cover

ఎండకాలం లీవులు

Download PDF ePub MOBI

ఇస్కూలుకు లీవులిచ్చి వారమవతా వుండాది. మాయమ్మ దెగ్గిరుంటే ఏదో ఒక పని జెప్పి సతాయిస్తాది. మా మూలింటవ్వే మేలు. ఎంతసేవు ఆట్లాడుకున్న్యా ఇంటికి పోంగానే ‘ఇంతసేవు తిండిగూడా తినకుండా యాడబొయ్యుంటివి నాయనా’ అని గిన్నికేసి తినమని జెప్తాది.

ఇస్కూలుంటే నేరుగా ఇంటికొచ్చి తిని మళ్లీ ఇస్కూలుకే పోతావుంట్న్యా. ఇప్పుడట్లకాదు. ఆటల్లోబడిబోతే పొద్దే తెలీదు. ఎంతసేపటికైనా రాకుంటే మాయవ్వకు గూడా నన్నెతకలేక యాస్టేగదా! బాయిలికాడికి, కుంటలకాడికి బోతామని బయం. అది తెలుసుకోని మాయమ్మ మా యింటికాడుండమంటాది. నాకు ముండ్లమిందున్నట్లే వుంటాది. నీళ్లు పోసుకోనని, సింపిరి తల దువ్వుకోనని ఇట్లుండే పుల్లెత్తి అట్లెయనని, ఈ కసమాలంతో ఏగేది కష్టంగా వుండాదని తిడ్తానే వుంటే నాకు మాయక్క దెగ్గిర నామర్దాగా వుంటాది.

ఏంజెయ్యాలా? అని మనసులో మనసు ల్యాకుండా ఆలోసిస్తా వుండాను. సాయంతరమయ్యింది. ‘అక్క సెత్తలు దోస్తావుంది. నువు దీపానికి పేండదెచ్చిపెట్టి నీళ్లు జల్లి ముక్కర్రెయి’ అని సెప్పి పెళ్లో నీల్లమంటెయ్యడానికి పొయ్యింది మాయమ్మ.

దీపానికి పేండ దెస్తామని సిగరసెట్ల కాడ పేండకళ్లుంటే ఆడికి బొయి పెద్దనిమ్మకాయంత పేండ ఎండకుండా లోపలుండేది దీస్సోని గుండ్రంగా దాన్ని ఎగరేసుకుంటా రోడ్డుపక్క జూసినాను. ఆడ రోడ్డు పక్కనుండే పీతిరి గుంతకాడ కుక్కల పల్లినించి మా సిన్నపెద్దమ్మొస్తా కన్పించింది. పేండ సేత్తోనే మా పెద్దమ్మకెదురుగా పరిగెత్తినాను. సేతిలో సంచుండాది. ఏవిూ త్యాకుండా రారుకదా మా పెద్దమ్మోళ్లు. ఏందెచ్చుంటాదా అనుకుంటానే ‘పెద్దమ్మా, నువుబొయ్యేటప్పుడు నన్నూ పిల్సుకోని బోవా’ అన్న్యాను.

పిల్సుకోని బోతాననింది మా పెద్దమ్మ. పేండముద్ద నట్టింట్లో మంటి పెమిదికింద బెట్టేసి సేతులు గడుక్కోని మా పెద్దమ్మ దెగ్గిరొచ్చి నిలబడ్తి, తినేదానికిస్తాదని. సంచిలోనుంచి సుగుంట్లు దీసి నాసేతిలో రొండుబెట్టి పెళ్లో నుంచి మాయమ్మ రాంగానే సంచి మాయమ్మ సేతికిచ్చింది. మా మూలింటవ్వోళ్లకిచ్చే వొచ్చి నట్లుండాది. ఆడబోతే మాయవ్వ నాకే పెద్దబాగమిస్తాది. కానీ ఈలోపల మా పెద్దమ్మేడ పూడస్తాదో అని బయం. పెళ్లోకి బొయ్యి మొగం గడుక్కోని మొగానికి పౌడరు బూసుకోని రొండు జెల్లెయ్యమని మాయమ్మ దెగ్గిరికి బోతి.

‘వున్నెట్టుండి నీళ్లుగూడా బోసుకోకుండా యాడికి తయారవతా వుండావు’ అని అర్సింది.

‘కుక్కల పల్లి కొస్తాదంట. రానీలే. లీవులేగదా!’ అనింది మా పెద్దమ్మ.

‘వూరి బసివితో నువ్వేంగలేవు కా’ అనింది మాయమ్మ. ‘నీళ్లు జల్లి ముగ్గెయ్యమంట్నే ఏస్తివా’ అని అర్సింది.

మూడు కడప్మెట్లపైన నీళ్లు సిలకరించి ముగ్గేసొచ్చినానా, ‘పొద్దుబోతా వుంది దీపం బెట్టల్ల’ అని మా పెద్దమ్మ కాలీసంచి సేతిలోకెత్తుకోని నిలబడింది.

సిక్కుతల దువ్వుకోనేలేదు. ‘నీళ్లు బోసుకోబో’ అని మాయమ్మొక పక్క. ‘ఆడబోసుకుంటాదిలే’ అని మా పెద్దమ్మనగానే తలగూడా దువ్వుకోకుండా ఆదలా బాదలా ఒక పావడా జాకెట్టు మా పెద్దమ్మ సంచిలో దూర్సి మా పెద్దమ్మతో బోవడానికి నిలబడ్తి.

