స్వేచ్ఛ ఓల్గా

బంధనాల స్వభావాన్ని చిత్రించే “స్వేచ్ఛ”

Download PDF    ePub    MOBI

ఈ పుస్తకానికి రాసిన పరిచయంలో రచయిత ఓల్గా స్వేచ్ఛ గురించి ఇలా అంటారు:

స్వేచ్ఛ ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గర నుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి ఇది సాధించడమే చాలా కష్టం. మన నుండి మనకు స్వేచ్ఛ. మనకు పుట్టుక నుండీ అలవాటైన భావాల నుండీ అభిప్రాయాల నుండీ ఆచారాల నుండీ స్వేచ్ఛ. మనలో జీర్ణించుకు పోయిన నమ్మకాల నుండీ విడుదల.

అరుణ ఎమ్మే ఆఖరి సంవత్సరం పరిక్షలు రాసింది. మధ్యతరగతి కుటుబంలో పుట్టి పెరిగిన ఆమె చిన్న నాటి నుండి అదుపాజ్ఞలతో పెరిగింది. వయసు రాగానే తండ్రీ, అన్నగారూ అరుణకు హద్దులు నిర్ణయించేవారు.

దీనికి కొంత కారణం అరుణ మేనత్త కనకమ్మ, భర్త చిన్నవయసులోనే చనిపోవడంతో తమ్ముడి (అరుణ తండ్రి) ఇంటికి కొంత ఆస్తితో చేరింది. వయసులో జరగాల్సిన ముచ్చటలేమీ జరగని కనకమ్మ తమ్ముని భార్య సీతమ్మ పైన, ఆ ఇంటివారి పైన తన పెత్తనాన్ని, కసినీ వెళ్ళగక్కుతూ ఉంటుంది. ఆమె ఆస్తి మీద ఆశతో ఎవరూ మారు మాట్లాడేవారుకాదు. ముఖ్యంగా అరుణను అనుక్షణం అణిచి వేయాలని చూసేది. అరుణ అక్కను 15 సంవత్సరాలకే పెళ్ళి చేసి పంపినట్లే అరుణను కూడా పంపాలని ఆమె ఆలోచన. అక్కకు మనవరాలు పుట్టినా ఇంకా చెల్లెలికి పెళ్ళి చేయలేదని తమ్ముడిని పోరేది. ఈ అణిచివేతను, ఆంక్షలనూ అరుణ చిన్న వయసు నుండీ మనసులోనే వ్యతిరేకిస్తూ ఉండేది.

ఇలాంటి కుటుంబంలో అరుణ ఆ మాత్రమైనా చదువుకోవటానికి కారణం తండ్రి జానకి రామయ్య దగ్గర పెళ్ళి చేయడానికి తగిన డబ్బు లేకపోవడమే, లేదంటే ఏనాడో పెళ్ళి చేసి గుండెల మీద భారాన్ని దింపుకునే వాడు.

ఆర్థిక స్వాతంత్రం కోసం ఉద్యోగం సంపాదించి, తాను ప్రేమించిన ప్రకాశాన్ని పెళ్ళాడితే తనకు స్వేచ్ఛ లభిస్తుందని అరుణ ఆలోచన. ఉద్యోగం రాగానే ప్రకాశాన్ని వివాహం చేసుకుంటుంది. అప్పుడే పిల్లలు వద్దన్నా ప్రకాశం వినిపించుకోడు, మొండి వైఖరితో అనుకున్నది సాధిస్తాడు. అతనికి మొదట్నుంచీ అరుణ ఉద్యోగం చేయటమూ, స్వతంత్రించి ఆర్థిక నిర్ణయాలు తీసుకొవటమూ పెద్దగా నచ్చదు. అరుణ ఉద్యోగం చేస్తూనే కుటుంబ భాధ్యతలనూ సమర్థంగా నిర్వహిస్తున్నా ప్రకాశం ఆమెను తన మాటలతో బాధ పెడుతుంటాడు. ఆమె కాలేజీలో పూర్తి జీతం కోసం సమ్మెలు చేయడం, అభ్యుదయ పత్రికకు పని చేయడం, అందుకోసం నలుగురిలోనూ తిరగడం, మెహందీ మహిళల్ని ఇంటర్యూ చేయడం, ఇవన్నీ చూసి అతనిలో వ్యతిరేకత పెరుగుతుంది. తన భార్య పూర్తిగా ఇంటి బాధ్యతలకే పరిమితం కావలన్నది అతని అభిప్రాయం. సమాజంలో జరిగే విషయాలన్నీ నెత్తి మీదకు వేసుకోవద్దంటాడు. చివరకు సంసారం కావాలో, సమాజ సేవ కావాలో తేల్చుకోమంటాడు.

ప్రకాశం మనస్తత్వం లోని మార్పును, మాటలతో అవమానించే తీరును అరుణ సహించలేకపోతుంది. చుట్టూ స్త్రీలంతా పైకి ఎలా ఉన్నా తనలాంటి సమస్యలతోనే సతమతవుతున్నారని అరుణ నెమ్మదిగా గ్రహిస్తుంది. చివరకు పైకి ఎంతో అభ్యుదయవాదిలా కనిపిస్తూ సమాజ చైతన్యం అంటూ కబుర్లు చెప్పే తోటి ఉద్యోగి కేశవరావు సొంత ఇంటిలో మాత్రం భార్యను కట్టు బానిసలా వంటింటికే పరిమితం చేయటాన్ని చూసి భరించలేకపోతుంది.

బంధనాల స్వభావం తెలిసే కొద్దీ అరుణకు స్వేచ్ఛ స్వరూపం కూడా అర్థమవుతుంది. చివరకు బంధాల నుండి విముక్తురాలు కావాలన్న నిర్ణయానికి వస్తుంది. తనకు చేతనైనంత వరకు సమాజానికి, తోటి ఆడవారికి సాయపడాలనే ఆలోచనకు వస్తుంది.

Posted in 2013, డిసెంబరు, పుస్తక సమీక్ష and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.