cover

అనుకోకుండా

Download PDF ePub MOBI

వచ్చేశావా? నువ్వొచ్చినట్టు కలొస్తుంటేనూ లేవలేకపోయాను.

- తొందరగా వచ్చాన్లే.

పురుగుల్ని తినే పిట్టలే కాదు, పువ్వుల్ని తెంపే ఉడతలూ ఉంటాయిరా అని పిల్లల్తో చెప్తే, ఒకళ్లనొకళ్ళు గిల్లుకుని నవ్వుతున్నారు. ఇక వీళ్ళు నమ్మరని విసుగొచ్చి అనుకున్నదాని కంటే ముందే బయల్దేరాను. రోడ్లింకా నిద్ర లేవలేదు తెలుసా. ఏవో రెండో మూడో బస్సులు వెళున్నాయంతే, నేనెక్కి వచ్చిన దాంతో కలిపి చూస్తే ఒక్కటే.

“ఇంకేంటి సంగతులు?” ఇద్దరం ఒకేసారి అని నవ్వుకుంటాం.

“ఆరోజు ఎక్కడాపానూ? ఆ… అక్కడ చుట్టుపక్కలంతా చెట్లూ, చీకటి. చిన్నలాంతరు బుడ్డి ఒకటి పట్టుకుని నక్కలా ఊళలేస్తూ, ఏ చప్పుడూ వినపడనప్పుడు కూడా ఎవరక్కడ అని అరుస్తూ తిరిగేవాణ్ణి. బాగా చిన్నతనం కదా. అసలు భయం లేదనే అనుకునేవాణ్ణి”

- బావుందోయ్. నాకైతే ఎవరు తప్పు చేసినా నేనే ఎండలో నిల్చోవాలి. నేనంటే బాగా ఇష్టంలే, అందుకు, క్రమశిక్షణ కోసం అన్నమాట. అట్లా నిల్చున్నప్పుడు ఉన్నఫళాన కుడి వైపుకు పరిగెడితే ఏ వూరొస్తుందా అనిపించేది. ఆ వూర్లో కొన్నాళ్ళు రహస్యంగా పొలాల్లో నిద్రపోయినట్టు ఊహించుకునేలోపు బడిగంట మోగేది.

“పెద్దయ్యాక తల్చుకుని బాగుందనుకోవడానికి బాగుంటుంది కదా చిన్నతనం?”

- కాదుమరీ! తీరికలేనప్పుడు తల్చుకుని బెంగ పడటానికి, ఖాళీగా విసుగ్గా గడిపిన రోజులు గుర్తొచ్చినట్టు.

*

ఒక్కడివే కదూ పాపం, నీ చుట్టూ అన్నీ వస్తువులే, నాతో సహా. కాసేపు సమయాన్ని గడపడానికి, కుదరకుంటే చంపి పాతెయ్యడానికి పనికొస్తాయి కదా ఊ ఊహలన్నీ, వస్తువులన్నీ, వస్తువుల కన్నా ఏ మాత్రం ఎక్కువ కాని మనుషుల సాంగత్యాలన్నీ?

అమాయకత్వం గుర్తుంటుందెప్పటికీ, ఆధారపడటం కూడా విసుగు పెడుతూ ఐనా గుర్తుంటుంది. అతిగా అర్థం చేసుకోవడమే ఎవరికీ అర్థం కాదు. ప్రశ్నించలేకపోవడం, నిందించడం చేతకాకపోవడమే ఎంతకీ అంతుపట్టవు. ఎక్కువగా తెలియడం అన్న ఒక్క కారణం చాలు నీ చావు ఎవరికీ అంత తప్పుగా అనిపించకపోవడానికి. ఇలాగే జరుగుతుంది చూస్తుండు అని చెప్పగలిగే అనుభవం వల్లే కావచ్చు, నీమీదున్న మంచితనపు మచ్చలు చెరిగిపోయేది.

ఇదంతా అనుకున్నంత కష్టం కాదని నీకూ తెలుసు.

ఊహించలేనంత నరకమని నాకు మాత్రమే, నాకైనా,

తెలుస్తుందంటావా?

*

Download PDF ePub MOBI

Posted in 2014, మ్యూజింగ్స్, సెప్టెంబర్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.