cover

పదనిష్పాదన కళ (18)

Download PDF ePub

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

(ii) ఆదివృద్ధిమాత్ర విశేషణాలు :- పైవిధంగా ‘ఇక’ ప్రత్యయాన్ని చేర్చకుండానే పదాది అచ్చుని వృద్ధిగా మార్చడం ద్వారా కూడా విశేషణాల్ని నిష్పాదిస్తారు. ఇలా నిష్పన్నమైనవాటిల్లో కొన్ని కాలక్రమేణా వ్యవహారంలో నామవాచకాలుగా స్థిర పడ్డాయి.

ఉరస్ (హృదయం) -> ఔరసుడు (కోరుకుని కన్న కొడుకు)

ఏణం (జింక)  -> ఐణం (జింకచర్మం)

కర్మ (పని) -> కార్ముడు (పనిచేసేవాడు)

కుముదం (తెల్లకలువ) -> కౌముది ( వెన్నెల = తెల్లకలువల్ని వికసింపజేసేది)

ఛందస్ (వేదం) -> ఛాందసుడు (వేదాధ్యయనం తప్ప ఇంకేమీ తెలియనివాడు, ఇంకేదీ ముఖ్యం కానివాడు)

తిల (నువ్వులు) -> తైలం (నూనె = మొదట్లో నువ్వుల నుంచి మాత్రమే తీయబడేది)

తేజస్ (అగ్ని) -> తైజసం (లోహం = అగ్నిలో కఱిగేది)

ధూర్ (కాడి) -> ధౌరేయం (కాడి మోసేది = ఎద్దు ; ధౌరేయుడు = సమర్థుడు)

పంథా -> పాంథుడు

పయస్ (పాలు) -> పాయసం (పాలతో కలిపి వండిన అన్నం)

పురం (ఊరు)  -> పౌరుడు (ఊరి వాస్తవ్యుడు)

సూరుడు (సూర్యుడు) -> సౌర (శక్తి, సౌర కుటుంబం మొ|| )

(iii) యాంతాలు :- పదాంత అచ్చు స్థానంలో ‘య’ ప్రత్యయాన్ని చేఱుస్తారు. కానీ ఇలాంటి నిర్మాణాల్లో హెచ్చుశాతం కాలక్రమేణా నామవాచకాలయ్యాయి. ఉదాహరణకి-

అహస్  -> అహస్యం (పగటిపూట చేయదగినది)

ఆచారం -> ఆచార్యుడు (ఆచారాన్ని నేర్పేవాడు)

ఈశాన -> ఈశాన్యం

వాయు  -> వాయవ్యం

కవి -> కావ్యం

రాజా -> రాజ్యం

తపస్ -> తపస్య (అదే)

నమస్ -> నమస్య (అదే)

పథం -> పథ్యం (వైద్యుడు సూచించిన ఆహారమార్గం)

పాదం -> పాద్యం (కాళ్ళు కడుక్కోవడానికి)

భృతం -> భృత్యుడు (జీతం తీసుకుని పనిచేసేవాడు)

రథం -> రథ్య (ప్రధాన రహదారి, పలు రథాలు వెళ్ళదగ్గ మార్గం)

రహస్ -> రహస్యం (అదే)

వనం -> వన్యం (అడవిజంతువు)

వీర (పురుషుడు) -> వీర్యం (అతనికి సంబంధించినది)

పదాది అక్షరం సంయుక్తమైతే ‘ఇయ’ ప్రత్యయాన్ని చేర్చాలి. ఉదాహరణకి,

సముద్రం -> సముద్రియం

(iv) ఈయాంతాలు :- (అ) అకారాంత, ఈకారాంత పదాల యొక్క చివఱి అచ్చు స్థానంలో ‘ఈయ’ ప్రత్య యాన్ని చేఱుస్తారు. ఉదాహరణకి-

అంతరం (మధ్య) -> అంతరీయం

(నడుము నుంచి క్రింది వఱకు ధరించబడేది – ధోవతి లేదా చీర)

(కాకమూ, తాళమూ) కాకతాళం -> కాకతాళీయం

జిహ్వామూలం -> జిహ్వామూలీయం

దేశం -> దేశీయం

ప్రాంతం -> ప్రాంతీయం

భారతం -> భారతీయం

భోజరాజు -> భోజరాజీయం

రాష్ట్రం -> రాష్ట్రీయం

శతరుద్రం -> శతరుద్రీయం

శాస్త్రం -> శాస్త్రీయం

స్వం -> స్వీయం

స్థానం -> స్థానీయం

సింహళం -> సింహళీయం

(ఆ) ‘ఈయ’ ప్రత్యయాన్ని నేరుగా చేర్చడానికి సాధ్యం కాని సందర్భాల్లో ‘కీయ’ అని చేర్చవచ్చు. ఉదాహరణకి,

రాజ -> రాజకీయ

పర -> పరకీయ

(ఆ) ‘ఆ, ఇ’ అనే అచ్చులు అంతంలో గల పదాలకు ‘ఈయ’ ప్రత్యయం చేఱినప్పుడు మొదటి అక్షరపు అచ్చుకు వృద్ధి వస్తుంది. ప్రత్యయం ‘ఏయ’ అవుతుంది. ఉదాహరణకి-