‘అసింకింగా నెత్తి గూడా దువ్వుకోకుండానా?’ అని మాయమ్మ నా పక్క వురిమురిమి సూస్తావుండాది. సెక్క దుబానితో పైపైన దువ్వుకోని మా పెద్దమ్మెంట బడి కుక్కలపల్లికి పూడ్సినాను.

కుక్కల పల్లికి బోవాలంటే నాకు తిర్నాలకు బొయినంత కుశాల. మా పెద్దపెద్దమ్మ కూతురు ఆనంద నాకంటే ఆర్నెల్లు పెద్దది. ఇద్దురూ కలిసి సిదుగుపన్లు సేస్తామని అందురికీ బయమే. ఎందుకంటే నేనే తులవైతే నా నెత్తిలో దూరిపోతాది ఆనంద.

మా పెద్దమ్మోళ్లిద్దురిదీ కలిసి ఒకటే సుట్టుబవంతిల్లు. సగమింట్లో వాళ్లు సగమింట్లో వీళ్లు వుంటారు. మద్దిలో వుండే కాలీ స్తలము ఇద్దురూ వాడుకుంటారు. ఆడే అన్నాలు దింటారు. అన్నే కూరాకు నారాకు వొల్సుకుంటారు. బయటి వాకిండ్లు మాత్రం ఒగదానికొకటి సంబందముండదు. ఆ పక్కొకరిది ఈ పక్కొకరిది.

మా సిన్న పెద్దమ్మతో బొయినాను కాబట్టి తిండీ తీర్తం వాళ్లింట్లోనే. అందురూ వాకిట్లోనే గదా తినేది. మా యానందకు వాళ్లమ్మేసకొచ్చి పెడ్తే నాకు మా సిన్నపెద్దమ్మ. వాళ్లేసుకున్న కోడిగుడ్డు అట్టు నాకు వొచ్చింది. వీళ్లేంచిన వొడియాలు వాళ్లకూ బొయినాయి.

ఇదీ కత. పని జెయ్యమనే వాళ్లుండరు. సాయంత్రమైతే వీళ్లో వాళ్లో ఏదో ఒక పలారం తప్పకుండా సేస్తారు. ఒకదినం మా పెద్దపెద్దమ్మ బెల్లం, ఉప్పిడి రవ్వ ఏసి వుక్కిరి కెలికింది. ఆ పొద్దే మా సిన్నపెద్దమ్మ అలసందపొప్పు రుబ్బి వొడలు సేసింది.

అదీ ఇదీ ఎత్తుకోని ఆనందా వాళ్ళ ఎద్దుల కొట్టంలో వుండే పెద్ద అరుగుమింద నేనూ ఆ బిడ్డి తినుకుంటా అచ్చన రాళ్లాడుకుంటా వుండాము. నా ఎనక పెద్ద సెరుకాకు మోపుండాది. మా పెద్ద పెదనాయన బాయికాడ మడకిడ్సుకోనొచ్చి గొడ్లను కుడిత్తొట్టి కాడ ఇడ్సి ఇంట్లోకి బొయినట్లుండాడు. కర్రెద్దు నీల్లు దాగి కొట్టంలో కొచ్చి సెరుకాకు మోపుమింద బడి కర్రల్ని ఈడ్సింది. వాటిమిందే కూసోనుండా నేను అంతే వులిక్కి పడిన నేను సగం ఎద్దుమింద బడి కిందికి జారినాను. అది బయంతో కదలబోయి నా కాలిని తొక్కేసింది. బొట్నేలుకాడ దెబ్బదగిలింది. ఇంగ సూడల్ల నా సామిరంగా! మా వూరికినిపించేంత గెట్టిగా యాడస్తా వుండాను.

బాయికాడున్ని మా సిన్న పెదనాయన్కి ఎవురు జెప్పినారో! గెసబోసుకుంటా పరిగెత్తుకోనొచ్చినాడు. అప్పిటికే మా పెద్దమ్మ తడిగుడ్డ సుట్టింది. నేనింగా యాడస్తానే వుండా. మా పెదనాయిన సింతోపుకల్లా పరిగెత్తిపొయ్యి ఏందో ఆకు నలుపుకుంటా వొచ్చి గుడ్డ దీసేసి పసురు పిండినాడు. సల్లంగా వుండాది. అయినా ఏడుపు నిలపలా. మా వూర్నించి మాయమ్మొచ్చేదాకా.

‘ఈళ్లిద్దురూ ఒగసోట సేరినారంటే ఇట్లే వుంటాది. అందుగ్గదా లీవులిచ్చినా నేను దాన్ని పంపించంది’ అని నిష్ఠూరమాడింది మాయమ్మ.

నడవలేనని ఎద్దుల బండి కట్టించి మావూరికి పంపించినాడు మా పెదనాయిన. సెరువు కట్టమింది నుంచి వూరేగింపు మాదిరిగా బండ్లో కూసోని వొస్తావున్ని నన్ను, మాయమ్మను మడికయ్యల్లో పన్జేసే మనుసులు పలకరిస్తా వుంటే సిగ్గనిపించింది నాకు.

*

Download PDF ePub MOBI

for regular updates, like Kinige Patrika facebook page.

Posted in 2014, ఇర్లచెంగి కథలు, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.