cover

పదనిష్పాదన కళ (19)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

౨. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని కలిగిన’ అర్థంలో అనే అర్థంలో వాడతారు.ఉదాహరణకి-

AmbitiousAmbition కలిగిన

Bashful – Bash (సిగ్గు) కలిగిన

Bicameral – 2 ఛాంబర్లు కలిగిన

Bifocal – 2 ఫోకస్సులు కలిగిన

Binary – రెండు అంగాలు కలిగిన

Brainy – Brain కలిగిన

Cellular – Cells కలిగిన

Cultured – Culture కలిగిన

Leprous – Leprosy కలిగిన

Moneyed – Money కలిగిన

ఈ అర్థాన్ని ద్యోతకం చేయడానికి ‘క, మతుప్, ణిని, ల’ ప్రత్యయాల్ని నామవాచకానికి తరువాత చేఱుస్తారు. ఉదాహరణకి-

అర్థం -> అర్థక/ అర్థవంత.

(i) క ప్రత్యయం:- ఇది అన్ని తెఱగుల నామవాచకాలకీ చివఱ చేఱుతుంది. ఉదాహరణకి-

పుస్తం (వ్రాత/ పూత) -> పుస్తక (వ్రాత కలిగిన)

నామ -> నామక (పేరు కలిగిన)

సత్తా -> సత్తాక (ఉనికి కలిగిన)

పరంపరా -> పరంపరాక (ఎడతెగని వరుస కలిగిన)

లతా -> లతాక (తీగలు కలిగిన)

శ్రీ -> శ్రీక (సౌభాగ్యం కలిగిన)

హేతు -> హేతుక (కారణం కలిగిన)

సంపత్తి -> సంపత్తిక (సంపద కలిగిన)

ఆయుష్ -> ఆయుష్క (ఆయుష్షు కలిగినది)

యశస్ -> యశస్క (యశస్సు కలిగిన)

ధనుష్ -> ధానుష్క (ధనుర్విద్యకలిగిన = ధనుర్విద్యలో నేర్పరియైన)

తటా -> తటాకం (గట్లు కలిగిన = చెఱువు)

(ii) మతుప్ ప్రత్యయం:- ఇది ఇకారాంత, ఋకారాంతాలు కాని నామవాచకాలకు చేఱినప్పుడు ‘వంత/ వతి’ అనే రూపాల్ని పొందుతుంది. పున్నపుంసక లింగాల్ని సూచించేట్లయితే ‘వంత’ అవుతుంది. స్త్రీలింగాన్ని సూచించేట్లయితే ‘వతి’ అవుతుంది. ఉదాహరణకి,

గుణం -> గుణవంతుడు/ గుణవంతం/ గుణవతి

విద్య -> విద్యావంతుడు/ విద్యావంతం/ విద్యావతి

తేజస్ -> తేజోవంతుడు/ తేజోవంతం/ తేజోవతి

జ్ఞానం -> జ్ఞానవంతుడు/ జ్ఞానవంతం/ జ్ఞానవతి

భాస్ -> భాస్వంతుడు/ భాస్వంతం/ భాస్వతి

రాజన్ -> రాజన్వంతుడు/ రాజన్వంతం/ రాజన్వతి

కుముద్ -> కుముద్వంతుడు/ కుముద్వంతం/ కుముద్వతి

ఇది ఇకారాంత, ఋకారాంతాలకి చేఱినప్పుడు ‘మంత/ మతి’ అనే రూపాల్ని పొందుతుంది. ఉదాహరణకి-

శక్తి -> శక్తిమంతుడు/ శక్తిమంతం/ శక్తిమతి

బుద్ధి -> బుద్ధిమంతుడు/ బుద్ధిమంతం/ బుద్ధిమతి

భర్త -> భర్తృమంతం/ భర్తృమతి (భర్త గల స్త్రీ)

హ్రీ -> హ్రీమతి (తప్పు చేయడానికి సంకోచించం/ తప్పు జఱుగుతుందేమోననే భయం గల స్త్రీ) మొ||

(iii) ణిని ప్రత్యయం :- ఇది చేఱినప్పుడు అకారాంత నామవాచకపు తుది అచ్చు స్థానంలో ‘ఇన్’ వస్తుంది. ఈ ‘ఇన్’ లోని తుది నకారపు పొల్లుని తెలుగులో ఉపయోగించరు. ఉదాహరణకి : శాస్త్రం -> శాస్త్రిన్. కానీ తెలుగులో ‘శాస్త్రి’ అనే అంటారు. ఈ ప్రత్యయాంతాల్లో ఏకవచన పుల్లింగరూపాలే ఏకవచన నపుంసకలింగ రూపాలు కూడా. ఉదాహరణకి,

1

(iv) సకారాంత నామవాచకాలు:- వీటికి ‘ఇన్’ బదులుగా ‘విన్’ చేఱుతుంది. ఈ ‘విన్’ లోని తుది నకారపు పొల్లుని తెలుగులో ఉపయోగించరు. ఈ ప్రత్యయాంతాల్లో కూడా పుల్లింగరూపాలే నపుంసకలింగ రూపాలు. ఉదాహరణకి,

