cover

మై స్టోరీ

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 15వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన ఇక్కడ చూడండి.)

Download PDF ePub MOBI

“రేయ్ నవీన్! నువ్వు ఏ కాలేజీ లో జాయిన్ అవుతావురా?” అమ్మ అడిగిన ప్రశ్నకు “శరత్ అన్నయ్య చదివిన కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అవుదామనుకుంటున్నా అమ్మా” అని చెప్పాను.

“అయితే వెళ్లి ఆ కాలేజీ అప్లికేషను తీసుకురా”.

“ఎందుకు అమ్మా! వాళ్లకి ఫోన్ చేస్తే వాళ్ళే క్షణాల్లో మన ముందు వాలుతారని అన్నయ్య చెప్పాడు”.

“ఎందుకైనా మంచిది ఆ కాలేజీ ఎలా ఉంటుందో ఎవరినైనా అడుగు”.

“అడిగానమ్మా. చాలామంది బాగుంటుందన్నారు”.

“ఎవరిని అడిగావు?”.

“కాలేజీముందు ఉన్నవారిని”.

“కాలేజీ ముందు ఉన్నవారిని అడిగితే అందరూ బాగుందనే చెప్తారు. లోపలికి వెళ్లి చదువుతున్న వారిని అడిగితే ఎలా ఉందో చెప్తారు. సాయంత్రం అన్నయ్యని అడుగు. ఈలోపు ఆ కాలేజీ వాళ్లకి ఫోన్ చెయ్.”

***

“హాయ్ రా! ఎలా ఉన్నావ్?” అడిగాను అన్నయ్యను.

“బానే ఉన్నాను. నువ్వు?”

“ఏ కాలేజీలో చేరాలా అని నిద్రలేకుండా ఆలోచిస్తూ ఉన్నాను”.

“ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావేమిటి?”

“నీకు నవ్వులాటగానే ఉంటుంది! సర్లే… నువ్ చదివిన కాలేజీ గురించి కనుక్కోమని అమ్మ చెప్పింది. అందుకే వచ్చాను.”

“ఏం?” కంగారుగా అడిగాడు.

“నేనూ అదే కాలేజీలో చేరదామనీ.”

“వద్దు” దాదాపు అరచినంత పని చేశాడు.

“ఏం?”

“వద్దనడానికి నేనెవర్నిలే గానీ, ముందు నేను పడిన బాధలు విను. తర్వాత నీ ఇష్టం.”

“ఏమైంది? నువ్వు చదివిన కాలేజీ బాగోదా?”

“ఆ మాటకొస్తే నేను చదివిన కాలేజీ ఏమిటి? ఏ కార్పొరేట్ కాలేజీ బాగోదు.”

“మరి మార్కులు ఎలా వచ్చేస్తాయ్ “

“స్టూడెంట్లను తమ కిష్టం లేని జంతువుల్లా ఊహించుకొని కొడుతుంటే మార్కులు రాక ఏం చేస్తాయ్?”

“మరి ఇందాక వచ్చిన వాళ్ళు కాలేజీలో అస్సలు కొట్టమని చెప్పారు?”

“ఆఁ మా కాలేజీలో కొడతాం – వచ్చి తన్నించుకోండని చెప్తే ఎవరు జాయిన్ అవుతారురా?”

“అంటే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలేనా?”

“మరి…! ఎంసెట్ కోచింగ్ కని మా దగ్గర డబ్బులు తీసుకొని రెండు సంవత్సరాలకి కలిపి రెండు పేజీలు కూడా చెప్పలేదు. అదేమిటని అడిగితే ముందు IPE చదవండి, అప్పుడు ఎంసెట్ గురించి మాట్లాడుకుందాం అని చల్లగా దాటేశారు”.

కొంచెం వివరంగా చెప్పమన్నాను. చిన్న నిట్టూర్పు విడిచి కథ చెప్పడానికి సమాయత్తమయ్యాడు .

“అది పదవ తరగతి రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం….

“పేరు : మోడేకుర్తి సతీష్ శరత్ కుమార్.

“మార్కులు : 494/600……..

“అని ఉన్న రిజల్ట్ పేపర్ ను పట్టుకొని ఊరంతా తిప్పి తెలిసిన వారికి , తెలియని వారికి… అందరికీ చూపించాను. అమ్మ, నాన్న, అన్న తప్ప అందరూ తిట్టారు .. అప్పుడే నాకు దుర్ముహూర్తం మొదలైందని అప్పుడు నాకు తెలియలేదు. రెండు సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే తెలిసింది.