రేఖా (గీత) -> రైఖేయం (గీతలా సన్నగా, వరుసగా)

లంకా -> లాంకేయుడు (లంకారాజ్య వాస్తవ్యుడు)

వినతా -> వైనతేయుడు (వినత కుమారుడు = గరుత్మంతుడు)

శిలా (ఱాయి) -> శైలేయం (ఱాతి నుండి పుట్టినది)

సరమా (కుక్కలకు ఆదిమాత అయిన దేవత) -> సారమేయం (కుక్క)

అగ్ని -> ఆగ్నేయం

జ్ఞాతి (బంధువు) -> జ్ఞాతేయం (బంధువుల సమూహం)

వ్రీహి (వఱి) -> వ్రైహేయం (వఱి పండడానికి పనికొచ్చేది = వఱినేల)

శక్తి -> శాక్తేయం (పరమాత్మను దేవీరూపంగా ఉపాసించే ఒక హిందూ మతశాఖ)

సురభి (కామధేనువు) -> సౌరభేయి (కామధేనువు యొక్క సంతానం = ఆవు)

(v) ఈనాంతాలు :- (అ) పదాంత అచ్చు స్థానంలో ‘ఈన’ ప్రత్యయాన్ని చేఱుస్తారు. ఉదాహరణకి-

అత్యంతం (మిక్కిలి) -> అత్యంతీన (మిక్కిలి వేగంగా వెళ్లే)

అనుకామం (ఇష్టప్రకారం) ->అనుకామీన (ఇష్టం వచ్చినట్లు వెళ్ళే)

కాలం ->కాలీన

నవం ->నవీన

యుగం -> యుగీన

విశ్వజనం -> విశ్వజనీన

సమామ్ సమామ్ (ప్రతిసంవత్సరమూ) -> సమాంసమీన (ప్రతిసంవత్సరమూ జఱిగే)

సర్వజనం (జనమంతా) -> సర్వజనీన

హ్యంగవం (నిన్నటి పాలు) -> హైయంగవీనం (వాటినుంచి తీసిన నెయ్యి)

(ఆ) మూలపదంలో రేఫ ఉంటే ’ఈన’ ప్రత్యయం ఈణ’ గా మారుతుంది. ఉదాహరణకి,

కర్మ(పని) -> కర్మీణ (పనిచేసే)’

పారం (అవతలి ఒడ్డు) -> పారీణ (అవతలి ఒడ్డుకు చేఱుకున్న)

(vi) ఏరాంతాలు :- పదాంత అచ్చు స్థానంలో ‘ఏర’ ప్రత్యయాన్ని చేఱుస్తారు. ఇది చేఱినప్పుడు పదాది అచ్చుకు వృద్ధి వస్తుంది. ఉదాహరణకి-

కులటా (దుశ్శీల) -> కౌలటేర (దుశ్శీలకు పుట్టిన)

దాస (పనివాడు) -> దాసేర (పనివాడికి పుట్టిన)

దేవ (ప్రభువు) -> దేవేరి (ప్రభువు భార్య)    

ఈ తెఱగు నిర్మాణాలు మఱీ ఎక్కువ లేవు. దీన్ని విస్తృత ప్రయోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది.

(vii) పరాంతాలు :- ఏ పదానికైనా పరం’ అని చేర్చడం ద్వారా విశేషణంగా మార్చవచ్చు. దీన్ని ‘సంబంధించిన’ అనే అర్థంలోనే కాక, ‘చెందిన, అధీనమైన, వైపు, కోణం’ అనే అర్థంలో కూడా వాడతారు. ఉదాహరణకి,

వ్యక్తి -> వ్యక్తిపరం     వ్యక్తిపర వైవిధ్యం

సాహిత్యం -> సాహిత్యపరం  సాహిత్యపర ఆసక్తులు

వృత్తి -> వృత్తిపరం    వృత్తిపర సూక్ష్మాలు

వాతావరణం -> వాతావరణపరం     వాతావరణపర అనిశ్చితులు

సమాజపరం -> సమాజపరం సమాజపర ఆస్తి

సిద్ధాంతం -> సిద్ధాంతపరం   సిద్ధాంతపర అభ్యంతరాలు

రక్షణ -> రక్షణపరం  క్షణపర సమస్యలు

భద్రత -> భద్రతాపరం        భద్రతాపర జాగ్రత్తలు

(viii) ఏ నియమానికీ లోబడని విశేషణకార్యాలు : ఇవి అనంతంగా ఉన్నాయి. వీటిని ప్రయోగం నిఘంటువుల ద్వారానే గ్రహించను వీలుపడుతుంది. ఉదాహరణకి-

పుంస్ -> పౌంస్న (పురుషులకు సంబంధించిన)

స్త్రీ -> స్త్రైణ (స్త్రీలకు సంబంధించిన) మొ||

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub

Posted in 2014, పదనిష్పాదన కళ, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.