2

(v) లాంతాలు:- పదాంతంలో ‘ల’ ప్రత్యయాన్ని చేఱుస్తారు. సాధారణంగా అకారాంత, ఆకారాంత పదాలకే ఈ ప్రత్యయం చేఱుతుంది. ‘ల’ ప్రత్యయం చేఱేటప్పుడు పదాంత అచ్చు స్థానంలో కొన్నిసార్లు ఇకారమూ, కొన్నిసార్లు ఆకారమూ వస్తాయి. ఇవి మొదట్లో విశేషణాలుగా మొదలై నామవాచకాలుగా స్థిరపడి ఉండొచ్చు. ఉదాహరణకి,

అనం (ఊపిరి) -> అనిలుడు (ఊపిరి పోసేవాడు = గాలిదేవుడు)

సికతా (ఇసుక) -> సికతిలం (ఇసుకమయమైన నేల)

అంసం (మూపు) -> అంసలుడు (దృఢమైన మూపు కలవాడు)

కుండం (కుండ) -> కుండలం (కుండలా గుండ్రంగా ఉండేది)

కుంతం (ఒక ఆయుధం) -> కుంతలం (ఆ ఆయుధంలా పొడవుగా ఉన్నటువంటిది = తలవెంట్రుక)

కృష్ణం (నల్లనిది) -> కృష్ణల (నల్లనిది = పూసల గురివింద)

చండం (తీవ్రం = extreme) -> చండాలుడు (తీవ్రమైన స్వభావం గలవాడు)

జట (జడ) -> జటిలం (జడల్లా చిక్కుముళ్ళు పడినది)

తమం (చీకటి) -> తమాలం ( చీకటిలా దట్టంగా ఉండేది = చాలా ముదుఱాకుపచ్చరంగు ఆకులు గల చీకటిచెట్టనే సముద్రతీరపు వృక్షం)

రసం -> రసాలం (రసం గలది = మామిడిపండు)

ధూమం (పొగ) -> ధూమలం (పొగవంటి రంగు = బూడిదరంగు, Grey color)

పటం (వస్త్రం) -> పటలం (ఇంటి కప్పు = ఇంటిని కప్పే వస్త్రంలాంటిది)

౩. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని ‘లేని’ అనే అర్థంలో వాడతారు. ఉదాహరణకి-

Aimless – Aim లేని

Baseless – Base లేని

Blameless – Blame లేని

Bloodless – Blood లేని

Boundless – Bounds లేని

Brainless – Brain లేని

Breathless – Breath లేని

Careless – Care లేని

Cheerless – Cheer లేని

Effortless – Effort లేని

Doubtless – Doubt లేని

ఈ అర్థాన్ని ద్యోతకం చేయడానికి ‘రహిత, అపేత, హీన, విహీన’ అనే సమాస అవయవాల్ని నామవాచకంతో సమాసిస్తారు. వీటిల్లో ‘హీన, విహీన’ అనేవి నీచార్థకాలు. ఉదాహరణకి-

మానవులు లేని విమానం =  మానవ రహిత విమానం (Unmanned aircraft)

రంగు లేని ద్రవం  =  వర్ణ రహిత ద్రవం (Colourless liquid)

విశ్వాసం లేని సేవకుడు  =  విశ్వాసరహిత సేవకుడు (Faithless servant)

చట్టంతో అదుపుకాని జనం  =  చట్టరహిత జనం (Lawless masses)

బుద్ధి లేని ఏల్బడి  =  బుద్ధిహీన పాలన (Tactless rule)

సిగ్గు లేని నడత  =  లజ్జాహీన ప్రవర్తన (Unabashed demeanor)

సంస్కారం లేని ధోరణి  =  సంస్కారహీన ధోరణి (Uncultured attitude)

కొన్నిటిని మాత్రం ఇంత బారుగా కాకుండా ఇంతకు ముందటి అధ్యాయాల్లో చెప్పినట్లు ‘అ, నిర్, వి’ అనే ఉపసర్గలతో క్లుప్తం గా అనువదించాల్సి ఉంటుంది. వీటిని చేర్చినప్పుడు కొన్నిసార్లు పదం నపుంసకలింగంగా మారడమే కాక పదానికి చివఱ ‘క’ ప్రత్యయం కూడా వస్తుంది. ఉదాహరణకి,

అంతం లేని  =  అనంత (infinite)

ఆకారం లేని    =  నిరాకార (formless)

కారణం లేని    =  అకారణ (irrational)

అవసరం లేని  =  అనవసర (needless)

ఆధారం లేని    =  నిరాధార (baseless)

సంతోషం లేని  =  నిస్తేజ (cheerless)

లక్ష్యం (జాగ్రత్త) లేని =  నిర్లక్ష్య (careless)

సందేహం లేని  =  నిస్సందేహ (doubtless)

దయ లేని/ దయమాలిన =  నిర్దయ (merciless)

౪. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని ’ కూడుకొన్న’ అనే అర్థంలో వాడతారు. ఉదాహరణకి-