“విజయనగరంలో పేరున్న కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్లో MPC గ్రూప్ లో చేరాను. మొదటి రోజు సరస్వతీ పూజ చేయించారు. ఒక వారం రోజులు సెలవులు ఇవ్వడం వలన క్లాసులు జరుగలేదు. తరువాత సంవత్సరంపాటు క్లాసులు జరుగడం (?) వలన సెలవులు ఇవ్వలేదు. తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలోకి మారడం వలన మొదటి నెల మార్కులు బాగా రాలేదు. అప్పుడు కాలేజీలో మాష్టార్ల వలన నేను అనుభవించిన బాధ వర్ణనాతీతం. దాని కన్నా వైతరణీ నదిలో మునకేసి రావటం ఉత్తమం. హై క్లాసు సెక్షన్ నుండి లోక్లాసు సెక్షన్ లోకి పంపించేసారు. దాంతో ఏం చేయాలో పాలుపోలేదు.

015“ ‘కష్టపడి’ చదువుదామనుకున్నాను. చదివాను… క్లాసులో రెండవ రాంక్ తెచ్చుకున్నాను. కానీ ఆనందం కలగటం లేదు. అంతకు ముందు అర్ధం చేసుకొని చదవటం వలన బట్టీ పట్టటానికి వీలులేకపోయింది. కానీ ఇప్పుడు బట్టీ పట్టటం వలన అర్ధం చేసుకొని చదవటానికి వీలులేకపోతోంది. నేను మారిపోతున్నానని నాకు స్పష్టంగా అర్ధం అవుతోంది. కానీ ఈ రకమైన మార్పును ఆస్వాదించలేక పోతున్నాను. క్రమంగా మొదటి రాంక్ తెచ్చుకున్నాను. తక్కువ మార్కులు వచ్చినప్పుడు తిట్టిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు.

“మొదటి సంవత్సరం 418/470 మార్కులు వచ్చాయి. మళ్ళీ తిట్టడం మొదలు పెట్టారు. నా మీద నాకే విసుగొచ్చింది. ఆ విసుగు మార్కులు తక్కువ వచ్చాయని కాదు. నా విషయంలో మార్కులు ఎక్కువ, తక్కువ అని ఉండవు. మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు ఒకలా, తక్కువ వచ్చినప్పుడు ఒకలా చూడటం వీళ్ళ అలవాటు. ఎక్కువ వచ్చినప్పుడు పెంపుడు కుక్కను చూసినట్టు ప్రేమగా చూస్తారు. తక్కువ వచ్చినప్పుడు వీధికుక్కను చూసినట్టు అసహ్యంగాచూస్తారు. అంటే మొత్తానికి మనల్నికుక్కల్లాగానే చూస్తారు. అందుకే ఆ విసుగు. మొదట ఆ విసుగుని అందరి మీదా చూపించడం మొదలు పెట్టాను. తర్వాత అర్ధం అయింది. నేను చేసిన తప్పుకి అందర్నీ నిందించడం ఎందుకు? చికాకు వచ్చింది. ఎంతలా అంటే ఒక దశలో కాలేజీ వాళ్ళని నరికిపారేయ్యాలని అనిపించింది.

“రెండవ సం.లో నా హాజరు సగానికి పడిపోయింది. చదివింది తక్కువే అయినా అర్థం చేసుకొని చదవడం మొదలు పెట్టాను. దాంతో ప్రతీ వారాంతపు పరీక్షలోనూ నాకు సున్నా మార్కులు వేసారు. కార్పొరేట్ కాలేజీలు ఎంతగా దిగజారిపోతున్నాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. కానీ నాకు తెలుసు- పబ్లిక్ పరీక్షల్లో నేను బాగానే మార్కులు సంపాదించగలనని. లేకపోయినా నష్టం లేదు. ఎందుకంటే నా దృష్టిలో మార్కులు ఎప్పుడో చచ్చిపోయాయి. కానీ రెండవ సంవత్సరం మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. నాకు నచ్చినట్టు నేను ఉండటానికి మించిన ఆనందం ఉంటుందా?

