొండో ఆడబిడ్డి పేరు జెప్పని వూర్లో వుంటాది. సామిరెడ్డి పల్లి పక్కనే వుందావూరు.

సామిరెడ్డి పల్లి పక్కనూరన్న్యాక ‘వరదరాజుల పల్లా? ఆ పల్లిలోనా మీ రొండో ఆడబిడ్డుండేది’

‘వూఁ ఆయమ్మే ఆ వూర్లోవుండేది. ఆయమ్మ కూతురు మన శ్రీన్రెడ్డి బార్య దనలచ్చిమి’.

‘ఆ యమ్మసరే. వాళ్లవూరు వరదరాజుల పల్లె అయితే పేరు జెప్పని వూరంటావేందవ్వా?’ అని తల బట్టుకొంట్ని నేను. మా యక్క గూడా నెత్తి గొట్టుకునింది.

‘ఆ పేరు నా నోటితో సెప్పొచ్చా? అది మీ తాతపేరుండే వూరని తెలీదా మీకు. సదవేస్తే మీకు వుండే మతి గూడా బోయింది. అందుకే మీకద్దెల్సుకోవడానికి ఇంతసేబ్బట్టింది’ మా సదువులు సంకనాకి పోతావుండాయనే బాదను మొగంలో సూపెట్టింది మాయవ్వ.

ఇంతకూ మా తాతపేరేందో తెల్సా మీకు? వరదారెడ్డి.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఇర్లచెంగి కథలు, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.