Pithy – Pith (చేవ) తో కూడుకొన్న

Contemptuous – Contempt తో కూడుకొన్న

Consensual – Consensus తో కూడుకొన్న

Curvaceous – Curves తో కూడుకొన్న

Hazardous – Hazards తో కూడుకొన్న

Harmonious – Harmony తో కూడుకొన్న

Sensational – Sensation తో కూడుకొన్న

Fashionable – Fashion తో కూడుకొన్న

Tearful – కన్నీళ్ళతో కూడుకొన్న

Melodious – Melody తో కూడుకొన్న

(అ) ఈ అర్థాన్ని ద్యోతకం చేయడానికి నామవాచకాన్ని ఈ క్రింది అవయవాలతో సమాసిస్తారు.

యుక్త, యుత = కలిసిన ; అన్విత, సమన్విత = పొందుపడిన ; ఉపేత, సహిత = తోడువచ్చిన, కూడుకొన్న ; మిశ్ర = కల గలిసిన ; పూర్వక, పురస్సర = ముందుపెట్టుకున్న, నడపబడుతున్న (led by, prompted by) శాలి (శాలిని) = ప్రకాశించే ; ద్వితీయ = రెండోది/ రెండోవాడుగా కలిగిన.

ఉదాహరణలు :

లయ -> లయాన్విత (rhythmic)

రాగం -> రాగయుక్త

శైలి     -> శైలీసమన్విత

భక్తి     -> భక్తియుత

బాధ్యత -> బాధ్యతాయుత

బలం -> బలోపేత

సందర్భం -> సందర్భసహిత

ప్రతిభ -> ప్రతిభాశాలి (ప్రతిభాశాలిని)

ప్రజ్ఞాశాలి -> ప్రజ్ఞాశాలి (ప్రజ్ఞాశాలిని)

జయం -> జయశాలి (జయశాలిని)

భార్య -> భార్యాద్వితీయుడు

(ఆ) ఇంత బారుగా చెప్పాల్సిన పని లేనప్పుడు ఈ అర్థంలోనే ‘స’ అనే ఉపసర్గని నామవాచకానికి ముందు వాడతారు. ఉదాహరణకి,

అభిప్రాయం -> సాభిప్రాయం (ఉద్దేశంతో కూడుకొన్న)

ఆకారం -> సాకారం (ఆకారంతో కూడుకొన్న)

ఆయుధం -> సాయుధ (ఆయుధాలతో కూడుకొన్న)

కుటుంబం -> సకుటుంబం (కుటుంబంతో కూడుకొన్న)

టీక     -> సటీకం (టీకతో కూడుకొన్న)

పరివారం -> సపరివారం (పరివారంతో కూడుకొన్న)

‘స’ అనే ఉపసర్గని చేర్చినప్పుడు కొన్నిసార్లు పదం నపుంసకలింగంగా మారడమే కాక పదానికి చివఱ ‘క’ ప్రత్య యం కూడా వస్తుంది. సామాన్య అవగాహనలో ఈ ‘కలిగిన, కూడుకొన్న’ అనే అర్థాలు సాధారణంగా పరస్పరం విజ్జోడవుతాయి.

౫. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని ‘నిండిన’ అనే అర్థంలో వాడతారు. ఉదాహరణకి-

Blissful – Bliss తో నిండిన

Colourful – Colours తో నిండిన

Troublesome – Troubles తో నిండిన

Irksome – Irks తో నిండిన

Doubtful – Doubt తో నిండిన

Eventful – Events తో నిండిన

Ferrous – ఇనుముతో నిండిన

Gassy – Gas తో నిండిన

Regretful – Regrets తో నిండిన

Vengeful – పగతో నిండిన

ఈ అర్థాన్ని ద్యోతకం చేయడానికి నామవాచకాన్ని ‘పూర్ణ, పూరిత, భరిత, మయ, భూయిష్ఠ, ఆవహ’ అనే అవయవాలతో సమాసిస్తారు. ఉదాహరణకి-

అశ్రువులు -> అశ్రుపూర్ణ

భక్తి     -> భక్తిపూర్ణ

భావం -> భావపూర్ణ

మహత్త్వం -> మహత్త్వపూర్ణ

ఆవేశం -> ఆవేశపూరిత

కాంతి -> కాంతిపూరిత

కుట్ర -> కుట్రపూరిత

ద్వేషం -> ద్వేషపూరిత

ద్రోహం -> ద్రోహపూరిత

ప్రేమ -> ప్రేమపూరిత

మోసం -> మోసపూరిత

అవినీతి -> అవినీతిమయం

జలం -> జలమయం

బుఱద -> బుఱదమయం

దుర్గంధం -> దుర్గంధభూయిష్ఠం

సమాసం -> సమాసభూయిష్ఠం

సుఖం -> సుఖావహం

భీతి -> భీత్యావహం (భీతావహం అని వాడుతున్నారు)

ఆశ -> ఆశావహం

ముదం -> ముదావహం

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, పదనిష్పాదన కళ, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.