“రెండవ సంవత్సరం లో నాకు 862/100 మార్కులు వచ్చాయి. ఈసారి ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. ఆనందంగా ఉన్నాను. ప్రస్తుతానికి గవర్నమెంట్ కాలేజీ లో డిగ్రీలో జాయిన్ అయ్యాను. సంతోషంగా ఉన్నాను. త్వరలో నాకు నచ్చిన యానిమేషన్ రంగం లోకి వెళ్లదలచుకున్నాను.

“కొసమెరుపు ఏమిటంటే ఇంటర్ కాలేజీ వాళ్ళు రెండు సంవత్సరాలకి కలిపి మొత్తంగా యాభై వేలు తీసుకొని నా జీవితాన్ని యాభై శాతం సర్వనాశనం చేసేసారు. కానీ ఆ కాలేజీలో చదవడం వలన నాకు ఇద్దరు మంచి స్నేహితులు పరిచయమయ్యారు. ఇది ఒక్కటే వాళ్ళ వల్ల నాకు కలిగిన లాభం. నీకు చెప్పొచ్చేదేమిటంటే….. నీకు నచ్చినట్టు నువ్వు చదివితే అది గవర్నమెంట్ కాలేజీ అయినా, కార్పొరేట్ కాలేజీ అయినా ఒకటే” అని ముగించాడు….

“మరి వాళ్లకి నువ్వు ముట్టజెప్పిన డబ్బు సంగతి ఏమిటి?” అడిగాను.

“వృధా… అన్నట్టు చెప్పడం మరిచిపొయాను. వీళ్ళకి ఇన్ని డబ్బులిస్తే నా పేరు గవర్నమెంట్ కాలేజీలో వేశారు”.

“అదేమిటి?”

“వీళ్ళ కాలేజీలో సీట్లు నిండిపోతే గవర్నమెంట్ కాలేజీలో మనల్ని వేసేస్తారు. ఇంకొక విషయమేమిటంటే ఇన్ని డబ్బులు తీసుకొన్నా మనకి సరైన వసతులు కల్పించరు. డిగ్రీ కూడా చదవని మాష్టార్లను వేస్తారు. నమ్మశక్యం కాని విషయమేమిటో తెలుసా? మాకు విరిగిపోయిన బ్లాక్ బోర్డు మీదే ఆరు నెలల పాటు పాఠాలు చెప్పారు”.

“ఓరి బాబోయ్!”

“సర్లే కానీ నువ్వు అప్లికేషనుతీసుకున్నావా?”

“ఆఁ… బీరువాలో ఉంది.”

“సర్లే నీకు నచ్చిన కాలేజీలో నువ్వు జాయిన్ అవ్వు. నా అభిప్రాయం చెప్పానంతే …. కానీ ఇందాక చెప్పినట్టు నువ్వు నీకు నచ్చినట్టు జీవించు. అలాగేనా? “

నానుంచి మౌనమే సమాధానమైంది.

అన్నయ్య దగ్గరనుంచి వచ్చేశాక ఆలోచించాను. గవర్నమెంట్ కాలేజీలో చదవడం వలన లాభమేంటి? కార్పొరేట్ కాలేజీలో చదవడం వలన నష్టమేంటి? అని….. చాలా సేపటి తర్వాత ఒక ధృడమైన అభిప్రాయానికి వచ్చాను. ఇంతలో నా దృష్టి చెత్త బుట్ట పై పడింది. వెంటనే బీరువా తలుపు తీశాను. అరనిముషం ముందు వరకు ఖాళీగా ఉన్న చెత్త బుట్ట ఇప్పుడు ఖాళీగా లేదు.

*

రచయిత వివరాలు

 sarath kumar

మోడేకుర్తి సతీష్ శరత్ కుమార్,

s/o  మోడేకుర్తి కామేశ్వర రావు, డోర్ నం. : 25-4-30/A,

గెడ్డవీధి, మహారాణి పేట, విజయనగరం(మండలం),

విజయనగరం(జిల్లా). ఫోన్ నంబర్: 8341363754.

Download PDF ePub MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, సెప్టెంబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , , .

2 Comments

  1. ప్రయత్నం బావుంది. అభినందించ దగ్గ విషయం ,ఏమిటంటే తనకు తెలిసిన పరిధి లోని విషయాన్ని చెప్పడం లో కృతకృత్యుడయ్యాడు. ముందు ముందు ఈ రచయిత కలం ఇంకా పదునెక్కి చక్కటి కధలు రాయాలని ,wishing you all the best…..మణి వడ్లమాని

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.