cover

ఏ పని చేస్తున్నా…

తల చుట్టూ మల్లెదండలు వేలాడదీసిన ముస్లిం పెళ్ళికూతురులా
కవిత్వం రాస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా ఆ పూలరేకుల వత్తిడి తగులుతూనే వుంటుంది
తలుపుతీసి కొరియర్ అందుకుని నాలుగక్షరాలు గిలుకుతానా
సంతక౦ కవిత్వం వాసనేస్తుంది
కూనిరాగం తీస్తూ వంటింట్లో కొచ్చి కాఫీ కలిపి తాగుతానా
కప్పు అడుగున కవిత్వ చారిక మిగిలిపోతుంది
రాసే రాసే పుస్తకం పక్కన పెట్టి కాసేపు చంటాడ్ని ఎత్తుకుంటానా
వాడి పాల బుగ్గ కవిత్వంలా చేతికి తగులుతుంది.
ఏ పనిచేస్తున్నా సరే కాస్త కాస్త కవిత్వం సాన మీద గంధ౦లా తీగ సాగుతుంది.
ఏం తింటానో, ఎప్పుడు నిద్ర పోతానో…
నాలుగైదు రోజులు అలాగే జ్వరపడి జ్వరపడి జ్వరపడి
ముఖం మీద గరగర లాడే ఎర్రమల్లెలు పక్కకి జరిపి
పొటమరించిన పద్య సోయగాన్ని కళ్ళారా చూసుకు౦టాను
గాఢమైన ముద్దుతో అ కవితకి ఒక పేరు పడతాను
– కొండేపూడి నిర్మల

Download PDF ePUB MOBI

for regular updates, like Kinige Patrika facebook page.

Posted in 2014, కవిత, సెప్టెంబర్ and tagged , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.